కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

11వ అధ్యాయం

పెళ్లి తర్వాత జీవితం

పెళ్లి తర్వాత జీవితం

“ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.”—1 కొరింథీయులు 13:8.

1, 2. వివాహ జీవితంలో సమస్యలు వస్తే అది విఫలమైనట్టేనా? వివరించండి.

 వివాహం యెహోవా ఇచ్చిన బహుమతి. అది ఒక వ్యక్తి జీవితంలో సంతోషాన్ని నింపగలదు. అయితే ప్రతీ ఒక్కరి వివాహ జీవితంలో సమస్యలు వస్తాయి. ఒక్కోసారి ఈ సమస్యలకు ముగింపే లేదా అని కూడా అనిపించవచ్చు. అంతేకాదు తమ మధ్య దూరం పెరిగినట్టు భార్యాభర్తలకు అనిపించవచ్చు.

2 వివాహ జీవితంలో సమస్యలు వస్తే మనం ఆశ్చర్యపోకూడదు. కష్టాలు వచ్చినంత మాత్రాన వివాహ జీవితం విఫలమైనట్టు కాదు. పెద్దపెద్ద సమస్యలు ఉన్న దంపతులు కూడా తమ వివాహ బంధాన్ని బలపర్చుకోగలిగారు. ఏ విధంగా?

ఒకరికొకరు దగ్గరవ్వడం, దేవునికి దగ్గరవ్వడం

3, 4. కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య ఏం జరగవచ్చు?

3 పెళ్లి ఇద్దరు వ్యక్తుల్ని ఒకటి చేస్తుంది. వాళ్లిద్దరి ఇష్టాయిష్టాలు, ఆలోచనలు, పనితీరులు వేర్వేరుగా ఉండవచ్చు. వాళ్ల నేపథ్యాలు, సంస్కృతులు కూడా వేరై ఉండవచ్చు. కాబట్టి వాళ్లు ఒకరినొకరు బాగా తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి సమయం, కృషి అవసరం.

4 అయితే కాలం గడుస్తుండగా భార్యాభర్తలు ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయి, ఒకరికొకరు మెల్లమెల్లగా దూరం అవ్వవచ్చు. వాళ్లు ఒకే ఇంట్లో ఉన్నా, ఎవరి లోకంలో వాళ్లు జీవిస్తున్నట్టు అనిపించవచ్చు. మరి వాళ్లు దగ్గరవ్వడానికి ఏది సహాయం చేస్తుంది?

బైబిలు సలహాలు వివాహ బంధాన్ని బలపరుస్తాయి

5. (ఎ) భార్యాభర్తలు ఒకరికొకరు దగ్గరవ్వడానికి ఏవి సహాయం చేస్తాయి? (బి) హెబ్రీయులు 13:4 ప్రకారం మనం వివాహాన్ని ఎలా చూడాలి?

5 భార్యాభర్తలు ఒకరికొకరు దగ్గరవ్వడానికి, అలాగే యెహోవాకు దగ్గరవ్వడానికి ఆయన ఇచ్చే మంచి సలహాలు సహాయం చేస్తాయి. (కీర్తన 25:4; యెషయా 48:17, 18) ఆయన ఇలా చెప్తున్నాడు: “వివాహాన్ని అందరూ గౌరవప్రదమైనదిగా చూడాలి.” (హెబ్రీయులు 13:4) మనం దేన్నైనా గౌరవప్రదమైనదిగా చూస్తే దాన్ని అమూల్యమైనదిగా, విలువైనదిగా ఎంచుతాం. దాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా కాపాడుకుంటాం. మనం వివాహాన్ని అలా గౌరవప్రదమైనదిగా చూడాలన్నదే యెహోవా కోరిక.

యెహోవా మీద ప్రేమ వివాహ బంధాన్ని బలపరుస్తుంది

6. వివాహం విషయంలో యెహోవాకున్న అభిప్రాయాన్ని మత్తయి 19:4-6 ఎలా తెలియజేస్తుంది?

