కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

7వ అధ్యాయం

దేవునిలా ప్రాణాన్ని విలువైనదిగా చూడండి

దేవునిలా ప్రాణాన్ని విలువైనదిగా చూడండి

“నీ దగ్గర జీవపు ఊట ఉంది.”—కీర్తన 36:9.

1, 2. (ఎ) యెహోవా మనకు ఏ బహుమతి ఇచ్చాడు? (బి) మన జీవితం బాగుండడం కోసం ఆయన ఏం ఇచ్చాడు?

 యెహోవా మనందరికీ ప్రాణం అనే అద్భుతమైన బహుమతి ఇచ్చాడు. (ఆదికాండం 1:27) మన జీవితం బాగుండాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేసే సూత్రాల్ని మనకు ఇచ్చాడు. వాటిని ఉపయోగించి మనం ‘తప్పొప్పులను గుర్తించాలి.’ (హెబ్రీయులు 5:14) అలా చేస్తే మనం యెహోవా సహాయంతో సరిగ్గా ఆలోచించగలుగుతాం. దేవుని సూత్రాల ప్రకారం జీవించినప్పుడు, వాటివల్ల మనం పొందే ప్రయోజనాల్ని అర్థం చేసుకున్నప్పుడు ఆ సూత్రాలు ఎంత విలువైనవో గుర్తిస్తాం.

2 జీవితంలో రకరకాల పరిస్థితులు ఎదురౌతుంటాయి. కొన్నిసార్లు, ఫలానా పరిస్థితిలో ఏం చేయాలో తెలిపే సూటైన నియమం బైబిల్లో ఉండకపోవచ్చు. ఉదాహరణకు, రక్తాన్ని ఉపయోగించి చేసే వైద్య చికిత్సల గురించి మనం నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. అప్పుడు యెహోవాను సంతోషపెట్టే నిర్ణయాలు ఎలా తీసుకోవచ్చు? యెహోవా ప్రాణాన్ని, రక్తాన్ని ఎలా చూస్తాడో తెలిపే సూత్రాలు బైబిల్లో ఉన్నాయి. వాటిని అర్థం చేసుకుంటే మనం తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం, మంచి మనస్సాక్షితో ఉండగలుగుతాం. (సామెతలు 2:6-11) వాటిలో కొన్ని సూత్రాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

దేవుడు ప్రాణాన్ని, రక్తాన్ని ఎలా చూస్తాడు?

3, 4. (ఎ) రక్తం విషయంలో తన అభిప్రాయాన్ని యెహోవా ఎలా తెలియజేశాడు? (బి) రక్తం దేనితో సమానం?

3 రక్తం పవిత్రమైనదని, అది ప్రాణంతో సమానమని బైబిలు చెప్తుంది. ప్రాణాన్ని యెహోవా విలువైనదిగా చూస్తాడు. కయీను తన తమ్ముడైన హేబెలును చంపాడు. అప్పుడు యెహోవా కయీనుతో ఇలా అన్నాడు: “నీ తమ్ముడి రక్తం నేల నుండి నాకు మొరపెడుతోంది.” (ఆదికాండం 4:10) హేబెలు రక్తం అతని ప్రాణాన్ని సూచించింది; ఇక్కడ “నీ తమ్ముడి రక్తం” అని అన్నప్పుడు యెహోవా హేబెలు ప్రాణం గురించే మాట్లాడుతున్నాడు.

4 నోవహు జలప్రళయం తర్వాత మనుషులు మాంసం తినడానికి దేవుడు అనుమతించాడు. కానీ “మాంసాన్ని దాని రక్తంతో తినకూడదు, ఎందుకంటే రక్తమే దాని ప్రాణం” అని ఆయన ఖచ్చితంగా చెప్పాడు. (ఆదికాండం 9:4) నోవహు పిల్లలందరికీ అంటే ఇప్పుడున్న మనకు కూడా ఆ ఆజ్ఞ వర్తిస్తుంది. యెహోవా దృష్టిలో రక్తం ప్రాణంతో సమానమని ఆ ఆజ్ఞను బట్టి అర్థమౌతోంది. మనం కూడా రక్తాన్ని ప్రాణంతో సమానంగా చూడాలి.—కీర్తన 36:9.

5, 6. ప్రాణం, రక్తం విషయంలో యెహోవా అభిప్రాయాన్ని మోషే ధర్మశాస్త్రం ఎలా తెలియజేసింది?

