కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

5

రాజ్యానికి సంబంధించిన సత్యాలపై రాజు వెలుగు ప్రసరింపజేశాడు

రాజ్యానికి సంబంధించిన సత్యాలపై రాజు వెలుగు ప్రసరింపజేశాడు

ఈ అధ్యాయంలోని ముఖ్యాంశం

దేవుని ప్రజలు రాజ్యం గురించి, దాని పరిపాలకుల గురించి, పౌరుల గురించి, రాజ్యానికి విశ్వసనీయంగా ఉండడం గురించి అర్థం చేసుకున్నారు

1, 2. యేసు ఒక తెలివైన గైడు అని ఎందుకు చెప్పవచ్చు?

 మీరు ఒక అందమైన పట్టణాన్ని చూడడానికి వెళ్లారని ఊహించుకోండి. అక్కడున్న అనుభవం గల ఒక గైడు, మీకు అన్నీ చూపిస్తూ వివరిస్తున్నాడు. మీకూ, మీతోపాటు ఉన్నవాళ్లకూ ఆ పట్టణం కొత్త. కాబట్టి మీరు ఆ గైడు చెప్పే ప్రతీ మాటను జాగ్రత్తగా వింటున్నారు. మీరు ఆ పట్టణంలో ఉన్న కొన్ని ప్రదేశాల్ని ఇంకా చూడకముందే, వాటి గురించి కుతూహలంతో ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. కానీ గైడు ఆ సమయంలో జవాబివ్వకుండా, ఆ ప్రదేశాలకు చేరుకుంటున్న సమయంలో జవాబిచ్చాడు. అంటే, అతను మీరు అడిగిన వివరాల్ని సరైన సమయంలో వెల్లడి చేశాడు. కాబట్టి, అతని తెలివిని చూసి మీరు ఎంతో ముగ్ధులౌతారు.

2 నిజ క్రైస్తవుల్ని ఆ టూరిస్టులతో పోల్చవచ్చు. వాళ్లు అత్యంత ప్రాముఖ్యమైన పట్టణం గురించి, అంటే ‘నిజమైన పునాదులుగల పట్టణమైన’ దేవుని రాజ్యం గురించి తెలుసుకోవాలనే కుతూహలంతో ఉన్నారు. (హెబ్రీ. 11:10) యేసు భూమ్మీదున్నప్పుడు, ఒక గైడులా తన అనుచరులకు దేవుని రాజ్యం గురించి ఎన్నో విషయాలు తెలియజేశాడు. ఆయన, వాళ్లు అడిగిన ప్రతీ ప్రశ్నకు జవాబిచ్చి, రాజ్యం గురించిన వివరాలన్నిటినీ ఒకేసారి వెల్లడి చేశాడా? లేదు. ఆయన ఇలా అన్నాడు: “నేను మీకు చెప్పాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు మీరు వాటిని అర్థం చేసుకోలేరు.” (యోహా. 16:12) తన శిష్యులు అర్థం చేసుకోలేని విషయాలతో యేసు వాళ్లను ఉక్కిరిబిక్కిరి చేయలేదు గానీ ఒక తెలివైన గైడులా వ్యవహరించాడు.

3, 4. (ఎ) చనిపోయిన తర్వాత కూడా, యేసు తన అనుచరులకు రాజ్యం గురించి ఎలా బోధించాడు? (బి) ఈ అధ్యాయంలో ఏమి పరిశీలిస్తాం?

3 యోహాను 16:12 లో నమోదైన ఆ మాటల్ని యేసు తన భూజీవితపు చివరి రోజున చెప్పాడు. చనిపోయిన తర్వాత కూడా, ఆయన దేవుని రాజ్యం గురించిన విషయాల్ని ఎలా చెప్పగలడు? ఆయన తన అపొస్తలులకు ఇలా అభయం ఇచ్చాడు: “సత్యాన్ని వెల్లడిజేసే పవిత్రశక్తి . . . మీరు సత్యాన్ని పూర్తిగా అర్థం చేసుకునేలా సహాయం చేస్తూ మిమ్మల్ని నడిపిస్తాడు.” a (యోహా. 16:13) పవిత్రశక్తిని కూడా, అన్నీ ఓపిగ్గా వివరించే ఒక గైడుతో పోల్చవచ్చు. యేసు పవిత్రశక్తి ద్వారా, తన అనుచరులకు దేవుని రాజ్యం గురించిన విషయాల్ని సరైన సమయంలో వెల్లడి చేస్తాడు.