6 మొట్టమొదటి వివాహాన్ని చేసింది యెహోవాయే. ఆయన కుమారుడైన యేసు ఇలా చెప్పాడు: “మీరు ఇది చదవలేదా? దేవుడు మొదట్లో వాళ్లను సృష్టించినప్పుడు పురుషునిగా, స్త్రీగా సృష్టించి ఇలా అన్నాడు: ‘అందుకే, పురుషుడు తన అమ్మానాన్నల్ని విడిచిపెట్టి తన భార్యను అంటిపెట్టుకొని ఉంటాడు, వాళ్లిద్దరూ ఒక్క శరీరంగా ఉంటారు.’ కాబట్టి వాళ్లు ఇక ఇద్దరుగా కాదుగానీ ఒకే శరీరంగా ఉంటారు. అందుకే దేవుడు ఒకటి చేసినవాళ్లను ఏ మనిషీ విడదీయకూడదు.” (మత్తయి 19:4-6) వివాహాన్ని ఏర్పాటు చేసినప్పటినుండి యెహోవా ఉద్దేశం, అది శాశ్వతంగా ఉండాలన్నదే. భార్యాభర్తలు కలిసిమెలిసి సంతోషంగా జీవించాలని ఆయన కోరుకున్నాడు.

7. భార్యాభర్తలు తమ బంధాన్ని ఎలా బలపర్చుకోవచ్చు?

7 కానీ, నేడు దంపతులు ఇంతకుముందు కన్నా ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు ఆ ఒత్తిడి ఎక్కువై, ఇక కలిసి ఉండడం కష్టమని, విడిపోవడమే మంచిదని అనుకుంటున్నారు. కానీ వివాహాన్ని యెహోవా ఎలా చూస్తాడో అర్థం చేసుకోవడం ద్వారా భార్యాభర్తలు తమ బంధాన్ని బలపర్చుకోవచ్చు.—1 యోహాను 5:3.

8, 9. (ఎ) వివాహం విషయంలో యెహోవా ఇచ్చే సలహాల్ని ఎలాంటి పరిస్థితిలో కూడా పాటించాలి? (బి) వివాహాన్ని విలువైనదిగా చూస్తే ఏం చేస్తాం?

8 యెహోవా ఇచ్చే సలహాలు ఎప్పుడూ మన మంచికే. పైన తెలియజేసినట్టు, “వివాహాన్ని అందరూ గౌరవప్రదమైనదిగా చూడాలి” అని ఆయన చెప్తున్నాడు. (హెబ్రీయులు 13:4; ప్రసంగి 5:4) యెహోవా ఇచ్చే సలహాల్ని కష్టమైన పరిస్థితుల్లో కూడా పాటిస్తే మనం తప్పకుండా ప్రయోజనం పొందుతాం.—1 థెస్సలొనీకయులు 1:3; హెబ్రీయులు 6:10.

9 మనం వివాహాన్ని విలువైనదిగా చూస్తాం కాబట్టి దానికి హానిచేసే ఎలాంటి పనులకైనా, మాటలకైనా దూరంగా ఉంటాం. అంతేకాదు మన వివాహజతకు మరింత దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తాం. అదెలా చేయవచ్చు?

మాటల్లో, చేతల్లో వివాహాన్ని గౌరవించండి

10, 11. (ఎ) కొంతమంది భార్యాభర్తలకు ఎలాంటి తీవ్రమైన సమస్య ఉంది? (బి) మన వివాహజతతో ఎలా మాట్లాడుతున్నామనేది ఎందుకు ప్రాముఖ్యం?

10 ఒక వ్యక్తి తన మాటలతో, చేతలతో వివాహజతను గాయపర్చే ప్రమాదం ఉంది. క్రైస్తవులు తమ వివాహజతను అస్సలు కొట్టకూడదని, గాయపర్చకూడదని మనకు తెలుసు. అయినా కొన్నిసార్లు మనం మన మాటల ద్వారా వివాహజతను బాధపెట్టే అవకాశం ఉంది. కొన్నిసార్లు మాటలు తూటాల్లా ఎదుటి వ్యక్తిని గాయపర్చవచ్చు. ఒకావిడ ఇలా చెప్పింది: “నా భర్త నన్ను మాటలతో హింసించేవాడు. అవి కత్తిపోట్లలా నా హృదయాన్ని గాయపర్చేవి. ఆ గాయాలు బయటికి కనిపించవు. ‘నువ్వు నాకు భారంగా తయారయ్యావు!’ ‘నువ్వు ఎందుకూ పనికిరావు!’ అని పదేపదే అనేవాడు.” తన భార్య ప్రతీదానికి తనను చులకన చేసి మాట్లాడేదని, అవమానించేదని ఒక భర్త చెప్తున్నాడు. అతను ఇలా అన్నాడు: “ఆమె నన్ను అనే మాటలు బయటికి చెప్పుకోలేకపోయేవాణ్ణి. ఆమెతో వాదించలేక ఉద్యోగం నుండి ఆలస్యంగా ఇంటికి వెళ్లేవాణ్ణి. ఇంటికి వెళ్లడం కన్నా ఉద్యోగ స్థలంలో ఉండడమే నయం అనిపించేది.” మనసును గాయపర్చేలా కఠినంగా, దురుసుగా మాట్లాడడం ఈ రోజుల్లో మామూలైపోయింది.

