కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

16వ అధ్యాయం

అపవాదిని ఎదిరించండి

అపవాదిని ఎదిరించండి

“అపవాదిని ఎదిరించండి, అప్పుడు అతను మీ దగ్గర నుండి పారిపోతాడు.”—యాకోబు 4:7.

1, 2. సాతాను, అతని చెడ్డదూతల గురించి మనం ఏం తెలుసుకోవాలి?

 యెహోవా తీసుకొచ్చే కొత్తలోకంలో జీవితం చాలా బాగుంటుంది. అప్పుడు, మనం ఎలా జీవించాలని దేవుడు మొదట్లో అనుకున్నాడో అలా జీవిస్తాం. కానీ ప్రస్తుతం సాతాను, అతని చెడ్డదూతల గుప్పిట్లో ఉన్న లోకంలో మనం జీవిస్తున్నాం. (2 కొరింథీయులు 4:4) మన కంటికి కనిపించకపోయినా వాళ్లు నిజంగా ఉన్నారు. అంతేకాదు వాళ్లకు చాలా శక్తి ఉంది.

2 మనం యెహోవాను అంటిపెట్టుకుని ఎలా ఉండవచ్చో, సాతాను నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చో ఈ అధ్యాయంలో చూస్తాం. మనకు సహాయం చేస్తానని యెహోవా మాటిస్తున్నాడు. అయితే సాతాను, అతని చెడ్డదూతలు ఏయే విధాలుగా మోసం చేస్తారో, దాడి చేస్తారో మనం తెలుసుకోవాలి.

“గర్జించే సింహం”

3. అపవాది ఏం చేయాలని చూస్తున్నాడు?

3 మనుషులు స్వార్థంతోనే యెహోవాను ఆరాధిస్తారని, కష్టాలు వస్తే ఆయన్ని సేవించడం ఆపేస్తారని సాతాను నిందిస్తున్నాడు. (యోబు 2:4, 5 చదవండి.) ఒక వ్యక్తి యెహోవా గురించి నేర్చుకోవాలని అనుకున్నప్పుడు సాతాను, చెడ్డదూతలు అది గమనించి, అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తారు. అతను యెహోవాకు సమర్పించుకుని బాప్తిస్మం తీసుకున్నప్పుడు సాతానుకు, చెడ్డదూతలకు కోపం వస్తుంది. అపవాది “గర్జించే సింహంలా” ఎవర్ని మింగాలా అని వెతుకుతున్నాడని బైబిలు చెప్తుంది. (1 పేతురు 5:8) యెహోవాతో మనకున్న సంబంధాన్ని పాడుచేయాలని సాతాను చూస్తున్నాడు.—కీర్తన 7:1, 2; 2 తిమోతి 3:12.

మనం యెహోవాకు సమర్పించుకున్నప్పుడు సాతానుకు కోపం వస్తుంది

4, 5. (ఎ) సాతాను ఏం చేయలేడు? (బి) మనం అపవాదిని ఎలా ఎదిరించవచ్చు?

4 కానీ మనం సాతానుకు, అతని చెడ్డదూతలకు భయపడాల్సిన అవసరం లేదు. యెహోవా వాళ్లకు హద్దులు పెట్టాడు కాబట్టి వాళ్లు చేయాలనుకున్నవన్నీ చేయలేరు. నిజ క్రైస్తవుల “గొప్పసమూహం” మహాశ్రమను దాటి సురక్షితంగా వస్తుందని యెహోవా మాటిచ్చాడు. (ప్రకటన 7:9, 14) దాన్ని ఆపడం అపవాది వల్ల కాదు, ఎందుకంటే యెహోవా తన ప్రజల్ని కాపాడతాడు.

