సరియైన ఉచ్చారణతో ధారాళంగా, సంభాషణాశైలిలో ప్రసంగించుట
పాఠ్యభాగం 29
సరియైన ఉచ్చారణతో ధారాళంగా, సంభాషణాశైలిలో ప్రసంగించుట
1-4. ధారాళత లోపించడానికి కారణాలను, సూచనలను పేర్కొనండి.
1 ప్రసంగించేందుకు మీరు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడు, సరియైన మాటల కొరకు మీరు తరచూ తడవులాడుతున్నట్లు మీకనిపిస్తుందా? లేదా మీరు గట్టిగా చదువుతున్నప్పుడు కొన్ని మాటలవద్ద తడబడుతున్నారా? అట్లయితే, ధారాళత విషయంలో మీకు సమస్య ఉంది. మాటల ప్రయోగంలో సంసిద్ధంగా ఉండేవాడే ధారాళంగా మాట్లాడే వ్యక్తి. అంటే అనాలోచితంగా లేదా విశ్వాసపాత్రంకాని మాటలను మాట్లాడే వ్యక్తని దాని భావం కాదు. అది సులభంగా లేదా స్వేచ్ఛగా వచ్చే మృదువైన లేక మనోహరమైన ప్రసంగం. ప్రత్యేక అవధానమివ్వడం కొరకే ధారాళత అనేది ప్రసంగ సలహా పత్రంపై పేర్కొనబడింది.
2 మాట్లాడేటప్పుడు ధారాళత లోపించడానికి స్పష్టమైన ఆలోచన లేకపోవడం, ప్రసంగాన్ని సరిగ్గా సిద్ధపడక పోవడమనేవి సర్వసాధారణమైన కారణాలు. సరియైన భాషా పరిజ్ఞానం లేకపోయిన లేదా మాటల ఎంపిక అంతంత మాత్రంగావున్నా అలా జరుగుతుంది. చదివేటప్పుడు ధారాళత లోపించిందంటే, ఇక్కడ కూడా పదముల పరిజ్ఞానం లేకపోవడం వలన తడబడుతూ లేదా సంశయిస్తున్ననూ సాధారణంగా గట్టిగా చదవడం అభ్యాసం చేయకపోవడం వలన అది కలుగుతుంది. ప్రాంతీయ సేవలో ధారాళత లోపించిందంటే, పైన పేర్కొన్న కారణాలతోపాటు బిడియం లేదా అనిశ్చయత తోడైయుండవచ్చును. అక్కడ సమస్య ముఖ్యంగా తీవ్రమైంది ఎందుకంటే కొన్ని సందర్భాలలో మీ ప్రేక్షకులు అనంగీకారంతో వెళ్లిపోవచ్చును. రాజ్యమందిరం లోనైతే మీ ప్రేక్షకులు మిమ్మును విడిచి వెళ్లరు, కాని వారి మనస్సులు సంచరిస్తూ ఉంటాయి మరి మీరు చెప్పేదానిలో ఎక్కువ భాగం వృధాకావచ్చు. గనుక ఇది ప్రాముఖ్యమైన విషయమే; ధారాళత నిజంగా అలవర్చుకోవలసిన లక్షణమే.
3 అనేకమంది ప్రసంగీకులకు “మరి-ఆ” లేదా అలాంటి “ఊతపదాలను” చేర్చి వినసొంపు లేకుండాచేసే అలవాటు ఉంది. అట్టి పదాలను మీరు ఎంత తరచుగా వాడుతున్నారో మీకు తెలియకపోతే, ఎవరైనా మీ ప్రసంగాన్ని వినేటట్లు ఏర్పాటు చేసుకొని, మీరు వీటిని పలికిన ప్రతిసారి వెంటనే వారిని పలకమనిచెప్పి అభ్యాస కార్యక్రమాన్ని చేపట్టి ప్రయత్నించడం మంచిది. మీరే ఆశ్చర్యపోవచ్చు.
4 ఇతరులు ఎప్పుడూ అరిగిపోయిన రికార్డులా మరలా మొదటికే వెళ్తుంటారు, అంటే వాక్యాన్ని ప్రారంభించి కొంచెం సేపు ఆగి మరలా ఆ వాక్యాన్ని మొదటి నుండి ప్రారంభిస్తుంటారు. ఈ చెడు అలవాటుతో మీరు సతమతమౌతుంటే, మీ ప్రతిదిన సంభాషణలో దీనిని అధిగమించడానికి ప్రయత్నించండి. మొదట యోచించడానికి ప్రయత్నించి విషయాన్ని స్పష్టంగా మీ మనస్సులో పెట్టుకోండి. అప్పుడు ఆ విషయాన్ని ఆగకుండా లేదా ఉద్దేశాలను “మధ్యంతరంగా” మార్చకుండా చెప్పండి.