11 భార్యాభర్తలు ఒకరితో ఒకరు కఠినంగా మాట్లాడుకుంటే వాళ్ల మనసులు గాయపడతాయి. ఆ గాయాలు మానడానికి చాలాకాలం పడుతుంది. వాళ్లు అలా కఠినంగా మాట్లాడుకోవడం యెహోవాకు ఇష్టం ఉండదు. కానీ కొన్నిసార్లు మీకు తెలియకుండానే మీ మాటలు వివాహజతను నొప్పించవచ్చు. మీరు వాళ్లతో దయగా మాట్లాడుతున్నారని మీరు అనుకుంటారు, కానీ వాళ్లు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి. ఒకవేళ మీ మాటలు వాళ్లను బాధపెట్టాయని తెలిస్తే మీరేం చేస్తారు? మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటారా?—గలతీయులు 5:15; ఎఫెసీయులు 4:31 చదవండి.

12. పెళ్లయిన వ్యక్తికి యెహోవాతో ఉన్న సంబంధం దేనివల్ల పాడవ్వవచ్చు?

12 నలుగురిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా మీరు మీ వివాహజతతో ఎలా మాట్లాడుతున్నారనేది యెహోవా గమనిస్తాడు. (1 పేతురు 3:7 చదవండి.) యాకోబు 1:26 ఇలా చెప్తుంది: “ఒక వ్యక్తి, తాను దేవుని ఆరాధకుణ్ణని అనుకుంటూ, నాలుకను అదుపులో పెట్టుకోకపోతే అతను తన హృదయాన్ని మోసం చేసుకుంటున్నాడు; అతని ఆరాధన వ్యర్థం.”

13. ఒక వ్యక్తి ఏ విధంగా తన వివాహజతను బాధపెట్టే అవకాశం ఉంది?

13 భార్యాభర్తలు వేరే విధాలుగా కూడా తమ వివాహజతను బాధపెట్టే అవకాశం ఉంది. ఉదాహరణకు, మీరు పరాయి వ్యక్తితో ఎక్కువ సమయం గడుపుతుంటే మీ వివాహజతకు ఎలా అనిపిస్తుంది? మీరు ఒక మంచి కారణంతోనే అంటే పరిచర్య కోసమో, ఏదైనా సమస్యను పరిష్కరించడం కోసమో ఆ వ్యక్తితో సమయం గడుపుతుండవచ్చు. కానీ దానివల్ల మీ వివాహజత బాధపడుతుండవచ్చు. ఒక సహోదరి ఇలా చెప్పింది: “నా భర్త సంఘంలో ఉన్న వేరే సహోదరితో ఎక్కువ సమయం గడుపుతూ, ఆమె మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంటే నాకు బాధగా ఉంటుంది. నేను పనికిరాని దాన్నేమో అనిపిస్తుంది.”

14. (ఎ) ఆదికాండం 2:24 లో ఏ ప్రాథమిక సత్యం ఉంది? (బి) మనల్ని మనం ఏమని ప్రశ్నించుకోవాలి?

14 క్రైస్తవులుగా మనం మన తల్లిదండ్రుల్ని, సంఘంలోని సహోదరసహోదరీల్ని పట్టించుకోవాలి. పెళ్లి తర్వాత మాత్రం మన వివాహజత గురించే ఎక్కువగా ఆలోచించాలి. భర్త “తన భార్యను అంటిపెట్టుకొని ఉంటాడు” అని యెహోవా చెప్పాడు. (ఆదికాండం 2:24) మన వివాహజత భావాలే మనకు ఎక్కువ ప్రాముఖ్యం. మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను నా భర్తతో/భార్యతో తగినంత సమయం గడుపుతూ శ్రద్ధ, ప్రేమ చూపిస్తున్నానా?’

