కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రేక్షకులతో సంబంధము, నోట్స్‌నుపయోగించు విధానము

ప్రేక్షకులతో సంబంధము, నోట్స్‌నుపయోగించు విధానము

పాఠ్యభాగం 28

ప్రేక్షకులతో సంబంధము, నోట్స్‌నుపయోగించు విధానము

1. ప్రేక్షకులతో సంబంధాన్ని పెట్టుకొనే ప్రాముఖ్యతను, దీనిలో నోట్స్‌ ఎలాంటి పాత్రను వహిస్తుందో వివరించండి.

1 ప్రేక్షకులతో మంచి సంబంధాన్ని కల్గియుండడం, బోధించుటలో మీకెంతో సహాయకరంగా వుంటుంది. వారి గౌరవాన్ని చూరగొని, మరింత సమర్థనీయంగా బోధించడానికి అది మీకు దోహదపడగలదు. వారితో మీకున్న సంబంధం ప్రసంగీకునిగా మీరు వారి ప్రతీ స్పందనను తక్షణమే గ్రహించగల్గునంతటి సన్నిహిత సహచర్యకు మిమ్మును తీసుకొని రావాలి. ప్రేక్షకులతో మీరట్టి సంబంధాన్ని కలిగియున్నారో లేదో నిర్ణయించడంలో మీరు నోట్స్‌ను ఉపయోగించే విధానము ప్రముఖ పాత్ర వహిస్తుంది. సుదీర్ఘంగా వ్రాసుకున్న విషయాలు మిమ్మును ఆటంకపర్చవచ్చు; కాని పరిస్థితులను బట్టి అవి ఉండవలసిన వాటికన్నా కొంచెం పొడవుగావున్నా, నోట్స్‌ను నైపుణ్యంతో ఉపయోగిస్తే ఆటంకంగా వుండదు. ఎందుకంటే, నిపుణతగల ప్రసంగీకుడు తన నోట్స్‌ వైపు అతిగా చూడడం లేదా అనుకోని సమయంలో చూడడం మూలంగా తనకు ప్రేక్షకులతోవున్న సంబంధాన్ని పోగొట్టుకోడు. మీ ప్రసంగ సలహా పత్రంపై దీనికి అవధానమివ్వబడి, “ప్రేక్షకులతో సంబంధము, నోట్స్‌నుపయోగించే విధానము” అని పేర్కొనబడింది.

2-5. ప్రేక్షకులతో దృష్టి సంబంధాన్ని కలిగియుండుటను ఫలప్రదం చేసేదేమిటి?

2 ప్రేక్షకులవైపు దృష్టిసారించుట. దృష్టి సారించుట అంటే మీ ప్రేక్షకులను చూడడమని భావం. అంటే కేవలం ప్రేక్షకులవైపు అలవోకగా చూడమని కాదుగాని ప్రేక్షకులలోవున్న ప్రతి ఒక్కరిని చూడమని దాని అర్థం. వారి ముఖాలపైనున్న భావాలను గమనించి వాటికి తగినట్లుగా ప్రతిస్పందించమని దాని భావము.

3 మీ ప్రేక్షకులవైపు చూడడమంటే, ఏ ఒక్కరినీ విడవకుండా అందరిని ఓ పద్ధతి ప్రకారం ఒక ప్రక్కనుండి మరో ప్రక్కకు చూడమనికాదు. ప్రేక్షకులలో ఒకనివైపు చూచి ఒకటి లేదా రెండు వాక్యాలను అతనితోనే మాట్లాడుతున్నట్లు చెప్పండి. అటుతరువాత మరొకరిని చూచి అతనితో మరికొన్ని మాటలను చెప్పండి. ఎవరికీ యిబ్బంది కలుగకుండునట్లు వారివైపు ఎక్కువ సేపు చూడవద్దు, అలాగే ప్రేక్షకులందరిలో కేవలం కొంతమంది మీదనే అవధానాన్ని నిలుపవద్దు. ఇలా చేస్తూ ప్రేక్షకులందరివైపు చూడండి, అయితే ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు, మరో వ్యక్తిపై దృష్టిసారించకముందు ఆ వ్యక్తితోనే అన్నట్లు మాట్లాడి, అతని ప్రతిచర్యను గమనించండి. మీ నోట్స్‌ను కేవలం కనురెప్ప పాటులో త్వరగా చూచేందుకు వీలగునట్లుగా దానిని పోడియం మీద పెట్టండి లేక చేతిలో ఉంచుకోండి లేదా బైబిల్లో పెట్టుకోండి. మీ నోట్స్‌ను చూడడానికి మీ తలంతా త్రిప్పవలసివస్తే, ప్రేక్షకులతో మీకున్న సంబంధం దెబ్బతింటుంది.

