22వ అధ్యాయం
పరీక్షలు ఎదురైనా ఆయన విశ్వసనీయంగా ఉన్నాడు
1, 2. కపెర్నహూములో యేసు మాట్లాడుతున్నప్పుడు పేతురు ఏమి కోరుకొనివుంటాడు? కానీ ఏమి జరిగింది?
పేతురు కపెర్నహూములోని సమాజమందిరంలో యేసుతో ఉన్నాడు. యేసు మాటలు వింటున్నవాళ్ల ముఖాలను ఆయన ఆందోళనగా పరిశీలించాడు. కపెర్నహూము ఆయన సొంత పట్టణం. అక్కడ గలిలయ సముద్ర ఉత్తర తీరాన ఆయన చేపల వ్యాపారం చేసుకునేవాడు. ఆయన స్నేహితులు, బంధువులు, తోటి వ్యాపారులు చాలామంది ఉండేది కూడా అక్కడే. వీళ్లు కూడా యేసును మెస్సీయగా గుర్తించి, సాటిలేని బోధకుడైన యేసు దగ్గర దేవుని రాజ్యం గురించి నేర్చుకోవడానికి చాలా ఉత్సుకత చూపిస్తారని పేతురు ఎంతో అనుకున్నాడు. కానీ ఈ విషయంలో ఆయనకు ఆ రోజు నిరాశే ఎదురైంది.
2 యేసు మాటలను చాలామంది వినడం ఆపేశారు. కొందరైతే గట్టిగా గొణుగుతున్నారు. యేసు సొంత శిష్యుల్లో కొందరి స్పందన పేతురును ఇంకెక్కువ కలవరపెట్టింది. యేసు దగ్గర కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడు వాళ్లలో కలిగిన ఉత్సాహం, సత్యం నేర్చుకున్నప్పుడు వాళ్లలో కలిగిన ఆనందం ఇప్పుడు వాళ్ల ముఖాల్లో అస్సలు కనబడడం లేదు. వాళ్లిప్పుడు బాధగా ఉన్నారు, కోపంగా కూడా ఉన్నారు. కొందరు యేసు మాటలు వినడానికే భయంకరంగా ఉన్నాయని అన్నారు. ఇక ఆయన మాటలు వినలేమంటూ సమాజమందిరం నుండి వెళ్లిపోయారు. యేసును అనుసరించడం కూడా మానుకున్నారు.—యోహాను 6:60, 66 చదవండి.
3. చాలాసార్లు, ఏమి చేసేలా పేతురు విశ్వాసం ఆయనకు సహాయం చేసింది?
3 పేతురుకు, తోటి అపొస్తలులకు అది క్లిష్టమైన పరిస్థితి. యేసు ఆరోజు చెప్పిన విషయాలు పేతురుకు పూర్తిగా అర్థంకాలేదు. వాటి గురించి స్పష్టంగా వివరించకపోతే ఎవరైనా సరే ఖచ్చితంగా అభ్యంతరపడతారు. పేతురు ఏమి చేస్తాడు? తన బోధకుని పట్ల విశ్వసనీయంగా ఉండే విషయంలో పరీక్ష ఎదురైంది ఇది మొదటిసారి కాదు, ఇదే చివరిసారి అని కూడా అనలేం. అలాంటి సవాళ్ల మధ్య విశ్వసనీయంగా ఉండడానికి పేతురు విశ్వాసం ఆయనకు ఎలా సహాయం చేసిందో చూద్దాం.
తోటి శిష్యులు విశ్వాసఘాతకులుగా తయారైనా విశ్వసనీయంగా ఉన్నాడు
4, 5. ప్రజలు అనుకున్నదానికి పూర్తి విరుద్ధంగా యేసు ఏమేమి చేశాడు?
4 చాలాసార్లు యేసు మాటలకు, పనులకు పేతురు ఎంతో ఆశ్చర్యపోయాడు. కొన్నిసార్లు తన బోధకుడు ప్రజలు అనుకున్నదానికి పూర్తి విరుద్ధంగా మాట్లాడాడు, చేశాడు. అంతకుముందు రోజే యేసు అద్భుతం చేసి వేలమందికి ఆహారం పెట్టాడు. దాంతో ప్రజలు ఆయనను రాజును చేద్దామని చూశారు. కానీ ఆయన అక్కడ నుండి వెళ్లిపోయి అక్కడివాళ్లను ఆశ్చర్యపర్చాడు. శిష్యులను పడవలో కపెర్నహూము వైపుకు వెళ్లమని చెప్పాడు. ఆ రాత్రి శిష్యులు గలిలయ సముద్రంలో ప్రయాణిస్తుండగా, తుఫానులో యేసు నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చి వాళ్లను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. విశ్వాసం గురించిన ముఖ్యమైన పాఠం పేతురుకు నేర్పించింది కూడా అప్పుడే.
