కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

10వ అధ్యాయం

పెళ్లి దేవుడు ఇచ్చిన బహుమతి

పెళ్లి దేవుడు ఇచ్చిన బహుమతి

“మూడు పేటల తాడు త్వరగా తెగిపోదు.”—ప్రసంగి 4:12.

1, 2. (ఎ) కొత్తగా పెళ్లయినవాళ్లు ఏం కోరుకుంటారు? (బి) ఈ అధ్యాయంలో ఏ ప్రశ్నల్ని పరిశీలిస్తాం?

 పెళ్లిరోజున పెళ్లికొడుకు, పెళ్లికూతురు సంతోషంగా ఉంటారు. ఎన్నో కలలతో, ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెడతారు. వాళ్లు తమ వివాహ బంధం చిరకాలం ఉండాలని, తమ వివాహ జీవితం ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటారు.

2 అయితే చాలా పెళ్లిళ్లు సంతోషంగా మొదలైనా, చివరివరకు అలా ఉండట్లేదు. వివాహ జీవితం చిరకాలం సంతోషంగా సాగాలంటే భార్యాభర్తలకు దేవుని నిర్దేశం అవసరం. కాబట్టి ఈ ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబుల్ని పరిశీలిద్దాం: పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చే కొన్ని ప్రయోజనాలు ఏంటి? ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి? మీరు మంచి భర్తగా లేదా భార్యగా ఉండడానికి ఎలా సిద్ధపడవచ్చు? వివాహ బంధం చిరకాలం కొనసాగడానికి ఏది సహాయం చేస్తుంది?—సామెతలు 3:5, 6 చదవండి.

నేను పెళ్లి చేసుకోవాలా?

3. పెళ్లి చేసుకుంటేనే సంతోషంగా ఉంటామా? వివరించండి.

3 పెళ్లి చేసుకుంటేనే సంతోషంగా ఉంటామని కొందరు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. పెళ్లి చేసుకోకుండా ఉండడం ఒక బహుమతి అని యేసు చెప్పాడు. (మత్తయి 19:10-12) దానివల్ల ప్రయోజనాలు ఉన్నాయని పౌలు కూడా చెప్పాడు. (1 కొరింథీయులు 7:32-38) అయితే పెళ్లి చేసుకోవాలా, వద్దా అనేది మీరే నిర్ణయించుకోవాలి. అంతేగానీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, సమాజం తెచ్చే ఒత్తిడి వల్ల పెళ్లి చేసుకోకూడదు.

4. పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చే కొన్ని ప్రయోజనాలు ఏంటి?

4 పెళ్లి కూడా దేవుడు ఇచ్చిన బహుమతి అని, దానివల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని బైబిలు చెప్తుంది. మొదటి మనిషైన ఆదాము గురించి యెహోవా ఇలా చెప్పాడు: “మనిషి ఇలా ఒంటరిగా ఉండడం మంచిదికాదు. నేను అతనికి సాటియైన సహాయకారిని చేస్తాను.” (ఆదికాండం 2:18) దేవుడు ఆదాముకు భార్యగా హవ్వను సృష్టించాడు, అలా మొదటి మానవ కుటుంబం ఆరంభమైంది. పెళ్లి చేసుకున్నవాళ్లు ఒకరికొకరు తోడునీడగా ఉంటారు. అంతేకాదు వాళ్లకు పిల్లలు పుడితే, ఆ పిల్లలు పెరగడానికి అనువైన వాతావరణం కల్పిస్తారు. అయితే పిల్లల్ని కనడం ఒక్కటే పెళ్లి ఉద్దేశం కాదు.—కీర్తన 127:3; ఎఫెసీయులు 6:1-4.

5, 6. వివాహ బంధాన్ని ‘మూడు పేటల తాడుతో’ ఎందుకు పోల్చవచ్చు?

5 సొలొమోను రాజు ఇలా రాశాడు: “ఒక్కరి కన్నా ఇద్దరు ఉండడం మంచిది, ఎందుకంటే వాళ్ల కష్టం వల్ల వాళ్లకు మంచి ప్రతిఫలం కలుగుతుంది. వాళ్లలో ఒకరు పడిపోతే, తోటివ్యక్తి అతన్ని పైకి లేపుతాడు. కానీ ఒంటరిగా ఉన్నవాడు పడిపోతే, అతన్ని ఎవరు పైకి లేపుతారు? . . . మూడు పేటల తాడు త్వరగా తెగిపోదు.”—ప్రసంగి 4:9-12.

