ఉత్సాహాన్ని, ఆప్యాయతను కనుపర్చుట
పాఠ్యభాగం 33
ఉత్సాహాన్ని, ఆప్యాయతను కనుపర్చుట
1. ఉత్సాహాన్ని ఏది ప్రోత్సహిస్తుంది?
1 ఉత్సాహం ప్రసంగానికి ప్రాణం వంటిది. మీరు చెప్పేదాని విషయంలో మీరు ఉత్సాహంగా లేకపోతే, మీ ప్రేక్షకులు కూడా ఉత్సాహంగా ఉండరు. అది మిమ్మల్నే చలింపజేయకపోతే, వారిని కూడా చలింపజేయదు. అయితే ప్రసంగీకునిగా మీరు సరియైన ఉత్సాహాన్ని కనుపర్చుటకు, మీరు ఏమి చెప్పనైయున్నారో దానిని మీ ప్రేక్షకులు వినవలసిన అవసరత ఉన్నదనే స్థిరనిశ్చయతకు మీరు రావాలి. అంటే మీరు ప్రసంగాన్ని సిద్ధపడేటప్పుడు, మీ ప్రేక్షకులకు అత్యంత ప్రయోజనకరంగా ఉండే అంశాలను ఎంపిక చేసుకొని, వాటి విలువను మీ శ్రోతలు వెంటనే గుణగ్రహించే విధంగా వాటిని రూపుదిద్దడం మూలంగా వారిని పరిగణలోనికి తీసుకున్నారని దాని అర్థం. మీరలా చేస్తే మనఃపూర్వకంగా మాట్లాడాలని మీరు ప్రేరేపింపబడతారు, మరి మీ ప్రేక్షకులు దానికి స్పందిస్తారు.
2-5. ఉజ్జీవమున్న ప్రసంగం ఉత్సాహాన్ని ఎలా ప్రదర్శించగలదు?
2 ఉజ్జీవ ప్రసంగం ద్వారా ఉత్సాహం చూపబడింది. మీ ప్రసంగంలో ఉండే ఉజ్జీవాన్నిబట్టే ఉత్సాహమనేది మరీ తేటతెల్లగా చూపించబడుతుంది. మీరు అలక్ష్యంగా లేదా నిర్జీవంగా ఉండలేరు. మీ ముఖకవళికలు, స్వరం, మాట్లాడే విధానం జీవం ఉట్టిపడేలావుండాలి. అంటే మీరు దృఢంగాను, శక్తితోను మాట్లాడాలి. పిడివాదం చేస్తుండకపోయినను ఒప్పించేరీతిలో మీరు మాట్లాడాలి. మీరు ఉత్సాహంగా ఉండవలసియున్నా మితిమీరిపోకూడదు. ఆశానిగ్రహాన్ని కోల్పోవడమంటే ప్రేక్షకుల అవధానాన్ని కోల్పోవడమనే దాని అర్థము.
3 ఉత్సాహమనేది అంటురోగం వంటిది. మీ ప్రసంగాన్ని గూర్చి మీరు ఉత్సాహంగావుంటే, మీ ప్రేక్షకులు ఆ ఉత్సాహాన్ని స్వీకరించగల్గుతారు. ప్రేక్షకులతో మంచి సంబంధాన్ని కలిగియుంటే, అది మరలా మీకు తిరిగి వచ్చి మీ ఉత్సాహాన్ని సజీవంగా ఉంచుతుంది. అలాకాక మీరు నిర్జీవంగావుంటే, మీ ప్రేక్షకులు కూడా మీతోపాటు నిర్జీవులౌతారు.
4 మనం దేవుని ఆత్మ సహాయముతో వెలుగొందాలని పౌలు చెబుతున్నాడు. మీరలావుంటే, చైతన్యవంతమైన మీ ప్రసంగం ప్రేక్షకుల మధ్య దేవుని ఆత్మ ప్రసరించునట్లు చేసి మీ ప్రేక్షకులను కార్యోన్ముఖులను చేస్తుంది. అపొల్లో తన ప్రసంగాలలో అట్టి ఆత్మను కనుపర్చాడు, మరి అతడు వాగ్ధాటిగల ప్రసంగీకుడని పిలువబడ్డాడు.—రోమా. 12:11; అపొ. 18:25; యోబు 32:18-20; యిర్మీ. 20:9.