5 మనం యెహోవాను అంటిపెట్టుకుని ఉంటే, ఆయనతో మనకున్న సంబంధాన్ని సాతాను పాడుచేయలేడు. దేవుని వాక్యం ఈ హామీ ఇస్తుంది: “మీరు యెహోవాతో ఉన్నంతకాలం ఆయన మీతో ఉంటాడు.” (2 దినవృత్తాంతాలు 15:2; 1 కొరింథీయులు 10:13 చదవండి.) హేబెలు, హనోకు, నోవహు, శారా, మోషే వంటి చాలామంది ప్రాచీనకాల నమ్మకమైన సేవకులు యెహోవాను అంటిపెట్టుకుని ఉండడం ద్వారా అపవాదిని ఎదిరించారు. (హెబ్రీయులు 11:4-40) మనమూ అలా ఎదిరించగలం. దేవుని వాక్యం ఇలా చెప్తుంది: “అపవాదిని ఎదిరించండి, అప్పుడు అతను మీ దగ్గర నుండి పారిపోతాడు.”—యాకోబు 4:7.

‘మనం పోరాడుతున్నాం’

6. సాతాను మన మీద ఎలా దాడి చేస్తాడు?

6 తాను చేయాలనుకున్నవన్నీ చేయకుండా యెహోవా హద్దులు పెట్టాడని సాతానుకు తెలుసు. అయినా దేవునితో మనకున్న సంబంధాన్ని పాడుచేయడానికి సాతాను ఎంతగానో ప్రయత్నిస్తాడు. నేడు అపవాది ఎన్నో విధాలుగా దాడి చేస్తున్నాడు, వేల సంవత్సరాలుగా ఉపయోగిస్తున్న పన్నాగాల్నే ఉపయోగిస్తున్నాడు. వాటిలో కొన్నిటిని ఇప్పుడు పరిశీలిద్దాం.

7. సాతాను యెహోవా ప్రజల మీద ఎందుకు దాడి చేస్తున్నాడు?

7 అపొస్తలుడైన యోహాను ఇలా రాశాడు: “లోకమంతా దుష్టుని గుప్పిట్లో ఉంది.” (1 యోహాను 5:19) సాతాను ఈ దుష్ట లోకాన్ని గుప్పిట్లో పెట్టుకున్నాడు, యెహోవా ప్రజల్ని కూడా తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నాడు. (మీకా 4:1; యోహాను 15:19; ప్రకటన 12:12, 17) తనకు కొంచెం సమయమే మిగిలివుందని అపవాదికి తెలుసు. అందుకే దేవునికి నమ్మకద్రోహం చేసేలా మనలో ప్రతీఒక్కరి మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నాడు. అపవాది కొన్నిసార్లు నేరుగా, ఇంకొన్నిసార్లు దొంగచాటుగా దాడి చేస్తాడు.

8. ప్రతీ క్రైస్తవుడు ఏం గుర్తుంచుకోవాలి?

8 “మనం పోరాడుతున్నది . . . పరలోకంలోని చెడ్డదూతల సైన్యంతో” అని ఎఫెసీయులు 6:12 చెప్తుంది. ప్రతీ క్రైస్తవుడు అపవాదితో, అతని చెడ్డదూతలతో వ్యక్తిగతంగా పోరాడాలి. యెహోవాకు సమర్పించుకున్న వాళ్లందరూ ఈ పోరాటంలో ఉన్నారని గుర్తుంచుకోవాలి. అపొస్తలుడైన పౌలు ఎఫెసులోని క్రైస్తవులకు రాసిన ఉత్తరంలో, ‘స్థిరంగా నిలబడండి’ అని మూడుసార్లు చెప్పాడు.—ఎఫెసీయులు 6:11, 13, 14.

9. సాతాను, అతని చెడ్డదూతలు ఏం చేయడానికి ప్రయత్నిస్తారు?