5-10. ప్రసంగీకుని ధారాళతను అభివృద్ధి చేసుకొనడానికి ఏ సలహాలివ్వబడ్డాయి?
5 మరో విషయం. మనం మాట్లాడేరీతిగానే మాటలను ఉపయోగించడానికి మనం అలవాటు పడ్డాం. గనుక ఏమి చెప్పదల్చామో మనకు కచ్చితంగా తెలిస్తే పదాలు సహజంగానే రావాలి. పదాలను మీరు తలంచాల్సివుంది. నిజానికి, ఉద్దేశం మీ మనస్సులో స్పష్టంగావుందో లేదో చూసుకొని మీరు మాట్లాడుతూ ఉండగా పదాలను గూర్చి ఆలోచించడానికి అభ్యాసం చేయడం మంచిది. మీరలా చేస్తే, మీరు మాట్లాడే మాటల మీద కాకుండా ఉద్దేశంపై మీ మనస్సు నిలిపితే, మాటలు వాటంతంటవే రావాలి, మరి మీ భావాలు మీరనుభవిస్తున్నంత సహజంగా వ్యక్తపర్చబడాలి. అయితే ఉద్దేశాలకు బదులు మాటలను గూర్చి మీరు ఆలోచించడం మొదలు పెడితే మీ ప్రసంగం నత్తనడక నడుస్తాది.
6 ధారాళత విషయంలో మీకున్న సమస్య మాటల ఎంపికకు సంబంధించినదైతే, భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించుకొనడానికి క్రమంగా పఠనము చేయడం అవసరం. సొసైటీ ప్రచురించే కావలికోట మరితర సాహిత్యాలు ప్రత్యేకంగా మీకు పరిచయంలేని మాటలను ఉపయోగిస్తుంటాయి, వాటిలో కొన్నింటిని మీ ప్రతిదిన మాటల్లో చేర్చండి.
7 చదవడంలో ధారాళత లేకపోవడానికి కారణం సాధారణంగా ఆ మాటలతో పరిచయం లేకపోవడమే గనుక అదే మీ సమస్యయైతే గట్టిగాను ఒక క్రమపద్ధతిలోను చదవడం మీరు బాగా అభ్యాసం చేయాలి.
8 అలా చేయగల్గే ఒక విధానమేమంటే, ఒకటి రెండు పేరాలను ఎంపిక చేసుకొని ఆ భాగమంతటితో మీరు పూర్తిగా పరిచయస్తులయ్యేంత వరకు నిశ్శబ్దంగా చదవండి. ఒకే ఉద్దేశానికి సంబంధించిన వాటిని ప్రత్యేకించండి అవసరమైతే వాటికి గుర్తు పెట్టండి. అప్పుడు ఈ భాగాన్ని గట్టిగా చదవడం అభ్యాసం చేయండి. అలా అభ్యాసం చేసేటప్పుడు ఒకే ఉద్దేశంగల వాటన్నింటిని ఏమాత్రం తడబడకుండా లేదా ఆగకూడని చోట ఆగకుండా ఉండేంత వరకు పదేపదే చదవండి.
9 పరిచయంలేని లేదా కష్టమైన మాటలు మీరు ఉచ్చరించేంత వీలుగా ఉండేంత వరకు వాటిని పదేపదే ఉచ్చరించాలి. ఆ మాటను మాత్రమే ఉచ్చరించ గల్గిన తరువాత పరిచయమున్న మాటలను వాక్యభాగంతో ఎంత సులభంగా కలిపి చదువుతారో ఆలాగే ఆ మాటను కూడా చదివేంత వరకు వాక్యభాగాన్నంతటిని చదవండి.
