కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

13వ అధ్యాయం

అన్ని ఆచారాల్ని, పండుగల్ని దేవుడు ఇష్టపడతాడా?

అన్ని ఆచారాల్ని, పండుగల్ని దేవుడు ఇష్టపడతాడా?

“ప్రభువుకు ఏది ఇష్టమో జాగ్రత్తగా తెలుసుకుంటూ ఉండండి.”—ఎఫెసీయులు 5:10.

1. యెహోవాను సరైన విధంగా ఆరాధించాలంటే మనం ఏం చేస్తూ ఉండాలి? ఎందుకు?

 యేసు ఇలా అన్నాడు: ‘దేవుణ్ణి సరైన విధంగా ఆరాధించేవాళ్లు పవిత్రశక్తితో, సత్యంతో ఆరాధిస్తారు. నిజానికి తనను అలా ఆరాధించే వాళ్ల కోసమే తండ్రి చూస్తున్నాడు.’ (యోహాను 4:23; 6:44) యెహోవాను సరైన విధంగా ఆరాధించాలంటే, మనం “ప్రభువుకు ఏది ఇష్టమో జాగ్రత్తగా తెలుసుకుంటూ” ఉండాలి. (ఎఫెసీయులు 5:10) అది అన్నిసార్లూ అంత తేలిక కాదు. ఎందుకంటే, యెహోవాకు ఇష్టంలేని పనులు చేసేలా సాతాను మనల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తాడు.—ప్రకటన 12:9.

2. సీనాయి పర్వతం దగ్గర ఏం జరిగింది?

2 సాతాను మనల్ని మోసం చేయడానికి ఉపయోగించే ఒక పద్ధతి: ఏది సరైనది, ఏది కాదు అనే విషయంలో మనల్ని తికమకపెట్టడం. ఇశ్రాయేలీయులు సీనాయి పర్వతం దగ్గర ఉన్నప్పుడు ఏం జరిగిందో గమనించండి. మోషే ఆ పర్వతం పైకి వెళ్లాడు, కింద ఇశ్రాయేలీయులు అతని కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. మోషే ఎంతకీ రాకపోయేసరికి వాళ్లు తమ కోసం ఒక దేవుణ్ణి చేయమని అహరోనును అడిగారు. అతను దూడ రూపంలో ఒక బంగారు విగ్రహం చేశాడు. అప్పుడు ప్రజలు పండుగ చేసుకున్నారు. వాళ్లు ఆ దూడ చుట్టూ నాట్యం చేశారు, దానికి వంగి నమస్కారం చేశారు. అలా చేయడం ద్వారా తాము యెహోవానే ఆరాధిస్తున్నామని వాళ్లు అనుకున్నారు. వాళ్లు దానికి “యెహోవాకు పండుగ” అని పేరు పెట్టినంతమాత్రాన అది యెహోవా ఆరాధన అయిపోలేదు. యెహోవా దాన్ని విగ్రహపూజలా చూశాడు, దానివల్ల చాలామంది చనిపోయారు. (నిర్గమకాండం 32:1-6, 10, 28) దీన్నుండి ఏ పాఠం నేర్చుకోవచ్చు? మోసపోకండి, “అపవిత్రమైన దేన్నీ ముట్టుకోకండి!” ఏది సరైనదో, ఏది కాదో యెహోవానే చెప్పనివ్వండి.—యెషయా 52:11; యెహెజ్కేలు 44:23; గలతీయులు 5:9.

3, 4. పండుగలు ఎలా మొదలయ్యాయో ఎందుకు తెలుసుకోవాలి?

3 యేసు భూమ్మీద ఉన్నప్పుడు, యెహోవాను ఎలా పవిత్రంగా ఆరాధించాలో అపొస్తలులకు చెప్పాడు. యేసు చనిపోయాక వాళ్లు దాన్ని కొత్త శిష్యులకు బోధించారు. కానీ అపొస్తలులు చనిపోయిన తర్వాత అబద్ధ బోధకులు తప్పుడు ఆలోచనల్ని, అన్యమత ఆచారాల్ని, పండుగల్ని సంఘంలోకి తీసుకొచ్చారు. వాళ్లు కొన్ని అన్యమత పండుగల పేర్లు మార్చి, అవి క్రైస్తవ పండుగలే అనిపించేలా చేశారు. (2 థెస్సలొనీకయులు 2:7, 10; 2 యోహాను 6, 7) ఆ పండుగల్లో చాలా వాటిని ప్రజలు ఇప్పటికీ ఆచరిస్తున్నారు. నేడు కూడా అవి అబద్ధ నమ్మకాల్ని, మంత్రతంత్రాల్ని ప్రోత్సహిస్తున్నాయి. *ప్రకటన 18:2-4, 23.