5 ఒక ప్రసంగం విషయంలో ఉత్సాహంగా ఉండాలంటే, ప్రసంగించదగు విలువైన సమాచారం మీవద్ద ఉన్నదన్న నమ్మకం మీకు కలగాలి. ప్రసంగీకునిగా మొదట మిమ్మల్నే ఉత్తేజపర్చగల సమాచారం మీవద్ద ఉన్నదన్న భావన మీకు కల్గేంత వరకు మీరు ప్రసంగించే సమాచారంపై సాధన చేయండి. ఆ సమాచారం క్రొత్తదే కానవసరం లేదు, కాని మీరు ఆ అంశాన్ని అందించే తీరు క్రొత్తదిగా ఉండవచ్చు. మీ ప్రేక్షకులను తమ ఆరాధనలో పటిష్ఠం చేయగల్గి, శ్రేష్ఠమైన పరిచారకులను చేయగల్గి లేదా శ్రేష్ఠమైన క్రైస్తవులను చేయగల్గే సమాచారం మీవద్ద ఉన్నదని మీకనిపిస్తే, అప్పుడు మీరు మీ ప్రసంగం విషయంలో ఉత్సాహంగా ఉండడానికి కారణముంది, నిస్సందేహంగా మీరు ఉత్సాహాన్ని కనుపరుస్తారు కూడా.
6-9. ఒకని ప్రసంగంలో ఉన్న సమాచారం ప్రసంగించే సమయంలో ఉత్సాహాన్ని ప్రదర్శించడానికెలా తోడ్పడుతుంది?
6 సమాచారానికి తగిన ఉత్సాహం. ప్రసంగంలో వైవిధ్యాన్ని కలిగివుండేందుకు, మీ ప్రేక్షకులకు ప్రయోజనాన్ని కల్గించేందుకు మీ ఉత్సాహాన్ని మరీ విపరీతంగా ప్రసంగమంతటా కనుపర్చకూడదు. మీరలా చేస్తే, తాము స్పందించడం ప్రారంభించకముందే నీరుగారి పోవచ్చును. వివిధ రీతుల్లో ప్రసంగించడానికి వీలగునట్లు సమాచారాన్ని తగినన్ని విధాలుగా సిద్ధపడాల్సిన అవసరతను యిది మరలా నొక్కితెల్పుతుంది. అంటే మీరు చర్చించే కొన్ని అంశాలకు మిగతావాటికన్నా ఎక్కువ ఉత్సాహాన్ని సహజంగా కనుపర్చవలసి ఉంటుందని దాని అర్థం, మరి వాటిని మీ ప్రసంగమంతటిలో నేర్పుగా కలుపుకొని రావాలి.
7 విశేషంగా ముఖ్యాంశాలను ఉత్సాహవంతంగా అందించాలి. మీ ప్రసంగాన్ని తారాస్థాయికి తీసుకువెళ్లే శిఖరాగ్రాలు దానిలో ఉండాలి. ఇవన్నీ మీ ప్రసంగానికి ఉన్నతాంశాలు గనుక, సాధారణంగా మీ ప్రేక్షకులను పురికొల్పడానికి, మీ తర్కన, మీ కారణాలు, మీ సలహా యొక్క అన్వయింపును వివరించేందుకు నిర్దేశించబడ్డాయి. మీ ప్రేక్షకులను ఒప్పించగల్గారు గనుక, మీ అభిప్రాయాల మూలంగా కల్గే ప్రయోజనాలను ప్రదర్శించడానికి, ఈ దృఢ నమ్మకాలను అనుసరించడం మూలంగా వారికి కల్గే ఆనందం, ఆధిక్యతల విషయంలో మీరిప్పుడు వారిని పురికొల్పవలసి వుంటుంది. ఇందుకు ఉత్సాహవంతంగా ప్రసంగించాలి.
8 అయినా, మీ ప్రసంగమందలి మరితర సందర్భాల్లో మీరు అలక్ష్యతను ఎన్నడూ చూపించకూడదు. మీ అంశం విషయమై మీకున్న దృఢసంకల్పాన్ని ఎన్నడూ పోగొట్టుకోకూడదు లేదా ఆసక్తిని కోల్పోయినట్లు ఉండకూడదు. చెట్టూచేమ లేని మైదానంలో చడీచప్పుడు కాకుండా మేత మేస్తున్న ఒక జింకను మనస్సున చిత్రీకరించుకోండి. పైకి నిర్భయంగా కన్పిస్తున్నప్పటికి, ప్రమాద సూచనను ఏమాత్రం పసిగట్టినా అద్భుతమైన గంతులతో దాన్ని అక్కడనుండి తీసుకొనిపోగల అంతర్గత శక్తి దాని సన్నని కాళ్లలోవుంది. అది నిర్భయంగావున్నా, ఎల్లవేళల అప్రమత్తంగా ఉంటుంది. అలాగే మీరు కూడా, ఉత్సాహంగా మాట్లాడని సమయాల్లోనూ అప్రమత్తంగా ఉండగలరు.
