కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

2

రాజ్యం పరలోకంలో స్థాపించబడింది

రాజ్యం పరలోకంలో స్థాపించబడింది

ఈ అధ్యాయంలోని ముఖ్యాంశం

రాజ్యం స్థాపించబడక ముందే దేవుడు తన ప్రజల్ని సిద్ధం చేయడం

1, 2. ప్రపంచ చరిత్రలోనే అత్యంత ప్రాముఖ్యమైన సంఘటన ఏమిటి? అది మనుషులకు కనిపించకుండా జరిగినంత మాత్రాన మనం ఆశ్చర్యపోవాలా?

 చరిత్రను మలుపు తిప్పే సంఘటనలు జరిగిన కాలంలో మీరు జీవించినట్లు ఊహించుకోండి. ఆ కాలంలో జీవించినంత మాత్రాన, మీరు ఆ సంఘటనల్ని కళ్లారా చూసివుండాలనేమీ లేదు. ఎందుకంటే, పాత విధానాలను తిరగరాసి చరిత్ర పుటల్లోకి ఎక్కే సంఘటనలు చాలావరకు నలుగురిలో జరగవు గానీ, నాలుగు గోడల మధ్య అంటే రాజభవనాల్లో, సభా మందిరాల్లో, లేదా ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతాయి. అయినప్పటికీ అవి లక్షలమంది జీవితాలను ప్రభావితం చేస్తాయి.

2 మరి ప్రపంచ చరిత్రలోనే అత్యంత ప్రాముఖ్యమైన సంఘటన మాటేమిటి? ఆ సంఘటన మనుషులకు కనిపించకుండా జరిగినప్పటికీ, అది లక్షలమంది జీవితాలను ప్రభావితం చేసింది. ఇంతకీ మనం ఏ సంఘటన గురించి మాట్లాడుతున్నాం? పరలోకంలో దేవుని రాజ్యం స్థాపించబడడం గురించి మాట్లాడుతున్నాం. ఎప్పుడో వాగ్దానం చేయబడిన ఆ మెస్సీయ ప్రభుత్వం, త్వరలోనే ఈ లోక వ్యవస్థనంతటినీ నిర్మూలిస్తుంది. (దానియేలు 2:34, 35, 44, 45 చదవండి.) మనుషులు ఆ ప్రాముఖ్యమైన సంఘటనను చూడలేదంటే, దానర్థం యెహోవా ఆ విషయాన్ని వాళ్లకు తెలీకుండా దాచిపెట్టాడనా? లేదు. రాజ్యం స్థాపించబడక ముందే, ఆయన తన నమ్మకమైన ప్రజల్ని దానికోసం సిద్ధం చేశాడు. అదెలాగో ఇప్పుడు పరిశీలిద్దాం.

‘నా సందేశకుడు నాకు ముందుగా మార్గాన్ని సిద్ధం చేస్తాడు’

3-5. (ఎ) మలాకీ 3:1 లో ప్రస్తావించబడిన “ఒప్పంద సందేశకుడు” ఎవరు? (బి) మలాకీ 3:1 లో ఉన్న ఇంకో సందేశకుడు ఏమి చేస్తాడు?

3 మెస్సీయ రాజ్యం స్థాపించబడక ముందే, యెహోవా తన ప్రజల్ని దానికోసం సిద్ధం చేయాలనుకున్నాడు. ఉదాహరణకు, మలాకీ 3:1, NWలో ఉన్న ప్రవచనాన్ని పరిశీలించండి: “ఇదిగో! నేను నా సందేశకుణ్ణి పంపుతున్నాను, అతను నాకు ముందుగా మార్గాన్ని సిద్ధం చేస్తాడు. మీరు వెదుకుతున్న నిజమైన ప్రభువు అకస్మాత్తుగా తన ఆలయానికి వస్తాడు; అలాగే, మీరు ఎవరి కోసం సంతోషంగా ఎదురుచూస్తున్నారో ఆ ఒప్పంద సందేశకుడు వస్తాడు.”

4 ఆధునిక కాలంలో, “నిజమైన ప్రభువు” అంటే యెహోవా, తన ఆధ్యాత్మిక ఆలయంలోని భూఆవరణలో సేవ చేస్తున్నవాళ్లను తనిఖీ చేయడానికి ఎప్పుడు వచ్చాడు? యెహోవా తన ‘ఒప్పంద సందేశకునితో’ వస్తాడని ఆ ప్రవచనం చెప్తుంది. ఆ “ఒప్పంద సందేశకుడు” ఎవరు? మెస్సీయ రాజైన యేసుక్రీస్తే! (లూకా 1:68-73) కొత్తగా సింహాసనాన్ని అధిష్ఠించిన యేసు తన తండ్రితో కలిసి, భూమ్మీదున్న దేవుని ప్రజల్ని తనిఖీ చేసి, వాళ్లను శుద్ధీకరిస్తాడు.—1 పేతు. 4:17.

5 మరి మలాకీ 3:1 లో ప్రస్తావించబడిన ఇంకో సందేశకుడు ఎవరు? ఆ సందేశకుడు, మెస్సీయ రాజవ్వడానికి ముందే రంగంలోకి దిగిన వ్యక్తి అయ్యుండాలి. 1914కు ముందు దశాబ్దాల్లో, మెస్సీయ రాజు కోసం మార్గాన్ని ఎవరు ‘సిద్ధం చేశారు’?

6. మలాకీ ప్రవచనంలో చెప్పబడిన ‘సందేశకునిలా,’ దేవుని ప్రజల్ని ఎవరు సిద్ధం చేశారు?

6 ఈ ప్రచురణలో, యెహోవా ప్రజల ఉత్తేజకరమైన చరిత్రను పరిశీలిస్తూ, ఆ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం. 19వ శతాబ్దం చివరి భాగంలో, విస్తారమైన నకిలీ క్రైస్తవుల మధ్య, నిజ క్రైస్తవుల ఒక చిన్న గుంపు ఆవిర్భవించింది. వాళ్లే ఆ తర్వాత బైబిలు విద్యార్థులుగా పిలువబడ్డారు. ఆ గుంపుకు నాయకత్వం వహిస్తున్న ఛార్లెస్‌ టి. రస్సెల్‌, అలాగే అతని సహచరులు, మలాకీ ప్రవచనంలో చెప్పబడిన ‘సందేశకునిలా,’ దేవుని ప్రజలకు ఆధ్యాత్మిక నిర్దేశం ఇస్తూ, ముందుముందు జరగబోయే సంఘటనలకు వాళ్లను సిద్ధం చేశారు. వాళ్లు ఏ నాలుగు విధానాల్లో దేవుని ప్రజల్ని సిద్ధం చేశారో ఇప్పుడు పరిశీలిద్దాం.

సత్యంతో ఆరాధించడం

7, 8. (ఎ) 1800లలో, ఆత్మకు చావు లేదనే సిద్ధాంతం తప్పని ఎవరు తెలియజేశారు? (బి) సి. టి. రస్సెల్‌, అతని సహచరులు ఇంకా ఏ అబద్ధ సిద్ధాంతాల్ని బయటపెట్టారు?

