కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలువైపు అవధానమును మళ్లించుట

బైబిలువైపు అవధానమును మళ్లించుట

పాఠ్యభాగం 24

బైబిలువైపు అవధానమును మళ్లించుట

1, 2. మన ప్రేక్షకులను బైబిలు వైపుకు ఎందుకు మళ్లించాలి?

1 ప్రతిఒక్కరి అవధానాన్ని దేవుని వాక్యమైన బైబిలువైపు త్రిప్పడమే పరిచర్యలో మనకున్న అభిలాష. మనం ప్రకటించే వర్తమానం దానిలోవుంది, మరి మనం చెప్పేవి మన స్వంత మాటలుకావని, దేవునివని ప్రజలు గ్రహించగోరతాం. దేవుని ప్రేమించే ప్రజలకు బైబిలునందు నమ్మకముంది. వారికొరకు దానిని చదివినప్పుడు, వారు విని, అది యిచ్చే సలహాను మనస్సులోనికి తీసుకుంటారు. అయితే వారు తమ స్వంత బైబిలును తీసుకొని, తామే దానిలో నుండి చదివితే, అది వారిలో మరింతగా నాటుకొనిపోతుంది. గనుక, ప్రాంతీయ సేవలో పరిస్థితులు అనుకూలిస్తే, తన బైబిలును తీసుకొని రమ్మని, మీతోపాటు లేఖనాలను చూడమని గృహస్థున్ని ప్రోత్సహించడం మంచిది. అలాగే, సంఘకూటాల్లో కూడా తమ బైబిలును ఉపయోగించుమని అందరిని ప్రోత్సహిస్తే, అది మన నమ్మకాలకు మూలాధారమైందని క్రొత్తవారు సులభంగా గుర్తించగల్గుతారు, మరి కళ్లారా చూడమని నొక్కిచెప్పడం మూలంగా అందరూ ప్రయోజనం పొందగల్గుతారు.

2 అందుచేత, మీరు లేఖన భాగాన్ని చదువుతున్నప్పుడు, ప్రేక్షకులు తమ స్వంత బైబిలులో దానిని గమనించగల్గితే, ప్రసంగించడంలో మీకున్న సంకల్పాన్ని నెరవేర్చే ప్రయోజనాన్ని పొందగలరు. వారలా చేశారా లేదా అనేది, మీరు వారికి సరియైన ప్రోత్సాహాన్నిచ్చారా లేదా అనేదానిపైనే ఎక్కువగా ఆధారపడివుంటుంది. ఇదే మీ ప్రసంగ సలహా పత్రంపై “బైబిలును ఉపయోగించుటకు ప్రేక్షకులను ప్రోత్సహించుట” అని పేర్కొనబడింది.

3, 4. దీనిని ఎలా ఫలవంతంగా చేయగలము?

3 సలహా యివ్వడంద్వారా. బైబిలును తీసిచూడండని ప్రేక్షకులను సూటిగా అడగడమే ఒకానొక శ్రేష్ఠమైన మార్గం; ఈ పద్ధతి తరచుగా వుపయోగించబడుతూ ఉంటుంది. కొన్నిసార్లు మీరు లేఖనాలను చదవకముందు అవి ఎక్కడ ఉంటాయో కేవలం చెబితే కూడా అలాంటి ఫలితాలను పొందవచ్చు; బహుశ యిలా చెప్పవచ్చు: “ఇప్పుడు మనం 2 తిమోతి 3:1-5 చదువుతున్నపుడు, మన ప్రాంతంలోనేవున్న పరిస్థితులను గూర్చి ఆలోచించండి.” అటుపిమ్మట, మీరు ఆ లేఖనాన్ని తెరిచిన తరువాత, ప్రేక్షకులు ఆ సలహాను పాటించారో లేదో ఒక్కసారి పరికించండి. సాధారణంగా వారు కూడా లేఖనాన్ని చూడడం ప్రారంభిస్తారు.

4 ప్రేక్షకులకు చూపించి, నొక్కివక్కాణించదలచిన లేఖనాలేమైనావుంటే, వేటిని చూపించాలో ప్రసంగీకుడే నిర్ణయించుకోవాలి. మీ ప్రేక్షకులను గమనించండి. మీరు చదివేది వారు గమనిస్తున్నారో లేదో చూడండి. ఏ కారణంచేతనైనా మీరు వ్రాతప్రతి ప్రసంగాన్ని యివ్వవలసివస్తే, కీలకమైన లేఖనాలను ప్రేక్షకులు తమ బైబిలునందు చూడగల్గేరీతిగా మీరు వాటిని చదవాలి.

5, 6. మనము చదవదలచిన లేఖనాలను ప్రేక్షకులు తీసేంతవరకు సమయాన్ని అనుమతించడం ఎందుకు ప్రయోజనకరమో వివరించుము.

