కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

12వ అధ్యాయం

తన దేవుని వల్ల ఊరట పొందాడు

తన దేవుని వల్ల ఊరట పొందాడు

1, 2. ఏలీయా జీవితంలో అత్యంత గొప్ప సంఘటనలు చోటుచేసుకున్న ఆ రోజున ఏమి జరిగింది?

 ఏలీయా వర్షంలో తడుస్తూ పరుగెత్తుతున్నాడు, కారుమబ్బులతో ఆ ప్రాంతమంతా చీకటి అలుముకుంది. యెజ్రెయేలు చేరుకోవాలంటే ఇంకా ఎంతో దూరం పరుగెత్తాలి, పైగా ఆయన కుర్రోడు కూడా కాదు. అయితే, “యెహోవా హస్తము” బలపర్చడంతో ఆయన అవిశ్రాంతంగా పరుగెత్తుతున్నాడు. ముందెన్నటికన్నా ఇప్పుడు యెహోవా హస్తం తనను ఎంతో బలపరుస్తోందని ఆయనకు అర్థమైంది. ఆయన ఎంత బలం పొందాడంటే, అహాబు రాజు రథాన్ని లాగుతున్న గుర్రాలను కూడా దాటేశాడు!—1 రాజులు 18:46 చదవండి.

2 ఏలీయా పరుగెత్తాల్సిన దూరం ఇంకా ఎంతో ఉంది. కుండపోతగా కురుస్తున్న వర్షం ఆయన ముఖం మీద కొడుతూవుంది. తన జీవితంలో అత్యంత గొప్ప సంఘటనలు జరిగిన ఆ రోజు గురించి ఆలోచిస్తూ ఆయన ఆ వర్షంలో పరుగెత్తడం ఊహించుకోండి. ఏలీయా దేవుడైన యెహోవాకు, సత్యారాధనకు నిజంగా అదొక గొప్ప విజయం. ఏలీయా చాలా ముందుకు వచ్చేశాడు. యెహోవా తనను ఉపయోగించుకుని ఎంతో శక్తిమంతంగా, అద్భుతంగా బయలు ఆరాధనను ఓడించిన స్థలం అంటే కర్మెలు పర్వతం ఆ గాలివానలో, చీకటిలో ఇక ఏమాత్రం కనిపించడం లేదు. 450 మంది బయలు ప్రవక్తలు మోసగాళ్లని తేలిపోయింది, న్యాయంగానే దేవుడు వాళ్లను నాశనం చేశాడు. మూడున్నర సంవత్సరాలు ఆ ప్రాంతంలో వర్షం పడలేదు, అందుకే వర్షాన్ని కురిపించమని ఏలీయా యెహోవాకు ప్రార్థన చేశాడు. అప్పుడు వర్షం కురిసింది!—1 రాజు. 18:18-45.

3, 4. (ఎ) ఏలీయా యెజ్రెయేలుకు వెళ్తున్నప్పుడు, పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఎందుకు ఆశించివుంటాడు? (బి) మనం ఏ ప్రశ్నలు పరిశీలిస్తాం?

3 ఆ వర్షంలో ఏలీయా 30 కి.మీ. దూరంలో ఉన్న యెజ్రెయేలుకు పరుగెత్తుతూ, పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆశించివుంటాడు. బయలు ప్రవక్తల నాశనం తర్వాత పరిస్థితులు నిజంగా మలుపు తిరుగుతాయని అనుకునివుంటాడు. అహాబులో మార్పు రావాలి! జరిగిందంతా చూశాక ఆయన ఖచ్చితంగా బయలు ఆరాధనను విడిచిపెడతాడనీ, తన రాణి యెజెబెలును అదుపులో ఉంచుతాడనీ, యెహోవా సేవకులను హింసించడం ఆపుతాడనీ ఏలీయా తనలోతాను అనుకొనివుంటాడు.