5 ఉదయాన చూసేసరికి ఆ ప్రజలంతా వాళ్ల వెనకే పడవల్లో వచ్చారు. యేసు అద్భుతంగా తమకు ఇంకెక్కువ ఆహారం పెడతాడనే ఉద్దేశంతోనే వాళ్లంతా అక్కడకు వచ్చారే కానీ ఆయన దగ్గర నేర్చుకోవాలనే ఆసక్తితో మాత్రం కాదు. భౌతిక విషయాల పట్ల వాళ్లకున్న అమితాసక్తిని చూసి యేసు వాళ్లను గద్దించాడు. (యోహా. 6:25-27) ఆ విషయం గురించిన చర్చ కపెర్నహూములోని సమాజమందిరంలో కూడా కొనసాగింది. ఇక్కడ యేసు ఓ ప్రాముఖ్యమైన సత్యాన్ని బోధించాడు, దాన్ని వాళ్లు అస్సలు జీర్ణించుకోలేకపోయారు.
6. యేసు ఏ ఉపమానం చెప్పాడు? దానికి శ్రోతలు ఎలా స్పందించారు?
6 ప్రజలు తనను కేవలం భౌతిక ఆహారం పెట్టగలిగే వ్యక్తిలా మాత్రమే చూడాలని యేసు అనుకోలేదు. తాను అర్పించబోయే బలిమీద విశ్వాసముంచి, తనను అనుసరించే వాళ్లకే దేవుడు నిత్యజీవం ఇస్తాడనే విషయం వాళ్లు గ్రహించాలని యేసు కోరుకున్నాడు. మోషే కాలంలో, తినడానికి దేవుడు కురిపించిన మన్నాతో తనను పోల్చుకుంటూ ఆయన ఒక ఉపమానం చెప్పాడు. కొందరు దానికి అభ్యంతరం చెప్పడంతో, జీవం పొందాలంటే తన శరీరాన్ని తిని, తన రక్తం తాగడం అవసరమని ఒక ఉపమానం ద్వారా వాళ్లకు విడమర్చి చెప్పాడు. అది విన్న వెంటనే వాళ్ల కోపం రెట్టింపయ్యింది. కొందరు ఇలా అన్నారు: ‘ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు?’ యేసు సొంత శిష్యుల్లో చాలామంది ఆయనను అనుసరించడం మానేశారు. a—యోహా. 6:47-60, 66.
7, 8. (ఎ) యేసు పాత్ర గురించి పేతురుకు ఇంకా అర్థంకానిది ఏమిటి? (బి) యేసు అపొస్తలులను అడిగిన ప్రశ్నకు పేతురు ఎలా జవాబిచ్చాడు?
7 మరి పేతురు ఏమి చేశాడు? యేసు మాటలు పేతురును కూడా అయోమయంలో పడవేసివుంటాయి. దేవుని చిత్తం నెరవేర్చడానికి యేసు తప్పకుండా చనిపోవాలనే విషయం ఆయనకు అప్పటికింకా అర్థంకాలేదు. ఆరోజు యేసును విడిచి వెళ్లిపోయిన నిలకడలేని శిష్యుల్లా పేతురు కూడా యేసును అనుసరించడం మానుకున్నాడా? లేదు. దానికి కారణం ఆయనకున్న ఒక ముఖ్యమైన లక్షణం. ఏమిటది?