4 మీ నోట్స్‌ను మీరెంత తరచుగా ఉపయోగిస్తున్నారని మాత్రమేకాదు, వాటిని మీరెప్పుడు చూస్తున్నారని కూడా మీ సలహాదారుడు గమనిస్తాడు. మీరు తారస్థాయికి చేరుకుంటున్నప్పుడు నోట్స్‌ను చూస్తుంటే, మీ ప్రేక్షకుల ప్రతిస్పందనను చూడలేరు. పదేపదే నోట్స్‌వైపు చూస్తున్నా కూడా మీ సంబంధాన్ని కోల్పోతారు. సర్వసాధారణంగా అది మీ బలహీనత అనో లేక ప్రసంగించడానికి సరిగా సిద్ధపడలేదనో సూచిస్తుంది.

5 సవివరమైన ప్రతినుండి ప్రసంగాన్నంతటిని యివ్వమని అనుభవజ్ఞులైన ప్రసంగీకులను ఆహ్వానించే సమయాలుంటాయి, అలాంటప్పుడు వారు ప్రేక్షకులపై దృష్టిసారించడాన్నిది కొంతవరకు పరిమితం చేస్తుంది. అయితే వారు బాగుగా సిద్ధపడి అందలి సమాచారంతో మంచి పరిచయాన్ని కల్గియున్నట్లైతే, తాము చదువుతున్న చోటునుండి తప్పిపోకుండా వారు ఆయా సమయాలలో ప్రేక్షకులవైపు చూడగల్గుతారు, తాము చేసే అర్థవంతమైన పఠనాన్ని ఇది ఉత్తేజపరుస్తుంది.

6-9. ప్రేక్షకులతో సంబంధాన్ని కలిగియుండే మరో పద్ధతిని, జాగ్రత్త వహించాల్సిన ప్రమాదాలను పేర్కోండి.

6 సూటిగా సంబోధించడం ద్వారా ప్రేక్షకులతో సంబంధం. దృష్టిసారించుట ఎంత ప్రాముఖ్యమో ఇది కూడా అంతే. మీ ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు మీరుపయోగించే మాటలు అందులో యిమిడివుంటాయి.

7 మీరు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు, ఆ వ్యక్తిని “మీరు,” “మీ” లేదా “మనము,” “మన,” అని సంబోధించి మాట్లాడతారు. సమంజసమనిపిస్తే పెక్కుమంది ప్రేక్షకులను కూడా అలాగే సంబోధించవచ్చు. మీ ప్రసంగంలో ఒక్కొక్క పర్యాయము ఒకరు లేక ఇద్దరితో మాట్లాడుతున్నట్లు ఊహించుకోండి. వారు మీతోనే మాట్లాడుతున్నట్లుగా భావించి వారికి జవాబిచ్చేందుకు వారిని నిశితంగా గమనించండి. ఇది ప్రసంగాన్ని మీ సొంతం చేస్తుంది.

8 అయితే ఒక హెచ్చరిక. మీ ప్రేక్షకులతో మరీ ఎక్కువ పరిచయం కలిగియుండవద్దు. ప్రాంతీయ పరిచర్యలో ఒక యింటివద్ద ఒకరు లేక ఇద్దరు వ్యక్తులతో మీరు హుందాగా మాట్లాడుతున్న దానికన్నా ఎక్కువ సన్నిహితం కానవసరం లేదు, కాని మీరు వారితో ఎలా సూటిగా మాట్లాడతారో అలాగే మాట్లాడవచ్చు, అలానే మాట్లాడాలి కూడా.

9 మరో ప్రమాదం. వ్యక్తిగత సర్వనామములను ఉపయోగించేటప్పుడు మీరు సరియైన నిర్ణయం చేసుకోవాలి, మీ ప్రేక్షకులను అనవసరమైన సంక్షోభంలో పడవేయవద్దు. ఉదాహరణకు, నేర ప్రవృత్తిని గూర్చిన ప్రసంగంలో మీ ప్రేక్షకులే నేరస్థులన్న భావాన్నిచ్చే సంబోధన మీరుపయోగించరు. లేదా మీరు సేవా కూటములో తక్కువ గంటలను గూర్చి చర్చిస్తున్నట్లయితే, అస్తమానం “మీరు” అనే సర్వనామాన్ని వాడే బదులు “మనము” అని సంబోధిస్తూ, మిమ్మల్ని కూడా ప్రసంగంలో యిముడ్చుకొనవచ్చు. వివేకము, గౌరవాదరణ ఇలాంటి ప్రమాదాన్ని సులభంగా జయించగలదు.