“ఏలీయా . . . అహాబుకంటె ముందుగా పరుగెత్తికొనిపోయి యెజ్రెయేలు గుమ్మము నొద్దకు వచ్చెను”

4 ఒక విషయం మనమనుకున్నట్టు జరుగుతోందనిపిస్తే మనలో ఆశలు చిగురించడం సహజమే. మన పరిస్థితులు రోజురోజుకూ మెరుగౌతాయని ఊహించుకుంటాం. ఆఖరికి, జీవితంలోని తీవ్రమైన సమస్యలు కూడా తీరిపోయాయని అనుకుంటాం. ఏలీయా ఒకవేళ అలా ఆలోచించినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు. ఎందుకంటే, ఆయన కూడా ‘మనలాంటి మనిషే.’ (యాకో. 5:17) నిజానికి ఏలీయా కష్టాలు అంతటితో ఆగిపోలేదు. కొన్ని గంటల్లోనే ఆయన ఎంతో భయపడి, నిరాశపడి చనిపోవాలని కూడా అనుకుంటాడు. అసలు ఏం జరిగింది? తన ప్రవక్త విశ్వాసాన్ని యెహోవా ఎలా బలపర్చాడు? ఆయనలో ధైర్యాన్ని ఎలా నింపాడు? ఇప్పుడు చూద్దాం.

ఊహించని మలుపు

5. కర్మెలు పర్వతంపై జరిగిన సంఘటనలు చూశాక, అహాబుకు యెహోవా మీద గౌరవం ఏమైనా కలిగిందా? అది మనకు ఎలా తెలుసు?

5 అహాబు యెజ్రెయేలులోవున్న తన రాజభవనానికి చేరుకునేసరికి ఆయనలో మార్పు ఏమైనా కనిపించిందా? బైబిలు ఇలా చెబుతోంది: ‘ఏలీయా చేసినదంతా, అతడు ఖడ్గంతో ప్రవక్తలనందరినీ చంపించిన సంగతి అహాబు యెజెబెలుకు తెలియజేశాడు.’ (1 రాజు. 19:1) ఆ రోజు జరిగిన సంగతుల గురించి అహాబు చెబుతున్నప్పుడు, ఏలీయా దేవుడైన యెహోవా గురించి ఆయన అసలు ప్రస్తావించనేలేదని గమనించండి. ఆ అద్భుతాలు ‘ఏలీయా చేశాడు’ అని అహాబు అన్నాడు, అంటే ఆయన వాటిని కేవలం మానవ దృష్టితోనే చూశాడు. అదంతా చూసినా ఆయనలో యెహోవా దేవుని మీద గౌరవం కలగలేదని అర్థమౌతోంది. మరి పగతోవున్న ఆయన భార్య ఎలా స్పందించింది?

6. యెజెబెలు ఏలీయాకు ఏ వర్తమానం పంపింది? దానర్థం ఏమిటి?

6 యెజెబెలు కోపంతో రగిలిపోయింది! ఆమె పగతో ఏలీయాకు ఈ వర్తమానం పంపింది: ‘రేపు ఈ వేళకు నేను నీ ప్రాణాన్ని వాళ్లలో ఒకని ప్రాణంలా చేయకపోతే దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయునుగాక.’ (1 రాజు. 19:2) ఈ చావు బెదిరింపు వెన్నులో వణుకుపుట్టించేదే! మరో మాటలో చెప్పాలంటే, తన బయలు ప్రవక్తలను చంపినందుకు ప్రతీకారంగా ఏలీయాను అదే రోజు చంపించకపోతే తను చచ్చిపోతానని యెజెబెలు శపథం చేసింది. ఒక్కసారి ఊహించుకోండి, గాలివాన వచ్చిన ఆ రాత్రి యెజ్రెయేలులోని ఒక చిన్న ఇంట్లో బసచేస్తున్న ఏలీయా ఉన్నట్టుండి నిద్రలేవాల్సి వచ్చింది, అదీ యెజెబెలు రాణి పంపిన ఆ భయంకరమైన వార్త వినడానికే! అప్పుడు ఆయన ఎలా స్పందించాడు?

భయం, నిరుత్సాహం ఆవహించాయి

7. యెజెబెలు బెదిరింపుకు ఏలీయా ఎలా స్పందించాడు? అప్పుడు ఆయన ఏమి చేశాడు?

7 బయలు ఆరాధనతో యుద్ధం దాదాపు ముగిసిందని ఏలీయా అనుకొనివుంటే ఆయన పొరపడినట్లే. అంత జరిగినా యెజెబెలులో ఎలాంటి మార్పూ రాలేదు. ఆమె అప్పటికే ఏలీయా నమ్మకమైన తోటి ప్రవక్తల్లో చాలామందిని చంపించింది, ఇప్పుడు తన వంతు వచ్చిందని ఆయనకు అనిపించింది. యెజెబెలు బెదిరింపుకు ఏలీయా ఎలా స్పందించాడు? ‘ఆయన భయపడ్డాడు.’ యెజెబెలు తనను ఎంత ఘోరంగా చంపుతుందో ఏలీయా ఊహించుకొని ఉంటాడా? ఒకవేళ దాని గురించే ఆలోచిస్తూ ఉంటే, ఆయన ధైర్యం తప్పక నీరుగారివుంటుంది. ఏదేమైనా ఏలీయా తన “ప్రాణం దక్కించుకోవడానికి పారిపోయాడు.”—1 రాజు. 18:4; 19:3, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

