కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

14వ అధ్యాయం

అన్ని విషయాల్లో నిజాయితీగా ఉండండి

అన్ని విషయాల్లో నిజాయితీగా ఉండండి

“మేము అన్ని విషయాల్లో నిజాయితీగా ప్రవర్తించాలని అనుకుంటున్నాం.”—హెబ్రీయులు 13:18.

1, 2. మనం నిజాయితీగా ఉండడానికి కృషి చేసినప్పుడు యెహోవాకు ఎలా అనిపిస్తుంది?

 ఒక అబ్బాయి స్కూల్‌ నుండి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. దారిలో ఒక పర్సు కనిపించింది. అందులో చాలా డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు అతను ఏం చేస్తాడు? కావాలంటే దాన్ని తన దగ్గరే ఉంచుకోవచ్చు. కానీ అతను అలా చేయలేదు. ఆ పర్సు ఎవరిదో తెలుసుకుని వాళ్లకు తిరిగిచ్చాడు. ఈ విషయం అతని తల్లికి తెలిసినప్పుడు ఆమె చాలా గర్వపడింది.

2 పిల్లలు నిజాయితీగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు సంతోషిస్తారు. మన పరలోక తండ్రి, ‘సత్యవంతుడు’ అయిన యెహోవా కూడా మన నిజాయితీని చూసి సంతోషిస్తాడు. (కీర్తన 31:5) మనం ఆయన్ని సంతోషపెట్టాలని, “అన్ని విషయాల్లో నిజాయితీగా ప్రవర్తించాలని” కోరుకుంటాం. (హెబ్రీయులు 13:18) మన జీవితంలో నిజాయితీగా ఉండడం కష్టమనిపించే నాలుగు రంగాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం. కష్టమనిపించినా నిజాయితీగా ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు వస్తాయో కూడా చూద్దాం.

మనతో మనం నిజాయితీగా ఉండడం

3-5. (ఎ) మనల్ని మనం ఎలా మోసం చేసుకునే ప్రమాదం ఉంది? (బి) మనతో మనం నిజాయితీగా ఉండడానికి ఏవి సహాయం చేస్తాయి?

3 వేరేవాళ్లతో నిజాయితీగా ఉండాలంటే ముందు మనతో మనం నిజాయితీగా ఉండాలి. అది అన్నిసార్లూ తేలిక కాదు. మొదటి శతాబ్దంలో లవొదికయ సంఘంలోని సహోదరులు దేవుణ్ణి సంతోషపెట్టకపోయినా, సంతోషపెడుతున్నామని అనుకుని వాళ్లను వాళ్లే మోసం చేసుకున్నారు. (ప్రకటన 3:17) అదేవిధంగా మనం కూడా మనల్ని మనం మోసం చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి, మనల్ని మనం పరిశీలించుకునేటప్పుడు నిజాయితీగా ఉండాలి.

4 శిష్యుడైన యాకోబు ఇలా రాశాడు: “ఒక వ్యక్తి, తాను దేవుని ఆరాధకుణ్ణని అనుకుంటూ, నాలుకను అదుపులో పెట్టుకోకపోతే అతను తన హృదయాన్ని మోసం చేసుకుంటున్నాడు; అతని ఆరాధన వ్యర్థం.” (యాకోబు 1:26) మనం కొన్ని మంచి పనులు చేస్తున్నంత కాలం దురుసుగా లేదా ఎగతాళిగా మాట్లాడినా, అబద్ధాలు చెప్పినా దేవుడు పట్టించుకోడని కొంతమంది అనుకుంటారు. కానీ అలా అనుకుంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే. అలా మోసం చేసుకోకుండా ఉండడానికి ఏది సహాయం చేస్తుంది?