9 దీనియంతటి భావమేమి? ఉత్తేజవంతంగా ప్రసంగించమని ఎన్నడూ బలవంతపెట్టరు. దానికి కారణముండాలి, మరి మీ సమాచారం మీకా కారణాన్ని అందివ్వాలి. మీరు కనుపర్చిన ఉత్సాహం మీ సమాచారానికి తగిందా కాదాయని మీ సలహాదారుడు పరిశీలిస్తాడు. అది శృతిమించిందా, మరీ తక్కువగావుందా లేక తగినచోట చూపబడలేదా? అయితే ఆయన మీకున్న వ్యక్తిత్వాన్ని పరిగణలోనికి తీసుకుంటాడు, కాని మీరు సిగ్గుపడుతున్నా, మితబాషిగావున్నా మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు, అలాగే మీరు ప్రతిదానికి మరీ ఉద్రేకపడుతున్నట్లు కన్పిస్తుంటే మిమ్మల్ని హెచ్చరిస్తాడు. కావున సమాచారానికి తగినట్లు మీరు ఉత్సాహాన్ని చూపించండి, ఉత్సాహంగా మాట్లాడడం ప్రసంగమంతటా సమతూకంగా ఉండేలాగున మీ సమాచారాన్ని మార్చండి.
**********
10-12. ఆప్యాయత, వాత్సల్యత అంటే అర్థమేమి?
10 ఆప్యాయత, వాత్సల్యతలకు ఉత్సాహానికి దగ్గర సంబంధముంది. అయితే వాటికి సంబంధించిన మాటలు భిన్నమైన భావోద్రేకాలకు చెందినవి మరి మీ ప్రేక్షకుల మధ్య భిన్నమైన ఫలితాలనిస్తాయి. ప్రసంగీకునిగా మీ సమాచారాన్ని బట్టి మీరు సాధారణంగానే ఉత్సాహంతో ఉంటారు, కాని మీ ప్రేక్షకులకు సహాయపడాలనే కోరికతో వారిని గూర్చి తలంచినప్పుడే మీరు ఆప్యాయంగా ఉంటారు. ప్రసంగ సలహా పత్రంపై పేర్కొనబడిన “ఆప్యాయత, వాత్సల్యత,” అను వాటికి ఆలోచనాపూర్వక అవధానం యివ్వాలి.
11 ఆప్యాయత, వాత్సల్యతలను మీరు ప్రదర్శిస్తే, మీరు ప్రేమ, దయ, కనికరాలను చూపే వ్యక్తియని ప్రేక్షకులు గ్రహిస్తారు. ఒక శీతల రాత్రి నిప్పులయొద్దకు వచ్చినట్లు వారు మీయొద్దకు ఆకర్షింపబడతారు. ఉత్తేజవంతమైన ప్రసంగం పురికొల్పునిస్తుంది, కాని మృదువైన వాత్సల్యత కూడా అవసరం. ఎల్లవేళల మనస్సును ఒప్పిస్తే సరిపోదు, మీరు హృదయాన్ని కదిలించాలి.
12 ఉదాహరణకు, ప్రేమ, దీర్ఘశాంతము, దయాళుత్వము, సాత్వికము అనే వాటిని మీ జీవితంలో లేశమాత్రమైనా ప్రదర్శించకుండా ఆ లక్షణాలను గూర్చి గలతీయులు 5:22, 23 నుండి చదవడం సమంజసంగా ఉంటుందా? అలాగే 1 థెస్సలొనీకయులు 2:7, 8 నందున్న పౌలు మాటలలోని మృదువైన వాత్సల్యతను కూడా గమనించండి. ఈ మాటలకు ఆప్యాయత, వాత్సల్యతలు అవసరము. వాటినెలా చూపవచ్చును?
13, 14. ఆప్యాయతను ముఖకవళికలలో ఎలా చూపించవచ్చును?