5 యెహోవా మోషేకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఇలా చెప్పాడు: “ఎవరైనా దేని రక్తాన్నైనా తింటే, అలా రక్తం తినే వ్యక్తిని నేను తిరస్కరిస్తాను, అతన్ని తన ప్రజల్లో నుండి కొట్టివేస్తాను. ఎందుకంటే, ఒక జీవి ప్రాణం దాని రక్తంలో ఉంటుంది.”—లేవీయకాండం 17:10, 11.

6 ఎవరైనా ఆహారం కోసం జంతువును చంపినప్పుడు దాని రక్తాన్ని నేల మీద పారబోయాలని మోషే ధర్మశాస్త్రం చెప్పింది. అలా దాని ప్రాణాన్ని సృష్టికర్త అయిన యెహోవాకే తిరిగి ఇస్తున్నట్టు అవుతుంది. (ద్వితీయోపదేశకాండం 12:16) అంటే ఇశ్రాయేలీయులు ఆ జంతువులో నుండి ప్రతీ రక్తపు బొట్టును తీసేయాలని కాదుగానీ వీలైనంత వరకు అందులో రక్తం లేకుండా చూసుకోవాలి. అప్పుడు వాళ్లు మంచి మనస్సాక్షితో ఆ మాంసం తినవచ్చు. అలా వాళ్లు దాని రక్తాన్ని గౌరవించడం ద్వారా, ప్రాణాన్ని ఇచ్చిన యెహోవాను గౌరవిస్తారు. అంతేకాదు పాప క్షమాపణ కోసం జంతు బలులు అర్పించమని కూడా ధర్మశాస్త్రం చెప్పింది.—“ప్రాయశ్చిత్తం,” “జంతువుల ప్రాణం పట్ల గౌరవం” చూడండి.

7. రక్తం పట్ల దావీదు ఎలా గౌరవం చూపించాడు?

7 దావీదు ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు జరిగిన ఒక సంఘటనను బట్టి రక్తం ఎంత విలువైనదో అర్థమౌతుంది. దావీదుకు బాగా దాహం వేసినప్పుడు అతని మనుషులు శత్రువులున్న ప్రాంతానికి వెళ్లి, ప్రాణాలకు తెగించిమరీ అతని కోసం నీళ్లు తెచ్చారు. ఆ నీళ్లను దావీదుకు ఇచ్చినప్పుడు, అతను తాగకుండా “వాటిని యెహోవా ముందు పారబోశాడు.” దావీదు ఇలా అన్నాడు: “యెహోవా, నేను ఈ పని చేయడం నా ఊహకందని విషయం! తమ ప్రాణాలకు తెగించి వెళ్లిన ఈ మనుషుల రక్తాన్ని నేను తాగాలా?” ప్రాణం, రక్తం దేవుని దృష్టిలో ఎంత విలువైనవో దావీదు అర్థం చేసుకున్నాడు.—2 సమూయేలు 23:15-17.

8, 9. రక్తం విషయంలో క్రైస్తవుల అభిప్రాయం ఎలా ఉండాలి?

8 తొలి క్రైస్తవుల కాలంలో, జంతు బలులు అర్పించాల్సిన అవసరం లేదు. కానీ రక్తం విషయంలో వాళ్లు సరైన అభిప్రాయం కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ధర్మశాస్త్రంలో ఉన్న కొన్ని విషయాల్ని, అంటే ‘రక్తానికి దూరంగా ఉండండి’ వంటి ఆజ్ఞల్ని వాళ్లు ఇంకా పాటించాలని యెహోవా కోరుకున్నాడు. లైంగిక పాపాలకు లేదా విగ్రహపూజకు దూరంగా ఉండడం ఎంత ప్రాముఖ్యమో, రక్తానికి దూరంగా ఉండడం కూడా అంతే ప్రాముఖ్యం.—అపొస్తలుల కార్యాలు 15:28, 29.

రక్తంలోని సూక్ష్మ భాగాల విషయంలో నా నిర్ణయాన్ని నేను వివరించగలనా?