10 అంతేకాకుండా, అలా చూడగానే చదివేటట్లు క్రమంగా అభ్యాసం చేసుకోండి. ఉదాహరణకు, దినవచనాన్ని దాని వ్యాఖ్యానాలను మీరు మొదటిసారిగా చూచినప్పుడే వాటిని గట్టిగా చదవడానికి ఎల్లవేళలా ప్రయత్నించండి. ఒక్కొక్క మాటను చూచే బదులు మాటలను సముదాయాలుగా చూచేలా మీ కన్నును అనుమతించి, ఉద్దేశాలన్నింటిని వ్యక్తపర్చడానికి అలవాటు పడండి. మీరు అభ్యాసం చేయగల్గితే, ప్రతిభావంతంగా మాట్లాడ్డం, చదవడం అనే శ్రేష్ఠమైన లక్షణాన్ని జయించగల్గుతారు.
**********
11-15. సంభాషణా శైలి ఉపయోగించే మాటలపై ఎలా ఆధారపడి ఉంటుంది?
11 సలహా పత్రంపై పేర్కొనబడిన మరొక కోరదగిన ప్రసంగ లక్షణం “సంభాషణా లక్షణం.” అది మీ ప్రతిదిన జీవితంలో మీరు కలిగియున్నదే, అయితే మీరు ప్రసంగాన్నిచ్చేటప్పుడు అది మీ దగ్గర వుంటుందా? పెద్ద సమూహముతో కూడా సులభంగా సంభాషించగల్గే వారు సహితం “ప్రసంగించడానికి” ముందుగా సిద్ధపడమని వారిని కోరితే ఎందుకో తరచూ వ్యావహారికంగానూ ఏదో “బోధ” చేస్తున్నవారిగాను మారిపోతారు. అయినా బహిరంగంగా మాట్లాడ్డంలో అత్యంత ప్రతిభావంతమైంది సంభాషణా శైలియే.
12 సంభాషణా శైలి మాటలు ఉపయోగించబడ్డాయి. సంభాషణా శైలిలో ప్రసంగించుటనేది ఎక్కువగా ఉపయోగించబడే మాటలపై ఆధారపడి ఉంటుంది. ధారాళంగా యిచ్చే ప్రసంగాన్ని సిద్ధపడుతున్నప్పుడు, అక్కడ వ్రాసుకున్న మాటలనే ఉన్నవి ఉన్నట్టుగా ఉచ్చరించడం సర్వసాధారణంగా మంచిది కాదు. వ్రాసుకున్న శైలికి మాట్లాడే మాటకు వ్యత్యాసముంటుంది. కావున ఈ విషయాలన్నింటిని మీ స్వంత మాటల్లో పెట్టండి. అక్కడ వ్రాసుకున్న వాక్యాన్ని ఉపయోగించడం మానండి.
13 మీరు వేదికమీద యిచ్చే ప్రసంగం అనుదినం మీరు మాట్లాడే తీరులో ఉండాలి. “బూటకంగా మాట్లాడేందుకు” మీరు ప్రయత్నించ కూడదు. అయినప్పటికిని, మీ మాటలు అతి జాగ్రత్తతో ముందుగా యోచించబడినవే గనుక మీరు సిద్ధపడిన ప్రసంగం మీ అనుదిన మాటలకంటే సహజంగా మెరుగ్గానే ఉండి ఎంతో ధారాళంగా వస్తాయి. కావున, మీ మాటలకే చక్కగా పదకూర్పు చేయాలి.
14 ప్రతిదినం అభ్యాసం చేసే అవసరతను యిది నొక్కితెల్పుతున్నది. మాట్లాడేటప్పుడు మీ సొంతమాటలనే మాట్లాడండి. యాసగా మాట్లాడవద్దు. మీరు కలిగియున్న ప్రతి విభిన్న ఉద్దేశాన్ని అందించడానికి అవే మాటలను పదాలను తదేకంగా ఉచ్చరించడం మానండి. భావంతో మాట్లాడ్డం నేర్చుకోండి. మీ ప్రతిదిన సంభాషణను గూర్చి గర్వపడండి, మీరు వేదిక మీద ఉన్నప్పుడు మాటలు ధారాళంగా వస్తాయి గనుక మీరు వైవిధ్యంతో కూడిన సంభాషణా శైలిలో ఎటువంటి ప్రేక్షకులకైనా తేలిగ్గా అర్థమయ్యే రీతిగా, అంగీకృతంగా ఉండేలా మాట్లాడగల్గుతారు.