7 బైబిలు విద్యార్థులు ప్రార్థనాపూర్వకంగా అధ్యయనం చేసి, అందరూ ఏకాభిప్రాయానికి వచ్చాక, స్పష్టమైన బైబిలు సత్యాల్ని సమకూర్చి, ప్రచురించారు. వందల సంవత్సరాలుగా, క్రైస్తవ మత సామ్రాజ్యం ఆధ్యాత్మిక చీకటిలో కూరుకుపోయింది. దాని బోధలు చాలావరకు అబద్ధ మతం నుండి వచ్చినవే. వాటిలో ఒకటి, ఆత్మకు చావు లేదనే సిద్ధాంతం. అయితే 1800లలో, శ్రద్ధగా బైబిల్ని చదివిన కొంతమంది వ్యక్తులు ఆ సిద్ధాంతాన్ని పరిశీలించి, అది దేవుని వాక్యం ఆధారంగా లేదని గుర్తించారు. వాళ్లలో హెన్రీ గ్ర్యూ, జార్జ్‌ స్టెట్సన్‌, జార్జ్‌ స్టార్జ్‌, ఆ సిద్ధాంతం సాతాను కల్పించిన ఒక అబద్ధమని తెలియజేసి, దాని గురించి ధైర్యంగా ప్రసంగాలు కూడా ఇచ్చారు. a వాళ్లు చేసిన కృషి, బైబిలు విద్యార్థులైన సి. టి. రస్సెల్‌కు, అతని సహచరులకు చాలా ఉపయోగపడింది.

8 బైబిలు విద్యార్థులు, ఆత్మకు చావు లేదనే సిద్ధాంతంతో ముడిపడివున్న ఇతర సిద్ధాంతాలను పరిశీలించి, అవి అబద్ధమని, ప్రజల్ని తికమకపెట్టేవిగా ఉన్నాయని గుర్తించారు. ఉదాహరణకు, మంచివాళ్లందరూ పరలోకానికి వెళ్తారనే సిద్ధాంతాన్ని, అలాగే చెడ్డవాళ్ల ఆత్మల్ని దేవుడు నరకంలో నిత్యం యాతన పెడతాడనే సిద్ధాంతాన్ని పరిశీలించి, అవి అబద్ధమని ఎన్నో ఆర్టికల్స్‌లో, పుస్తకాల్లో, పాంప్లెట్లలో, కరపత్రాల్లో, అలాగే వార్తాపత్రికల్లో ప్రచురించిన ప్రసంగాల్లో ధైర్యంగా తెలియజేశారు.

9. త్రిత్వ సిద్ధాంతం తప్పని జాయన్స్‌ వాచ్‌ టవర్‌ ఎలా తెలియజేసింది?

9 అంతేకాదు, ప్రజలందరూ గౌరవిస్తున్న త్రిత్వ సిద్ధాంతం కూడా తప్పని బైబిలు విద్యార్థులు తెలియజేశారు. 1887లో జాయన్స్‌ వాచ్‌ టవర్‌ ఇలా చెప్పింది: “యెహోవా, యేసు వేర్వేరు వ్యక్తులని, యెహోవా తండ్రి అని, యేసు ఆయన కొడుకు అని లేఖనాలు స్పష్టంగా చెప్తున్నాయి. త్రిత్వ సిద్ధాంతం—అంటే ముగ్గురు దేవుళ్లు ఒకటిగా ఉండడం, అదే సమయంలో ఒక్క దేవుడే ముగ్గురిగా ఉండడం—ఎందుకు అంత ప్రజాదరణ పొందిందో అర్థం కావట్లేదు. పైగా చర్చియే ఆ సిద్ధాంతాన్ని బోధిస్తుందంటే, అది అబద్ధ సిద్ధాంతాల బంధకాల్లో చిక్కుకుపోయిందనీ, ఆ విషయం కూడా గుర్తించలేనంత గాఢనిద్రలో ఉందనీ తెలుస్తోంది.”

10. 1914 ఒక ప్రాముఖ్యమైన సంవత్సరమని వాచ్‌ టవర్‌ పత్రిక ఎలా సూచించింది?

10 జాయన్స్‌ వాచ్‌ టవర్‌ అండ్‌ హెరాల్డ్‌ ఆఫ్‌ క్రైస్ట్స్‌ ప్రెసెన్స్‌ పత్రిక, దాని శీర్షికకు తగ్గట్లుగానే, క్రీస్తు ప్రత్యక్షతకు సంబంధించిన ప్రవచనాలపై ఎక్కువగా దృష్టిపెట్టింది. ఆ పత్రికను రాసిన నమ్మకమైన అభిషిక్త క్రైస్తవులు, దానియేలు ప్రవచనంలో ఉన్న ‘ఏడు కాలాలకు,’ మెస్సీయ రాజ్యానికి సంబంధం ఉందని గుర్తించారు. ఆ ఏడు కాలాలు 1914లో ముగుస్తాయని వాళ్లు 1870ల ప్రారంభంలోనే తెలియజేశారు. (దాని. 4:25; లూకా 21:24) ఆ కాలంలో జీవిస్తున్న సహోదరులకు, 1914కున్న ప్రాముఖ్యత ఏమిటో పూర్తిగా అర్థంకాకపోయినా, వాళ్లు దాని గురించి చాటిచెప్పారు. వాళ్ల కృషికి వచ్చిన మంచి ఫలితాల్ని మనం ఇప్పటికీ అనుభవిస్తున్నాం.

11, 12. (ఎ) సహోదరుడు రస్సెల్‌ తాను బోధించిన వాటికి ఘనత ఎవరికి ఆపాదించాడు? (బి) 1914కు ముందు దశాబ్దాల్లో రస్సెల్‌, అతని సహచరులు చేసిన కృషికి ఎలాంటి ఫలితాలు వచ్చాయి?

11 రస్సెల్‌, అతని సహచరులు ఆ ప్రాముఖ్యమైన సత్యాల్ని గుర్తించినందుకు తమకే ఘనత రావాలని కోరుకోలేదు. రస్సెల్‌ తనకంటే ముందుగా బైబిలు సత్యాల్ని వెలికి తీసినవాళ్లకు, మరిముఖ్యంగా యెహోవాకు ఘనత ఇచ్చాడు. ఎందుకంటే, తన ప్రజలకు ఏమి బోధించాలో, ఎప్పుడు బోధించాలో పూర్తిగా యెహోవా చేతిలోనే ఉంటుంది. అసత్యం నుండి సత్యాన్ని వేరుచేయడంలో రస్సెల్‌, అతని సహచరులు చేసిన కృషిని యెహోవా ఆశీర్వదించాడు. సంవత్సరాలు గడుస్తుండగా, వాళ్లు క్రైస్తవ మత సామ్రాజ్యానికి వేరుగా, ప్రత్యేకంగా జీవించారు.