4 నిజ క్రైస్తవులు పవిత్రశక్తి సహాయంతో రాజ్యం గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. దేవుని రాజ్య పరిపాలన ఎప్పుడు మొదలైంది; ఆ రాజ్య పాలకులు, పౌరులు ఎవరు; వాళ్లకు ఏ నిరీక్షణలు ఉన్నాయి; రాజ్యానికి విశ్వసనీయంగా ఉండడం అంటే ఏమిటి వంటి విషయాల గురించి దేవుని ప్రజలు ఏమి అర్థం చేసుకున్నారో ఇప్పుడు పరిశీలిద్దాం.

ఒక ప్రాముఖ్యమైన సంవత్సరాన్ని అర్థం చేసుకోవడం

5, 6. (ఎ) రాజ్యం స్థాపించబడడం గురించి, కోతకాలం గురించి బైబిలు విద్యార్థులు మొదట్లో ఏమి అనుకున్నారు? (బి) వాళ్లు అలా తప్పుగా అర్థం చేసుకున్నంత మాత్రాన, యేసు వాళ్లను నిర్దేశించట్లేదని మనం ఎందుకు అనుకోకూడదు?

5 ఈ పుస్తకంలోని 2వ అధ్యాయంలో చూసినట్లుగా, బైబిలు ప్రవచనాల నెరవేర్పుకు సంబంధించి 1914 చాలా ప్రాముఖ్యమైన సంవత్సరమని, బైబిలు విద్యార్థులు దశాబ్దాల ముందే తెలియజేశారు. అయితే, క్రీస్తు ప్రత్యక్షత 1874లో మొదలైందని, 1878లో క్రీస్తు పరలోకంలో పరిపాలించడం మొదలుపెట్టాడని, 1914 అక్టోబరు కల్లా ఆయన రాజ్యాన్ని పూర్తిగా స్థాపిస్తాడని వాళ్లు అనుకున్నారు. అంతేకాదు, కోతకాలం 1874 నుండి 1914 వరకు కొనసాగుతుందని, అభిషిక్తులు పరలోకానికి సమకూర్చబడడంతో అది ముగుస్తుందని వాళ్లు అనుకున్నారు. అలా వాళ్లు కొన్ని విషయాల్ని తప్పుగా అర్థం చేసుకున్నంతమాత్రాన, యేసు పవిత్రశక్తి ద్వారా వాళ్లను నిర్దేశించట్లేదని మనం అనుకోవాలా?

6 లేదు! మొదటి పేరాలో ఉన్న ఉదాహరణ గురించి మళ్లీ ఒకసారి ఆలోచించండి. ఆ టూరిస్టులు ముందుగానే కొన్ని అభిప్రాయాలు ఏర్పర్చుకుని, కుతూహలంతో ప్రశ్నలు అడిగినంత మాత్రాన, ఆ గైడు వాళ్లను సరిగా నిర్దేశించట్లేదని మనం అనుకోవాలా? లేదు! అదేవిధంగా, దేవుని ప్రజలు కొన్ని విషయాల్ని పవిత్రశక్తి వెల్లడి చేయకముందే తెలుసుకోవాలని ప్రయత్నించినంత మాత్రాన, యేసు వాళ్లను నిర్దేశించట్లేదని మనం అనుకోకూడదు. నిజానికి వాళ్లు తమ అభిప్రాయాలను సరిదిద్దుకోవడానికి వినయంగా, సిద్ధంగా ఉన్నారు కాబట్టి యేసు వాళ్లకు ఎన్నో విషయాలు తెలియజేశాడు.—యాకో. 4:6.

7. దేవుని ప్రజల మీద మరింత వెలుగు ఎలా ప్రకాశించింది?