13 ఆప్యాయత ముఖకవళికలలో సుస్పష్టమైంది. మీ ప్రేక్షకుల యెడల మీకు వాత్సల్యతవుంటే, అది మీ ముఖంలో కన్పించాలి. అలాకాకపోతే, వారి యెడల మీరు నిజంగానే వాత్సల్యతను కల్గియున్నారని మీ ప్రేక్షకులు తలంచకపోవచ్చును. అయితే అది యథార్థమైనదై ఉండాలి. దానిని ఒక మాస్క్‌వలే ధరించలేము. అలాగే ఆప్యాయత, వాత్సల్యతలను శోకము, భావావేశాలతో కలిపి గలిబిలి చేయకూడదు. దయాపూర్వక ముఖకవళిక యథార్థతను, నిష్కాపట్యతను ప్రదర్శిస్తుంది.
14 ఎక్కువ భాగం మీరు స్నేహపూరితమైన ప్రేక్షకులతోనే మాట్లాడతారు. కావున, మీరు నిజంగా ప్రేక్షకులవైపు చూస్తే వారి యెడల మీకు నిజమైన ఆప్యాయత ఏర్పడుతుంది. మీరు బిడియంలేని వారిగాను స్నేహపూర్వకంగాను ఉంటారు. ప్రేక్షకులలో ముఖ్యంగా స్నేహపూర్వక ముఖమున్న ఎవరినైనా ఎంచుకోండి. కొన్ని క్షణాలవరకు అతనితోనే వ్యక్తిగతంగా మాట్లాడండి. మరొకరిని ఎంచుకొని వానితో మాట్లాడండి. ఇది మీకు ప్రేక్షకులతో మంచి సంబంధాన్ని కల్గించడమే కాకుండా, మీరు ప్రేక్షకులకు దగ్గరౌతున్నట్లు మీకనిపిస్తుంది, ఆప్యాయతతో కూడిన మీ ముఖకవళికలు ప్రేక్షకులను మీకు సన్నిహితులను చేస్తాయి.
15-19. ప్రసంగీకుని స్వరంలో ఆప్యాయత, వాత్సల్యతను కనుపర్చుటకు ఏవి తోడ్పడగలవో సూచించండి.
15 ఆప్యాయత, వాత్సల్యత కంఠస్వరంలో స్పష్టమైంది. మీ కంఠస్వరాన్ని బట్టి జంతువులు సహితం మీ భావోద్రేకాలను కొంతమేరకు అర్థం చేసుకోగలవని రుజువయ్యింది. అట్లయితే, కంఠస్వరంతోనే వ్యక్తపర్చబడిన ఆప్యాయత, వాత్సల్యతలకు ప్రేక్షకులు ఎంతగా స్పందిస్తారో కదా.
16 ప్రేక్షకులతో సంబంధం తెగిపోయిందని మీకు నిజంగా అనిపిస్తే, మీరు చెప్పేవాటికి ప్రేక్షకులు ఎలా స్పందిస్తారనే దానికన్నా చెప్పవలసిన మాటలను గూర్చే మీరు ఎక్కువగా ఆలోచిస్తుంటే, అప్రమత్తంగావున్న ప్రేక్షకులకు దానిని మరుగు చేయడం కష్టం. కాని మీరు మాట్లాడుతున్న వారిపైనే మీ ఆసక్తి కేంద్రీకృతమైయుంటే, మీరు ఆలోచిస్తున్నట్లే వారును ఆలోచించేలా మీ తలంపులను వారికిని అందించాలనే మనఃపూర్వకమైన కోరిక మీకుంటే, మీ వాత్సల్యత, మీ స్వరంలో వచ్చే మార్పులోనే కన్పిస్తుంది.
17 స్పష్టమైనరీతిగా, ఇది మాత్రం యథార్థమైన ఆసక్తియైయుండాలి. ఉత్సాహాన్ని ఎలా నటించలేమో ఆలాగే నిజమైన ఆప్యాయతను కూడా నటించలేము. వేషధారణతో కూడిన తీపిమాటలను పల్కువాడనే అభిప్రాయాన్ని ప్రసంగీకుడు ఎన్నడూ కల్గించకూడదు. అలాగే ఆప్యాయత, వాత్సల్యతలను శోకభావంతోను లేదా బూటకపు భావోద్రేకతతో కూడిన కల్పిత, గద్గద స్వరంతో గలిబిలి చేయకూడదు.
