కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఉపదేశాత్మక సమాచారము, స్పష్టంగా అందించబడింది

ఉపదేశాత్మక సమాచారము, స్పష్టంగా అందించబడింది

పాఠ్యభాగం 21

ఉపదేశాత్మక సమాచారము, స్పష్టంగా అందించబడింది

1-3. ఒకడు ఇచ్చే ప్రసంగం ఉపదేశాత్మకంగా ఉండాలంటే నిర్దిష్ట సమాచారం ఎందుకు అవసరం?

1 విలువైన ప్రసంగాలు శ్రద్ధతోకూడిన సిద్ధపాటుతో ప్రారంభమౌతాయి, అందుకు సమయం, ప్రయత్నం అవసరం. అయితే అది ఎంత ప్రయోజనకరమోగదా! మీకున్న కచ్చితమైన జ్ఞాననిధిని మీరు వృద్ధిచేసుకుంటారు, మరి మీరు ప్రేక్షకులతో పంచుకొనుటకు మీయొద్ద నిజంగా ప్రయోజనకరమైన సమాచారం కొంత ఉంది. సాధారణ విషయాలు మాట్లాడేకంటే, అందించేందుకు మీయొద్ద వికాసం కల్గించే వివరాలున్నాయి, మీరు చెప్పబోయేది సరియైనదేనని మీకు తెలుసు. దేవుని వాక్యము యెడల ప్రేక్షకులకున్న మెప్పుదలను అది బలపరుస్తుంది, కనుక అది యెహోవాను ఘనపర్చును. ఉపదేశాత్మక సమాచారాన్ని గూర్చిన మన చర్చ ముఖ్యంగా మీరు మీ ప్రసంగములో ఏమి చెప్తారో అనేదానిని గూర్చే. ఆ చెప్పే విషయాన్ని గూర్చిన వివిధ ఆకృతులను సంక్షిప్తంగా పరిశీలించండి. అదే ప్రసంగ సలహా పత్రంపైనున్న మొదటి అంశము.

2 నిర్దిష్ట సమాచారము. సాధారణ విషయాలను ప్రస్తావించే ప్రసంగానికి విలువ, ప్రామాణికత లోపిస్తాయి, అధికారరీత్యా మాట్లాడలేరు. అది అస్పష్టంగా ఉంటుంది. ప్రేక్షకులనది సందిగ్ధంలో పడవేస్తుంది. భావాలు జ్ఞాపకంలో ఉండాలంటే అవి నిర్దిష్టంగాను, కచ్చితంగాను ఉండాలి. అది మీరు చేసిన పరిశోధనను, ఆ అంశాన్ని గూర్చి మీకున్న అవగాహనను చూపిస్తుంది.

3 ప్రసంగాన్ని సిద్ధపడేటప్పుడు ఎందుకు? ఎప్పుడు? ఎక్కడ? మున్నగు ప్రశ్నలు వేసుకొనడం ద్వారా ఈ లక్షణాన్ని అలవర్చుకొనవచ్చు. ఏదో జరిగిన సంఘటనను మాత్రం పేర్కొనడం సరిపోదు. స్థలాల పేర్లను, తారీఖులను, బహుశ కారణాలను పేర్కొనండి. కొన్ని సత్యాలను తెల్పడం మాత్రమే సరిపోదు. అవి ఎందుకు సత్యమో చూపండి; వాటిని తెలుసుకోవడం ఎందుకు ప్రాముఖ్యమో తెల్పండి. ఉపదేశిస్తున్నట్లయితే, ఒక విషయాన్ని ఎలా చేయాలో వివరించండి. ఇలా వివరించడం ఎంతవరకు చేయవచ్చుననేది అప్పటికే ప్రేక్షకులకు ఎంతవరకు తెలుసుననే దానిమీద ఆధారపడి ఉంటుంది. కావున ఎట్టి వివరాలు అవసరమౌతాయో నిర్ణయించేందుకు ప్రేక్షకులను పరిగణలోనికి తీసుకోండి.

4-6. ప్రేక్షకులకు మీ ప్రసంగం ఉపదేశాత్మకంగా ఉండాలంటే, ఏ అంశాలను మీరు మనస్సునందుంచుకోవాలి?

