కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

15వ అధ్యాయం

ఆమె దేవుని ప్రజల పక్షాన నిలబడింది

ఆమె దేవుని ప్రజల పక్షాన నిలబడింది

1-3. (ఎ) భర్తను కలవడానికి వెళ్తున్నప్పుడు ఎస్తేరు ఎందుకు భయపడివుంటుంది? (బి) ఎస్తేరు గురించిన ఏ ప్రశ్నలను మనం పరిశీలిస్తాం?

 ఎస్తేరు, షూషనులోని రాజగృహ ఆవరణం దగ్గరకు వెళ్తున్న కొద్దీ మనసులోని భయాన్ని అణచుకుంటోంది. అదంత సులువేం కాదు. ఆ కోట అణువణువునా రాజ వైభవం ఉట్టిపడుతోంది. దాని ఇటుకగోడల నిండా రెక్కలున్న ఎద్దులు, విలుకాండ్రు, సింహాల ఆకారాల్లో రంగురంగుల ఉబ్బెత్తు శిల్పాలు కనువిందు చేస్తున్నాయి. చుట్టూ రాతి స్తంభాలు, వాటిపై చెక్కిన ఆకారాలు, భారీ శిల్పాలు కొలువుదీరివున్నాయి. పైగా ఆ కోట, మంచు కప్పుకున్న ఎత్తైన జాగ్రోస్‌ పర్వతాలను ఆనుకొనివున్న విశాలమైన, చదునైన స్థలం మీద ఉంది. అక్కడనుండి చూస్తే, స్వచ్ఛమైన నీరు పారే కాయొస్పెస్‌ నది కనిపిస్తుంది. ఇదంతా, ఎస్తేరు కలుసుకోబోతున్న వ్యక్తి గొప్ప అధికారాన్ని అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికీ గుర్తుచేసేందుకే. “మహా రాజు” అని తనను తాను సంభోదించుకున్న ఆ వ్యక్తే ఆమె భర్త కూడా.

2 ఏంటి భర్తా? విశ్వసనీయురాలు, యూదురాలు అయిన ఏ యువతైనా అహష్వేరోషు లాంటి అన్యుణ్ణి పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుందా? a అహష్వేరోషు అబ్రాహాము వంటివాళ్లను ఆదర్శంగా తీసుకున్న వ్యక్తి కాడు. భార్య శారా చెప్పిన మాట వినమని దేవుడు చెప్పినప్పుడు అబ్రాహాము వినయంగా అలా చేశాడు. (ఆది. 21:12) కానీ అహష్వేరోషు రాజుకు, ఎస్తేరు దేవుడైన యెహోవా గురించి గానీ ఆయన ధర్మశాస్త్రం గురించి గానీ అసలేమీ తెలీదు, ఒకవేళ తెలిసినా అదీ చాలా కొద్దిగానే. అయితే, పారసీక దేశపు చట్టం గురించి మాత్రం ఆయనకు తెలుసు. ఎస్తేరు ఇప్పుడు చేయబోతున్న పనిని నిషేధించే శాసనం కూడా అందులో ఉంది. ఏమిటా శాసనం? పారసీక రాజ్య చక్రవర్తి పిలవకముందే ఎవరైనా ఆయన ముందుకు వస్తే, వాళ్లకు మరణశిక్ష పడుతుంది. రాజు ఎస్తేరును పిలవలేదు, అయినా ఆమె ఆయన దగ్గరకు వెళ్తోంది. సింహాసనం మీద కూర్చున్న రాజుకు కనిపించేంత దగ్గరగా ఎస్తేరు రాచనగరు ఆవరణానికి చేరువౌతున్న కొద్దీ, మృత్యువు ఒడిలోకి వెళ్తున్నట్లు ఆమెకు అనిపించివుంటుంది.—ఎస్తేరు 4:10, 11; 5:1 చదవండి.

3 ఇంతకీ ఆమె అంతటి సాహసానికి ఎందుకు పూనుకుంది? ఈ అసామాన్యురాలైన యువతి చూపించిన విశ్వాసం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? ముందుగా, పారసీక రాణి అంత గొప్ప స్థాయికి ఆమె ఎలా చేరుకుందో చూద్దాం.

ఎస్తేరు నేపథ్యం

4. ఎస్తేరు నేపథ్యం గురించి చెప్పండి. ఆమెకు తన అన్న దగ్గర పెరిగే పరిస్థితి ఎందుకు వచ్చింది?

4 ఎస్తేరు ఓ అనాథ. ఆమె తల్లిదండ్రుల గురించి బైబిల్లో ఎక్కువ వివరాలు లేవు. వాళ్లు ఆమెకు హదస్సా అని పేరుపెట్టారు. అందమైన తెల్లని పూలుండే “గొంజి” చెట్టును హెబ్రీలో అలా పిలుస్తారు. ఎస్తేరు తల్లిదండ్రులు చనిపోయినప్పుడు, వాళ్ల బంధువుల్లో ఒకడైన మొర్దెకై ఆమె యోగక్షేమాలు చూసుకున్నాడు. ఆయన చాలా దయగలవాడు. వరసకు ఆయన ఎస్తేరుకు అన్న అవుతాడు, కానీ వయసులో చాలా పెద్ద. ఆయన చిన్నారి ఎస్తేరును తన కన్నబిడ్డలా చూసుకున్నాడు.—ఎస్తే. 2:5-7, 15.

