కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

8వ అధ్యాయం

యెహోవా ప్రజలు పవిత్రంగా ఉంటారు

యెహోవా ప్రజలు పవిత్రంగా ఉంటారు

“మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని పవిత్రులు అవ్వండి, ఎందుకంటే నేను పవిత్రుణ్ణి.”—లేవీయకాండం 11:44.

1-3. (ఎ) ఒక తల్లి తన పిల్లవాణ్ణి ఎందుకు శుభ్రంగా ఉంచుతుంది? (బి) తన ప్రజలు పవిత్రంగా ఉండాలని యెహోవా ఎందుకు కోరుకుంటున్నాడు?

 ప్రేమగల ఒక తల్లి తన పిల్లవాణ్ణి స్కూలుకు పంపించడానికి సిద్ధం చేస్తోంది. ఆ పిల్లవాడికి స్నానం చేయించి శుభ్రంగా, మంచిగా ఉన్న బట్టలు వేసింది. శుభ్రంగా ఉండడం వల్ల అతను ఆరోగ్యంగా ఉంటాడు, చూసేవాళ్లకు అతని తల్లిదండ్రుల మీద మంచి అభిప్రాయం కలుగుతుంది.

2 మనం శుభ్రంగా, పవిత్రంగా ఉండాలని మన తండ్రి అయిన యెహోవా కోరుకుంటున్నాడు. (లేవీయకాండం 11:44, 45) ఎందుకంటే అలా ఉండడం వల్ల మనకు మేలు జరుగుతుంది. అంతేకాదు యెహోవాకు మహిమ వస్తుంది.—యెహెజ్కేలు 36:22; 1 పేతురు 2:12 చదవండి.

3 పవిత్రంగా ఉండడం అంటే ఏంటి? దానివల్ల మనకెలా మేలు జరుగుతుంది? ఈ ప్రశ్నలు పరిశీలిస్తూ మీరు ఏయే మార్పులు చేసుకోవచ్చో ఆలోచించండి.

మనం ఎందుకు పవిత్రంగా ఉండాలి?

4, 5. (ఎ) మనం ఎందుకు శుభ్రంగా ఉండాలి? (బి) శుభ్రతను యెహోవా ప్రాముఖ్యంగా ఎంచుతాడని సృష్టి ఎలా చూపిస్తుంది?

4 పవిత్రంగా ఉండే విషయంలో యెహోవాయే మంచి ఆదర్శం. (లేవీయకాండం 19:2) మనం ‘దేవుణ్ణి అనుకరించాలని’ కోరుకుంటాం. మనం పవిత్రంగా ఉండడానికి ముఖ్య కారణం అదే.—ఎఫెసీయులు 5:1.

5 శుభ్రతను యెహోవా ప్రాముఖ్యంగా ఎంచుతాడని సృష్టిని చూస్తే అర్థమౌతుంది. గాలి, నీరు శుభ్రంగా ఉండేలా యెహోవా ప్రకృతి చక్రాల్ని ఏర్పాటు చేశాడు. (యిర్మీయా 10:12) కాలుష్యం రోజురోజుకీ పెరిగిపోతుంది. అయినా, భూమి దానికదే ఎన్నో విధాలుగా శుభ్రం చేసుకుంటుంది. ఉదాహరణకు, యెహోవా కొన్ని సూక్ష్మ జీవుల్ని సృష్టించాడు. వాటిని మైక్రోస్కోప్‌ (సూక్ష్మదర్శిని) సహాయంతో మాత్రమే చూడగలం. ఈ సూక్ష్మ జీవులు విషపూరితమైన వ్యర్థాల్ని హానిలేని పదార్థాలుగా మారుస్తాయి. ఇది శక్తివంతమైన ప్రక్రియ! శాస్త్రవేత్తలు ఈ సూక్ష్మ జీవుల్లో కొన్నిటిని ఉపయోగించి, కాలుష్యం వల్ల కలుగుతున్న నష్టాన్ని తగ్గిస్తున్నారు.—రోమీయులు 1:20.

6, 7. యెహోవా ఆరాధకులు శుభ్రంగా ఉండాలని ధర్మశాస్త్రం ఎలా తెలియజేసింది?

