కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

6వ అధ్యాయం

వినోదాన్ని ఎలా ఎంచుకోవాలి?

వినోదాన్ని ఎలా ఎంచుకోవాలి?

“అన్నీ దేవునికి మహిమ తీసుకొచ్చేలా చేయండి.”—1 కొరింథీయులు 10:31.

1, 2. వినోదాన్ని ఎందుకు జాగ్రత్తగా ఎంచుకోవాలి?

 మీరు ఒక పండు తినాలనుకున్నారు, కానీ దానిలో కొంత భాగం పాడైపోవడం మీరు గమనించారు. అప్పుడు ఏం చేస్తారు? అలాగే తినేస్తారా? దాన్ని పడేస్తారా? లేక పాడైపోయినంత వరకు తీసేసి మిగతాది తింటారా?

2 ఒకవిధంగా, వినోదం కూడా ఆ పండు లాంటిదే. కొంతవరకు వినోదం బాగానే ఉంది, కానీ చాలావరకు అనైతికత, హింస, మంత్రతంత్రాలు వంటివాటితో పాడైపోయింది. కొందరు అన్నిరకాల వినోదాన్ని ఆనందిస్తారు. ఇంకొందరు అన్నిరకాల వినోదం చెడ్డదే అంటారు. మరికొందరు వినోదాన్ని జాగ్రత్తగా ఎంచుకుంటూ, చెడ్డదాన్ని వదిలేసి మంచిదాన్ని ఆనందిస్తారు. మరి మీరేం చేస్తారు?

3. వినోదాన్ని ఎంచుకునేటప్పుడు మనం ఏం ఆలోచించాలి?

3 మనందరికీ కాస్త వినోదం అవసరమే. మనం దాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాలని కోరుకుంటాం. అయితే, మనం ఎంచుకునే వినోదం మన ఆరాధనపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఆలోచించాలి.

“అన్నీ దేవునికి మహిమ తీసుకొచ్చేలా చేయండి”

4. వినోదాన్ని ఎంచుకోవడానికి సహాయపడే ఒక బైబిలు సూత్రం చెప్పండి.

4 యెహోవాకు సమర్పించుకున్నప్పుడు, మన జీవితాన్ని ఆయన సేవ కోసం ఉపయోగిస్తామని మాటిచ్చాం. (ప్రసంగి 5:4 చదవండి.) “అన్నీ దేవునికి మహిమ తీసుకొచ్చేలా” చేస్తామని మాటిచ్చాం. (1 కొరింథీయులు 10:31) కాబట్టి మనం కూటాల్లో, పరిచర్యలో ఉన్నప్పుడు మాత్రమే కాదు అన్ని సమయాల్లో, చివరికి వినోదాన్ని ఆనందిస్తున్నప్పుడు కూడా దేవునికి సమర్పించుకున్న వాళ్లమే.

5. యెహోవాకు మనం చేసే ఆరాధన ఎలా ఉండాలి?

5 జీవితంలో మనం చేసే ప్రతీది మన ఆరాధనపై ప్రభావం చూపిస్తుంది. పౌలు దాన్ని ఇలా వివరించాడు: “మీ శరీరాల్ని సజీవమైన, పవిత్రమైన, దేవునికి ఇష్టమైన బలిగా అప్పగించండి.” (రోమీయులు 12:1) యేసు ఇలా అన్నాడు: “నువ్వు నీ దేవుడైన యెహోవాను నీ నిండు హృదయంతో, నీ నిండు ప్రాణంతో, నీ నిండు మనసుతో, నీ పూర్తి బలంతో ప్రేమించాలి.” (మార్కు 12:30) మనం యెహోవాకు ఎప్పుడూ మంచిదే ఇవ్వాలనుకుంటాం. ప్రాచీన ఇశ్రాయేలీయులు ఏ లోపం లేని జంతువును యెహోవాకు బలిగా అర్పించేవాళ్లు. ఏదైనా లోపం ఉంటే యెహోవా దాన్ని ఇష్టపడేవాడు కాదు. (లేవీయకాండం 22:18-20) అదేవిధంగా, మన ఆరాధనను యెహోవా ఇష్టపడని పరిస్థితి రావచ్చు. ఎలా?