9 ఆ ఆజ్ఞ మన కాలానికి కూడా వర్తిస్తుంది. యెహోవాయే జీవానికి మూలమని, సమస్త జీవం ఆయనకే చెందుతుందని క్రైస్తవులమైన మనకు తెలుసు. రక్తం పవిత్రమైనదని, అది ప్రాణంతో సమానమని కూడా మనకు తెలుసు. కాబట్టి రక్తాన్ని ఉపయోగించి చేసే ఎలాంటి వైద్య చికిత్సల విషయంలోనైనా నిర్ణయం తీసుకునేటప్పుడు బైబిలు సూత్రాల్ని పరిశీలించడం ప్రాముఖ్యం.

రక్తాన్ని వైద్యం కోసం ఉపయోగించడం

10, 11. (ఎ) యెహోవాసాక్షులు రక్తాన్ని, రక్తంలోని నాలుగు ప్రధాన భాగాల్ని ఎక్కించుకుంటారా? (బి) ప్రతీ క్రైస్తవుడు ఏ విషయాల్ని వ్యక్తిగతంగా నిర్ణయించుకోవాలి?

10 ‘రక్తానికి దూరంగా ఉండడం’ అంటే కేవలం దాన్ని తినకుండా, తాగకుండా ఉండడం మాత్రమే కాదని యెహోవాసాక్షులకు తెలుసు. కాబట్టి వాళ్లు రక్తం ఎక్కించుకోరు, రక్తదానం చేయరు, తమ రక్తాన్ని నిల్వ ఉంచి మళ్లీ ఎక్కించుకోరు. అంతేకాదు రక్తంలోని నాలుగు ప్రధాన భాగాలైన ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్‌లెట్స్‌, ప్లాస్మాలో దేన్నీ వాళ్లు ఎక్కించుకోరు.

11 రక్తంలోని ఆ నాలుగు ప్రధాన భాగాల్ని సూక్ష్మ భాగాలుగా విడదీయవచ్చు. ఆ సూక్ష్మ భాగాల్ని తీసుకోవాలా వద్దా అనేది క్రైస్తవులు ఎవరికి వాళ్లే నిర్ణయించుకోవాలి. తమ సొంత రక్తాన్ని ఉపయోగించి చేసే వైద్య విధానాల విషయంలో కూడా అంతే. ఆపరేషన్‌ జరుగుతున్నప్పుడు, రక్త పరీక్షలు చేయించుకునేటప్పుడు, లేదా చికిత్స తీసుకుంటున్నప్పుడు తన రక్తాన్ని ఎలా ఉపయోగించాలో ప్రతీ క్రైస్తవుడు వ్యక్తిగతంగా నిర్ణయించుకోవాలి.—“రక్తంలోని సూక్ష్మ భాగాలు, వైద్య విధానాలు” చూడండి.

12. (ఎ) మనం మనస్సాక్షి ప్రకారం తీసుకునే నిర్ణయాల్ని యెహోవా పట్టించుకుంటాడని ఎలా చెప్పవచ్చు? (బి) వైద్య విధానాలకు సంబంధించి మంచి నిర్ణయాలు ఎలా తీసుకోవచ్చు?

12 మనస్సాక్షి ప్రకారం తీసుకునే నిర్ణయాల్ని యెహోవా నిజంగా పట్టించుకుంటాడా? పట్టించుకుంటాడు. యెహోవా మన ఆలోచనల్ని, ఉద్దేశాల్ని గమనిస్తాడు. (సామెతలు 17:3; 24:12 చదవండి.) కాబట్టి, ఏదైనా వైద్య చికిత్సకు సంబంధించి నిర్ణయం తీసుకునే ముందు మనం యెహోవా నిర్దేశం కోసం ప్రార్థించాలి, ఆ చికిత్స గురించి పరిశోధన చేయాలి. తర్వాత, బైబిలు శిక్షిత మనస్సాక్షిని ఉపయోగించి నిర్ణయం తీసుకోవాలి. అంతేగానీ, మన స్థానంలో ఉంటే ఏం చేస్తారో చెప్పమని వేరేవాళ్లను అడగకూడదు, వేరేవాళ్లు కూడా వాళ్ల అభిప్రాయాల్ని మన మీద రుద్దకూడదు. ప్రతీ క్రైస్తవుడు “తన బరువు తానే మోసుకోవాలి.”—గలతీయులు 6:5; రోమీయులు 14:12.

యెహోవా నియమాల్లో ఆయన ప్రేమ కనిపిస్తుంది

13. రక్తానికి సంబంధించిన నియమాల్ని, సూత్రాల్ని బట్టి యెహోవా గురించి ఏం తెలుసుకోవచ్చు?

