కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

5వ అధ్యాయం

లోకానికి దూరంగా ఉండండి

లోకానికి దూరంగా ఉండండి

“మీరు లోకానికి చెందినవాళ్లు కాదు.”—యోహాను 15:19.

1. యేసు తాను చనిపోవడానికి ముందు రాత్రి దేని గురించి ఆలోచించాడు?

 అది యేసు చనిపోవడానికి ముందు రాత్రి. ఇక ఆయన శిష్యులతో కలిసి ఉండడు కాబట్టి వాళ్ల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. ఆయన వాళ్లకు ఇలా చెప్పాడు: “మీరు లోకానికి చెందినవాళ్లు కాదు.” (యోహాను 15:19) తర్వాత యేసు వాళ్ల గురించి తండ్రికి ఇలా ప్రార్థించాడు: “నేను లోకసంబంధిని కానట్టే వాళ్లు కూడా లోకసంబంధులు కారు.” (యోహాను 17:15, 16) ఆ మాటలకు అర్థం ఏంటి?

2. యేసు చెప్పిన ‘లోకం’ ఏంటి?

2 యేసు చెప్పిన ‘లోకం’ దేవుని గురించి తెలియని ప్రజల్ని, సాతాను పరిపాలన కింద ఉన్న ప్రజల్ని సూచిస్తుంది. (యోహాను 14:30; ఎఫెసీయులు 2:2; యాకోబు 4:4; 1 యోహాను 5:19) మనం ఎలా లోక సంబంధులం కాకుండా ఉండవచ్చు? కొన్ని విధానాల్ని ఈ అధ్యాయంలో పరిశీలిస్తాం: (1) దేవుని రాజ్యానికి విశ్వసనీయంగా ఉంటూ రాజకీయ విషయాల్లో తటస్థంగా ఉండడం, (2) ఈ లోక స్ఫూర్తిని ఎదిరించడం, (3) బట్టలు, కనబడే తీరు విషయంలో అణకువ చూపించడం, (4) డబ్బు విషయంలో సరైన అభిప్రాయంతో ఉండడం, (5) దేవుడు ఇచ్చిన యుద్ధ కవచాన్ని వేసుకోవడం.—“తటస్థత” చూడండి.

దేవుని రాజ్యానికి విశ్వసనీయంగా ఉండండి

3. యేసు రాజకీయాల్లో తలదూర్చాడా?

3 యేసు భూమ్మీద ఉన్నప్పుడు ప్రజలు ఎన్నో సమస్యలతో సతమతమవ్వడం, వాళ్ల జీవితాలు భారంగా ఉండడం గమనించాడు. ఆయన వాళ్ల మీద నిజమైన శ్రద్ధ చూపించాడు, వాళ్లకు సహాయం చేయాలని కోరుకున్నాడు. మరి ఆయన రాజకీయ నాయకుడు అయ్యాడా? లేదు. ప్రజలకు నిజంగా అవసరమైనది దేవుని రాజ్యమే అని ఆయనకు తెలుసు. యేసు రాజయ్యేది ఆ రాజ్యానికే, ఆయన ప్రకటించింది కూడా ఆ రాజ్యం గురించే. (దానియేలు 7:13, 14; లూకా 4:43; 17:20, 21) యేసు రాజకీయాల్లో తలదూర్చలేదు, ఆయన అన్ని సమయాల్లో తటస్థంగా ఉన్నాడు. రోమా అధిపతి అయిన పొంతి పిలాతు ముందు నిలబడినప్పుడు యేసు ఇలా అన్నాడు: “నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినది కాదు.” (యోహాను 18:36) ఆయన శిష్యులు కూడా తటస్థంగా ఉన్నారు. తొలి క్రైస్తవులు “రాజకీయ పదవులు చేపట్టేవాళ్లు కాదు” అని ఆన్‌ ద రోడ్‌ టు సివిలైజేషన్‌ అనే పుస్తకం చెప్పింది. నేడు మనం కూడా వాళ్లలాగే ఉండాలనుకుంటాం. మనం దేవుని రాజ్యానికి విశ్వసనీయంగా మద్దతిస్తాం, ఈ లోక రాజకీయ వ్యవహారాల్లో తటస్థంగా ఉంటాం.—మత్తయి 24:14.

మీరు దేవుని రాజ్యానికి ఎందుకు విశ్వసనీయంగా మద్దతిస్తున్నారో వివరించగలరా?