6, 7. వినోదం మన ఆరాధనపై ఎలాంటి ప్రభావం చూపించవచ్చు?

6 యెహోవా మనకు ఇలా చెప్తున్నాడు: “మీరు పవిత్రులుగా ఉండాలి, ఎందుకంటే నేను పవిత్రుణ్ణి.” (1 పేతురు 1:14-16; 2 పేతురు 3:11) మన ఆరాధన పవిత్రంగా ఉంటేనే ఆయన అంగీకరిస్తాడు. (ద్వితీయోపదేశకాండం 15:21) యెహోవా అనైతికతను, హింసను, మంత్రతంత్రాల్ని ద్వేషిస్తాడు కాబట్టి మనం అలాంటి పనులు చేయకూడదు. (రోమీయులు 6:12-14; 8:13) అలాంటివి చేసినా, అలాంటివి ఉన్న వినోదం చూసినా మన ఆరాధన అపవిత్రమౌతుంది. అప్పుడు యెహోవా దాన్ని అంగీకరించడు. ఆయనతో మనకున్న స్నేహం కూడా తీవ్రంగా పాడవ్వవచ్చు.

7 మరి వినోదాన్ని తెలివిగా ఎలా ఎంచుకోవచ్చు? ఫలానా వినోదం మంచిదో, కాదో తెలుసుకోవడానికి ఏ సూత్రాలు సహాయం చేస్తాయి? ఈ ప్రశ్నల గురించి ఇప్పుడు పరిశీలిద్దాం.

చెడును అసహ్యించుకోండి

8, 9. మనం ఎలాంటి వినోదానికి పూర్తిగా దూరంగా ఉంటాం? ఎందుకు?

8 నేడు రకరకాల వినోదం అందుబాటులో ఉంది. అందులో కొన్ని క్రైస్తవులు చూడగలిగేలా ఉన్నాయి, కానీ చాలావరకు అలా లేవు. ముందుగా, మనం ఎలాంటి వినోదాన్ని అస్సలు చూడకూడదో తెలుసుకుందాం.

9 నేడు సినిమాల్లో, వెబ్‌సైట్లలో, టీవీ కార్యక్రమాల్లో, వీడియో గేముల్లో, పాటల్లో అనైతికత, హింస, మంత్రతంత్రాలు వంటివి ఎక్కువైపోయాయి. తరచూ వాటిలో చెడ్డ విషయాల్ని తప్పు కాదన్నట్టుగా, సరదా కోసం అన్నట్టుగా చూపిస్తున్నారు. కానీ క్రైస్తవులు జాగ్రత్తగా ఉంటారు, యెహోవా పవిత్ర ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్న వినోదాన్ని అస్సలు చూడరు. (అపొస్తలుల కార్యాలు 15:28, 29; 1 కొరింథీయులు 6:9, 10) అలా వాళ్లు చెడును అసహ్యించుకుంటూ, యెహోవాను సంతోషపెడతారు.—కీర్తన 34:14; రోమీయులు 12:9.

10. చెడు వినోదాన్ని ఎంచుకుంటే ఏం జరగవచ్చు?

10 అయితే హింస, అనైతికత, మంత్రతంత్రాలు వంటివి ఉన్న వినోదాన్ని చూడడంలో తప్పు లేదని కొందరు అనుకుంటారు. ‘చూస్తే ఏమౌతుంది? నేను అలాంటివి చేయను కదా’ అని వాళ్లు అనుకుంటారు. అలా అనుకుంటే, మనల్ని మనం మోసం చేసుకున్నట్టే. బైబిలు ఇలా చెప్తుంది: “హృదయం అన్నిటికన్నా మోసకరమైంది, ప్రమాదకరమైంది.” (యిర్మీయా 17:9) మనం యెహోవాకు ఇష్టంలేనివి ఉన్న వినోదాన్ని ఆనందిస్తూ, వాటిని అసహ్యించుకుంటున్నామని ఎలా చెప్పగలం? మనం అలాంటివాటిని ఆనందిస్తూ ఉంటే, కొంతకాలానికి వాటిలో తప్పేమీ లేదని అనుకోవడం మొదలుపెడతాం. అంతేకాదు మన మనస్సాక్షి బలహీనపడి, తప్పుడు నిర్ణయం తీసుకునే ముందు మనల్ని హెచ్చరించడం మానేస్తుంది.—కీర్తన 119:70; 1 తిమోతి 4:1, 2.