మంచి కారణంతోనే మొర్దెకై తన పెంపుడు కూతుర్ని చూసి గర్వపడివుంటాడు

5, 6. (ఎ) మొర్దెకై ఎస్తేరును ఎలా పెంచాడు? (బి) షూషనులో, వాళ్ల జీవితం ఎలా ఉండేది?

5 మొర్దెకై, ఎస్తేరులు పారసీక దేశ రాజధానియైన షూషనులో ఉన్న యూదా పరవాసులు. తమ మతం వల్ల, తాము అనుసరించే ధర్మశాస్త్రం వల్ల అక్కడ వాళ్లు కాస్త వివక్షకు గురైవుంటారు. అయితే, ఒకప్పుడు కష్టాల్లోవున్న తన ప్రజలను ఎన్నోసార్లు ఆదుకున్న, ఇకముందు కూడా ఆదుకోనున్న కనికరం గల తమ దేవుడైన యెహోవా గురించి తన అన్న నేర్పిస్తున్న కొద్దీ ఎస్తేరు ఆయనకు ఎంతో దగ్గరైవుంటుంది. (లేవీ. 26:44, 45) వాళ్లిద్దరి మధ్య ప్రేమానుబంధాలు, నమ్మకం తప్పక బలపడివుంటాయి.

6 మొర్దెకై, షూషను కోటలో ఒక అధికారిగా పనిచేసివుంటాడు. రాజ సేవకులతో పాటు ఆయన ఎప్పుడూ రాజ గుమ్మం దగ్గర కూర్చునేవాడు. (ఎస్తే. 2:19, 21; 3:3) ఎస్తేరు ఎదుగుతుండగా ఆమె ఏమేం చేసిందో మనకు ఖచ్చితంగా తెలీదు. అయితే, ఆమె తన అన్నను, వాళ్ల ఇంటిని చక్కగా చూసుకొనివుంటుంది. వాళ్ల ఇల్లు బహుశా నదికి ఆవల బీదవాళ్లు ఉండే చోట ఉండివుంటుంది. షూషనులోని అంగడికి వెళ్లడం ఆమెకు చాలా సరదాగా అనిపించివుంటుంది. కంసాలులు, వెండిపని చేసేవాళ్లు, ఇతర వర్తకులు తాము తయారుచేసిన వస్తువులను అక్కడ అమ్మేవాళ్లు. ముందుముందు, అలాంటి ఖరీదైన వస్తువులు తనకు అతి సాధారణ విషయాలు అవుతాయని ఆమె కనీసం ఊహించి కూడా ఉండకపోవచ్చు. తన జీవితం ఎంతగా మారనుందో అప్పుడు ఆమెకు తెలీదు.

‘ఆమె అందగత్తె’

7. రాణి స్థానం నుండి వష్తిని ఎందుకు తొలగించారు? ఆ తర్వాత ఏమి జరిగింది?

7 ఓ రోజు, రాజగృహంలో జరిగిన ఒక సంఘటన గురించి షూషనులో పెద్ద దుమారం రేగింది. రాజ్యంలోని ఘనులకు రాజు గొప్ప విందు చేయించాడు. భారీ స్థాయిలో ఆహారాన్ని, ద్రాక్షారసాన్ని ఏర్పాటుచేశాడు. రాజు విందు మధ్యలో, స్త్రీలతో కలిసి విందు చేసుకుంటున్న తన అందాల రాణి వష్తిని అక్కడకు తీసుకురమ్మని సేవకులకు ఆజ్ఞాపించాడు. కానీ ఆమె రానంది. ఆ అవమానం తట్టుకోలేని రాజు కోపంతో, వష్తికి ఏ శిక్ష విధించాలో తన సలహాదారులను అడిగాడు. వాళ్ల సలహా మేరకు, రాణి స్థానం నుండి వష్తిని తొలగించాడు. దాంతో రాజ సేవకులు రాజ్యంలోని సౌందర్యవతులైన కన్యకల వేటలో పడ్డారు. వాళ్లలో రాజు ఇష్టపడే యువతి రాణి అవుతుంది.—ఎస్తే. 1:1–2:4.

8. (ఎ) ఎస్తేరు పెద్దదౌతుండగా మొర్దెకై ఎందుకు కాస్త ఆందోళన పడివుంటాడు? (బి) అందం గురించి బైబిలు ప్రోత్సహిస్తున్న సరైన వైఖరిని మనం ఎలా అలవర్చుకోవచ్చు? (సామెతలు 31:30 కూడా చూడండి.)