4. నిజ క్రైస్తవులు దేవుని రాజ్యానికి ఎలా మద్దతిస్తారు?

4 రాయబారులు సాధారణంగా తమ దేశం తరఫున వేరే దేశంలో పనిచేస్తారు, అయినా వాళ్లు అక్కడి రాజకీయాల్లో తలదూర్చరు. పరలోకంలో క్రీస్తుతోపాటు పరిపాలించే నిరీక్షణ ఉన్న అభిషిక్తులు కూడా రాయబారులే. పౌలు అభిషిక్త క్రైస్తవులకు ఇలా రాశాడు: ‘క్రీస్తుకు బదులు మనం రాయబారులుగా పనిచేస్తున్నాం.’ (2 కొరింథీయులు 5:20) దేవుని రాజ్యానికి ప్రతినిధులుగా ఉన్న అభిషిక్తులు ఈ లోక రాజకీయాల్లో, ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోరు. (ఫిలిప్పీయులు 3:20) బదులుగా, దేవుని ప్రభుత్వం గురించి తెలుసుకునేలా వాళ్లు లక్షలమందికి సహాయం చేస్తున్నారు. భూమ్మీద నిరంతరం జీవించే నిరీక్షణ ఉన్న “వేరే గొర్రెలు” కూడా అభిషిక్తులకు మద్దతిస్తూ తటస్థంగా ఉంటారు. (యోహాను 10:16; మత్తయి 25:31-40) అవును, నిజ క్రైస్తవులెవ్వరూ ఈ లోక రాజకీయాల్లో తలదూర్చరు.—యెషయా 2:2-4 చదవండి.

5. క్రైస్తవులు ఎందుకు యుద్ధాల్లో పాల్గొనరు?

5 నిజ క్రైస్తవులు తోటి విశ్వాసులందర్నీ సొంత కుటుంబ సభ్యుల్లా చూస్తారు. వాళ్ల దేశం, నేపథ్యం ఏదైనా అందరూ ఐక్యంగా ఉంటారు. (1 కొరింథీయులు 1:10) మనం యుద్ధంలో పాల్గొంటే మన తోటి విశ్వాసులతో, అంటే మన కుటుంబ సభ్యులతో పోరాడినట్టు అవుతుంది. నిజానికి వాళ్లను ప్రేమించాలని యేసు ఆజ్ఞాపించాడు. (యోహాను 13:34, 35; 1 యోహాను 3:10-12) అంతేకాదు, శత్రువుల్ని కూడా ప్రేమించాలని యేసు చెప్పాడు.—మత్తయి 5:44; 26:52.

6. యెహోవాకు సమర్పించుకున్న సేవకులు ప్రభుత్వం పట్ల ఎలా గౌరవం చూపిస్తారు?

6 క్రైస్తవులమైన మనం తటస్థంగా ఉంటూనే మంచి పౌరులుగా ఉండడానికి కృషిచేస్తాం. ఉదాహరణకు, మనం ప్రభుత్వ చట్టాల్ని పాటించడం ద్వారా, పన్నులు కట్టడం ద్వారా ప్రభుత్వం పట్ల గౌరవం చూపిస్తాం. కానీ “దేవునివి దేవునికి” చెల్లించడానికి ఎప్పుడూ కృషిచేస్తాం. (మార్కు 12:17; రోమీయులు 13:1-7; 1 కొరింథీయులు 6:19, 20) “దేవునివి” అంటే ఆయన పట్ల మనం చూపించాల్సిన ప్రేమ, విధేయత, ఆరాధన వంటివి. ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా మనం యెహోవాకే లోబడతాం.—లూకా 4:8; 10:27; అపొస్తలుల కార్యాలు 5:29; రోమీయులు 14:8 చదవండి.

“ఈ లోక స్ఫూర్తిని” ఎదిరించండి

7, 8. “లోక స్ఫూర్తి” అంటే ఏంటి? దానివల్ల ప్రజలు ఎలా తయారౌతున్నారు?

7 మనం లోక సంబంధులుగా ఉండకూడదంటే “ఈ లోక స్ఫూర్తి” ప్రకారం నడుచుకోకూడదు. లోక స్ఫూర్తి అంటే సాతాను ప్రోత్సహిస్తున్న ఆలోచనా విధానం, ప్రవర్తించే తీరు. యెహోవాను ఆరాధించని ప్రజల్లో ఆ స్ఫూర్తి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే క్రైస్తవులు ఈ లోక స్ఫూర్తిని ఎదిరిస్తారు. పౌలు చెప్పినట్లు క్రైస్తవులమైన ‘మనం ఈ లోక స్ఫూర్తిని పొందలేదు కానీ, దేవుడు ఇచ్చిన పవిత్రశక్తినే పొందాం.’—1 కొరింథీయులు 2:12; ఎఫెసీయులు 2:2, 3; “లోక స్ఫూర్తి” చూడండి.

