కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

12వ అధ్యాయం

“బలపర్చే మంచి మాటలే మాట్లాడండి”

“బలపర్చే మంచి మాటలే మాట్లాడండి”

‘మీ నోటి నుండి చెడ్డ మాట అనేదే రాకూడదు. బలపర్చే మంచి మాటలే మాట్లాడండి.’—ఎఫెసీయులు 4:29.

1-3. (ఎ) యెహోవా ఇచ్చిన మంచి బహుమతుల్లో ఒకటి ఏంటి? మనం దాన్ని ఎలా ఉపయోగించే ప్రమాదం ఉంది? (బి) మాట్లాడే వరాన్ని ఎలా ఉపయోగించాలి?

 ఒక తండ్రి వాళ్ల అబ్బాయికి బైక్‌ కొనిచ్చాడు. అతనికి ఆ బహుమతి ఇచ్చినందుకు తండ్రి చాలా సంతోషించాడు. అయితే ఆ అబ్బాయి ఇష్టమొచ్చినట్టు బైక్‌ నడుపుతూ ఎవరినైనా గాయపర్చాడు అనుకోండి, ఆ తండ్రికి ఎలా అనిపిస్తుంది?

2 “ప్రతీ మంచి బహుమతి, ప్రతీ పరిపూర్ణ వరం” యెహోవాయే ఇస్తాడు. (యాకోబు 1:17) ఆయన మనకు ఇచ్చిన మంచి బహుమతుల్లో ఒకటి, మాట్లాడే సామర్థ్యం. మాటల ద్వారా మన భావాల్ని, ఆలోచనల్ని తెలియజేస్తాం. మన మాటలు ఇతరులకు మంచి చేయవచ్చు లేదా హాని చేయవచ్చు, వాళ్లను సంతోషపెట్టవచ్చు లేదా బాధపెట్టవచ్చు.

3 మాటలకు చాలా శక్తి ఉంది. మాట్లాడే వరాన్ని ఎలా ఉపయోగించాలో యెహోవా మనకు చెప్తున్నాడు: “మీ నోటి నుండి చెడ్డ మాట అనేదే రాకూడదు. బదులుగా, వినేవాళ్లకు ప్రయోజనం కలిగేలా అవసరాన్ని బట్టి, బలపర్చే మంచి మాటలే మాట్లాడండి.” (ఎఫెసీయులు 4:29) మన మాటల ద్వారా దేవుణ్ణి ఎలా సంతోషపెట్టవచ్చో, ఇతరుల్ని ఎలా ప్రోత్సహించవచ్చో ఇప్పుడు పరిశీలిద్దాం.

జాగ్రత్తగా మాట్లాడండి

4, 5. మాటలకున్న శక్తి గురించి బైబిల్లోని సామెతలు ఏం చెప్తున్నాయి?

4 మాటలకు చాలా శక్తి ఉంది కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నామో, ఎలా మాట్లాడుతున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. సామెతలు 15:4 ఇలా చెప్తుంది: “ప్రశాంతమైన నాలుక జీవవృక్షం, వంకర మాటలు కృంగదీస్తాయి.” చెట్లు మనకు ప్రాణాన్నిస్తాయి, వాటి నీడ సేదదీర్పును ఇస్తుంది. అదేవిధంగా దయగల మాటలు వినేవాళ్లకు సేదదీర్పును ఇస్తాయి. కానీ కఠినమైన మాటలు ఇతరుల్ని బాధపెడతాయి, కృంగదీస్తాయి.—సామెతలు 18:21.

మృదువైన మాటలు సేదదీర్పును ఇస్తాయి

5 సామెతలు 12:18 ఇలా చెప్తుంది: “ఆలోచించకుండా మాట్లాడే మాటలు కత్తిపోట్ల లాంటివి.” దయ లేకుండా మాట్లాడితే మనసు గాయపడవచ్చు, బంధాలు తెగిపోవచ్చు. మీ విషయంలో అలా ఎప్పుడైనా జరిగిందా? ఎవరైనా మీతో దయ లేకుండా మాట్లాడి మిమ్మల్ని బాధపెట్టారా? ఆ సామెత ఇంకా ఇలా చెప్తుంది: “తెలివిగలవాళ్ల మాటలు గాయాల్ని నయం చేస్తాయి.” ఆలోచించి మాట్లాడితే మనసుకు తగిలిన గాయాలు మానవచ్చు, మనస్పర్థల వల్ల పాడైన బంధాలు బాగవ్వవచ్చు. (సామెతలు 16:24 చదవండి.) మన మాటలు ఇతరులపై ప్రభావం చూపిస్తాయని గుర్తుపెట్టుకుంటే జాగ్రత్తగా మాట్లాడతాం.