8 తన చిట్టి చెల్లెలు తన కళ్లముందే ఎదిగి అందాలరాశిగా మారడం ఆయనలో ఒకింత గర్వాన్ని, కాస్త ఆందోళనను కూడా కలిగించివుంటుంది. ‘ఆమె రూపవతి, అందగత్తె’ అని బైబిలు చెబుతోంది. (ఎస్తే. 2:7, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) ఒక వ్యక్తికి అందంతోపాటు జ్ఞానం, వినయం అనే లక్షణాలు కూడా ఉండాలని బైబిలు చెబుతోంది. అవి లేకపోతే అహంకారం, గర్వం వంటి అవలక్షణాలు పొడచూపే ప్రమాదముంది. (సామెతలు 11:22 చదవండి.) అలాంటివాళ్లు మీకు ఎప్పుడైనా తారసపడ్డారా? మరి ఎస్తేరు అందం ఆమెకు వరం అవుతుందా? లేక అది ఆమెను గర్విష్ఠిగా చేస్తుందా? కాలమే చెప్పాలి.

9. (ఎ) ఎస్తేరు రాజ సేవకుల దృష్టిలో పడినప్పుడు ఏమి జరిగింది? ఆమెను మొర్దెకైకి దూరంగా తీసుకువెళ్లినప్పుడు ఇద్దరూ ఎందుకు దుఃఖపడివుంటారు? (బి) ఎస్తేరు ఒక అన్యుణ్ణి పెళ్లి చేసుకోవడాన్ని మొర్దెకై ఎందుకు అనుమతించివుంటాడు? (బాక్సు కూడా చూడండి.)

9 ఎస్తేరు రాజ సేవకుల దృష్టిలో పడింది. వాళ్లు వెదికిన మిగతా కన్యకలతో పాటు ఆమెను మొర్దెకైకి దూరంగా నదికి ఆవలనున్న రాజభవనానికి తీసుకెళ్లారు. (ఎస్తే. 2:8) ఇద్దరూ తండ్రీకూతుళ్లలా ఉండేవాళ్లు కాబట్టి ఆ ఎడబాటు వాళ్లిద్దరికీ ఎంతో దుఃఖం కలిగించివుంటుంది. మొర్దెకై, తన పెంపుడు కూతుర్ని ఒక అవిశ్వాసికిచ్చి పెళ్లిచేయాలని ఎప్పుడూ అనుకొనివుండడు, అది రాజైనా సరే. కానీ ఇప్పుడు పరిస్థితులు ఆయన చేయిదాటిపోయాయి. b రాజ సేవకులు తనను తీసుకువెళ్లే ముందు మొర్దెకై చెప్పిన మాటలను ఎస్తేరు ఎంత జాగ్రత్తగా ఆలకించివుంటుందో కదా! తనను షూషను కోటకు తీసుకెళ్తుండగా ఆమె మదిలో ఎన్నో ప్రశ్నలు మెదిలివుంటాయి. ముందుముందు ఆమె జీవితం ఎలా ఉంటుంది?

“చూసిన ప్రతి ఒక్కరికీ ఆమె నచ్చింది”

10, 11. (ఎ) కొత్త జీవనశైలి ఎస్తేరు మీద ఎలాంటి ప్రభావం చూపించివుండేది? (బి) ఎస్తేరు యోగక్షేమాల గురించి మొర్దెకై ఎంతగా పట్టించుకున్నాడు?

10 ఒక్కసారిగా ఎస్తేరు జీవితం పూర్తిగా మారిపోయింది. పారసీక సామ్రాజ్యం నలుమూలల నుండి తీసుకొచ్చిన “కన్యకలు అనేకులు” కూడా ఆమెతోపాటు ఉన్నారు. వాళ్ల అలవాట్లు, భాషలు, ఆలోచనాతీరు ఎంతో వేరుగా ఉండివుంటాయి. వాళ్లందరి మీద హేగేను అధికారిగా నియమించారు. ఒక సంవత్సరం పాటు కన్యకలందరికీ, సుగంధ ద్రవ్యాలతో మర్దనల లాంటివి చేస్తూ వాళ్లు మరింత అందంగా కనిపించేలా చేస్తారు. (ఎస్తే. 2:8, 12) అలాంటి జీవనశైలి వల్ల, కన్యకల్లో కొందరికి అందం పిచ్చి పట్టివుంటుంది. అది వాళ్లలో అహంకారాన్ని, పోటీతత్వాన్ని కూడా పెంచివుంటుంది. మరి ఎస్తేరు పరిస్థితి ఎలావుంది?

11 ఎస్తేరు గురించి మొర్దెకై ఆలోచించినంతగా లోకంలో ఎవరూ ఆలోచించివుండరు. ఆయన ప్రతీరోజు, ఆ కన్యకలు ఉండే అంతఃపురం దగ్గరే తచ్చాడుతూ ఎస్తేరు యోగక్షేమాల గురించి వాకబు చేసేవాడని బైబిలు చెబుతోంది. (ఎస్తే. 2:11) బహుశా అక్కడి సేవకులు ఎస్తేరు గురించి తనకు ఏ చిన్న విషయం చెప్పినా, ఆయన ఒక తండ్రిలా ఎంతో గర్వపడివుంటాడు. ఎందుకు?