6 యెహోవా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రం కూడా, శుభ్రంగా ఉండడం ఎంత ప్రాముఖ్యమో తెలియజేసింది. ఉదాహరణకు, ప్రజలు శుభ్రంగా ఉంటేనే యెహోవా వాళ్ల ఆరాధనను అంగీకరించేవాడు. ప్రాయశ్చిత్త రోజున ప్రధానయాజకుడు రెండుసార్లు స్నానం చేయాలి. (లేవీయకాండం 16:4, 23, 24) యాజకులు కూడా కాళ్లూచేతులు కడుక్కున్న తర్వాతే బలులు అర్పించాలి. (నిర్గమకాండం 30:17-21; 2 దినవృత్తాంతాలు 4:6) కొన్ని సందర్భాల్లో శుభ్రతను పాటించకపోతే మరణశిక్ష విధించేవాళ్లు.—లేవీయకాండం 15:31; సంఖ్యాకాండం 19:17-20.

7 నేడు మన సంగతేంటి? ధర్మశాస్త్రం యెహోవా ప్రమాణాల గురించి ఎంతో నేర్పిస్తుంది. (మలాకీ 3:6) యెహోవా ఆరాధకులు శుభ్రంగా ఉండాలని అది స్పష్టం చేస్తుంది. ఆయన ప్రమాణాలు ఏమాత్రం మారలేదు. నేడు కూడా తన ఆరాధకులు శుభ్రంగా, పవిత్రంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు.—యాకోబు 1:27.

పవిత్రంగా ఉండడం అంటే ఏంటి?

8. మనం ఏయే విషయాల్లో పవిత్రంగా ఉండాలి?

8 యెహోవా దృష్టిలో పవిత్రంగా ఉండడం అంటే మనల్ని, మన బట్టల్ని, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే కాదు. మన ఆరాధన, ప్రవర్తన, ఆలోచనలు కూడా పవిత్రంగా ఉండాలి. అవును, యెహోవా మనల్ని పవిత్రులుగా ఎంచాలంటే జీవితంలోని అన్ని విషయాల్లో శుభ్రంగా, పవిత్రంగా ఉండాలి.

9, 10. ఆరాధన పవిత్రంగా ఉండడం అంటే అర్థం ఏంటి?

9 పవిత్రమైన ఆరాధన. మనకు అబద్ధ మతంతో ఎలాంటి సంబంధం ఉండకూడదు. ఇశ్రాయేలీయులు బబులోనులో బందీలుగా ఉన్నప్పుడు, చుట్టూ వేరే దేవుళ్లను ఆరాధించే ప్రజలు ఉండేవాళ్లు. ఆ ప్రజల ఆరాధనలో అనైతికత ఉండేది. అయితే, ఇశ్రాయేలీయులు తమ దేశానికి తిరిగొచ్చి స్వచ్ఛారాధనను కొనసాగిస్తారని యెషయా ప్రవచించాడు. “అక్కడి నుండి వెళ్లిపోండి, అపవిత్రమైన దేన్నీ ముట్టుకోకండి! . . . దాని మధ్య నుండి వెళ్లిపోండి, మిమ్మల్ని మీరు పవిత్రంగా ఉంచుకోండి” అని యెహోవా వాళ్లకు చెప్పాడు. అంటే వాళ్ల ఆరాధన బబులోనులోని అబద్ధ మత బోధలతో, అలవాట్లతో, ఆచారాలతో కలుషితం కాకూడదు.—యెషయా 52:11.

10 నేటి నిజ క్రైస్తవులు కూడా అబద్ధ మతానికి దూరంగా ఉంటారు. (1 కొరింథీయులు 10:21 చదవండి.) అబద్ధ మత బోధల నుండి పుట్టుకొచ్చిన ఎన్నో పద్ధతులు, ఆచారాలు, నమ్మకాలు ప్రపంచమంతటా ఉన్నాయి. ఉదాహరణకు, మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ బ్రతికే ఉంటుందని చాలామంది నమ్ముతారు. ఆ నమ్మకం నుండే ఎన్నో ఆచారాలు పుట్టుకొచ్చాయి. (ప్రసంగి 9:5, 6, 10) క్రైస్తవులు అలాంటి ఆచారాలకు దూరంగా ఉండాలి. వాటిలో పాల్గొనమని కుటుంబ సభ్యులు మనల్ని ఒత్తిడి చేయవచ్చు. కానీ మనం యెహోవా దృష్టిలో పవిత్రంగా ఉండాలని కోరుకుంటాం కాబట్టి వాళ్ల ఒత్తిడికి లొంగిపోం.—అపొస్తలుల కార్యాలు 5:29.