5 అద్దంలో చూసుకున్నప్పుడు మనం బయటికి ఎలా కనిపిస్తున్నామో తెలుస్తుంది. బైబిలు చదివినప్పుడు మనం లోపల ఎలా ఉన్నామో తెలుస్తుంది. మన బలాలు ఏంటో, బలహీనతలు ఏంటో తెలుసుకోవడానికి బైబిలు సహాయం చేస్తుంది. అంతేకాదు మన ఆలోచనల్లో, ప్రవర్తనలో, మాటల్లో ఏయే మార్పులు చేసుకోవాలో కూడా చెప్తుంది. (యాకోబు 1:23-25 చదవండి.) మనలో ఏ తప్పూ లేదని అనుకుంటే, అవసరమైన మార్పులు ఎప్పటికీ చేసుకోలేం. కాబట్టి బైబిల్ని ఉపయోగిస్తూ మనల్ని మనం నిజాయితీగా పరిశీలించుకోవాలి. (విలాపవాక్యాలు 3:40; హగ్గయి 1:5) మనం నిజంగా ఎలాంటి వాళ్లమో తెలుసుకోవడానికి ప్రార్థన కూడా సహాయం చేస్తుంది. మనల్ని పరిశీలించమని, మన తప్పుల్ని గుర్తించడానికి సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించి, వాటిని సరిచేసుకోవచ్చు. (కీర్తన 139:23, 24) “కపట బుద్ధి గలవాళ్లు యెహోవాకు అసహ్యం, నిజాయితీపరులకు ఆయన దగ్గరి స్నేహితుడు” అని మనం గుర్తుంచుకుంటాం.—సామెతలు 3:32.

కుటుంబంలో నిజాయితీగా ఉండడం

6. భార్యాభర్తలు ఒకరితో ఒకరు ఎందుకు నిజాయితీగా ఉండాలి?

6 కుటుంబంలో నిజాయితీగా ఉండడం చాలా ప్రాముఖ్యం. భార్యాభర్తలు ఒకరితో ఒకరు నిజాయితీగా ఉంటే సురక్షితంగా ఉన్నట్లు భావిస్తారు, ఒకరినొకరు నిజంగా నమ్మగలుగుతారు. కానీ వాళ్లు వేరే వ్యక్తితో సరసాలాడడం, రహస్యంగా ప్రేమ వ్యవహారాలు సాగించడం, అశ్లీల చిత్రాలు చూడడం వంటివి చేస్తే నిజాయితీగా ఉన్నట్టు అవ్వదు. కీర్తనకర్త ఏమన్నాడో గమనించండి: “మోసగాళ్లతో నేను సహవసించను, తమ నిజ స్వరూపాన్ని దాచిపెట్టేవాళ్లకు నేను దూరంగా ఉంటాను.” (కీర్తన 26:4) మీ ఆలోచనల్లో కూడా మీ వివాహజత పట్ల నిజాయితీగా ఉండండి, లేదంటే మీ వివాహ బంధం బీటలువారుతుంది.

మీ వివాహ బంధాన్ని బలహీనపర్చే దేన్నైనా వెంటనే తిరస్కరించండి

7, 8. పిల్లలకు నిజాయితీగా ఉండడం నేర్పించడానికి తల్లిదండ్రులు బైబిల్ని ఎలా ఉపయోగించవచ్చు?

7 నిజాయితీగా ఉండడం ఎంత ప్రాముఖ్యమో తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి. అందుకోసం వాళ్లు బైబిల్ని ఉపయోగించవచ్చు. బైబిల్లో, నిజాయితీగా లేనివాళ్ల ఉదాహరణలు ఉన్నాయి: దొంగగా మారిన ఆకాను, డబ్బు కోసం అబద్ధాలాడిన గేహజీ, డబ్బు దొంగిలించి ఆ తర్వాత 30 వెండి నాణేల కోసం యేసును అప్పగించిన యూదా.—యెహోషువ 6:17-19; 7:11-25; 2 రాజులు 5:14-16, 20-27; మత్తయి 26:14, 15; యోహాను 12:6.