6 భార్యాభర్తలు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఓదార్చుకుంటూ, సంరక్షించుకుంటూ ప్రాణ స్నేహితుల్లా కలిసి ఉంటే వివాహ జీవితం బాగుంటుంది. ప్రేమ ఉంటే వివాహ బంధం బలంగా ఉంటుంది. అయితే, భార్యాభర్తలిద్దరూ యెహోవాను ఆరాధిస్తే అది ఇంకా బలంగా ఉంటుంది. అప్పుడు అది ‘మూడు పేటల తాడులా’ బలంగా తయారౌతుంది. మూడు తాళ్లను దగ్గరదగ్గరగా అల్లినప్పుడు, అది రెండు పేటల తాడు కన్నా బలంగా ఉంటుంది. అదేవిధంగా, భార్యాభర్తలు యెహోవాకు చోటు ఇచ్చినప్పుడు వాళ్ల బంధం బలంగా ఉంటుంది.

7, 8. పెళ్లి గురించి పౌలు ఏ సలహా ఇచ్చాడు?

7 పెళ్లి చేసుకున్న తర్వాత, భార్యాభర్తలు సహజమైన తమ లైంగిక కోరికల్ని తీర్చుకోవచ్చు. (సామెతలు 5:18) అయితే ఆ కోరికల్ని తీర్చుకోవడానికే పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తి తన జతను తెలివిగా ఎంచుకోలేకపోవచ్చు. అందుకే లైంగిక కోరికలు బలంగా ఉండే “యౌవనప్రాయం” దాటిపోయిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని బైబిలు చెప్తుంది. (1 కొరింథీయులు 7:36) ఆ కోరికలు తగ్గేవరకు వేచి ఉంటే, ఇంకా బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు.—1 కొరింథీయులు 7:9; యాకోబు 1:15.

8 మీరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే, వివాహ జీవితంలో సంతోషాలే కాదు సమస్యలు కూడా ఉంటాయనే వాస్తవాన్ని గుర్తుంచుకోవడం మంచిది. “పెళ్లి చేసుకునేవాళ్లకు శరీర సంబంధమైన శ్రమలు వస్తాయి” అని పౌలు చెప్పాడు. (1 కొరింథీయులు 7:28) ప్రతీ ఒక్కరి వివాహ జీవితంలో, చివరికి అన్యోన్యంగా ఉండే భార్యాభర్తల మధ్య కూడా సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటే, మీ వివాహజతను జాగ్రత్తగా ఎంచుకోండి.

ఎవర్ని పెళ్లి చేసుకోవాలి?

9, 10. యెహోవాను ఆరాధించని వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఏమౌతుంది?

9 ఎవర్ని పెళ్లి చేసుకోవాలో ఆలోచిస్తున్నప్పుడు ఈ ప్రాముఖ్యమైన బైబిలు సూత్రాన్ని గుర్తుంచుకోండి: “అవిశ్వాసులతో ఎగుడుదిగుడు కాడి కిందికి వెళ్లకండి.” (2 కొరింథీయులు 6:14, అధస్సూచి) పౌలు ఇక్కడ, వ్యవసాయం చేసేటప్పుడు జంతువుల మీద పెట్టే కాడి గురించి మాట్లాడుతున్నాడు. సాధారణంగా రైతులు పెద్ద జంతువును, చిన్న జంతువును లేదా బలమైన జంతువును, బలహీనమైన జంతువును కలిపి కాడి మోపరు. అలా చేస్తే వాటిమీద జాలి చూపించినట్లు అవ్వదు, అవి రెండూ ఇబ్బందిపడతాయి. అదేవిధంగా యెహోవాను ఆరాధించే వ్యక్తి, ఆయన్ని ఆరాధించని వ్యక్తిని పెళ్లి చేసుకుంటే చాలా సమస్యలు రావచ్చు. కాబట్టి, “ప్రభువును అనుసరించే వ్యక్తినే” పెళ్లి చేసుకోమని బైబిలు చెప్తుంది, అది తెలివైన సలహా.—1 కొరింథీయులు 7:39.

