కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

3వ అధ్యాయం

దేవుణ్ణి ప్రేమించేవాళ్లను స్నేహితులుగా ఎంచుకోండి

దేవుణ్ణి ప్రేమించేవాళ్లను స్నేహితులుగా ఎంచుకోండి

“తెలివిగలవాళ్లతో తిరిగేవాడు తెలివిగలవాడు అవుతాడు.”—సామెతలు 13:20.

1-3. (ఎ) సామెతలు 13:20 నుండి ఏం నేర్చుకోవచ్చు? (బి) మనం ఎందుకు స్నేహితుల్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి?

 ఒక పిల్లవాడు వాళ్ల అమ్మానాన్నల్ని చూస్తూ ఉండడం మీరెప్పుడైనా గమనించారా? ఆ పిల్లవాడికి ఇంకా మాటలు రాకముందే వాళ్లు చెప్పేవి, చేసేవి అన్నీ గ్రహిస్తాడు. పెద్దయ్యాక తనకు తెలీకుండానే అమ్మానాన్నల్లా మాట్లాడడం, ప్రవర్తించడం మొదలుపెడతాడు. పెద్దవాళ్లు కూడా ఎవరితో ఎక్కువ సమయం గడుపుతారో వాళ్లలా ఆలోచించడం, ప్రవర్తించడం మొదలుపెడతారు.

2 “తెలివిగలవాళ్లతో తిరిగేవాడు తెలివిగలవాడు అవుతాడు” అని సామెతలు 13:20 చెప్తుంది. ఇక్కడ ‘తిరగడం’ అంటే కేవలం ఒక వ్యక్తి పక్కన ఉండడం కాదుగానీ అతనితో సమయం గడపాలని కోరుకోవడం, అతన్ని ప్రేమించడం, అతన్ని దగ్గరివాడిలా భావించడం. మనం ఎవరితో ఎక్కువ సమయం గడుపుతామో, ముఖ్యంగా ఎవర్ని దగ్గరివాళ్లని అనుకుంటామో వాళ్ల ప్రభావం మన మీద చాలా ఉంటుంది.

3 మన స్నేహితులు మన మీద మంచి ప్రభావం చూపించవచ్చు లేదా చెడు ప్రభావం చూపించవచ్చు. సామెతలు 13:20 ఇంకా ఇలా చెప్తుంది: “మూర్ఖులతో సహవాసం చేసేవాడు చెడిపోతాడు.” దేవుణ్ణి ప్రేమించే స్నేహితులైతే ఆయనకు ఎప్పుడూ నమ్మకంగా ఉండమని మనల్ని ప్రోత్సహిస్తారు. మనం స్నేహితుల్ని జాగ్రత్తగా ఎంచుకోవాలంటే, ముందుగా యెహోవా ఎలాంటివాళ్లను స్నేహితులుగా ఎంచుకుంటాడో పరిశీలించాలి.

దేవుడు ఎవర్ని స్నేహితులుగా ఎంచుకుంటాడు?

4. దేవునికి స్నేహితులుగా ఉండడం ఎందుకు ఒక గొప్ప గౌరవం? యెహోవా అబ్రాహామును “నా స్నేహితుడు” అని ఎందుకు పిలిచాడు?

4 విశ్వ సర్వాధిపతి అయిన యెహోవా తనకు స్నేహితులుగా ఉండే అవకాశాన్ని మనకు ఇస్తున్నాడు. అది నిజంగా ఒక గొప్ప గౌరవం. యెహోవా తన స్నేహితుల్ని జాగ్రత్తగా ఎంచుకుంటాడు. తన మీద ప్రేమ, విశ్వాసం ఉన్నవాళ్లను ఆయన స్నేహితులుగా ఎంచుకుంటాడు. అబ్రాహాము గురించి ఆలోచించండి. అతను దేవుని కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండేవాడు. అతను ఎన్నోసార్లు విశ్వాసం, విధేయత చూపించాడు. చివరికి తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. “దేవుడు ఇస్సాకును తిరిగి బ్రతికించగలడని” అబ్రాహాము నమ్మాడు. (హెబ్రీయులు 11:17-19; ఆదికాండం 22:1, 2, 9-13) అబ్రాహాము విశ్వాసం, విధేయత చూపించాడు కాబట్టి యెహోవా అతన్ని “నా స్నేహితుడు” అని పిలిచాడు.—యెషయా 41:8; యాకోబు 2:21-23.