13 యెహోవా మనల్ని ఏం చేయమని చెప్పినా అది మన మంచి కోసమే, మన మీద ప్రేమతోనే. (కీర్తన 19:7-11) అయితే కేవలం మనకు ప్రయోజనం కలుగుతుందనే ఉద్దేశంతో కాదుగానీ, ఆయన మీద ప్రేమతోనే ఆయన ఆజ్ఞలకు లోబడతాం. ఆ ప్రేమ వల్లే మనం రక్తం ఇవ్వం, ఎక్కించుకోం. (అపొస్తలుల కార్యాలు 15:20) అది మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. రక్తం ఎక్కించుకోవడం వల్ల వచ్చే నష్టాల గురించి నేడు చాలామంది తెలుసుకుంటున్నారు. అంతేకాదు రక్తం ఎక్కించకుండా ఆపరేషన్‌ చేయడమే రోగికి మంచిదని చాలామంది డాక్టర్లు నమ్ముతున్నారు. వీటిని బట్టి యెహోవా మార్గాలు తెలివైనవని, ప్రేమగలవని స్పష్టమౌతోంది.—యెషయా 55:9 చదవండి; యోహాను 14:21, 23.

14, 15. (ఎ) యెహోవా తన ప్రజల్ని కాపాడడానికి ఏ నియమాలు ఇచ్చాడు? (బి) ఆ నియమాల వెనకున్న సూత్రాల్ని మీరెలా పాటించవచ్చు?

14 దేవుని నియమాలు ఆయన ప్రజలకు ఎప్పుడూ మంచే చేశాయి. పెద్దపెద్ద ప్రమాదాల నుండి కాపాడడానికి యెహోవా ప్రాచీన ఇశ్రాయేలీయులకు కొన్ని నియమాలు ఇచ్చాడు. ఉదాహరణకు, ఇంటి డాబా మీద నుండి ఎవరూ పడిపోకుండా ఉండేలా యజమాని పిట్టగోడ కట్టించాలని యెహోవా చెప్పాడు. (ద్వితీయోపదేశకాండం 22:8) మరో నియమం ఏంటంటే, పొడిచే అలవాటు ఉన్న ఎద్దు ఎవర్నీ పొడవకుండా, చంపకుండా ఉండేలా యజమాని దాన్ని అదుపులో ఉంచాలి. అది అతని బాధ్యత. (నిర్గమకాండం 21:28, 29) ఒక ఇశ్రాయేలీయుడు ఆ నియమాల్ని పాటించకపోవడం వల్ల ఎవరైనా చనిపోతే, ఆ ఇశ్రాయేలీయుడు దోషి అవుతాడు.

15 ప్రాణాన్ని యెహోవా విలువైనదిగా చూస్తాడని ఆ నియమాల్ని బట్టి తెలుస్తుంది. ఆ నియమాల వెనకున్న సూత్రాల్ని మనమెలా పాటించవచ్చు? మన ఇంటిని అలాగే వాహనాన్ని సురక్షితంగా ఉంచుకోవడం ద్వారా, వాహనాన్ని జాగ్రత్తగా నడపడం ద్వారా, ప్రమాదకరమైన సరదాలకు-ఆటలకు దూరంగా ఉండడం ద్వారా ప్రాణం పట్ల గౌరవం చూపించవచ్చు. కొంతమంది ప్రజలు, ముఖ్యంగా యౌవనులు ప్రమాదాల్ని పట్టించుకోకుండా సాహసాలు చేస్తారు. కానీ అలాంటి ప్రవర్తనను యెహోవా ఇష్టపడడు. మన ప్రాణాన్ని, ఎదుటివాళ్ల ప్రాణాన్ని విలువైనదిగా చూడాలని ఆయన కోరుతున్నాడు.—ప్రసంగి 11:9, 10.

16. గర్భస్రావం విషయంలో యెహోవా అభిప్రాయం ఏంటి?

