కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ ప్రేక్షకులను ఒప్పించండి, వారితో తర్కించండి

మీ ప్రేక్షకులను ఒప్పించండి, వారితో తర్కించండి

పాఠ్యభాగం 31

మీ ప్రేక్షకులను ఒప్పించండి, వారితో తర్కించండి

1, 2. ఒప్పింపజేసే తర్కం అంటే ఏమిటి?

1 మీరు ప్రసంగిస్తున్నప్పుడు ప్రేక్షకులు వినాలని మీరు అపేక్షిస్తారు, అంతమాత్రమే కాదు. అందించబడిన తర్కనలను అంగీకరించి తదనుగుణంగా ప్రవర్తించాలని కూడా మీరు వారిని కోరతారు. మీరు చెబుతున్నదాని వాస్తవికతను వారు ఒప్పుకుంటే, మరి వారి హృదయాలు సరియైనవైతే వారలా చేస్తారు. ఒప్పింపజేయడమంటే సాక్ష్యాధారాలతో తృప్తిపర్చడమని అర్థం. అయితే కేవలం సాక్ష్యాధారాలే ఎల్లవేళల సరిపోవు. సాధారణంగా వాటిని బలపరుస్తూ తర్కించడం అవసరం. అందుచేత, తర్కించి ఒప్పింపజేయడంలో మూడు ప్రాథమిక కారకాలు యిమిడి ఉన్నాయి: మొదటిది సాక్ష్యాధారాలు; రెండవది, ఆ సాక్ష్యాధారాలు అందించబడిన అనుక్రమము లేదా క్రమ పద్ధతి; మూడవది, వాటిని అందించుటలో ఉపయోగించిన విధము, పద్ధతులు. ప్రసంగ సలహా పత్రంపై పేర్కొనబడిన “ఒప్పింపజేసే తర్కము” అను అంశానికి సంబంధమున్న ఈ చర్చలో, మీరు ప్రసంగాన్ని ఎలా యిచ్చారు అనేదానికన్నా, ఏమి చెప్పబడింది, ఏ సాక్ష్యాధారమివ్వబడింది అనేదానిని మనం పరిశీలించబోతున్నాము.

2 ఒప్పింపజేసే తర్కము సరియైన మూల కారణాలపై ఆధారపడి ఉంటుంది, ఆ రీతిగానే మీ సలహాదారుడు దీనిని పరిశీలిస్తాడు. మీరిచ్చే సాక్ష్యాధారాలు వాటిని చదవవలసి వచ్చినను, ఒప్పించేరీతిలో అవి ఉండాలి. మీ ప్రసంగంలో ఒప్పింపజేసే లక్షణము మీ అంశాన్ని స్థిరపర్చడానికి మీరుపయోగించిన వాస్తవాలపై కాకుండా దాన్ని అందించే విధానంపై ఆధారపడియుంటే మీ తర్కాన్ని స్థిరమైనదిగాను వాస్తవమైనదిగాను చేయడానికి మీరు ఈ లక్షణాన్ని యింకను వృద్ధిచేసుకొనడానికి కృషి చేయవలసి ఉంటుంది.

3-6. పునాదిని ఎందుకు వేయాలో సూచించండి.

3 పునాది వేయబడింది. మీ తర్కములను వినిపించక ముందు సరియైన పునాదిని వేయడం అవసరం. చర్చనీయాంశమేమిటో మీరు స్పష్టం చేయాలి. మీరు అంగీకరించే సంబంధిత విషయాలను నొక్కితెల్పుట మూలంగా ఒక సామాన్య విషయాన్ని స్థిరపర్చడం ప్రయోజనకరము.

4 కొన్ని సందర్భాలలో పదాలను స్పష్టంగా నిర్వచించాలి. సంబంధంలేని విషయాలన్నింటిని విడిచి పెట్టాలి. పునాదిని వేయడంలో త్వరపడవద్దు. దాన్ని స్థిరంగా వేయండి, కాని పునాదే భవనం కానివ్వకండి. ఒక తర్కాన్ని త్రిప్పికొడుతుంటే, దానిలోవున్న లోపాలను కనుగొనడానికి, మీ తర్కాన్ని నిశ్చయపర్చుకొనడానికి, ఆ విషయానికున్న కీలకానికి ఎలా చేరుకోవచ్చునో తెలుసుకోవడానికి వివిధ అంశాలను విశ్లేషించండి.