8 యేసు తన అపొస్తలులను చూసి ఇలా అడిగాడు: “మీరు కూడ వెళ్లిపోవలెనని యున్నారా?” (యోహా. 6:67) ఆయన పన్నెండుమందినీ అడిగాడు, కానీ జవాబిచ్చింది పేతురు. చాలాసార్లు మిగతా అపొస్తలులు నోరుతెరవక ముందే పేతురు మాట్లాడేసేవాడు. బహుశా ఆయన వాళ్లందరికన్నా వయసులో పెద్దవాడయ్యుంటాడు. ఏదేమైనా ఆయన శిష్యులందరికన్నా నిర్మొహమాటంగా మాట్లాడేవాడైయ్యుంటాడు. ఎప్పుడో ఒకసారి తప్ప, పేతురు తన మనసులో మాటను దాచుకోకుండా బయటకు చెప్పేసేవాడనిపిస్తోంది. ఈ సందర్భంలో ఆయన మనసులో మరపురాని ఈ చక్కని మాటలు ఉన్నాయి: “ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు.”—యోహా. 6:68.
9. పేతురు యేసుపట్ల ఎలా విశ్వసనీయతను చూపించాడు?
9 ఆ మాటలు మీ మనసును స్పృశించడం లేదా? యేసు మీద పేతురుకున్న విశ్వాసం వల్లే పేతురు విశ్వసనీయత అనే వెలకట్టలేని లక్షణాన్ని పెంపొందించుకున్నాడు. యెహోవా పంపించిన రక్షకుడు యేసేననీ, యేసు మాటలు అంటే, దేవుని రాజ్యం గురించిన ఆయన బోధలు రక్షణకు నడిపిస్తాయనీ పేతురుకు స్పష్టంగా అర్థమైంది. తనకు కొన్ని విషయాలు అర్థంకాకపోయినా దేవుని అనుగ్రహాన్ని, నిత్యజీవాన్ని పొందాలంటే మరో దారి లేదని పేతురుకు తెలుసు.
యేసు బోధలు మనం అనుకున్నదానికి, మన ఇష్టాయిష్టాలకు విరుద్ధంగా ఉన్నా వాటికి కట్టుబడివుండాలి
10. నేడు పేతురులా మనం విశ్వసనీయతను ఎలా చూపించవచ్చు?
10 మీరూ అలాగే అనుకుంటున్నారా? ఈనాడు ప్రపంచంలో చాలామంది యేసును ప్రేమిస్తున్నామని చెప్పుకుంటారే కానీ ఆయన పట్ల విశ్వసనీయతను చూపించరు. క్రీస్తుపట్ల నిజమైన విశ్వసనీయత చూపించాలంటే పేతురులా మనం కూడా యేసు బోధలను ప్రేమించాలి. వాటిని నేర్చుకోవాలి, వాటి అంతరార్థాన్ని గ్రహించాలి, వాటి ప్రకారం నడుచుకోవాలి. వాటిలో కొన్ని మనం అనుకున్నదానికి, మన ఇష్టాయిష్టాలకు విరుద్ధంగా ఉన్నా సరే అలా చేయాలి. విశ్వసనీయంగా ఉన్నామని నిరూపించుకుంటేనే, యేసు అనుకున్నట్టు, నిత్యజీవం పొందుతామని ఆశించవచ్చు. యెహోవా గురించి బైబిలు ఇలా చెబుతోంది: “తన భక్తుల [“విశ్వసనీయుల,” NW] ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు.”—కీర్త. 97:10.
సరిదిద్దినప్పుడు విశ్వసనీయంగా ఉన్నాడు
11. యేసు తన అనుచరులతో కలిసి ఎక్కడికి బయలుదేరాడు? (అధస్సూచి కూడా చూడండి.)
11 అది జరిగి ఎంతో సమయం కాకముందే యేసు తన అపొస్తలులతో, ఇతర శిష్యులతో కలిసి ఉత్తరంవైపుగా సుదీర్ఘ ప్రయాణం మొదలుపెట్టాడు. నీలిరంగు నీళ్లున్న గలిలయ సముద్రం నుండి చూసినా కూడా, వాగ్దాన దేశానికి ఉత్తరం వైపు సుదూరాన మంచు కమ్ముకున్న హెర్మోను పర్వత శిఖరం అప్పుడప్పుడు కనిపిస్తుంది. ఫిలిప్పుదైన కైసరయ సమీప గ్రామాలకు చేరువయ్యే కొద్దీ ఆ పర్వతం మరీ పెద్దగా కనబడుతుంది. b అక్కడ నుండి చూస్తే దక్షిణాన వాగ్దాన దేశం చాలా భాగం కనిపిస్తుంది. ఆహ్లాదకరమైన ఆ పరిసరాల మధ్య యేసు తన అనుచరులను ప్రాముఖ్యమైన ప్రశ్న ఒకటి అడిగాడు.