6. మాటల్ని అదుపు చేసుకోవడం ఎందుకు కష్టంగా ఉంటుంది?

6 మనం జాగ్రత్తగా మాట్లాడడానికి మరో కారణం, మనందరం అపరిపూర్ణులం. ‘మనిషి హృదయం చెడువైపే మొగ్గుచూపుతుంది’ అని బైబిలు చెప్తుంది. సాధారణంగా మన మాటలు మన హృదయంలో ఏముందో చూపిస్తాయి. (ఆదికాండం 8:21; లూకా 6:45) నిజానికి మన మాటల్ని అదుపు చేసుకోవడం అంత తేలిక కాదు. (యాకోబు 3:2-4 చదవండి.) కానీ ఆ విషయంలో మెరుగవ్వడానికి మనం కృషిచేస్తూ ఉండాలి.

7, 8. మన మాటలు యెహోవాతో మనకున్న సంబంధంపై ఎలాంటి ప్రభావం చూపించవచ్చు?

7 మనం ఏం మాట్లాడుతున్నామో, ఎలా మాట్లాడుతున్నామో యెహోవాకు లెక్క అప్పచెప్పాలి కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. యాకోబు 1:26 ఇలా చెప్తుంది: “ఒక వ్యక్తి, తాను దేవుని ఆరాధకుణ్ణని అనుకుంటూ, నాలుకను అదుపులో పెట్టుకోకపోతే అతను తన హృదయాన్ని మోసం చేసుకుంటున్నాడు; అతని ఆరాధన వ్యర్థం.” మనం జాగ్రత్తగా మాట్లాడకపోతే యెహోవాతో మన సంబంధం దెబ్బతిని, చివరికి పూర్తిగా పాడైపోవచ్చు.—యాకోబు 3:8-10.

8 మనం ఏం మాట్లాడుతున్నామో, ఎలా మాట్లాడుతున్నామో జాగ్రత్తగా చూసుకోవడానికి మంచి కారణాలే ఉన్నాయి. మనం యెహోవా కోరుకుంటున్న విధంగా మాట్లాడాలంటే, ముందుగా ఎలా మాట్లాడకూడదో తెలుసుకోవాలి.

కృంగదీసే మాటలు

9, 10. (ఎ) ఈ రోజుల్లో ఎలాంటి మాటలు బాగా ఎక్కువైపోయాయి? (బి) మనం ఎందుకు అసభ్యంగా మాట్లాడకూడదు?

9 ఈ రోజుల్లో అసభ్యమైన లేదా అపవిత్రమైన మాటలు బాగా ఎక్కువైపోయాయి. అవతలివాళ్ల మీద గెలవాలంటే బూతులు, అసభ్యమైన మాటలు మాట్లాడాల్సిందేనని చాలామంది అనుకుంటున్నారు. వినోద కార్యక్రమాల్లో ఇతరుల్ని నవ్వించడానికి పిచ్చిపిచ్చి జోకులు, అసభ్యమైన మాటలు ఉపయోగిస్తున్నారు. కానీ అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు: “మీరు వాటన్నిటినీ వదిలేయాలి. మీరు ఆగ్రహం, కోపం, చెడుతనం, తిట్టడం మానేయాలి, మీ నోటి నుండి అసభ్యమైన మాటలు రాకూడదు.” (కొలొస్సయులు 3:8) “అసభ్యమైన హాస్యం” అనేదాని ప్రస్తావన కూడా నిజ క్రైస్తవుల మధ్య రాకూడదని పౌలు చెప్పాడు.—ఎఫెసీయులు 5:3, 4.