ధైర్యం కోల్పోకుండా ఉండాలంటే మనల్ని భయపెట్టే ప్రమాదాల మీద మనసుపెట్టకూడదు

8. (ఎ) ఏలీయా లాంటి సమస్యే పేతురుకు కూడా ఉండేదని ఎందుకు చెప్పవచ్చు? (బి) ఏలీయా, పేతురుల నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు?

8 ఏలీయా ఒక్కడే కాదు, ఆయనలాంటి ఎంతోమంది విశ్వాసులు కూడా అంతలా భయపడ్డారు. చాలాకాలం తర్వాత జీవించిన అపొస్తలుడైన పేతురు ఉదాహరణే తీసుకోండి. ఆయనను నీళ్ల మీద తనతోపాటు నడిచేలా యేసు చేసినప్పుడు పేతురు ‘గాలిని చూస్తూ’ ఉన్నాడు. దాంతో ధైర్యం కోల్పోయి మునిగిపోసాగాడు. (మత్తయి 14:30, 31 చదవండి.) ఏలీయా, పేతురుల నుండి మనం ఒక మంచి పాఠం నేర్చుకోవచ్చు. ధైర్యం కోల్పోకుండా ఉండాలంటే మనల్ని భయపెట్టే ప్రమాదాల మీద కాకుండా మన నిరీక్షణకు, బలానికి మూలమైన యెహోవా మీద మనసుపెట్టాలి.

‘ఇంతమట్టుకు చాలు!’

9. ఏలీయా ప్రయాణం గురించి వివరించండి. పారిపోతున్నప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది?

9 భయం వల్ల ఏలీయా నైరుతి దిశలో దాదాపు 150 కి.మీ. దూరంలోవున్న బెయేర్షెబా పట్టణానికి పారిపోయాడు, అది యూదా దక్షిణ సరిహద్దుకు దగ్గర్లో ఉంది. ఏలీయా అక్కడ తన దాసుణ్ణి వదిలేసి ఒంటరిగా అరణ్యానికి వెళ్లిపోయాడు. ఆయన ‘ఒక రోజంత ప్రయాణం’ చేశాడని బైబిలు చెబుతోంది. అంటే, ఆయన ఉదయాన్నే బయలుదేరి ఉంటాడు. బహుశా, తనతోపాటు ఆహారంగానీ కావాల్సిన వస్తువులుగానీ తీసుకెళ్లి ఉండడు. నిరుత్సాహం, భయం ఆవహించిన ఏలీయా మండుటెండలో రాళ్లూరప్పలూ ఉన్న దారిగుండా ఎంతో కష్టపడి నడుచుకుంటూ వెళ్లాడు. ఎండ ప్రతాపం తగ్గి చీకటిపడే సరికి ఏలీయాలో ఇక ఏమాత్రం సత్తువ లేదు. అలిసిపోయి ఓ బదరీ చెట్టు కింద కూలబడ్డాడు, ఆ నిర్జన ప్రాంతంలో తలదాచుకోవడానికి దగ్గర్లో ఇంకేమీ లేదు.—1 రాజు. 19:4.

10, 11. (ఎ) ఏలీయా యెహోవాకు చేసిన ప్రార్థనకు అర్థమేమిటి? (బి) బాగా కృంగిపోయినప్పుడు కొంతమంది దేవుని సేవకులకు ఎలా అనిపించిందో పేరాలోని లేఖనాల నుండి వివరించండి.

10 ఎంతో విరక్తితో ఏలీయా తన ప్రాణం తీసేయమని ప్రార్థించాడు. “నా పితరులకంటె నేను ఎక్కువవాడను కాను” అని ఆయన అన్నాడు. ఆ సమయానికి తన పితరులు మట్టిలో కలిసిపోయారని, వాళ్ల ఎముకలు మాత్రమే మిగిలాయని, అంటే వాళ్లు ఎవరికీ ఏ మేలూ చేయలేని స్థితిలో ఉన్నారని ఆయనకు తెలుసు. (ప్రసం. 9:10) తన పరిస్థితి కూడా వాళ్లలాగే ఉందని ఏలీయాకు అనిపించింది. అందుకే “ఇంతమట్టుకు చాలు” అని తన బాధను వెళ్లగ్రక్కాడు. ఇక బ్రతకడం ఎందుకని అనుకున్నాడు.

