కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

2వ అధ్యాయం

దేవుని ముందు మంచి మనస్సాక్షితో ఉండండి

దేవుని ముందు మంచి మనస్సాక్షితో ఉండండి

“మంచి మనస్సాక్షిని కాపాడుకోండి.”​—1 పేతురు 3:16.

1, 2. తెలియని ప్రదేశంలో దారి చూపించే వ్యక్తులు లేదా పరికరాలు ఉండడం ఎందుకు అవసరం? మనకు దారి చూపించడానికి యెహోవా ఏం ఇచ్చాడు?

 మీరు ఒక పెద్ద ఎడారిలో నడుస్తున్నారు అనుకోండి. గాలి బలంగా వీస్తుండడం వల్ల ఇసుక తిన్నెల ఆకారం మారిపోతోంది. అలాంటి పరిస్థితిలో మీరు సులభంగా దారి తప్పవచ్చు. కాబట్టి మీ దగ్గర దిక్సూచి, మ్యాపు, GPS వంటివి ఉండాలి. లేదా మీకు సూర్యుడు, నక్షత్రాల్ని బట్టి దారి కనిపెట్టడం అయినా తెలిసుండాలి. ఆ ఎడారి గురించి బాగా తెలిసిన వ్యక్తయినా మీతో ఉండాలి. లేదంటే మీ ప్రాణం ప్రమాదంలో పడవచ్చు.

2 మనందరికీ జీవితంలో చాలా సమస్యలు వస్తాయి, కొన్నిసార్లు దిక్కుతోచని స్థితిలో ఉంటాం. అయితే దారి చూపించడానికి యెహోవా మనందరికీ మనస్సాక్షిని ఇచ్చాడు. (యాకోబు 1:17) ముందుగా మనస్సాక్షి అంటే ఏంటో, అదెలా పనిచేస్తుందో తెలుసుకుందాం. తర్వాత మన మనస్సాక్షికి ఎలా శిక్షణ ఇవ్వవచ్చో, వేరేవాళ్ల మనస్సాక్షిని ఎందుకు పట్టించుకోవాలో, మంచి మనస్సాక్షి మనకెలా మేలు చేస్తుందో పరిశీలిద్దాం.

మనస్సాక్షి అంటే ఏంటి? అదెలా పనిచేస్తుంది?

3. మనస్సాక్షి అంటే ఏంటి?

3 మనస్సాక్షి అంటే తప్పొప్పుల్ని గుర్తించే సామర్థ్యం. మనలో న్యాయమూర్తిలా పనిచేసే ఈ మనస్సాక్షి యెహోవా ఇచ్చిన గొప్ప బహుమతి. బైబిల్లో “మనస్సాక్షి” అని ఉపయోగించిన గ్రీకు పదానికి, “మన గురించి మనకు తెలియడం” అని అర్థం. మనస్సాక్షి సరిగ్గా పనిచేసినప్పుడు మనల్ని, మన లోపలి ఆలోచనల్ని, భావాల్ని నిజాయితీగా పరిశీలించుకుంటాం. అది మనల్ని చెడుకు దూరంగా ఉంచుతూ మంచి వైపు నడిపిస్తుంది. మనస్సాక్షి వల్ల సరైన నిర్ణయం తీసుకున్నప్పుడు సంతోషిస్తాం, తప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు బాధపడతాం.—“మనస్సాక్షి” చూడండి.

4, 5. (ఎ) ఆదాముహవ్వలు తమ మనస్సాక్షి చెప్పింది వినకపోవడం వల్ల ఏం జరిగింది? (బి) మనస్సాక్షి ఎలా పనిచేస్తుందో తెలిపే కొన్ని బైబిలు ఉదాహరణలు చెప్పండి.

4 మనలో ప్రతీ ఒక్కరం మనస్సాక్షి చెప్పేది వినాలో వద్దో నిర్ణయించుకోవచ్చు. ఆదాముహవ్వలు తమ మనస్సాక్షి చెప్పింది వినకుండా పాపం చేశారు. తర్వాత వాళ్లు బాధపడినా ప్రయోజనం లేకపోయింది. వాళ్లు అప్పటికే దేవుని ఆజ్ఞను మీరారు. (ఆదికాండం 3:7, 8) పరిపూర్ణ మనస్సాక్షి ఉన్నా, దేవుని ఆజ్ఞను మీరడం తప్పని తెలిసినా, వాళ్లు తమ మనస్సాక్షి చెప్పింది వినలేదు.