4 నేడు ప్రపంచవ్యాప్తంగా పండుగలు, వేడుకలు ప్రజల జీవితంలో చాలా ముఖ్యమైపోయాయి. కానీ యెహోవా అభిప్రాయం ఏంటో తెలుసుకుంటుండగా, పండుగల విషయంలో మీ అభిప్రాయాన్ని మార్చుకోవాలని మీకు అనిపించవచ్చు. అది అంత తేలిక కాదు, కానీ యెహోవా మీకు సహాయం చేస్తాడు. కొన్ని పండుగలు ఎలా మొదలయ్యాయో పరిశీలించి, వాటి విషయంలో యెహోవా అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం.

క్రిస్మస్‌ ఎలా మొదలైంది?

5. యేసు డిసెంబరు 25న పుట్టలేదని ఎలా చెప్పవచ్చు?

5 చాలా దేశాల్లో డిసెంబరు 25న క్రిస్మస్‌ జరుపుకుంటారు. యేసు ఆ రోజునే పుట్టాడని చాలామంది అనుకుంటారు. యేసు ఏ నెలలో, ఏ రోజున పుట్టాడో బైబిలు చెప్పట్లేదు. కానీ సంవత్సరంలో ఏ సమయంలో పుట్టాడో బైబిలు చెప్తుంది. యేసు పుట్టినప్పుడు బేత్లెహేములో “గొర్రెల కాపరులు రాత్రిపూట ఆరుబయట ఉండి తమ మందల్ని కాస్తూ ఉన్నారు” అని లూకా రాశాడు. (లూకా 2:8-11) డిసెంబరులో బేత్లెహేములో వర్షం, మంచు కురుస్తూ చాలా చలిగా ఉంటుంది. కాబట్టి కాపరులు రాత్రిపూట తమ మందల్ని ఆరుబయట ఉంచరు. దాన్నిబట్టి యేసు డిసెంబరులో కాదుగానీ వాతావరణం మామూలుగా ఉన్న నెలలో పుట్టాడని స్పష్టమౌతోంది. ఆయన సెప్టెంబరులో లేదా అక్టోబరులో పుట్టాడని బైబిలు, అలాగే చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి.

6, 7. (ఎ) క్రిస్మస్‌కు సంబంధించిన చాలా ఆచారాలు ఎలా మొదలయ్యాయి? (బి) మనం ఎందుకు బహుమతులు ఇస్తాం?

6 మరి క్రిస్మస్‌ ఎలా మొదలైంది? శాటర్నేలియా వంటి కొన్ని అన్యమత పండుగల నుండి క్రిస్మస్‌ వచ్చింది. శాటర్నేలియా అనేది శాటర్న్‌ అనే వ్యవసాయ దేవునికి రోమన్లు చేసే పండుగ. ది ఎన్‌సైక్లోపీడియా అమెరికానా ఇలా చెప్తుంది: “డిసెంబరు మధ్యలో జరుపుకునే శాటర్నేలియా అనే రోమన్ల పండుగ నుండే చాలా క్రిస్మస్‌ ఆచారాలు పుట్టుకొచ్చాయి. ఉదాహరణకు పెద్దపెద్ద విందులు చేసుకోవడం, బహుమతులు ఇచ్చుకోవడం, కొవ్వొత్తులు వెలిగించడం వంటివి దాన్నుండే వచ్చాయి.” పర్షియన్లు కూడా డిసెంబరు 25న సూర్య దేవుడైన మిత్ర పుట్టినరోజును చేసుకునేవాళ్లు.