5. తనకు విశ్వసనీయంగా ఉండేవాళ్లను యెహోవా ఎలా చూస్తాడు?

5 యెహోవా తన స్నేహితుల్ని చాలా విలువైనవాళ్లుగా చూస్తాడు. వాళ్లు కూడా ఆయనకు విశ్వసనీయంగా ఉండడానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. (2 సమూయేలు 22:26 చదవండి.) వాళ్లు ఆయన్ని ప్రేమిస్తారు కాబట్టే విశ్వసనీయత, విధేయత చూపిస్తారు. తనకు లోబడే “నిజాయితీపరులకు ఆయన దగ్గరి స్నేహితుడు” అని బైబిలు చెప్తుంది. (సామెతలు 3:32) యెహోవా తన స్నేహితుల్ని తన “గుడారంలో” ప్రత్యేక అతిథులుగా ఉండడానికి ఆహ్వానిస్తాడు. తనను ఆరాధించమని, ఏ సమయంలోనైనా ప్రార్థించమని ఆయన వాళ్లకు చెప్తున్నాడు.—కీర్తన 15:1-5.

6. మనం యేసును ప్రేమిస్తున్నామని ఎలా చూపిస్తాం?

6 యేసు ఇలా అన్నాడు: “ఎవరైనా నన్ను ప్రేమిస్తే, అతను నా మాట ప్రకారం నడుచుకుంటాడు, నా తండ్రి అతన్ని ప్రేమిస్తాడు.” (యోహాను 14:23) కాబట్టి యెహోవాకు స్నేహితులుగా ఉండాలంటే మనం యేసును కూడా ప్రేమించాలి, ఆయన చెప్పినవి చేయాలి. ఉదాహరణకు మంచివార్త ప్రకటించమని, శిష్యుల్ని చేయమని యేసు ఇచ్చిన ఆజ్ఞలకు మనం లోబడతాం. (మత్తయి 28:19, 20; యోహాను 14:15, 21) మనం యేసును ప్రేమిస్తాం కాబట్టే ‘నమ్మకంగా ఆయన అడుగుజాడల్లో’ నడుస్తాం. (1 పేతురు 2:21) మన మాటల్లో, చేతల్లో తన కుమారుడైన యేసును అనుకరించడానికి శాయశక్తులా కృషి చేసినప్పుడు యెహోవా సంతోషిస్తాడు.

7. యెహోవా స్నేహితుల్నే మన స్నేహితులుగా చేసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

7 విశ్వాసం, విధేయత, విశ్వసనీయత చూపిస్తూ తన కుమారుణ్ణి ప్రేమించేవాళ్లను యెహోవా స్నేహితులుగా ఎంచుకుంటాడు. మనం కూడా అలాంటి స్నేహితుల్నే ఎంచుకుంటామా? యేసును అనుకరించేవాళ్లను, దేవుని రాజ్యం గురించి బోధించేవాళ్లను మన స్నేహితులుగా చేసుకోవాలి. మనం ఇంకా మంచి వ్యక్తిలా అవ్వడానికి, అన్ని సమయాల్లో యెహోవాకు విశ్వసనీయంగా ఉండడానికి వాళ్లు సహాయం చేస్తారు.

బైబిల్లో ఉన్న ఉదాహరణలు

8. రూతు, నయోమిల స్నేహంలో మీకు ఏ విషయాలు నచ్చాయి?

8 స్నేహం గురించి బైబిల్లో ఎన్నో మంచి ఉదాహరణలు ఉన్నాయి. వాటిలో రూతు, ఆమె అత్త నయోమిల స్నేహం ఒకటి. వాళ్లిద్దరి దేశాలు, నేపథ్యాలు వేరు, పైగా నయోమి రూతు కన్నా చాలా పెద్దది. అయినా వాళ్లు మంచి స్నేహితులయ్యారు, ఎందుకంటే వాళ్లిద్దరు యెహోవాను ప్రేమించారు. నయోమి మోయాబు దేశాన్ని విడిచి ఇశ్రాయేలుకు తిరిగి వెళ్లాలనుకున్నప్పుడు, “రూతు తన అత్తతో” కలిసి వెళ్లింది. ఆమె ఇలా అంది: “నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు.” (రూతు 1:14, 16) రూతు నయోమి మీద ఎంతో దయ చూపించింది. ఇశ్రాయేలుకు వచ్చాక ఆమె కష్టపడి పనిచేసి నయోమిని చూసుకుంది. నయోమి కూడా రూతును ఎంతో ప్రేమించి ఆమెకు మంచి సలహా ఇచ్చింది. రూతు ఆ సలహా పాటించడం వల్ల వాళ్లిద్దరికీ ఎన్నో దీవెనలు వచ్చాయి.—రూతు 3:6.