**********

10, 11. సంక్షిప్తప్రతిని ఉపయోగించుటను నేర్చుకొనడానికి మనలను ఏది పురికొల్పాలి?

10 సంక్షిప్తప్రతిని ఉపయోగించు విధము. క్రొత్తగా ప్రసంగించే వారిలో కొంతమంది సంక్షిప్తప్రతి నుండి మాట్లాడుతున్నట్లు ప్రసంగిస్తారు. సాధారణంగా వారు ప్రసంగాన్నంతటిని ముందుగానే వ్రాసుకొని, పిమ్మట దానిని చదవనైనా చదువుతారు లేదా జ్ఞాపకముంచుకొని ప్రసంగిస్తారు. ప్రారంభంలో మీ సలహాదారుడు ఈ విషయాన్ని అంతగా పట్టించుకోడు, అయితే మీరు మీ ప్రసంగ సలహా పత్రంపై “సంక్షిప్తప్రతి ఉపయోగము” అనే అంశానికి వచ్చేసరికి మీ నోట్స్‌ని నుండి ప్రసంగించాలని అతడు మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు. దానిలో మీరు పరిణతి సాధిస్తే, బహిరంగ ప్రసంగీకునిగా గొప్ప ప్రగతిని సాధించిన వారౌతారు.

11 చదవడం రాని పిల్లలు, పెద్దలు కూడా ఉద్దేశాలను తెలియజేయడానికి ఉపమానాలను ఉపయోగిస్తూ ప్రసంగిస్తారు. రాజ్య పరిచర్యలో పేర్కొనబడుతున్న సరళమైన లేఖన అందింపులవంటి సంక్షిప్తప్రతితో కూడా మీరు ప్రసంగాన్ని సిద్ధపడవచ్చు. ప్రాంతీయ సేవలో మీరు వ్రాతప్రతి లేకుండానే మాట్లాడుతూ ఉంటారు. అలాగే మీరు దానిమీద మనస్సు పెట్టగల్గితే పాఠశాలలో కూడా అంతే సులభంగా చేయగల్గుతారు.

12, 13. నోట్స్‌ని ఎలా తయారు చేయవచ్చునో సలహాలనివ్వండి.

12 ఈ లక్షణంపై కృషి సల్పమనడం, సిద్ధపడేటప్పుడు ప్రసంగించేటప్పుడు కూడా వ్రాతప్రతి నుండి వైదొలగకుండా ఉండేలా సహాయపడేందుకే, గనుక ప్రసంగాన్ని బట్టీపట్టవద్దు. అది ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశాన్ని విఫలం చేస్తుంది.

13 మీరు లేఖనాలను ఉపయోగిస్తున్నట్లయితే, ఎలా? ఎవరు? ఎప్పుడు? ఎక్కడ? మున్నగు ప్రశ్నలను వేసుకోవచ్చు. ప్రసంగించేటప్పుడు ఒక లేఖనాన్ని చదవండి, మీకు మీరే ఈ ప్రశ్నలను వేసుకోండి లేదా మీ గృహస్థునికి వేయండి, అవసరమైతే వాటికి సమాధానమివ్వండి. అదెంతో సరళంగా ఉంటుంది.

14, 15. ఏ విషయాలు మనలను నిరుత్సాహపర్చకూడదు?

14 క్రొత్తగా ప్రసంగించేవారు తాము ఏదైనా మర్చిపోతామేమోనని తరచూ తలస్తూ ఉంటారు. అయితే, మీరు మీ ప్రసంగాన్ని సహేతుకంగా అందించియుంటే, మీరొక అంశాన్ని విడిచిపెట్టినా ఏ ఒక్కరు దానిని పోగొట్టుకోరు. ఈ స్థాయిలో సమాచారమంతటిని అందించారా లేదా అనేది ప్రధానం కాదు. ప్రస్తుతం మీరు సంక్షిప్తప్రతి నుండి మాట్లాడుట నేర్చుకోవడం అత్యంత ప్రాముఖ్యము.

