కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

స్వరము, వ్యవధి

స్వరము, వ్యవధి

పాఠ్యభాగం 23

స్వరము, వ్యవధి

1, 2. తగినంత గట్టిగా మనమెందుకు మాట్లాడాలి?

1 మీరు చెప్పేది యితరులకు సరిగా వినబడకపోతే, మీరు చేసే ప్రసంగమంతా వృధాయే. అటు మీ స్వరం మరీ బిగ్గరగావున్నా ప్రేక్షకులకు యిబ్బంది కల్గించి మీరు సిద్ధపడిన మంచి తలంపులనుండి దూరం చేస్తుంది. తగినంత స్వరాన్ని కలిగియుండే అవసరత అనేక రాజ్యమందిరాలలో కన్పిస్తుంటుంది, అక్కడ ముందు భాగంలో కూర్చున్నవారు కూటాలలో చేసే వ్యాఖ్యానాలు వెనుక భాగంలోనున్న వారికి వినబడవు. కొన్నిసార్లు వేదికపై నుండి మాట్లాడే వ్యక్తికి తగినంత స్వరం లేకపోవచ్చు, కావున అతడు ప్రేక్షకులను ఉత్తేజపర్చలేడు. ప్రాంతీయ సేవలో కూడా వినికిడి కష్టంగా ఉన్నవారిని మనం కలుస్తుంటాం, అలాగే మనం దర్శిస్తున్న యింటిలోనుండో లేక వెలుపలనుండో వచ్చే శబ్దాలు మనతో పోటీపడుతుండవచ్చు. తగినంత స్వరానికి మనం శ్రద్ధనివ్వాలని ఇదంతా చూపిస్తుంది.

2 సులభంగా వినగల్గునంత బిగ్గరగా. ఎంత స్వరం ఉపయోగించాలి అని నిర్ణయించడానికి మొదటిగా, అవసరమగునంత స్వరం వాడబడిందా లేదా అను ప్రశ్నను బట్టి ఎంతో చక్కగా విశ్లేషించవచ్చు. అంటే, మొదటి వరుసలో కూర్చున్నవారి చెవులకు చిల్లులు పడకుండా వెనుకనున్న వారికి మీ స్వరం వినబడుతుందా? తొలిదశలోనున్న విద్యార్థికి ఆ అవధానం సరిపోతుంది, కాని ప్రగతి సాధించినవారు దీనికి సంబంధించిన ఈ క్రింది వాటిలో కూడా ప్రావీణ్యత సంపాదించడానికి కృషిచేయాలి. ప్రతి విద్యార్థికి ఈ లక్షణంపై ఎంతమేరకు సలహానివ్వాలనే దానిని పాఠశాల అధ్యక్షుడు నిర్ణయించుకోవాలి.

3-10. మనం ఎంత స్వరం ఉపయోగించాలో నిర్ణయించడానికి తోడ్పడే పరిస్థితులేవి?

3 పరిస్థితులకు తగిన స్వరం. ప్రసంగీకుడు తాను మాట్లాడుతున్న విభిన్న పరిస్థితులను గుర్తెరగాలి. అది అతని వివేచనాశక్తిని విస్తృతపర్చి, పరిస్థితులకు అనుగుణంగా మారునట్లుచేసి, ప్రేక్షకుల హృదయాలను చేరి వారి అవధానాన్ని చూరగొనేలా చేస్తుంది.

4 హాలును బట్టి, ప్రేక్షకుల పరిమాణాన్ని బట్టి పరిస్థితులు మారతాయి. పరిస్థితుల కనుగుణంగా మీ స్వరాన్ని నియంత్రించాలి. క్రొత్తగా ఆసక్తిచూపుతున్న వ్యక్తి యింట్లో మాట్లాడేదానికన్నా రాజ్యమందిరంలో ప్రసంగాన్నిస్తున్నప్పుడు స్వరం పెద్దదిగా ఉండాలి. అలాగే, సేవాకూటానికి హాలంతా నిండినప్పటికన్నా, ప్రాంతీయసేవ కొరకు హాలు ముందుభాగంలో కూడుకున్న చిన్నగుంపుకు తక్కువ స్వరం అవసరము.