9. దావీదు, యోనాతానుల స్నేహంలో మీకేం నచ్చింది?

9 మరో ఉదాహరణ దావీదు, యోనాతానులది. వాళ్లు మంచి స్నేహితులు, ఇద్దరూ యెహోవాకు విశ్వసనీయంగా ఉన్నారు. యోనాతాను దావీదు కన్నా దాదాపు 30 ఏళ్లు పెద్దవాడు, తన తండ్రి తర్వాత ఇశ్రాయేలుకు రాజవ్వాల్సినవాడు. (1 సమూయేలు 17:33; 31:2; 2 సమూయేలు 5:4) అయినా, యెహోవా దావీదును రాజుగా ఎంచుకున్నాడని తెలిశాక యోనాతాను అసూయపడలేదు, పోటీతత్వం చూపించలేదు. బదులుగా, దావీదుకు మద్దతివ్వడానికి చేయగలిగినదంతా చేశాడు. ఉదాహరణకు, ఒకసారి దావీదు ప్రమాదంలో ఉన్నప్పుడు, “యెహోవా మీద నమ్మకం పెంచుకోవడానికి” యోనాతాను అతనికి సహాయం చేశాడు, అంతేకాదు తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టాడు. (1 సమూయేలు 23:16, 17) దావీదు కూడా మంచి స్నేహితుణ్ణని నిరూపించుకున్నాడు. దావీదు యోనాతాను కుటుంబాన్ని చూసుకుంటానని మాటిచ్చాడు, అతను చనిపోయాక కూడా దావీదు ఆ మాట మీద నిలబడ్డాడు.—1 సమూయేలు 18:1; 20:15-17, 30-34; 2 సమూయేలు 9:1-7.

10. ముగ్గురు హెబ్రీ యువకుల స్నేహం నుండి ఏం నేర్చుకోవచ్చు?

10 షద్రకు, మేషాకు, అబేద్నెగో అనే ముగ్గురు హెబ్రీ యువకులు కూడా మంచి స్నేహితులు. చిన్నప్పుడే వాళ్లను బబులోనుకు బందీలుగా తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నా, యెహోవాకు నమ్మకంగా ఉండేలా వాళ్లు ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. పెద్దయ్యాక వాళ్ల విశ్వాసానికి ఒక పరీక్ష ఎదురైంది. బంగారు ప్రతిమకు మొక్కమని నెబుకద్నెజరు రాజు ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్లు అందుకు ఒప్పుకోకుండా రాజుతో ఇలా అన్నారు: ‘మేము నీ దేవుళ్లను సేవించం, నువ్వు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు మొక్కం.’ ఆ పరీక్షలో వాళ్లు ముగ్గురూ తమ దేవునికి విశ్వసనీయంగా ఉన్నారు.—దానియేలు 1:1-17; 3:12, 16-28.

11. పౌలు, తిమోతి ఎలా మంచి స్నేహితులయ్యారు?

11 అపొస్తలుడైన పౌలు యువకుడైన తిమోతిని కలిసినప్పుడు అతనికి యెహోవా మీద ప్రేమ, సంఘం పట్ల నిజమైన శ్రద్ధ ఉన్నాయని గమనించాడు. కాబట్టి వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న చాలామంది సహోదర సహోదరీలకు సహాయం చేసేలా పౌలు తిమోతికి శిక్షణ ఇచ్చాడు. (అపొస్తలుల కార్యాలు 16:1-8; 17:10-14) తిమోతి ఎంతగా కష్టపడి పనిచేశాడంటే, ‘అతనిలాంటి మనస్తత్వం కలిగినవాళ్లు ఇంకెవ్వరూ నా దగ్గర లేరు’ అని పౌలు అన్నాడు. సహోదర సహోదరీల మీద తిమోతి “నిజమైన శ్రద్ధ” చూపిస్తాడని పౌలుకు తెలుసు. వాళ్లిద్దరూ కలిసి యెహోవా సేవలో కష్టపడి పనిచేయడం వల్ల మంచి స్నేహితులయ్యారు.—ఫిలిప్పీయులు 2:20-22; 1 కొరింథీయులు 4:17.