7 నేడు క్రిస్మస్‌ జరుపుకునే చాలామంది అది అన్యమత పండుగల నుండి వచ్చిందని అనుకోవట్లేదు. కుటుంబంతో సమయం గడుపుతూ, మంచి భోజనం తింటూ, బహుమతులు ఇచ్చుకునే సందర్భంలా మాత్రమే దాన్ని చూస్తున్నారు. నిజమే, మనం మన కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని ప్రేమిస్తాం. తన సేవకులందరూ “ఇచ్చే” గుణాన్ని కలిగి ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు. “సంతోషంగా ఇచ్చేవాళ్లంటే దేవునికి ఇష్టం” అని 2 కొరింథీయులు 9:7 చెప్తుంది. మనం కేవలం ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే బహుమతులు ఇవ్వాలని యెహోవా కోరుకోవట్లేదు. యెహోవా ప్రజలు సంవత్సరంలో ఎప్పుడైనా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సమయం గడుపుతారు, ఎదుటివాళ్ల నుండి ఏమీ ఆశించకుండా ప్రేమతో బహుమతులు ఇస్తారు.—లూకా 14:12-14.

ఫలానా పండుగ జరుపుకోవాలో లేదో తెలియాలంటే అదెలా మొదలైందో తెలుసుకోవాలి

8. జ్యోతిష్యులు బహుమతులు ఇచ్చింది అప్పుడే పుట్టిన యేసుకా? వివరించండి.

8 చాలామంది క్రిస్మస్‌ సమయంలో బహుమతులు ఇస్తారు. ఎందుకంటే, పశువుల పాకలో అప్పుడే పుట్టిన యేసు దగ్గరికి ముగ్గురు జ్ఞానులు బహుమతులు తీసుకొచ్చారని వాళ్లు చెప్తారు. కొంతమంది యేసు దగ్గరికి వచ్చి బహుమతులు ఇచ్చిన మాట నిజమే. బైబిలు కాలాల్లో ముఖ్యమైన వ్యక్తిని కలిసినప్పుడు అలా బహుమతులు ఇవ్వడం అలవాటు. (1 రాజులు 10:1, 2, 10, 13) అయితే యేసు దగ్గరికి వచ్చిన ఆ జ్ఞానులు యెహోవా ఆరాధకులు కాదని, వాళ్లు జ్యోతిష్యులని, ఇంద్రజాలం (మ్యాజిక్‌) చేసేవాళ్లని బైబిలు చెప్తుంది. పైగా వాళ్లు యేసును పశువుల పాకలో కాదుగానీ ఒక ఇంట్లో కలిశారు. ఆ జ్యోతిష్యులు తూర్పు నుండి బయల్దేరి అక్కడికి చేరుకునేసరికి కొన్ని నెలలు పట్టివుంటుంది. వాళ్లు కలిసే సమయానికి యేసు అప్పుడే పుట్టిన బాబు కాదుగానీ, కాస్త ఎదిగిన “పిల్లవాడు.”—మత్తయి 2:1, 2, 11.

పుట్టినరోజుల గురించి బైబిలు ఏం చెప్తుంది?

9. బైబిల్లో ఎవరెవరు పుట్టినరోజు జరుపుకున్నారు?

9 పిల్లలు పుట్టినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. (కీర్తన 127:3) అంతమాత్రాన మనం పుట్టినరోజులు జరుపుకోవాలని కాదు. బైబిల్లో ఇద్దరు వ్యక్తులు మాత్రమే పుట్టినరోజు జరుపుకున్నారు: ఒకరు ఐగుప్తు ఫరో, ఇంకొకరు రాజైన హేరోదు అంతిప. (ఆదికాండం 40:20-22; మార్కు 6:21-29 చదవండి.) వాళ్లిద్దరూ యెహోవా సేవకులు కాదు. నిజానికి, యెహోవా ఆరాధకులు పుట్టినరోజు జరుపుకున్నట్లు బైబిల్లో ఎక్కడా లేదు.

10. తొలి క్రైస్తవులు పుట్టినరోజు వేడుకల్ని ఎలా చూసేవాళ్లు?

10 తొలి క్రైస్తవులు “ఎవరి పుట్టినరోజు వేడుకనైనా అన్యమత ఆచారంలానే చూసేవాళ్లు” అని ద వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా చెప్తుంది. ఆ ఆచారాలు అబద్ధ నమ్మకాల నుండి వచ్చాయి. ఉదాహరణకు, ప్రతీ వ్యక్తి ఏదోక దేవుని పుట్టినరోజున పుడతాడని ప్రాచీన గ్రీకులు నమ్మేవాళ్లు. పుట్టినరోజు జరుపుకుంటేనే ఆ దేవుడు తమను జీవితాంతం కాపాడుతూ ఉంటాడని వాళ్లు నమ్మేవాళ్లు. పుట్టినరోజులకు అలాంటి అన్యమత నమ్మకాలతోనే కాదు, జ్యోతిష్యం, రాశిఫలాలు వంటివాటితో కూడా సంబంధం ఉంది.