12, 13. (ఎ) తన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారని యేసు తన శిష్యులను ఎందుకు అడిగాడు? (బి) యేసుతో మాట్లాడుతున్నప్పుడు పేతురు ఎలా స్వచ్ఛమైన విశ్వాసాన్ని చూపించాడు?
12 ఆయన వాళ్లను ఇలా అడిగాడు: ‘నేనెవడనని జనసమూహములు చెప్పుకొనుచున్నారు?’ జవాబు కోసం ఎదురుచూస్తున్నట్టు ఉన్న యేసు కళ్లలోకి పేతురు చూస్తూ తన బోధకుని దయాగుణాన్ని, అమోఘమైన, నికార్సైన జ్ఞానాన్ని మళ్లీ ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించివుంటాడు. ప్రజలు తాము చూసినదాన్నిబట్టి, విన్నదాన్నిబట్టి తనను ఎవరని అనుకుంటున్నారో తెలుసుకోవాలని యేసుకు ఆసక్తి కలిగింది. శిష్యులు యేసు గురించి అప్పటికే ప్రజల్లో వ్యాపించివున్న కొన్ని తప్పుడు అభిప్రాయాల గురించి ఆయనకు చెప్పారు. యేసు అంతటితో ఊరుకోలేదు, తన సన్నిహిత అనుచరులు కూడా అలాగే పొరబడ్డారేమో తెలుసుకోవాలనుకున్నాడు. ఆయన శిష్యులను ఇలా అడిగాడు: ‘మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారు?’—లూకా 9:18-20.
13 ఇప్పుడు కూడా పేతురే ముందు మాట్లాడాడు. అక్కడున్న చాలామంది మనసుల్లోని ఈ అభిప్రాయాన్ని ఆయన స్పష్టంగా, గట్టి నమ్మకంతో చెప్పాడు: “నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు.” యేసు చిరునవ్వుతో ఆప్యాయంగా పేతురును మెచ్చుకునివుంటాడు. ఈ ముఖ్యమైన సత్యాన్ని స్వచ్ఛమైన విశ్వాసం చూపించేవాళ్లు స్పష్టంగా గ్రహించేలా చేసేది ఏ మనిషో కాదు, యెహోవా దేవుడేనని పేతురుకు యేసు గుర్తుచేశాడు. యెహోవా అప్పటివరకు బయల్పరచిన అతి గొప్ప సత్యాల్లో ఒకదాన్ని అంటే ఎంతో పూర్వం ఆయన వాగ్దానం చేసిన మెస్సీయ (క్రీస్తు) ఎవరో గ్రహించేలా యెహోవా పేతురుకు సహాయం చేశాడు.—మత్తయి 16:16, 17 చదవండి.
14. యేసు పేతురుకు ఏ విశేషమైన పనులు అప్పగించాడు?
14 ఈ క్రీస్తునే ఒక ప్రాచీన ప్రవచనం ‘ఇల్లుకట్టేవారు నిషేధించే రాయి’ అని అంటోంది. (కీర్త. 118:22; లూకా 20:17, 18) యేసు అలాంటి ప్రవచనాలను మనసులో పెట్టుకునే, ఆ రాయి మీదే అంటే, పేతురు కొంతసేపటి క్రితం గుర్తించిన క్రీస్తు అనే బండమీదే యెహోవా ఒక సంఘాన్ని స్థాపించనున్నాడని చెప్పాడు. ఆ సంఘంలో పేతురుకు కొన్ని ముఖ్యమైన, విశేషమైన పనులు అప్పగించాడు. కొందరు అనుకుంటున్నట్టు యేసు పేతురును మిగతా అపొస్తలులకన్నా గౌరవనీయమైన స్థానంలో ఉంచలేదు, కానీ కొన్ని అదనపు బాధ్యతలు అప్పగించాడంతే. ఆయన పేతురుకు “రాజ్యముయొక్క తాళపుచెవులు” ఇచ్చాడు. (మత్త. 16:19) మూడు విభిన్న గుంపుల ప్రజలకు అంటే ముందు యూదులకు, తర్వాత సమరయులకు, ఆ తర్వాత అన్యులకు (యూదులు కానివాళ్లకు) దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అవకాశాన్ని తెరిచే గొప్ప గౌరవం పేతురుకు దక్కింది.