10 అసభ్యమైన మాటల్ని యెహోవా ఇష్టపడడు, ఆయన్ని ప్రేమించేవాళ్లు కూడా ఇష్టపడరు. అవి అపవిత్రమైనవి. శరీర కార్యాల్లో “అపవిత్రత” కూడా ఒకటని బైబిలు చెప్తుంది. (గలతీయులు 5:19-21) అపవిత్రతలో చాలారకాల పాపాలు ఉన్నాయి. ఒక అపవిత్రమైన అలవాటు ఇంకో అపవిత్రమైన అలవాటుకు దారితీయవచ్చు. ఒక వ్యక్తి ఎంత చెప్పినా వినకుండా అపవిత్రమైన, అసభ్యమైన మాటలు మాట్లాడుతూ ఉంటే, అతన్ని సంఘం నుండి బహిష్కరించాల్సి రావచ్చు.—2 కొరింథీయులు 12:21; ఎఫెసీయులు 4:19; “లెక్కలేనితనం, అపవిత్రత” చూడండి.

11, 12. (ఎ) మన మాటలు హానికరమైన పుకార్లుగా ఎలా మారవచ్చు? (బి) మనం ఎందుకు ఇతరుల మీద లేనిపోనివి కల్పించి చెప్పకూడదు?

11 మనం హానికరమైన పుకార్లకు కూడా దూరంగా ఉండాలి. ఇతరుల గురించి తెలుసుకోవాలని, మనవాళ్ల గురించి ఇతరులకు చెప్పాలని కోరుకోవడం సహజమే. మొదటి శతాబ్దంలో కూడా క్రైస్తవులు తమ సహోదర సహోదరీలు ఎలా ఉన్నారో, వాళ్లకు ఏ సహాయం కావాలో తెలుసుకోవాలనుకున్నారు. (ఎఫెసీయులు 6:21, 22; కొలొస్సయులు 4:8, 9) కానీ ఇతరుల గురించి మాట్లాడుకునే మాటలు తెలియకుండానే హానికరమైన పుకార్లుగా మారవచ్చు. ఎవరో చెప్పింది విని దాన్ని ఇతరులకు చెప్పేటప్పుడు అబద్ధాల్ని, రహస్యంగా ఉంచాల్సిన విషయాల్ని చెప్పే అవకాశం ఉంది. జాగ్రత్తగా లేకపోతే, హానికరమైన పుకార్లే లేనిపోనివి కల్పించి చెప్పే మాటలుగా మారవచ్చు. పరిసయ్యులు యేసు చేయనివాటిని చేశాడని నిందిస్తూ ఆయన మీద లేనిపోనివి కల్పించి చెప్పారు. (మత్తయి 9:32-34; 12:22-24) లేనిపోనివి కల్పించి చెప్పడం వల్ల ఇతరుల పేరు పాడౌతుంది, గొడవలు వస్తాయి, బాధ కలుగుతుంది, స్నేహాలు దెబ్బతింటాయి.—సామెతలు 26:20.

12 మన మాటలు ఇతరులకు సహాయం చేసేలా, ప్రోత్సహించేలా ఉండాలి కానీ స్నేహితుల్ని శత్రువులుగా మార్చేలా ఉండకూడదని యెహోవా చెప్తున్నాడు. “సహోదరుల మధ్య గొడవలు పెట్టేవాడు” యెహోవాకు అసహ్యం. (సామెతలు 6:16-19) లేనిపోనివి కల్పించి చెప్పిన మొట్టమొదటి వ్యక్తి అపవాది అయిన సాతానే. అతను దేవుని మీద లేనిపోనివి చెప్పాడు. (ప్రకటన 12:9, 10) ఈ రోజుల్లో ఒకరి మీద ఒకరు అబద్ధాలు చెప్పుకోవడం సాధారణమైపోయింది. కానీ క్రైస్తవ సంఘంలో దానికి చోటు లేదు. (గలతీయులు 5:19-21) కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి, ఎప్పుడూ ఆలోచించి మాట్లాడాలి. మీరు ఇతరుల గురించి విన్న విషయాన్ని ఎవరికైనా చెప్పేముందు ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను చెప్పబోయే విషయం నిజమేనా? దాన్ని చెప్పడం మంచిదేనా? దాన్ని చెప్పడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? నేను ఎవరి గురించైతే మాట్లాడుతున్నానో ఆ వ్యక్తి ఇది వింటే ఏమనుకుంటాడు? వేరేవాళ్లు ఎవరైనా నా గురించి ఇలా చెప్తే నాకెలా అనిపిస్తుంది?’—1 థెస్సలొనీకయులు 4:11 చదవండి.