11. మనం ఎలా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు?

11 తమ పుట్టినరోజు ప్రత్యేకమైనదని, ఆ రోజు అందరూ తమను ప్రేమించాలని చాలామంది అనుకుంటారు. అయితే మనం మన కుటుంబ సభ్యుల పట్ల, స్నేహితుల పట్ల ఏదోక ప్రత్యేకమైన రోజునే కాదుగానీ సంవత్సరంలో అన్నిరోజులూ ప్రేమ చూపించవచ్చు. మనం ఎప్పుడూ దయగా ఉండాలని, ఇచ్చే స్వభావాన్ని చూపించాలని యెహోవా కోరుకుంటున్నాడు. (అపొస్తలుల కార్యాలు 20:35 చదవండి.) దేవుడు జీవం అనే అమూల్యమైన బహుమతిని ఇచ్చినందుకు, పుట్టినరోజునే కాదుగానీ ప్రతీరోజు కృతజ్ఞతతో ఉంటాం.—కీర్తన 8:3, 4; 36:9.

నిజ క్రైస్తవులు ప్రేమతోనే ఇతరులకు బహుమతులు ఇస్తారు

12. పుట్టినరోజు కన్నా చనిపోయిన రోజు మేలైనదని ఎలా చెప్పవచ్చు?

12 ప్రసంగి 7:1 ఇలా చెప్తుంది: “శ్రేష్ఠమైన తైలం కంటే మంచిపేరు మేలు, పుట్టిన రోజు కన్నా చనిపోయే రోజు మేలు.” పుట్టినరోజు కన్నా చనిపోయిన రోజు మేలైనదని ఎలా చెప్పవచ్చు? ఒక వ్యక్తి పుట్టినప్పుడు అతను ఇంకా జీవితంలో ఏమీ సాధించలేదు. అయితే చనిపోయిన రోజు కల్లా అతను చేసిన పనుల్ని బట్టి అతనికి గుర్తింపు వస్తుంది. అతను యెహోవాను ఆరాధించడానికి, తోటివాళ్లకు మేలు చేయడానికి తన జీవితాన్ని ఉపయోగిస్తే “మంచిపేరు” సంపాదించుకుంటాడు, అతను చనిపోయిన తర్వాత కూడా యెహోవా అతన్ని గుర్తుపెట్టుకుంటాడు. (యోబు 14:14, 15) యెహోవా ప్రజలు తమ పుట్టినరోజును గానీ, యేసు పుట్టినరోజును గానీ చేసుకోరు. యేసు చనిపోయిన రోజును మాత్రమే జ్ఞాపకం చేసుకుంటారు. నిజానికి, యేసు ఆచరించమని చెప్పింది ఇదొక్కటే.—లూకా 22:17-20; హెబ్రీయులు 1:3, 4.

ఈస్టర్‌ ఎలా మొదలైంది?

13, 14. ఈస్టర్‌ పండుగకు దేనితో సంబంధం ఉంది?

13 ఈస్టర్‌ అనేది యేసు పునరుత్థానాన్ని గుర్తుచేసుకునే ఒక పండుగ అని చాలామంది అనుకుంటారు. అయితే ఈస్టర్‌ పండుగకు, ఆంగ్లో-శాక్సన్‌ల వెలుగు దేవత, వసంత రుతువు దేవత అయిన ఈస్ట్రేకు సంబంధం ఉంది. ఆమె సంతాన సాఫల్య దేవత కూడా అని ద డిక్షనరీ ఆఫ్‌ మిథాలజీ చెప్తుంది. అయితే తొలి క్రైస్తవులు ఈస్టర్‌ను జరుపుకోలేదని, అది అన్యమత ఆచారాల నుండి వచ్చిందని చరిత్ర పుస్తకాలు చెప్తున్నాయి. తొలి క్రైస్తవులు ఈస్టర్‌ను జరుపుకున్నట్లు బైబిల్లో ఎక్కడా లేదని ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా చెప్తుంది. కాబట్టి ఈస్టర్‌కు, యేసు పునరుత్థానానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టమౌతుంది.