5 మీరు ప్రసంగాన్ని సిద్ధపడేటప్పుడు, మీ అంశాన్ని గూర్చి ప్రేక్షకులకు అప్పటికే ఎంత తెలుసో చూచుకొనడానికి మీరు ప్రయత్నించాలి. మీ తర్కాలను అందించే ముందుగా మీరు ఎంతమేరకు పునాది వేయాలో యిది ఎంతో చక్కగా నిర్ణయిస్తుంది.

6 దయ, ఆలోచనాపూర్వకంగా మాట్లాడుటను గూర్చి మనమిక్కడ కృషి చేయకున్నను అట్టివి మనలను యుక్తిగాను, క్రైస్తవ మర్యాదతో వ్యవహరించునట్లు చేయగలవు. ఎల్లవేళల క్రైస్తవ సూత్రాల యెడల మీకున్న అవగాహనపై అవధానాన్ని నిల్పి మీ ప్రేక్షకుల హృదయాలను, మనస్సులను తెరవండి.

7-13. “సరియైన ఆధారం చూపబడింది” అనే దాని అర్థాన్ని వివరించండి.

7 సరియైన నిదర్శనం చూపబడింది. ప్రసంగీకునిగా కేవలం మీరు నమ్ముతున్నారు గనుక లేదా పేర్కొంటున్నారు కాబట్టి ఒక విషయం “నిరూపించ” బడదు. “అది ఎందుకు నిజం?” లేదా “అలాగని మీరు ఎందుకు చెబుతున్నారు?” అని మీ ప్రేక్షకులు అడగడం పూర్తిగా సమర్థనీయమని మీరు ఎల్లప్పుడు జ్ఞాపకముంచుకోవాలి. “ఎందుకు?” అనే ప్రశ్నకు సమాధానం యివ్వవలసిన బాధ్యత ఎల్లవేళల ప్రసంగీకునిగా మీకేవుంది.

8 “ఎలా?” “ఎవరు?” “ఎక్కడ?” “ఎప్పుడు?” “ఏమిటి?” అనే ప్రశ్నలు కేవలం వాస్తవాలను, సమాచారాన్ని సమాధానంగా అందిస్తాయి, కాని “ఎందుకు?” అనే ప్రశ్న కారణాలను అందిస్తుంది. ఈ విషయంలో అది ఒంటరిగానే ఉండి మీనుండి కేవలం వాస్తవాలకంటే ఎంతో కోరుతుంది. మీ ఆలోచనా సామర్థ్యానికి అది పనికల్పిస్తుంది. ఈ హేతువుచేత, మీరు ప్రసంగాన్ని సిద్ధపడేటప్పుడు “ఎందుకు?” అనే ప్రశ్నను పదేపదే వేసుకోండి. పిమ్మట వాటికి సమాధానాలు యివ్వగల్గేటట్లు చూసుకోండి.

9 మీరలా వ్యాఖ్యానించడానికిగల కారణాలను ప్రామాణికంగా అంగీకరించబడిన వ్యక్తుల మాటలను తరచూ పేర్కొంటుండవచ్చు. అంటే అతడు అలా చెప్పియుంటే, అతడు ప్రజ్ఞావంతుడని గుర్తించబడ్డాడు గనుక అది నిజమై యుంటుందని దాని భావం. దాన్ని నమ్మడానికి అది తగిన కారణమౌతుంది. ఈ రంగంలో సర్వోన్నత అధికారి యెహోవా దేవుడే. కావున, ఒక విషయాన్ని బలపర్చడానికి బైబిలునుండి ఒక లేఖనాన్ని పేర్కొన్నామంటే దాన్ని నిరూపించడానికి తగినంత ఆధారం ఉందన్నమాట. ఇది “సాక్ష్యాధారమైన” నిదర్శనమని పిలువబడుతుంది, ఎందుకంటే ఒక అంగీకృతమైన సాక్షినుండి “సాక్ష్యాన్ని” కల్గివున్నది.

10 సాక్ష్యాధారమైన నిదర్శనాన్ని అందించునప్పుడు మీ సాక్ష్యం ప్రేక్షకులకు అంగీకృతమైనదై యుండేటట్లు చూచుకోవాలి. మానవులను అధికార ప్రమాణంగా పేర్కొంటుంటే, వారి గతచరిత్ర ఏమిటో వారెలా పరిగణింపబడుతున్నారో స్పష్టంగా తెలుసుకోండి. బైబిలు దైవిక ప్రామాణం గలదని అనేకులు అంగీకరిస్తారు, కాని, కొందరైతే దానిని మానవులే తయారు చేశారని తలస్తారు, కావున వారి మాటలు ప్రామాణికమైనవి కావు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఇతర సాక్ష్యాధారాలను తీసుకోవాలి లేదా మొదటిగా బైబిలు సత్యసంధతను స్థిరపర్చాలి.

