కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పునరుక్తి, అభినయాలను ఉపయోగించుట

పునరుక్తి, అభినయాలను ఉపయోగించుట

పాఠ్యభాగం 26

పునరుక్తి, అభినయాలను ఉపయోగించుట

1-3. బోధనా నైపుణ్యానికి ఉద్ఘాటన ఎందుకు అవసరము?

1 మీరు ప్రసంగించేటప్పుడు ప్రేక్షకులు జ్ఞాపకముంచుకొని, దాన్ని ఉపయోగించగల్గే సమాచారాన్ని అందించడమే మీ ఉద్దేశమై యుండాలి. వారు దాన్ని మరచిపోతే ప్రయోజనం లేదు. మీరు చెప్పేదానిని వారు తమ మనస్సునందు ఉంచుకొనడానికి సహాయపడగల్గే ఒకానొక మార్గమేమంటే, అత్యంత ప్రాముఖ్యమైన అంశాలను మరలా చెప్పడమే. పునరుక్తి జ్ఞాపకశక్తికి తల్లివంటిదని యుక్తంగానే చెప్పబడింది. అతి ప్రాముఖ్యమైన బోధనా నైపుణ్యాలలో పునరుక్తి ఒకటి. లేఖనాలను ఉపయోగించేటప్పుడు దాని అవసరత ఏమిటో మీరిప్పటికే తెలుసుకున్నారు. అయితే, ప్రసంగ సలహా పత్రంపై నొక్కివక్కాణించుటకై “పునరుద్ఘాటన” అనేది ప్రత్యేకంగా పేర్కొనబడింది, ఎందుకంటే అది మీ ప్రసంగమందలి యితర భాగాలకు కూడా వర్తిస్తుంది.

2 పునరుద్ఘాటించుటలో ప్రావీణ్యతను సంపాదించుటకు మీకు తోడ్పడేందుకు, ఈ విషయాన్ని మనమిప్పుడు రెండు విభిన్న దృక్పథాలనుండి పరిశీలించబోతున్నాం. ప్రతిదీ విభిన్నమైన పునరుక్తికి సంబంధించినది; ప్రతిదానికి ఓ ఉద్దేశం వుంది. ముఖ్యాంశాల పునరుక్తి అనేది జ్ఞాపకముంచుకోవడానికి సహాయపడుతుంది. అర్థంకాని అంశాలను పునరుక్తించినట్లైతే వాటిని అర్థం చేసుకొనడానికి సహాయపడుతుంది.

3 ఈ లక్షణాన్ని గూర్చి యోచించేటప్పుడు ప్రసంగించే విధానమేకాదు సిద్ధపాటు కూడా ప్రాముఖ్యం. వేటిని పునరుక్తించాలో, ఎప్పుడు పునరుక్తించడం మంచిదో మీరు ముందుగానే నిర్ణయించుకోవలసిన అవసరముంది.

4-6. ముఖ్యాంశాలను పునరుక్తించడానికి “అంచెలంచెలుగా ప్రస్తావించే” సారాంశం “ముగింపు” సారాంశాన్ని ఎలా ఉపయోగించవచ్చునో వర్ణించండి.

4 ముఖ్యాంశాలను పునరుక్తించుట. ముఖ్యాంశాల పునరుక్తిని సర్వసాధారణంగా ఏదొక విధమైన సారాంశం నెరవేరుస్తుంటుంది. రెండు అసాధారణమైన విధానాలను మనమిప్పుడు చర్చిద్దాం, వాటిని “అంచెలంచెలుగా” ప్రస్తావించే సారాంశం మరియు “ముగింపు” సారాంశం అని పిలుద్దాము.

5 అంతకుముందు చర్చించిన ఒక్కొక్క ముఖ్యాంశ సారాంశానికి అవధానమిస్తూ, పరిశీలించబడిన ప్రతి ముఖ్యాంశంలోని అవశ్యమైనవాటి పునఃపరిశీలనే అంచెలంచెలుగా అందించే సారాంశం. ఈ ప్రకారంగా ప్రసంగమంతా అనుసంధానం చేయబడుతుంది.