15. వివాహజతతో కాకుండా వేరే వ్యక్తితో మరీ సన్నిహితంగా ఎందుకు ఉండకూడదు?

15 మన వివాహజతతో కాకుండా వేరే వ్యక్తితో మరీ సన్నిహితంగా ఉంటే వివాహ బంధం బీటలువారుతుంది. మనం ఆ వ్యక్తికి దగ్గరై ప్రేమను, ఇష్టాన్ని పెంచుకునే అవకాశం ఉంది. (మత్తయి 5:28) దానివల్ల చివరికి తప్పు చేసి వివాహాన్ని అగౌరవపర్చే ప్రమాదం ఉంది.

“పెళ్లి పాన్పు ఏ కళంకం లేనిదై ఉండాలి”

16. వివాహం గురించి బైబిలు ఏ ఆజ్ఞ ఇస్తుంది?

16 “వివాహాన్ని అందరూ గౌరవప్రదమైనదిగా చూడాలి” అని చెప్పిన తర్వాత బైబిలు ఇలా చెప్తుంది: “పెళ్లి పాన్పు ఏ కళంకం లేనిదై ఉండాలి. లైంగిక పాపం చేసేవాళ్లకు, వ్యభిచారం చేసేవాళ్లకు దేవుడు తీర్పుతీరుస్తాడు.” (హెబ్రీయులు 13:4, అధస్సూచి) ఇక్కడ “పెళ్లి పాన్పు” అనే మాట, భార్యాభర్తల మధ్య ఉండే లైంగిక సంబంధాన్ని సూచిస్తుంది. (సామెతలు 5:18) మనం దాన్ని గౌరవిస్తూ, కళంకం కలగకుండా చూసుకోవాలి. ఎలా?

17. (ఎ) వ్యభిచారం విషయంలో చాలామంది అభిప్రాయం ఎలా ఉంది? (బి) వ్యభిచారం విషయంలో క్రైస్తవుల అభిప్రాయం ఎలా ఉండాలి?

17 వివాహజతతో కాకుండా వేరేవాళ్లతో లైంగిక సంబంధం పెట్టుకోవడంలో తప్పేమీ లేదని చాలామంది అనుకుంటున్నారు. వాళ్ల ప్రభావం మన మీద పడనివ్వకూడదు. లైంగిక పాపాలు, వ్యభిచారం తనకు అసహ్యం అని యెహోవా చాలా సూటిగా చెప్తున్నాడు. (రోమీయులు 12:9 చదవండి; హెబ్రీయులు 10:31; 12:29) వివాహజతతో కాకుండా వేరే వ్యక్తితో లైంగిక సంబంధం పెట్టుకుంటే పెళ్లి పాన్పును అపవిత్రం చేసినట్టే. ఆ విధంగా యెహోవా ప్రమాణాల పట్ల అగౌరవం చూపిస్తే, ఆయనతో మనకున్న సంబంధం పాడౌతుంది. కాబట్టి క్రైస్తవులమైన మనం వ్యభిచారానికి నడిపించే దారిలో అడుగు పెట్టకూడదు. అంటే వేరే వ్యక్తి గురించి తప్పుడు ఆలోచనలు మన మనసులోకి రానివ్వకూడదు.—యోబు 31:1.

18. (ఎ) వ్యభిచారం, అబద్ధ దేవుళ్లను పూజించడంతో సమానం అని ఎలా చెప్పవచ్చు? (బి) వ్యభిచారాన్ని యెహోవా ఎలా చూస్తాడు?

18 మోషే ధర్మశాస్త్రం ప్రకారం, అబద్ధ దేవుళ్లను పూజించడం ఎంత పెద్ద తప్పో వ్యభిచారం చేయడం కూడా అంతే పెద్ద తప్పు. ఆ రెండిటికీ శిక్ష ఒకటే, అదే మరణశిక్ష. (లేవీయకాండం 20:2, 10) వ్యభిచారం, అబద్ధ దేవుళ్లను పూజించడంతో సమానం అని ఎలా చెప్పవచ్చు? ఒక ఇశ్రాయేలీయుడు అబద్ధ దేవుళ్లను పూజిస్తే, నమ్మకంగా ఉంటానని యెహోవాకు ఇచ్చిన మాటను తప్పినట్టే. అదేవిధంగా ఒక వ్యక్తి వ్యభిచారం చేస్తే, నమ్మకంగా ఉంటానని తన భార్యకు ఇచ్చిన మాటను తప్పినట్టే. (నిర్గమకాండం 19:5, 6; ద్వితీయోపదేశకాండం 5:9; మలాకీ 2:14 చదవండి.) ఇశ్రాయేలీయుల కాలంలో, వ్యభిచారాన్ని యెహోవా చాలా పెద్ద పాపంలా చూశాడని స్పష్టమౌతుంది.