5 అయితే ఈ పరిస్థితులుకూడా మారుతుండవచ్చు. హాలులోపల, బయట అకస్మాత్తుగా శబ్దం రావచ్చు. అటుగా వెళ్తున్న కారు, సమీపంలో వెళ్లే రైలు, బిగ్గరగా అరిచే జంతువుల శబ్దాలు, పిల్లల ఏడ్పు, ఆలస్యంగా వచ్చినవారి మూలంగా కలిగే శబ్దం వీటన్నింటికి మీ స్వరంలో భేదం చూపించాల్సి వుంటుంది. వాటిని గుర్తెరిగి స్వరం పెంచకపోతే, బహుశ ఒక ముఖ్యమైన విషయమే వినబడక పోవచ్చు.

6 అనేక సంఘాలకు స్వరాన్ని అధికం చేసే శబ్దయంత్ర సామాగ్రి ఉంటుంది. దానిని ఉపయోగించుటలో శ్రద్ధ తీసుకొనకపోతే స్వరం ఎక్కువ, తక్కువ కావచ్చు, ఈ పరిస్థితులందు శ్రద్ధ వహించనందుకు విద్యార్థికి సలహా యివ్వవలసి ఉంటుంది. (మైక్రోఫోన్‌ వాడుటను గూర్చి 13వ పాఠ్యభాగం ఇంగ్లీషులో చూడండి.)

7 కొన్నిసార్లు ప్రసంగీకుడు తనకున్న స్వరాన్ని బట్టి ఆ విషయంలో ప్రగతి సాధించుట కష్టంగా ఉండవచ్చు. మీకాసమస్య వుంటే, మీ స్వరం సరిగా వినబడకపోతుంటే, పాఠశాల అధ్యక్షుడు సలహా యిస్తాడు. కొన్ని సాధనలను లేదా మీ స్వరాన్ని పెంచి, దాన్ని మెరుగుపర్చుకొనడానికి దోహదపడే తర్ఫీదు కార్యక్రమాన్ని లేదా తగిన వ్యాయామాన్ని అతడు సిఫారసు చేయవచ్చు. అయితే, సలహా యిచ్చేందుకు స్వర లక్షణమే ఒక ప్రత్యేక అంశం గనుక మీ స్వరాన్ని గూర్చి పరిశీలన చేసేటప్పుడు దాన్నిగూర్చి నొక్కి తెల్పబడదు.

8 ఒకే ప్రసంగంలోని ప్రతి పరిస్థితి పరిగణలోనికి తీసుకొనబడదు. ఇప్పుడిచ్చే ప్రసంగం మీద సలహా యివ్వాలి కాని ఉత్పన్నమౌతున్న ప్రతి విషయంపై యివ్వకూడదు. అయితే, ఇప్పుడిచ్చే ప్రసంగానికి విద్యార్థిని అభినందించి, సలహా పత్రంపై “G” అని గుర్తించినప్పటికి, విభిన్న పరిస్థితులందు ఒక విద్యార్థి ఎదుర్కొనే అవకాశమున్న సమస్యలను గూర్చి పాఠశాల అధ్యక్షుడు హెచ్చరించవచ్చును.

9 విద్యార్థి తనకు సరిపడేంత స్వరం ఉందా లేదాయని ఎలా నిర్ణయించుకోగలడు? ఒకానొక శ్రేష్ఠమైన కొలమానం ప్రేక్షకుల ప్రతిస్పందన. అనుభవజ్ఞుడైన ప్రసంగీకుడు తాను ఉపోద్ఘాతాన్ని అందిస్తున్నప్పుడు హాలు వెనుకనున్నవారిని జాగ్రత్తగా గమనించి, వారు సులభంగా వినగల్గుతున్నారా లేదాయని వారి భావవ్యక్తతనుబట్టి, స్పందననుబట్టి నిర్ణయించి తదనుగుణంగా స్వరాన్ని మార్చుకుంటాడు. ఒక్కసారి హాలులోనున్నవారి “స్పందనను” పొందిన తరువాత ఇక అతనికి ఏ యిబ్బంది ఉండదు.