15. పేతురు యేసును గద్దించడానికి కారణం ఏమిటి? పేతురు ఏమని గద్దించాడు?
15 అయితే, ఎక్కువ పొందేవాళ్ల నుండి ఎక్కువ ఆశిస్తారనే విషయాన్ని యేసు ఆ తర్వాత ఒకసారి చెప్పాడు. అలాంటివాళ్లలో పేతురు ఒకడు. (లూకా 12:48) యేసు తాను త్వరలోనే యెరూషలేములో బాధలుపడి చనిపోతాననే విషయంతోపాటు మెస్సీయ గురించిన ముఖ్యమైన సత్యాలను వాళ్లకు తెలియజేస్తూ వచ్చాడు. ఆ విషయాలు పేతురును ఎంతో కలవరపెట్టాయి. యేసును పక్కకు తీసుకువెళ్లి ఇలా గద్దించాడు: “ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీ కెన్నడును కలుగదు.”—మత్త. 16:21, 22.
16. యేసు పేతురును ఎలా సరిదిద్దాడు? యేసు మాటల్లో మనందరికీ ఉపయోగపడే ఏ సలహా ఉంది?
16 పేతురు సదుద్దేశంతోనే అలా అన్నాడు. కానీ యేసు స్పందన చూసి ఆయన అవాక్కయ్యుంటాడు. ఆయన వెనక్కి తిరిగి, బహుశా పేతురులాగే ఆలోచిస్తున్న మిగతా శిష్యులను చూసి ఇలా అన్నాడు: “సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు నాకు అభ్యంతర కారణమైయున్నావు; నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక యున్నావు.” (మత్త. 16:23; మార్కు 8:32, 33) ఆ మాటల్లో మనందరికీ ఉపయోగపడే ఒక సలహా ఉంది. దేవుని ఆలోచనను పక్కకు పెట్టి మనుషుల ఆలోచనకు ప్రాధాన్యమివ్వడం చాలా సులువు. మనం ఒకవేళ అదే చేస్తే, మన ఉద్దేశం ఎదుటివ్యక్తికి సహాయపడాలనేదే అయినా, తెలియకుండానే యెహోవాను కాకుండా సాతానును సంతోషపెట్టేలా ఆ వ్యక్తిని ప్రోత్సహించిన వాళ్లమౌతాం. యేసు అన్నదానికి పేతురు ఎలా స్పందించాడు?
17. యేసు పేతురుతో “సాతానా, నా వెనుకకు పొమ్ము” అన్నప్పుడు ఆయన ఉద్దేశమేమిటి?
17 యేసు తనను నిజంగా అపవాదియైన సాతానని పిలవడం లేదని పేతురుకు అర్థమైవుంటుంది. అయినా యేసు సాతానుతో మాట్లాడినట్టు పేతురుతో మాట్లాడలేదు. ఆయన సాతానుతో మాట్లాడుతున్నప్పుడు, “సాతానా, పొమ్ము” అన్నాడు, అదే పేతురుతోనైతే “సాతానా, నా వెనుకకు పొమ్ము” అన్నాడు. (మత్త. 4:10) ఎన్నో మంచి లక్షణాలున్నాయని తనకు అనిపించిన ఈ అపొస్తలుణ్ణి యేసు కాదనుకోలేదు. కానీ ఈ సందర్భంలో యేసు ఆయన తప్పుడు ఆలోచనా తీరును సరిదిద్దాడంతే. పేతురు తనకు అవరోధంలా మారకుండా, తనకు సహకరించాలనే ఉద్దేశంతో యేసు అలా అన్నాడు.
క్రమశిక్షణను వినయంగా స్వీకరించి, దాని నుండి పాఠం నేర్చుకుంటేనే మనం యేసుక్రీస్తుకు, ఆయన తండ్రి యెహోవాకు దగ్గరౌతూ ఉంటాం
18. పేతురు తన విశ్వసనీయతను ఎలా చూపించాడు? మనం ఆయనను ఎలా ఆదర్శంగా తీసుకోవచ్చు?