16 ఇంకా పుట్టని శిశువు ప్రాణంతో సహా ప్రతీ ఒక్కరి ప్రాణం యెహోవాకు విలువైనదే. ఒక వ్యక్తి వల్ల అనుకోకుండా గర్భిణీ స్త్రీకి దెబ్బ తగిలి, ఆమె గానీ ఆమె కడుపులో ఉన్న బిడ్డ గానీ చనిపోతే, యెహోవా ఆ వ్యక్తిని హంతకుడిలా చూస్తాడని ధర్మశాస్త్రం చెప్పింది. అనుకోకుండా జరిగినా, ఒక ప్రాణం పోయింది కాబట్టి ఆ హంతకుణ్ణి చంపేయాలి. (నిర్గమకాండం 21:22, 23 చదవండి.) కడుపులో ఉన్న బిడ్డను కూడా దేవుడు ఒక వ్యక్తిలానే చూస్తాడు. దీన్నిబట్టి గర్భస్రావం విషయంలో దేవుని అభిప్రాయం ఏమైవుంటుందని మీరు అనుకుంటున్నారు? ప్రతీ సంవత్సరం లక్షలమంది పిల్లల్ని కడుపులోనే చంపేస్తుంటే యెహోవాకు ఎలా అనిపిస్తుంది?

17. ఒక స్త్రీ యెహోవాను తెలుసుకోకముందు గర్భస్రావం చేయించుకుని ఉంటే, ఆమె ఏ నమ్మకంతో ఉండవచ్చు?

17 గర్భస్రావం విషయంలో యెహోవా అభిప్రాయం తెలియకముందు ఒక స్త్రీ గర్భస్రావం చేయించుకుని ఉంటే, అప్పుడేంటి? యేసు బలి ఆధారంగా యెహోవా తన తప్పును క్షమిస్తాడనే నమ్మకంతో ఆమె ఉండవచ్చు. (లూకా 5:32; ఎఫెసీయులు 1:7) ఆమె నిజంగా పశ్చాత్తాపపడితే, గతంలో చేసిన తప్పు గురించి ఇంకా బాధపడుతూ ఉండాల్సిన అవసరం లేదు. “యెహోవా కరుణ, కనికరం గల దేవుడు . . . పడమటికి తూర్పు ఎంత దూరంలో ఉంటుందో, ఆయన మన అపరాధాల్ని మనకు అంత దూరంలో ఉంచాడు.”—కీర్తన 103:8-14.

మనసులో ద్వేషం పెట్టుకోకండి

18. మనసులో ద్వేషాన్ని తీసేసుకోవడానికి మనం ఎందుకు కృషిచేయాలి?

18 దేవుడు ఇచ్చిన జీవమనే బహుమతి పట్ల గౌరవం మన హృదయంలో నుండే మొదలౌతుంది. మనసులో వేరేవాళ్ల మీద ద్వేషం పెట్టుకోకుండా ఉండడం ద్వారా ఆ గౌరవం చూపిస్తాం. అపొస్తలుడైన యోహాను ఇలా రాశాడు: “తన సహోదరుణ్ణి ద్వేషించే ప్రతీ వ్యక్తి హంతకుడే.” (1 యోహాను 3:15) మనకు తెలీకుండానే ఒక వ్యక్తి మీద మనకున్న అయిష్టం ద్వేషంగా మారవచ్చు. ద్వేషం వల్ల మనం ఆ వ్యక్తితో అగౌరవంగా ప్రవర్తించవచ్చు, లేనిపోని నిందలు వేయవచ్చు, ఆఖరికి వాళ్లు చనిపోవాలని కూడా కోరుకోవచ్చు. మనం వేరేవాళ్ల మీద మనసులో ద్వేషం లాంటివి పెట్టుకుంటే యెహోవాకు తెలుస్తుంది. (లేవీయకాండం 19:16; ద్వితీయోపదేశకాండం 19:18-21; మత్తయి 5:22) ఒకవేళ మనకు ఎవరి మీదైనా ద్వేషం ఉందని తెలిస్తే, దాన్ని తీసేసుకోవడానికి మనం గట్టిగా కృషిచేయాలి.—యాకోబు 1:14, 15; 4:1-3.

19. మనం ప్రాణాన్ని గౌరవిస్తున్నామని చూపించే మరో విధానం ఏంటి?

19 మనం మరో విధంగా కూడా ప్రాణాన్ని గౌరవిస్తున్నామని చూపించవచ్చు. ‘హింసను ప్రేమించేవాళ్లంటే యెహోవాకు అసహ్యం’ అని కీర్తన 11:5 చెప్తుంది. హింసతో కూడిన వినోదాన్ని ఎంచుకుంటే, మనం హింసను ప్రేమిస్తున్నామని చూపిస్తున్నట్టు అవుతుంది. హింసాత్మక ఆలోచనలతో, చిత్రాలతో, మాటలతో మన మనసును నింపుకోవాలని మనం కోరుకుంటామా? లేదు. పవిత్రమైన, ప్రశాంతమైన ఆలోచనలతో మన మనసును నింపుకోవాలనుకుంటాం.—ఫిలిప్పీయులు 4:8, 9 చదవండి.