5 లేఖనాన్ని కనుగొనడానికి సమయాన్ని అనుమతించుటద్వారా. కేవలం లేఖనాన్ని పేర్కొంటే సరిపోదు. ప్రేక్షకులు లేఖనాన్ని కనుగొనే లోపల మీరు దాన్ని చదివేసి మరోదానికి వెళ్లిపోతే, వారు నిరుత్సాహపడి యిక చూడడం మానుకుంటారు. ప్రేక్షకులను గమనించి, ఎక్కువమంది లేఖనాన్ని తీస్తే అప్పుడు దాన్ని చదవవచ్చు.

6 దీర్ఘకాల వ్యవధులను తరచుగా యివ్వడం మూలంగా మీ విలువైన సమయం వృధాకాకుండా లేక ప్రేక్షకులు లేఖనాన్ని వెదకుతున్నప్పుడు అనవసరమైన “ఖాళీ” ఏర్పడకుండు నిమిత్తం, మీరు చదవదలచిన దానికి ఎంతో ముందుగా లేఖనాన్ని పేర్కొనడం మంచిది. అయితే, ఇక్కడ సరియైన వ్యవధినివ్వడం ప్రాముఖ్యం. అయితే, లేఖనాన్ని పరిచయం చేయడానికి ఎంతో ముందే దాన్ని పేర్కొంటే, మీరు చెప్పే కొన్ని విషయాలను వారు అంతశ్రద్ధగా వినరని మీరు జ్ఞాపకముంచుకోవాలి. అలాంటి పరిస్థితిలో ముందుగా తర్కించదలచిన విషయాలను లేఖనాన్ని పేర్కొనకముందే తెలియజేయాలి.

**********

7-18. లేఖనాలను ఫలవంతంగా పరిచయం చేయడానికి ఏ పద్ధతులను ఉపయోగించవచ్చును?

7 ప్రసంగంలో ఉపయోగించబడే లేఖనాలు సాధారణంగా ప్రసంగానికి ముఖ్యాంశాలై వుంటాయి. ఈ లేఖనాలపైనే చర్చలు ఆధారపడి వుంటాయి. గనుక, అవి ప్రసంగానికి ఎంతగా దోహదపడతాయనేది, అవి ఎంత సమర్థవంతంగా వుపయోగించబడ్డాయనే దానిపై ఆధారపడి వుంటుంది. కావున “లేఖనములను సరిగ్గా పరిచయము చేయుట” అని మీ ప్రసంగ సలహా పత్రంపైవున్న విషయం పరిశీలించదగినంత ప్రాముఖ్యమైనది.

8 లేఖన భాగాన్ని పరిచయంచేసి, చదివి, అన్వయించడానికి చాలా మార్గాలున్నాయి. ఉదాహరణకు, కొన్నిసార్లు లేఖన పరిచయం కేవలం దాన్ని చదవడానికి నడిపించడమేకాక, ఆ చదివే తీరే విషయాన్ని నొక్కితెల్పునట్లు లేదా స్థిరపరచేలాచేసి అన్వయింపును కూడా చేయగలదు. మరోపక్షాన కొన్ని లేఖనాలు ఉపోద్ఘాతమేమీ లేకుండా, ప్రసంగ ప్రారంభంలోనే పేర్కొనబడతాయి.

9 లేఖనాన్ని ఫలవంతంగా పరిచయం చేయడమెలాగో నేర్చుకొనడానికి, అనుభవజ్ఞులైన ప్రసంగీకులు ఏమి చేస్తున్నారో గమనించండి. లేఖనాలు పరిచయం చేయబడుతున్న విభిన్న రీతులను గుర్తించడానికి ప్రయత్నించండి. వాటి ప్రయోజనాలను పరిగణించండి. మీ ప్రసంగాలను సిద్ధపడుతున్నప్పుడు, మరి ముఖ్యంగా ఆ లేఖనం ముఖ్యాంశానికి కీలకమైనదైతే దాని ఉపయోగమేమిటో పరిశీలించండి. అత్యంత సమర్థనీయంగా పరిచయం చేయడానికి వీలయ్యేలా దాని ఉపోద్ఘాతాన్ని జాగ్రత్తగా సిద్ధపడండి. కొన్ని సలహాలిక్కడ యివ్వబడ్డాయి:

10 ఒక ప్రశ్న. సమాధానాలు యివ్వాల్సిన ప్రశ్నలు ఆలోచింప చేస్తాయి. లేఖనము, దాని అన్వయింపు మూలంగా సమాధానం వచ్చేలా చూడండి. ఉదాహరణకు, రక్తమార్పిడిని గూర్చి మాట్లాడుతున్నప్పుడు, హెబ్రీ లేఖనాలలో దాని నిషేధాన్ని గూర్చి తెల్పిన తరువాత మీరు అపొస్తలుల కార్యములు 15:28, 29 పరిచయం చేస్తుండవచ్చు. “మరి ఇదే నిషేధం క్రైసవులకు కూడా విధించబడిందా? తొలి సంఘమందలి పరిపాలక సభ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అధికారపూర్వకంగా జారీచేసిన ఆజ్ఞను గమనించండి” అని చెప్పి లేఖనాన్ని పరిచయం చేయవచ్చు.