11. వినోదాన్ని ఎంచుకునే విషయంలో గలతీయులు 6:7 మనకెలా సహాయం చేస్తుంది?

11 “మనిషి ఏమి విత్తుతాడో అదే పంట కోస్తాడు” అని బైబిలు చెప్తుంది. (గలతీయులు 6:7) అది నిజం. మనం చెడు వినోదాన్ని ఆనందిస్తూ ఉంటే, కొంతకాలానికి మనం కూడా అలాంటి చెడ్డ పనులు చేసే ప్రమాదం ఉంది. ఉదాహరణకు, కొంతమంది అనైతికత ఉన్న వినోదం చూడడం వల్ల అనైతిక పనులు చేశారు. అయితే వినోదాన్ని తెలివిగా ఎంచుకునే విషయంలో యెహోవా మనకు సహాయం చేస్తాడు.

బైబిలు సూత్రాల్ని ఉపయోగించి నిర్ణయాలు తీసుకోండి

12. వినోదం విషయంలో సరైన నిర్ణయాలు ఎలా తీసుకోవచ్చు?

12 కొన్ని రకాల వినోదాన్ని యెహోవా అస్సలు ఇష్టపడడని వెంటనే తెలిసిపోతుంది కాబట్టి వాటికి దూరంగా ఉంటాం. అయితే కొన్నిసార్లు అలా తెలీదు, అప్పుడేం చేయాలి? మనం వేటిని చూడకూడదో, వినకూడదో, చదవకూడదో తెలిపే నియమాల పట్టిక యెహోవా ఇవ్వలేదు. మనం బైబిలు శిక్షిత మనస్సాక్షిని ఉపయోగించాలని ఆయన కోరుకుంటున్నాడు. (గలతీయులు 6:5 చదవండి.) యెహోవా మనకు సూత్రాల్ని ఇచ్చాడు. సూత్రాలు అంటే ఫలానా విషయంలో యెహోవా అభిప్రాయాన్ని తెలియజేసే ప్రాథమిక సత్యాలు. ఆ సూత్రాల సహాయంతో మన మనస్సాక్షికి శిక్షణ ఇవ్వవచ్చు. “యెహోవా ఇష్టం ఏమిటో” అర్థం చేసుకుని, ఆయన్ని సంతోషపెట్టే నిర్ణయాలు తీసుకోవడానికి అవి సహాయం చేస్తాయి.—ఎఫెసీయులు 5:17.

మంచి వినోదాన్ని ఎంచుకోవడానికి బైబిలు సూత్రాలు సహాయం చేస్తాయి

13. వినోదం విషయంలో క్రైస్తవుల నిర్ణయాలు ఎందుకు వేర్వేరుగా ఉంటాయి? కానీ క్రైస్తవులందరూ ఏం చేయాలి?

13 తరచూ ఒక క్రైస్తవుడు ఎంచుకునే వినోదం, ఇంకో క్రైస్తవుడు ఎంచుకునే వినోదానికి భిన్నంగా ఉంటుంది. ఎందుకు? మనందరి అభిరుచులు వేర్వేరుగా ఉంటాయి. అంతేకాదు ఒక వ్యక్తికి సరైనది అనిపించింది, మరో వ్యక్తికి తప్పు అనిపించవచ్చు. అయినప్పటికీ సరైన నిర్ణయాలు తీసుకోవడానికి క్రైస్తవులందరూ బైబిలు సూత్రాల్ని పాటించాలి. (ఫిలిప్పీయులు 1:9) యెహోవాకు అంగీకారమైన వినోదాన్ని ఎంచుకునేలా అవి మనకు సహాయం చేస్తాయి.—కీర్తన 119:11, 129; 1 పేతురు 2:16.