8 నిజాయితీగా ఉన్నవాళ్ల ఉదాహరణలు కూడా బైబిల్లో ఎన్నో ఉన్నాయి: దొరికిన డబ్బును తిరిగి ఇచ్చేయమని తన కొడుకులకు చెప్పిన యాకోబు; దేవునికి ఇచ్చిన మాట మీద నిలబడిన యెఫ్తా, అతని కూతురు; కష్టమైన పరిస్థితుల్లో కూడా నిజాయితీగా ఉన్న యేసు. (ఆదికాండం 43:12; న్యాయాధిపతులు 11:30-40; యోహాను 18:3-11) నిజాయితీగా ఉండడం ఎంత ప్రాముఖ్యమో అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణలు పిల్లలకు సహాయం చేస్తాయి.

9. తల్లిదండ్రులు నిజాయితీగా ఉండడం వల్ల పిల్లలకు ఎలాంటి ప్రయోజనం వస్తుంది?

9 తల్లిదండ్రులు ఈ ముఖ్యమైన బైబిలు సూత్రాన్ని గుర్తుంచుకోవచ్చు: “ఇతరులకు బోధించే నువ్వు, నీకు నువ్వు బోధించుకోవా? ‘దొంగతనం చేయకూడదు’ అని ప్రకటించే నువ్వు దొంగతనం చేస్తావా?” (రోమీయులు 2:21) తల్లిదండ్రులు ఒకటి చెప్పి ఇంకొకటి చేస్తే పిల్లలకు తెలిసిపోతుంది. నిజాయితీగా ఉండమని పిల్లలకు చెప్తూ తల్లిదండ్రులే అలా ఉండకపోతే, ఏం చేయాలో పిల్లలకు అర్థంకాదు. తల్లిదండ్రులు చిన్న అబద్ధం చెప్పినా పిల్లలు దాన్ని గమనిస్తారు. దానివల్ల వాళ్లు కూడా అబద్ధాలు చెప్పేవాళ్లుగా తయారవ్వవచ్చు. (లూకా 16:10 చదవండి.) అయితే తల్లిదండ్రులు నిజాయితీగా ఉండడం పిల్లలు చూస్తే, భవిష్యత్తులో వాళ్లు కూడా నిజాయితీగల తల్లిదండ్రులు అవుతారు.—సామెతలు 22:6; ఎఫెసీయులు 6:4.

సంఘంలో నిజాయితీగా ఉండడం

10. తోటి క్రైస్తవులతో మాట్లాడేటప్పుడు మనం ఎలా నిజాయితీగా ఉండవచ్చు?

10 క్రైస్తవ సహోదర సహోదరీలతో కూడా మనం నిజాయితీగా ఉండాలి. కొన్నిసార్లు మామూలుగా మాట్లాడుకునే మాటలే పుకార్లకు, లేనిపోనివి కల్పించి చెప్పడానికి దారితీస్తాయి. మనం విన్న విషయం నిజమో కాదో తెలుసుకోకుండానే వేరేవాళ్లకు చెప్తే, అబద్ధాలు వ్యాప్తి చేసినట్టు అవుతుంది. అందుకే ‘పెదాల్ని అదుపు చేసుకోవడం’ చాలా మంచిది. (సామెతలు 10:19) నిజాయితీగా ఉండడం అంటే మనం ఆలోచించే, తెలుసుకునే, వినే ప్రతీది చెప్పడం అని కాదు. ఒక విషయం గురించి నిజం తెలిసినంత మాత్రాన దాన్ని ఇతరులకు చెప్పాల్సిన అవసరంలేదు. అది మనకు సంబంధించిన విషయం కాకపోవచ్చు, దాని గురించి చెప్పడం అంత మంచిది కూడా కాకపోవచ్చు. (1 థెస్సలొనీకయులు 4:11) కొంతమంది ముఖంమీదే మాట్లాడి, “నేను నిజాయితీగా మాట్లాడుతున్నాను” అంటారు. కానీ యెహోవా ప్రజలమైన మనం ఎప్పుడూ ప్రేమగా, దయగా మాట్లాడాలని కోరుకుంటాం.—కొలొస్సయులు 4:6 చదవండి.