4 ప్రేక్షకులకు ఉపదేశాత్మకంగా ఉండాలి. కొందరికి ఉపదేశాత్మకంగావున్న సమాచారం మరి కొందరి జ్ఞానార్జనకు దోహదపడదు, లేదా వారిని పూర్తిగా అంధకారంలో ముంచివేస్తుంది. కావున సమాచారం ఒక నిర్దిష్ట ప్రేక్షకులకు తగినదైయుండాలి. ఉదాహరణకు, మన పని ఎలా నిర్వహించబడుతుందనే విషయాన్ని గూర్చి మాట్లాడుతున్నప్పుడు, యెహోవాకు సమర్పించుకొనడానికి సిద్ధపడుతున్న వ్యక్తితో లేదా లోకస్థులతో మాట్లాడుతున్న రీతికన్నా సేవాకూటంలో ఆ సమాచారాన్ని భిన్నంగా అందించాలి.

5 ఈ అంశాలను దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలోని వివిధ ప్రసంగాలలో కూడా పరిగణలోనికి తీసుకోవాలి. నియమించబడిన ఏ ప్రసంగంలోని సమాచారమైనా ప్రేక్షకులకు, సన్నివేశానికి, ప్రసంగ ఉద్దేశానికి సరిపడేదైయుండాలి. ఈ అంశాలు ప్రసంగాన్నిబట్టి, ప్రసంగీకుడు ఏర్పాటు చేసిన సన్నివేశాన్నిబట్టి నిర్ణయించబడతాయి. అయితే, ఉపదేశ ప్రసంగం సంఘాన్నుద్దేశించి ప్రసంగించేదై వుంటుంది. ఇతర ప్రసంగాలు వివిధ రీతుల్లో ఉండవచ్చు, సన్నివేశాన్నిబట్టి ప్రేక్షకులు, ఉద్దేశము గుర్తించబడును. అన్ని సందర్భాలలోను, ప్రసంగంలో యిమిడియున్న ప్రేక్షకులకు ఆ సమాచారం అన్వయింపబడిందా లేదా? అని అటు విద్యార్థి, యిటు సలహాదారుడు కూడా ప్రశ్నించుకోవాలి. ఆ ప్రసంగం నుండి ప్రేక్షకులు ఉపదేశాన్ని, బోధను పొందగలరా?

6 ప్రసంగాన్ని సిద్ధపడేటప్పుడు, ఈ ప్రసంగంలో నేనేమి సాధించదల్చాను అని మిమ్ములను మీరు ప్రశ్నించుకోండి. నేను చెప్పదల్చింది ఈ వ్యక్తికి లేదా ఈ గుంపుకు ఎంతవరకు తెలుసు? ఈ అంశాలను స్పష్టంగా తెల్పేముందు నేనెటువంటి పునాదిని వేయాలి? మరొక గుంపుకు నేను దానిని మరోరీతిగా ఎలా అందించగలను? మనమిలా పోల్చుకుంటే తరచు అవి మన దృక్పథాలను స్పష్టం చేస్తాయి. మీరు సిద్ధపడేటప్పుడు, ప్రేక్షకులకు తగినట్లు మార్చగల్గుతున్నారో లేదో చూసుకొని మీరు ప్రసంగించబోయే ప్రేక్షకులకు సమాచారాన్ని ఉపదేశాత్మకంగా చేయగలరో లేదో చూసుకొనేందుకు, వివిధ గుంపులకొరకు వివిధ పద్ధతులను ప్రయత్నించి చూడండి.

7, 8. మన ప్రసంగాలను ఎలా ఆచరణాత్మకంగా చేయగలం?

7 ఆచరణయోగ్యమైన సమాచారము. నేర్చుకోవలసిన సమాచారమెంతోవుంది, కాని అదంతా ఆచరణయోగ్యం కాదు. మనకు ఉపదేశాత్మక సమాచారమంటే, క్రైస్తవ జీవితం కొరకు, మన పరిచర్య కొరకు మనం నేర్చుకొనవలసిన సంగతులే. మనం సంపాదించుకొన్న ఈ సమాచారాన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకొనగోరుతున్నాము.