11. మన ప్రవర్తనను ఎలా పవిత్రంగా ఉంచుకోవచ్చు?

11 పవిత్రమైన ప్రవర్తన. యెహోవా దృష్టిలో పవిత్రంగా ఉండాలంటే అన్ని రకాల లైంగిక పాపాలకు దూరంగా ఉండాలి. (ఎఫెసీయులు 5:5 చదవండి.) “లైంగిక పాపానికి దూరంగా పారిపోండి” అని యెహోవా చెప్తున్నాడు. ఏమాత్రం పశ్చాత్తాపపడకుండా అనైతికంగా ప్రవర్తించేవాళ్లు “దేవుని రాజ్యానికి వారసులు అవ్వరు” అని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు.—1 కొరింథీయులు 6:9, 10, 18; “నైతిక పవిత్రత” చూడండి.

12, 13. మన ఆలోచనలు ఎందుకు పవిత్రంగా ఉండాలి?

12 పవిత్రమైన ఆలోచనలు. సాధారణంగా మనం ఏం ఆలోచిస్తామో అవే చేస్తాం. (మత్తయి 5:28; 15:18, 19) కాబట్టి మన ఆలోచనలు పవిత్రంగా ఉంటే మనం పవిత్రంగా నడుచుకుంటాం. నిజమే, మనం అపరిపూర్ణులం కాబట్టి అప్పుడప్పుడు చెడ్డ ఆలోచనలు వస్తుంటాయి. అలా వచ్చినప్పుడు వెంటనే వాటిని తీసేసుకోవాలి. లేదంటే మెల్లమెల్లగా మన హృదయం అపవిత్రమైపోవచ్చు, మనం ఏం ఆలోచిస్తూ ఉన్నామో వాటినే చేయాలని అనుకోవచ్చు. కాబట్టి మన మనసును పవిత్రమైన ఆలోచనలతో నింపుకోవాలి. (ఫిలిప్పీయులు 4:8 చదవండి.) అందుకే మనం అనైతికత, హింస వంటివి ఉన్న వినోదానికి దూరంగా ఉంటాం. మనం వేటిని చదవాలో, చూడాలో, మాట్లాడాలో జాగ్రత్తగా ఎంచుకుంటాం.—కీర్తన 19:8, 9.

13 దేవుని ప్రేమలో నిలిచివుండాలంటే మన ఆరాధన, ప్రవర్తన, ఆలోచనలు పవిత్రంగా ఉండాలి. అయితే మన శరీరాన్ని, పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవడం కూడా యెహోవా దృష్టిలో ముఖ్యమైనదే.

మనం ఎలా శుభ్రంగా ఉండవచ్చు?

14. మనం ఎందుకు శుభ్రంగా ఉండాలి?

14 మన శరీరాన్ని, పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవడం మనకు, చుట్టుపక్కల వాళ్లకు మేలు చేస్తుంది. శుభ్రంగా ఉంటే మనకు మంచిగా, సంతృప్తిగా అనిపిస్తుంది. ఇతరులు కూడా మనతో ఉండడానికి ఇష్టపడతారు. అయితే మనం శుభ్రంగా ఉండడానికి అంతకన్నా ముఖ్యమైన కారణం ఉంది. మన పరిశుభ్రత యెహోవాకు మంచిపేరు తెస్తుంది. దీని గురించి ఆలోచించండి: ఒక పిల్లవాడు ఎప్పుడూ మురికిగా ఉంటే, మీరు అతని తల్లిదండ్రుల గురించి చెడుగా అనుకోవచ్చు. అదేవిధంగా మనం శుభ్రంగా ఉండకపోతే, దానిమీద మనసుపెట్టకపోతే ప్రజలు యెహోవా గురించి చెడుగా అనుకోవచ్చు. పౌలు ఇలా అన్నాడు: “మా పరిచర్యను తప్పుబట్టే అవకాశం ఏమాత్రం ఇవ్వకూడదని, మేము ఎవ్వరికీ ఏ విషయంలోనూ ఎలాంటి ఆటంకం కలిగించట్లేదు; బదులుగా, అన్నివిధాలా మమ్మల్ని మేము దేవుని పరిచారకులుగా సిఫారసు చేసుకుంటున్నాం.”—2 కొరింథీయులు 6:3, 4.