11 ఒక దైవజనుడు ఇంతగా కృంగిపోవడం చూసి మనం ఆశ్చర్యపోవాలా? లేదు. ఎందుకంటే రిబ్కా, యాకోబు, మోషే, యోబు వంటి ఎంతోమంది విశ్వాసులైన స్త్రీపురుషులు బాగా కృంగిపోయి చావును కోరుకున్నారని బైబిలు చెబుతోంది.—ఆది. 25:22; 37:35; సంఖ్యా. 11:13-15; యోబు 14:13.

12. మీరు ఎప్పుడైనా కృంగిపోతే ఏలీయాలా ఏమి చేయాలి?

12 నేడు మనం ‘అపాయకరమైన కాలాల్లో’ జీవిస్తున్నాం. కాబట్టి చాలామంది, చివరకు విశ్వాసులైన దేవుని సేవకులు కూడా అప్పుడప్పుడు కృంగిపోతుంటారు. (2 తిమో. 3:1) ఒకవేళ మీకు అలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఎదురైతే, ఏలీయాలా మీరు కూడా మీ బాధను దేవునికి చెప్పుకోండి. ఎంతైనా యెహోవాయే “సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు.” (2 కొరింథీయులు 1:3, 4 చదవండి.) ఆయన ఏలీయాను ఓదార్చాడా?

యెహోవా తన ప్రవక్తను పోషించాడు

13, 14. (ఎ) యెహోవా ఒక దేవదూతను పంపించి, బాధలో ఉన్న తన ప్రవక్త మీద ప్రేమతో ఎలా శ్రద్ధ చూపించాడు? (బి) మన పరిమితులతో సహా మనలో ప్రతీ ఒక్కరి గురించి యెహోవాకు అంతా తెలుసనే విషయం ఎందుకు ఊరటనిస్తుంది?

13 తానెంతో ప్రేమించే ప్రవక్త అరణ్యంలో ఒక చెట్టు కింద కూర్చొని తన ప్రాణం తీసేయమని వేడుకుంటుంటే, పరలోకం నుండి చూస్తున్న యెహోవాకు ఏమి అనిపించివుంటుంది? మనం ఊహించనవసరం లేదు. ఏలీయా నిద్రలోకి జారుకున్నాక యెహోవా ఆయన దగ్గరకు ఒక దేవదూతను పంపించాడు. ఆ దూత ఏలీయాను మెల్లగా తట్టి, ‘లేచి భోజనం చేయి’ అన్నాడు. ఏలీయా లేచి, ఆ దూత దయతో తనకిచ్చిన వేడివేడి అప్పాన్ని తిని, దూత ఇచ్చిన నీళ్లు తాగాడు. ఏలీయా ఆ దేవదూతకు కనీసం కృతజ్ఞతలైనా చెప్పాడా? ఆ ప్రవక్త అప్పం తిని, నీళ్లు తాగి మళ్లీ పడుకుండిపోయాడని మాత్రమే మనం బైబిల్లో చదువుతాం. ఆయన మాట్లాడలేనంతగా కృంగిపోయాడా? ఏదేమైనా ఆ దూత ఆయనను రెండవసారి లేపాడు, బహుశా అప్పటికి తెల్లవారివుంటుంది. ఆ దూత మరోసారి ఏలీయాతో ‘లేచి భోజనం చేయి’ అంటూ ఆలోచింపజేసే ఈ మాటలు అన్నాడు: “నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమైయున్నది.” —1 రాజు. 19:5-7.

14 దేవుని సహాయంతో ఆ దూత ఏలీయా ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోగలిగాడు. ఏలీయా స్వశక్తితో అంతదూరం ప్రయాణించలేడని కూడా ఆ దూతకు తెలుసు. మన లక్ష్యాలేమిటో, మన పరిమితులేమిటో మనకన్నా బాగా తెలిసిన అలాంటి దేవుణ్ణి సేవించడం మనకు ఎంతో ఊరటనిస్తుంది. (కీర్తన 103:13, 14 చదవండి.) ఆ భోజనం వల్ల ఆయనకు ఎంత శక్తి వచ్చింది?