12, 13. (ఎ) ఎస్తేరును చూసినవాళ్లకు ఆమె గురించి ఏమనిపించింది? (బి) తాను యూదురాలిననే విషయం ఎస్తేరు ఎవ్వరికీ చెప్పలేదని గ్రహించినప్పుడు మొర్దెకై ఎందుకు సంతోషించివుంటాడు?

12 ఎస్తేరు హేగేకు ఎంతగా నచ్చిందంటే, ఆయన ఆమె మీద ఎంతో దయ చూపించాడు. ఆమెకు ఏడుగురు సేవకురాళ్లను ఇచ్చి, ఆమెను అంతఃపురంలోని అతి శ్రేష్ఠమైన స్థలంలో ఉంచాడు. “ఎస్తేరును చూసిన ప్రతి ఒక్కరికీ ఆమె నచ్చింది” అని కూడా బైబిలు చెబుతోంది. (ఎస్తే. 2:9, 15, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) కేవలం ఆమె అందం వల్లే అందరూ ఆమెను ఇష్టపడివుంటారా? లేదు, అందానికి మించిందేదో ఆమెలో ఉంది.

అందం కన్నా వినయం, జ్ఞానం చాలా ప్రాముఖ్యమైనవని ఎస్తేరుకు తెలుసు

13 ఉదాహరణకు, “మొర్దెకై—నీ జాతిని నీ వంశమును కనుపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించియుండెను గనుక ఆమె తెలుపలేదు” అని బైబిలు చెబుతోంది. (ఎస్తే. 2:10) పారసీక రాజ కుటుంబం యూదుల పట్ల ఎంతో వివక్ష చూపిస్తోందని మొర్దెకై గమనించాడు కాబట్టే, తను యూదురాలిననే విషయం ఎవ్వరికీ చెప్పవద్దని ఆయన ఎస్తేరుతో అన్నాడు. ఎస్తేరు ఇప్పుడు తనకు దూరంగా ఉన్నా ముందులాగే జ్ఞానంతో, విధేయతతో నడుచుకుంటోందని తెలుసుకొని మొర్దెకై ఎంతో సంతోషించివుంటాడు!

14. నేటి యౌవనులు ఎస్తేరును ఎలా ఆదర్శంగా తీసుకోవచ్చు?

14 అలాగే నేటి యౌవనులు కూడా తమ తల్లిదండ్రులకు, తమ బాగోగులు చూసుకునేవాళ్లకు సంతోషాన్ని కలిగించవచ్చు. తల్లిదండ్రులు దగ్గర్లో లేనప్పుడు, చుట్టూ బుద్ధిహీనులూ చెడ్డవాళ్లూ ఉన్నా తాము సరైన ప్రమాణాలకు కట్టుబడి జీవిస్తూ అలాంటివాళ్ల చెడు ప్రభావాలను తిప్పికొట్టవచ్చు. అలా చేసినప్పుడు, ఎస్తేరులాగే వాళ్లు కూడా తమ పరలోక తండ్రి హృదయాన్ని సంతోషపెడతారు.—సామెతలు 27:11 చదవండి.

15, 16. (ఎ) ఎస్తేరు ఎలా రాజు హృదయాన్ని గెలుచుకుంది? (బి) తన జీవితంలో వచ్చిన మార్పుకు అలవాటుపడడం ఎస్తేరుకు ఎందుకు కష్టమైవుంటుంది?

15 ఎస్తేరును రాజు దగ్గరకు తీసుకువెళ్లే సమయం వచ్చినప్పుడు, తను మరింత అందంగా కనిపించడానికి ఏది కావాలంటే అది తీసుకోమన్నారు. అయితే ఎంతో వినమ్రంగా ఆమె హేగే తీసుకోమన్నవి తప్ప ఇంకేమీ తీసుకోలేదు. (ఎస్తే. 2:15) రాజు హృదయాన్ని గెలవాలంటే అందం ఒక్కటే సరిపోదని బహుశా ఆమె గ్రహించివుంటుంది. అణకువ, వినయం అరుదుగా కనిపించే ఆ కోటలో అలాంటి లక్షణాలు చాలా ఆకట్టుకునేవిగా ఉంటాయని ఆమెకు తెలుసు. మరి ఆమె ఆలోచన సరైనదేనా?

16 బైబిలు ఇలా చెబుతోంది: “స్త్రీలందరికంటె రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటె ఆమె అతనివలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్యకిరీటమును ఆమె తలమీద ఉంచి ఆమెను వష్తికి బదులుగా రాణిగా నియమించెను.” (ఎస్తే. 2:17) ఆమె జీవితం ఒక్కసారిగా మారిపోయింది. దానికి అలవాటుపడడం వినయంగల ఆ యూదురాలికి ఎంతో కష్టమైవుంటుంది. ఇప్పుడామె రాణి! ఆ కాలంలో భూమ్మీద అత్యంత శక్తిమంతుడైన చక్రవర్తికి భార్య! దానివల్ల ఆమె కళ్లు నెత్తికెక్కాయా? లేదు!