10 కొన్నిసార్లు, ఒంటరిగా ఉండిపోవడం కన్నా యెహోవాను ఆరాధించని వ్యక్తిని పెళ్లి చేసుకోవడమే మంచిదని కొందరు క్రైస్తవులు అనుకున్నారు. కానీ బైబిలు సలహాను పట్టించుకోకపోతే కష్టాలు, కన్నీళ్లే మిగలవచ్చు. యెహోవా సేవకులకు తమ జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనది, ఆయన్ని ఆరాధించడమే. మరి అంత ప్రాముఖ్యమైన ఆరాధనను మీ వివాహజతతో కలిసి చేయలేకపోతే మీకెలా అనిపిస్తుంది? అందుకే యెహోవాను ప్రేమించని, ఆరాధించని వ్యక్తిని పెళ్లి చేసుకునే బదులు ఒంటరిగానే ఉండిపోవాలని చాలామంది నిర్ణయించుకున్నారు.—కీర్తన 32:8 చదవండి.

11. మీరు సరైన వివాహజతను ఎలా ఎంచుకోవచ్చు?

11 అలాగని యెహోవాను ఆరాధించే ఏ వ్యక్తయినా మీకు సరైన జోడి అవుతారని కాదు. మీరు పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తుంటే మీకు నిజంగా నచ్చే వాళ్ల కోసం, ఎవరితో మీ జీవితాన్ని పంచుకోగలరో వాళ్ల కోసం వెదకండి. మీలాంటి లక్ష్యాలే ఉండి, దేవుని ఆరాధనకు మొదటి స్థానం ఇచ్చే వ్యక్తి దొరికేవరకు వేచి ఉండండి. నమ్మకమైన దాసుడు మన ప్రచురణల్లో ఇచ్చిన మంచి సలహాల్ని చదవడానికి, ధ్యానించడానికి సమయం తీసుకోండి.—కీర్తన 119:105 చదవండి.

12. పిల్లలకు పెళ్లి సంబంధాలు చూస్తున్న తల్లిదండ్రులకు బైబిలు ఎలా సహాయం చేస్తుంది?

12 కొన్ని ప్రాంతాల్లో తల్లిదండ్రులే పిల్లలకు పెళ్లి సంబంధాలు చూస్తారు. వాళ్లయితేనే పిల్లలకు సరైన జతను చూడగలరు అన్నది చాలామంది అభిప్రాయం. బైబిలు కాలాల్లో కూడా ఈ పద్ధతి ఉండేది. ఒకవేళ మీ తల్లిదండ్రులు మీకు పెళ్లి సంబంధాలు చూస్తుంటే, వాళ్లు ఎలాంటి లక్షణాలు ఉన్నవాళ్ల కోసం వెతకాలో బైబిలు చదివి తెలుసుకోవచ్చు. ఉదాహరణకు, అబ్రాహాము తన కొడుకైన ఇస్సాకు కోసం ఆస్తి, హోదా ఉన్న అమ్మాయిని కాదుగానీ యెహోవాను ప్రేమించే అమ్మాయిని చూశాడు.—ఆదికాండం 24:3, 67; “ఎక్కువమందిని పెళ్లి చేసుకోవడం” చూడండి.

పెళ్లి కోసం నేనెలా సిద్ధపడవచ్చు?

13-15. (ఎ) ఒక అబ్బాయి మంచి భర్తగా ఉండడానికి ఎలా సిద్ధపడవచ్చు? (బి) ఒక అమ్మాయి మంచి భార్యగా ఉండడానికి ఎలా సిద్ధపడవచ్చు?

13 మీరు పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తుంటే, ముందుగా మీరు దానికోసం సిద్ధంగా ఉన్నారో లేదో చూసుకోండి. మీరు సిద్ధంగా ఉన్నట్టు మీకు అనిపించవచ్చు. కానీ సిద్ధపడడం అంటే ఏంటో పరిశీలిస్తే, మీరు నిజంగా సిద్ధంగా ఉన్నారో లేదో తెలుస్తుంది.