11 లేఖనం బలపర్చే ఒక వివరణను లేదా సూత్రాన్ని పరిచయం చేయవచ్చు. ఉదాహరణకు, నేరాన్ని గూర్చిన ప్రసంగంలో మీరిలా అనవచ్చు: “మంచి చెడులను గూర్చి మన దృక్పథమేమైయున్నదను దానిలో మన సహవాసుల ఎంపిక కూడా ప్రాముఖ్యం.” పిమ్మట మీ వాగ్మూలాన్ని బలపరుస్తూ 1 కొరింథీయులు 15:33 నందలి పౌలు మాటలను మీరు చదువ వచ్చును.

12 బైబిలును అధికార ప్రామాణికంగా పేర్కొనడం. ముఖ్యంగా మధ్యలో ఉపయోగించే లేఖనాలను గూర్చి మిరిలా చెబితేచాలు: “ఈ విషయాన్ని గూర్చి దేవుని వాక్యం ఏమి చెబుతుందో గమనించండి.” ఆ లేఖనం కొరకు ఎదురు చూడడానికి అది సహాయంచేసి, దాన్ని వుపయోగించుటలోగల నిర్దిష్టమైన కారణాన్ని అది అందించగలదు.

13 ఒక సమస్య. “నరకాన్ని” గూర్చిన ప్రసంగంలో మీరిలా అనవచ్చు: “మానవుడు నిత్యాగ్ని జ్వాలలతో బాధపడాల్సివుంటే, మరణానంతరం అతడు స్మారకంలో ఉంటాడని దాని అర్థం. కాని ప్రసంగి 9:5, 10 ఏమి చెబుతుందో గమనించండి.”

14 అనేక సమాధానాలనిచ్చి ఎంపిక చేసుకోనిచ్చుట. కొంతమంది ప్రేక్షకులకు ఒక సూటియైన ప్రశ్న లేదా ఒక సమస్యను అర్థం చేసుకొనడం మరీ కష్టంగా వున్నపుడు అనేక విషయాలను అందజేసి లేఖనము, దాని అన్వయింపు వాటికి సమాధామిచ్చేలా అనుమతించండి. ఒక కాథోలిక్కుతో మాట్లాడుతున్నప్పుడు ప్రార్థన ఎవరికి చేయాలో చూపేందుకు మత్తయి 6:9 ఉపయోగించాలని మీరు కోరుతుండవచ్చు. సూటిగా ప్రశ్నించినా లేక సమస్యను ముందుంచినా అది గృహస్థుని మనస్సును పెడత్రోవ పట్టించవచ్చు, అందుచేత మీరిలా అనవచ్చు: “మనం ఎవరికి ప్రార్థించాలనే విషయంపై అనేక అభిప్రాయాలున్నాయి. కొందరు మరియమ్మకు, మరికొందరు ‘పరిశుద్ధులలో’ ఒకరికి ప్రార్థించాలంటారు, కాని కొందరైతే మనం దేవునికి మాత్రమే ప్రార్థించాలని అంటారు. యేసు యిలా చెప్పాడు.”

15 చారిత్రక ఆధారము. విమోచనమును గూర్చిన ప్రసంగములో హెబ్రీయులు 9:12 ను మీరు వుపయోగించి యేసు తన స్వరక్తమిచ్చి “నిత్యమైన విమోచన” సంపాదించెను అని నిరూపించ వలసివుంటే, ఆ లేఖనాన్ని చదివేముందు, ఆలయమందలి “పరిశుద్ధ స్థలము”లో యేసు ప్రవేశించాడని పౌలు చెబుతున్నదాన్ని గూర్చి క్లుప్తంగా వివరించవలసిన అవసరముందని మీరు గమనించవచ్చు.

16 సందర్భం. ఒక లేఖనాన్ని పరిచయం చేసేటప్పుడు దానికి ముందు, వెనుకనున్న వచనాలలో వివరించబడిన ఆ లేఖన సన్నివేశం కొన్నిసార్లు సహాయకరంగా వుండవచ్చు. ఉదాహరణకు, “కైసరువి కైసరునకు చెల్లించుడి” అంటే అర్థమేమిటో తెల్పడానికి లూకా 20:25 నందున్న లేఖనాన్ని ఉపయోగించేటప్పుడు, ఆ వృత్తాంతములో వర్ణించబడినరీతిగా కైసరు పైవ్రాతవున్న నాణాన్ని యేసు ఉపయోగించినదాన్ని వివరించుట ప్రయోజనకరమని మీరు కనుగొనవచ్చు.