18 పేతురు యేసుతో వాదించాడా, ఆయన మీద కోపం తెచ్చుకున్నాడా, లేకపోతే ముఖం మాడ్చుకున్నాడా? అలా ఏమీ చేయలేదు. దిద్దుబాటును వినమ్రంగా స్వీకరించాడు. అలా ఆయన మరోసారి కూడా తన విశ్వసనీయతను చాటుకున్నాడు. క్రీస్తును అనుసరించే వాళ్లందరికీ కొన్నిసార్లు దిద్దుబాటు అవసరమౌతుంది. క్రమశిక్షణను వినయంగా స్వీకరించి, దాని నుండి పాఠం నేర్చుకుంటేనే మనం యేసుక్రీస్తుకు, ఆయన తండ్రి యెహోవా దేవునికి దగ్గరౌతూ ఉంటాం.—సామెతలు 4:13 చదవండి.
విశ్వసనీయత చూపించినందుకు గొప్ప గౌరవం దక్కింది
19. ఆశ్చర్యానికి గురిచేసే ఏ మాట యేసు అన్నాడు? అందుకు పేతురు ఏమి అనుకునివుంటాడు?
19 యేసు ఆ తర్వాతే ఆశ్చర్యానికి గురిచేసే మరో మాట అన్నాడు: “ఇక్కడ నిలిచియున్నవారిలో కొందరు, మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచువరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.” (మత్త. 16:28) ఈ మాటలు పేతురులో తప్పకుండా ఆసక్తి రేకెత్తించివుంటాయి. ఇంతకీ ఆ మాటల వెనక యేసు ఉద్దేశం ఏమైవుంటుంది? యేసు అంతకుముందే తనను గట్టిగా సరిదిద్దాడు కాబట్టి అలాంటి ప్రత్యేకమైన అవకాశాలు తనకు దొరకవని ఆయన అనుకునివుంటాడు.
20, 21. (ఎ) పేతురు చూసిన దర్శనం గురించి వివరించండి. (బి) దర్శనంలో కనిపించిన రూపాల మధ్య జరిగిన చర్చ పేతురు తనను తాను సరిదిద్దుకోవడానికి ఎలా తోడ్పడింది?
20 దాదాపు ఒక వారం తర్వాత యేసు యాకోబును, యోహానును, పేతురును తీసుకుని ‘ఎత్తయిన ఒక కొండమీదికి’ వెళ్లాడు. బహుశా అది 25 కి.మీ. దూరంలోనే ఉన్న హెర్మోను పర్వతం అయ్యుంటుంది. ముగ్గురు శిష్యులు నిద్రమత్తులో ఉన్నారు కాబట్టి బహుశా అది రాత్రివేళ అయ్యుంటుంది. యేసు ప్రార్థన చేస్తుండగా శిష్యుల నిద్రమత్తును పోగొట్టే సంగతి ఒకటి జరిగింది.—మత్త. 17:1; లూకా 9:28, 29, 32.
21 వాళ్లు చూస్తుండగా యేసు మెల్లమెల్లగా మారిపోయాడు. ఆయన ముఖం వెలగడం మొదలైంది, ఆ తేజస్సు అంతకంతకూ ఎక్కువై చివరకు ఆయన ముఖం సూర్యునిలా ప్రకాశించింది. ఆయన వస్త్రాలు కూడా తెల్లగా ధగధగా మెరిసిపోయాయి. యేసు పక్కన రెండు రూపాలు కనబడ్డాయి. ఒకటి మోషేది, రెండవది ఏలీయాది. వాళ్లు యేసుతో “ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమునుగూర్చి” మాట్లాడారు. తప్పకుండా అది యేసు మరణపునరుత్థానాల గురించే అయ్యుంటుంది. యేసు బాధలుపడి చనిపోకూడదని తాను అనుకోవడం తప్పని పేతురుకు అర్థమైంది!—లూకా 9:30, 31.
22, 23. (ఎ) పేతురు చాలా ఉత్సాహవంతుడని, ఆప్యాయతగలవాడని ఎలా చెప్పవచ్చు? (బి) యేసు ముగ్గురు శిష్యులకు దక్కిన మరో ఆశీర్వాదం ఏమిటి?