15 ముఖ్యంగా యిది ఇంటింటి పరిచర్యలో వాస్తవం. మరి విద్యార్థి ప్రసంగాల్లో మీరు ఒక గృహస్థునితో మాట్లాడుతున్నట్లైతే, మీరు యింటింటి సేవలో ఉన్నట్లు తలంచి, అక్కడ మీరెంత సహజంగా, తేలిగ్గా అర్థమయ్యే రీతిగా మాట్లాడతారో ఇక్కడ కూడ అలాగే మాట్లాడడానికి ప్రయత్నించండి. అది అప్పటికప్పుడు మాట్లాడుతున్న, సహజమైన ప్రసంగంగా ఉంటుంది, అంతకన్నా ప్రాముఖ్యంగా ప్రాంతీయ సేవలో మరింత ప్రతిభావంతంగా మాట్లాడే తర్ఫీదును యిది మీకిస్తుంది.
16-19. ప్రసంగించే తీరు సంభాషణా శైలిపై ఎలా ఆధారపడి ఉంటుందో సూచించండి.
16 సంభాషణా శైలి ప్రసంగం. సంభాషించే రీతిలో ప్రసంగించడమనేది కేవలం ఉపయోగించబడే మాటల మీదే ఆధారపడదు. మీరు ప్రసంగించే పద్ధతి లేదా శైలి కూడా ప్రాముఖ్యమే. దీనిలో కంఠ స్వరం, స్వరభేదం, సహజంగా వ్యక్తపర్చడం యిమిడివున్నాయి. ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగిస్తున్ననూ ప్రతిదిన మాటలు వచ్చేటంతటి అయత్న పూర్వకంగా అవి వస్తాయి.
17 సంభాషణా శైలి ప్రసంగం వాగ్దాటికి పూర్తిగా భిన్నమైనది. “బోధించే పద్ధతిలో” అందించే ప్రసంగానికుండే విధానాలన్నీ దానికి ఉండవు, మరి సకల డాంబికాలకు అది అతీతంగా ఉంటుంది.
18 క్రొత్తగా ప్రసంగించేవారు సంభాషణా శైలిలో ప్రసంగించ లేకపోవడానికి ఒక కారణమేమంటే, ప్రసంగానికి సంబంధించిన మాటలను మరీ విపరీతంగా ముందే సిద్ధపడడమే. ప్రసంగించడాన్ని సిద్ధపడేటప్పుడు సరియైన విధంగా సిద్ధపడ్డాననడానికి ప్రసంగమంతా కంఠస్థమయ్యేంత వరకు ఒక్కొక్క మాట పలుకుతూ ఉండాలని మీరు తలంచకండి. ధారాళంగా యిచ్చే ప్రసంగాన్ని సిద్ధపడుతున్నప్పుడు వ్యక్తపర్చాల్సిన విషయాలను జాగ్రత్తగా పునర్విమర్శ చేసుకోవడానికి ప్రాధాన్యతనివ్వాలి. వీటిని ఉద్దేశాలుగా లేదా తలంపులుగా పరిగణించి ఒకదాని తరువాత మరొకటి సులభంగా మనస్సులోనికి వచ్చేంతవరకు పునర్విమర్శించుకోవాలి. వాటిని హేతుబద్ధంగా వర్ణించి, పథకం ప్రకారం ఏర్పాటు చేసుకొంటే యిది అంత కష్టమనిపించదు, మరి ప్రసంగించేటప్పుడు ఆ ఉద్దేశాలు సులభంగా, తేలిగ్గా వచ్చేస్తాయి. అలా ఉంటే, సంభాషించాలనే కోరికతో వాటిని వ్యక్తపరిస్తే ప్రసంగంలో సంభాషణా శైలి ఒక భాగమైయుంటుంది.
19 మీరలా చేస్తున్నారో లేదో చూసుకోవడానికి ఒక మార్గమేమంటే, ప్రేక్షకులలో వివిధ వ్యక్తులతో మాట్లాడే ప్రయత్నం చేయడమే. ఒక్కొక్కరితో సూటిగా మాట్లాడండి. అతడు ఒక ప్రశ్నను అడిగాడని తలంచి దానికి సమాధానమివ్వండి. ఆ విషయాన్ని వివరిస్తూ అతనితో ఏకాంతంగా మాట్లాడుతున్నట్లు ఊహించుకోండి. పిమ్మట ప్రేక్షకుల్లోని మరొకరిపై దృష్టిని నిల్పి అదే పద్ధతిని అనుసరించండి.
20-23. ఒకడు తాను చదివేతీరు సహజంగా ఉండేలా ఎలా చేయగలడు?