15 ఈ ప్రసంగాన్ని యిచ్చేటప్పుడు యిప్పటికే మీరు నేర్చుకొనిన అనేక లక్షణాలు అదృశ్యమైనట్లు మీరు భావిస్తారు. భయపడవద్దు. వ్రాతప్రతి లేకుండా మీరు ప్రసంగించడం నేర్చుకున్న తరువాత వాటంతటవే ప్రత్యక్షమౌతాయి, వాటిలో మీరు ప్రావీణ్యతను సంపాదించినట్లు కనుగొంటారు.

16, 17. నోట్స్‌ని తయారు చేసేటప్పుడు మనము దేనిని జ్ఞాపకముంచుకోవాలి?

16 పరిచర్య పాఠశాలలో యిచ్చే ప్రసంగాలకు ఉపయోగించు నోట్స్‌లను గూర్చి ఒక్కమాట చెప్పుకుందాం. ఉద్దేశాలను జ్ఞప్తికి తెచ్చుకొనడానికి వాటిని ఉపయోగించాలే తప్ప, పదేపదే వల్లించడానికి కాదు. అవి క్లుప్తంగా ఉండాలి. అవి చక్కగా, క్రమమైన పద్ధతిలో, స్పష్టంగా కన్పించేటట్లు ఉండాలి. మీరు ఏర్పాటు చేసుకున్న సన్నివేశం పునర్దర్శనమైతే మీ నోట్స్‌ పైకి కన్పించకూడదు, మీ బైబిల్లో దాన్ని పెట్టుకోవచ్చు. అది వేదిక మీదనుండి యిచ్చే ప్రసంగమైతే, పోడియంను మీరు ఉపయోగించనై యున్నారని మీకు తెలిస్తే, నోట్స్‌ విషయంలో మీకు సమస్య ఉండదు. కాని అవి స్పష్టంగా తెలియకపోతే, తదనుగుణంగా సిద్ధపడండి.

17 మీ నోట్స్‌ పైభాగమున విషయాంశాన్ని వ్రాసుకొనడం మరొక సహాయకం. ముఖ్యాంశాలు కూడా కంటికి స్పష్టంగా కన్పించాలి. వాటన్నింటిని పెద్ద అక్షరాలతో వ్రాయడానికి లేదా వాటిక్రింద గీత గీయడానికి ప్రయత్నించండి.

18, 19. నోట్స్‌ని ఉపయోగించడాన్ని మనమెలా అభ్యాసం చేయవచ్చును?

18 మీరు ప్రసంగించేటప్పుడు నోట్స్‌లను కొన్నింటినే ఉపయోగించమంటే, నామమాత్రంగా సిద్ధపడమని కాదు. మొదట ప్రసంగాన్ని అన్ని వివరాలతో మీకు నచ్చిన విధంగా ఒక నోట్స్‌ను తయారుచేయండి. పిమ్మట, మరింత క్లుప్తంగావుండే రెండవ నోట్స్‌ను తయారుచేయండి. ప్రసంగాన్ని యిచ్చేందుకు మీరు ఉపయోగించే నోట్స్‌ యిదే.

19 ఇప్పుడు ఈ రెండు క్లుప్తప్రతులను మీ ఎదుట పెట్టుకొని సంగ్రహపర్చిన దానివైపు మాత్రమే చూస్తూ మొదటి ముఖ్యాంశంపై మీరు చెప్పగల్గినంత చెప్పండి. తదుపరి, ఎక్కువ వివరాలున్న నోట్స్‌ని చూచి మీరు వేటిని విడిచిపెట్టారో గమనించండి. సంగ్రహపర్చిన నోట్స్‌లోని రెండవ ముఖ్యాంశానికి వెళ్లి అలాగే చేయండి. క్లుప్తంగా వ్రాసిన నోట్స్‌ నందలి మాటలను చూచి సవివరంగా వ్రాసుకున్న నోట్స్‌లోని ప్రతివిషయాన్ని మీరు జ్ఞప్తికి తెచ్చుకొనేంతంగా అవి మీకు అనతికాలంలో పరిచయమౌతాయి. అభ్యాసం, అనుభవం ద్వారా సిద్ధపడి ధారాళంగా మాట్లాడడం వలన కలిగే విలువలను మీరు ప్రశంసించడం మొదలుపెడతారు, మరి కచ్చితంగా అవసరం అనుకున్నప్పుడు మాత్రమే మీరు సవివర వ్రాతప్రతిని ఉపయోగిస్తారు. మీరు మాట్లాడేటప్పుడు ఏమంత తొందరపాటును కలిగియుండరు, మరి మీ ప్రేక్షకులు దానిని ఎంతో గౌరవముతో వింటారు.

[అధ్యయన ప్రశ్నలు]