13, 14. (ఎ) తిట్టడం వల్ల ఏ హాని జరుగుతుంది? (బి) దూషించడం అంటే ఏంటి? క్రైస్తవులు ఎందుకు దూషించకూడదు?

13 కొన్నిసార్లు మనందరం ఏదోకటి అనేసి, ఆ తర్వాత బాధపడతాం. కానీ మనం అదేపనిగా ఇతరుల్ని విమర్శించాలని, దురుసుగా లేదా కఠినంగా మాట్లాడాలని కోరుకోం. క్రైస్తవులు ఇతరుల్ని తిట్టకూడదు. పౌలు ఇలా చెప్పాడు: ‘మీరు అన్నిరకాల ద్వేషం, అలాగే కోపం, ఆగ్రహం, అరవడం, తిట్టడం మానేయండి.’ (ఎఫెసీయులు 4:31) “తిట్టడం” అనే పదాన్ని చెడుగా మాట్లాడడం, గాయపర్చడం, అవమానించడం అని కొన్ని బైబిళ్లు అనువదించాయి. తిట్టడం వల్ల ఇతరుల గౌరవం దెబ్బతింటుంది, తమకు ఏమాత్రం విలువ లేదని వాళ్లు అనుకుంటారు. ముఖ్యంగా పిల్లలు త్వరగా గాయపడతారు, కాబట్టి మన మాటలతో వాళ్లను కృంగదీయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి.—కొలొస్సయులు 3:21.

14 దూషించడం గురించి కూడా బైబిలు మనల్ని హెచ్చరిస్తుంది. దూషించడం అంటే విపరీతంగా తిట్టడం, గాయపర్చాలనే ఉద్దేశంతో అదేపనిగా అవమానించడం. ఒక వ్యక్తి తన వివాహజతతో, పిల్లలతో అలా మాట్లాడడం ఎంత బాధాకరమో కదా! చెప్పినా వినకుండా ఇతరుల్ని దూషించే వ్యక్తి సంఘంలో ఉండడానికి అర్హుడు కాడు. (1 కొరింథీయులు 5:11-13; 6:9, 10) అసభ్యంగా మాట్లాడడం, హానికరమైన పుకార్లు వ్యాప్తి చేయడం, తిట్టడం, దూషించడం వల్ల యెహోవాతో, ఇతరులతో మనకున్న సంబంధం పాడౌతుంది.

బలపర్చే మాటలు

15. ఎలాంటి మాటలు ఇతరుల్ని బలపరుస్తాయి?

15 మాట్లాడే వరాన్ని యెహోవా కోరుకుంటున్నట్లు ఎలా ఉపయోగించవచ్చు? మనం ఖచ్చితంగా ఇలాగే మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదు అని బైబిలు చెప్పట్లేదు. కానీ “బలపర్చే మంచి మాటలే” ఉపయోగించాలని ప్రోత్సహిస్తుంది. (ఎఫెసీయులు 4:29) పవిత్రమైన, దయగల, నిజమైన మాటలు ఇతరుల్ని బలపరుస్తాయి. మన మాటలు ఇతరుల్ని ప్రోత్సహించేలా, సహాయపడేలా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు. అయితే అలా మాట్లాడడం ఒక సవాలుగా ఉండవచ్చు. చెడుగా మాట్లాడడానికి కష్టపడాల్సిన అవసరం లేదు కానీ మంచిగా మాట్లాడడానికే కృషి అవసరం. (తీతు 2:8) మన మాటల ద్వారా ఇతరుల్ని ఎలా బలపర్చవచ్చో ఇప్పుడు చూద్దాం.

16, 17. (ఎ) మనం ఎందుకు మెచ్చుకోవాలి? (బి) మనం ఎవరెవర్ని మెచ్చుకోవచ్చు?