11, 12. (ఎ) పాపం చేసిన వ్యక్తి దాని గురించి సంఘ పెద్దలతో ఎందుకు నిజాయితీగా మాట్లాడాలి? (బి) మనం ఎలాంటి ప్రశ్నలు వేసుకోవచ్చు? (సి) మనం యెహోవా సంస్థతో ఎలా నిజాయితీగా ఉండవచ్చు?

11 సంఘంలో ఉన్నవాళ్లకు సహాయం చేసే బాధ్యతను యెహోవా సంఘ పెద్దలకు అప్పగించాడు. మనం వాళ్లతో నిజాయితీగా ఉంటే వాళ్లు మనకు సులభంగా సహాయం చేయగలుగుతారు. అలాగని ఎందుకు చెప్పవచ్చు? ఉదాహరణకు, మీకు ఒంట్లో బాగోక డాక్టరు దగ్గరికి వెళ్లారనుకోండి. మీకున్న సమస్యలన్నీ చెప్తారా లేక కొన్ని దాచిపెడతారా? అలా దాచిపెడితే డాక్టరు మీకు సహాయం చేయగలడా? అదేవిధంగా మనం ఏదైనా ఘోరమైన తప్పు చేస్తే దాన్ని కప్పిపుచ్చడానికి అబద్ధాలు చెప్పకూడదు. బదులుగా సంఘ పెద్దల దగ్గరికి వెళ్లి నిజాయితీగా దాని గురించి చెప్పాలి. (కీర్తన 12:2; అపొస్తలుల కార్యాలు 5:1-11) ఒకవేళ మీ స్నేహితుడు ఘోరమైన తప్పు చేశాడని మీకు తెలిస్తే, అప్పుడేంటి? (లేవీయకాండం 5:1) “అతను నా స్నేహితుడు కాబట్టి దాన్ని రహస్యంగా ఉంచుతాను” అని మీరు అనుకుంటారా? లేదా యెహోవాతో అతనికున్న సంబంధాన్ని బాగుచేసుకోవడానికి, బలపర్చుకోవడానికి పెద్దలు సహాయం చేస్తారని గుర్తుంచుకుంటారా?—హెబ్రీయులు 13:17; యాకోబు 5:14, 15.

12 మనం యెహోవా సంస్థతో కూడా నిజాయితీగా ఉండాలి. ఉదాహరణకు క్షేత్రసేవా రిపోర్టు వంటివి నింపుతున్నప్పుడు, పయినీరు సేవకు లేదా వేరే సేవకు దరఖాస్తు చేస్తున్నప్పుడు నిజాయితీగా ఉంటాం.—సామెతలు 6:16-19 చదవండి.

13. వ్యాపార విషయాల్లో మనం తోటి క్రైస్తవులతో ఎలా నిజాయితీగా ఉండవచ్చు?

13 క్రైస్తవులు రాజ్యమందిరంలో ఉన్నప్పుడు గానీ పరిచర్యలో ఉన్నప్పుడు గానీ వ్యాపార విషయాలు మాట్లాడుకోరు. వ్యాపార విషయాల్లో సహోదర సహోదరీల్ని వాడుకోరు. మీరు ఒక సహోదరుణ్ణి పనిలో పెట్టుకుంటే సమయానికి జీతం ఇవ్వండి, ఎంత ఇస్తారని చెప్పారో అంత జీతం ఇవ్వండి, చట్ట ప్రకారం అతనికి వచ్చే ఇన్సూరెన్స్‌, సెలవులు వంటివన్నీ ఇవ్వండి. (1 తిమోతి 5:18; యాకోబు 5:1-4) ఒకవేళ మీరు ఎవరైనా సహోదరుడి దగ్గర పనిచేస్తుంటే, అతను మిమ్మల్ని ప్రత్యేకంగా చూడాలని ఆశించకండి. (ఎఫెసీయులు 6:5-8) ఎంత సమయం పని చేయడానికి ఒప్పుకున్నారో అంత సమయం పనిచేయండి, జీతానికి తగ్గట్లు కష్టపడండి.—2 థెస్సలొనీకయులు 3:10.