ప్రాణం పట్ల గౌరవంలేని సంస్థల్లో ఉండకండి

20. సాతాను లోకం ఏవిధంగా రక్తాపరాధాన్ని మూటగట్టుకుంది?

20 సాతాను లోకానికి ప్రాణం పట్ల గౌరవం లేదు. అది యెహోవా దృష్టిలో రక్తాపరాధాన్ని మూటగట్టుకుంది. వందల సంవత్సరాలుగా రాజకీయ శక్తులు లక్షలమంది ప్రజల్ని పొట్టనబెట్టుకున్నాయి. అందులో ఎంతోమంది యెహోవా సేవకులు కూడా ఉన్నారు. బైబిలు ఆ శక్తుల్ని లేదా ప్రభుత్వాల్ని భయంకరమైన, క్రూరమైన జంతువులతో పోల్చింది. (దానియేలు 8:3, 4, 20-22; ప్రకటన 13:1, 2, 7, 8) ఈ రోజుల్లో ఆయుధాల అమ్మకం పెద్ద వ్యాపారమైపోయింది. ప్రజలు ప్రాణాంతకమైన ఆయుధాలు అమ్ముతూ లాభాలు గడిస్తున్నారు. “లోకమంతా దుష్టుని గుప్పిట్లో ఉంది” అని స్పష్టమౌతోంది.—1 యోహాను 5:19.

21, 22. దేవుని ప్రజలమైన మనం ‘లోకసంబంధులం కాదని’ ఎలా చూపించవచ్చు?

21 నిజ క్రైస్తవులు “లోకసంబంధులు కారు.” యెహోవా ప్రజలు రాజకీయాల్లో, యుద్ధాల్లో పాల్గొనకుండా తటస్థంగా ఉంటారు. వాళ్లు ఎవ్వర్నీ చంపరు, ప్రజల్ని చంపే ఏ సంస్థకూ మద్దతివ్వరు. (యోహాను 15:19; 17:16) వాళ్లు హింసించబడినా తిరిగి ఎవర్నీ హింసించరు. శత్రువుల్ని సైతం ప్రేమించాలని యేసు చెప్పిన మాటను వాళ్లు పాటిస్తారు.—మత్తయి 5:44; రోమీయులు 12:17-21.

22 మతం కూడా లక్షలమంది చావుకు కారణమైంది. ప్రపంచ అబద్ధ మత సామ్రాజ్యమైన మహాబబులోను గురించి బైబిలు ఇలా చెప్తుంది: “ప్రవక్తల రక్తం, పవిత్రుల రక్తం, భూమ్మీద దారుణంగా చంపబడిన వాళ్లందరి రక్తం ఈ నగరంలో కనిపించింది.” యెహోవా తన ప్రజల్ని దానిలో నుండి ‘బయటికి రమ్మని’ ఎందుకు చెప్తున్నాడో మీరు అర్థం చేసుకున్నారా? యెహోవాను ఆరాధించేవాళ్లు అబద్ధ మతంతో ఎలాంటి సంబంధం కలిగివుండరు.—ప్రకటన 17:6; 18:2, 4, 24.

23. మహాబబులోను నుండి ‘బయటికి రావాలంటే’ ఏం చేయాలి?

23 మహాబబులోను నుండి ‘బయటికి రావాలంటే’ మనం ఏ అబద్ధ మతంలోనూ భాగంగా లేమని స్పష్టంగా చెప్పేయాలి. ఉదాహరణకు, ఏదైనా మతంలో మనకు సభ్యత్వం ఉంటే దాన్ని రద్దు చేసుకోవాల్సి రావచ్చు. అంతేకాదు, ఆ అబద్ధ మతం చేసే చెడ్డ పనుల్ని అసహ్యించుకోవాలి, తిరస్కరించాలి. అబద్ధ మతం అనైతికతను, రాజకీయాల్ని, అత్యాశతో కూడిన వ్యాపారాల్ని అనుమతిస్తుంది, ప్రోత్సహిస్తుంది. (కీర్తన 97:10 చదవండి; ప్రకటన 18:7, 9, 11-17) దానివల్ల, గడిచిన సంవత్సరాల్లో లక్షలమంది ప్రాణాలు కోల్పోయారు.