7 1919 తర్వాతి సంవత్సరాల్లో, దేవుని ప్రజల మీద మరింత వెలుగు ప్రకాశించింది. (కీర్తన 97:11 చదవండి.) 1925 వాచ్‌ టవర్‌ పత్రికలో వచ్చిన “ఒక జనాంగం పుట్టుక” అనే ఆర్టికల్‌, మెస్సీయ రాజ్యం 1914లో స్థాపించబడిందని లేఖనాధార రుజువులతో సహా వివరించింది. అంతేకాదు, ప్రకటన 12వ అధ్యాయంలో పరలోక స్త్రీ ఒక బిడ్డకు జన్మనివ్వడం గురించిన ప్రవచనం, మెస్సీయ రాజ్యం స్థాపించబడినప్పుడు నెరవేరిందని కూడా ఆ ఆర్టికల్‌ తెలియజేసింది. b అలాగే, మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో దేవుని ప్రజలు ఎదుర్కొన్న హింసలకు, శ్రమలకు కారణం, సాతాను పరలోకం నుండి పడద్రోయబడడమే అనీ, “తనకు కొంచెం సమయమే ఉందని తెలిసి” సాతాను చాలా కోపంతో ఉన్నాడనీ ఆ ఆర్టికల్‌ వివరించింది.—ప్రక. 12:12.

8, 9. (ఎ) రాజ్యం అన్నిటికన్నా ప్రాముఖ్యమైనదని దేవుని ప్రజలు ఎలా గ్రహించారు? (బి) ఇప్పుడు మనం ఏ ప్రశ్నల్ని పరిశీలిస్తాం?

8 మెస్సీయ రాజ్యం ఎంత ప్రాముఖ్యమైనది? విమోచన క్రయధనం ద్వారా మనుషులు రక్షణ పొందడం కన్నా, మెస్సీయ రాజ్యమే అత్యంత ప్రాముఖ్యమని వాచ్‌ టవర్‌ పత్రిక 1928 నుండి నొక్కిచెప్పడం మొదలుపెట్టింది. ఎందుకంటే, మెస్సీయ రాజ్యం ద్వారానే యెహోవా తన పేరును పవిత్రపర్చుకుంటాడు, తన సర్వాధిపత్యాన్ని నిరూపించుకుంటాడు, మనుషుల విషయంలో తన సంకల్పాలన్నిటిని నెరవేరుస్తాడు.

9 ఆ రాజ్యంలో యేసుతోపాటు ఎవరు పరిపాలిస్తారు? ఆ రాజ్య పౌరులుగా భూమ్మీద ఎవరుంటారు? క్రీస్తు అనుచరులు చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఏమిటి?

కోతపనిలో భాగంగా అభిషిక్తుల్ని సమకూర్చడం

10. 1,44,000 సంఖ్య గురించి దేవుని ప్రజలు ఏమి అర్థం చేసుకున్నారు?

10 పరలోకంలో క్రీస్తుతోపాటు 1,44,000 మంది నమ్మకమైన అనుచరులు పరిపాలిస్తారని, దేవుని ప్రజలు 1914కు కొన్ని దశాబ్దాల ముందే అర్థం చేసుకున్నారు. c అంతేకాదు, 1,44,000 సంఖ్య అక్షరార్థమైనదని, దానిలోని సభ్యుల్ని యెహోవా మొదటి శతాబ్దం నుండే ఎంపిక చేసుకోవడం మొదలుపెట్టాడని వాళ్లు గ్రహించారు.

11. క్రీస్తుకు పెళ్లికూతురు అయ్యేవాళ్లు ఈ భూమ్మీద ఉన్నప్పుడు చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఏమిటి?

11 భవిష్యత్తులో క్రీస్తుకు పెళ్లికూతురుగా ఏర్పడే ఆ అభిషిక్తులు, భూమ్మీద ఉన్నప్పుడు ఏమి చేస్తారు? యేసు ప్రకటనా పనికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చాడని, దాన్ని కోతకాలంతో ముడిపెట్టాడని వాళ్లకు తెలుసు. (మత్త. 9:37; యోహా. 4:35) ఈ పుస్తకంలోని 2వ అధ్యాయంలో చూసినట్లుగా, కోతకాలం 40 ఏళ్లపాటు ఉంటుందని, అభిషిక్తులు పరలోకానికి సమకూర్చబడడంతో అది ముగుస్తుందని వాళ్లు అనుకున్నారు. కానీ, 40 ఏళ్లు పూర్తయ్యాక కూడా ఆ ప్రకటనా పని కొనసాగడంతో, వాళ్లకు మెరుగైన అవగాహన అవసరమైంది. అయితే, నేడు మనం ఆ విషయంలో స్పష్టమైన అవగాహన పొందాం. అదేంటంటే, గోధుమల్ని గురుగుల్ని, అంటే నమ్మకమైన అభిషిక్త క్రైస్తవుల్ని నకిలీ క్రైస్తవుల్ని వేరుచేసే కోతకాలం 1914లో మొదలైంది. కాబట్టి పరలోక నిరీక్షణ ఉన్న మిగతావాళ్లను సమకూర్చాల్సిన సమయం వచ్చింది!