17 సమ్మిళితం. ఈ పద్ధతులన్నింటిని సమ్మిళితం చేయుట కూడా సాధ్యమే, మరియు తరచూ ప్రయోజనకరము.

18 ఒక లేఖనం చదవబడేటప్పుడు, అవధానాన్ని చూపే అపేక్షను తగినంతగా వృద్ధిచేసేలా లేఖన పరిచయం ఉండి, మీరా లేఖనాన్ని ఉపయోగించుటలోగల కారణాన్ని అది చూపించాలి.

19, 20. పేర్కొన్న లేఖనంపై మనం ఆసక్తిని రేకెత్తించామో లేదో ఎలా నిర్ణయించగలము?

19 లేఖనాల కొరకైన అపేక్షను వృద్ధిచేయుట. లేఖనం కొరకైన అపేక్షను మీరెప్పుడు వృద్ధి చేశారో మీరెలా తెలుసుకోగలరు? ప్రాథమికంగా ప్రేక్షకుల స్పందననుబట్టి తెలుసుకోవచ్చు, అయితే మీరు లేఖనాన్ని పరిచయం చేసిన తీరునుబట్టి కూడా తెలుసుకోగలవు. మీరు లేఖనాన్ని పరిచయం చేసిన తరువాత దాన్ని చదవనందుకు ప్రేక్షకులు అయోమయ స్థితిలో వుంటే, లేదా మీ పరిచయంలో ఒక ప్రశ్నకు సమాధానమివ్వక విడిచిపెడితే, అప్పుడు మీరు లేఖనం విషయమై ఆసక్తిని రేకెత్తించారన్నమాట. అయితే, ఉపోద్ఘాతం మాత్రం పాఠ్యాంశానికి, పరిచయం చేయబడే లేఖనానికి సంబంధం కల్గినదై వుండాలి. ఉపోద్ఘాతంలో విడువబడిన ప్రశ్నకు ఆ లేఖనంగాని, లేదా దాని తదుపరి వచ్చే అన్వయింపుగాని సమాధానమివ్వాలి.

20 లేఖనానికి ముందుండే ఉపోద్ఘాతాన్ని, ఒక చాటింపుకు ముందు ఊదే బూరధ్వనితో పోల్చవచ్చు. ఆ బూర ఊదువాడు విషయాన్నంతటిని తానే చెప్పడు. బదులుగా, తాను ఊదిన బూర శబ్దం అందరి ఆసక్తిని కూడగట్టి, చాటించేదానికి అవధానమిచ్చేలా చేస్తుంది. ఇలా పరిచయం చేసినట్లైతే, మీరు ఎంచుకున్న లేఖనాన్ని ఆసక్తితో, ప్రయోజనం పొందేలా వింటారు.

21. లేఖనాన్ని ఉపయోగించుటలో మనకున్న కారణంపై ఎందుకు అవధానాన్ని కేంద్రీకరించాలి?

21 లేఖనాన్ని ఉపయోగించు కారణంపై అవధానాన్ని నిల్పుట. ఒక లేఖనాన్ని పరిచయం చేసేటప్పుడు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వుండవచ్చును, అయితే ఆ లేఖనం ఎందుకు సరియైనదో, దానికి పూర్తి అవధానమివ్వడం ఎందుకు ప్రాముఖ్యమో కూడా చూపించాల్సి వుంటుంది. ఉదాహరణకు, భూమి మానవుని శాశ్వత గృహమని మీరు చర్చించదల్చినప్పుడు ప్రకటన 21:3, 4 వచనాలను ఉపయోగించాలని మీరు సిద్ధపడుతుండవచ్చు. మీ ప్రారంభపు తర్కనతోపాటు యిలా చెప్పవచ్చు: “తదుపరి లేఖనమైన ప్రకటన 21:3, 4 నందు తెల్పబడినట్లు మరణము, వేదన యికవుండనప్పుడు దేవుని నివాసం ఎక్కడ వుంటుందో గమనించండి.” లేఖనం బయలుపర్చు విషయాన్ని అపేక్షతో ఎదురు చూచేలా చేయడమేకాక, మీరు లేఖనాన్ని చదివిన తరువాత దాన్ని మీ తర్కనకు సులభంగా అన్వయించగల లేఖన ముఖ్యభాగానికి అవధానాన్ని మళ్లించగల్గారు. లేఖనము యొక్క అసలైన భావానికి అవధానాన్ని మళ్లించడంద్వారా, దేవుని వాక్య ప్రాముఖ్యతను మీరు నొక్కితెల్పుతున్నారు.

[అధ్యయన ప్రశ్నలు]