19. వివాహజతకు ద్రోహం చేయకూడదని మనం ఎందుకు నిశ్చయించుకుంటాం?

19 నేడు మన సంగతేంటి? మనం మోషే ధర్మశాస్త్రం కింద లేకపోయినా వ్యభిచారం విషయంలో యెహోవా అభిప్రాయం ఏమాత్రం మారలేదు. మనం అబద్ధ దేవుళ్లను ఎన్నడూ ఆరాధించనట్టే, మన వివాహజతకు ఎన్నడూ ద్రోహం చేయకూడదని నిశ్చయించుకోవాలి. (కీర్తన 51:1, 4; కొలొస్సయులు 3:5) ఒకవేళ అలా చేస్తే వివాహాన్ని, మన దేవుడైన యెహోవాను అగౌరవపర్చినట్టే.—“విడాకులు, వేరుగా ఉండడం” చూడండి.

మీ వివాహ బంధాన్ని ఎలా బలపర్చుకోవచ్చు?

20. తెలివి వివాహ బంధాన్ని ఎలా బలపరుస్తుంది?

20 మీ వివాహ బంధాన్ని ఎలా బలపర్చుకోవచ్చు? బైబిలు ఇలా చెప్తుంది: “తెలివి వల్ల ఇల్లు కట్టబడుతుంది, వివేచన వల్ల అది సుస్థిరం చేయబడుతుంది.” (సామెతలు 24:3) తెలివిగా ఆలోచించి కట్టిన ఇల్లు సుస్థిరంగా, సౌకర్యవంతంగా, సురక్షితంగా ఉంటుంది. వివాహ జీవితం కూడా అంతే. తెలివిగల వ్యక్తి తన వివాహ జీవితం సురక్షితంగా, ఆహ్లాదకరంగా, ఆనందంగా ఉండేలా చూసుకుంటాడు.

21. జ్ఞానం వివాహ బంధాన్ని ఎలా బలపరుస్తుంది?

21 ఆ ఇల్లు గురించి బైబిలు ఇంకా ఇలా చెప్తుంది: “జ్ఞానం వల్ల దాని గదులు అన్నిరకాల విలువైన, ఆహ్లాదకరమైన సంపదలతో నింపబడతాయి.” (సామెతలు 24:4) దేవుని వాక్యంలో మీరు నేర్చుకునే విషయాలు మీ వివాహ బంధాన్ని బలపర్చగలవు. (రోమీయులు 12:2; ఫిలిప్పీయులు 1:9) మీరిద్దరూ కలిసి బైబిల్ని, ప్రచురణల్ని చదువుతున్నప్పుడు అందులోని విషయాల్ని మీరెలా పాటించవచ్చో చర్చించుకోండి. ఒకరి పట్ల ఒకరు ఏయే విధాలుగా ప్రేమ, గౌరవం, దయ, శ్రద్ధ చూపించుకోవచ్చో ఆలోచించండి. మీ వివాహ బంధాన్ని బలపర్చే, మీ మధ్య ప్రేమను వృద్ధిచేసే లక్షణాల్ని పెంచుకోవడానికి సహాయం చేయమని యెహోవాను అడగండి.—సామెతలు 15:16, 17; 1 పేతురు 1:7.

కుటుంబ ఆరాధన సమయంలో యెహోవా నిర్దేశం కోసం వెదకండి

22. వివాహజతను ప్రేమించడానికి, గౌరవించడానికి, ఘనపర్చడానికి ఎందుకు కృషిచేయాలి?

22 మీ వివాహజతను ప్రేమించడానికి, గౌరవించడానికి, ఘనపర్చడానికి చేయగలిగినదంతా చేయండి. అలా చేస్తే మీ ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది, మీ బంధం బలపడుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా యెహోవా సంతోషిస్తాడు.—కీర్తన 147:11; రోమీయులు 12:10.