సహోదరుడు రస్సెల్‌, అతని సహచరులు బైబిలు సత్యాల్ని తెలియజేశారు

12 1914కు ముందు దశాబ్దాల్లో, బైబిలు సత్యాల్ని తెలియజేయడంలో ఆ నమ్మకమైన పురుషులు చేసిన కృషి మరువలేనిది! వాళ్లు చేసిన కృషిని గుర్తుచేసుకుంటూ, 1917 ద వాచ్‌ టవర్‌ అండ్‌ హెరాల్డ్‌ ఆఫ్‌ క్రైస్ట్స్‌ ప్రెసెన్స్‌ పత్రిక నవంబరు 1 సంచిక ఇలా చెప్పింది: “నరకం, అలాగే ఇతర అబద్ధ సిద్ధాంతాలు కలిగించిన భయం నుండి, లక్షలమంది ప్రజలు ఇప్పుడు విముక్తి పొందుతున్నారు . . . నలభై కన్నా ఎక్కువ సంవత్సరాల క్రితం, సత్యం అనే కెరటం ఎగసిపడడం మొదలైంది. అది ఇప్పటికీ ఎగసిపడుతూనే ఉంది, భూమంతటినీ నింపే వరకు అలా ఎగసిపడుతూనే ఉంటుంది. వ్యతిరేకులు దాన్ని ఆపాలని ప్రయత్నించవచ్చు. కానీ మహా సముద్రంలో విరుచుకుపడుతున్న కెరటాల్ని ఆపడం ఎవ్వరి తరం కాదు.”

13, 14. (ఎ) “సందేశకుడు” ఎలా మెస్సీయ రాజు కోసం మార్గం సిద్ధం చేశాడు? (బి) దాదాపు వంద సంవత్సరాల క్రితం జీవించిన మన సహోదరుల నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

13 ఒక్కసారి వీటి గురించి ఆలోచించండి: యెహోవా, యేసు త్రిత్వంలో భాగం కాదని అర్థం చేసుకోకపోతే బైబిలు విద్యార్థులు క్రీస్తు ప్రత్యక్షత కోసం సిద్ధంగా ఉండేవాళ్లా? ఆత్మకు చావు లేదనే సిద్ధాంతం తప్పని; క్రీస్తు అడుగుజాడల్లో నడిచే కొద్దిమంది మాత్రమే అమర్త్యమైన జీవితం పొందుతారని; దేవుడు నరకాగ్నిలో ప్రజల్ని నిత్యం యాతన పెట్టడని అర్థం చేసుకోకపోతే వాళ్లు సిద్ధంగా ఉండేవాళ్లా? ఖచ్చితంగా ఉండేవాళ్లు కాదు. కాబట్టి, మెస్సీయ రాజు కోసం “సందేశకుడు” మార్గం సిద్ధం చేశాడని నిస్సందేహంగా చెప్పవచ్చు!

14 మరి మన విషయమేమిటి? దాదాపు వంద సంవత్సరాల క్రితం జీవించిన ఆ సహోదరుల నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? వాళ్లలాగే మనం కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి, అధ్యయనం చేయాలి. (యోహా. 17:3) ఈ లోకం వస్తుసంపదలకు ప్రాముఖ్యత ఇస్తూ ఆధ్యాత్మికంగా కృశించిపోతుండగా, మనం మాత్రం ఆధ్యాత్మిక ఆహారం పట్ల ఆకలిని పెంచుకుంటూ ఉందాం!—1 తిమోతి 4:15 చదవండి.

“నా ప్రజలారా, . . . దానిలో నుండి బయటికి రండి”

15. బైబిలు విద్యార్థులు క్రమక్రమంగా ఏ విషయాన్ని గ్రహించారు? (అధస్సూచి చూడండి.)

15 చర్చీలతో తెగతెంపులు చేసుకోవడం ప్రాముఖ్యమని బైబిలు విద్యార్థులు బోధించారు. 1879లో వాచ్‌ టవర్‌ పత్రిక “బబులోను చర్చి” గురించి ప్రస్తావించింది. బబులోను చర్చి, రోమన్‌ క్యాథలిక్‌ చర్చిని సూచిస్తుందా? బైబిల్లో ఉన్న “బబులోను” క్యాథలిక్‌ చర్చిని సూచిస్తుందని, ప్రొటస్టెంట్‌ చర్చి సభ్యులు వందల సంవత్సరాల పాటు అనుకున్నారు. కానీ క్రైస్తవ మత సామ్రాజ్యానికి చెందిన చర్చీలన్నీ, ఆధునిక కాల “బబులోను” కిందకే వస్తాయని బైబిలు విద్యార్థులు క్రమక్రమంగా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే, చర్చీలన్నీ పైన ప్రస్తావించిన అబద్ధ సిద్ధాంతాలనే బోధిస్తున్నాయి. b అయితే ఆ చర్చీల్లో భాగంగా ఉన్న మంచి ప్రజలు ఏమి చేయాలో, తర్వాతి సంవత్సరాల్లో వచ్చిన మన ప్రచురణలు సూటిగా చెప్పాయి.

16, 17. (ఎ) అబద్ధమతంతో తెగతెంపులు చేసుకోమని మిలీనియల్‌ డాన్‌ 3వ సంపుటి, అలాగే వాచ్‌ టవర్‌ పత్రిక ఎలా ప్రోత్సహించాయి? (బి) మొదట్లో అలాంటి హెచ్చరికల్ని నిర్లక్ష్యం చేయడానికి కారణం ఏమిటి? (అధస్సూచి చూడండి.)

16 ఉదాహరణకు, ఆధునిక కాల బబులోనును దేవుడు తిరస్కరించాడని వివరిస్తూ, 1891లో మిలీనియల్‌ డాన్‌ 3వ సంపుటి ఇలా చెప్పింది: “క్రైస్తవ మత సామ్రాజ్యానికి చెందిన చర్చీలన్నిటిని దేవుడు తిరస్కరించాడు. కాబట్టి, దాని అబద్ధ సిద్ధాంతాలను, ఆచారాలను సమర్థించని వాళ్లందరూ దానిలో నుండి బయటికి రావాలని కోరుతున్నాం.”

17 కొంతమంది, క్రైస్తవ మత సామ్రాజ్యానికి చెందిన చర్చీల్లో ఇంకా సభ్యత్వం కలిగివుండి, “మేము సత్యాన్నే సమర్థిస్తున్నాం, కాకపోతే అప్పుడప్పుడు చర్చికి వెళ్తున్నాం” అని చెప్పుకునేవాళ్లు. అలాంటి వాళ్లను ఉద్దేశించి 1900, వాచ్‌ టవర్‌ జనవరి సంచిక ఇలా చెప్పింది: “సగం బబులోనులో, సగం బయట ఉండడం సరైనదేనా? ఇలాంటి విధేయతను . . . దేవుడు అంగీకరిస్తాడా? ఖచ్చితంగా అంగీకరించడు. చర్చిలో సభ్యత్వం ఉన్న ప్రతీ వ్యక్తి, దానిలో చేరినప్పుడే దానితో ఒక ఒప్పందం చేసుకున్నట్లు. కాబట్టి, తన సభ్యత్వాన్ని రద్దు చేసుకున్నానని బహిరంగంగా చెప్పేంతవరకు, . . . అతను ఆ ఒప్పందంలోని షరతులకు కట్టుబడి ఉండాల్సిందే.” సంవత్సరాలు గడిచే కొద్దీ, ఈ విషయం గురించి మన ప్రచురణలు ఇంకా సూటిగా హెచ్చరించాయి. c అదేంటంటే, యెహోవా సేవకులు అబద్ధ మతంతో పూర్తిగా తెగతెంపులు చేసుకోవాలి.