8 విద్యార్థి తాను సిద్ధపడుతున్నప్పుడు, పాఠశాల అధ్యక్షుడు తాను సలహా యిస్తున్నప్పుడు, ఈ ప్రసంగంలో ఏ మార్గదర్శక సూత్రాలను గమనించవచ్చు? చర్చిస్తున్నప్పుడు ఈ సమాచారాన్ని ఉపయోగించవచ్చునా? అందించబడిన సమాచారం ప్రాంతీయసేవకు అన్వయించవచ్చునా? అది దేవుని వాక్యాన్ని ఘనపరచి, ఆయన సంకల్పాన్ని సూటిగా చూపిస్తున్నదా? అని ప్రశ్నించుకొంటూ యీ విషయాన్ని పరిశీలించాలి. ఈ సమాచారాన్నంతటిని కొన్ని ప్రసంగాలే అందించగలవు, అయితే అందించబడిన సమాచారం ప్రేక్షకులు ఏదొక రీతిన ఉపయోగించదగినదై వుండాలి.

9-11. కచ్చితమైన వివరణ ఎందుకు ప్రాముఖ్యం?

9 కచ్చితమైన వివరణ. యెహోవాసాక్షులు సత్యాన్నితెల్పే సంస్థకు చెందినవారు. మనము సత్యాన్ని మాట్లాడగోరతాం, అది ప్రతి వివరములోను అన్నివేళల కచ్చితంగా ఉండేలా చూస్తాం. ఇది కేవలం సిద్ధాంతం విషయంలోనే కాదుగాని, ఇతరులు చెప్పిన వాటిని పేర్కొనేటప్పుడు వారిని గూర్చి ఏమి చెప్తాం, లేదా ఎలా పరిచయం చేస్తామనే విషయంలోనూ, ఆలాగే విజ్ఞాన సంబంధిత వివరాలు లేదా వార్తా సంఘటనలను వివరించే విషయంలో కూడా ఆలాగే చేయాలి.

10 ప్రేక్షకులకు అందించిన తప్పుడు వివరాలు ఆనోట ఈనోట వ్యాపించవచ్చు, ఆ పొరపాటు పెద్దదైపోవచ్చు. ప్రేక్షకులు గుర్తించిన అవాస్తవ విషయాలనుబట్టి ప్రసంగీకుడు అందించే ఇతర ప్రామాణిక అంశాలను, బహుశ ఆ వర్తమానాన్నే వారు సందేహించవచ్చు. క్రొత్తగా ఆసక్తిచూపే వ్యక్తి అలాంటి వివరాలను విన్న తరువాత, మరొక సందర్భంలో తాను మరోవిధంగా వింటే, యెహోవాసాక్షుల మధ్య తలంపుల్లో అనైక్యత ఉందనే ముగింపుకు వచ్చి, కారణమేమీ చెప్పకుండానే తాను సహవసించుట మానివేయవచ్చు.

11 విద్యార్థి తెల్పే ప్రతి వివరములోని అంశాలను సలహాదారుడు ఎత్తి చూపకూడదు, ముఖ్యంగా సత్యంలో క్రొత్తవారై దేవుని వాక్యమునందలి లోతైన సంగతులలో పూర్తిగా స్థిరపడనివారి విషయంలో అలా చేయకూడదు. బదులుగా, అతడు ఆ విద్యార్థి తలంపును మలచడానికి యుక్తిగా సహాయపడి, జాగ్రత్తగా ముందే సిద్ధపడుట వలన కచ్చితమైన వివరాలను అందించుటను ఎలా వృద్ధిచేసుకొనవచ్చునో తెల్పుతాడు.

12, 13. వివరణనిచ్చే అదనపు సమాచారము యొక్క విలువేమిటి?