కోతకాలం 1914లో మొదలైంది (11వ పేరా చూడండి)

12, 13. పదిమంది కన్యల గురించి, తలాంతుల గురించి యేసు చెప్పిన ఉదాహరణలు ఈ చివరి రోజుల్లో ఎలా నెరవేరాయి?

12 1919 నుండి, నమ్మకమైన బుద్ధిగల దాసుడు ప్రకటనా పని గురించి నొక్కిచెప్పేలా యేసు నిర్దేశించాడు. యేసు ఆ పనిని మొదటి శతాబ్దంలో అప్పగించాడు. (మత్త. 28:19, 20) అంతేకాదు, ఆ పని చేయడానికి తన అభిషిక్త అనుచరులకు ఏ లక్షణాలు ఉండాలో కూడా తెలియజేశాడు. పదిమంది కన్యల ఉదాహరణలో, అభిషిక్తులు మెలకువగా ఉంటూ ఆధ్యాత్మికంగా అప్రమత్తంగా ఉండాలని ఆయన చెప్పాడు. అలా మెలకువగా ఉంటేనే వాళ్లు తమ అంతిమ లక్ష్యాన్ని చేరుకోగలరు. అంటే, క్రీస్తు తన 1,44,000 మందితో కూడిన “పెళ్లికూతురి” చేతిని అందుకున్నప్పుడు పరలోకంలో జరిగే గొప్ప పెళ్లి విందులో వాళ్లు భాగం వహించగలరు. (ప్రక. 21:2) అలాగే, తలాంతుల ఉదాహరణలో, తమకు అప్పగించబడిన ప్రకటనా పనిలో అభిషిక్తులు కష్టపడి పనిచేయాలని యేసు వివరించాడు.—మత్త. 25:1-30.

13 గత వంద సంవత్సరాలుగా, అభిషిక్తులు ఆధ్యాత్మికంగా మెలకువగా ఉంటూ ప్రకటనా పనిలో కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి, వాళ్లు తప్పకుండా బహుమానం పొందుతారు! అయితే కోతకాలంలో 1,44,000 మందిలోని మిగతావాళ్లను సమకూర్చడం మాత్రమే జరుగుతుందా?

భూమ్మీద ఉండబోయే రాజ్య పౌరుల్ని సమకూర్చడం!

14, 15. మర్మము సమాప్తమాయెను (ఇంగ్లీషు) పుస్తకం ఏ నాలుగు గుంపుల గురించి చర్చించింది?

14 ప్రకటన 7:9-14 లో ప్రస్తావించబడిన “గొప్పసమూహం” ఎవరో తెలుసుకోవాలని దేవుని ప్రజలు ఎప్పటినుండో ఆత్రుతతో ఉన్నారు. యేసు వెల్లడి చేయకముందే, వాళ్లు దాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించడంవల్ల సరళంగా, స్పష్టంగా ఉన్న సత్యాల్ని కూడా గ్రహించలేకపోయారు. నేడు, మనం వాటిని గ్రహించినందుకు ఎంతో సంతోషిస్తున్నాం.