20 చదివేటప్పుడు సంభాషణా శైలిలో చదవడమనేది నిపుణత సంపాదించవలసిన అత్యంత కష్టమైన ప్రసంగ లక్షణాలలో ఒకటి, అయితే అది అత్యంత శ్రేష్ఠమైన వాటిలో ఒకటి. మనం బహిరంగంగా చదివేదానిలో ఎక్కువగా సిద్ధపడి ధారాళంగా యిచ్చే ప్రసంగం కొరకు లేఖనాలను బైబిలునుండి చదవడం ఉంటుంది. బైబిలును భావగర్భితంగాను అర్థాన్ని గ్రహించిన తీరులోను చదవాలి. అది సజీవంగా ఉండాలి. అయితే దేవుని నిజ సేవకులు మతనాయకుల పావనప్రద శైలిని ఎన్నడూ అనుకరించకూడదు. యెహోవా సేవకులు ఆయన వాక్యాన్ని ఈ పుస్తకమందలి సజీవమైన భాషకివ్వాల్సిన వేషధారణలేని వాస్తవికతతో, సహజంగా నొక్కిపల్కి చదువుతారు.
21 అలాగే కావలికోట లేదా పుస్తక పఠనములో పేరాలను చదవడం విషయంలోను అంతే. ఇక్కడ కూడా పదాలు, వాక్యకూర్పు సంభాషణా శైలిలో ఉండవు, కావున మీరు చదివేతీరు ఎల్లవేళల సంభాషించే విధంగా ఉండదు. కాని, చదువుతున్నదాని భావాన్ని మీరు గ్రహించి, వీలైనంత సహజంగాను అర్థవంతంగాను చదవగల్గితే, మీరు సాధారణంగా మాట్లాడేదానికన్నా కొంచెం వ్యవహారికంగా ఉన్నప్పటికిని దానిని సిద్ధపడి ధారాళంగా యిచ్చే ప్రసంగంలా యివ్వవచ్చు. గనుక, మీరు ముందుగా సిద్ధపడగల్గితే మీకు సహాయపడగల్గే గుర్తులేవైనా ఉంటే వాటిని వ్రాసుకొనడం మీ అభ్యాసమై వుండాలి, సమాచారాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నట్లు, సహజ శైలిలో అందజేయడానికి శాయశక్తులా కృషి చేయండి.
22 సంభాషణా శైలిలో చదవడం లేదా మాట్లాడడంలో యథార్థత, సహజత్వం కీలకమైనవి. మీ హృదయం నుండి సంగతులు పొర్లి ప్రవహించేలా చేసి, మీ శ్రోతలకు మనవి చేసుకొంటున్నట్లుగా మాట్లాడండి.
23 మంచి మర్యాదను ఎలాగైతే ఆయా సందర్భాలలో మాత్రమే ధరించుకోమో మంచి భాష కూడా అంతే. మీరు యింటివద్ద మంచి మర్యాదను కలిగివుంటే ఎల్లవేళల దానిని బయట ఎలా ప్రదర్శిస్తారో, అలాగే మీరు ప్రతిదినం మంచి భాషను మాట్లాడితే, వేదికమీద కూడా ఆవిధంగానే మాట్లాడగల్గుతారు.
**********
24, 25. లోపభూయిష్టమైన ఉచ్చారణ ఎందుకు కోరదగింది కాదు?
24 ఉచ్చారణ. సరియైన ఉచ్చారణ కూడా ప్రాముఖ్యం, అది ప్రసంగ సలహా పత్రంపై ప్రత్యేకంగా పేర్కొనబడింది. పేతురు యోహానులు విద్యలేని పామరులని సాధారణ మనుష్యులని పరిగణింపబడినట్లే, క్రైస్తవులందరికి లోకసంబంధమైన మంచి విద్య లేకపోయినప్పటికిని, మనం ప్రసంగించేటప్పుడు సరిగా ఉచ్చరించకపోవడం వలన దారిమళ్లకుండా జాగ్రత్త వహించాలి. తగినంత అవధానమిస్తే దాన్ని యిట్టే సరిదిద్దుకోవచ్చు.