9 సాతాను, అతని చెడ్డదూతలు మనల్ని ఎన్నో విధాలుగా మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. ఒక విషయంలో సాతానును ఎదిరించినంత మాత్రాన ఇంకో విషయంలో కూడా ఎదిరించగలమని చెప్పలేం. అపవాది మన బలహీనతల్ని గమనించి, వాటికి తగ్గట్లు ఉచ్చులు సిద్ధం చేస్తాడు. మనం వాటిలో పడకుండా జాగ్రత్తగా ఉండవచ్చు, ఎందుకంటే అపవాది పన్నాగాల గురించి బైబిలు ముందే చెప్పింది. (2 కొరింథీయులు 2:11; “సాతాను పన్నాగాలు” చూడండి.) వాటిలో ఒకటి, మంత్రతంత్రాలు.

చెడ్డదూతలకు దూరంగా ఉండండి

10. (ఎ) మంత్రతంత్రాలు అంటే ఏంటి? (బి) మంత్రతంత్రాల్ని యెహోవా ఎలా చూస్తాడు?

10 మంత్రతంత్రాలు అంటే చెడ్డదూతలతో సంప్రదించి చేసే పనులు. అంటే భవిష్యత్తు చెప్పడం, మంత్రవిద్య, మంత్రాలు ప్రయోగించడం, చనిపోయినవాళ్లతో మాట్లాడడానికి ప్రయత్నించడం వంటివి. మంత్రతంత్రాలు యెహోవాకు ‘అసహ్యం’ అని బైబిలు చెప్తుంది. మనం అలాంటివి చేస్తూ, అదే సమయంలో యెహోవాను ఆరాధించడం కుదరదని బైబిలు చెప్తుంది. (ద్వితీయోపదేశకాండం 18:10-12; ప్రకటన 21:8) క్రైస్తవులు అన్ని రకాల మంత్రతంత్రాలకు పూర్తిగా దూరంగా ఉండాలి.—రోమీయులు 12:9.

11. మానవాతీత శక్తులకు సంబంధించిన విషయాల్లో కాస్త ఆసక్తి చూపించినా ఏమౌతుంది?

11 మనం మానవాతీత శక్తులకు సంబంధించిన విషయాల్లో ఆసక్తి చూపిస్తే, సాతాను మనల్ని సులభంగా మంత్రతంత్రాల వైపుకు లాగేస్తాడు. అన్ని రకాల మంత్రతంత్రాలు యెహోవాతో మనకున్న సంబంధాన్ని పాడుచేస్తాయి.

సాతాను మనల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తాడు

12. సాతాను ఎలా మనల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తాడు?

12 సాతాను ప్రజల ఆలోచనా విధానాన్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తాడు. అతను మెల్లమెల్లగా సందేహాలు పుట్టించి, చివరికి వాళ్లు “మంచిని చెడు అని, చెడును మంచి అని” తికమకపడేలా చేస్తాడు. (యెషయా 5:20) బైబిలు సలహాలు పనికిరావని, దేవుని ప్రమాణాల్ని పాటించకపోతే మనం ఇంకా సంతోషంగా ఉంటామని అపవాది చెప్తున్నాడు.

13. సాతాను ఎలా సందేహాలు పుట్టించడానికి ప్రయత్నించాడు?

13 సాతాను ఉపయోగించే శక్తివంతమైన పన్నాగాల్లో ఒకటి, సందేహాలు పుట్టించడం. అతను చాలాకాలంగా దాన్ని ఉపయోగిస్తూ వచ్చాడు. ఏదెను తోటలో సాతాను హవ్వతో మాట్లాడుతున్నప్పుడు ఆమెలో సందేహాలు పుట్టించడానికి ఇలా ప్రయత్నించాడు: “ఈ తోటలో ఉన్న అన్ని చెట్ల పండ్లనూ మీరు తినకూడదని దేవుడు నిజంగా చెప్పాడా?” (ఆదికాండం 3:1) తర్వాత యోబు కాలంలో, దేవదూతల ముందు సాతాను యెహోవాతో ఇలా అన్నాడు: “యోబు ఊరికే దేవునిపట్ల భయభక్తులు కలిగి ఉన్నాడా?” (యోబు 1:9) యేసు బాప్తిస్మం తీసుకున్న తర్వాత సాతాను ఆయనతో ఇలా అన్నాడు: “నువ్వు దేవుని కుమారుడివైతే, ఈ రాళ్లను రొట్టెలుగా మారమని ఆజ్ఞాపించు.”—మత్తయి 4:3.