10 అదే కార్యక్రమంలోని యితర ప్రసంగీకులను గమనించడం మరొక మార్గం. వారి ప్రసంగం సులభంగా వినబడిందా? వారెంత స్వరాన్ని ఉపయోగిస్తున్నారు? తదనుగుణంగా మీస్వరాన్ని మార్చుకోండి.

11, 12. సమాచారానికి తగిన స్వరం వుండడం ఎందుకు ప్రాముఖ్యం?

11 సమాచారానికి తగిన స్వరం. స్వరాన్ని గూర్చి మనమిక్కడ చేస్తున్న చర్చను స్వరభేదముతో ముడిపెట్టకూడదు. చర్చించబడుతున్న నిర్దిష్ట సమాచారానికి సరిపడేంత స్వరం ఉందా లేదాయనేదే ప్రస్తుతం పరిశీలించేది. ఉదాహరణకు, లేఖనాలనుండి దేవుని తీర్పులు చదవబడుతుంటే, సహోదరుల మధ్య వుండాల్సిన ప్రేమను గూర్చిన సలహాను విద్యార్థి చదువుతున్నప్పుడు ఉండవలసిన స్వరంకన్నా భిన్నంగా ఉండాలి. యెషయా 36:11-12, 13 వచనాలతో పోల్చి ఈ మాటలు పలుకబడిన తీరులో ఉన్న తేడాను గమనించండి. సమాచారానికి తగినట్లు స్వరం ఉండాలి, కాని అది విపరీతంగా ఉండకూడదు.

**********

12 ఎంత స్వరాన్ని ఉపయోగించాలో నిర్ణయించేటప్పుడు, మీ సమాచారాన్ని, మీ ఉద్దేశాన్ని జాగ్రత్తగా విశ్లేషించుకోండి. మీ ప్రేక్షకుల ఆలోచనలను మార్చాలనుకుంటుంటే మరింత ఎక్కువ స్వరాన్ని ఉపయోగించి దాన్ని కనుమరుగు చేయకండి. అయితే వారిని ఉత్తేజపర్చగోరితే స్వరం కాస్త గట్టిగా ఉండాల్సి వస్తుంది. మీ సమాచారాన్నిబట్టి గట్టిగా మాట్లాడవలసివస్తే మరీ మృదువుగా మాట్లాడి దానిని బలహీనపర్చవద్దు.

13-16. వ్యవధికున్న విలువను చూపండి.

13 ప్రసంగించేటప్పుడు తగినంత స్వరం ఎంత ప్రాముఖ్యమో సరియైన స్థానంలో ఆగడం కూడా అంతే ప్రాముఖ్యం. అదే లేకపోతే ఆ మాటల భావం సులభంగా కనుమరుగై, మీ ప్రేక్షకులు గుర్తుంచుకోవలసిన ముఖ్యాంశాలు వారిలో నాటుకోవు. వ్యవధి మీకు నమ్మకాన్ని, నిశ్చలతను యిచ్చి, చక్కగా ఊపిరి తీసుకొనడానికి అనుమతించి, ప్రసంగమందలి కష్టమైన పదాలవద్ద తడబడకుండా ఉండే అవకాశాన్నిస్తుంది. పరిస్థితి మీ అదుపులో ఉందని, మీరు అనవసరంగా కంగారు పడడంలేదని, ప్రేక్షకులను పరిగణలోనికి తీసుకుంటున్నారని, వారు విని, జ్ఞాపకముంచుకోవలసిన సమాచారం మీయొద్ద కొంతవుందని మీరిచ్చే వ్యవధులు చూపిస్తాయి.