8 లోక స్ఫూర్తి వల్ల ప్రజలు స్వార్థపరులుగా, గర్విష్ఠులుగా, తిరుగుబాటు చేసేవాళ్లుగా తయారౌతున్నారు. అంతేకాదు దేవునికి లోబడాల్సిన అవసరం తమకు లేదని అనుకుంటున్నారు. పర్యవసానాల గురించి ఆలోచించకుండా ఏది నచ్చితే అది చేస్తున్నారు, తమ కోరికలు తీర్చుకోవడానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. సాతానే వాళ్లను అలా తప్పుదారి పట్టిస్తున్నాడు. (1 యోహాను 2:16; 1 తిమోతి 6:9, 10) మరిముఖ్యంగా దేవుని సేవకుల్ని తప్పుదారి పట్టించడానికి, తనలా ఆలోచించేలా మోసం చేయడానికి అపవాది ప్రయత్నిస్తున్నాడు.—యోహాను 8:44; అపొస్తలుల కార్యాలు 13:10; 1 యోహాను 3:8.

9. లోక స్ఫూర్తి మన మీద ఎలా ప్రభావం చూపించవచ్చు?

9 ఈ లోక స్ఫూర్తి మన చుట్టూ గాలిలా వ్యాపించి ఉంది. దాన్ని ఎదిరించడానికి కృషి చేయకపోతే అది మన మీద కూడా ప్రభావం చూపిస్తుంది. (సామెతలు 4:23 చదవండి.) అది మనకు తెలీకుండానే జరగవచ్చు. ఉదాహరణకు, యెహోవాను ఆరాధించనివాళ్ల ఆలోచనలు, వైఖరులు మన మీద ప్రభావం చూపించవచ్చు. (సామెతలు 13:20; 1 కొరింథీయులు 15:33) లేదా విపరీతమైన పోటీతత్వం ఉన్న ఆటలు, అశ్లీల చిత్రాలు, మతభ్రష్టత్వం వంటివి మన మీద ప్రభావం చూపించవచ్చు.—“మతభ్రష్టత్వం” చూడండి.

10. మనం ఈ లోక స్ఫూర్తిని ఎలా ఎదిరించవచ్చు?

10 మరి ఈ లోక స్ఫూర్తిని ఎదిరించడానికి మనం ఏం చేయవచ్చు? యెహోవాకు దగ్గరగా ఉండాలి, ఆయన ఇచ్చే తెలివి ప్రకారం నడుచుకోవాలి. పవిత్రశక్తి కోసం ఎప్పుడూ ప్రార్థించాలి, ఆయన సేవలో బిజీగా ఉండాలి. యెహోవా ఈ విశ్వంలోనే అత్యంత శక్తిమంతుడు. కాబట్టి లోక స్ఫూర్తిని ఎదిరించడంలో ఆయన మనకు సహాయం చేస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు.—1 యోహాను 4:4.

బట్టలు, కనబడే తీరు

11. లోకంలో చాలామంది ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు?

11 బట్టలు, కనబడే తీరు విషయంలో కూడా మనం లోక సంబంధులం కాదని చూపిస్తాం. ఈ లోకంలో చాలామంది ఇతరుల దృష్టిని ఆకర్షించేలా, తప్పుడు కోరికల్ని కలిగించేలా, సమాజంపై తిరుగుబాటు వైఖరిని చూపించేలా, తమకు ఎంత డబ్బు ఉందో చూపించుకునేలా బట్టలు వేసుకుంటారు. ఇంకొంతమంది తాము చూడడానికి ఎలా ఉన్నామో అస్సలు పట్టించుకోకుండా మురికిగా ఉంటారు. కానీ మనం మాత్రం బట్టలు, కనబడే తీరు విషయంలో లోకస్థుల్లా ఉండం.

నేను వేసుకునే బట్టలు యెహోవాకు ఘనత తెస్తున్నాయా?

12, 13. బట్టలు వేసుకునే విషయంలో ఏ సూత్రాలు మనకు సహాయం చేస్తాయి?