14. కలిసి వ్యాపారం చేయాలనుకునే క్రైస్తవులు ముందే ఏం చేయాలి?

14 ఒకవేళ మీ సహోదరునితో లేదా సహోదరితో కలిసి వ్యాపారం చేయాల్సి వస్తే అప్పుడేంటి? మీరు వాళ్లతో కలిసి పెట్టుబడి పెట్టి ఉండవచ్చు లేదా అప్పు తీసుకుని ఉండవచ్చు. అలాంటప్పుడు ఈ బైబిలు సూత్రం చాలా ఉపయోగపడుతుంది: అన్ని విషయాలూ రాసి పెట్టుకోండి! యిర్మీయా ప్రవక్త పొలం కొన్నప్పుడు రెండు దస్తావేజుల్ని రాయించాడు. ఒకదాని మీద సాక్షుల సంతకం పెట్టించాడు. తర్వాత ఆ రెండిటిని భవిష్యత్తులో ఎప్పుడైనా చూసుకునేలా భద్రపర్చాడు. (యిర్మీయా 32:9-12; ఆదికాండం 23:16-20 కూడా చూడండి.) అలా ఒప్పందాన్ని రాయిస్తే సహోదరుల మీద నమ్మకం లేనట్టు అవుతుందని కొందరు అనుకుంటారు. కానీ చాలావరకు, అలా రాయిస్తేనే లేనిపోని సమస్యలు, అపార్థాలు, గొడవలు రాకుండా ఉంటాయి. వ్యాపార విషయాల కన్నా సంఘంలో శాంతిని కాపాడడమే ప్రాముఖ్యమని గుర్తుంచుకోండి.—1 కొరింథీయులు 6:1-8; “వ్యాపారం, చట్టపరమైన విషయాలు” చూడండి.

సమాజంలో నిజాయితీగా ఉండడం

15. వ్యాపారంలో జరిగే మోసాన్ని యెహోవా ఎలా చూస్తాడు?

15 మనం సాక్షులుకాని వాళ్లతో సహా ప్రతీ ఒక్కరితో నిజాయితీగా ఉండాలి. మనం నిజాయితీగా ఉండడం యెహోవాకు ప్రాముఖ్యం. “దొంగ త్రాసు యెహోవాకు అసహ్యం, సరైన తూకంరాళ్లను చూసి ఆయన సంతోషిస్తాడు.” (సామెతలు 11:1; 20:10, 23) బైబిలు కాలాల్లో, వ్యాపారం చేసేటప్పుడు తరచూ త్రాసులను ఉపయోగించేవాళ్లు. కానీ కొంతమంది వర్తకులు తప్పుడు తూకంతో ప్రజల్ని మోసం చేసేవాళ్లు. అంటే ఇచ్చేటప్పుడేమో తక్కువ సరుకుల్ని ఇచ్చేవాళ్లు, తీసుకునేటప్పుడు మాత్రం ఎక్కువ మొత్తం తీసుకునేవాళ్లు. బైబిలు కాలాల్లోలాగే ఇప్పుడు కూడా వ్యాపారంలో మోసం ఎక్కువైపోయింది. అలాంటి మోసాన్ని యెహోవా అప్పుడు అసహ్యించుకున్నట్టే ఇప్పుడు కూడా అసహ్యించుకుంటున్నాడు.

16, 17. మనం ఇంకా ఏయే విషయాల్లో నిజాయితీగా ఉండాలి?