16 యెహోవా, యేసు ఇద్దరూ హృదయపూర్వకంగా మెచ్చుకుంటారు. మనం వాళ్లను అనుకరించాలని కోరుకుంటాం. (మత్తయి 3:17; 25:19-23; యోహాను 1:47) మనం ఇతరుల గురించి ఆలోచించి, వాళ్ల పట్ల వ్యక్తిగత శ్రద్ధ చూపిస్తూ మెచ్చుకున్నప్పుడు వాళ్లు నిజంగా ప్రోత్సాహం పొందుతారు. సామెతలు 15:23 ఇలా చెప్తుంది: “సరైన సమయంలో మాట్లాడిన మాట ఎంత మంచిది!” ఎవరైనా మన కృషిని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నప్పుడు, మనం చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పినప్పుడు మనం ఎంతో ప్రోత్సాహం పొందుతాం.—మత్తయి 7:12 చదవండి; “మెచ్చుకోవడం, ప్రోత్సహించడం” చూడండి.

17 ఇతరుల్లో మంచిని చూడడం అలవాటు చేసుకుంటే, వాళ్లను మనస్ఫూర్తిగా మెచ్చుకోవడం తేలికౌతుంది. ఉదాహరణకు సంఘంలో ఒక సహోదరుడు చక్కగా సిద్ధపడి ప్రసంగాలు ఇస్తుండవచ్చు, లేదా మీటింగ్స్‌లో కామెంట్‌ చెప్పడానికి కృషి చేస్తుండవచ్చు. అలాగే ఒక యౌవనుడు స్కూల్లో సత్యం వైపు ధైర్యంగా నిలబడుతుండవచ్చు, ఒక వృద్ధుడు పరిచర్యలో పాల్గొనడానికి చేయగలిగినదంతా చేస్తుండవచ్చు. మనం అలాంటి వాళ్లను మెచ్చుకున్నప్పుడు వాళ్లు ప్రోత్సాహం పొందుతారు. భర్త తన భార్యను ప్రేమిస్తున్నానని చెప్పడం, మెచ్చుకోవడం కూడా ప్రాముఖ్యం. (సామెతలు 31:10, 28) మొక్కలకు నీరు, వెలుతురు ఎంత అవసరమో మనకు కూడా ఎవరో ఒకరు మెచ్చుకోవడం అంతే అవసరం. ముఖ్యంగా పిల్లలకు అది చాలా అవసరం. కాబట్టి వాళ్ల మంచి లక్షణాల్ని, ప్రయత్నాల్ని మెచ్చుకునే అవకాశాల కోసం చూడండి. అప్పుడు వాళ్ల ధైర్యం, విశ్వాసం బలపడి, సరైనది చేయడానికి ఇంకా ఎక్కువ ప్రయత్నిస్తారు.

మన మాటల ద్వారా, మాట్లాడే తీరు ద్వారా ఇతరుల్ని ప్రోత్సహించవచ్చు, ఓదార్చవచ్చు

18, 19. మనం ఇతరుల్ని ప్రోత్సహించడానికి, ఓదార్చడానికి ఎందుకు కృషి చేయాలి? ఎలా కృషి చేయాలి?

18 మనం ఇతరుల్ని ప్రోత్సహించడం ద్వారా, ఓదార్చడం ద్వారా యెహోవాను అనుకరిస్తాం. ఆయన “దీనుల” పట్ల, “నలిగిపోయిన వాళ్ల” పట్ల ఎంతో శ్రద్ధ చూపిస్తాడు. (యెషయా 57:15) మనం “ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ,” “కృంగినవాళ్లతో ఊరటనిచ్చేలా” మాట్లాడాలని యెహోవా చెప్తున్నాడు. (1 థెస్సలొనీకయులు 5:11, 14) అందుకోసం మనం చేసే కృషిని ఆయన గమనిస్తాడు, మెచ్చుకుంటాడు.