14. (ఎ) వినోదం కోసం ఎంత సమయం కేటాయిస్తున్నామో ఎందుకు ఆలోచించుకోవాలి? (బి) పౌలు క్రైస్తవులకు ఏ సలహా ఇచ్చాడు?

14 వినోదం కోసం ఎంత సమయం కేటాయిస్తున్నామో కూడా మనం ఆలోచించాలి. వినోదానికి మన జీవితంలో ఏ స్థానం ఇస్తున్నామో అది చూపిస్తుంది. క్రైస్తవులమైన మనకు యెహోవా సేవే అన్నిటికన్నా ముఖ్యమైనది. (మత్తయి 6:33 చదవండి.) కానీ తెలియకుండానే మనం వినోదం కోసం మరీ ఎక్కువ సమయం వెచ్చించవచ్చు. పౌలు క్రైస్తవులకు ఈ సలహా ఇచ్చాడు: “తెలివితక్కువవాళ్లలా కాకుండా తెలివిగలవాళ్లలా నడుచుకోండి, మీ సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఉపయోగించుకోండి.” (ఎఫెసీయులు 5:15, 16) కాబట్టి వినోదం కోసం ఎంత సమయం వెచ్చించాలో హద్దులు పెట్టుకుంటూ, మన జీవితంలో యెహోవా సేవకే మొదటి స్థానం ఇచ్చేలా చూసుకోవాలి.—ఫిలిప్పీయులు 1:10.

15. ఫలానా వినోదం యెహోవాతో మన స్నేహాన్ని పాడుచేస్తుందనే సందేహం వస్తే ఏం చేస్తాం?

15 యెహోవాకు ఇష్టంలేని వినోదాన్ని అస్సలు చూడకూడదని మనకు స్పష్టంగా తెలుసు. అయితే కొన్ని రకాల వినోదం విషయంలో మనకు సందేహం ఉంటే, అప్పుడేంటి? అలాంటి సమయాల్లో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు, మీరు ఒక కొండ మీద ఉన్న ఘాట్‌ రోడ్డులో ప్రయాణిస్తున్నారు అనుకోండి. మీరు మీ వాహనాన్ని ఆ దారి అంచుల్లో నడుపుతారా? లేదు. ప్రాణం మీద గౌరవం ఉంటే అంచులకు కాస్త దూరంగా నడుపుతారు. వినోదం విషయంలో కూడా అంతే. బైబిలు ఇలా చెప్తుంది: “చెడు నుండి పక్కకు తప్పుకో.” (సామెతలు 4:25-27) ఫలానా వినోదం చెడ్డదని స్పష్టంగా తెలిసినప్పుడు మాత్రమే కాదు అది చెడ్డదేమో, యెహోవాతో మనకున్న స్నేహాన్ని పాడుచేస్తుందేమో అనే సందేహం వచ్చినా దానికి దూరంగా ఉంటాం.

యెహోవా అభిప్రాయాన్ని తెలుసుకోండి

16. (ఎ) యెహోవా అసహ్యించుకునే కొన్ని విషయాలు ఏంటి? (బి) వాటిని మనం కూడా అసహ్యించుకుంటున్నామని ఎలా చూపిస్తాం?

16 ఒక కీర్తనకర్త ఇలా రాశాడు: “యెహోవాను ప్రేమించే వాళ్లారా, చెడును అసహ్యించుకోండి.” (కీర్తన 97:10) యెహోవా ఆలోచనల్ని, భావాల్ని బైబిలు తెలియజేస్తుంది. ‘బైబిలు చదవడం ద్వారా నేను యెహోవా ఆలోచనల్ని అర్థం చేసుకుంటున్నానా?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఉదాహరణకు, “అబద్ధాలాడే నాలుక, అమాయకుల రక్తం చిందించే చేతులు, కుట్రలు పన్నే హృదయం, కీడు చేయడానికి పరుగులు తీసే పాదాలు” యెహోవాకు అసహ్యం అని బైబిలు చెప్తుంది. (సామెతలు 6:16-19) ‘లైంగిక పాపం, విగ్రహపూజ, మంత్రవిద్య, అసూయ, విపరీతమైన కోపం, ఈర్ష్య, తాగుబోతుతనం, విచ్చలవిడి విందులు’ వంటివాటికి దూరంగా ఉండాలని కూడా బైబిలు చెప్తుంది. (గలతీయులు 5:19-21) వినోదాన్ని ఎంచుకోవడానికి ఆ బైబిలు సూత్రాలు మీకు సహాయపడతాయి. నలుగురిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా మనం అన్ని విషయాల్లో యెహోవా ప్రమాణాల్ని పాటించాలని కోరుకుంటాం. (2 కొరింథీయులు 3:18) తరచూ, మనం ఒంటరిగా ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు మనం నిజంగా ఎలాంటివాళ్లమో తెలియజేస్తాయి.—కీర్తన 11:4; 16:8.