14. మంత్రతంత్రాల విషయంలో సాతాను ఎలా సందేహాలు పుట్టిస్తాడు?

14 ఈ రోజుల్లో కూడా అపవాది ప్రజల్లో సందేహాలు పుట్టిస్తున్నాడు. కొన్ని రకాల మంత్రతంత్రాలు తప్పేమీ కాదన్నట్లు చూపించడం ద్వారా, అవి నిజంగా అంత ప్రమాదకరమా అని ప్రజలు సందేహించేలా చేస్తున్నాడు. కొంతమంది క్రైస్తవులు సైతం ప్రమాదాల్ని గుర్తుపట్టలేకపోయారు. (2 కొరింథీయులు 11:3) మరి మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చు? సాతాను చేతుల్లో మోసపోకుండా ఎలా జాగ్రత్తపడవచ్చు? మనం మోసపోయే ప్రమాదం ఉన్న రెండు విషయాల్ని గమనిద్దాం. అవి: వినోదం, వైద్య చికిత్స.

మన సహజ కోరికల్ని ఉపయోగించి మోసం చేస్తాడు

15. వినోదం ద్వారా మనమెలా మంత్రతంత్రాల్లో పాల్గొనే అవకాశం ఉంది?

15 నేడు చాలా సినిమాల్లో, వీడియోల్లో, టీవీ కార్యక్రమాల్లో, వీడియో గేముల్లో, వెబ్‌సైట్లలో చెడ్డదూతలకు, ఇంద్రజాలానికి, మానవాతీత శక్తులకు సంబంధించిన విషయాలు ఉంటున్నాయి. వాటివల్ల హాని లేదని, అవి సరదా కోసమే అని చాలామంది అనుకుంటున్నారు. కానీ వాటి ద్వారా తమ జీవితాల్లోకి చెడ్డదూతల్ని ఆహ్వానిస్తున్నారని, అది ప్రమాదకరమని వాళ్లు గుర్తించట్లేదు. రాశి ఫలాలు, చేతి రేఖలు, చిలక జోస్యం, స్ఫటికపు గోళం వంటివి కూడా మంత్రతంత్రాల కిందికి వస్తాయి. అపవాది వాటిని ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా, సరదాగా కనిపించేలా చేస్తూ ప్రమాదాల్ని కప్పిపెడుతున్నాడు. మంత్రతంత్రాలకు లేదా మానవాతీత శక్తులకు సంబంధించిన వాటిని చేస్తే ప్రమాదం గానీ, అలాంటి వినోదాన్ని చూస్తే ఏమౌతుంది అని ఒక వ్యక్తి అనుకోవచ్చు. అలా ఆలోచించడం సరైనది కాదు. ఎందుకు?—1 కొరింథీయులు 10:12.

16. మానవాతీత శక్తులకు సంబంధించిన వినోదాన్ని మనం ఎందుకు ఎంచుకోకూడదు?