5 అయితే అపరిపూర్ణులైన చాలామంది ఆదాముహవ్వల్లా కాకుండా తమ మనస్సాక్షి చెప్పింది విన్నారు. అందుకు యోబు ఒక మంచి ఉదాహరణ. అతను మనస్సాక్షి చెప్పేది విని సరైన నిర్ణయాలు తీసుకున్నాడు కాబట్టే ఇలా అనగలిగాడు: “నేను జీవించినంత కాలం నా హృదయం నన్ను తప్పుపట్టదు.” (యోబు 27:6) ఇక్కడ “హృదయం” అనే మాట అతని మనస్సాక్షిని, అంటే తప్పొప్పులు గుర్తించే సామర్థ్యాన్ని సూచిస్తుంది. దావీదు విషయానికొస్తే, అతను కొన్నిసార్లు తన మనస్సాక్షిని పట్టించుకోకుండా యెహోవాకు అవిధేయత చూపించాడు. కానీ తర్వాత ‘అతని మనస్సాక్షి అతన్ని గద్దించింది.’ (1 సమూయేలు 24:5) అంటే, అతను చేసింది తప్పని మనస్సాక్షి అతనికి చెప్పింది. మనస్సాక్షి చెప్పింది వినడం వల్ల అతను పశ్చాత్తాపపడ్డాడు, మళ్లీ ఎప్పుడూ ఆ తప్పు చేయలేదు.

6. దేవుడు ప్రతీ ఒక్కరికి మనస్సాక్షి అనే బహుమతిని ఇచ్చాడని ఎందుకు చెప్పవచ్చు?

6 సాధారణంగా, యెహోవా గురించి తెలియని ప్రజలకు కూడా తప్పొప్పుల్ని గుర్తించే సామర్థ్యం ఉంటుంది. బైబిలు ఇలా చెప్తుంది: “ఫలానా విషయంలో వాళ్లు దోషులో కాదో వాళ్ల ఆలోచనలే చెప్తాయి.” (రోమీయులు 2:14, 15) ఉదాహరణకు హత్య చేయడం, దొంగతనం చేయడం తప్పని చాలామందికి తెలుసు. తప్పొప్పుల్ని గుర్తించే ఆ సామర్థ్యాన్ని వాళ్లలో పెట్టింది యెహోవాయే. నిజానికి వాళ్లు తెలియకుండానే తమ మనస్సాక్షి చెప్పేది వింటున్నారు, దేవుని సూత్రాల్ని పాటిస్తున్నారు. సూత్రాలు అంటే సరైన నిర్ణయం తీసుకునేలా సహాయం చేయడానికి యెహోవా ఇచ్చిన ప్రాథమిక సత్యాలు.

7. కొన్నిసార్లు మనస్సాక్షి ఎందుకు మనల్ని తప్పుదారి పట్టించవచ్చు?

7 కొన్నిసార్లు మన అపరిపూర్ణ ఆలోచనల వల్ల, భావాల వల్ల మనస్సాక్షి మనల్ని తప్పుదారి పట్టించవచ్చు. కాబట్టి మన మనస్సాక్షి సరిగ్గా పనిచేయాలంటే దానికి శిక్షణ అవసరం. (ఆదికాండం 39:1, 2, 7-12) ఈ విషయంలో మనకు సహాయం చేయడానికి యెహోవా పవిత్రశక్తిని, బైబిలు సూత్రాల్ని ఇచ్చాడు. (రోమీయులు 9:1) మనస్సాక్షికి ఎలా శిక్షణ ఇవ్వవచ్చో ఇప్పుడు పరిశీలిద్దాం.

మనస్సాక్షికి ఎలా శిక్షణ ఇవ్వవచ్చు?

8. (ఎ) మన హృదయం మనస్సాక్షిపై ఎలా ప్రభావం చూపించవచ్చు? (బి) ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మనం ఏమని ప్రశ్నించుకోవాలి?