15, 16. (ఎ) యెహోవా ఏర్పాటు చేసిన భోజనం ఏలీయాకు ఎంత శక్తినిచ్చింది? (బి) నేడు యెహోవా తన సేవకులను పోషించే విధానం పట్ల మనం ఎందుకు కృతజ్ఞత చూపించాలి?

15 బైబిలు ఇలా చెబుతోంది: ‘అతడు లేచి భోజనం చేసి, ఆ భోజనపు బలంతో నలువది రాత్రింబగళ్లు ప్రయాణం చేసి, దేవుని పర్వతమని పేరుపెట్టబడిన హోరేబుకు వచ్చాడు.’ (1 రాజు. 19:8) తనకన్నా దాదాపు ఆరు శతాబ్దాల ముందు జీవించిన మోషేలా, దాదాపు పది శతాబ్దాల తర్వాత జీవించిన యేసులా ఏలీయా 40 పగళ్లూ 40 రాత్రిళ్లూ ఉపవాసమున్నాడు. (నిర్గ. 34:28; లూకా 4:1, 2) ఆ ఒక్క భోజనంతో ఆయన సమస్యలన్నీ తీరిపోలేదు, కానీ అద్భుతంగా అది ఆయనకు ఎంతో శక్తినిచ్చింది. వయసు పైబడిన ఏలీయా ఎలాంటి దారీలేని అరణ్యంలో రోజుల తరబడి, వారాల తరబడి అలా దాదాపు నెలన్నర రోజులు కష్టపడుతూ చేసిన ప్రయాణం గురించి ఒక్కసారి ఆలోచించండి!

16 యెహోవా తన సేవకులను ఇప్పుడు కూడా పోషిస్తున్నాడు, అయితే భౌతిక ఆహారంతో కాదుగానీ మరెంతో ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక ఆహారంతో పోషిస్తున్నాడు. (మత్త. 4:4) ఆయన వాక్యం నుండి, పూర్తిగా బైబిలు ఆధారంగా రూపొందిన ప్రచురణల నుండి మనం ఆయన గురించి తెలుసుకుంటూ ఆధ్యాత్మిక పోషణ పొందుతున్నాం. దానివల్ల సమస్యలన్నీ తీరిపోవు కానీ మనకై మనం సహించలేని వాటిని సహించగలుగుతాం, అంతేకాదు “నిత్యజీవము” కూడా పొందగలుగుతాం.—యోహా. 17:3.

17. ఏలీయా ఎక్కడికి వెళ్లాడు? ఆ చోటు ఎందుకు ప్రత్యేకమైనది?

17 ఏలీయా దాదాపు 320 కి.మీ. నడిచి చివరకు హోరేబు కొండ (సీనాయి పర్వతం) దగ్గరకు చేరుకున్నాడు. ఆ చోటు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే, అంతకుముందు యెహోవా దేవుడు ఒక దేవదూత ద్వారా మండుతున్న పొదలో మోషేకు ప్రత్యక్షమైంది అక్కడే. ఆ తర్వాత యెహోవా ఇశ్రాయేలీయులతో ధర్మశాస్త్ర నిబంధన చేసింది కూడా అక్కడే. ఇప్పుడు ఏలీయా అక్కడే ఒక గుహలో తలదాచుకున్నాడు.

యెహోవా తన ప్రవక్తకు ఎలా ఊరటనిచ్చి, బలపర్చాడు?

18, 19. (ఎ) యెహోవా దూత ఏలీయాను ఏమని అడిగాడు? దానికి ఏలీయా ఎలా స్పందించాడు? (బి) ఏలీయా మాటల్ని బట్టి, ఆయన ఏ మూడు కారణాల వల్ల కృంగిపోయాడని తెలుస్తోంది?

18 హోరేబు కొండ దగ్గర యెహోవా “వాక్కు” అంటే బహుశా ఒక దేవదూత ఇలా అడిగాడు: ‘ఏలీయా, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు?’ ఆయన ఆ ప్రశ్నను చాలా మృదువుగా అడిగివుంటాడు, తన భావాలు కుమ్మరించడానికి అదే మంచి అవకాశమని ఏలీయా అనుకున్నాడు. ఆయన తన మనోభావాల్ని ఇలా వ్యక్తం చేశాడు: “ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గముచేత హతము చేసిరి, సైన్యములకధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహా రోషముగలవాడనై నేను ఒకడనుమాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణమునుకూడ తీసివేయుటకై చూచుచున్నారు.” (1 రాజు. 19:9, 10) ఏలీయా అంతలా ఎందుకు కృంగిపోయాడు? దానికి కనీసం మూడు కారణాలున్నాయని ఆయన మాటల్ని బట్టి తెలుస్తోంది.