6 ప్రసంగ ముగింపులో, అంచెలంచెల సారాంశాలను వుపయోగించినా, వుపయోగించకపోయినా ముగింపు సారాంశము ప్రస్తావించబడుతుంది. మరియు ప్రసంగాన్నంతటిని కొన్ని క్లుప్త వ్యాఖ్యానాలతో పునఃపరిశీలించవచ్చు. కొన్నిసార్లు, పునఃపరిశీలించబడే ముఖ్యాంశాలు ఎన్నివున్నాయో పేర్కొనడానికి అది సహాయపడుతుంది. జ్ఞాపకశక్తికి ఇది మరో సహాయకము.

7-10. విషయాలను పునరుక్తించడానికి సారాంశ తరహా పద్ధతిని ఆసక్తిదాయకంగా ఎలా చేయవచ్చు?

7 సారాంశమనేది విషయాలను లేదా తలంపులను కేవలం పునరుచ్చరించడం లేక మరలా పేర్కొనడం వంటిదే కానవసరం లేదు. దీనిని వివిధ రీతులలో చేయవచ్చు: ఉపమానము, లేఖనాన్ని వుపయోగించుట, మరో దృక్కోణమునుండి విషయాన్ని పరిశీలించుట, పోల్చిచూచుట లేదా వ్యత్యాసాన్ని చూపుట, సమాంతరాలను చూపుట, పర్యాయ పదాలను లేదా ప్రశ్నలను వాడుట మున్నగు పద్ధతుల్లో చేయవచ్చును. ఉదాహరణకు, బహిరంగ ప్రసంగ సారాంశాన్ని, ముఖ్యమైన లేఖనాలను, ప్రధాన అంశాలను అన్వయిస్తూ ఓ ఐదు నిమిషాలపాటు క్లుప్తంగా చేయాలి. ఎవరైనా తమవెంట తీసుకొనివెళ్లి ఉపయోగించగల క్యాప్సూల్‌ మందురూపంలో ఇక్కడ ప్రసంగమంతా లభ్యమౌతుంది.

8 ముఖ్యంగా తర్కన, సహేతుకత యిమిడివున్న ప్రసంగాలలో సారాంశ రూపంలోనున్న పునరుక్తి సహాయకరంగా వుంటుంది, ఉద్దేశాలను ప్రేక్షకుల మనస్సులో మరింత లోతుగా నాటడానికి ఆ చర్చకు పట్టిన సమయం, క్లుప్తమైన పునఃపరిశీలన సహాయం చేస్తాయి. అయితే, ఒక విషయాన్ని క్లుప్తంగా పేర్కొనడం అన్నివేళల అవసరం లేదు. అటుపిమ్మట మాట్లాడవలసిన మరొక అంశాన్ని ఆధారం చేసుకొంటూ దాన్ని పేర్కొనవచ్చు.

9 ముఖ్యమైన విషయాలను పునరుక్తించు మరొక మార్గమేమంటే, ప్రసంగ ఉపోద్ఘాతంలో వాటిని పేర్కొని, ఈ అంశాలను ప్రసంగమంతటిలో వివరిస్తూ ఉండడమే. ఈ విధమైన పునరుక్తి, ఉద్దేశాలను మనస్సులో మరింతగా నాటుతుంది.

10 ముఖ్యమైన అంశాలను పునరుక్తించే ఈ వివిధ మార్గాలతో పరిచయం కలిగియుండుట ద్వారా, ప్రసంగాన్ని ఆసక్తికరంగాను, ఉత్సాహవంతంగాను చేసి, సులభంగా జ్ఞాపకముంచుకొనేలా చేసేందుకు ఎంతో చేయవచ్చు.

11-14. అర్థంకాని విషయాలను పునరుక్తించడంలో ఏ కీలకమైన కారకాలు యిమిడివున్నాయి?