19 సంఘంలో ఎవరైనా దిగులుగా, నిరుత్సాహంగా ఉండడం మీరు గమనించారా? అయితే మీ మాటలతో వాళ్లను ఎలా బలపర్చవచ్చు? మీరు వాళ్ల సమస్యను తీసేయలేకపోవచ్చు కానీ వాళ్లంటే మీకు శ్రద్ధ ఉందని తెలియజేయవచ్చు. అందుకోసం మీరు వాళ్లతో సమయం గడపవచ్చు, ప్రోత్సాహాన్నిచ్చే బైబిలు లేఖనం చదవవచ్చు, ప్రార్థించవచ్చు. (కీర్తన 34:18; మత్తయి 10:29-31) సంఘంలో ఉన్న సహోదర సహోదరీలు వాళ్లను ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పండి. (1 కొరింథీయులు 12:12-26; యాకోబు 5:14, 15) వాళ్లతో మనస్ఫూర్తిగా మాట్లాడినప్పుడు, మీరు వాళ్లను నిజంగానే ప్రేమిస్తున్నారని వాళ్లు అర్థం చేసుకుంటారు.—సామెతలు 12:25 చదవండి.

20, 21. మనం ఇతరులకు ఎలా మంచి సలహా ఇవ్వవచ్చు?

20 మనం మంచి సలహా ఇవ్వడం ద్వారా కూడా ఇతరుల్ని బలపర్చవచ్చు. మనందరం అపరిపూర్ణులం కాబట్టి ఎప్పటికప్పుడు మనకు సలహాలు అవసరం. సామెతలు 19:20 ఇలా చెప్తుంది: “నువ్వు ముందుముందు తెలివిగలవాడివి అవ్వాలంటే సలహాను విను, క్రమశిక్షణను స్వీకరించు.” సలహా ఇచ్చేది సంఘ పెద్దలు మాత్రమే కాదు. తల్లిదండ్రులు పిల్లలకు నిర్దేశమిస్తారు. (ఎఫెసీయులు 6:4) సహోదరీలు కూడా తోటి సహోదరీలకు మంచి సలహా ఇవ్వవచ్చు. (తీతు 2:3-5) మనం మన సహోదర సహోదరీల్ని ప్రేమిస్తాం, కాబట్టి వాళ్లను నొప్పించేలా కాకుండా బలపర్చేలా సలహా ఇవ్వాలనుకుంటాం. అదెలా చేయవచ్చు?

21 ఎవరైనా మీకు మంచి సలహా ఇచ్చారా? ఆ సలహాను మీరు ఎందుకు సులభంగా తీసుకోగలిగారు? బహుశా వాళ్లకు మీ మీద నిజంగా శ్రద్ధ ఉందని మీరు గమనించి ఉంటారు. లేదా వాళ్లు మీతో దయగా, ప్రేమగా మాట్లాడివుంటారు. (కొలొస్సయులు 4:6) వాళ్లు ఆ సలహాను బైబిలు ఆధారంగా ఇచ్చివుంటారు. (2 తిమోతి 3:16) మీరు ఎవరికైనా సలహా ఇస్తున్నప్పుడు అదే పద్ధతిని పాటించవచ్చు. మీరు నేరుగా బైబిలు తీసి చూపించినా చూపించకపోయినా, మీ సలహా ఎప్పుడూ బైబిలు ఆధారంగానే ఉండాలి. ఎవ్వరూ తమ సొంత అభిప్రాయాల్ని వేరేవాళ్ల మీద రుద్దకూడదు, తమ ఆలోచనల్ని సమర్థించుకోవడానికి లేఖనాల్ని తప్పుగా అన్వయించకూడదు. మీరు సులభంగా తీసుకునేలా ఇతరులు మీకు ఎలా సలహా ఇచ్చారో గుర్తుపెట్టుకుంటే, మీరు కూడా వేరేవాళ్లకు అలాగే సలహా ఇవ్వగలుగుతారు.

22. మాట్లాడే వరాన్ని ఎలా ఉపయోగించాలని మీరు అనుకుంటున్నారు?

22 మాట్లాడే సామర్థ్యం దేవుడిచ్చిన బహుమతి. ఆయన మీద ప్రేమ ఉంటే దాన్ని సరిగ్గా ఉపయోగిస్తాం. మన మాటలు ఇతరుల్ని కృంగదీయవచ్చు లేదా బలపర్చవచ్చు. కాబట్టి మన మాటల ద్వారా ఇతరుల్ని ప్రోత్సహించడానికి, బలపర్చడానికి చేయగలిగినదంతా చేద్దాం.