19 మొదటిది, ఏలీయా తాను చేసిన పనంతా వ్యర్థమైపోయిందని అనుకున్నాడు. దేవుని పరిశుద్ధమైన పేరుకూ ఆయన ఆరాధనకూ ప్రాధాన్యమిస్తూ ‘మహా రోషంతో’ యెహోవాను ఎన్నో ఏళ్లు సేవించినా పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నట్లు ఆయనకు అనిపించింది. ప్రజలు ఇంకా అవిశ్వాసులుగా, అవిధేయులుగా ఉన్నారు. మరోవైపు అబద్ధ ఆరాధన ఎంతో ప్రబలిపోతోంది. రెండవది, ఏలీయా తాను ఏకాకినయ్యానని అనుకుని ‘నేను ఒకణ్ణి మాత్రమే మిగిలివున్నాను’ అన్నాడు. ఇశ్రాయేలు జనాంగంలోని యెహోవా ఆరాధకుల్లో తానే చివరివాడని అనుకున్నాడు. మూడవది, ఆయన భయపడ్డాడు. తోటి ప్రవక్తల్లో చాలామంది అప్పటికే హతులయ్యారు, ఇప్పుడు తన వంతు వచ్చిందని ఆయనకు బలంగా అనిపించింది. అలాంటి భావాలు బయటకు చెప్పుకోవడం అంత సులువు కాదు. అయినా ఏలీయా అహాన్ని అడ్డురానివ్వలేదు, అవమానపాలౌతానేమో అనుకొని మౌనంగా ఉండిపోలేదు. ప్రార్థన చేసేటప్పుడు దేవునితో మనసు విప్పి మాట్లాడే విషయంలో విశ్వాసులందరికీ ఏలీయా ఆదర్శంగా ఉన్నాడు.—కీర్త. 62:8.

20, 21. (ఎ) హోరేబు కొండమీద ఉన్న గుహ ద్వారం నుండి ఏలీయా ఏమి చూశాడో వివరించండి. (బి) యెహోవా శక్తిని కళ్లారా చూసిన ఏలీయాకు ఏ విషయం అర్థమైంది?

20 ఏలీయా భయాందోళనలను యెహోవా ఎలా పోగొట్టాడు? గుహ ద్వారం దగ్గర నిలబడమని ఆ దేవదూత ఏలీయాకు చెప్పాడు. ఏమి జరగనుందో తెలియకపోయినా ఏలీయా ఆయన చెప్పినట్లే చేశాడు. అప్పుడు అకస్మాత్తుగా బలమైన గాలి వీచింది. ఆ ధాటికి పర్వతాలు, శిలలు కూడా బద్దలయ్యాయి. అంటే తప్పకుండా చెవులు చిల్లులుపడేంత పెద్ద శబ్దం వచ్చివుంటుంది. అంత బలంగా వీచే గాలిలో, జంతు వెంట్రుకలతో తయారైన బరువాటి పైవస్త్రం ఊడిపోకుండా పట్టుకుంటూ ఏలీయా తన కళ్లను కాపాడుకోవడానికి ప్రయత్నించడం ఊహించుకోండి. తర్వాత భూకంపం వచ్చింది, దాని ప్రతాపానికి ఆ చోటంతా విపరీతంగా కంపిస్తూవుంటే పడిపోకుండా నిలబడడానికి చాలా కష్టపడివుంటాడు. ఆయన తేరుకునేలోపే అక్కడ పెద్దపెద్ద మంటలు రేగాయి, తీక్షణమైన వేడిని తట్టుకోలేక ఆయన గుహ లోపలికి వెళ్లాల్సివచ్చింది.—1 రాజు. 19:11, 12.