11 అర్థంకాని అంశాల పునరుక్తి. అర్థమయ్యేలా ఒక విషయాన్ని పునరుక్తించాలా లేదా అనేది పూర్తిగా మీ ప్రేక్షకులపై ఆధారపడి వుంటుంది. అది ప్రాముఖ్యమైన అంశమైతే, దాన్ని ఎక్కువసార్లు వినే అవకాశాన్ని వారికివ్వకపోతే అది వారికి స్పష్టం కాదని మీరనుకుంటుంటే, ఏదొక విధంగా మీరు దాన్ని ప్రస్తావించాలి లేకపొతే మీరు మీ ప్రేక్షకులను ప్రసంగ ముగింపు వరకు తోడుకొనిపోలేరు. అయితే, ఉద్ఘాటించుటకు దోహదపడని అనవసరమైన పునరుక్తి ప్రసంగాన్ని అర్థం పర్థం లేనిదిగా చేస్తుంది.

12 ప్రసంగాన్ని సిద్ధపడేటప్పుడు మీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకోండి. బహుశ మీ ప్రేక్షకులకుండే నిర్దిష్ట సమస్యలను కొంతమేరకు మీరు గ్రహించడానికి అది మీకు సహాయపడాలి. అట్టి విషయాలను భిన్నమైన దృక్పథాల నుండి పరికించేందుకు వాటిని ఏదొకరీతిగా పునరుక్తించండి.

13 మీరు చెప్పింది ప్రేక్షకులకు అర్థం కాలేదని మీరెలా గ్రహించగలరు? ప్రేక్షకుల వైపు చూడండి. వారి ముఖకవళికలను గమనించండి, లేదా ఒకరిద్దరు వ్యక్తులతో మాట్లాడుతుంటే, ప్రశ్నలనడగండి.

14 అయితే దీన్ని బాగుగా గమనించండి: అదే మాటలను పదే పదే వల్లించినంత మాత్రాన మీ ఉద్దేశం ఎల్లవేళల నెరవేరదు. బోధించడానికి దానికన్నా ఎంతోవుంది. మీరు మొదట చెప్పిన విషయాన్ని ప్రేక్షకులు గ్రహించకపోతే, వారికి అర్థమయ్యేలా చేసేందుకు అవే మాటలను కేవలం మరలా ప్రస్తావిస్తే చాలదు. అందుకు మీరేమి చేయాలి? పరిస్థితులకు అనుగుణ్యంగా మీరు మారాలి. మీ ప్రసంగానికి అప్పటికప్పుడు కొన్ని అదనపు విషయాలను చేర్చవలసి వుంటుంది. మీ ప్రేక్షకుల అవసరతలను తీర్చగల్గడానికి నేర్చుకొనడం, ఉపదేశకునిగా మీరెంత మేరకు రాణిస్తున్నారో నిర్ణయిస్తుంది.

**********

15-18. వర్ణన అభినయాలను వుపయోగించుటను ఒక వ్యక్తి ఎలా నేర్చుకొనగలడు?

15 మీరు చెప్పేదానిని అభినయాలు కూడా ఉద్ఘాటించగలవు, పలుకబడిన మాట యొక్క భావానికి అవి తరచూ బలాన్ని చేకూరుస్తాయి. ఈ విధంగా అవి ఉద్దేశాలను బలపరచి, ఉత్తేజపరుస్తాయి. సాధారణంగా అభినయాలు లేకుండా ఎవ్వరూ మాట్లాడలేరు. గనుక, మీరు వేదికపై అభినయించకపోతే, మీరు ధైర్యంగా లేరని ప్రేక్షకులు గ్రహిస్తారు. మీరు సహజంగా అభినయిస్తున్నట్లైతే, ప్రేక్షకులు మిమ్మును గూర్చి పట్టించుకోరు; మీరు చెబుతున్న దానిని గూర్చి ఆలోచిస్తారు. అభినయాలు మీకు ఉజ్జీవాన్నిచ్చి, మీలోని భావాలను పురికొల్పి మీ ప్రసంగానికి జీవం పోస్తాయి. ఏదో పుస్తకం నుండి వాటిని అనుకరించకూడదు. చిరునవ్వు చిందించడం లేదా నవ్వడం లేదా కోపాన్ని వ్యక్తం చేయడమెలాగో మీరెన్నడూ అధ్యయనం చేయలేదు, అలాగే వేరొకరి అభినయాలను అనుకరించవలసిన పనిలేదు, అవి ఎంత సహజంగా, అయత్నపూర్వకంగా వస్తే అంత మంచిది. పలుకబడిన మాటకు భావప్రకటన చేయడానికి, అభినయాలతోపాటు ముఖకవళికలు కూడా ఉంటాయి.