15 “పరలోకానికి వెళ్లేవాళ్లలో రెండు గుంపులు, భూమ్మీద ఉండేవాళ్లలో రెండు గుంపులు” ఉన్నాయని 1917లో మర్మము సమాప్తమాయెను (ఇంగ్లీషు) అనే పుస్తకం చెప్పింది. ఆ నాలుగు గుంపులవాళ్లు ఎవరు? వాళ్లకున్న నిరీక్షణలు ఏమిటి? మొదటి గుంపు ఎవరంటే, క్రీస్తుతోపాటు పరిపాలించే 1,44,000 మంది. రెండో గుంపు గొప్పసమూహం. ఈ గొప్పసమూహంలో, సత్యం తెలుసుకుని ఇంకా క్రైస్తవ మత సామ్రాజ్యపు చర్చీలకు వెళ్తున్న నామకార్థ క్రైస్తవులు ఉంటారని అప్పట్లో అనుకునేవాళ్లు. వాళ్లకు విశ్వాసం ఉంది కానీ, సత్యారాధన పక్షాన స్థిరంగా నిలబడేంత విశ్వాసం లేదు. కాబట్టి వాళ్లకు పరలోకంలో కొంచెం తక్కువ స్థానాలు ఇవ్వబడతాయని అనుకున్నారు. ఇక భూమి విషయానికొస్తే, అబ్రాహాము, మోషే, ఇతర నమ్మకస్థులు మూడో గుంపు, సామాన్య మనుషులు నాలుగో గుంపు. మూడో గుంపువాళ్లు నాలుగో గుంపుపై అధికారం చేస్తారని దేవుని ప్రజలు అనుకున్నారు.

16. 1923లో, 1932లో దేవుని ప్రజలు ఏ విషయాల్ని గ్రహించారు?

16 అయితే, క్రీస్తు అనుచరులు పవిత్రశక్తి సహాయంతో క్రమక్రమంగా సరైన అవగాహనకు వచ్చారు. ఉదాహరణకు 1923లో, క్రీస్తు పరిపాలన కింద భూమ్మీద జీవించే ఒక గుంపు ఉంటుందని ద వాచ్‌ టవర్‌ పత్రిక తెలియజేసింది. అంతేకాదు 1932లో, కావలికోట పత్రిక యెహోనాదాబు గురించి చర్చించింది. ఇశ్రాయేలు అభిషిక్త రాజైన యెహూ అబద్ధ మతంపై యుద్ధం చేస్తున్నప్పుడు, యెహోనాదాబు అతనికి మద్దతిచ్చాడు. (2 రాజు. 10:15-17) యెహోనాదాబు లాంటి ప్రజలు ఆధునిక కాలంలో కూడా ఉన్నారనీ, యెహోవా వాళ్లను “హార్‌మెగిద్దోన్‌” నుండి రక్షిస్తాడని, వాళ్లు ఇదే భూమ్మీద జీవిస్తారని ఆ ఆర్టికల్‌ చెప్పింది.

17. (ఎ) 1935లో ఏ విషయంపై పూర్తి అవగాహన వచ్చింది? (బి) ఆ కొత్త అవగాహనకు నమ్మకమైన క్రైస్తవులు ఎలా స్పందించారు? (“ చాలామంది హాయిగా ఊపిరి పీల్చుకున్నారు” అనే బాక్సు చూడండి.)

17 అయితే, 1935లో ఆ విషయంపై పూర్తి అవగాహన వచ్చింది. వాషింగ్టన్‌ డి.సి.లో జరిగిన ఒక సమావేశంలో, గొప్పసమూహంవాళ్లు ఈ భూమ్మీదే ఉంటారనీ, యేసు చెప్పిన గొర్రెలు మేకల ఉదాహరణలోని గొర్రెలు వాళ్లేననీ వివరించబడింది. (మత్త. 25:33-40) అంతేకాదు, “వాటిని కూడా నేను తీసుకొని రావాలి” అని యేసు చెప్పిన ‘వేరే గొర్రెల్లో’ వాళ్లు భాగమని ఆ సమావేశంలో వెల్లడైంది. (యోహా. 10:16) ఆ సమావేశంలో సహోదరుడు జె. ఎఫ్‌. రూథర్‌ఫర్డ్‌ ప్రసంగిస్తూ, “భూమ్మీద నిరంతరం జీవించే నిరీక్షణ ఉన్నవాళ్లంతా దయచేసి నిలబడతారా?” అని అడిగాడు. వెంటనే, ప్రేక్షకుల్లో సగం కన్నా ఎక్కువమంది లేచి నిలబడ్డారు. అప్పుడు “ఇదిగో, గొప్పసమూహం!” అని సహోదరుడు అన్నాడు. చాలామంది తమకున్న నిరీక్షణను అర్థం చేసుకుని సంతోషించారు.