ఏలీయాకు ఊరటనివ్వడానికి, ఆయనను ప్రోత్సహించడానికి యెహోవా తన అపారమైన శక్తిని ఉపయోగించాడు

21 యెహోవా తన ప్రకృతి శక్తిని అద్భుతంగా ప్రదర్శించిన ఈ మూడు సందర్భాల్లోనూ ఆయన ‘ప్రత్యక్షం కాలేదు’ అని బైబిలు చెబుతోంది. బయలులా యెహోవా కల్పితమైన ప్రకృతి దేవుడు కాదని ఏలీయాకు తెలుసు. మోసపోయిన బయలు ఆరాధకులు, “మేఘ వాహకుడు” (వర్షాలు కురిపించేవాడు) అని బయలును కొనియాడేవాళ్లు. ప్రకృతిలో కనిపించే మహా శక్తికి నిజంగా యెహోవాయే మూలం, అయినా అవేవీ ఆయనకు ఏ రకంగానూ సాటిరావు. నిజానికి ఆకాశాలు కూడా ఆయనను “పట్టజాలవు”! (1 రాజు. 8:27) ఆ అద్భుతాలు ఏలీయాకు ఏవిధంగా సహాయం చేశాయి? అంతకుముందు ఆయన పడిన భయాన్ని ఒకసారి గుర్తుచేసుకోండి. అంత గొప్ప శక్తిమంతుడైన యెహోవా దేవుడు తన పక్కనుండగా అహాబుకు, యెజెబెలుకు ఏలీయా ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు!—కీర్తన 118:6 చదవండి.

22. (ఎ) ‘మిక్కిలి నిమ్మళమైన స్వరం’ ఏలీయా విలువైనవాడని ఎలా హామీనిచ్చింది? (బి) ఆ ‘స్వరం’ ఎవరిదై ఉంటుంది? (అధస్సూచి చూడండి.)

22 మంటలు ఆరిపోయాక నిశ్శబ్దం ఆవహించింది, అప్పుడు ఏలీయా ‘మిక్కిలి నిమ్మళమైన ఒక స్వరం’ విన్నాడు. అది ఏలీయా భావాలను మళ్లీ చెప్పమని అడిగింది, అప్పుడు ఏలీయా తన భావాలను రెండవసారి కుమ్మరించాడు. a బహుశా దానివల్ల ఏలీయాకు ఇంకాస్త ఊరట కలిగి ఉంటుంది. అయితే, ‘మిక్కిలి నిమ్మళమైన స్వరం’ ఆ తర్వాత అన్న మాటలు విని ఏలీయా ఖచ్చితంగా ఇంకా ఎంతో ఓదార్పు పొందాడు. ఏలీయా విలువైనవాడని యెహోవా ఆయనకు హామీనిచ్చాడు. ఎలా? ఇశ్రాయేలులో బయలు ఆరాధనకు వ్యతిరేకంగా జరగబోయే యుద్ధంలో తాను చేయాలనుకుంటున్న దాని గురించి దేవుడు చాలా విషయాలు ఆయనకు చెప్పాడు. ఏలీయా చేసిన పని అస్సలు వృథా కాలేదు, ఎందుకంటే దేవుడు చేయాలనుకున్నది నిరాటంకంగా సాగుతోంది. అంతేకాదు, యెహోవా అనుకున్నది నెరవేర్చడానికి ఏలీయా ఇంకా పనిచేయాల్సి ఉంది, అందుకే యెహోవా ఆయనకు కొన్ని ప్రత్యేక సూచనలు ఇచ్చి తన పనిని కొనసాగించమని తిరిగి పంపించాడు.—1 రాజు. 19:12-17.

23. ఒంటరివాణ్ణి అయిపోయానని ఏలీయా పడుతున్న బాధను పోగొట్టడానికి యెహోవా ఏ రెండు రకాలుగా సహాయం చేశాడు?

23 ఒంటరివాణ్ణి అయిపోయానని ఏలీయా పడుతున్న బాధను పోగొట్టడానికి యెహోవా ఏమి చేశాడు? ఆయన రెండు రకాలుగా సహాయం చేశాడు. ఒకటి, ఎలీషాను తర్వాతి ప్రవక్తగా అభిషేకించమని ఏలీయాతో చెప్పాడు. ఆ పరిస్థితుల్లో ఆయనకు అదెంతో ఊరటనిచ్చి ఉంటుంది! రెండు, యెహోవా సంతోషకరమైన ఈ వార్త చెప్పాడు: ‘ఇశ్రాయేలు వారిలో బయలుకు మోకాళ్లూనని, నోటితో వాని ముద్దుపెట్టుకొనని ఏడు వేలమంది నాకు ఇంకా మిగిలి ఉన్నారు.’ (1 రాజు. 19:18) ఏలీయా ఒంటరివాడు కాదు. బయలును ఆరాధించని నమ్మకమైన ఇశ్రాయేలీయులు ఇంకా వేలమంది ఉన్నారని తెలుసుకొని ఏలీయా ఎంతో ఊరట పొందివుంటాడు. ఆ రోజుల్లో దాదాపు మిగిలిన వాళ్లంతా యెహోవాకు ఎదురుతిరుగుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఏలీయా యెహోవాకు నమ్మకంగా సేవచేస్తూ, ఆయనకు ఎల్లప్పుడూ విశ్వసనీయంగా ఉండే విషయంలో నమ్మకమైన ఇశ్రాయేలీయులకు ఆదర్శంగా ఉండడం ఎంతో అవసరం. ‘మిక్కిలి నిమ్మళమైన స్వరంతో’ యెహోవా దూత మాట్లాడిన ఆ మాటలు ఏలీయా హృదయాన్ని ఎంతో స్పృశించి ఉంటాయి. దేవుడే స్వయంగా తనతో మాట్లాడినట్లు ఆయనకు అనిపించివుంటుంది.