18. దేవుని ప్రజలు మహాబబులోను నుండి బయటికి రావడం ఎందుకు ప్రాముఖ్యం?

18 మహాబబులోనును విడిచి రమ్మనే అలాంటి హెచ్చరికల్ని క్రమంగా ఇవ్వకపోతే, క్రీస్తు కోసం ఒక అభిషిక్తుల గుంపు ఏర్పడివుండేదా? ఆ గుంపు క్రీస్తు ప్రత్యక్షతకు సిద్ధంగా ఉండేదా? ఖచ్చితంగా ఉండేది కాదు. ఎందుకంటే, బబులోను నుండి దూరంగా వచ్చేసిన క్రైస్తవులు మాత్రమే యెహోవాను “పవిత్రశక్తితో, సత్యంతో” ఆరాధించగలరు. (యోహా. 4:24) మనం కూడా అబద్ధ మతం నుండి బయటికి వచ్చేయాలని నిశ్చయించుకున్నామా? “నా ప్రజలారా . . . దానిలో నుండి బయటికి రండి” అని దేవుడు ఇచ్చిన ఆజ్ఞకు ఎల్లప్పుడూ లోబడివుందాం!—ప్రకటన 18:4 చదవండి.

ఆరాధన కోసం సమకూడడం

19, 20. ఆరాధన కోసం సమకూడమని వాచ్‌ టవర్‌ పత్రిక దేవుని ప్రజల్ని ఎలా ప్రోత్సహించింది?

19 తోటి విశ్వాసులు ఆరాధన కోసం ఎక్కడ వీలైతే అక్కడ సమకూడాలని బైబిలు విద్యార్థులు బోధించారు. నిజ క్రైస్తవులు అబద్ధ మతం నుండి బయటికి వస్తే సరిపోదు గానీ, వాళ్లు సత్యారాధనలో భాగం వహించాలి. వాచ్‌ టవర్‌ పత్రిక, దాని తొలి సంచికల్లోనే, ఆరాధన కోసం సమకూడమని పాఠకుల్ని ప్రోత్సహించింది. ఉదాహరణకు, సహోదరుడు రస్సెల్‌ 1880, జూలైలో ప్రసంగాలు ఇవ్వడానికి వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాడు. ఆ కూటాలు తనకు ఎంత ప్రోత్సాహాన్ని ఇచ్చాయో వాచ్‌ టవర్‌ పత్రికలో తెలియజేశాడు. అంతేకాదు, కూటాల విషయంలో తాము సాధిస్తున్న అభివృద్ధి గురించి కూడా ఒక కార్డుమీద రాసి పంపించమని పాఠకుల్ని కోరాడు. వాటిలో కొన్నిటిని పత్రికలో ప్రచురిస్తామని చెప్తూ, రస్సెల్‌ ఇలా అన్నాడు: “మీ అభివృద్ధిని ప్రభువు ఎంతగా ఆశీర్వదించాడో . . . మాకు తెలియజేయండి. మీరు మీ తోటి విశ్వాసులతో కలిసి క్రమంగా కూటాలు జరుపుకుంటున్నారో లేదో కూడా మాకు చెప్పండి.”

1909లో, డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో తొలి బైబిలు విద్యార్థుల గుంపుతో ఛార్లెస్‌ రస్సెల్‌

20 1882 వాచ్‌ టవర్‌ పత్రికలో, “సమకూడడం” అనే ఆర్టికల్‌ వచ్చింది. క్రైస్తవులు “ఒకర్నొకరు బలపర్చుకోవడానికి, పురికొల్పుకోవడానికి, ప్రోత్సహించుకోవడానికి” కూటాలు జరుపుకోవాలని ఆ ఆర్టికల్‌ తెలియజేసింది. అది ఇలా చెప్పింది: “కూటాలకు రావడానికి, మీకు పాండిత్యం గానీ గొప్పగొప్ప నైపుణ్యాలు గానీ ఉండాల్సిన అవసరం లేదు. ప్రతీఒక్కరు సొంత బైబిలు, పేపరు, పెన్సిలు తెచ్చుకోండి. బైబిలు కంకార్డెన్స్‌ను . . . సాధ్యమైనంత ఎక్కువగా ఉపయోగించండి. ఏదైనా ఒక అంశాన్ని ఎంచుకుని, దాన్ని అర్థం చేసుకోవడానికి పవిత్రశక్తిని ఇవ్వమని ప్రార్థించండి; తర్వాత దాన్ని చదవండి, దాని గురించి ఆలోచించండి; లేఖనాలను ఒకదానితో ఒకటి పోల్చి చూడండి. అలా చేస్తే మీరు తప్పకుండా సత్యం తెలుసుకుంటారు.”

21. కూటాలకు హాజరయ్యే విషయంలో, కాపరి సందర్శనం చేసే విషయంలో, పెన్సిల్వేనియాలోని అల్గేనీలో ఉన్న సంఘం ఎలా చక్కని ఆదర్శం ఉంచింది?

21 బైబిలు విద్యార్థుల ప్రధాన కార్యాలయం, అమెరికాలోని పెన్సిల్వేనియాలో అల్గేనీలో ఉండేది. బైబిలు విద్యార్థులు హెబ్రీయులు 10:24, 25లో ఉన్న సలహాను పాటిస్తూ అక్కడ క్రమంగా కూడుకునేవాళ్లు. (చదవండి.) చిన్నతనంలో ఆ కూటాలకు హాజరైన ఛార్లెస్‌ కేపన్‌ అనే ఒక వృద్ధ సహోదరుడు ఇలా చెప్పాడు: “సొసైటీ సమావేశ హాలు లోపల ‘ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సోదరులు’ అని గోడ మీద రాసి ఉండేది. ఆ లేఖనం నాకు ఇప్పటికీ గుర్తుంది. యెహోవా ప్రజల మధ్య బోధకులు-సామాన్య ప్రజలు అనే తేడాలు ఉండవని ఆ లేఖనం ఎప్పుడూ గుర్తుచేసేది.” (మత్త. 23:8) ఆ కూటాలు ఎంత ప్రోత్సాహకరంగా ఉండేవో, సహోదరుడు రస్సెల్‌ ఒక కాపరిలా సంఘంలోని ప్రతీఒక్కరి మీద ఎలా శ్రద్ధ చూపించేవాడో కేపన్‌ గుర్తుచేసుకున్నాడు.