18. క్రీస్తు అనుచరులు దేనిపై దృష్టిపెట్టారు? దాని ఫలితం ఏమిటి?

18 అప్పటినుండి దేవుని ప్రజలు, గొప్పసమూహంలోని సభ్యుల్ని సమకూర్చడంపై దృష్టిపెట్టేలా యేసు నిర్దేశించాడు. మొదట్లో, వాళ్లు తక్కువమందే ఉన్నట్లు అనిపించింది. అందుకే, ఒక సందర్భంలో సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ “‘గొప్పసమూహం’ నిజానికి అంత గొప్పగా ఉండదేమో” అని అన్నాడు. కానీ ఆ సమకూర్చే పనిని యెహోవా ఎంతగా ఆశీర్వదించాడో ఇప్పుడు మనం కళ్లారా చూస్తున్నాం. యేసు నిర్దేశం కింద, పవిత్రశక్తి నిర్దేశం కింద, అభిషిక్తులూ అలాగే ‘వేరే గొర్రెలకు’ చెందిన గొప్పసమూహం సభ్యులూ కలిసి, “ఒకే మందగా” తయారై “ఒకే కాపరి” కింద సేవ చేస్తున్నారు.

గొప్పసమూహం సభ్యుల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటుందో సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ ఊహించలేదు (ఎడమ నుండి కుడికి: నేథన్‌ హెచ్‌. నార్‌, జోసెఫ్‌ ఎఫ్‌. రూథర్‌ఫర్డ్‌, హేడెన్‌ సి. కోవింగ్టన్‌)

19. గొప్పసమూహం సభ్యుల్ని సమకూర్చడంలో మనమెలా భాగం వహించవచ్చు?

19 క్రీస్తు, 1,44,000 మంది కలిసి పరిపాలించే భూపరదైసులో, నమ్మకస్థులైన చాలామంది ప్రజలు నిత్యం జీవిస్తారు. దేవుని ప్రజలు భూనిరీక్షణ గురించి అర్థం చేసుకునేలా యేసు సహాయం చేయడం సంతోషించే విషయం కాదంటారా? ఆ నిరీక్షణ గురించి పరిచర్యలో కలిసే ప్రజలతో మాట్లాడడం ఎంత గొప్ప అవకాశమో కదా! కాబట్టి మన పరిస్థితులు అనుకూలించినంత మేరకు దానిలో చురుగ్గా పాల్గొందాం. అప్పుడు ఇంకా ఎక్కువమంది ప్రజలు గొప్పసమూహంలో సభ్యులు అవుతారు, అలాగే యెహోవా పేరుకు ఎక్కువ స్తుతి కలుగుతుంది!—లూకా 10:2 చదవండి.

గొప్పసమూహం సభ్యుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ ఉంది

రాజ్యానికి విశ్వసనీయంగా ఉండడం అంటే ఏమిటి?

20. సాతాను సంస్థలో ఏయే వ్యవస్థలు ఉన్నాయి? దేవుని రాజ్యానికి విశ్వసనీయంగా ఉండాలంటే ఏమి చేయాలి?

20 రాజ్యం గురించి తెలుసుకుంటున్న దేవుని ప్రజలు, దానికి విశ్వసనీయంగా ఉండడం అంటే ఏమిటో కూడా అర్థం చేసుకోవాలి. 1922లో ద వాచ్‌ టవర్‌ పత్రిక, ప్రస్తుతం రెండు సంస్థలు ఉనికిలో ఉన్నాయని, ఒకటి యెహోవా సంస్థ, మరొకటి సాతాను సంస్థ అని తెలియజేసింది. సాతాను సంస్థలో వాణిజ్య, మత, రాజకీయ వ్యవస్థలు ఉన్నాయని కూడా ఆ పత్రిక చెప్పింది. దేవుని రాజ్యానికి విశ్వసనీయంగా ఉండాలనుకునేవాళ్లు సాతాను సంస్థలోని ఏ వ్యవస్థలోనూ భాగం వహించకూడదు, తమ విశ్వసనీయత విషయంలో రాజీపడకూడదు. (2 కొరిం. 6:17) దాని అర్థం ఏమిటి?