25 ఒక వ్యక్తి ఉచ్చారణ అంతగా బాగుండకపోతే, తన ప్రేక్షకుల మనస్సులకు తప్పుడు తలంపులను అందించే అవకాశముంది, అది నిజంగా వాంఛనీయం కాదు. ఎవరైనా తన ప్రసంగంలో తప్పుడు ఉచ్చారణ చేయడం మీరు విన్నప్పుడు, సర్వసాధారణంగా జరిగేదేమంటే ఎర్ర లైటు వెలిగినట్లు అది మీ మనస్సులో తళుక్కుమని వెలుగుతుంది. అతడు తర్కించే విషయాన్ని వినడం మానివేసి తప్పుగా ఉచ్చరించిన ఆ పదాన్ని గూర్చే మీరు తలంచడం మొదలు పెడతారు. ఏమి చెప్పబడింది అనేదాని నుండి ఎలా చెప్పబడింది అనేదానిపై మీ అవధానాన్ని మళ్లించేలా అది చేస్తుంది.
26, 27. ఉచ్చారణకు సంబంధించి ఏ సమస్యలు పేర్కొనబడ్డాయి?
26 ఉచ్చారణకు సంబంధించి మూడు సామాన్యమైన సమస్యలున్నాయని చెప్పవచ్చు. ఇందులో ఒకటి, కచ్చితంగా తప్పుడు ఉచ్చారణే, అందులో సరియైనచోట నొక్కి పలకక పోవడం లేదా అక్షరాలకు సరియైన శబ్దాన్ని యివ్వకపోవడం జరుగుతుంది. అనేకమైన ఆధునిక భాషలకు ఒక క్రమమైన ఉచ్చారణా పద్ధతి ఉంది, కాని ఇంగ్లీషు భాషకు మాత్రం ఒకే పద్ధతి లేదు, అది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. అటుతరువాత సరియైన విధంగా ఉచ్చరించేది మరొకటుంది కాని అతిశయోక్తిగా పలకడం, మరీ సున్నితంగా మాట్లాడడం, బూటకపు ప్రదర్శన, గొంతుచించుకొని అరవడం కోరదగినవి కావు. మూడవ సమస్య ఏమంటే, తదేకంగా మాటల్లో తడబడడం, గుణింతాలను తీక్షణంగా చూడడం లేదా వాటిని దాటవేయడం మున్నగు అలవాట్లు ఉంటాయి. వాటిని విడనాడాలి.
27 సాధారణంగా మనం ప్రతిదినం మాట్లాడే మాటల్లో మనకు పరిచయమున్న మాటలను వాడుతూ ఉంటాము; కాబట్టి ఈ విషయంలో ఉచ్చారణ ఏమంత సమస్యగా పరిణమించదు. చదివేటప్పుడే గొప్ప చిక్కు ఎదురౌతుంది. అయితే యెహోవాసాక్షులు బహిరంగంగాను, ఏకాంతంగాను చదవడంలో ప్రముఖ పాత్ర వహిస్తారు. మనం యింటింటికి వెళ్లినప్పుడు ప్రజల కొరకు బైబిలును చదువుతాం. కొన్నిసార్లు మనల్ని కావలికోట పఠనంలో, ఒక గృహ బైబిలు పఠనంలో లేదా సంఘ పుస్తక పఠనంలో పేరాలను చదవమని కోరవచ్చును. మనం చదవడం కచ్చితంగా ఉండడం, ఉచ్చారణ సరియైన విధంగా ఉండడం ప్రాముఖ్యం. అలా ఉండకపోతే, మనం ఏమి మాట్లాడుతున్నామో మనకు తెలియదనే భావాన్నిస్తుంది. వర్తమానంపై అవధానాన్ని నిలపకుండా చేస్తుంది.
28-34. తన ఉచ్చారణను అభివృద్ధి చేసుకొనడానికి ఒకనికి ఎలా సహాయపడవచ్చు?
28 తప్పుడు ఉచ్చారణ విషయమై సలహా యివ్వడంలో మితిమీర కూడదు. ఒకటి రెండు మాటల్లో సమస్య తలెత్తితే, ఏకాంతంగా సలహా యిస్తే సరిపోతుంది. అయితే ప్రసంగమంతటిలో కేవలం కొన్ని మాటలనే తప్పుగా ఉచ్చరించినప్పటికిని, ఈ మాటలు మనం పరిచర్యలో లేదా మన ప్రతిదిన మాటల్లో క్రమంగా వాడేవైతే వాటిని సరిగ్గా ఉచ్చరించడం ఎలాగో విద్యార్థి నేర్చుకొనేలా పాఠశాల అధ్యక్షుడు వాటికి అవధానమిస్తే ఆ విద్యార్థికి ఎంతో సహాయకరంగా ఉంటుంది.