22. క్రైస్తవ కూటాలకు హాజరవ్వమనే సలహాకు నమ్మకమైన ప్రజలు ఎలా స్పందించారు? వాళ్ల నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

22 బైబిలు విద్యార్థులు ఉంచిన అలాంటి ఆదర్శాన్ని నమ్మకమైన ప్రజలు అనుసరించారు. క్రమంగా సమకూడాలనే సలహాకు వాళ్లు లోబడ్డారు. అప్పుడు మిగతా రాష్ట్రాల్లో అంటే ఒహాయోలో, మిచిగాన్‌లో, ఆ తర్వాత ఉత్తర అమెరికా అంతటా, అలాగే ఇతర దేశాల్లో కూడా సంఘాలు ఏర్పడ్డాయి. ఒక్కసారి ఆలోచించండి. ఆరాధన కోసం సమకూడడం ప్రాముఖ్యమని దేవుని ప్రజలు అర్థం చేసుకోకపోతే, వాళ్లు క్రీస్తు ప్రత్యక్షతకు సిద్ధంగా ఉండేవాళ్లా? ఖచ్చితంగా కాదు! మరి మన విషయమేమిటి? మనం కూడా వాళ్లలాగే, ఆరాధన కోసం సమకూడడానికి, ఒకర్నొకరం ఆధ్యాత్మికంగా బలపర్చుకోవడానికి, క్రైస్తవ కూటాలకు క్రమంగా వెళ్లాలని తీర్మానించుకుందాం.

ఉత్సాహంగా ప్రకటించడం

23. అభిషిక్తులందరూ సత్యాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉందని వాచ్‌ టవర్‌ పత్రిక ఎలా స్పష్టం చేసింది?

23 సత్యాన్ని ప్రకటించాల్సిన బాధ్యత అభిషిక్తులందరిపై ఉందని బైబిలు విద్యార్థులు బోధించారు. 1885లో వాచ్‌ టవర్‌ పత్రిక ఇలా చెప్పింది: “అభిషిక్తుల గుంపులోని ప్రతీఒక్కరు ప్రకటించడానికే అభిషేకించబడ్డారని (యెష. 61:1), పరిచర్య కోసమే పిలువబడ్డారని మనం మర్చిపోకూడదు.” 1888 వాచ్‌ టవర్‌ పత్రిక ఇలా సలహా ఇచ్చింది: “మన బాధ్యత ఏమిటో స్పష్టం చేయబడింది. . . . ఆ బాధ్యతను నిర్లక్ష్యం చేసినా, లేదా దాన్ని తప్పించుకోవడానికి సాకులు వెదికినా, మనం సోమరిపోతు దాసుల్లా ఉంటాం. అలా, మనం పిలువబడిన ఉన్నతమైన పిలుపుకు అనర్హులం అవుతాం.”

24, 25. (ఎ) రస్సెల్‌, అతని సహచరులు ప్రకటించమని ప్రజల్ని ప్రోత్సహించడంతో పాటు ఇంకా ఏమి చేశారు? (బి) ఏ వాహనాలూ లేని రోజుల్లో తాను చేసిన ప్రకటనా పని గురించి ఒక కల్‌పోర్చర్‌ ఏమి చెప్పాడు?

24 సహోదరుడు రస్సెల్‌, అతని సహచరులు ప్రకటించమని ప్రజల్ని ప్రోత్సహించడంతో పాటు, బైబిలు విద్యార్థుల కరపత్రాలు (ఇంగ్లీషు) అనే కరపత్రాలను ప్రచురించారు. తర్వాత, అవి ఓల్డ్‌ థియాలజీ క్వాటర్లీ అని పిలువబడ్డాయి. వాచ్‌ టవర్‌ పాఠకులు ఆ కరపత్రాలను అందుకున్నాక, వాటిని ప్రజలకు ఉచితంగా పంచిపెట్టేవాళ్లు.

మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవాలి: ‘నా జీవితంలో ప్రకటనా పనికే మొదటి స్థానం ఇస్తున్నానా?’

25 పూర్తికాల పరిచర్యకే అంకితమైన వాళ్లను కల్‌పోర్చర్లు అని పిలిచేవాళ్లు. పైన ప్రస్తావించిన ఛార్లెస్‌ కేపన్‌ కూడా వాళ్లలో ఒకరు. ఆయన ఇలా గుర్తుచేసుకున్నాడు: “నేను అమెరికా భూవిజ్ఞాన సర్వేవాళ్లు తయారు చేసిన మ్యాప్‌లను ఉపయోగించి, పెన్సిల్వేనియాలో నా క్షేత్రాన్ని పూర్తిచేశాను. ఆ మ్యాపుల్లో దారులు స్పష్టంగా ఉండేవి. వాటి సహాయంతో, ప్రతీ జిల్లాలో ప్రతీ ప్రాంతానికి కాలినడకన వెళ్లాను. ఒక్కోసారి, మూడు రోజులపాటు ఏదైనా ఒక ఊరిలో తిరిగి, స్టడీస్‌ ఇన్‌ ద స్క్రిప్చర్స్‌ పుస్తకాలు ఎవరెవరికి కావాలో రాసుకునేవాణ్ణి. తర్వాత ఒక గుర్రపుబండిని అద్దెకు తీసుకుని ఆ పుస్తకాలను వాళ్లకు అందజేసేవాణ్ణి. తరచూ రైతుల దగ్గర ఆగి, రాత్రుళ్లు వాళ్ల దగ్గరే బస చేసేవాణ్ణి. ఆ రోజుల్లో అసలు వాహనాలే ఉండేవి కాదు.”

ఒక కల్‌పోర్చర్‌. అతని గుర్రపుబండి మీద కనిపిస్తున్న “చార్ట్‌ ఆఫ్‌ ది ఏజెస్‌” చిత్రం

26. (ఎ) దేవుని ప్రజలు క్రీస్తు పరిపాలనకు సిద్ధంగా ఉండాలంటే, ప్రకటనా పనిలో పాల్గొనడం ఎందుకు ప్రాముఖ్యం? (బి) మనల్ని మనం ఏమని ప్రశ్నించుకోవాలి?

26 అలా ప్రకటించాలంటే చాలా ధైర్యం, ఉత్సాహం కావాలి. ఒకవేళ ప్రకటనా పని ఎంత ప్రాముఖ్యమైందో దేవుని ప్రజలు అర్థం చేసుకొనివుండకపోతే, యేసు పరిపాలనకు వాళ్లు సిద్ధంగా ఉండేవాళ్లా? ఖచ్చితంగా కాదు! ఎందుకంటే, యేసు ప్రత్యక్షతా కాలంలో ప్రకటనా పని అసాధారణమైన ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. (మత్త. 24:14) ప్రాణాలు కాపాడే ఆ పనికి తమ జీవితంలో మొదటి స్థానం ఇవ్వాలంటే, వాళ్లు దానికోసం ముందుగానే సిద్ధం చేయబడాలి. మనల్ని మనం ఇలా ప్రశ్నించుకుందాం: ‘నా జీవితంలో ప్రకటనా పనికి మొదటి స్థానం ఇస్తున్నానా? దానిలో పూర్తిగా భాగం వహించడం కోసం త్యాగాలు చేస్తున్నానా?’

దేవుని రాజ్యం స్థాపించబడింది!