8 మనసుకు నచ్చింది చేయడమే మనస్సాక్షి మాట వినడం అని కొంతమంది అనుకుంటారు. తమ దృష్టికి ఏది మంచిదనిపిస్తే అది చేయవచ్చని వాళ్లు అనుకుంటారు. కానీ మన అపరిపూర్ణ భావాలు చాలా శక్తివంతమైనవి, అవి మనల్ని తప్పుదారి పట్టించగలవు. “హృదయం అన్నిటికన్నా మోసకరమైంది, ప్రమాదకరమైంది. దాన్ని ఎవరు తెలుసుకోగలరు?” అని బైబిలు అంటోంది. (యిర్మీయా 17:9) కాబట్టి ఒక విషయం తప్పయినా, అది సరైనదని అనుకునేలా హృదయం మన మనస్సాక్షిని మోసగించవచ్చు. ఉదాహరణకు, క్రైస్తవుడిగా మారకముందు పౌలు దేవుని ప్రజల్ని క్రూరంగా హింసిస్తూ, తాను సరైనదే చేస్తున్నానని అనుకున్నాడు. అతని దృష్టిలో అతనికి మంచి మనస్సాక్షి ఉంది. కానీ తాను యెహోవా దృష్టిలో తప్పు చేస్తున్నానని పౌలు గ్రహించాడు, అవసరమైన మార్పులు చేసుకున్నాడు. అతను ఇలా రాశాడు: “నన్ను పరిశీలించేది యెహోవాయే.” (1 కొరింథీయులు 4:4; అపొస్తలుల కార్యాలు 23:1; 2 తిమోతి 1:3) కాబట్టి మనం ఏదైనా చేసేముందు, ‘ఈ పని యెహోవాకు నచ్చుతుందా?’ అని ప్రశ్నించుకోవాలి.

9. దైవ భయం అంటే ఏంటి?

9 మనం ఎవరినైనా ప్రేమిస్తే వాళ్లను బాధపెట్టాలని కోరుకోం. అలాగే, మనం యెహోవాను ప్రేమిస్తాం కాబట్టి ఆయన్ని బాధపెట్టే పనేదీ చేయాలనుకోం. మనం చేసే పనివల్ల ఆయన ఎక్కడ బాధపడతాడో అనే భయం మనలో ఉండాలి. దాన్నే దైవ భయం అంటారు. నెహెమ్యా ఉదాహరణ పరిశీలించండి. నెహెమ్యా ‘దేవునికి భయపడ్డాడు,’ అందుకే అధిపతిగా తనకున్న హోదాను ఉపయోగించి డబ్బు సంపాదించాలని అనుకోలేదు. (నెహెమ్యా 5:15) యెహోవాను బాధపెట్టే పనేదీ చేయకూడదని అతను కోరుకున్నాడు. నెహెమ్యాలాగే మనం కూడా దైవ భయం కలిగివుంటాం, కాబట్టి యెహోవాను బాధపెట్టే పనేదీ చేయం. మనం ఆయన్ని సంతోషపెట్టాలని కోరుకుంటాం. ఆయన్ని సంతోషపెట్టాలంటే ఏం చేయాలో బైబిలు చదివి తెలుసుకోవచ్చు.—“దైవ భయం” చూడండి.

10, 11. మద్యం విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి ఏ బైబిలు సూత్రాలు సహాయం చేస్తాయి?

10 ఉదాహరణకు, ఒక క్రైస్తవుడు మద్యం తాగాలో వద్దో నిర్ణయించుకోవాల్సి రావచ్చు. సరైన నిర్ణయం తీసుకోవడానికి అతనికి ఏ సూత్రాలు సహాయం చేస్తాయి? మద్యం అస్సలు తాగకూడదు అని బైబిలు చెప్పట్లేదు. నిజానికి, ద్రాక్షారసం దేవుడు ఇచ్చిన బహుమతి అని బైబిలు చెప్తుంది. (కీర్తన 104:14, 15) అయితే, ‘అతిగా తాగకూడదని’ యేసు తన అనుచరులకు చెప్పాడు. (లూకా 21:34) అలాగే క్రైస్తవులు ‘విచ్చలవిడి విందులకు, తాగుబోతుతనానికి’ దూరంగా ఉండాలని పౌలు చెప్పాడు. (రోమీయులు 13:13) తాగుబోతులు “దేవుని రాజ్యానికి వారసులు అవ్వరు” అని కూడా అతను చెప్పాడు.—1 కొరింథీయులు 6:9, 10.