17. (ఎ) ఎస్తేరు తన పెంపుడు తండ్రికి ఏయే విధాలుగా లోబడివుంది? (బి) ఈ రోజుల్లో మనం ఎస్తేరులా ఉండడం ఎందుకు ప్రాముఖ్యం?

17 రాణి అయ్యాక కూడా ఎస్తేరు తన పెంపుడు తండ్రి మొర్దెకైకి లోబడేవుంది. యూదులతో తనకున్న సంబంధాన్ని రహస్యంగానే ఉంచింది. ఒకసారి అహష్వేరోషును చంపడానికి జరుగుతున్న కుట్రను మొర్దెకై బయటపెట్టి, ఆ హెచ్చరికను రాజుకు చేరవేయమన్నాడు. ఎస్తేరు ఆయన చెప్పినట్లే చేసింది. దాంతో ఆ ద్రోహుల పన్నాగం బెడిసికొట్టింది. (ఎస్తే. 2:20-23) అంతేకాదు, ఆమె వినయవిధేయతలు కనబరుస్తూ తన దేవుని మీద విశ్వాసం కూడా చూపించింది. విధేయత అనే లక్షణాన్ని చులకనగా చూస్తూ అవిధేయతను, తిరుగుబాటుతనాన్ని వంటబట్టించుకున్న ప్రజలు ఎక్కువగావున్న ఈ రోజుల్లో మనం ఎస్తేరులా ఉండడం ఎంతో ప్రాముఖ్యం. అయితే, నిజమైన విశ్వాసం ఉన్నవాళ్లు ఎస్తేరులాగే విధేయతను ఎంతో అమూల్యంగా ఎంచుతారు.

ఎస్తేరు విశ్వాసానికి పరీక్ష ఎదురైంది

18. (ఎ) హామానుకు వంగి నమస్కరించడానికి మొర్దెకై ఎందుకు నిరాకరించివుంటాడు? (అధస్సూచి కూడా చూడండి.) (బి) విశ్వాసంగల నేటి స్త్రీపురుషులు మొర్దెకైని ఎలా ఆదర్శంగా తీసుకుంటున్నారు?

18 అహష్వేరోషు ఆస్థానంలో హామాను అనే వ్యక్తి ఉన్నతహోదాలో ఉండేవాడు. అహష్వేరోషు అతణ్ణి అధిపతులందరిలో ప్రధానునిగా, తన ముఖ్య సలహాదారుగా నియమించి రాజు తర్వాత రాజంతటి స్థానంలో ఉంచాడు. అంతెందుకు, హామాను ఎదురుపడినప్పుడు అందరూ మోకాళ్లూని అతనికి నమస్కరించాలని కూడా రాజు ఆజ్ఞాపించాడు. (ఎస్తే. 3:1-4) అయితే, ఆ ఆజ్ఞ వల్ల మొర్దెకై చిక్కుల్లో పడ్డాడు. రాజుకు లోబడాలి కానీ దేవుణ్ణి అగౌరవపర్చేంతగా కాదని ఆయన నమ్మేవాడు. హామాను ఒక అగాగీయుడు, అంటే దేవుని ప్రవక్త అయిన సమూయేలు చంపిన అమాలేకీయుల రాజైన అగగు వంశానికి చెందినవాడని తెలుస్తోంది. (1 సమూ. 15:33) ఈ అమాలేకీయులు ఎంత దుష్టులంటే యెహోవాకు, ఇశ్రాయేలీయులకు శత్రువులయ్యారు. అందుకే, దేవుడు అమాలేకీయులను ఒక జనాంగంగా దోషులని తీర్పుతీర్చాడు. c (ద్వితీ. 25:19) అలాంటప్పుడు, నమ్మకమైన ఏ యూదుడైనా ఒక అమాలేకీయునికి వంగి నమస్కరిస్తాడా? అందుకే మొర్దెకై హామానుకు వంగి నమస్కరించలేదు. ఈ రోజువరకూ విశ్వాసంగల స్త్రీపురుషులు, ‘మనుషులకు కాదు దేవునికే మనం లోబడాలి’ అనే సూత్రాన్ని పాటించడానికి తమ ప్రాణాలను కూడా పణంగాపెడుతూ వచ్చారు.—అపొ. 5:29.

19. హామాను ఏమని కంకణం కట్టుకున్నాడు? రాజును తనవైపు తిప్పుకోవడానికి అతను ఏమి చేశాడు?