మనం యెహోవా ప్రజలం కాబట్టి మనల్ని, మన పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవాలి

15, 16. మనం శుభ్రంగా ఉండడానికి ఏం చేయవచ్చు?

15 మన శరీరం, బట్టలు. మనం ప్రతీరోజు శుభ్రంగా ఉంటాం. ఉదాహరణకు మనం రోజూ స్నానం చేస్తాం. వంట చేసేముందు, తినేముందు చేతుల్ని సబ్బుతో కడుక్కుంటాం. అలాగే టాయిలెట్‌కు వెళ్లి వచ్చిన తర్వాత, మురికిగా ఉన్న దేన్నైనా ముట్టుకున్న తర్వాత ఖచ్చితంగా చేతుల్ని సబ్బుతో కడుక్కుంటాం. చేతుల్ని కడుక్కోవడం చిన్న విషయం అనిపించినా క్రిములు, వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండాలంటే అది చాలా అవసరం. అది ప్రాణాల్ని కూడా కాపాడగలదు. ఒకవేళ టాయిలెట్‌, డ్రైనేజీ వంటి సదుపాయాలు లేకపోతే వేరే మార్గాల గురించి ఆలోచించవచ్చు. ప్రాచీన ఇశ్రాయేలీయులకు ఆ సదుపాయాలు లేవు కాబట్టి ఇళ్లకు, నీళ్లు ఉండే స్థలాలకు దూరంగా వెళ్లి, గుంట చేసి మలాన్ని కప్పేవాళ్లు.—ద్వితీయోపదేశకాండం 23:12, 13.

16 మన బట్టలు ఖరీదైనవిగా, ఆడంబరంగా, ఫ్యాషన్‌గా ఉండాల్సిన అవసరం లేదు. కానీ అవి శుభ్రంగా, పద్ధతిగా ఉండాలి. (1 తిమోతి 2:9, 10 చదవండి.) మనం కనబడేతీరు ఎప్పుడూ యెహోవాకు మహిమ తీసుకురావాలని కోరుకుంటాం.—తీతు 2:10.

17. మన ఇంటిని, పరిసరాల్ని ఎందుకు శుభ్రంగా ఉంచుకుంటాం?

17 మన ఇల్లు, పరిసరాలు. మనం ఎలాంటి ప్రాంతంలో నివసించినా మన ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటాం. కారు, బైక్‌, లేదా ఏ వాహనం వాడుతున్నా దాన్ని శుభ్రంగా ఉంచుకుంటాం. ముఖ్యంగా కూటాలకు, పరిచర్యకు వెళ్లేటప్పుడు అలా చేస్తాం. ఎందుకంటే, శుభ్రంగా ఉండే పరదైసు భూమి గురించి మనం ఇతరులకు ప్రకటిస్తాం. (లూకా 23:43; ప్రకటన 11:18) అంతేకాదు మన ఇంటిని, పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా పరిశుభ్రమైన కొత్తలోకంలో జీవించడానికి సిద్ధపడుతున్నామని చూపిస్తాం.

18. మన ఆరాధనా స్థలాన్ని ఎందుకు శుభ్రంగా ఉంచుకుంటాం?

18 మన ఆరాధనా స్థలం. మన ఆరాధనా స్థలాల్ని అంటే రాజ్యమందిరాల్ని, సమావేశ హాళ్లను శుభ్రంగా ఉంచుకుంటాం. ప్రజలు రాజ్యమందిరానికి మొదటిసారి వచ్చినప్పుడు అది శుభ్రంగా ఉండడం గమనిస్తారు. దానివల్ల యెహోవాకు మహిమ వస్తుంది. రాజ్యమందిరాన్ని శుభ్రంగా, మంచి స్థితిలో ఉంచే అవకాశం సంఘంలోని వాళ్లందరికీ ఉంది.—2 దినవృత్తాంతాలు 34:10.