17. వినోదాన్ని ఎంచుకునే ముందు ఏ ప్రశ్నలు వేసుకోవాలి?

17 కాబట్టి వినోదాన్ని ఎంచుకునే ముందు ఈ ప్రశ్నలు వేసుకోండి: ‘నా నిర్ణయం యెహోవాతో నాకున్న సంబంధంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? నా మనస్సాక్షిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?’ వినోదాన్ని ఎంచుకోవడానికి సహాయం చేసే మరికొన్ని సూత్రాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

18, 19. (ఎ) పౌలు క్రైస్తవులకు ఏ సలహా ఇచ్చాడు? (బి) వినోదాన్ని ఎంచుకోవడానికి ఏ సూత్రాలు సహాయం చేస్తాయి?

18 సాధారణంగా మనం ఏ వినోదాన్ని ఎంచుకుంటామో దానితోనే మన మనసు నిండిపోతుంది. పౌలు ఇలా రాశాడు: “ఏవి నిజమైనవో, ఏవి ప్రాముఖ్యమైనవో, ఏవి నీతిగలవో, ఏవి పవిత్రమైనవో, ఏవి ప్రేమించదగినవో, ఏవి గౌరవప్రదమైనవో, ఏవి మంచివో, ఏవి పొగడదగినవో వాటి గురించి ఆలోచిస్తూ ఉండండి.” (ఫిలిప్పీయులు 4:8) మనసును అలాంటి మంచి విషయాలతో నింపుకున్నప్పుడు మనం ఇలా అనగలుగుతాం: “యెహోవా, . . . నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీకు సంతోషం కలిగించేలా ఉండాలి.”—కీర్తన 19:14.

19 ఈ ప్రశ్నలు వేసుకోండి: ‘నేను నా మనసును వేటితో నింపుకుంటున్నాను? ఏదైనా సినిమా లేదా కార్యక్రమం చూసిన తర్వాత నాకు సంతోషంగా, సేదదీర్పుగా అనిపిస్తుందా? నా మనస్సాక్షి ఏమైనా ఇబ్బంది పడుతుందా? (ఎఫెసీయులు 5:5; 1 తిమోతి 1:5, 19) యెహోవాకు ప్రార్థించడానికి వెనకాడతానా లేక ధైర్యంగా ప్రార్థిస్తానా? హింస, అనైతికతతో కూడిన ఆలోచనలు నాకు వస్తున్నాయా? (మత్తయి 12:33; మార్కు 7:20-23) నేను ఎంచుకునే వినోదం వల్ల “ఈ వ్యవస్థ” ప్రభావం నా మీద పడుతుందా?’ (రోమీయులు 12:2) అలా నిజాయితీగా పరిశీలించుకుంటే, యెహోవాతో మన స్నేహాన్ని బలంగా ఉంచుకోవడానికి ఏం చేయాలో తెలుస్తుంది. మనం కీర్తనకర్తలాగే ఇలా ప్రార్థిస్తాం: “వ్యర్థమైనవాటిని చూడకుండా నా కళ్లను పక్కకు తిప్పు.” *కీర్తన 119:37.

వేరేవాళ్ల గురించి కూడా ఆలోచించండి

20, 21. వినోదాన్ని ఎంచుకునేటప్పుడు వేరేవాళ్ల గురించి ఎందుకు ఆలోచించాలి?