29 మరోవైపు, విద్యార్థి బైబిలునుండి చదువుతున్నప్పుడు ఒకటి లేదా రెండు హెబ్రీ పదాలను సరిగా ఉచ్చరించకపోతే, గుర్తించదగిన బలహీనతగా దీనిని పరిగణించ కూడదు. అయితే, అతడు పేర్లను ఎక్కువ మట్టుకు సరిగా ఉచ్చరించకపోతే, సిద్ధపడలేదని తేటతెల్లమౌతాది, అప్పుడు సలహా యివ్వాలి. సరియైన ఉచ్చారణ ఏమిటో ముందుగా నిర్దారించుకొని దానిని అభ్యాసం చేసేందుకు విద్యార్థికి సహాయపడాలి.
30 అతిశయోక్తిగా ఉచ్చరించే విషయం కూడా అంతే. అదేపనిగా చేస్తున్నందున అది నిజంగా ప్రసంగం నుండి ప్రక్కకు మళ్లిస్తుంటే, విద్యార్థికి సహాయపడాలి. అంతేకాకుండా, అనేకమంది వేగంగా మాట్లాడుతున్నప్పుడు కొన్నిమాటలను దాటవేస్తారని కూడా గుర్తించాలి. దీనికి సలహా యివ్వనవసరం లేదు, కాని అదే అలవాటుగా చేస్తుంటే, విద్యార్థి పదేపదే మాటలను దాటవేస్తున్నందున అతని ప్రసంగాన్ని అర్థం చేసుకొనడం కష్టమౌతుంటే లేదా వర్తమానం ప్రక్కదారి పడుతుంటే, అప్పుడు అతనికి ఉచ్చారణను సరిచేసుకొనేందుకు కొంత సహాయాన్ని అందించాల్సి ఉంటుంది.
31 అయితే, విభిన్న స్థానాలలో ఉచ్చారణ వ్యత్యాసంగా ఉంటుందన్న సంగతిని మీ సలహాదారుడు మనస్సునందు ఉంచుకుంటాడు. నిఘంటువులు సహితం ఒకటి కంటే ఎక్కువ అంగీకృత ఉచ్చారణను పేర్కొంటున్నాయి. కావున ఉచ్చారణ విషయంలో సలహా యిచ్చేటప్పుడు అతడు తగు జాగ్రత్త వహిస్తాడు. వ్యక్తిగత ఎంపికగా అతడు దానిని పరిగణించడు.
32 ఉచ్చారణ విషయంలో మీకు సమస్యవుంటే, దాని మీద మీరు మనస్సు నిలిపినప్పుడు దానిని సరిచేసుకొనడం ఏమంత కష్టం కాదని కనుగొంటారు. అనుభవజ్ఞులైన ప్రసంగీకులు సహితం తమ్మును చదవమని అడిగినప్పుడు తమకు అంతగా పరిచయంలేని మాటలను నిఘంటువులో చూస్తారు. అంతేగాని వాటిని ఖూనీ చేయరు. గనుక నిఘంటువును ఉపయోగించండి.
33 ఉచ్చారణను అభివృద్ధి చేసుకొనే మరొక మార్గమేమంటే, మరొకరి యెదుట చదవడం, అంటే మాటలను బాగుగా ఉచ్చరించగలవాని యెదుట చదివి మీరు పొరపాటు చేసినప్పుడెల్లా మిమ్మల్ని ఆపి సరిచేయమని అడగడమే.
34 మూడవ పద్ధతేమంటే, మంచి ప్రసంగీకులు ప్రసంగిస్తున్నప్పుడు శ్రద్ధగా వినడమే. మీరు వింటూ ఆలోచించండి; మీరు పలికే తీరుకు వ్యతాసంగా వారు పలుకుతూవుంటే ఆ మాటలను గుర్తుపెట్టుకోండి. వాటిని వ్రాసుకోండి; నిఘంటువులో వాటిని పరిశీలించి అభ్యాసం చేయండి. త్వరలో మీకు కూడా సరియైన ఉచ్చారణ వస్తుంది. ధారాళత, సంభాషణా శైలి, సరియైన ఉచ్చారణతో కూడిన మాటలు మీ ప్రసంగాన్ని ఎంతగానో మెరుగు పరుస్తాయి.
[అధ్యయన ప్రశ్నలు]