27, 28.అపొస్తలుడైన యోహాను ఒక దర్శనంలో ఏమి చూశాడు? రాజ్యం స్థాపించబడినప్పుడు సాతాను, అతని చెడ్డ దూతలు ఎలా స్పందించారు?

27 చివరికి ఆ ప్రాముఖ్యమైన సంవత్సరం, అంటే 1914 రానేవచ్చింది. ఈ అధ్యాయం ఆరంభంలో చర్చించినట్లుగా, పరలోకంలో జరిగిన మహిమాన్విత సంఘటనల్ని మనుషులెవరూ చూడలేదు. అయితే, అపొస్తలుడైన యోహాను వాటిని ఒక దర్శనంలో చూశాడు. అతనికి పరలోకంలో “ఒక గొప్ప సూచన” కనిపించింది. దేవుని “స్త్రీ,” అంటే ఆత్మప్రాణులతో ఏర్పడిన పరలోక సంస్థ, గర్భవతియై ఒక మగబిడ్డను కనింది. ఆ బిడ్డ “ఇనుపదండంతో అన్ని దేశాల్ని పరిపాలిస్తాడు.” పుట్టగానే, ఆ బిడ్డను “సింహాసనం మీద కూర్చొని ఉన్న దేవుని దగ్గరకు తీసుకువెళ్లారు.” అప్పుడు, పరలోకంలో ఒక పెద్ద స్వరం ఇలా చెప్పింది: “ఇప్పుడు రక్షణ, శక్తి, రాజ్యం మన దేవునివి అయ్యాయి. అధికారం ఆయన క్రీస్తుకు వచ్చింది.”—ప్రక. 12:1, 5, 10.

28 దర్శనంలో యోహాను చూసింది, మెస్సీయ రాజ్యం స్థాపించబడడాన్నే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. అది నిజంగా మహిమాన్వితమైన సంఘటన. కానీ సాతానుకు, అతని చెడ్డ దూతలకు అది నచ్చలేదు. దాంతో, వాళ్లు మిఖాయేలు నాయకత్వం కింద ఉన్న నమ్మకమైన దూతలతో తలపడ్డారు. అప్పుడేమి జరిగింది? “ఆ మహాసర్పం కిందికి పడవేయబడింది. అది మొదటి సర్పం. దానికి అపవాది, సాతాను అనే పేర్లు ఉన్నాయి. అతడు లోకమంతటినీ మోసం చేస్తున్నాడు. అతడు భూమ్మీద పడవేయబడ్డాడు, అతడి దూతలు కూడా అతడితోపాటు పడవేయబడ్డారు.”—ప్రక. 12:7, 9.

1914లో యేసు రాజయ్యాడని బైబిలు విద్యార్థులు గుర్తించారు

29, 30. మెస్సీయ రాజ్యం స్థాపించబడినప్పుడు (ఎ) భూమ్మీద అలాగే (బి) పరలోకంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి?

29 1914లో శ్రమ మొదలౌతుందని బైబిలు విద్యార్థులు ఎన్నో సంవత్సరాల ముందే తెలియజేశారు. కానీ, వాళ్లు చెప్పిన మాట అంత ఖచ్చితంగా నెరవేరుతుందని వాళ్లు కూడా ఊహించివుండరు. ఆ సమయంలో మనుషులపై సాతాను ప్రభావం ఇంకా ఎక్కువౌతుందని సూచిస్తూ, యోహాను ఇలా రాశాడు: “భూమికి, సముద్రానికి శ్రమ. ఎందుకంటే అపవాది తనకు కొంచెం సమయమే ఉందని తెలిసి చాలా కోపంతో మీ దగ్గరికి దిగివచ్చాడు.” (ప్రక. 12:12) 1914లో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆ విధంగా, క్రీస్తు ప్రత్యక్షతకు సంబంధించిన సూచన భూవ్యాప్తంగా నెరవేరడం ప్రారంభమైంది, అలాగే ఈ వ్యవస్థకు ‘చివరి రోజులు’ మొదలయ్యాయి.—2 తిమో. 3:1.

30 కానీ పరలోకంలో సంతోషం వెల్లివిరిసింది. ఎందుకంటే సాతాను, అతని చెడ్డ దూతలు పరలోకం నుండి శాశ్వతంగా తొలగించబడ్డారు. యోహాను ఇంకా ఇలా చెప్పాడు: “పరలోకమా, పరలోక నివాసులారా, సంతోషించండి!” (ప్రక. 12:12) పరలోకం శుభ్రం చేయబడింది; యేసు రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించాడు; కాబట్టి, మెస్సీయ రాజ్యం భూమ్మీదున్న దేవుని ప్రజల పక్షాన చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. అది ఏ చర్య తీసుకుంటుంది? ఈ అధ్యాయం ఆరంభంలో చూసినట్లు, ‘ఒప్పంద సందేశకుడైన’ క్రీస్తు, ముందుగా భూమ్మీదున్న దేవుని సేవకుల్ని శుద్ధీకరిస్తాడు. అంటే ఏమి చేస్తాడు?

పరీక్షించబడే కాలం

31. శుద్ధీకరించే సమయం గురించి మలాకీ ఏమి ప్రవచించాడు? ఆ ప్రవచనం ఎలా నెరవేరింది? (అధస్సూచి చూడండి.)

31 శుద్ధీకరించే ప్రక్రియ అంత సాఫీగా సాగదని మలాకీ ప్రవచించాడు. అతను ఇలా రాశాడు: “ఆయన వచ్చుదినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్నివంటివాడు, చాకలివాని సబ్బువంటి వాడు.” (మలా. 3:2) ఆ మాటలు నిజమయ్యాయి. భూమ్మీదున్న దేవుని ప్రజలు 1914 నుండి ఎన్నో కష్టాలు, తీవ్రమైన పరీక్షలు ఎదుర్కొన్నారు. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో, చాలామంది బైబిలు విద్యార్థులు క్రూరంగా హింసించబడ్డారు, జైల్లో వేయబడ్డారు. d

32. 1916లో సంస్థకు లోపలి నుండి కూడా ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి?

32 వాటికి తోడు, సంస్థకు లోపలి నుండి కూడా కష్టాలు ఎదురయ్యాయి. 1916లో సహోదరుడు రస్సెల్‌ 64 ఏళ్లకే చనిపోవడంతో, చాలామంది దేవుని ప్రజలు విభ్రాంతికి గురయ్యారు. ఎందుకంటే, వాళ్లు అతని మీద మితిమీరిన అభిమానం పెంచుకున్నారు. సహోదరుడు రస్సెల్‌ అలాంటి గౌరవాన్ని ఎన్నడూ కోరుకోలేదు. అయినప్పటికీ, కొంతమంది అతని మీద పూజ్య భావాన్ని పెంచుకున్నారు. అతను చనిపోతే సత్యం ఇక వెల్లడి అవ్వదని అనుకున్నారు. కొంతమందైతే, సంస్థ చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా అడ్డుకున్నారు. దానివల్ల సంస్థలో మతభ్రష్టత్వం మొదలై, విభజనలు ఏర్పడ్డాయి.