అపవిత్రమైన అలవాట్లను విడిచిపెట్టండి

19. మనం వేటికి దూరంగా ఉండాలి?

19 మనం దూరంగా ఉండాల్సిన చెడ్డ అలవాట్లన్నిటి గురించి బైబిల్లో లేదు. కానీ వాటి విషయంలో యెహోవా అభిప్రాయాన్ని తెలియజేసే సూత్రాలు బైబిల్లో ఉన్నాయి. మనం సిగరెట్లకు, మత్తుపదార్థాలకు (డ్రగ్స్‌కు) దూరంగా ఉండాలని, మద్యం అతిగా తాగకూడదని ఆయన కోరుకుంటున్నాడు. మనం దేవుని స్నేహితులమైతే, అలాంటివి చేయం. ఎందుకంటే, మనం ప్రాణం అనే బహుమతిని ఎంతో గౌరవిస్తాం. చెడ్డ అలవాట్ల వల్ల మన ఆయుష్షు తగ్గిపోతుంది, ఆరోగ్యం పాడౌతుంది, మన పక్కనున్న వాళ్లకు కూడా హాని జరుగుతుంది. చాలామంది తమ ఆరోగ్యం కోసం వాటిని మానుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే యెహోవా స్నేహితులమైన మనం, వాటిని మానుకోవడానికి అంతకన్నా ముఖ్యమైన కారణం ఉంది, అదే దేవుని మీద మనకున్న ప్రేమ. ఒక యువతి ఇలా అంది: “యెహోవా సహాయంతో నా జీవితాన్ని బాగు చేసుకున్నాను, చెడ్డ అలవాట్లను మానుకున్నాను. . . . నా సొంతగా అయితే ఆ మార్పుల్ని చేసుకోగలిగేదాన్ని కాదేమో.” హానికరమైన అలవాట్లను మానుకోవడానికి సహాయం చేసే ఐదు బైబిలు సూత్రాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

20, 21. మనం ఎలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు?

20 “శరీరానికి, మనసుకు ఏ కళంకం లేకుండా మనల్ని మనం శుభ్రపర్చుకుందాం; దైవభయంతో పూర్తిస్థాయిలో పవిత్రులమవ్వడానికి కృషిచేద్దాం.” (2 కొరింథీయులు 7:1) మన మనసుకు లేదా శరీరానికి హానిచేసే అపవిత్రమైన అలవాట్లకు మనం దూరంగా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు.

21 ‘ఏ కళంకం లేకుండా మనల్ని మనం శుభ్రపర్చుకోవడానికి’ గల బలమైన కారణం 2 కొరింథీయులు 6:17, 18 లో ఉంది. యెహోవా ఇలా చెప్తున్నాడు: “అపవిత్రమైనదాన్ని ముట్టకండి.” తర్వాత ఆయన ఇలా మాటిచ్చాడు: “నేను మిమ్మల్ని స్వీకరిస్తాను. నేను మీకు తండ్రిని అవుతాను, మీరు నాకు కుమారులు, కూతుళ్లు అవుతారు.” అవును, ఆయన దృష్టిలో మనల్ని అపవిత్రం చేసే వాటన్నిటికీ దూరంగా ఉంటే, తండ్రి తన పిల్లల్ని ప్రేమించినట్టు యెహోవా మనల్ని ప్రేమిస్తాడు.

22-25. అపవిత్రమైన అలవాట్లకు దూరంగా ఉండడానికి ఏ బైబిలు సూత్రాలు సహాయం చేస్తాయి?