11 ఒక క్రైస్తవుడు ఈ ప్రశ్నల గురించి ఆలోచించవచ్చు: ‘నేను ఎందుకు తాగాలనుకుంటున్నాను? కాస్త సేదదీరడం కోసమా? ఆత్మవిశ్వాసం పెరుగుతుందనా? ఎంత మోతాదులో తాగాలో, ఎంత తరచుగా తాగాలో హద్దులు పెట్టుకుని వాటిని పాటించగలనా? * స్నేహితులతో సరదాగా గడుపుతున్నప్పుడు అక్కడ మద్యం ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటానా?’ తెలివైన నిర్ణయాలు తీసుకునేలా సహాయం చేయమని మనం యెహోవాను అడగవచ్చు. (కీర్తన 139:23, 24 చదవండి.) ఈ విధంగా, బైబిలు సూత్రాల్ని పాటించేలా మన మనస్సాక్షికి శిక్షణ ఇవ్వవచ్చు. దాంతోపాటు మనం ఇంకా ఏం చేయాలో ఇప్పుడు పరిశీలిద్దాం.

వేరేవాళ్ల మనస్సాక్షిని ఎందుకు పట్టించుకోవాలి?

12, 13. మన మనస్సాక్షి, ఇతరుల మనస్సాక్షి ఎందుకు వేర్వేరుగా పనిచేయవచ్చు? అలాంటి సందర్భాల్లో మనం ఏం చేయవచ్చు?

12 అందరి మనస్సాక్షి ఒకేలా ఉండదు. వేరేవాళ్ల మనస్సాక్షికి తప్పు అనిపించింది మన మనస్సాక్షికి తప్పు అనిపించకపోవచ్చు. ఉదాహరణకు మీరు మద్యం తాగాలని నిర్ణయించుకోవచ్చు, కానీ ఇంకో వ్యక్తి తాగకూడదని నిర్ణయించుకోవచ్చు. ఎందుకీ తేడా?

మద్యం తాగాలో వద్దో నిర్ణయించుకోవడానికి శిక్షణ పొందిన మనస్సాక్షి మీకు సహాయం చేస్తుంది

13 సాధారణంగా పెరిగిన ప్రాంతం, కుటుంబ సభ్యుల అభిప్రాయాలు, జీవితంలో ఎదురైన అనుభవాలు వంటివాటిని బట్టి ఒక్కొక్కరు ఒక్కోలా ఆలోచిస్తారు. మద్యం విషయానికొస్తే, గతంలో మితిమీరి మద్యం తాగినవాళ్లు ఇక అస్సలు తాగకూడదని నిర్ణయించుకోవచ్చు. (1 రాజులు 8:38, 39) కాబట్టి మీరు ఎవరికైనా మద్యం తాగమని ఇచ్చినప్పుడు అతను వద్దు అంటే మీరేం చేస్తారు? నొచ్చుకుంటారా? తాగమని బలవంతం చేస్తారా? ఎందుకు తాగట్లేదో చెప్పమని పట్టుబడతారా? లేదు, మీరు అతని మనస్సాక్షిని గౌరవిస్తారు.

14, 15. పౌలు రోజుల్లో ఎలాంటి పరిస్థితి ఉంది? అతను ఏ మంచి సలహా ఇచ్చాడు?

14 అపొస్తలుడైన పౌలు రోజుల్లో, ఒక విషయంలో క్రైస్తవుల మనస్సాక్షి వేర్వేరుగా పనిచేసింది. అప్పట్లో, విగ్రహాలకు అర్పించిన కొంత మాంసాన్ని మార్కెట్లో అమ్మేవాళ్లు. (1 కొరింథీయులు 10:25) ఆ మాంసాన్ని కొని తినడం తప్పేమీ కాదని పౌలుకు అనిపించింది. ఆహారమంతా యెహోవా ఇచ్చిందే అన్నది అతని అభిప్రాయం. అయితే, ఇదివరకు విగ్రహాల్ని ఆరాధించిన కొంతమంది సహోదరులకు ఆ మాంసాన్ని తినడం తప్పు అనిపించింది. మరి అప్పుడు పౌలు, ‘నా మనస్సాక్షికి తప్పు అనిపించట్లేదు కాబట్టి నేను మాంసం తింటాను. నాకు నచ్చింది తినే హక్కు నాకుంది’ అని అనుకున్నాడా?