33. అనుకున్నవి జరగకపోవడం వల్ల దేవుని ప్రజల విశ్వాసం ఎలా పరీక్షించబడింది?

33 అనుకున్నవి జరగకపోవడం వల్ల కూడా వాళ్ల విశ్వాసం పరీక్షించబడింది. అన్య జనులకు నియమించిన కాలాలు 1914లో పూర్తి అవుతాయని వాళ్లకు తెలుసు కానీ, ఆ సంవత్సరంలో ఖచ్చితంగా ఏమి జరుగుతుందో మాత్రం వాళ్లకు తెలీదు. (లూకా 21:24) 1914లో క్రీస్తు తన పెళ్లికూతుర్ని, అంటే అభిషిక్తుల్ని పరలోకంలో తనతోపాటు పరిపాలించడానికి తీసుకెళ్తాడని వాళ్లు అనుకున్నారు. కానీ వాళ్ల కలలు నిజం కాలేదు. అంతేకాదు, 40 సంవత్సరాల కోతకాలం 1918 వసంతకాలంలో ముగుస్తుందని 1917 చివర్లో వచ్చిన వాచ్‌ టవర్‌ పత్రిక ప్రకటించింది. కానీ ఆ సంవత్సరంలో ప్రకటనా పని ముగియలేదు. నిజానికి, ఆ సంవత్సరం నుండే అది ఇంకా వేగం పుంజుకుంది. అయితే, కోతకాలం ముగిసింది గానీ పరిగె ఏరే కాలం ఇంకా ఉందని ఆ తర్వాత వచ్చిన సంచిక స్పష్టం చేసింది. అయినప్పటికీ, చాలామంది నిరుత్సాహపడి యెహోవాను సేవించడం మానేశారు.

34. 1918లో ఎలాంటి కఠినమైన పరీక్ష ఎదురైంది? దేవుని ప్రజలు ‘చనిపోయారని’ క్రైస్తవ మత సామ్రాజ్యం ఎందుకు అనుకుంది?

34 1918లో ఇంకా కఠినమైన పరీక్ష ఎదురైంది. సి. టి. రస్సెల్‌ చనిపోయాక అతని స్థానంలో వచ్చిన జె. ఎఫ్‌. రూథర్‌ఫర్డ్‌ను, మరో ఏడుగురు సహోదరులను అరెస్టు చేశారు. వాళ్లకు అన్యాయంగా ఎన్నో సంవత్సరాల జైలు శిక్ష విధించి, వాళ్లను అమెరికాలోని జార్జియాలో అట్లాంటా సెంట్రల్‌ జైలుకు పంపించారు. దాంతో దేవుని ప్రజల ప్రకటనా పని కుంటుబడినట్లు అనిపించింది. అప్పుడు క్రైస్తవ మత సామ్రాజ్యపు నాయకుల్లో చాలామంది సంతోషించారు. “నాయకులు” జైల్లో వేయబడ్డారు, బ్రూక్లిన్‌లోని ప్రధాన కార్యాలయం మూతపడింది, అమెరికాలో అలాగే యూరప్‌లో ప్రకటనా పని నిషేధించబడింది. కాబట్టి బైబిలు విద్యార్థులు ‘చనిపోయారనీ,’ వాళ్లిక రారనీ ఆ మతనాయకులు అనుకున్నారు. (ప్రక. 11:3, 7-10) కానీ వాళ్లు ఎంత పొరబడుతున్నారో కదా!

తిరిగి బలపడిన సమయం!

35. తన ప్రజలు కష్టాలు ఎదుర్కొనేలా యెహోవా ఎందుకు అనుమతించాడు? ఆ సమయంలో యేసు ఏ చర్య తీసుకున్నాడు?

35 తన ప్రజల్ని శుద్ధీకరించడం కోసం యెహోవాయే ఆ కష్టాల్ని అనుమతించాడని యేసుకు తెలుసు. కానీ ఆ విషయం శత్రువులకు తెలీదు. (మలా. 3:3) అగ్నిలాంటి పరీక్షల్ని అనుమతిస్తే నమ్మకమైన ప్రజలెవరో తెలుస్తుందనీ, వాళ్లు మరింత మెరుగౌతారనీ, శుద్ధి చేయబడతారనీ, తమ రాజుకు ఇంకా బాగా సేవ చేయగలుగుతారనీ యెహోవాకు, యేసుకు తెలుసు. ఆశ్చర్యకరంగా, 1919 ప్రారంభంలోనే నమ్మకమైన దేవుని ప్రజలు ఆ పరీక్షల్ని తట్టుకుని తిరిగి బలం పుంజుకున్నారు! అలా, అసాధ్యమని శత్రువులు అనుకున్నదాన్ని దేవుని పవిత్రశక్తి సుసాధ్యం చేసింది. (ప్రక. 11:11) ఆ సమయంలో, యేసు తన ప్రత్యక్షతకు సంబంధించిన సూచనలోని ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని నెరవేర్చాడు. ఆయన ‘నమ్మకమైన, బుద్ధిగల దాసుణ్ణి,’ అంటే తన ప్రజలకు సరైన సమయంలో ఆధ్యాత్మిక ఆహారాన్ని అందిస్తూ, వాళ్లకు నాయకత్వం వహించే అభిషిక్త పురుషుల చిన్న గుంపును నియమించాడు.—మత్త. 24:45-47.

36. దేవుని ప్రజలు ఆధ్యాత్మికంగా తిరిగి బలం పుంజుకున్నారని ఎలా చెప్పవచ్చు?

36 1919, మార్చి 26న సహోదరుడు రూథర్‌ఫర్డ్‌, అతని సహచరులు జైలు నుండి విడుదలయ్యారు. వెంటనే, ఆ సంవత్సరం సెప్టెంబరులో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు, ద గోల్డెన్‌ ఏజ్‌ అనే మరో పత్రికను ప్రారంభించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ద వాచ్‌ టవర్‌ పత్రికతో పాటు పరిచర్యలో ఉపయోగించడం కోసం దాన్ని రూపొందించారు. e అదే సంవత్సరంలో బులెటిన్‌ మొదటి సంచిక విడుదలైంది. దాన్నే ప్రస్తుతం మన క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ వర్క్‌బుక్‌ అని పిలుస్తున్నాం. అది ముఖ్యంగా, పరిచర్య విషయంలో దేవుని ప్రజల్ని ప్రోత్సహించడానికి రూపొందించబడింది. అందుకే, 1919 నుండి ఇంటింటి పరిచర్య ఊపు అందుకుంది.

37. 1919 తర్వాతి సంవత్సరాల్లో కొంతమంది ఎలా అవిశ్వసనీయులుగా మారారు?