12 యెహోవా సేవకులమైన మనం ఎప్పుడూ పద్ధతిగా, శుభ్రంగా, సందర్భానికి తగినట్టుగా మంచి బట్టలు వేసుకోవాలనుకుంటాం. మనం “దైవభక్తి” చూపిస్తూ “అణకువ, మంచి వివేచన ఉట్టిపడే” బట్టలు వేసుకుంటాం.—1 తిమోతి 2:9, 10; యూదా 21.

13 మనం వేసుకునే బట్టల్ని బట్టి ఇతరులకు యెహోవా మీద, ఆయన ప్రజల మీద ఒక అభిప్రాయం ఏర్పడవచ్చు. మనం “అన్నీ దేవునికి మహిమ తీసుకొచ్చేలా” చేయాలనుకుంటాం. (1 కొరింథీయులు 10:31) అణకువ ఉంటే ఇతరుల భావాల్ని, అభిప్రాయాల్ని గౌరవిస్తాం. కాబట్టి బట్టలు, కనబడే తీరు విషయంలో మనం తీసుకునే నిర్ణయాలు ఇతరుల మీద ప్రభావం చూపిస్తాయని గుర్తుంచుకుంటాం.—1 కొరింథీయులు 4:9; 2 కొరింథీయులు 6:3, 4; 7:1.

14. కూటాలకు, పరిచర్యకు ఎలాంటి బట్టలు వేసుకోవాలో నిర్ణయించుకునేటప్పుడు ఏం ఆలోచించాలి?

14 కూటాలకు, పరిచర్యకు ఎలాంటి బట్టలు వేసుకోవాలో నిర్ణయించుకునేటప్పుడు ఈ ప్రశ్నల గురించి ఆలోచించాలి: మనం ఇతరుల దృష్టిని ఆకర్షించాలనుకుంటామా? మన బట్టలు ఇతరుల్ని ఇబ్బందిపెడతాయా? నా బట్టలు నా ఇష్టం, వేరేవాళ్లకు అది అనవసరం అని అనుకుంటున్నామా? (ఫిలిప్పీయులు 4:5; 1 పేతురు 5:6) అందంగా కనిపించాలనుకోవడంలో తప్పు లేదు, కానీ మన క్రైస్తవ లక్షణాలే మనకు నిజమైన అందాన్ని తెస్తాయి. యెహోవా మనల్ని చూస్తున్నప్పుడు ఆ లక్షణాల్నే గమనిస్తాడు. అవి మన హృదయం ఎలా ఉందో చూపిస్తాయి. ‘మన హృదయ అలంకరణ దేవుని దృష్టిలో చాలా విలువైనది.’—1 పేతురు 3:3, 4.

15. బట్టలు, కనబడే తీరు విషయంలో యెహోవా ఖచ్చితమైన నియమాలు ఎందుకు పెట్టలేదు?

15 ఖచ్చితంగా ఇలాంటి బట్టలే వేసుకోవాలి, ఇలాంటివి వేసుకోకూడదు అని యెహోవా నియమాలు పెట్టలేదు. బదులుగా మంచి నిర్ణయాలు తీసుకోవడం కోసం ఆయన మనకు బైబిలు సూత్రాల్ని ఇచ్చాడు. (హెబ్రీయులు 5:14) నిర్ణయాలు చిన్నవైనా పెద్దవైనా వాటిని ఆయన మీద, ఇతరుల మీద ఉన్న ప్రేమతో తీసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. (మార్కు 12:30, 31 చదవండి.) ప్రపంచవ్యాప్తంగా యెహోవా ప్రజలు తమ సంస్కృతిని బట్టి, ఇష్టాల్ని బట్టి రకరకాల బట్టలు వేసుకుంటారు. అది చూడడానికి అందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.

డబ్బు విషయంలో సరైన అభిప్రాయం

16. డబ్బు గురించి లోకం చెప్పేది, యేసు చెప్పిన దానికి ఎలా వేరుగా ఉంది? మనం ఏ ప్రశ్నల గురించి ఆలోచించుకోవాలి?