స్నేహితుల్ని ఎలా ఎంచుకోవాలి?

12, 13. (ఎ) సంఘంలో కూడా మనం స్నేహితుల్ని ఎందుకు జాగ్రత్తగా ఎంచుకోవాలి? (బి) 1 కొరింథీయులు 15:33 లో ఉన్న హెచ్చరికను అపొస్తలుడైన పౌలు ఎందుకు ఇచ్చాడు?

12 సంఘంలో తోటి సహోదర సహోదరీల నుండి మనం ఎంతో నేర్చుకుంటాం, దేవునికి నమ్మకంగా ఉండడానికి ఒకరికొకరం సహాయం చేసుకుంటాం. (రోమీయులు 1:11, 12 చదవండి.) కానీ సంఘంలో కూడా మనం ఎవరితో ఎక్కువగా స్నేహం చేయాలో జాగ్రత్తగా ఆలోచించాలి. సంఘంలో వేర్వేరు సంస్కృతుల, నేపథ్యాల వాళ్లు ఉంటారు. అంతేకాదు కొత్తగా వచ్చినవాళ్లు, ఎన్నో ఏళ్లుగా యెహోవాను సేవిస్తున్నవాళ్లు ఉంటారు. చెట్టుకున్న కాయలు పండడానికి సమయం పట్టినట్లే, ఒక వ్యక్తికి యెహోవాతో ఉన్న సంబంధం బలపడడానికి కూడా సమయం పడుతుంది. కాబట్టి మనం ఒకరి పట్ల ఒకరం ఓర్పు, ప్రేమ చూపించాలి. అంతేకాదు, ఎల్లప్పుడూ స్నేహితుల్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి.—రోమీయులు 14:1; 15:1; హెబ్రీయులు 5:12–6:3.

13 కొన్నిసార్లు సంఘంలో మనం మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి రావచ్చు. ఒక సహోదరుడు లేదా సహోదరి బైబిలు ఖండిస్తున్న పనులు చేస్తుండవచ్చు, లేదా ఫిర్యాదు చేసే స్వభావాన్ని అలవర్చుకుని సంఘానికి హాని చేస్తుండవచ్చు. అలాంటివి చూసి మనం ఆశ్చర్యపోం. ఎందుకంటే మొదటి శతాబ్దంలో కూడా కొన్నిసార్లు సంఘంలో సమస్యలు వచ్చాయి. అపొస్తలుడైన పౌలు అప్పటి క్రైస్తవుల్ని ఇలా హెచ్చరించాడు: “మోసపోకండి. చెడు సహవాసాలు మంచి అలవాట్లను పాడుచేస్తాయి.” (1 కొరింథీయులు 15:12, 33) ఎవరితో ఎక్కువగా స్నేహం చేయాలో నిర్ణయించుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండమని పౌలు తిమోతిని కూడా హెచ్చరించాడు. నేడు మనం కూడా ఆ హెచ్చరికను పాటించాలి.—2 తిమోతి 2:20-22 చదవండి.

14. మన స్నేహితులు యెహోవాతో మనకున్న స్నేహంపై ఎలాంటి ప్రభావం చూపించవచ్చు?

14 యెహోవాతో మనకున్న స్నేహం అత్యంత విలువైనది, మనం దాన్ని కాపాడుకోవాలి. కాబట్టి మన విశ్వాసాన్ని, యెహోవాతో ఉన్న స్నేహాన్ని దెబ్బతీసేవాళ్లతో ఎక్కువగా స్నేహం చేయకూడదు. స్పాంజీని మురికి నీళ్లలో ఉంచి, అది మంచి నీళ్లను పీల్చుకోవాలని ఆశించం కదా. అదేవిధంగా చెడ్డ పనులు చేసేవాళ్లతో స్నేహం చేస్తూ, మనం మంచి పనులు చేయగలం అనుకుంటే మోసపోయినట్టే. కాబట్టి, ఎవరితో ఎక్కువగా స్నేహం చేయాలో నిర్ణయించుకునేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి.—1 కొరింథీయులు 5:6; 2 థెస్సలొనీకయులు 3:6, 7, 14.

యెహోవాను ప్రేమించే మంచి స్నేహితులు మీకు దొరుకుతారు

15. సంఘంలో మంచి స్నేహితులు దొరకాలంటే ఏం చేయాలి?