37 ప్రకటనా పని క్రీస్తు సేవకుల్ని శుద్ధీకరించింది. ఏ విధంగా? ప్రకటనా పని చేయాలంటే చాలా వినయం కావాలి. కాబట్టి గర్వం, అహంకారం ఉన్నవాళ్లందరూ ఆ పని నుండి పక్కకు తప్పుకున్నారు. అంతేకాదు, వాళ్లు నమ్మకమైన ప్రజలతో సహవాసం మానుకున్నారు. 1919 తర్వాతి సంవత్సరాల్లో, కొంతమంది అవిశ్వసనీయులుగా మారి సంస్థ మీద చాడీలు చెప్పడం, దాన్ని దూషించడం మొదలుపెట్టారు. చివరికి, దేవుని ప్రజల్ని హింసిస్తున్న శత్రువులతో చేతులు కలిపారు.

38. భూమ్మీద క్రీస్తు అనుచరులు సాధించిన ప్రతీ గెలుపు, ప్రతీ విజయం ఏమి నిరూపించింది?

38 అలాంటి పరీక్షలు, కష్టాలు ఎదురైనా భూమ్మీదున్న క్రీస్తు అనుచరులు ఆధ్యాత్మికంగా నిలదొక్కుకుని, అభివృద్ధి సాధించారు. వాళ్లు సాధించిన ప్రతీ గెలుపు, ప్రతీ విజయం దేవుని రాజ్య పరిపాలన మొదలైందని తిరుగులేని విధంగా నిరూపించింది! అపరిపూర్ణ మనుషుల ఒక చిన్న గుంపు సాతాను మీద, ఈ లోక వ్యవస్థ మీద ప్రతీసారి విజయం సాధిస్తుందంటే, అది కేవలం యెహోవా తన కొడుకు ద్వారా, మెస్సీయ రాజ్యం ద్వారా అందిస్తున్న సహాయం వల్లే!—యెషయా 54:17 చదవండి.

జైలు నుండి విడుదలైన కొన్ని నెలలకే, సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ ఒక సమావేశంలో ఉత్తేజకరమైన ప్రసంగాన్ని ఇస్తున్నాడు

39, 40. (ఎ) ఈ ప్రచురణలో ఏయే విషయాలు పరిశీలిస్తాం? (బి) ఈ పుస్తకాన్ని అధ్యయనం చేయడం వల్ల మీరు ఎలాంటి ప్రయోజనం పొందవచ్చు?

39 దేవుని రాజ్యం ఇప్పటికే వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ వంద సంవత్సరాల్లో, అది భూమ్మీద ఏమి సాధించిందో మనం తర్వాతి అధ్యాయాల్లో పరిశీలిస్తాం. ఈ పుస్తకంలో ఉన్న ఏడు భాగాల్లో, రాజ్యం వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధి గురించి తెలుసుకుంటాం. అంతేకాదు, ప్రతీ అధ్యాయం చివర్లో ఉన్న పునఃసమీక్ష బాక్సు, రాజ్యం మనకెంత వాస్తవికంగా ఉందో వ్యక్తిగతంగా పరిశీలించుకోవడానికి సహాయం చేస్తుంది. రాజ్యం త్వరలోనే చెడ్డవాళ్లను నాశనం చేసి, భూమిని పరదైసుగా మార్చడం గురించి ఈ పుస్తకంలోని చివరి అధ్యాయాలు చర్చిస్తాయి. ఈ ప్రచురణను అధ్యయనం చేయడం వల్ల మీరెలా ప్రయోజనం పొందవచ్చు?

40 దేవుని రాజ్యం మీద మీకున్న విశ్వాసాన్ని నీరుగార్చాలని సాతాను ప్రయత్నిస్తున్నాడు. కానీ యెహోవా మాత్రం మీ విశ్వాసాన్ని బలపర్చి, మిమ్మల్ని కాపాడాలని, మిమ్మల్ని శక్తిమంతుల్ని చేయాలని కోరుకుంటున్నాడు. (ఎఫె. 6:16) కాబట్టి ఈ ప్రచురణను ప్రార్థనాపూర్వకంగా అధ్యయనం చేయమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం. ఈ పుస్తకం చదువుతున్నంతసేపూ ‘దేవుని రాజ్యం నిజంగా పరిపాలిస్తోందని నేను నమ్ముతున్నానా?’ అని ప్రశ్నించుకుంటూ ఉండండి. దేవుని రాజ్యం పరిపాలిస్తోందని ఇప్పుడు నమ్మితేనే, భవిష్యత్తులో మీరు దానికి ఉత్సాహంగా మద్దతివ్వగలుగుతారు. ఆ రోజున, భూమ్మీద సజీవంగా ఉన్న ప్రతీఒక్కరు దేవుని రాజ్యం నిజమైనదని, అది పరిపాలిస్తోందని ఒప్పుకుంటారు!

a గ్ర్యూ, స్టెట్సన్‌, స్టార్జ్‌ గురించి మరింత సమాచారం కోసం, యెహోవాసాక్షులు—దేవుని రాజ్య ప్రచారకులు (ఇంగ్లీషు) అనే పుస్తకంలో 45-46 పేజీలు చూడండి.

b ఈ లోకంతో స్నేహం చేస్తున్న మత సంస్థలతో తెగతెంపులు చేసుకోవడం ప్రాముఖ్యమని బైబిలు విద్యార్థులు గ్రహించారు. అయినప్పటికీ, విమోచన క్రయధనాన్ని నమ్ముతున్నామని, దేవునికి సమర్పించుకున్నామని చెప్పుకుంటూనే చర్చికి వెళ్తున్నవాళ్లను క్రైస్తవ సహోదరులుగానే పరిగణించారు.

c మొదట్లో అలాంటి హెచ్చరికల్ని నిర్లక్ష్యం చేయడానికి కారణం, అవి ముఖ్యంగా చిన్నమందకు అంటే 1,44,000 మందికి మాత్రమే వర్తిస్తాయని అనుకోవడం. 1935కు ముందు, ప్రకటన 7:9, 10 లోని ‘గొప్పసమూహంలో’ క్రైస్తవ మత సామ్రాజ్యానికి చెందిన చర్చి సభ్యులు ఉంటారని, అంతం సమయంలో క్రీస్తు పక్షాన నిలబడినందుకు వాళ్లు పరలోకానికి వెళ్లే రెండో తరగతిగా ఏర్పడతారని బైబిలు విద్యార్థులు అనుకున్నారు. దాని గురించి మనం ఈ పుస్తకంలోని 5వ అధ్యాయంలో చర్చిస్తాం.

d సెప్టెంబరు 1920లో ద గోల్డెన్‌ ఏజ్‌ (ప్రస్తుతం తేజరిల్లు!) పత్రిక ప్రత్యేక సంచికను ప్రచురించారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో కెనడా, ఇంగ్లాండ్‌, జర్మనీ, అమెరికా వంటి దేశాల్లో దేవుని ప్రజలు ఎంత క్రూరంగా హింసించబడ్డారో అది వివరించింది. దానికి ముందు దశాబ్దాల్లో, బైబిలు విద్యార్థులు అలాంటి ఘోరమైన హింసను ఎన్నడూ అనుభవించలేదు.

e చాలా సంవత్సరాల వరకు, ద వాచ్‌ టవర్‌ పత్రిక ముఖ్యంగా చిన్నమందలోని సభ్యుల్ని బలపర్చడం కోసమే తయారు చేయబడింది.