పెళ్లి విషయంలో బైబిలు ఇస్తున్న సలహాల్ని చదివి, ధ్యానించడానికి సమయం తీసుకోండి

14 కుటుంబంలో భర్తకు, భార్యకు వేర్వేరు బాధ్యతలు ఉన్నాయని బైబిలు చెప్తుంది. కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అబ్బాయి, అమ్మాయి వేర్వేరు విషయాల కోసం సిద్ధపడాలి. అబ్బాయి, కుటుంబ శిరస్సుగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాడో లేదో ఆలోచించుకోవాలి. భర్త తన భార్యాపిల్లల అవసరాలు తీర్చాలని, వాళ్లను ప్రేమించాలని యెహోవా కోరుకుంటున్నాడు. అన్నిటికన్నా ముఖ్యంగా భర్త ఆధ్యాత్మిక విషయాల్లో తన కుటుంబాన్ని ముందుండి నడిపించాలి. తన కుటుంబాన్ని పట్టించుకోని వ్యక్తి “అవిశ్వాసి కన్నా చెడ్డవాడు” అని బైబిలు చెప్తుంది. (1 తిమోతి 5:8) కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అబ్బాయి, ఈ బైబిలు సూత్రం తనకు ఎలా వర్తిస్తుందో ఆలోచించాలి: “ముందుగా బయట పనులు చక్కబెట్టుకో, పొలంలో పనులు సిద్ధం చేసుకో, ఆ తర్వాత ఇల్లు కట్టుకో.” అంటే, అతను పెళ్లికి ముందే యెహోవా చెప్తున్న లాంటి భర్తగా ఉండడానికి సిద్ధపడాలి.—సామెతలు 24:27.

15 పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి భార్యగా, బహుశా తల్లిగా తన బాధ్యతల్ని చేపట్టడానికి సిద్ధంగా ఉందో లేదో పరిశీలించుకోవాలి. మంచి భార్య తన భర్తను, పిల్లల్ని ఎలా చూసుకుంటుందో బైబిలు చెప్తుంది. (సామెతలు 31:10-31) నేడు చాలామంది అబ్బాయిలు పెళ్లయ్యాక భార్య తన కోసం ఏమేం చేస్తుందో ఆలోచిస్తున్నారు. అమ్మాయిలు కూడా పెళ్లయ్యాక భర్త తన కోసం ఏమేం చేస్తాడో ఆలోచిస్తున్నారు. అయితే మన భర్త లేదా భార్య కోసం మనం ఏం చేయగలం అనే దానిగురించి ఆలోచించాలని యెహోవా చెప్తున్నాడు.

16, 17. మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే దేని గురించి ధ్యానించాలి?

16 భర్త గురించి, భార్య గురించి యెహోవా ఏం చెప్తున్నాడో పెళ్లికి ముందే ధ్యానించండి. భర్త కుటుంబ శిరస్సు కాబట్టి ఏమైనా చేయవచ్చు, అంటే భార్యను తిట్టొచ్చు, కొట్టొచ్చు అని అనుకోకూడదు. మంచి కుటుంబ శిరస్సు తన కుటుంబ సభ్యుల్ని యేసులా ఎప్పుడూ ప్రేమగా, దయగా చూసుకుంటాడు. (ఎఫెసీయులు 5:23) అమ్మాయి విషయానికొస్తే, భర్త నిర్ణయాలకు మద్దతివ్వడం, అతనికి సహకరించడం అంటే ఏంటో ఆమె ఆలోచించాలి. (రోమీయులు 7:2) ఒక అపరిపూర్ణ వ్యక్తికి తాను సంతోషంగా లోబడగలదో లేదో పరిశీలించుకోవాలి. అలా చేయలేనని అనిపిస్తే, ప్రస్తుతానికి పెళ్లి చేసుకోకపోవడమే మంచిదని ఆమె నిర్ణయించుకోవచ్చు.

17 భార్య, భర్త తమ సంతోషం కన్నా తమ వివాహజత సంతోషం గురించే ఎక్కువగా ఆలోచించాలి. (ఫిలిప్పీయులు 2:4 చదవండి.) పౌలు ఇలా రాశాడు: “మీలో ప్రతీ ఒక్కరు తనను తాను ప్రేమించుకున్నట్టు తన భార్యను ప్రేమించాలి; భార్య విషయానికొస్తే, ఆమెకు తన భర్త మీద ప్రగాఢ గౌరవం ఉండాలి.” (ఎఫెసీయులు 5:21-33) సాధారణంగా స్త్రీపురుషులిద్దరూ ప్రేమ, గౌరవాల్ని పొందాలని కోరుకుంటారు. ముఖ్యంగా పురుషులు భార్య గౌరవాన్ని పొందాలని, అలాగే స్త్రీలు భర్త ప్రేమను పొందాలని కోరుకుంటారు. భార్యాభర్తలు అలా ప్రేమ, గౌరవాల్ని చూపించుకున్నప్పుడు వాళ్ల వివాహ జీవితం సంతోషంగా సాగిపోతుంది.