12 వివరణనిచ్చే అదనపు సమాచారము. ధ్యానించుట మూలంగా లేదా ఒక అంశం మీద చేసిన పరిశోధన ద్వారా కూడబెట్టిన తలంపులు ప్రసంగానికి ఎంతగానో దోహదపడి, ప్రేక్షకులకు అప్పటికే పరిచయమున్న సమాచారాన్ని ఉపదేశ సారములేని విధంగా మరలా అందించకుండా ఉండడానికి తోడ్పడతాయి. అది ప్రసంగానికి తాజాదనాన్నిచ్చి, ప్రేక్షకుల ఆసక్తిని ఉట్టిపడేలాచేసి, బాగా పరిచయమున్న అంశాన్ని నిజంగా ఉల్లాసవంతం చేస్తుంది. అంతేకాకుండా, అది ప్రసంగీకునికి ధైర్యాన్నిస్తుంది. అందించడానికి ఎంతోకొంత వైవిధ్యమున్న జ్ఞానంతో కూడిన ప్రసంగాన్ని యివ్వడానికి అతడు సంసిద్ధమౌతాడు.

13 స్వంత ఉద్దేశాలను పేర్కొనే ప్రమాదాన్ని విడనాడాలి. సొసైటీ ప్రచురణలపైనే ఆధారపడి, వాటినే ఉపయోగించాలి. సొసైటీ ఇండెక్స్‌లను, లేఖనాల అథస్సూచికలను చూడండి. మీరు చెప్పేది పెడత్రోవ పట్టించేదికాక, తేటగా ఉండేటట్లు చూసుకోండి.

**********

14-16. విషయాలను సరళంగా అందించడానికి ప్రసంగాన్ని సిద్ధపడేటప్పుడు ఏమి చేయాలి?

14 మీరు ప్రసంగాన్ని సిద్ధపడేటప్పుడు మీరు చెప్పదల్చేది ఎలా చెప్పదల్చుకున్నారో అని కూడ అవధానమివ్వడం ప్రాముఖ్యం. దీనినే ప్రసంగ సలహా పత్రం “స్పష్టంగా, అర్థవంతంగా” అని సంబోధిస్తుంది. దీనికి సరియైన అవధానం యివ్వకపోతే మీరు ప్రేక్షకుల హృదయాలను చేరుట కష్టం, లేదా వారు విన్నది జ్ఞాపకముంచుకోలేరు. ఇందుకు మూడు ప్రాముఖ్యమైన అంశాలను పరిశీలించాలి.

15 సరళంగా పేర్కొనడం. అంటే వాక్యాలను ముందుగానే తలంచుకొని ఉండాలని దీనిభావం కాదు. కాని ప్రసంగించదలచిన విషయాలను ముందుగానే విశ్లేషించుకోవాలి, కొన్ని నిర్దిష్ట కారణాలను పరిగణలోనికి తీసుకోవాలి. ఇది సాధారణభాషలో, సరళమైన తలంపును వ్యక్తపర్చిన కచ్చితమైన ప్రసంగంలా కన్పిస్తుంది. ప్రసంగీకుని మనస్సులోని అంశమే ప్రసంగంలో కన్పిస్తుంది.

16 చివరి క్షణంలో సిద్ధపడకూడదు. ప్రసంగంలోని ప్రతి అంశం ప్రసంగీకునికి స్పష్టంగా అర్థమై, సామాన్య శైలిలో తాను చెప్పగల్గేంతవరకు వాటిని గూర్చి ఆలోచించి చూసుకోవాలి. ప్రసంగించడానికి సిద్ధపడుతున్నప్పుడు ఈ అంశాలను పునఃసమీక్షించుకుంటే, అవి అతని మనస్సులో నాటుకొనిపోయి, అవసరమైనప్పుడు వెంటనే జ్ఞప్తికి వస్తాయి. మరి అవి ప్రసంగీకునికి ఎంత స్పష్టంగా ఉన్నాయో ప్రేక్షకులకు కూడా అంతే స్పష్టంగా ఉంటాయి.

17, 18. పరిచయంలేని పదాలను ఎందుకు వివరించాలి?

17 అపరిచిత పదాలను వివరించుట. లేఖనాలను, వాచ్‌టవర్‌ సొసైటీ ప్రచురణలను మనం పఠించుట మూలంగా మన పరిచర్యతో పరిచయం లేనివారికి తెలియని క్రొత్త పదాలు, శబ్దసముదాయం మనం తెలుసుకున్నాం. ఇటువంటి క్రొత్త పదాలను ఉపయోగించి కొందరు ప్రేక్షకులకు బైబిలు సత్యాలను వివరించాల్సి వస్తే అప్పుడు మనం చెప్పినదంతా వృధాకావచ్చు లేదా మన ప్రసంగమే పూర్తిగా అస్పష్టంగా ఉండవచ్చు.