16 అభినయాలు వాటి గుణాలనుబట్టి రెండు సాధారణ వర్గాలుగా విభజించబడ్డాయి: వర్ణన, ఉద్ఘాటనా అభినయాలు.

17 వర్ణన అభినయాలు. వర్ణన అభినయాలు, అభినయాన్ని వ్యక్తపరుస్తాయి లేదా కొల ప్రమాణాలను, స్థలాన్ని చూపిస్తాయి. వీటిని నేర్చుకొనడం అతి సులభం. కాబట్టి మీకు వేదికమీద అభినయించడం సమస్యగావుంటే, సామాన్యమైన వర్ణన అభినయాలను చేయడానికి మొదట ప్రయత్నించండి.

18 పాఠశాలలో ఈ లక్షణంపై మీరు కృషి చేస్తుంటే, ఒకటి రెండు అభినయాలతో తృప్తిచెందకండి. ప్రసంగమంతా తరచు అభినయించడానికి ప్రయత్నించండి. ఇలా చేయడానికి, దిక్కులను, దూరాన్ని, పరిమాణాన్ని, విస్తీర్ణాన్ని, వేగాన్ని, ప్రాంతాన్ని, వ్యత్యాసాన్ని, సంబంధిత స్థానాలను లేదా పోల్చిచెప్పే మాటలు మొదలగు వాటికొరకు అన్వేషించండి. అవసరమైతే, ఆ అంశంవద్ద అభినయించాలని మీకు జ్ఞాపకముండేందుకు వాటికి మీ నోట్సులో ఏదొక విధమైన గురుతుపెట్టండి. మొదట్లోనే మీకీ లక్షణానికి “G” గుర్తు లభించినా ఈ అభ్యాసాన్ని కొంత కాలం కొనసాగించండి. కొన్ని ప్రసంగాలనిచ్చిన తరువాత మీ అభినయాలకు గురుతు పెట్టవలసిన పనిలేదని లేదా వాటిని గూర్చి ముందుగా తలంచవలసిన పనిలేదని, మీరు సహజంగానే అభినయించ గల్గుతున్నారని గ్రహిస్తారు.

19-20. ఉద్ఘాటనా అభినయాలు ఏ ఉద్దేశాన్ని నెరవేరుస్తాయి?

19 ఉద్ఘాటనా అభినయాలు. ఉద్ఘాటనా అభినయాలు భావాన్ని, దృఢసంకల్పాన్ని వ్యక్తపరుస్తాయి. అవి విరామ గురుతుల వద్ద ఆగేటట్లు చేసి, ఉద్దేశాలకు జీవంపోసి దృఢపరుస్తాయి. గనుక ఉద్ఘాటనా అభినయాలు చాలా ప్రాముఖ్యం. అయితే, జాగ్రత్త సుమా! సర్వసాధారణంగా ఉద్ఘాటనా అభినయాలు అతిగాచేసే ఓ అలవాటుగా మారతాయి. దీన్ని నిరోధించడానికి, పునరుద్ఘాటించే అభినయాలను మానివేయండి.

20 అభినయించడం అతిగాచేసే అలవాటు మీకు ఓ సమస్యగావుంటే, కొంతకాలం వరకు పూర్తిగా వర్ణన అభినయాలనే చేయండి. ఈ విధమైన అభినయాలలో మీరు నైపుణ్యాన్ని సంపాదించిన తరువాత ఉద్ఘాటనా అభినయాలను సులభంగా చేయవచ్చు. అనుభవాన్ని సంపాదించి, వేదికమీద నిర్భయంగా ప్రసంగించ గల్గితే, ఉద్ఘాటనా అభినయాలు మీ దృఢసంకల్పాన్ని, సద్భావాన్ని ప్రదర్శిస్తూ, మీ అంతర్గత భావాలను సహజంగా వ్యక్తపరుస్తాయి. అవి మీ ప్రసంగాన్ని అర్థవంతం చేస్తాయి.

[అధ్యయన ప్రశ్నలు]