14 క్రొత్త ప్రసంగీకుడు సమర్థవంతంగా వ్యవధినిచ్చే సామర్థ్యాన్ని సంపాదించుకొనడానికి ఎంతో సమయం పట్టదు. మొదటిగా, మీరు చెప్పవలసింది ప్రాముఖ్యమైన సమాచారమని, అది వారి జ్ఞాపకాలలో ఉండిపోవాలని మీరు కోరుతున్నట్లు మీరు నిశ్చయతకు రావాలి. కొన్నిసార్లు తల్లి తన పిల్లవాన్ని సరిదిద్దుతున్నప్పుడు, అతని అవధానాన్ని నిలపడానికి ఏదో విషయాన్ని ప్రస్తావిస్తుంది. పిల్లవాడు పూర్తి అవధానమిచ్చేంతవరకు ఆమె మరొక్క మాట మాట్లాడదు. అప్పుడు ఆమె తన మనస్సులోని మాటను బయట పెడుతుంది. తాను చెబుతున్న విషయాన్ని పిల్లవాడు అలక్ష్యం చేయడని, జ్ఞాపకముంచుకుంటాడని ఆమె రూఢిగా తెలుసుకొనగోరుతుంది.

15 కొంతమంది తాము రోజూ మాట్లాడే మాటల్లోకూడా ఏమాత్రం వ్యవధినివ్వరు. మీకాసమస్య వుంటే ప్రాంతీయ సేవలో మీ పరిచర్య సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఈ లక్షణాన్ని పెంపొందించుకోవాలని కోరుకుంటారు. అక్కడ మనం మాట్లాడేది సంభాషణా శైలిలో వుంటుంది. గృహస్థుడు మధ్యలో మాట్లాడకుండా వుండేందుకు అతడు వినడానికి, వేచియుండడానికి అనువైన వ్యవధినివ్వడానికి సరియైన వ్యవధి అవసరం. సంభాషించుటలో వ్యవధినిచ్చుటకు నైపుణ్యం, ప్రావీణ్యత ఎంత అవసరం, ఎంత ఫలదాయకమో ఈ సామర్థ్యం వేదిక మీద ప్రదర్శించినప్పుడు కూడా అంతే.

16 ప్రసంగంలో సరియైన వ్యవధినివ్వడంలో వచ్చే ఒక తీవ్రమైన సమస్య ఏమిటంటే, ఎక్కువ సమాచారాన్ని కలిగివుండడమే. ఇది మానుకోండి. వ్యవధులకు సమయాన్నివ్వండి; అవి అవసరము.

17-21. విరామ గురుతులకు వ్యవధినిచ్చే ప్రాముఖ్యతను వివరించండి.

17 విరామ గురుతులకు వ్యవధి. విరామ గురుతులకు వ్యవధినిస్తున్నామంటే, తలంపును స్పష్టీకరించుటకు; సంబంధిత తలంపులను ప్రత్యేక పరచుటకు; వాక్యభాగాన్ని, ప్రకరణమును, వాక్యము, పేరాల ముగింపును సూచించడానికే. తరచు అట్టి మార్పులు, పదరూప భేదమును బట్టి చూపవచ్చును, కాని ప్రసంగానికి సాధారణ విరామ గురుతులనిచ్చేందుకు వ్యవధులు కూడా ఫలవంతంగా ఉంటాయి. వాక్యాన్ని విభాగించడం కామాలు, సెమికోలనులు భిన్నమైన గుర్తింపును కలిగియున్నట్లే, వ్యవధి కూడా దాని ఉపయోగాన్నిబట్టి వ్యత్యాసంగానే వుండాలి.

18 సరియైన స్థానంలో వ్యవధి ఇవ్వకపోతే అది వాక్యభావాన్నే మార్చివేయవచ్చు. దృష్టాంతానికి, యేసు లూకా 23:43 నందు చెప్పిన మాటలను ఇంగ్లీషు ప్రకారం తీసుకుందాం, “ట్రూలీ ఐ టెల్‌ యు టుడే, యు విల్‌ బి విత్‌ మి ఇన్‌ పారడైజ్‌.” ఇందులో కామానుగాని వ్యవధినిగాని మొదటి “యు” మరియు “టుడే”కు మధ్య పెడితే దాని అర్థం పూర్తిగా మారిపోతుంది, ఈ లేఖనాన్ని తప్పుగా అనువదించిన దానిలో కన్పించేది అదే. కావున, ఉద్దేశించబడిన తలంపును అందజేయడానికి సరియైనరీతిలో వ్యవధినిచ్చుట ప్రాముఖ్యము.