18. కోర్ట్‌షిప్‌ సమయంలో అబ్బాయి, అమ్మాయి ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?

18 పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి, అబ్బాయి ఒకరి గురించి ఒకరు ఎక్కువగా తెలుసుకోవడానికి గడిపే సమయాన్ని కోర్ట్‌షిప్‌ అంటారు. అది ఆహ్లాదకరంగా ఉండాలి. ఆ సమయంలో వాళ్లు ఊహల్లో తేలిపోకుండా వాస్తవాల్లోకి వచ్చి నిజాయితీగా ఆలోచించాలి. అప్పుడు వాళ్లిద్దరు జీవితాన్ని పంచుకోగలరో లేదో వాళ్లకు అర్థమౌతుంది. కోర్ట్‌షిప్‌ సమయంలో వాళ్లు మనసువిప్పి మాట్లాడుకోవడం, ఎదుటి వ్యక్తి మనసులో నిజంగా ఏముందో గ్రహించడం నేర్చుకుంటారు. వాళ్ల స్నేహం బలపడేకొద్దీ సహజంగానే వాళ్ల మధ్య శారీరక ఆకర్షణ పెరుగుతుంది. కానీ వాళ్లు ఒకరి మీద ఒకరు ప్రేమానురాగాల్ని చూపించుకునేటప్పుడు హద్దులు మీరకూడదు. లేదంటే వాళ్లు పెళ్లికి ముందే తప్పు చేసే ప్రమాదం ఉంది. నిజమైన ప్రేమ ఉంటే వాళ్లు ఆత్మనిగ్రహం చూపించగలుగుతారు. అంతేకాదు వాళ్లిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని, యెహోవాతో ఉన్న సంబంధాన్ని పాడుచేసే ఏ పనీ చేయకుండా ఉండగలుగుతారు.—1 థెస్సలొనీకయులు 4:6.

కోర్ట్‌షిప్‌ సమయంలో అబ్బాయి, అమ్మాయి మనసువిప్పి మాట్లాడుకోవడం నేర్చుకుంటారు

వివాహ బంధం చిరకాలం ఉండాలంటే నేనేం చేయాలి?

19, 20. క్రైస్తవులమైన మనం వివాహాన్ని ఎలా చూడాలి?

19 చాలా పుస్తకాల్లో, సినిమాల్లో అబ్బాయి, అమ్మాయి సంతోషంగా పెళ్లి చేసుకోవడంతో కథ ముగుస్తుంది. కానీ నిజ జీవితంలో అసలు కథ పెళ్లితోనే మొదలౌతుంది. వివాహ బంధం శాశ్వతంగా ఉండాలనేది యెహోవా ఉద్దేశం.—ఆదికాండం 2:24.

20 నేడు చాలామంది వివాహాన్ని చిరకాల బంధంలా చూడట్లేదు. త్వరగా పెళ్లి చేసుకుంటున్నారు, త్వరగా విడాకులు తీసుకుంటున్నారు. సమస్యలు వచ్చిన వెంటనే భర్తను లేదా భార్యను వదిలేసి, ఆ బంధాన్ని తెంచేసుకోవాలని అనుకుంటున్నారు. అయితే బైబిలు వివాహాన్ని మూడు పేటల తాడుతో పోల్చిందని గుర్తుతెచ్చుకోండి. మూడు తాళ్లను దగ్గరదగ్గరగా అల్లినప్పుడు, బలంగా లాగినా అది తెగిపోదు. అదేవిధంగా, సహాయం కోసం యెహోవా వైపు చూసినప్పుడు వివాహ బంధం చిరకాలం నిలుస్తుంది. యేసు ఇలా అన్నాడు: “దేవుడు ఒకటి చేసినవాళ్లను ఏ మనిషీ విడదీయకూడదు.”—మత్తయి 19:6.

21. ఒకరినొకరు ప్రేమించుకోవడానికి భార్యాభర్తలకు ఏది సహాయం చేస్తుంది?