18 మీ ప్రేక్షకులను పరిగణలోనికి తీసుకోండి. వారి అవగాహనా స్థాయి ఏమిటి? మన పనిని గూర్చి వారికి ఎంతవరకు తెలుసు? ప్రసంగీకుడు అర్థం చేసుకున్నట్లు వారిలో ఎంతమంది ఈ మాటలను అర్థం చేసుకోగలరు? “దైవ పరిపాలన,” “శేషం,” “వేరేగొర్రెలు,” “అర్మగిద్దోను,” మరియు “రాజ్యం” వంటి పదాలు శ్రోతల మనస్సులో భిన్నమైన తలంపులనివ్వవచ్చు లేదా అసలు ఏ తలంపును యివ్వకపోవచ్చు. మన పనిని గూర్చి శ్రోతకు పరిచయం లేకపోతే “ఆత్మ,” “నరకం,” “అమరత్వం” వంటి పదాలను కూడా స్పష్టం చేయవలసి వుంటుంది. కాని సంఘంలో ప్రసంగిస్తున్నట్లయితే, ఈ పదాలను వివరించాల్సిన అవసరముండదు. గనుక సందర్భాన్ని పరిగణలోనికి తీసుకోవాలి.

19, 20. ఎక్కువ సమాచారాన్ని ప్రస్తావించకుండా ఎలా ఉండవచ్చు?

19 ఎక్కువ సమాచారం అవసరం లేదు. ప్రసంగంలో ఎక్కువ సమాచారముంటే, ఆ సమాచారం ప్రేక్షకులను గందరగోళంలో ముంచెత్తి అవగాహనను కుంటుపర్చవచ్చు లేదా అసలే అర్థం కాకపోవచ్చును. ఒక ప్రసంగం యొక్క సంకల్పాన్ని నెరవేర్చుటకు, నిర్దేశించబడిన సమయంలో స్పష్టంగా వివరించదగిన దానికంటే ఎక్కువ సమాచారాన్ని ప్రస్తావించకూడదు. ప్రేక్షకులు సహేతుకంగా గ్రహించగల్గిన దానికంటే ఎక్కువ వ్యక్తపర్చకూడదు. అంతేకాకుండా, ఒక క్రొత్త వ్యక్తికి లేదా క్రొత్తగా ఆసక్తి చూపుతున్న వ్యక్తికి సమాచారాన్ని అందిస్తున్నప్పుడు, అదే అంశాన్ని సంఘంలో ప్రసంగిస్తున్న రీతికన్నా బాగుగా సూక్ష్మీకరించి వివరించాలి. ఇక్కడ కూడా, సలహాదారుడు, ప్రసంగీకుడు మాట్లాడుతున్న ప్రేక్షకులను పరిగణలోనికి తీసుకోవాలి.

20 విద్యార్థి తాను ఎంత సమాచారాన్ని ప్రసంగంలో చేర్చాలో ఎలా తెలుసుకోగలడు? సిద్ధపడేటప్పుడు పోల్చిచూచుకోవడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మీరేమి చెప్పాలో విశ్లేషించుకోండి. వీటిలో ఎన్ని అంశాలు, కనీసం వాటిలోని ఎన్ని భాగాలు ప్రేక్షకులకు అప్పటికే తెలుసు? క్రొత్తవారు ఎంతమంది ఉండవచ్చు? వారికి అప్పటికే మంచి జ్ఞానము ఉన్నట్లయితే, మనకు నిర్దేశించబడిన సమయంలో మనం దానికి మరింత జోడించవచ్చు. అయితే చర్చించబడే అంశాన్ని గూర్చి వారికేమీ తెలియకపోతే, ఎంత చెప్పాల్సివుంటుంది, ప్రేక్షకులు వీటిని పూర్తిగా గ్రహించేలా వివరించడానికి ఎంత సమయం పడుతుంది అనేవాటి విషయంలో ఎక్కువ శ్రద్ధ వహించాల్సివుంటుంది.

[అధ్యయన ప్రశ్నలు]