19 హామాను కోపంతో ఊగిపోయాడు, అది మొర్దెకై ఒక్కణ్ణి చంపితే చల్లారే కోపం కాదు. మొర్దెకైతోపాటు ఆయన జాతిని కూడా సమూలంగా నాశనం చేయాలని హామాను కంకణం కట్టుకున్నాడు! వాళ్ల గురించి లేనిపోనివి నూరిపోస్తూ రాజును కూడా తనవైపు తిప్పుకున్నాడు. వాళ్ల పేరు ఎత్తకుండా, “జనులలో ఒక జాతివారు చెదరి యున్నారు” అని చెప్పి, వాళ్ల వల్ల రాజుకు ఏమీ ప్రయోజనం లేదన్నట్లు మాట్లాడాడు. ఇంకా దారుణమైన విషయమేమిటంటే, వాళ్లు రాజు ఆజ్ఞలను పాటించడంలేదని, తిరుగుబాటుదారులని, ప్రమాదకరమైన ప్రజలని చెప్పాడు. తన సామ్రాజ్యంలోని యూదులను చంపడానికి అయ్యే ఖర్చు కోసం పెద్ద మొత్తాన్ని తాను రాజు ఖజానాకు ఇస్తానని కూడా అన్నాడు. d దాంతో అహష్వేరోషు తన ఉంగరం హామానుకు ఇచ్చి, అతను అనుకున్నట్లు తాకీదు రాయించి ఆ ఉంగరంతో ముద్రవేయమని చెప్పాడు.—ఎస్తే. 3:5-10.

20, 21. (ఎ) హామాను చేయించిన ప్రకటన, పారసీక సామ్రాజ్యంలోని యూదులందరి మీద, మొర్దెకై మీద ఎలాంటి ప్రభావం చూపించింది? (బి) మొర్దెకై ఎస్తేరును ఏమి చేయమని వేడుకున్నాడు?

20 వెంటనే రాజ సేవకులు, వేగంగా గుర్రాలపై సంచరిస్తూ యూదులకు ఆ మరణ శాసనాన్ని ఆ సువిశాల సామ్రాజ్య నలుమూలలా ప్రకటించారు. ఎంతో దూరానవున్న యెరూషలేముకు ఆ వార్త చేరినప్పుడు వాళ్లకు ఎలా అనిపించివుంటుందో ఒక్కసారి ఊహించండి! అక్కడ, బబులోను చెర నుండి తిరిగివచ్చిన శేషించిన యూదులు రక్షణగా కనీసం ప్రాకారం కూడా లేని ఆ పట్టణాన్ని తిరిగి కట్టడానికి తంటాలుపడుతున్నారు. ఆ భయంకరమైన వార్త విన్నప్పుడు మొర్దెకై బహుశా వాళ్ల గురించీ, అలాగే షూషనులో ఉన్న తన బంధుమిత్రుల గురించీ ఆలోచించివుంటాడు. ఆయన దుఃఖంతో తన బట్టలు చింపుకున్నాడు. గోనెపట్ట కట్టుకొని, తలమీద బూడిద పోసుకొని, పట్టణం మధ్యలో పెద్దగా రోదించాడు. షూషనులో అంతమంది యూదులకు, వాళ్ల స్నేహితులకు చెప్పలేని వేదన కలిగించిన హామాను మాత్రం అదేమీ తనకు పట్టనట్లు రాజుతో కలిసి ద్రాక్షారసం తాగుతూ కూర్చున్నాడు.—ఎస్తేరు 3:12–4:1 చదవండి.

21 యూదులను కాపాడడానికి తాను ఏదో ఒకటి చేయాలని మొర్దెకైకి తెలుసు. కానీ ఆయన ఏమి చేయగలడు? మొర్దెకై గోనెపట్ట కట్టుకొని దుఃఖిస్తున్నాడని విన్న ఎస్తేరు ఆయనకు బట్టలు పంపింది. కానీ ఆయన వాటిని తీసుకోలేదు. అల్లారుముద్దుగా పెంచుకున్న ఎస్తేరు తనకు దూరమవడానికీ, ఒక అన్యుడైన రాజుకు భార్య అవడానికీ తన దేవుడైన యెహోవా ఎందుకు అనుమతించాడోనని మొర్దెకై బహుశా ఎంతోకాలం ఆలోచించివుంటాడు. ఇప్పుడు ఆయనకు ఆ కారణం అర్థమవుతున్నట్లు అనిపించింది. ఎస్తేరు రాణికి మొర్దెకై ఒక సందేశం పంపాడు, “ఆమె తన జనుల” పక్షాన నిలబడి, వాళ్ల తరఫున రాజుతో మాట్లాడాలని వేడుకున్నాడు.—ఎస్తే. 4:4-8.

22. రాజైన తన భర్త ముందుకు వెళ్లడానికి ఎస్తేరు ఎందుకు భయపడింది? (అధస్సూచి కూడా చూడండి.)