15 సంఘంలో యెహోవాను నిజంగా ప్రేమించేవాళ్లు మీకు దొరుకుతారు. వాళ్లు మీకు దగ్గరి స్నేహితులు అవ్వగలరు. (కీర్తన 133:1) మీ వయసువాళ్లనే లేదా మీలాంటి నేపథ్యం ఉన్నవాళ్లనే స్నేహితులుగా చేసుకోవాలని చూడకండి. యోనాతాను దావీదు కన్నా చాలా పెద్దవాడని, రూతు నయోమి కన్నా చాలా చిన్నదని గుర్తుంచుకోండి. “మీ హృదయాల్ని విశాలం చేసుకోండి” అని బైబిలు ఇస్తున్న సలహాను పాటించడం మంచిది. (2 కొరింథీయులు 6:13; 1 పేతురు 2:17 చదవండి.) మీరు ఎంత ఎక్కువగా యెహోవాను అనుకరిస్తే, ఇతరులు అంత ఎక్కువగా మీతో స్నేహం చేయాలనుకుంటారు.

సమస్యలు వచ్చినప్పుడు

16, 17. సంఘంలో ఎవరైనా మనల్ని బాధపెడితే ఏం చేయకూడదు?

16 కుటుంబంలో ఒక్కొక్కరి వ్యక్తిత్వం, అభిప్రాయం, పని తీరు ఒక్కోలా ఉండవచ్చు. సంఘంలో కూడా అంతే. రకరకాల వ్యక్తులు ఉండడం వల్ల జీవితం ఆసక్తికరంగా ఉంటుంది, ఒకరి నుండి ఒకరం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. కానీ ఆ వైవిధ్యం వల్లే కొన్నిసార్లు సహోదర సహోదరీల మధ్య మనస్పర్థలు, చికాకులు వస్తుంటాయి. కొన్నిసార్లు వాళ్లు మనల్ని నొప్పించవచ్చు, మన మనోభావాల్ని గాయపర్చవచ్చు. (సామెతలు 12:18) అలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనం నిరుత్సాహపడిపోయి సంఘానికి దూరం అవ్వాలా?

17 లేదు. ఎవరైనా మనల్ని బాధపెడితే మనం నిరుత్సాహపడి సంఘానికి దూరమవ్వం. మనల్ని బాధపెట్టింది యెహోవా కాదు. ఆయన మనకు జీవాన్ని ఇచ్చాడు, కావల్సినవన్నీ ఇచ్చాడు. మన ప్రేమ, విశ్వసనీయత పొందడానికి ఆయన అర్హుడు. (ప్రకటన 4:11) సంఘం అనేది యెహోవా ఇచ్చిన బహుమతి. అది మన విశ్వాసాన్ని బలంగా ఉంచుకోవడానికి సహాయం చేస్తుంది. (హెబ్రీయులు 13:17) కాబట్టి ఎవరో మనల్ని బాధపెట్టారని మనం ఆ బహుమతిని దూరం చేసుకుంటామా?—కీర్తన 119:165 చదవండి.

18. (ఎ) మన సహోదర సహోదరీలతో సర్దుకుపోవడానికి ఏది సహాయం చేస్తుంది? (బి) మనం ఎందుకు ఇతరుల్ని క్షమించాలి?

18 మనం మన సహోదర సహోదరీల్ని ప్రేమిస్తాం, సమస్యలు వచ్చినా సర్దుకుపోవాలనుకుంటాం. యెహోవా మనుషుల నుండి పరిపూర్ణతను ఆశించడు, మనం కూడా ఆశించకూడదు. (సామెతలు 17:9; 1 పేతురు 4:8) మనందరం తప్పులు చేస్తాం, కానీ ప్రేమ ఉంటే ‘ఒకరినొకరం మనస్ఫూర్తిగా క్షమించుకుంటాం.’ (కొలొస్సయులు 3:13) అంతేకాదు చిన్నచిన్న మనస్పర్థలు పెద్ద సమస్యల్లా మారకుండా చూసుకుంటాం. నిజమే, ఎవరైనా మనల్ని బాధపెట్టినప్పుడు ఆ విషయాన్ని అంత తేలిగ్గా మర్చిపోలేం. మనం కోపం తెచ్చుకుని, ఆ వ్యక్తి మీద పగ పెట్టుకునే అవకాశం ఉంది. కానీ అలా చేస్తే మనమే నష్టపోతాం, మన సంతోషాన్ని కోల్పోతాం. అలా కాకుండా మనల్ని బాధపెట్టినవాళ్లను క్షమిస్తే మనకు మనశ్శాంతి ఉంటుంది, సంఘంలో ఐక్యత ఉంటుంది, అన్నిటికన్నా ముఖ్యంగా మనకు యెహోవాతో మంచి సంబంధం ఉంటుంది.—మత్తయి 6:14, 15; లూకా 17:3, 4; రోమీయులు 14:19.