15 పౌలు అలా అనుకోలేదు. అతను తోటి సహోదరుల అభిప్రాయాల్ని ఎంతగా గౌరవించాడంటే, వాళ్లను అభ్యంతరపెట్టే బదులు మాంసం తినడమే మానేస్తానని అన్నాడు. “మనం మన సంతోషం మాత్రమే చూసుకోకూడదు . . . క్రీస్తు కూడా తనను తాను సంతోషపెట్టుకోలేదు” అని పౌలు అన్నాడు. (రోమీయులు 15:1, 3) యేసులాగే పౌలు కూడా తన గురించి కాకుండా ఇతరుల గురించే ఎక్కువగా ఆలోచించాడు.—1 కొరింథీయులు 8:13; 10:23, 24, 31-33 చదవండి.

16. ఒక సహోదరుడు తన మనస్సాక్షికి నచ్చింది చేస్తుంటే, మనం ఎందుకు తీర్పుతీర్చకూడదు?

16 ఒకవేళ మనకు తప్పు అనిపించింది వేరేవాళ్ల మనస్సాక్షికి తప్పు అనిపించకపోతే అప్పుడేంటి? మనం వాళ్లను విమర్శించకూడదు. మన అభిప్రాయమే సరైనదని, వాళ్లది తప్పని పట్టుబట్టకూడదు. (రోమీయులు 14:10 చదవండి.) ఎందుకంటే, యెహోవా మనస్సాక్షిని ఇచ్చింది మనల్ని మనం పరిశీలించుకోవడానికే కానీ వేరేవాళ్లకు తీర్పుతీర్చడానికి కాదు. (మత్తయి 7:1) మన సొంత అభిప్రాయాలు సంఘంలో విభజనలు సృష్టించాలని మనం ఎన్నడూ కోరుకోం. బదులుగా సంఘంలో ప్రేమను, ఐక్యతను పెంచడానికి కృషిచేస్తాం.—రోమీయులు 14:19.

మంచి మనస్సాక్షి మనకెలా మేలు చేస్తుంది?

17. కొంతమంది మనస్సాక్షికి ఏం జరిగింది?

17 అపొస్తలుడైన పేతురు ఇలా రాశాడు: “మంచి మనస్సాక్షిని కాపాడుకోండి.” (1 పేతురు 3:16) విచారకరమైన విషయం ఏంటంటే, కొంతమంది యెహోవా సూత్రాల్ని పదేపదే నిర్లక్ష్యం చేయడం వల్ల, మెల్లమెల్లగా వాళ్ల మనస్సాక్షి వాళ్లను హెచ్చరించడం మానేసింది. వాళ్ల మనస్సాక్షి “కాల్చిన ఇనుముతో వాతవేయబడింది” అని పౌలు అన్నాడు. (1 తిమోతి 4:2, అధస్సూచి) వాతపడిన చోట, చర్మం మొద్దుబారిపోయి స్పర్శ తెలీదు. అదేవిధంగా ఒక వ్యక్తి అలవాటుగా చెడు చేస్తూ ఉంటే, అతని మనస్సాక్షి “వాతవేయబడి,” కొంతకాలానికి పనిచేయడం మానేయవచ్చు.

మంచి మనస్సాక్షి మనల్ని సరైన దారిలో నడిపిస్తూ సంతోషాన్ని, మనశ్శాంతిని ఇస్తుంది

18, 19. (ఎ) తప్పు చేశామనే బాధ కలగడం వల్ల మనం ఏం చేస్తాం? (బి) పశ్చాత్తాపపడిన తర్వాత కూడా తప్పు చేశామనే బాధ మనల్ని వేధిస్తుంటే ఏం గుర్తుంచుకోవాలి?

18 మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మనస్సాక్షి మనల్ని బాధపెడుతుంది. దానివల్ల మనం చేసింది తప్పని గుర్తిస్తాం. తప్పుల నుండి పాఠం నేర్చుకుని, వాటిని మళ్లీ చేయకూడదని కోరుకుంటాం. ఉదాహరణకు దావీదు రాజు పాపం చేసినప్పుడు, పశ్చాత్తాపపడేలా అతని మనస్సాక్షి సహాయం చేసింది. తాను చేసినదాన్ని అసహ్యించుకుని, ఇకమీదట యెహోవాకు లోబడాలని అతను నిర్ణయించుకున్నాడు. ‘యెహోవా మంచివాడు, క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు’ అని దావీదు తన సొంత అనుభవం ద్వారా చెప్పాడు.—కీర్తన 51:1-19; 86:5; “పశ్చాత్తాపం” చూడండి.