22 ఆ సందేశం విన్నప్పుడు ఎస్తేరు గుండె జారిపోయివుంటుంది. ఆమె విశ్వాసానికి అత్యంత పెద్ద పరీక్ష ఎదురైంది. ఆమె చాలా భయపడింది. ఆ విషయాన్నే మొర్దెకైకి ఆమె పంపిన తిరుగు సందేశంలో స్పష్టంగా తెలియజేసింది. రాజు పిలవకుండానే ఆయన ముందుకు వెళ్తే మరణదండన విధిస్తారనే రాజ శాసనాన్ని ఆయనకు గుర్తుచేసింది. రాజు తన బంగారపు దండాన్ని చూపిస్తే మాత్రమే ఆ శిక్ష తప్పుతుంది. మరి ఎస్తేరుకు అలా జరగదని అనుకోవచ్చా? ముఖ్యంగా, రాజు పిలిచినప్పుడు వెళ్లని వష్తికి పట్టిన గతిని చూసి కూడా అలా అనుకోవడానికి కారణం ఏమైనా ఉందా? గత 30 రోజులుగా రాజు తనను పిలవలేదని ఎస్తేరు మొర్దెకైకి చెప్పింది. చపలచిత్తుడైన ఆ రాజుకు తన మీద ప్రేమ తగ్గిపోయివుంటుందని ఎస్తేరుకు బలంగా అనిపించింది. eఎస్తే. 4:9-11.

23. (ఎ) ఎస్తేరు విశ్వాసాన్ని బలపర్చడానికి మొర్దెకై ఏమి అన్నాడు? (బి) మొర్దెకై మనకు ఎందుకు ఆదర్శప్రాయుడు?

23 ఎస్తేరు విశ్వాసాన్ని బలపర్చడానికి మొర్దెకై దృఢమైన సందేశం పంపాడు. ఒకవేళ ఆమె ఏమీ చేయలేకపోతే, యూదులకు రక్షణ మరోవైపు నుండి కలుగుతుందని ఆమెకు హామీ ఇచ్చాడు. ఒక్కసారి ఆ హింస మొదలయ్యాక తాను మాత్రం తప్పించుకుంటానని ఆమె ఎలా అనుకోగలదు? తన ప్రజల్ని ఎన్నటికీ సమూలంగా నాశనం కానివ్వని, తన వాగ్దానాల్ని తప్పక నెరవేర్చే యెహోవా మీద తనకెంత విశ్వాసముందో ఇక్కడ మొర్దెకై చూపిస్తున్నాడు. (యెహో. 23:14) తర్వాత ఆయన ఎస్తేరుతో ఇలా అన్నాడు: “నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుము.” (ఎస్తే. 4:12-14) నిజంగా మొర్దెకై మనకు ఆదర్శప్రాయుడు కాదంటారా? ఆయనకు తన దేవుడైన యెహోవా మీద పూర్తి నమ్మకముంది. మరి మన విషయమేమిటి?—సామె. 3:5, 6.

ఆమె విశ్వాసం మరణ భయం కన్నా బలమైనది

24. ఎస్తేరు ధైర్యవిశ్వాసాల్ని ఎలా చూపించింది?

24 ఇప్పుడు ఎస్తేరు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. షూషనులోని యూదులందరూ తనలాగే మూడు రోజులు ఉపవాసం ఉండేలా చూడమని మొర్దెకైతో చెప్పింది. ఆ సందేశం చివర్లో, ధైర్యవిశ్వాసాలు ఉట్టిపడేలా ఆమె అన్న ఈ మాటలు నేటికీ ప్రతిధ్వనిస్తున్నాయి: “నేను నశించిన నశించెదను.” (ఎస్తే. 4:15-17) ఆ మూడు రోజులూ, ఎస్తేరు తన జీవితంలో ముందెన్నడూ చేయనంత తీవ్రంగా ప్రార్థన చేసివుంటుంది. చివరకు ఆ సమయం రానేవచ్చింది. ఆమె శ్రేష్ఠమైన రాజవస్త్రాలు ధరించుకొని, చక్కగా అలంకరించుకొని రాజుకు అన్నివిధాలా నచ్చేలా తయారైంది. తర్వాత, రాజును కలవడానికి బయల్దేరింది.

దేవుని ప్రజలను కాపాడడానికి ఎస్తేరు తన ప్రాణాలకు తెగించింది

25. ఎస్తేరు తన భర్త దగ్గరకు వెళ్లినప్పుడు ఏమి జరిగిందో వివరించండి.

25 ఈ అధ్యాయం మొదట్లో చూసినట్లు, ఎస్తేరు రాజు ఆస్థానానికి వెళ్లింది. కలవరపెట్టే ఆలోచనలు ఎన్నో ఆమె మనసులో మెదిలివుంటాయి, లెక్కలేనన్నిసార్లు తీవ్రంగా ప్రార్థించివుంటుంది. ఆమె రాజు ఆవరణంలోకి ప్రవేశించింది. అక్కడ నుండి ఆమె, సింహాసనం మీద కూర్చున్న అహష్వేరోషును చూడగలదు. ఆమె బహుశా ఆయన ముఖకవళికలు గమనించడానికి ప్రయత్నించివుంటుంది. ఒకవేళ ఆమె వేచివుండాల్సి వచ్చుంటే గనుక, ఆమెకు క్షణమొక యుగంలా గడిచివుంటుంది. చివరకు ఆమె భర్త ఆమెను చూశాడు. ఆమెను చూడగానే రాజు ఆశ్చర్యపోయివుంటాడు. కానీ తర్వాత ఆయన ముఖంలో సంతోషం కనబడింది. ఆయన ఎస్తేరు వైపు బంగారు దండం చూపాడు!—ఎస్తే. 5:1, 2.