14 తన కుమారుని పునరుత్థానాన్ని అన్యమత ఆచారాలతో ముడిపెడితే యెహోవా సంతోషిస్తాడా? లేదు. (2 కొరింథీయులు 6:17, 18) అంతేకాదు, యేసు పునరుత్థానాన్ని ఒక పండుగలా జరుపుకోమని యెహోవా ఎప్పుడూ చెప్పలేదు.

కొత్త సంవత్సర వేడుకలు

15. కొత్త సంవత్సర వేడుకలు ఎలా మొదలయ్యాయి?

15 కొత్త సంవత్సర వేడుకలు ఎలా మొదలయ్యాయి? ద వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా ఇలా చెప్తుంది: “క్రీస్తు పూర్వం 46లో, రోమా చక్రవర్తి అయిన జూలియస్‌ సీజర్‌ కొత్త సంవత్సర వేడుకల కోసం జనవరి 1ని ఎంచుకున్నాడు. రోమన్లు ఆ రోజును జానస్‌ అనే దేవుడికి అంకితం చేశారు. అతను తలుపులకు, ద్వారాలకు, ప్రతీ ప్రారంభానికి దేవుడు. జానస్‌ అనే పేరు నుండే జనవరి అనే పేరు వచ్చింది. అతనికి రెండు ముఖాలు ఉంటాయి. ఒకటి ముందు వైపు ఉంటుంది, ఒకటి వెనక వైపు ఉంటుంది.” చాలామంది కొత్త సంవత్సరాన్ని జనవరి 1న జరుపుకుంటారు, కొన్ని దేశాల్లో వేరే రోజున జరుపుకుంటారు. వాళ్లు జరుపుకునే వేడుకలు కూడా వేర్వేరుగా ఉంటాయి. చాలాచోట్ల ప్రజలు ఆ రోజున కలిసి తాగుతారు, విచ్చలవిడి విందులు చేసుకుంటారు.

దేవుణ్ణి సంతోషపెట్టే పెళ్లిళ్లు

16, 17. పెళ్లి చేసుకోబోతున్న వాళ్లు దేని గురించి ఆలోచించాలి?

16 పెళ్లి అనేది చాలా సంతోషించే సమయం. ప్రపంచవ్యాప్తంగా పెళ్లిళ్లు వేర్వేరు విధాలుగా జరుగుతాయి. పెళ్లి ఆచారాలు ఎక్కడి నుండి వచ్చాయనేది ప్రజలు సాధారణంగా ఆలోచించరు. కాబట్టి కొన్ని ఆచారాలు అన్యమత నమ్మకాల నుండి వచ్చాయని వాళ్లకు తెలియకపోవచ్చు. అయితే పెళ్లి చేసుకోబోతున్న క్రైస్తవుడు, క్రైస్తవురాలు తమ పెళ్లిలో యెహోవాకు ఇష్టంలేని ఎలాంటి ఆచారాలూ జరగకుండా చూసుకోవాలి. పెళ్లి ఆచారాలు ఎక్కడి నుండి మొదలయ్యాయో తెలుసుకుంటే, వాళ్లు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు.—మార్కు 10:6-9.

17 పెళ్లికొడుకుకు, పెళ్లికూతురికి ‘అదృష్టాన్ని’ తెస్తాయనే నమ్మకంతో ప్రజలు కొన్ని ఆచారాలు చేస్తారు. (యెషయా 65:11) ఉదాహరణకు కొన్నిచోట్ల పెళ్లికొడుకు, పెళ్లికూతురు మీద అక్షింతలు చల్లుతారు. దానివల్ల ఆ దంపతులు సంతానం, సంతోషం, దీర్ఘాయుష్షు పొందుతారని; వాళ్లకు కీడు జరగదని ప్రజలు నమ్ముతారు. అయితే, అబద్ధ మతంతో సంబంధం ఉన్న ఎలాంటి ఆచారాలకైనా క్రైస్తవులు దూరంగా ఉండాలి.—2 కొరింథీయులు 6:14-18 చదవండి.

18. పెళ్లి చేసుకోబోతున్న వాళ్లు ఇంకా ఏ బైబిలు సూత్రాల గురించి ఆలోచించాలి?