11 ఒక హెచ్చరిక. సాక్ష్యాధారాలు అన్నింటిని నమ్మకంగా ఉపయోగించాలి. సందర్భానికి సంబంధంలేని ఏ వ్యాఖ్యానాన్ని తీసుకోవద్దు. మీరు పేర్కొంటున్న అధికారి తాను చెప్పదలచింది మీరు చెప్పేది ఒకేరీతిగా ఉండేలాగున చూచుకోండి. మీరు పేర్కొనేవాటిని నిర్దిష్టంగా పేర్కొనండి. గణాంకాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. వీటిని సరిగా అందించకపోతే విపత్కర పరిణామాలు సంభవించవచ్చు. సరాసరి మూడు అడుగుల లోతు మాత్రమే ఉన్న నీటి ప్రవాహంలో ఈదడం చేతకాని వ్యక్తి వాగులో మునిగిపోయిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. మధ్యలో పది అడుగుల లోతున్న గుంటను గూర్చి అతడు మర్చిపోయాడు.

12 సందర్భ సహిత సాక్ష్యాధారమేమంటే, మానవులను అధికారికంగా పేర్కొనడం లేదా దైవిక అధికారాన్ని పేర్కొనడం మినహా పేర్కొనేదే. సాక్షుల మాటలనుండి కాకుండా వాస్తవాల నుండి ఊహించిన వాటిపై ఆధారపడిన సాక్ష్యాధారమది. మీ అభిప్రాయాలను రుజువుపర్చి, సందర్భ సహిత సాక్ష్యాధారమును ఒప్పింపజేయాలంటే, మీ అభిప్రాయాలకు మద్దతుగా మీకు తగినన్ని వాస్తవాలు, తర్కనలు ఉండాలి.

13 మీరందిస్తున్న రుజువులన్నీ (అవి క్రమంలో ఉండనవసరం లేదు) ప్రేక్షకులను సంతృప్తిపర్చడానికి సరిపోతాయని మీరనుకుంటే, ప్రసంగం సంతృప్తికరంగా ఉన్నట్లు మీ సలహాదారుడు పరిగణిస్తాడు. దానిని ప్రేక్షకుల దృక్పథం నుండి చూడగా “నేను ఒప్పించబడ్డానా?” అని సలహాదారుడు తన్నుతాను ప్రశ్నించుకుంటాడు. అతడు ఒప్పించబడితే మీ ప్రసంగం విషయంలో మిమ్మల్ని మెచ్చుకుంటాడు.

14. ఫలవంతమైన సారాంశమంటే ఏమిటి?

14 ఫలవంతమైన సారాంశం. ఒప్పింపజేసే తర్కనలకు సర్వసాధారణంగా ఏదొక విధమైన సారాంశం అవసరమౌతుంది. ఉపయోగించబడిన తర్కనలకు ప్రశంసను యినుమడింపజేయడానికి అది తర్కనకు అంతిమ విన్నపం. సారాంశమంటే, సాధారణంగా అది “ఇలా ఉంది గనుక, అలా ఉంది గనుక, గనుక మనం చెప్పేదేమంటే . . .” అని పేర్కొనేదే అయినా కేవలం వాస్తవాలను మరలా పేర్కొనడం మాత్రమే కాకూడదు. అంశాలన్నింటిని ముడిపెట్టడానికి, వాటిని ఒక కొలిక్కి తీసుకురావడానికి ఇది నిర్దేశించబడింది. అనేక సందర్భాల్లో ఫలవంతమైన సారాంశమే, తర్కాలను నిజంగా ఒప్పింపజేసే రీతిగా ఉండేలా వివరిస్తుంది

**********

15, 16. వివేచించునట్లు ప్రేక్షకులకు ఎందుకు సహాయపడాలి?

15 మీరు ఒక ప్రసంగంలో ఉపయోగించే తర్కనలు బాగున్నప్పటికిని, కేవలం వాస్తవాలను పేర్కొంటే సరిపోదు. ప్రేక్షకులు మీ తర్కనలను అర్థం చేసుకొని, మీకున్న అభిప్రాయానికే వారును వచ్చేలాగున వారు తర్కించుకొనేందుకు సహాయపడే రీతిలో మీరు వాటిని అందించాలి. దీనినే ప్రసంగ సలహా పత్రం “ప్రేక్షకులు ఆలోచించేలా సహాయపడుటకు” అని పేర్కొంటున్నది.