16 సాతాను, అతని చెడ్డదూతలు మన మనసును చదవలేరు. కానీ మనం ఎంచుకునేవాటిని బట్టి మన కోరికలు, ఆలోచనలు వాళ్లు తెలుసుకోగలరు. ఉదాహరణకు మన కోసం, మన కుటుంబ సభ్యుల కోసం మనం ఎలాంటి వినోదాన్ని ఎంచుకుంటున్నామో వాళ్లు గమనిస్తారు. ఒకవేళ చనిపోయినవాళ్లతో మాట్లాడడం, మంత్రాలు ప్రయోగించడం, చెడ్డదూతలు పట్టడం, మంత్రగత్తెలు, రక్తపిశాచాలు వంటివి ఉన్న సినిమాల్ని, సంగీతాన్ని, పుస్తకాల్ని ఎంచుకుంటే మనకు వాటి మీద ఆసక్తి ఉందని సాతానుకు, అతని చెడ్డదూతలకు తెలిసిపోతుంది. అప్పుడు వాళ్లు మనల్ని మంత్రతంత్రాల ఊబిలోకి లాగేయడానికి ప్రయత్నిస్తారు.—గలతీయులు 6:7 చదవండి.

17. ఆరోగ్యంగా ఉండాలనే మన కోరికను సాతాను ఎలా వాడుకోవచ్చు?

17 ఆరోగ్యంగా ఉండాలనే మన కోరికను కూడా సాతాను వాడుకోగలడు. ఈ రోజుల్లో చాలామంది రోగాల బారిన పడుతున్నారు. ఒక వ్యక్తి ఎంతమంది డాక్టర్లకు చూపించుకున్నా, ఎన్ని మందులు వాడినా వ్యాధి నయం కాకపోవచ్చు. (మార్కు 5:25, 26) దాంతో అతను విసిగిపోయి, చివరికి భూతవైద్యుడి దగ్గరికి వెళ్లాలని లేదా మంత్రతంత్రాలతో సంబంధం ఉన్న వైద్య చికిత్సను తీసుకోవాలని నిర్ణయించుకునే ప్రమాదం ఉంది. కానీ క్రైస్తవులమైన మనం “ఇంద్రజాల శక్తిని” ఉపయోగించి చేసే వైద్య చికిత్సల్ని తీసుకోకూడదు.—యెషయా 1:13.

అనారోగ్యంతో ఉన్నప్పుడు యెహోవాపై ఆధారపడండి

18. క్రైస్తవులు ఎలాంటి వైద్య చికిత్సలు చేయించుకోరు?

18 ప్రాచీన ఇశ్రాయేలులో కొందరు “ఇంద్రజాల శక్తిని” ఉపయోగించేవాళ్లు. వాళ్లతో యెహోవా ఇలా అన్నాడు: “మీరు ప్రార్థించడానికి చేతులు చాపినప్పుడు, నేను నా కళ్లను పక్కకు తిప్పుకుంటాను. మీరు ఎన్నో ప్రార్థనలు చేస్తున్నా, నేను వినట్లేదు.” (యెషయా 1:15) ఒక్కసారి ఆలోచించండి, యెహోవా కనీసం వాళ్ల ప్రార్థనలు కూడా వినడు! యెహోవాతో మనకున్న సంబంధాన్ని పాడుచేసే, ఆయన సహాయాన్ని పొందకుండా చేసే ప్రతీ పనికి మనం దూరంగా ఉండాలనుకుంటాం. మరిముఖ్యంగా అనారోగ్యంతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం. (కీర్తన 41:3) కాబట్టి మనం చేయించుకోవాలనుకుంటున్న చికిత్సకు మంత్రతంత్రాలతో లేదా మానవాతీత శక్తులతో సంబంధం ఉందేమో కనుక్కోవాలి. (మత్తయి 6:13) అలా సంబంధం ఉందని అనుమానం వచ్చినా, దాన్ని చేయించుకోకూడదు!—“వైద్య చికిత్స” చూడండి.

చెడ్డదూతల గురించిన కథలు

19. చాలామంది అపవాదికి ఎందుకు భయపడుతున్నారు?