ఎవరైనా బహిష్కరించబడినప్పుడు

19. సంఘంలోని ఒక వ్యక్తితో మనం ఎప్పుడు సహవాసం మానేయాలి?

19 ఒక ఉదాహరణ పరిశీలించండి. ప్రేమగల ఒక కుటుంబంలో ఒకరినొకరు సంతోషపెట్టడానికి అందరూ తమ వంతు కృషి చేస్తున్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రం ఎదురుతిరుగుతున్నాడు. కుటుంబంలో ఉన్న వాళ్లందరూ పదేపదే సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నా అతను మారట్లేదు. అతను ఇల్లు వదిలి వెళ్లిపోవాలని అనుకోవచ్చు, లేదా కుటుంబ పెద్ద అతన్ని ఇల్లు వదిలి వెళ్లిపోమని చెప్పవచ్చు. సంఘంలో కూడా అలా జరిగే అవకాశం ఉంది. ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా యెహోవాకు ఇష్టంలేని పనులు చేస్తూ, సంఘానికి హాని చేస్తుండవచ్చు. సహాయం చేసినా పట్టించుకోకుండా, సంఘంలో ఉండడం తనకు ఇష్టం లేదన్నట్టు ప్రవర్తించవచ్చు. అతను సంఘాన్ని వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకోవచ్చు లేదా అతన్ని సంఘం నుండి బహిష్కరించాల్సి రావచ్చు. అలా జరిగినప్పుడు “అతనితో సహవాసం మానేయాలి” అని బైబిలు సూటిగా చెప్తుంది. (1 కొరింథీయులు 5:11-13 చదవండి; 2 యోహాను 9-11) ఆ వ్యక్తి మన కుటుంబ సభ్యుడో, స్నేహితుడో అయితే అలా సహవాసం మానేయడం మనకు మరీ కష్టంగా ఉంటుంది. అయితే అలాంటి పరిస్థితిలో మనం వేరే ఎవ్వరి కన్నా యెహోవాకే విశ్వనీయంగా ఉండాలి.—“బహిష్కరించడం” చూడండి.

20, 21. (ఎ) బహిష్కరించడం అనేది ప్రేమతో చేసిన ఏర్పాటు అని ఎందుకు చెప్పవచ్చు? (బి) స్నేహితుల్ని జాగ్రత్తగా ఎంచుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

20 బహిష్కరించడం అనేది యెహోవా ప్రేమతో చేసిన ఏర్పాటు. యెహోవా ప్రమాణాల పట్ల గౌరవం లేనివాళ్ల నుండి అది సంఘాన్ని కాపాడుతుంది. (1 కొరింథీయులు 5:7; హెబ్రీయులు 12:15, 16) యెహోవా పట్ల, ఆయన పవిత్రమైన పేరు పట్ల, ఆయన ఉన్నత ప్రమాణాల పట్ల ప్రేమ చూపించడానికి అది సహాయం చేస్తుంది. (1 పేతురు 1:15, 16) ఈ ఏర్పాటు, బహిష్కరించబడిన వ్యక్తి పట్ల కూడా ప్రేమ చూపిస్తుంది. అలాంటి తీవ్రమైన క్రమశిక్షణ వల్ల ఆ వ్యక్తి తన తప్పు తెలుసుకుని మారే అవకాశం ఉంది. ఒకప్పుడు బహిష్కరించబడి ఆ తర్వాత యెహోవా దగ్గరికి తిరిగొచ్చిన చాలామంది సంఘంలోకి ప్రేమగా ఆహ్వానించబడ్డారు.—హెబ్రీయులు 12:11.

21 మన స్నేహితులు మన మీద మంచి ప్రభావం చూపించవచ్చు లేదా చెడు ప్రభావం చూపించవచ్చు. కాబట్టి వాళ్లను జాగ్రత్తగా ఎంచుకోవడం ప్రాముఖ్యం. యెహోవాను ప్రేమించేవాళ్లను స్నేహితులుగా చేసుకుంటే, ఆయనకు ఎప్పుడూ నమ్మకంగా ఉండేలా వాళ్లు సహాయం చేస్తారు.