21. (ఎ) నమ్మకమైన దాసుడు వాణిజ్య వ్యవస్థ గురించి ఎలా హెచ్చరించాడు? (బి) 1963లో కావలికోట పత్రిక “మహాబబులోను” గురించి ఏమి చెప్పింది?

21 వాణిజ్య వ్యవస్థలో ఉన్న అవినీతిని బయటపెడుతూ, దాని వస్తుసంపదల మోజులో చిక్కుకోవద్దని నమ్మకమైన దాసుడు ప్రచురణల ద్వారా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు. (మత్త. 6:24) అలాగే, సాతాను సంస్థలోని మత వ్యవస్థ గురించి కూడా మన ప్రచురణలు హెచ్చరించాయి. ఉదాహరణకు, 1963లో కావలికోట పత్రిక, “మహాబబులోను” క్రైస్తవ మత సామ్రాజ్యాన్ని మాత్రమే కాదుగానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అబద్ధ మతాలన్నిటినీ సూచిస్తుందని తెలియజేసింది. అంతేకాదు ప్రతీ దేశంలో, ప్రాంతంలో నివసిస్తున్న దేవుని ప్రజలు, దానినుండి “బయటికి” రావాలని, దాని అబద్ధ మత ఆచారాలన్నిటి నుండి తమను పవిత్రులుగా చేసుకోవాలని ప్రోత్సహించింది. ఈ పుస్తకంలోని 10వ అధ్యాయంలో దాని గురించి వివరంగా తెలుసుకుంటాం.—ప్రక. 18:2, 4.

22. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో, రోమీయులు 13:1 లో ఉన్న సలహాను దేవుని ప్రజలు ఎలా అర్థం చేసుకున్నారు?

22 మరి సాతాను సంస్థలోని రాజకీయ వ్యవస్థ మాటేమిటి? నిజ క్రైస్తవులు ఈ లోక పోరాటాల్లో, యుద్ధాల్లో పాల్గొనవచ్చా? క్రీస్తు అనుచరులు సాటి మనుషుల్ని చంపకూడదని బైబిలు విద్యార్థులు మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అర్థం చేసుకున్నారు. (మత్త. 26:52) అయితే, “పై అధికారాలకు” లోబడమని రోమీయులు 13:1 చెప్తుంది కాబట్టి సైన్యంలో చేరవచ్చని, సైనికులు ధరించే యూనిఫామ్‌ వేసుకోవచ్చని, యుద్ధంలో ఎవరినైనా చంపాల్సివచ్చినప్పుడు మాత్రం తుపాకీని గాలిలో పేల్చాలని చాలామంది బైబిలు విద్యార్థులు అనుకున్నారు.

23, 24. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో, దేవుని ప్రజలు రోమీయులు 13:1 ని ఎలా అర్థం చేసుకున్నారు? కానీ తర్వాత వాళ్లు ఏ సరైన అవగాహనకు వచ్చారు?

23 రెండో ప్రపంచ యుద్ధం మొదలౌతున్న సమయంలో, అంటే 1939లో కావలికోట పత్రిక, తటస్థంగా ఉండడం గురించి లోతుగా చర్చించింది. క్రైస్తవులు ఈ లోక పోరాటాల్లో, యుద్ధాల్లో అస్సలు పాల్గొనకూడదని ఆ ఆర్టికల్‌ స్పష్టంగా చెప్పింది. అది సరైన సమయంలో వచ్చిన నిర్దేశం కదా! ఆ విధంగా, క్రీస్తు అనుచరులు ఘోరమైన రక్తాపరాధం నుండి తప్పించుకున్నారు. కానీ ఒక్క విషయాన్ని మాత్రం వాళ్లు తప్పుగా అర్థం చేసుకున్నారు. రోమీయులు 13:1 లో ప్రస్తావించబడిన “పై అధికారాలు” లోక అధికారులు కాదుగానీ యెహోవా, యేసు అని 1929 నుండి మన ప్రచురణలు తెలియజేశాయి. ఆ విషయంలో వాళ్లకు సరైన అవగాహన అవసరమైంది.