18 ఒకవేళ మీరు కటువుగా మాట్లాడేవారైతే, బొంగురు స్వరం మీకుంటే మీ మాటల్లో ఆప్యాయతను కనుపర్చడం కష్టం. అలాంటి సమస్య ఏదైనావుంటే మనఃపూర్వకంగాను పట్టుదలతోను దానిని అధిగమించడానికి మీరు ప్రయత్నించాలి. అది స్వరలక్షణానికి సంబంధించిన విషయం గనుక దానికి సమయం అవసరం, కాని మీ స్వరంలో ఆప్యాయతను వృద్ధిచేయడానికి సరియైన అవధానం, ప్రయత్నం ఎంతో సహాయపడగలవు.
19 సాంకేతికపరంగా మీకు సహాయపడగల్గేది ఒకటుంది అదేమంటే, ప్రసంగాన్ని కష్టతరం చేసే సమ్మిళితమైన, క్లిష్టమైన అచ్చులను జ్ఞాపకం ఉంచుకొనడమే. అచ్చులను విడదీయడం నేర్చుకోండి. ఇది వాటిని సులభంగా పల్కడానికి సహాయంచేసి, మీ ప్రసంగంలో స్వరాన్నిబట్టి ఆప్యాయతను కనుపర్చేలా చేయగల్గుతుంది.
20, 21. ప్రసంగించేటప్పుడు ఆప్యాయతను, వాత్సల్యతను ప్రదర్శించడానికి ఓ ప్రసంగంలో ఉన్న సమాచారం ఎలా తోడ్పడగలదు?
20 సమాచారానికి తగిన ఆప్యాయత, వాత్సల్యత. ఉత్సాహం విషయంలో జరిగినట్లే, మీ మాటల్లో ఆప్యాయత, వాత్సల్యతలు వ్యక్తపర్చబడుట అనేది మీరు చెప్పేదాని మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. మత్తయి 23 నందు యేసు పరిసయ్యులను, శాస్త్రులను ఖండిస్తున్న వృత్తాంతం దీనికి ఉదాహరణ. నిందారోపణ చేస్తున్న ఈ తీవ్రమైన మాటలను ఆయన మందకొడిగా, నిర్జీవంగా వ్యక్తపర్చాడని మనం ఊహించలేము. అయితే తిరస్కారాన్ని, కోపాన్ని వ్యక్తపర్చే ఈ మాటల్లో పూర్తిగా ఆప్యాయత, మృదువైన వాత్సల్యతలతో నిండిన పదభాగం యిమిడివుంది, యేసు కలిగియున్న కనికరాన్ని అది యిలా వ్యక్తపరుస్తుంది: “కోడి తన పిల్లలను రెక్కలక్రింది కేలాగు చేర్చుకొనునో ఆలాగే నేనును నీ పిల్లలను ఎన్నోమారులు చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరు ఒల్లకపోతిరి.” ఇక్కడ మృదువైన వాత్సల్యత తేటగా కన్పిస్తుంది, కాని “ఇదిగో మీ యిల్లు మీకు విడువబడియున్నది,” అన్న తదుపరి వ్యాఖ్యానంలో అదే విధమైన భావప్రకటన లేదు. ఇచ్చట స్వరం తిరస్కారాన్ని, విసుగును చూపిస్తుంది.
21 మరి ఆప్యాయత, వాత్సల్యతలను ఎచ్చట చూపించ తగును? ఇంటింటి సేవలో లేదా విద్యార్థి ప్రసంగాల్లో మీరు చెప్పేవాటియందు ఎక్కువగా వీటిని ప్రదర్శిస్తారు, కాని ముఖ్యంగా మీరు తర్కిస్తూ, ప్రోత్సహిస్తూ, బుద్ధిచెబుతూ, సహానుభూతిని వ్యక్తపరుస్తున్న సమయాలలో చూపాల్సివుంటుంది. ఆప్యాయతను కనుపర్చాలని జ్ఞాపకం ఉంచుకొని, తగిన సమయంలో ఉత్సాహంగా ఉండడం మరిచిపోకండి. అన్ని విషయాలలో సమతూకంగా ఉండండి, అయితే మీరు చెప్పేవాటన్నింటికి సాధ్యమైనంతమట్టుకు పూర్తిగా భావప్రకటనను చేయండి.
[అధ్యయన ప్రశ్నలు]