మనం బైబిలు నిర్దేశాన్ని పాటించడానికి సిద్ధంగా ఉంటే, అది మనకు ‘మిక్కిలి నిమ్మళమైన స్వరంలా’ పనిచేస్తుంది

24, 25. (ఎ) యెహోవా దేవుని ‘మిక్కిలి నిమ్మళమైన స్వరాన్ని’ మనం ఎలా వినవచ్చు? (బి) యెహోవా ఇచ్చిన ఊరటకు ఏలీయా సానుకూలంగా స్పందించాడని మనం ఎందుకు నమ్మవచ్చు?

24 సృష్టిలోని గొప్ప ప్రకృతి శక్తులను చూసి మనం ఏలీయాలా ఎంతో ఆశ్చర్యపోతుంటాం, అలా ఆశ్చర్యపోవాలి కూడా. యెహోవాకు ఎంత శక్తి ఉందో సృష్టిని చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. (రోమా. 1:20) తన సేవకులకు సహాయం చేయడానికి తన అపారమైన శక్తిని ఉపయోగించడం యెహోవాకు ఇప్పటికీ ఇష్టం. (2 దిన. 16:9) అయితే, దేవుడు ఎక్కువగా తన వాక్యమైన బైబిలు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. (యెషయా 30:21 చదవండి.) మనం బైబిలు నిర్దేశాన్ని పాటించడానికి సిద్ధంగా ఉంటే, అది మనకు ‘మిక్కిలి నిమ్మళమైన స్వరంలా’ పనిచేస్తుంది. తన అమూల్యమైన వాక్యంతో యెహోవా మనల్ని సరిదిద్దుతున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాననే హామీ ఇస్తున్నాడు.

25 హోరేబు కొండ దగ్గర యెహోవా ఇచ్చిన ఊరటకు ఏలీయా సానుకూలంగా స్పందించాడా? నిస్సందేహంగా! దుష్టత్వంతో నిండిపోయిన అబద్ధ ఆరాధనకు వ్యతిరేకంగా పోరాడిన ధైర్యస్థుడు, నమ్మకస్థుడు అయిన ప్రవక్త మళ్లీ తన పని మొదలుపెట్టాడు. ఏలీయాలాగే మనం కూడా దేవుడు ప్రేరేపించిన మాటలను, అంటే ‘లేఖనాల వల్ల కలిగే ఆదరణను’ మనసులోకి తీసుకుంటే ఆయనలా విశ్వాసం చూపించగలుగుతాం.—రోమా. 15:4.

a ‘మిక్కిలి నిమ్మళమైన స్వరం,’ 1 రాజులు 19:9⁠లో ప్రస్తావించిన ‘యెహోవా వాక్కును’ తెలియజేసిన దేవదూతదే అయ్యుంటుంది. 15వ వచనంలోనైతే, దేవదూత అని కాకుండా “యెహోవా” అని ఉంది. ఆ మాటలు చదువుతున్నప్పుడు, అరణ్యంలో యెహోవా ఇశ్రాయేలీయులను నడిపించడానికి ఉపయోగించుకున్న దూత మనకు గుర్తుకురావచ్చు. “నా నామము ఆయనకున్నది” అని ఆ దూత గురించే దేవుడు చెప్పాడు. (నిర్గ. 23:21) ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా చెప్పలేం. అయినా భూమ్మీదకు రాకముందు యేసు ‘వాక్యంగా,’ అంటే యెహోవా ముఖ్య ప్రతినిధిగా ఆయన సేవకులతో మాట్లాడాడన్న విషయాన్ని గమనించండి.—యోహా. 1:1.