24 1962లో, క్రీస్తు అనుచరులు పవిత్రశక్తి నిర్దేశంతో తమ అవగాహనను సరి చేసుకున్నారు. 1962 కావలికోట నవంబరు 15, డిసెంబరు 1 సంచికలు రోమీయులు 13:1-7 వచనాలను వివరించాయి. ఎట్టకేలకు, “కైసరువి కైసరుకు చెల్లించండి, కానీ దేవునివి దేవునికి చెల్లించండి” అని యేసు చెప్పిన మాటల్లో ఉన్న సూత్రాన్ని దేవుని ప్రజలు అర్థం చేసుకోగలిగారు. (లూకా 20:25) రోమీయులు 13లో ఉన్న “పై అధికారాలు” ఈ లోక అధికారాలని, క్రైస్తవులు వాటికి లోబడాలి గానీ యెహోవా కన్నా ఎక్కువగా కాదని వాళ్లు గ్రహించారు. అంటే యెహోవాకు అవిధేయత చూపించే ఏదైనా పని చేయమని ఆ అధికారులు చెప్తే, ప్రాచీనకాల అపొస్తలుల్లాగే ఇలా జవాబిస్తాం: “మేము లోబడాల్సిన పరిపాలకుడు దేవుడే కానీ మనుషులు కాదు.” (అపొ. 5:29) తటస్థంగా ఉండాలనే ఆ సూత్రాన్ని దేవుని ప్రజలు ఎలా పాటించారో ఈ పుస్తకంలోని 1314 అధ్యాయాల్లో వివరంగా తెలుసుకుంటాం.

శాశ్వత జీవితం పొందుతామనే నిరీక్షణ గురించి ఇతరులకు చెప్పడం ఎంత గొప్ప అవకాశమో కదా!

25. రాజ్యానికి సంబంధించిన విషయాల్ని అర్థం చేసుకునేలా పవిత్రశక్తి దేవుని ప్రజల్ని నిర్దేశిస్తున్నందుకు మీరెలా భావిస్తున్నారు?

25 గత వంద సంవత్సరాల్లో మనం రాజ్యం గురించి ఏయే విషయాలు తెలుసుకున్నాం? దేవుని రాజ్యం పరలోకంలో ఎప్పుడు స్థాపించబడిందో, అది స్థాపించబడడం ఎంత ప్రాముఖ్యమో అర్థం చేసుకున్నాం. అంతేకాదు, నమ్మకస్థులైన ప్రజలకు ఉండే రెండు నిరీక్షణల గురించి అంటే పరలోక నిరీక్షణ గురించి, భూనిరీక్షణ గురించి తెలుసుకున్నాం. ఈ లోక అధికారాలకు ఎంతవరకు లోబడాలో, దేవుని రాజ్యానికి ఎలా విశ్వసనీయంగా ఉండాలో గ్రహించాం. ఒక్కసారి ఆలోచించండి! యేసుక్రీస్తు తన నమ్మకమైన దాసుని ద్వారా ఆ విలువైన సత్యాలను బోధించివుండకపోతే, మనం వాటిని అర్థం చేసుకోగలిగేవాళ్లమా? క్రీస్తు, అలాగే పవిత్రశక్తి మనల్ని నిర్దేశిస్తున్నందుకు మనం ఎంతో సంతోషించవచ్చు!

a ఒక రెఫరెన్సు పుస్తకం ప్రకారం, ఆ లేఖనంలో “నడిపిస్తాడు” అని అనువదించబడిన గ్రీకు పదానికి “దారి చూపిస్తాడు” అని అర్థం.

b రోమా సామ్రాజ్యపు అన్య మతానికి, రోమన్‌ కాథలిక్‌ చర్చికి మధ్య జరిగే యుద్ధాన్ని ఆ దర్శనం సూచిస్తుందని అంతకుముందు అనుకున్నారు.

c 1,44,000 మందిలో, 1914కల్లా క్రైస్తవులుగా మారిన యూదులు ఉంటారని 1880, జాయన్స్‌ వాచ్‌ టవర్‌ జూన్‌ సంచిక చెప్పింది. అయితే, 1880లోని తర్వాతి నెలల్లో వచ్చిన కొత్త అవగాహన, నేడు మనం అర్థం చేసుకున్న సత్యానికి దగ్గరగా ఉంది.