20 మనం ఈ ముఖ్యమైన సూత్రాన్ని కూడా గుర్తుంచుకోవాలి: “అన్నీ చేయదగినవే, కానీ అన్నీ ప్రోత్సాహాన్ని ఇవ్వవు. ప్రతీ ఒక్కరు సొంత ప్రయోజనం గురించి కాకుండా ఇతరుల ప్రయోజనం గురించి ఆలోచిస్తూ ఉండాలి.” (1 కొరింథీయులు 10:23, 24) అంటే, మనకు స్వేచ్ఛ ఉన్నంత మాత్రాన ఏదైనా చేయవచ్చని కాదు. మన నిర్ణయాలు మన సహోదర సహోదరీలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో జాగ్రత్తగా ఆలోచించాలి.

21 అందరి మనస్సాక్షి ఒకేలా ఉండదు. ఉదాహరణకు, ఒక టీవీ కార్యక్రమాన్ని చూడడంలో తప్పేమీ లేదని మీ మనస్సాక్షికి అనిపించవచ్చు. కానీ మీ సహోదరుని మనస్సాక్షికి అది తప్పు అనిపించవచ్చు. ఆ విషయం తెలిస్తే మీరేం చేస్తారు? దాన్ని చూసే హక్కు మీకు ఉన్నా, చూడకూడదని మీరు నిర్ణయించుకోవచ్చు. ఎందుకంటే, మన ‘సహోదరుల విషయంలో పాపం చేస్తే, క్రీస్తుకు వ్యతిరేకంగా పాపం చేసినట్లు’ అవుతుంది. (1 కొరింథీయులు 8:12) తోటి విశ్వాసిని అభ్యంతరపెట్టే దేన్నీ చేయకూడదని మనం కోరుకుంటాం.—రోమీయులు 14:1; 15:1; 1 కొరింథీయులు 10:32.

22. తోటి క్రైస్తవులు మనలాంటి నిర్ణయాలే తీసుకోవాలని మనం ఎందుకు పట్టుబట్టకూడదు?

22 అయితే కొన్నిసార్లు ఫలానాది చూడడం, చదవడం, లేదా చేయడం మీ మనస్సాక్షికి తప్పు అనిపించవచ్చు, కానీ మీ సహోదరునికి తప్పు అనిపించకపోవచ్చు. మరి అప్పుడేం చేస్తారు? మీ సహోదరుణ్ణి మీరు ప్రేమిస్తారు, గౌరవిస్తారు కాబట్టి అతను కూడా మీలాంటి నిర్ణయాలే తీసుకోవాలని మీరు పట్టుబట్టరు. ఉదాహరణకు, ఒక మంచి డ్రైవర్‌ వాహనాన్ని తనకు నచ్చిన వేగంలో నడుపుతాడు. అయితే వేరేవాళ్లు తనకన్నా వేగంగా లేదా నెమ్మదిగా వెళ్లడం చూసి వాళ్లు మంచి డ్రైవర్లు కాదని అనుకోడు. అదేవిధంగా వినోదం విషయంలో మీ అభిప్రాయం, మీ సహోదరుని అభిప్రాయం కాస్త వేరుగా ఉన్నంత మాత్రాన, అతను బైబిలు సూత్రాల్ని పాటించట్లేదని మీరు అనుకోకూడదు.—ప్రసంగి 7:16; ఫిలిప్పీయులు 4:5.

23. మనం మంచి వినోదాన్ని ఎలా ఎంచుకుంటాం?

23 మరి, మనం మంచి వినోదాన్ని ఎలా ఎంచుకుంటాం? బైబిలు సూత్రాలతో శిక్షణ పొందిన మన మనస్సాక్షిని ఉపయోగించినప్పుడు, మన సహోదర సహోదరీల గురించి ఆలోచించినప్పుడు మనం సరైనదాన్ని ఎంచుకుంటాం. అంతేకాదు, “అన్నీ దేవునికి మహిమ తీసుకొచ్చేలా” చేస్తున్నామనే సంతోషంతో ఉంటాం.

^ వినోదాన్ని ఎంచుకోవడానికి సహాయం చేసే మరికొన్ని సూత్రాలు సామెతలు 3:31; 13:20; ఎఫెసీయులు 5:3, 4; కొలొస్సయులు 3:5, 8, 20 లో ఉన్నాయి.