26. నిజక్రైస్తవులకు ఎస్తేరుకు ఉన్నంత ధైర్యం ఎందుకు అవసరం? ఎస్తేరు చేయాల్సింది ఇంకా ఎంతోవుందని మనం ఎందుకు చెప్పవచ్చు?

26 ఎస్తేరు చెప్పేది వినడానికి రాజు సుముఖంగా ఉన్నాడు. ఆమె తన దేవునికి నమ్మకంగా ఉంది, ఆయన ప్రజలను కాపాడడానికి తన ప్రాణాలకు తెగించింది. విశ్వాసం విషయంలో దేవుని సేవకులందరికీ ఆమె చక్కని ఆదర్శంగా నిలిచింది. అలాంటి వ్యక్తులను నేటి నిజక్రైస్తవులు ఎంతో అమూల్యంగా ఎంచుతారు. తన నిజమైన అనుచరులు ఒకరిపట్ల ఒకరు స్వయంత్యాగపూరిత ప్రేమ చూపించాలని యేసు చెప్పాడు. (యోహాను 13:34, 35 చదవండి.) అలాంటి ప్రేమ చూపించాలంటే, ఎస్తేరుకు ఉన్నంత ధైర్యం కావాలి. ఆ రోజు ఆమె దేవుని ప్రజల పక్షాన నిలబడినా, ఆమె చేయాల్సింది ఇంకా ఎంతోవుంది. రాజు ప్రియ సలహాదారుడు హామాను ఒక దుష్ట కుట్రదారుడని ఆమె రాజును ఎలా ఒప్పిస్తుంది? తన ప్రజలను కాపాడడానికి ఆమె ఏమి చేయగలదు? తర్వాతి అధ్యాయంలో ఆ ప్రశ్నలను పరిశీలిస్తాం.

a ఈ అహష్వేరోషే, సా.శ.పూ. 5వ శతాబ్దపు తొలినాళ్లలో పారసీక సామ్రాజ్యాన్ని పరిపాలించిన గ్సెరెక్సెస్‌ I (Xerxes I) అని చాలామంది అంటారు.

b 16వ అధ్యాయంలోని, “ఎస్తేరు గురించిన ప్రశ్నలు” అనే బాక్సు చూడండి.

c అమాలేకీయుల “శేషము” హిజ్కియా రాజు కాలంలోనే హతమైంది కాబట్టి, ఆ జనాంగంలో చిట్టచివర మిగిలినవాళ్లలో హామాను ఒకడైవుంటాడు.—1 దిన. 4:43.

d హామాను ఇరవై వేల మణుగుల వెండిని ఇస్తానని చెప్పాడు. ఈ రోజుల్లో దాని విలువ వందల కోట్ల రూపాయలు ఉంటుంది. ఒకవేళ అహష్వేరోషే గ్సెరెక్సెస్‌ I అయ్యుంటే, హామాను ఇస్తానన్న మొత్తం గురించి విన్నప్పుడు ఎంతో సంతోషించి ఉంటాడు. ఎందుకంటే, గ్సెరెక్సెస్‌ గ్రీసుతో యుద్ధం చేయాలని ఎంతోకాలంగా అనుకుంటున్నాడు, దానికి ఆయనకు చాలా డబ్బు అవసరమైంది. కానీ చివరకు, ఆ యుద్ధంలో ఆయన ఘోర పరాజయాన్ని చవిచూశాడు.

e గ్సెరెక్సెస్‌ I రాజుకు చపలచిత్తుడు, కోపిష్ఠి అనే పేరుంది. ఆయన గ్రీసుతో చేసిన యుద్ధానికి సంబంధించి గ్రీకు చరిత్రకారుడు హెరొడోటస్‌ రాసిన కొన్ని విషయాలను చూస్తే ఆ సంగతి అర్థమౌతుంది. ఓడలను పక్కపక్కన పేరుస్తూ హెల్లెస్పాంటు జలసంధి మీద వారధి నిర్మించమని ఆ రాజు ఆజ్ఞాపించాడు. ఒక తుఫాను వల్ల వారధి చెల్లాచెదురైనప్పుడు, దాన్ని నిర్మించిన ఇంజనీర్ల తలలు తెగనరకమని ఆయన ఆజ్ఞాపించాడు. అంతేకాదు, అవమానకరమైన ప్రకటనను బిగ్గరగా చదువుతున్నప్పుడు నీటిని కొడుతూ ఆ జలసంధిని “శిక్షించమని” కూడా తన సేవకులకు చెప్పాడు. ఆ సందర్భంలోనే, ఒక సంపన్నుడు వచ్చి తన కుమారుడు సైన్యంలో చేరకుండా ఉండేందుకు అనుమతించమని వేడుకున్నప్పుడు రాజు ఆ కుమారుణ్ణి సగానికి నరికించి, ఆయన శరీరాన్ని హెచ్చరికగా అందరికీ కనిపించేలా పెట్టించాడు.