16 డబ్బు, వస్తువులు ఉంటేనే సంతోషంగా ఉంటామని సాతాను లోకం చెప్తుంది. కానీ అది అబద్ధమని యెహోవా సేవకులమైన మనకు తెలుసు. మనం యేసు చెప్పిన ఈ మాటల్ని నమ్ముతాం: “ఒక వ్యక్తికి చాలా ఆస్తిపాస్తులు ఉన్నా, అవి అతనికి జీవాన్ని ఇవ్వవు.” (లూకా 12:15) డబ్బుతో నిజమైన సంతోషాన్ని కొనలేం. డబ్బు నిజమైన స్నేహితుల్ని, మనశ్శాంతిని, శాశ్వత జీవితాన్ని ఇవ్వలేదు. నిజమే మనకు డబ్బు, వస్తువులు అవసరం. జీవితాన్ని ఆనందంగా గడపాలని మనకూ ఉంటుంది. కానీ దేవునితో మంచి సంబంధం కలిగివుంటూ, ఆరాధనకు మన జీవితంలో మొదటి స్థానం ఇచ్చినప్పుడే మనం సంతోషంగా ఉంటామని యేసు చెప్పాడు. (మత్తయి 5:3; 6:22, అధస్సూచి) ఈ ప్రశ్నల గురించి ఆలోచించండి: ‘డబ్బు విషయంలో లోకస్థుల ఆలోచనా తీరు నా మీద ప్రభావం చూపించిందా? నేను ఎప్పుడూ డబ్బు గురించే ఆలోచిస్తున్నానా, దాని గురించే మాట్లాడుతున్నానా?’—లూకా 6:45; 21:34-36; 2 యోహాను 6.

17. డబ్బు విషయంలో లోకస్థుల ఆలోచనకు దూరంగా ఉంటే మన జీవితం ఎలా ఉంటుంది?

17 మనం యెహోవా సేవ మీద మనసుపెడుతూ, డబ్బు విషయంలో లోకస్థుల ఆలోచనకు దూరంగా ఉంటే మన జీవితం బాగుంటుంది. మనం సంతృప్తిగా, మనశ్శాంతిగా ఉంటాం. (మత్తయి 6:31, 32; రోమీయులు 15:13) వస్తుసంపదల గురించి అతిగా ఆందోళనపడకుండా ఉంటాం. (1 తిమోతి 6:9, 10 చదవండి.) ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని రుచిచూస్తాం. (అపొస్తలుల కార్యాలు 20:35) మనకు ఇష్టమైనవాళ్లతో ఎక్కువ సమయం గడపగలుగుతాం. అంతేకాదు హాయిగా నిద్రపోగలుగుతాం.—ప్రసంగి 5:12.

“సంపూర్ణ యుద్ధ కవచం”

18. సాతాను ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు?

18 యెహోవాతో మనకున్న సంబంధాన్ని పాడుచేయడానికి సాతాను ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి మనం చేయగలిగినదంతా చేయాలి. మనం “చెడ్డదూతల సైన్యంతో” పోరాడుతున్నాం. (ఎఫెసీయులు 6:12) మనం సంతోషంగా ఉండడం గానీ నిరంతరం జీవించడం గానీ సాతానుకు, అతని చెడ్డదూతలకు ఇష్టంలేదు. (1 పేతురు 5:8) బలవంతులైన ఆ శత్రువులు మన మీద దాడిచేసినా యెహోవా సహాయంతో మనం వాళ్లను ఓడించగలం!

19. క్రైస్తవులు వేసుకోవాల్సిన “యుద్ధ కవచాన్ని” ఎఫెసీయులు 6:14-18 ఎలా వర్ణిస్తుంది?

19 పూర్వకాలంలో, సైనికులు యుద్ధానికి వెళ్లేముందు తమను తాము కాపాడుకోవడానికి కవచం వేసుకునేవాళ్లు. అదేవిధంగా, మనం యెహోవా ఇచ్చిన “యుద్ధ కవచాన్ని” వేసుకోవాలి. (ఎఫెసీయులు 6:13) అది మనల్ని కాపాడుతుంది. ఆ కవచాన్ని ఎఫెసీయులు 6:14-18 ఇలా వర్ణిస్తుంది: “కాబట్టి మీరు నడుముకు సత్యం అనే దట్టీ కట్టుకుని, ఛాతికి నీతి అనే కవచం తొడుక్కుని స్థిరంగా నిలబడండి; మీ పాదాలకు, శాంతి సువార్త ప్రకటించడం కోసం సంసిద్ధత అనే చెప్పులు వేసుకోండి. వీటన్నిటితో పాటు విశ్వాసం అనే పెద్ద డాలు పట్టుకోండి, దానితో మీరు దుష్టుడి అగ్ని బాణాలన్నీ ఆర్పేయగలుగుతారు. అంతేకాదు, మీ తలకు రక్షణ అనే శిరస్త్రాణం పెట్టుకోండి, పవిత్రశక్తి ద్వారా ఇవ్వబడిన దేవుని వాక్యం అనే ఖడ్గం పట్టుకోండి. అలాగే, ప్రతీ సందర్భంలో అన్నిరకాల ప్రార్థనలతో, అభ్యర్థనలతో పవిత్రశక్తికి అనుగుణంగా ప్రార్థిస్తూ ఉండండి.”