19 అయితే ఒక వ్యక్తి పశ్చాత్తాపపడిన చాలాకాలం తర్వాత కూడా, తాను చేసిన తప్పు గురించి బాధపడుతుండవచ్చు. ఆ బాధ వల్ల అతను కృంగిపోయి, ఎందుకూ పనికిరానివాణ్ణి అని అనుకోవచ్చు. మీకూ ఎప్పుడైనా అలా అనిపించిందా? మీరు గతాన్ని మార్చలేరని గుర్తుంచుకోండి. మీరు తెలిసి చేసినా, తెలియక చేసినా యెహోవా మీ పాపాల్ని పూర్తిగా క్షమించేశాడు. కాబట్టి ఇప్పుడు మీరు యెహోవా ముందు పవిత్రంగా ఉన్నారని, సరైనది చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. అయినా మీ హృదయం మిమ్మల్ని నిందిస్తుంటే, “దేవుడు మన హృదయాల కన్నా గొప్పవాడని” గుర్తుంచుకోండి. (1 యోహాను 3:19, 20 చదవండి.) తప్పు చేశామనే బాధ లేదా అవమానం నుండి బయటపడడానికి దేవుని ప్రేమ, క్షమాపణ సహాయం చేస్తాయి. యెహోవా మిమ్మల్ని క్షమించాడనే నమ్మకంతో మీరు ఉండవచ్చు. ఆ విషయాన్ని అర్థంచేసుకున్నాక మీ మనస్సాక్షి ప్రశాంతంగా ఉంటుంది, మీరు సంతోషంగా దేవుని సేవ చేయవచ్చు.—1 కొరింథీయులు 6:11; హెబ్రీయులు 10:22.

20, 21. (ఎ) ఈ పుస్తకం మీకు ఎలా సహాయం చేస్తుంది? (బి) యెహోవా మనకు ఏ స్వేచ్ఛను ఇచ్చాడు? మనం దాన్ని ఎలా ఉపయోగించాలి?

20 కష్టమైన ఈ చివరి రోజుల్లో, మీ మనస్సాక్షి మిమ్మల్ని హెచ్చరిస్తూ కాపాడాలంటే దానికి శిక్షణ అవసరం. అలా శిక్షణ ఇవ్వడానికి ఈ పుస్తకం సహాయం చేస్తుంది. మీ జీవితంలోని వేర్వేరు సందర్భాల్లో బైబిలు సూత్రాల్ని ఎలా పాటించాలో కూడా ఈ పుస్తకం చెప్తుంది. నిజమే, ప్రతీ సందర్భంలో మనమేం చేయాలో తెలిపే నియమాల పట్టిక ఈ పుస్తకంలో లేదు. మనం దేవుని సూత్రాల మీద ఆధారపడిన “క్రీస్తు నియమం” ప్రకారం జీవిస్తాం. (గలతీయులు 6:2) ఫలానా విషయంలో సూటైన నియమం లేనంత మాత్రాన, తప్పు చేయడానికి దాన్ని ఒక సాకుగా తీసుకోకూడదు. (2 కొరింథీయులు 4:1, 2; హెబ్రీయులు 4:13; 1 పేతురు 2:16) నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను యెహోవా మనకు ఇచ్చాడు. మనం ఆ స్వేచ్ఛను యెహోవాను ప్రేమిస్తున్నామని చూపించడానికి ఉపయోగిస్తాం.

21 బైబిలు సూత్రాల గురించి ధ్యానించి, వాటిని పాటించడం ద్వారా మన “వివేచనా సామర్థ్యాల్ని” ఉపయోగించడం నేర్చుకుంటాం, యెహోవాలా ఆలోచిస్తాం. (హెబ్రీయులు 5:14) ఆ విధంగా శిక్షణ పొందిన మనస్సాక్షి మనల్ని సరైన దారిలో నడిపిస్తుంది, దేవుని ప్రేమలో నిలిచివుండేలా సహాయం చేస్తుంది.

^ మద్యానికి బానిసైన వాళ్లు కొంచెం తాగి ఆపలేరని, వాళ్లు అసలు మద్యం ముట్టకపోవడమే మంచిదని చాలామంది డాక్టర్లు చెప్తారు.