19 మీరు చదివేటప్పుడు వ్రాయబడియున్న విరామ గురుతుల నన్నింటిని గమనిస్తూ, సిద్ధపడి ధారాళంగా ప్రసంగించేటప్పుడు మీ మాటల్లోనే విరామము నివ్వడం నేర్చుకోండి. చదివేటప్పుడు కొన్నిసార్లు విస్మరించదగిన ఏకైక విరామ చిహ్నం కామా. కామా ఉన్న చోట వ్యవధిని యివ్వాలా వద్దా అన్నది వ్యక్తిగతంగా ఎంచుకోవలసిన విషయం. అయితే సెమికోలన్లు, చుక్కలు, ఉదాహృత (కొటేషన్‌) గురుతులు, మరియు పేరాల విభాగాలు వీటన్నింటిని పాటించాలి.

20 చేతివ్రాత ప్రతిని లేదా బైబిలునందలి భాగాన్ని చదివేటప్పుడు ప్రసంగ ప్రతిపై గురుతులు పెట్టుకొనుట మీకు సహాయకరంగా ఉండవచ్చు. కొద్దిపాటి వ్యవధినివ్వడం (బహుశ కొంచెం ఆగడం) కొరకు చిన్న నిలువుగీతను గీయండి; ఎక్కువ సేపు వ్యవధినివ్వడానికి రెండు గీతలు లేదా “X” గురుతునివ్వండి.

21 చదవడాన్ని అభ్యాసం చేస్తున్నప్పుడు కొన్ని వాక్యాలు మీకే అసభ్యంగావుంటే, మరి మీరు ఆగరాని చోట ఆగుతూవుంటే, వాక్యభాగంలోని మాటలన్నింటిని కలుపుతూ పెన్సిల్‌ గుర్తులను పెట్టుకోండి. పిమ్మట, మీరు వాటిని చదువుతున్నప్పుడు, అనుసంధానం చేయబడిన మాటల్లోని చివరి పదానికి వచ్చేంతవరకు వ్యవధినివ్వవద్దు లేదా ఆగవద్దు. అనుభవజ్ఞులైన ప్రసంగీకులు కూడా చాలావరకు యిలానే చేస్తారు.

22-24. అంశం మారుతున్నప్పుడు వ్యవధినివ్వడం ఎందుకు అవసరం?

22 మరో అంశానికి వెళ్లేటప్పుడు వ్యవధినివ్వండి. ఒక ముఖ్యాంశాన్నుండి మరో ముఖ్యాంశానికి వెళ్తున్నప్పుడు వ్యవధినిస్తే, ప్రేక్షకులు దానిని గుర్తించడానికి వీలుంటుంది. అంతేకాకుండా, అపార్థం చేసుకోకుండా అది నిరోధిస్తుంది. మనస్సు దానంతటదే కుదుటపడడానికి, ధోరణిలో మార్పును గుర్తించడానికి, ప్రసంగించబడుతున్న కొత్త తలంపును వినడానికి అవకాశమిస్తుంది. ఒక డ్రైవరు వాహనాన్ని ప్రక్కకు త్రిప్పేటప్పుడు వేగాన్ని తగ్గించడం ఎంతప్రాముఖ్యమో, అంశం మారుతున్నప్పుడు కూడా ప్రసంగీకుడు వ్యవధినివ్వడం అంతే ప్రాముఖ్యము.