24, 25. యెహోవాను తెలుసుకోవడం వల్ల మనశ్శాంతితో, మంచి మనస్సాక్షితో ఎలా ఉండవచ్చు?

24 యెహోవాను తెలుసుకోకముందు, మనలో ప్రతీ ఒక్కరం సాతాను లోకం చేసే చెడ్డ పనులకు ఏదోక విధంగా మద్దతిచ్చి ఉంటాం. కానీ ఇప్పుడు మనం మారాం, విమోచన క్రయధనాన్ని అంగీకరించాం, దేవునికి మన జీవితాన్ని సమర్పించుకున్నాం. అంతేకాదు ‘యెహోవా ఇచ్చే సేదదీర్పును’ పొందాం. దేవుణ్ణి సంతోషపెడుతున్నామని తెలుసుకుని మనశ్శాంతితో, మంచి మనస్సాక్షితో ఉన్నాం.—అపొస్తలుల కార్యాలు 3:19; యెషయా 1:18.

25 మనం ఒకప్పుడు ప్రాణాన్ని లెక్కచేయని సంస్థలో భాగంగా ఉన్నా, విమోచన క్రయధనం ఆధారంగా యెహోవా మనల్ని క్షమించగలడు. యెహోవా ఇచ్చిన ప్రాణం అనే బహుమతి పట్ల మనకు ఎంతో కృతజ్ఞత ఉంది. ఇతరులు యెహోవా గురించి తెలుసుకునేలా, సాతాను లోకాన్ని విడిచిపెట్టేలా, దేవునికి దగ్గరయ్యేలా సహాయం చేయడానికి మనం కృషి చేయడం ద్వారా ఆ కృతజ్ఞత చూపిస్తాం.—2 కొరింథీయులు 6:1, 2.

రాజ్యం గురించి ఇతరులకు చెప్పండి

26-28. (ఎ) యెహోవా యెహెజ్కేలుకు ఏ ముఖ్యమైన పని అప్పగించాడు? (బి) నేడు మనం ఏ పని చేయాలని యెహోవా చెప్తున్నాడు?

26 ప్రాచీన ఇశ్రాయేలులో యెహోవా యెహెజ్కేలు ప్రవక్తకు ఒక పని అప్పగించాడు. అతను యెరూషలేము త్వరలోనే నాశనమౌతుందని ప్రజల్ని హెచ్చరించాలి, ప్రాణాలతో బయటపడాలంటే ఏం చేయాలో వాళ్లకు బోధించాలి. యెహెజ్కేలు ప్రజల్ని హెచ్చరించకపోతే, వాళ్ల ప్రాణాలకు యెహోవా అతన్నే బాధ్యునిగా ఎంచుతాడు. (యెహెజ్కేలు 33:7-9) ఆ ప్రాముఖ్యమైన సందేశాన్ని ప్రకటించడానికి శాయశక్తులా కృషిచేయడం ద్వారా యెహెజ్కేలు తనకు ప్రాణం పట్ల గౌరవం ఉందని చూపించాడు.

27 యెహోవా మనకు కూడా ఒక పని అప్పగించాడు. అదేంటంటే, సాతాను లోకం త్వరలోనే నాశనమౌతుందని మనం ప్రజల్ని హెచ్చరించాలి, వాళ్లు యెహోవాను తెలుసుకుని కొత్తలోకంలోకి వెళ్లేలా సహాయం చేయాలి. (యెషయా 61:2; మత్తయి 24:14) ఆ పనిలో మనం శాయశక్తులా కృషిచేసినప్పుడు, పౌలులాగే ఇలా అనగలుగుతాం: ‘ఎవరి రక్తం విషయంలోనూ నేను దోషిని కాను, నేను దేవుని ఇష్టమంతటినీ మీకు చెప్పకుండా ఉండలేదు.’—అపొస్తలుల కార్యాలు 20:26, 27.

28 మన జీవితంలోని వేరే రంగాల్లో కూడా మనం పవిత్రంగా ఉండాలి. తర్వాతి అధ్యాయంలో దాని గురించి పరిశీలిస్తాం.