16 దేవుడు మనతో కారణసహితంగా మాట్లాడుతున్నాడు గనుక మీరు ఈ లక్షణాన్ని కలిగియుండాలి. అంతేకాదు, యేసు తాను చెప్పిన ఉపమానాలను తన శిష్యులకు వివరించి, యివే సత్యాలను యితరులకు బోధించే విధంగా వారిని సన్నద్ధం చేశాడు. వివేచించేందుకు మీ ప్రేక్షకులకు సహాయపడుట అంటే మీ వాదనలను గ్రహించి, మీకున్నటువంటి అవగాహనకే వారును వచ్చి, యితరులకు బోధించడానికి మీ వాదనలను ఉపయోగించే రీతిగా సన్నద్ధులై ఉండునట్లు మీ ప్రేక్షకులకు సహాయపడుటకు అవసరమయ్యే పద్ధతులన్నీ ఉపయోగించమని అర్థము.

17, 18. ఒకే సామాన్య విషయాన్ని ప్రస్తావించడం ఎలా జరుగుతుంది?

17 ఒకే సామాన్య విషయాన్ని ప్రస్తావించుట. మీరు ప్రసంగాన్ని ప్రారంభించినప్పుడు ఒక సామాన్య విషయాన్ని ప్రస్తావించడానికి మీరు ఏమి చెబుతారో అలాగే దానిని ఎలా చెబుతారో అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. అయితే ప్రసంగం ముందుకు సాగేకొలది ఆ విషయాన్నే ప్రస్తావించడంలో తప్పిపోకూడదు లేక ప్రేక్షకుల అవధానాన్ని పోగొట్టుకోకూడదు. మీ ప్రేక్షకుల మనస్సును తాకే విధంగా మీరు విషయాలను చెప్పుకుంటూపోవాలి. అంటే చర్చించబడుతున్న విషయంపై వారి దృక్పథమేమిటో మీరు మనస్సునందు ఉంచుకోవలసిన అవసరముంది, మరి మీ తర్కన ఎందుకు యుక్తమైందో వారు గ్రహించేలా సహాయపడుటకు ఈ అవగాహనను ఉపయోగించండి.

18 ఒక సామాన్య విషయాన్ని ప్రస్తావించి కడవరకు దానిని కొనసాగించి, ప్రేక్షకులు కారణసహితంగా వివేచించడానికి సహాయపడిన ఆదర్శ దృష్టాంతం, అపొస్తలుల కార్యములు 17:22-31 నందు వ్రాయబడిన అపొస్తలుడైన పౌలు వాదనే. ప్రారంభంలో అతడు ఒక సామాన్య విషయాన్ని ప్రస్తావించి, తన ప్రసంగమంతటిలో దానిని ఎలా కొనసాగించాడో గమనించండి. ముగింపుకు వచ్చేసరికి అక్కడున్న న్యాయాధిపతితో సహా ప్రేక్షకులలో కొంతమంది సత్యాన్ని అంగీకరించేలా చేశాడు.—అపొస్తలుల కార్యములు 17:33, 34.

19-23. విషయాలను తగినంతగా వృద్ధిచేయగల పద్ధతులను సూచించండి.

19 తగినన్ని అంశాలు చర్చించబడ్డాయి. ప్రేక్షకులు ఒక విషయాన్ని వివేచించాలంటే, తర్కనలను తాము పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాం గనుక వాటిని నిరాకరిస్తున్నాము అనడానికి వీలులేని విధంగా తగినంత సమాచారాన్ని వారికి అందించాలి. వారికి సహాయపడవలసిన బాధ్యత మీదే.