21 మనందరికీ బలాలు, బలహీనతలు ఉంటాయి. ఎదుటివాళ్ల బలహీనతల మీద, ముఖ్యంగా వివాహజత బలహీనతల మీద మనసుపెట్టడం చాలా సులభం. కానీ అలా చేస్తే మనం సంతోషంగా ఉండలేం. బదులుగా మన భర్త లేదా భార్యలోని మంచి లక్షణాల మీద మనసుపెడితే వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది. ఒక అపరిపూర్ణ వ్యక్తిలో మంచి లక్షణాలను చూడడం సాధ్యమేనా? సాధ్యమే! ఎందుకంటే, మనం అపరిపూర్ణులమైనా యెహోవా మనలోని మంచి లక్షణాల మీద మనసు పెడుతున్నాడు. అలా కాకుండా ఆయన మన తప్పుల మీద మనసుపెడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి! కీర్తనకర్త ఇలా అన్నాడు: “యెహోవా, నువ్వు తప్పుల్ని గమనిస్తూ ఉంటే, యెహోవా, ఎవరు నిలవగలరు?” (కీర్తన 130:3) తమ వివాహజతలో మంచిని చూస్తూ, క్షమించడానికి సిద్ధంగా ఉండడం ద్వారా భార్యాభర్తలు యెహోవాను అనుకరించవచ్చు.—కొలొస్సయులు 3:13 చదవండి.

22, 23. దంపతులకు అబ్రాహాము, శారా ఎలా మంచి ఆదర్శం ఉంచారు?

22 సంవత్సరాలు గడిచే కొద్దీ వివాహ బంధం మరింత బలపడవచ్చు. అబ్రాహాము, శారాల వివాహ జీవితం చిరకాలం సంతోషంగా సాగింది. ఊరు అనే నగరంలో ఉన్న తమ ఇంటిని విడిచిపెట్టి రమ్మని యెహోవా అబ్రాహాముకు చెప్పాడు. అప్పుడు శారాకు 60 కన్నా ఎక్కువ ఏళ్లు ఉండుంటాయి. చాలా సౌకర్యంగా ఉన్న ఇంటిని విడిచిపెట్టి, డేరాల్లో నివసించడం ఎంత కష్టమో ఆలోచించండి. కానీ శారా తన భర్తకు మంచి స్నేహితురాలిగా, సహాయకారిగా ఉంటూ నిజమైన గౌరవం చూపించింది. ఆమె అబ్రాహాము నిర్ణయాలకు మద్దతిచ్చింది, అవి సఫలం అవ్వడానికి సహాయం చేసింది.—ఆదికాండం 18:12; 1 పేతురు 3:6.

23 నిజానికి, అన్యోన్యంగా ఉన్న భార్యాభర్తల మధ్య కూడా ఒక్కోసారి భేదాభిప్రాయాలు వస్తాయి. ఒక సందర్భంలో శారా చెప్పింది అబ్రాహాముకు నచ్చలేదు. అప్పుడు యెహోవా, “ఆమె మాట విను” అని అతనితో అన్నాడు. అబ్రాహాము ఆమె మాట వినడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయి. (ఆదికాండం 21:9-13) ఎప్పుడైనా మీకు, మీ వివాహజతకు మధ్య భేదాభిప్రాయాలు వస్తే నిరుత్సాహపడకండి. అలాంటి పరిస్థితిలో కూడా ప్రేమ, గౌరవాల్ని చూపిస్తూ ఉండండి. అది చాలా ప్రాముఖ్యం.

పెళ్లిరోజు నుండే దేవుని వాక్యానికి మీ వివాహ జీవితంలో చోటు ఇవ్వండి

24. భార్యాభర్తలు యెహోవాకు ఎలా మహిమ తెస్తారు?

24 క్రైస్తవ సంఘంలో సంతోషంగా జీవిస్తున్న దంపతులు వేలమంది ఉన్నారు. మీరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లయితే ఒక విషయం గుర్తుంచుకోండి. వివాహజతను ఎంచుకోవడం, మీరు తీసుకునే అత్యంత ప్రాముఖ్యమైన నిర్ణయాల్లో ఒకటి. ఆ నిర్ణయం మీ మిగతా జీవితమంతటి మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి యెహోవా నిర్దేశం కోసం చూడండి. అప్పుడు మీ వివాహజతను తెలివిగా ఎంచుకోగలుగుతారు, పెళ్లి కోసం సిద్ధంగా ఉండగలుగుతారు. అంతేకాదు ప్రేమ చూపించుకుంటూ, వివాహ బంధాన్ని బలంగా ఉంచుకోవడానికి కృషిచేస్తూ యెహోవాకు మహిమ తెస్తారు.