20. “యుద్ధ కవచం” మనల్ని కాపాడాలంటే మనం ఏం చేయాలి?

20 ఒకవేళ సైనికుడు ఆ కవచంలో దేన్నైనా వేసుకోవడం మర్చిపోయి యుద్ధానికి వెళ్తే, శత్రువులు సరిగ్గా గురి చూసి రక్షణ లేని ఆ శరీర భాగంపై దాడిచేస్తారు. మన “కవచం” మనల్ని కాపాడాలంటే అందులో ఒక్కదాన్ని కూడా మనం మర్చిపోకూడదు. ఆ కవచాన్ని ఎప్పుడూ వేసుకునే ఉండాలి, దాన్ని మంచి స్థితిలో ఉంచుకోవాలి. ఈ లోకం నాశనమయ్యే వరకు, సాతాను, అతని చెడ్డదూతలు భూమ్మీద నుండి తొలగించబడే వరకు మన పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. (ప్రకటన 12:17; 20:1-3) కాబట్టి తప్పుడు కోరికలతో లేదా ఏదైనా బలహీనతతో మనం పోరాడుతుంటే ఆ పోరాటాన్ని ఆపకూడదు!—1 కొరింథీయులు 9:27.

21. మనం అపవాదిని ఎలా ఎదిరించగలం?

21 మనం అపవాదిని ఒంటరిగా ఎదిరించలేం. కానీ యెహోవా సహాయంతో ఎదిరించగలం! అందుకోసం మనం యెహోవాకు ప్రార్థించాలి, బైబిల్ని అధ్యయనం చేయాలి, మన సహోదర సహోదరీలతో సహవసించాలి. (హెబ్రీయులు 10:24, 25) అలా చేస్తే దేవునికి విశ్వసనీయంగా ఉంటాం, మన విశ్వాసం గురించి చెప్పడానికి సిద్ధంగా ఉంటాం.

మీ విశ్వాసం గురించి చెప్పడానికి సిద్ధంగా ఉండండి

22, 23. (ఎ) మన విశ్వాసం గురించి ధైర్యంగా చెప్పడానికి ఎలా సిద్ధంగా ఉండవచ్చు? (బి) తర్వాతి అధ్యాయంలో ఏం చూస్తాం?

22 మనం అన్ని సమయాల్లో మన విశ్వాసం గురించి చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. (యోహాను 15:19) కొన్ని విషయాల్లో యెహోవాసాక్షులు తీసుకునే నిర్ణయాలు వేరేవాళ్ల నిర్ణయాలకు వేరుగా ఉంటాయి. ఈ ప్రశ్నల గురించి ఆలోచించడం ద్వారా మన విశ్వాసం గురించి ధైర్యంగా చెప్పగలుగుతాం: ‘నేను ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో నాకు పూర్తిగా తెలుసా? బైబిలు చెప్పేది, నమ్మకమైన బుద్ధిగల దాసుడు చెప్పేది సరైనదని నేను నమ్ముతున్నానా? నేనొక యెహోవాసాక్షిగా ఉన్నందుకు గర్వపడుతున్నానా? (కీర్తన 34:2; మత్తయి 10:32, 33) నా నమ్మకాల్ని వేరేవాళ్లకు వివరించగలనా?’—మత్తయి 24:45; యోహాను 17:17; 1 పేతురు 3:15 చదవండి.

23 కొన్ని పరిస్థితుల్లో మనం లోకానికి వేరుగా ఉండాలంటే ఏం చేయాలో వెంటనే అర్థమైపోతుంది, కానీ కొన్నిసార్లు వెంటనే అర్థంకాదు. వినోదం విషయంలో కూడా అంతే. సాతాను మనల్ని మోసం చేయడానికి ఉపయోగించే పద్ధతుల్లో వినోదం ఒకటి. మనం వినోదాన్ని ఎలా జాగ్రత్తగా ఎంచుకోవచ్చు? దాని గురించి తర్వాతి అధ్యాయంలో చూస్తాం.