20 దానిని ఫలవంతంగా చేయడానికి, ఎక్కువ విషయాలను ప్రస్తావించకుండా జాగ్రత్తపడండి. ప్రసంగాన్ని త్వరత్వరగా ముగించేస్తే అందు మూలంగా కలుగవలసిన ప్రయోజనం చేకూరదు. మీ ప్రేక్షకులు కేవలం వినడం మాత్రమే కాదు వాటిని అర్థం చేసుకొనే విధంగా విషయాలను పూర్తిగా వివరించడానికి సమయాన్ని తీసుకోండి. మీరు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించినప్పుడు, దానిని వివరించడానికి సమయాన్ని తీసుకోండి. ఎందుకు? ఎవరు? ఎలా? ఏమిటి? ఎప్పుడు? ఎక్కడ? అనే ప్రశ్నలకు సమాధానమివ్వండి. అలా చేసి ప్రేక్షకులు విషయాన్ని మరింత ఎక్కువగా గ్రహించడానికి సహాయపడండి. మీ మాటల్లోని సహేతుకతను నొక్కిచెప్పడానికి కొన్నిసార్లు మీరు అనుకూల ప్రతికూల వాదనలను కూడా అందించ వచ్చును. అలాగే, ఒక నియమాన్ని పేర్కొన్న తరువాత, దాని అన్వయింపును ప్రేక్షకులు గ్రహించేటట్లు ఉపమానరీతిగా తెలియజేయడం మంచిదని మీరు గ్రహించవచ్చు. అయితే, వివేకాన్ని ఉపయోగించాలి. ఏదైనా అంశాన్ని వివరించాలంటే అది లభించే సమయం మీదను, చర్చించబడుతున్న విషయానికి దీనికివున్న సంబంధం మీదను ఆధారపడి ఉంటుంది.

21 ప్రేక్షకులు వివేచించునట్లు సహాయపడడానికి ఎల్లవేళల ప్రశ్నలు బాగా పనిచేస్తాయి. వాక్యాలంకార ప్రశ్నలు, అంటే ప్రేక్షకుల నుండి సమాధానం అపేక్షించకుండా వారికి వేయబడే ప్రశ్నలు, వాటికి తోడు సరియైన వ్యవధులు వారి ఆలోచనను రేకెత్తిస్తాయి. మీరు యింటింటి సేవలో మాట్లాడేరీతిగా ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులతో మాట్లాడుతుంటే, మీ ప్రసంగంలో మున్ముందుకు సాగిపోతూ ప్రశ్నలు వేసి వారిలోని ఆలోచనలను రాబట్టండి, ఆ విధంగా ప్రసంగించబడుతున్న విషయాలను వారు గ్రహించి, అంగీకరించేటట్లు చేయండి.

22 మీ ప్రేక్షకుల మనస్సును రంజింపజేయగోరుతున్నారు గనుక వారు తమ స్వంత అనుభవం నుండి లేదా మీ చర్చలోనే అంతకుముందు భాగంలో వారు అప్పటికే తెలుసుకున్న విషయాలపై మీరిప్పుడు నిర్మించాలి. కనుక మీరు కొన్ని విషయాలను తగినంతగా వివరించారో లేదో తెలుసుకొనడానికి, ఆ అంశాన్ని గూర్చి అప్పటికే మీ ప్రేక్షకులకు ఏమి తెలుసు అనేదానిని మీరు పరిగణలోనికి తీసుకోవాలి.

23 మీరు చెప్పేది ప్రేక్షకులు వింటున్నారో లేదో నిశ్చయ పర్చుకొనడానికి ఎల్లవేళల వారి స్పందనను పరిశీలించుట ప్రాముఖ్యం. అవసరమైతే, మరో అంశానికి వెళ్లకముందు కొంచెం వెనక్కి వెళ్లి విషయాలను స్పష్టీకరించండి. విషయాలను పరిశీలించడంలో మీరు వారికి సహాయపడకపోతే, మీ ఆలోచనా సరళినుండి వారు సులభంగా ప్రక్కకు తొలగిపోగలరు.

24. తర్కనలను మీ ప్రేక్షకులకు అన్వయిస్తే ఏ మంచి సంకల్పం నెరవేరుతుంది?

24 ప్రేక్షకులకు అన్వయించబడింది. ఏదైనా తర్కాన్ని అందించేటప్పుడు, పరిశీలించబడుతున్న విషయానికి అది ఎలా సంబంధం కలిగివుందో స్పష్టంగా పేర్కొంటూ వివరించడానికి ప్రయత్నించండి. అంతేకాకుండా అందించబడిన వాస్తవాలకు అనుగుణంగా చర్యగైకొనండని శ్రోతలను అర్థిస్తూ మీ ప్రసంగంలో పురికొల్పును యిమడ్చండి. మీరు చెప్పిన దాన్ని వారు నిజంగా ఒప్పుకుంటే, చర్యగైకొనడానికి సిద్ధంగా ఉంటారు.

[అధ్యయన ప్రశ్నలు]