16 మనకు కూడా కొన్ని సందర్భాల్లో నిజాయితీగా ఉండడం కష్టం కావచ్చు. ఉదాహరణకు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడం, ప్రభుత్వ పత్రాలను నింపడం, స్కూల్లో పరీక్షలు రాయడం వంటివి. చాలామంది అబద్ధాలు చెప్పడం, ఉన్నదాన్ని ఎక్కువ చేసి చెప్పడం, తప్పుడు సమాచారం ఇవ్వడం తప్పేమీ కాదనుకుంటారు. ప్రజలు అలా ఉండడం చూసి మనం ఆశ్చర్యపోం. ఎందుకంటే చివరి రోజుల్లో “తమను తాము ప్రేమించుకునేవాళ్లు, డబ్బును ప్రేమించేవాళ్లు, . . . మంచిని ప్రేమించనివాళ్లు” ఉంటారని బైబిలు ముందే చెప్పింది.—2 తిమోతి 3:1-5.

17 నిజాయితీలేని ప్రజలే వర్ధిల్లుతున్నట్టు కొన్నిసార్లు అనిపించవచ్చు. (కీర్తన 73:1-8) అయినప్పటికీ క్రైస్తవులు నిజాయితీగా ఉంటారు. అలా ఉన్నందుకు వాళ్లు ఉద్యోగం కోల్పోవచ్చు, ఆర్థికంగా నష్టపోవచ్చు, లేదా తోటి ఉద్యోగుల నుండి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అయినా నిజాయితీ చాలా విలువైనది. ఎందుకు?

నిజాయితీగా ఉండడం వల్ల వచ్చే ఆశీర్వాదాలు

18. మంచిపేరు ఎందుకు చాలా విలువైనది?

18 నమ్మకస్థుడు, నిజాయితీపరుడు, నమ్మదగినవాడు అనే పేరు సంపాదించడం ఈ రోజుల్లో చాలా అరుదు. అది అమూల్యమైనది. మనలో ప్రతీ ఒక్కరం అలాంటి మంచిపేరు సంపాదించుకోగలం. (మీకా 7:2) నిజమే, నిజాయితీగా ఉన్నందుకు కొంతమంది మనల్ని ఎగతాళి చేయవచ్చు, పిచ్చివాళ్లని అనవచ్చు. కానీ ఇతరులు మీ నిజాయితీని గుర్తిస్తారు, మిమ్మల్ని నమ్ముతారు. ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షులకు నిజాయితీపరులనే పేరు ఉంది. యెహోవాసాక్షులు నిజాయితీగా ఉంటారు కాబట్టి చాలామంది వాళ్లను ఉద్యోగంలో పెట్టుకోవడానికి ఇష్టపడతారు. నిజాయితీగా లేకపోవడం వల్ల తోటి ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నా, సాక్షులు మాత్రం తరచూ ఉద్యోగాలను నిలబెట్టుకుంటారు.

కష్టపడి పనిచేయడం ద్వారా యెహోవాకు ఘనత తీసుకురావచ్చు

19. నిజాయితీగా ఉండడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి?

19 మీరు అన్ని విషయాల్లో నిజాయితీగా ఉండడం వల్ల మంచి మనస్సాక్షితో, మనశ్శాంతితో ఉంటారు. పౌలులాగే మీరు కూడా ఇలా చెప్పగలుగుతారు: ‘మేము మంచి మనస్సాక్షి కలిగివున్నామని నమ్ముతున్నాం.’ (హెబ్రీయులు 13:18) అంతకన్నా ముఖ్యంగా, అన్ని విషయాల్లో నిజాయితీగా ఉండడానికి మీరు చేస్తున్న కృషిని మీ ప్రేమగల తండ్రి అయిన యెహోవా చూస్తాడు, మెచ్చుకుంటాడు.—కీర్తన 15:1, 2; సామెతలు 22:1 చదవండి.