19 అపవాది, చెడ్డదూతలు కల్పితం అని కొందరు అనుకుంటారు. ఇంకొందరు తమ సొంత అనుభవాన్ని బట్టి వాళ్లు నిజంగా ఉన్నారని నమ్ముతారు. చాలామంది ప్రజలు చెడ్డదూతలకు భయపడుతూ రకరకాల ఆచారాలు పాటిస్తారు. చెడ్డదూతలు మనుషులకు చేసే హాని గురించి కొంతమంది కథలుకథలుగా చెప్తుంటారు. అలా వాళ్లు భయపడడమే కాకుండా ఇతరుల్నీ భయపెడతారు. ఆ కథలు తరచూ ఆసక్తికరంగా ఉండడం వల్ల వెంటనే వేరేవాళ్లకు చెప్పాలనిపిస్తుంది. ఆ కథల వల్ల ప్రజలకు అపవాది మీద భయం పెరుగుతుంది.

20. మనం సాతాను అబద్ధాల్ని ఎలా వ్యాప్తి చేసే అవకాశం ఉంది?

20 ప్రజలు తనకు భయపడాలనేది సాతాను కోరిక అని గుర్తుంచుకోండి. (2 థెస్సలొనీకయులు 2:9, 10) అతను పచ్చి అబద్ధాలకోరు. మంత్రతంత్రాల విషయంలో ఆసక్తి చూపించేవాళ్ల మనసుల్ని ఎలా మలచాలో, లేనివి ఉన్నట్లు ఎలా నమ్మించాలో అతనికి తెలుసు. అలాంటివాళ్లు తాము నిజంగానే ఏదో చూశాం, విన్నాం అని భ్రమపడి వేరేవాళ్లకు వాటిని కథలుగా చెప్పవచ్చు. ఆ కథలు ఒకరి నుండి ఒకరికి వ్యాపించే కొద్దీ వాటిలో కల్పితాలు ఎక్కువౌతూ ఉంటాయి. అలాంటి కథల ద్వారా ప్రజల్లో భయాన్ని పెంచాలని సాతాను కోరుకుంటున్నాడు. అలాంటివి వ్యాప్తి చేసి సాతానుకు సహాయం చేయాలని మనం కోరుకోం.—యోహాను 8:44; 2 తిమోతి 2:16.

21. చెడ్డదూతల గురించి కథలు చెప్పే బదులు మనం ఏం చేయాలి?

21 యెహోవా ప్రజల్లో ఎవరికైనా గతంలో చెడ్డదూతలకు సంబంధించిన అనుభవాలు ఉంటే, వాళ్లు వాటిని ఇతరులకు చెప్పరు. అపవాది, చెడ్డదూతలు చేయగల దేనికీ మనం భయపడాల్సిన అవసరం లేదు. బదులుగా మనం యేసు మీద, యెహోవా ఆయనకు ఇచ్చిన శక్తి మీద మనసుపెట్టాలి. (హెబ్రీయులు 12:2) యేసు తన శిష్యులకు చెడ్డదూతల గురించిన కథలు చెప్పలేదు కానీ రాజ్యం గురించి, “దేవుని శక్తివంతమైన కార్యాల” గురించి ప్రకటించాడు.—అపొస్తలుల కార్యాలు 2:11; లూకా 8:1; రోమీయులు 1:11, 12.

22. మీరు ఏం చేయాలని నిశ్చయించుకున్నారు?

22 యెహోవాతో మనకున్న సంబంధాన్ని పాడుచేయాలన్నదే సాతాను లక్ష్యం. దానికోసం అతను ఏమైనా చేస్తాడు. కానీ అపవాది ఉపయోగించే పన్నాగాలు ఏంటో మనకు తెలుసు. మనం అన్నిరకాల మంత్రతంత్రాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నాం. మన నిశ్చయాన్ని నీరుగార్చే అవకాశాన్ని అపవాదికి ఏమాత్రం ఇవ్వం. (ఎఫెసీయులు 4:27 చదవండి.) అవును, మనం అపవాదిని ఎదిరిస్తే అతని ఉచ్చుల్లో పడకుండా ఉంటాం, యెహోవా కాపుదల కింద సురక్షితంగా ఉంటాం.—ఎఫెసీయులు 6:11.