22 ఈ దర్శనంలో ఎలాగైనా పాల్గొనాలని పేతురుకు బలంగా అనిపించింది. బహుశా ఆయన దాన్ని పొడిగించాలని కూడా అనుకునివుంటాడు. మోషే, ఏలీయాలు యేసును విడిచిపెట్టి వెళ్లిపోతున్నట్టు ఆయనకు అనిపించింది. అందుకే పేతురు ఇలా అన్నాడు: “ఏలినవాడా, మనమిక్కడ ఉండుట మంచిది, నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలీయాకు ఒకటియు మూడు పర్ణశాలలు మేము కట్టుదుము.” అయితే దర్శనంలో కనబడిన రెండు రూపాలు, పూర్వం ఎప్పుడో చనిపోయిన యెహోవా సేవకులకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. కాబట్టి వాటికి పర్ణశాలలు అవసరం లేదు. ఏమీ ఆలోచించకుండా పేతురు అలా అనేశాడంతే. పేతురు చాలా ఉత్సాహవంతుడు, ఆప్యాయతగలవాడు. అందుకే మనకు ఆయనంటే ఎంతో ఇష్టం.—లూకా 9:33.
23 ఆ రాత్రి, ఆ ముగ్గురు శిష్యులకు మరో ఆశీర్వాదం దక్కింది. పర్వతం మీద ఒక మేఘం వాళ్లను కమ్ముకుంది. దానిలో నుండి ఒక స్వరం వినబడింది. అది యెహోవా దేవుని స్వరం! ఆయనిలా అన్నాడు: “ఈయన నేనేర్పరచుకొనిన నా కుమారుడు; ఈయన మాట వినుడి.” అంతటితో దర్శనం ముగిసింది, ఇప్పుడు కొండమీద యేసు, ఆ శిష్యులు మాత్రమే ఉన్నారు.—లూకా 9:34-36.
24. (ఎ) రూపాంతర దర్శనం పేతురుకు ఎలా ప్రయోజనం చేకూర్చింది? (బి) ఆ దర్శనం నుండి నేడు మనం ఎలా ప్రయోజనం పొందవచ్చు?
24 రూపాంతర దర్శనం పేతురుకూ మనకూ ఒక గొప్ప బహుమానం! ఆ రాత్రి జరిగిన దాని గురించి కొన్ని దశాబ్దాల తర్వాత పేతురు తన పత్రికలో రాశాడు. యేసు పరలోక రాజుగా మహిమాన్వితుడైనప్పుడు ఎలా ఉంటాడో తిలకించాననీ, యేసు ‘మహాత్మ్యమును కన్నులారా’ చూశాననీ ఆయన అందులో అన్నాడు. ఈ దర్శనం దేవుని వాక్యంలోని ఎన్నో ప్రవచనాలను ధ్రువపర్చింది, తనకు ముందుముందు ఎదురయ్యే శ్రమల్ని తట్టుకునేలా పేతురు విశ్వాసాన్ని బలపర్చింది. (2 పేతురు 1:16-19 చదవండి.) పేతురులా మనం కూడా యెహోవా మన మీద అధికారిగా నియమించిన యేసు దగ్గర నేర్చుకుంటూ, ఆయన ఇచ్చే క్రమశిక్షణను, దిద్దుబాటును స్వీకరిస్తూ, ప్రతీరోజు ఆయన అడుగుజాడల్లో వినయంగా నడుస్తూ ఆయన పట్ల విశ్వసనీయంగా ఉంటే ఆ దర్శనం మన విశ్వాసాన్ని కూడా అలాగే బలపరుస్తుంది.
a ప్రజలు అంతకుముందు రోజున యేసు చెప్పినదాన్ని విని ఉత్సాహంగా ఆయన దేవుని ప్రవక్తని చెప్పుకున్నారు. ఇప్పుడు అదే ప్రజలు సమాజమందిరంలో యేసు మాటల్ని విని మరోలా స్పందించడం చూస్తుంటే వాళ్లు ఎంత చపలచిత్తులో అర్థమౌతుంది.—యోహా. 6:14.
b వాళ్లు వెళ్లాలనుకున్న ప్రాంతం గలిలయ సముద్ర తీరం నుండి దాదాపు 50 కి.మీ. దూరంలో ఉంది. సముద్రమట్టానికి 700 అడుగుల దిగువన ఉన్న ప్రాంతం నుండి ప్రకృతి రమణీయమైన ప్రాంతాల గుండా, సముద్రమట్టానికి 1,150 అడుగుల ఎగువన ఉన్న ప్రాంతానికి ప్రయాణించారు.