18 తమ పెళ్లి గౌరవప్రదంగా జరగాలని, వచ్చినవాళ్లందరూ ఆనందించాలని క్రైస్తవ దంపతులు కోరుకుంటారు. పెళ్లికి వచ్చిన అతిథులు కొత్త జంటతో గానీ ఇతరులతో గానీ అమర్యాదగా, సరసంగా, ఇబ్బందిపెట్టేలా మాట్లాడరు. (సామెతలు 26:18, 19; లూకా 6:31; 10:27) క్రైస్తవ పెళ్లిళ్లు ‘వస్తుసంపదల్ని గొప్పగా చూపించుకునేలా’ ఆడంబరంగా ఉండవు. (1 యోహాను 2:16) మీరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లయితే, అది మీకు తీపి గుర్తుగా ఉండేలా చూసుకోండి.—“పెళ్లి” చూడండి.

టోస్టింగ్‌ ఎలా మొదలైంది?

19, 20. టోస్టింగ్‌ ఎలా మొదలైంది?

19 చాలాచోట్ల పెళ్లిళ్లలో, పార్టీల్లో మద్యం గ్లాసులు పైకెత్తి ఛీర్స్‌ చెప్తుంటారు, దాన్నే టోస్టింగ్‌ అంటారు. ముందుగా ఒకతను మంచి జరగాలని కోరతాడు, మిగతావాళ్లు దానికి అంగీకరిస్తూ తమ గ్లాసులు పైకెత్తుతారు. క్రైస్తవులు టోస్టింగ్‌ని ఎలా చూడాలి?

20 టోస్టింగ్‌ అనేది ఒక ప్రాచీన కాల అన్యమత ఆచారం నుండి వచ్చివుంటుందని ఇంటర్నేషనల్‌ హాండ్‌బుక్‌ ఆన్‌ ఆల్కహాల్‌ అండ్‌ కల్చర్‌ అనే పుస్తకం చెప్తుంది. ప్రాచీన కాలంలో ప్రజలు దీర్ఘాయుష్షును, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని వేడుకుని, ఆ విన్నపాన్ని తీర్చడానికి దేవుళ్లకు పవిత్ర పానీయాన్ని అర్పించేవాళ్లు. అందుకోసం వాళ్లు గ్లాసుల్ని పైకెత్తేవాళ్లు. అయితే క్రైస్తవులు యెహోవా దీవెనలు పొందాలంటే చేయాల్సింది అది కాదు.—యోహాను 14:6; 16:23.

“యెహోవాను ప్రేమించే వాళ్లారా, చెడును అసహ్యించుకోండి”

21. క్రైస్తవులు ఇంకా ఎలాంటి వేడుకలకు దూరంగా ఉండాలి?

21 మీరేదైనా వేడుకలో పాల్గొనాలా వద్దా అని నిర్ణయించుకునేటప్పుడు ఆ వేడుక ఎలాంటి వైఖరిని, ప్రవర్తనను ప్రోత్సహిస్తుందో ఆలోచించండి. ఉదాహరణకు కొన్ని వేడుకల్లో, ఉత్సవాల్లో రెచ్చగొట్టే డాన్సులు, అతిగా తాగడం, అనైతికత ఉంటాయి. కొన్ని వేడుకలు స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహిస్తాయి, మరికొన్ని దేశభక్తిని ప్రోత్సహిస్తాయి. మనం అలాంటి వేడుకల్లో పాల్గొంటే, యెహోవా అసహ్యించుకునే వాటిని అసహ్యించుకున్నట్లు అవుతుందా?—కీర్తన 1:1, 2; 97:10; 119:37.

22. ఏదైనా ఒక వేడుకలో పాల్గొనాలా వద్దా అనేది ఎలా నిర్ణయించుకోవచ్చు?

22 దేవుణ్ణి అగౌరవపర్చే ఎలాంటి వేడుకలకైనా క్రైస్తవులు దూరంగా ఉండాలి. అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “మీరు తిన్నా, తాగినా, ఇంకేమి చేసినా అన్నీ దేవునికి మహిమ తీసుకొచ్చేలా చేయండి.” (1 కొరింథీయులు 10:31; “తెలివైన నిర్ణయాలు తీసుకోవడం” చూడండి.) నిజమే ప్రతీ వేడుకకు అనైతికత, అబద్ధ మతం, దేశభక్తి వంటివాటితో సంబంధం ఉండదు. ఏదైనా ఒక వేడుక బైబిలు సూత్రాలకు విరుద్ధంగా లేకపోతే, అందులో పాల్గొనాలా వద్దా అనేది మనం వ్యక్తిగతంగా నిర్ణయించుకోవాలి. అయితే మన నిర్ణయం ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కూడా ఆలోచించాలి.