22 “నువ్వు నీ దేవుడైన యెహోవాను నీ నిండు హృదయంతో, నీ నిండు ప్రాణంతో, నీ నిండు మనసుతో ప్రేమించాలి.” (మత్తయి 22:37) ఇది అన్నిటికన్నా ముఖ్యమైన ఆజ్ఞ. (మత్తయి 22:38) మన సంపూర్ణ ప్రేమను పొందడానికి యెహోవా అర్హుడు. మన ఆయుష్షును తగ్గించే లేదా మెదడును పాడుచేసే దేన్నైనా చేయాలని నిర్ణయించుకుంటే, మనం ఆయన్ని సంపూర్ణంగా ప్రేమించినట్లు ఎలా అవుతుంది? కాబట్టి, ఆయన ఇచ్చిన ప్రాణం పట్ల గౌరవం చూపించడానికి మనం చేయగలిగినదంతా చేస్తాం.

23 “[యెహోవా] అందరికీ ప్రాణాన్ని, ఊపిరిని, అన్నిటినీ ఇస్తున్నాడు.” (అపొస్తలుల కార్యాలు 17:24, 25) మీ స్నేహితుడు ఏదైనా ప్రత్యేకమైన బహుమతి ఇస్తే మీరు దాన్ని పాడుచేసుకుంటారా? ప్రాణం దేవుడు ఇచ్చిన గొప్ప బహుమతి. మనం దాన్ని చాలా విలువైనదిగా చూస్తాం. కాబట్టి మన జీవితాన్ని ఆయనకు మహిమ తెచ్చేలా ఉపయోగించాలని కోరుకుంటాం.—కీర్తన 36:9.

24 “నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు నీ సాటిమనిషిని ప్రేమించాలి.” (మత్తయి 22:39) అపవిత్రమైన అలవాట్లు మనకే కాదు మన చుట్టూ ఉన్నవాళ్లకు కూడా హాని చేయవచ్చు. ముఖ్యంగా మనం ఎంతగానో ప్రేమించే మన కుటుంబ సభ్యులకు హాని చేయవచ్చు. ఉదాహరణకు ఇంట్లో పొగ తాగేవాళ్లు ఉంటే, వాళ్లు విడిచిన పొగను పీల్చడం వల్ల ఇంట్లోవాళ్లకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి చెడు అలవాట్లు మానుకోవడం ద్వారా మన చుట్టూ ఉన్నవాళ్లను ప్రేమిస్తున్నామని చూపిస్తాం.—1 యోహాను 4:20, 21.

25 “ప్రభుత్వాలకు, అధికారాలకు లోబడమని . . . వాళ్లకు గుర్తుచేస్తూ ఉండు.” (తీతు 3:1) చాలా దేశాల్లో కొన్నిరకాల డ్రగ్స్‌ కలిగివుండడం, ఉపయోగించడం చట్ట వ్యతిరేకం. ప్రభుత్వాల్ని గౌరవించమని యెహోవా చెప్తున్నాడు కాబట్టి మనం అలాంటి చట్టాలకు లోబడతాం.—రోమీయులు 13:1.

మనం శుభ్రంగా, పవిత్రంగా ఉండడం ద్వారా యెహోవాకు మహిమ తెస్తాం

26. (ఎ) యెహోవా మన ఆరాధనను అంగీకరించాలంటే మనం ఏం చేయాలి? (బి) పవిత్రంగా ఉండడానికి కృషిచేస్తే వచ్చే ప్రయోజనం ఏంటి?

26 యెహోవాకు స్నేహితులుగా ఉండాలంటే, మనం కొన్ని మార్పులు చేసుకోవాల్సి రావచ్చు. అది ఇప్పుడే మొదలుపెట్టాలి. అపవిత్రమైన అలవాటును మానుకోవడం అన్నిసార్లు అంత తేలిక కాదు, కానీ మనం మానుకోగలం! సహాయం చేస్తానని యెహోవా మాటిస్తున్నాడు. ఆయన ఇలా అన్నాడు: “యెహోవా అనే నేనే నీ దేవుణ్ణి. నీకు ప్రయోజనం కలిగేలా నేనే నీకు బోధిస్తున్నాను, నువ్వు నడవాల్సిన దారిలో నేనే నిన్ను నడిపిస్తున్నాను.” (యెషయా 48:17) శుభ్రంగా, పవిత్రంగా ఉండడానికి చేయగలిగినదంతా చేసినప్పుడు, మన దేవునికి మహిమ తెస్తున్నామనే నమ్మకంతో ఉండవచ్చు.