23 సిద్ధపడి ధారాళంగా యిచ్చే ప్రసంగంలో, ప్రధాన అంశాలమధ్య వ్యవధినివ్వడానికి వీలగునట్లు సమాచారాన్ని సంక్షిప్త ప్రతిలో చక్కగా ఏర్పాటు చేసుకోవాలి. ఇది ప్రసంగ ధారాళత లేదా పొందికతో జోక్యం చేసుకోనక్కరలేదు, కాని ఒక నిర్దిష్ట అంశాన్ని తుదివరకు వర్ణించి, కొద్దిగా వ్యవధినిచ్చి, అటుతరువాత మరో క్రొత్త అంశానికి వెళ్లేలా ఉద్దేశాలను చక్కగా ఏర్పాటు చేసుకోవాలి. అట్టి తారస్థాయి పదాలు, మార్పులు మీకు జ్ఞాపకముండడానికి అవసరమైతే మీ సంక్షిప్త ప్రతిలో గుర్తుపెట్టుకోవాలి.

24 సాధారణంగా, విరామ గురుతులకు యిచ్చే వ్యవధికన్నా, అంశం మారేటప్పుడు యిచ్చే వ్యవధి ఎక్కువగానే ఉంటుంది; అయితే, ప్రసంగంలో దీర్ఘకాల వ్యవధులను ఎక్కువ సార్లు యివ్వకూడదు లేదా ప్రసంగాన్ని సాగదీయకూడదు. అలా చేస్తే నష్టమే వాటిల్లవచ్చు.

25-28. ఒక విషయాన్ని నొక్కిచెప్పడానికి, అంతరాయం కల్గించే పరిస్థితులకు తగినట్లు వ్యవధినివ్వడం మనకెలా సహాయం చేస్తుందో చూపండి.

25 నొక్కిచెప్పుటకు వ్యవధి. నొక్కిచెప్పుటకు వ్యవధినిచ్చుట సాధారణంగా నాటకీయంగా సంభవిస్తుంది. ఇందువల్ల ప్రేక్షకులు ఎదురుచూడడానికి లేదా చెవియొగ్గడానికి అది తోడ్పడుతుంది.

26 ఒక ప్రాముఖ్యమైన విషయానికి ముందు వ్యవధినిస్తే ఎదురుచూచేలా చేస్తుంది. దాన్ని ముగించిన తరువాత యిచ్చే వ్యవధి ఆ తలంపు యొక్క ప్రాధాన్యత అంతా నాటుకుపోవడానికి తోడ్పడుతుంది. ఈ రెండు వ్యవధులు ఒకే రకమైనవికావు, కావున ఒక సందర్భానికి ఏది సరియైనదో లేదా రెండూ ఉపయోగించవచ్చునో మీరే నిర్ణయించుకోవాలి.

27 నొక్కిచెప్పడానికి వ్యవధినివ్వడం అత్యంత గుర్తించదగిన విషయాలకే పరిమితం చేయాలి, లేకపోతే వాటి విలువే పోతుంది.

28 పరిస్థితులనుబట్టి వ్యవధినివ్వండి. అంతరాయాలనుబట్టి ప్రసంగీకుడు తాత్కాలికంగా వ్యవధినివ్వాల్సి వస్తుంది. అంతరాయం తీవ్రమైనది కాకపోతే, స్వరాన్ని పెంచి కొనసాగించవచ్చు, అది మంచిది. అయితే, అది ప్రసంగానికి ఆటంకం కల్గించే అంతరాయమైతే, అప్పుడు మీరు వ్యవధినివ్వాల్సి వుంటుంది. మీరు చూపిన వివేకాన్ని ప్రేక్షకులు మెచ్చుకుంటారు. ఏది ఏమైనా అనేక సందర్భాల్లో వారు వినరు, ఎందుకంటే తాత్కాలిక అంతరాయం వారి అవధానాన్ని మళ్లిస్తుంటుంది. కావున మీరు మీ ప్రేక్షకులకు చెప్పదలచిన మంచి సంగతుల నుండి వారు పూర్తి ప్రయోజనం పొందేలా వ్యవధిని ఫలవంతంగా ఉపయోగించండి.

[అధ్యయన ప్రశ్నలు]