మీ మాటలతో, చేతలతో యెహోవాను మహిమపర్చండి

23, 24. మన నిర్ణయాల్ని సాక్షులుకాని కుటుంబ సభ్యులకు ఎలా వివరించవచ్చు?

23 యెహోవాను అగౌరవపర్చే వేడుకల్లో పాల్గొనడం బహుశా మీరు మానేసివుంటారు. దానివల్ల సాక్షులుకాని మీ కుటుంబ సభ్యులు మీకు వాళ్ల మీద ప్రేమలేదని, ఇక వాళ్లతో కలిసివుండడం మీకు ఇష్టంలేదని అనుకోవచ్చు. కుటుంబమంతా కలవడానికి పండుగ రోజులే మంచి అవకాశం అని వాళ్లు అనుకోవచ్చు. మరి మీరేం చేయవచ్చు? మీకు వాళ్ల పట్ల ప్రేమ ఉందని, వాళ్లు మీకు ముఖ్యమైన వాళ్లని ఎన్నో విధాలుగా చూపించవచ్చు. (సామెతలు 11:25; ప్రసంగి 3:12, 13) కలిసి సమయం గడపడానికి వేరే సందర్భాల్లో వాళ్లను ఆహ్వానించవచ్చు.

24 ఫలానా పండుగను ఎందుకు చేసుకోరని మీ బంధువులు అడిగితే, మీరు ప్రచురణల్లో, jw.orgలో పరిశోధన చేయవచ్చు. అప్పుడు, ఏ కారణాల వల్ల మీరు దాన్ని చేసుకోవట్లేదో వాళ్లకు చక్కగా వివరించగలుగుతారు. మీరు వాదన గెలవడానికి, మీ అభిప్రాయాల్ని రుద్దడానికి ప్రయత్నిస్తున్నారని వాళ్లు అనుకునేలా మాట్లాడకండి. చాలా విషయాల్ని ఆలోచించి మీరే సొంతగా ఈ నిర్ణయం తీసుకున్నారని వాళ్లు గుర్తించేలా మాట్లాడండి. ప్రశాంతంగా ఉండండి, “మీ మాటలు ఎప్పుడూ దయగా, ఉప్పు వేసినట్టు రుచిగా” ఉండనివ్వండి.—కొలొస్సయులు 4:6.

25, 26. యెహోవా ప్రమాణాల్ని ప్రేమించేలా తల్లిదండ్రులు పిల్లలకు ఎలా సహాయం చేయవచ్చు?

25 కొన్ని వేడుకల్లో మనం ఎందుకు పాల్గొనమో మనకు స్పష్టంగా తెలిసుండాలి. (హెబ్రీయులు 5:14) యెహోవాను సంతోషపెట్టాలన్నదే మన లక్ష్యం. మీరు తల్లిదండ్రులైతే మీ పిల్లలు బైబిలు సూత్రాల్ని అర్థంచేసుకుని, వాటిని ప్రేమించేలా సహాయం చేయండి. మీ పిల్లలు యెహోవాను ఒక నిజమైన వ్యక్తిగా తెలుసుకుంటే, వాళ్లు కూడా ఆయన్ని సంతోషపెట్టాలని కోరుకుంటారు.—యెషయా 48:17, 18; 1 పేతురు 3:15.

26 యెహోవాను పవిత్రంగా, నిజాయితీగా ఆరాధించడానికి మనం చేయగలిగినదంతా చేసినప్పుడు ఆయన సంతోషిస్తాడు. (యోహాను 4:23) అయితే, అవినీతితో నిండిన ఈ లోకంలో ఒక వ్యక్తి నిజాయితీగా ఉండడం అసాధ్యమని చాలామంది అనుకుంటారు. అది నిజమేనా? దానిగురించి తర్వాతి అధ్యాయంలో పరిశీలిద్దాం.

^ కొన్ని పండుగలు, ఆచారాల గురించిన సమాచారాన్ని యెహోవాసాక్షుల పరిశోధనా పుస్తకంలో, jw.org వెబ్‌సైట్‌లో చూడవచ్చు.