కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

17వ అధ్యాయం

‘ఇదిగో! యెహోవా దాసురాలిని!’

‘ఇదిగో! యెహోవా దాసురాలిని!’

1, 2. (ఎ) ఒక కొత్త వ్యక్తి మరియను ఏమని సంబోధించాడు? (బి) అది ఆమె జీవితంలో ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయమని ఎందుకు చెప్పవచ్చు?

 మరియ, ఇంట్లోకి వచ్చిన కొత్త వ్యక్తిని కళ్లు విప్పార్చుకొని ఆశ్చర్యంగా చూసింది. ఆమె తల్లి కోసమో తండ్రి కోసమో ఆయన రాలేదు, ఆమె కోసమే వచ్చాడు. ఆయన నజరేతువాడు కాదనైతే ఆమెకు తెలిసిపోతోంది. ఎందుకంటే, ఆ చిన్న పట్టణంలో కొత్తవాళ్లను ఇట్టే గుర్తుపట్టవచ్చు. పైగా ఈ వ్యక్తి మరీ ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు. ఆయన మరియను అప్పటివరకు ఎవరూ సంబోధించని విధంగా సంబోధిస్తూ ఇలా అన్నాడు: ‘దయాప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభువు నీకు తోడైయున్నాడు.’—లూకా 1:26-28 చదవండి.

2 గలిలయలోని నజరేతువాడైన హేలీ కుమార్తె మరియను బైబిలు మనకు అలా పరిచయం చేస్తోంది. ఆమె జీవితంలో ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం అది. యోసేపు అనే వడ్రంగితో ఆమె పెళ్లి నిశ్చయమైంది, ఆయన పెద్ద ఆస్తిపరుడేమీ కాదుగానీ విశ్వాసం గలవాడు. కాబట్టి, పెళ్లయ్యాక యోసేపు భార్యగా ఆయనకు చేదోడువాదోడుగా ఉంటూ, ఇద్దరూ కలిసి ఒక చిన్న కుటుంబాన్ని ఏర్పర్చుకుంటారని ఆమె అనుకొనివుంటుంది. అయితే అనుకోకుండా ఒక రోజు, దేవుడు ఆమెకు అప్పగించనున్న ఒక బాధ్యత గురించి చెప్పడానికి ఆ కొత్త వ్యక్తి వచ్చాడు. అది ఆమె జీవితాన్నే మార్చేసింది.

3, 4. మరియ గురించి తెలుసుకోవాలంటే వేటిని పక్కనబెట్టాలి? దేని గురించి మాత్రమే ఆలోచించాలి?

3 బైబిల్లో మరియ గురించి ఎక్కువ వివరాలు లేవని తెలుసుకొని చాలామంది ఆశ్చర్యపోతారు. ఆమె నేపథ్యం గురించి, వ్యక్తిత్వం గురించి బైబిలు అంతగా ఏమీ చెప్పడం లేదు, ఆమె రూపం గురించైతే అసలేమీ మాట్లాడడం లేదు. కానీ, ఆమెకు సంబంధించి దేవుని వాక్యం ఇస్తున్న కొన్ని వివరాలు ఆమె గురించి ఎంతో చెబుతాయి.

4 మరియ గురించి తెలుసుకోవాలంటే, ఆమె గురించి వివిధ మతాలు బోధిస్తున్న అనేక తప్పుడు అభిప్రాయాలను పక్కనబెట్టి ఆలోచించాలి. అందుకోసం తైలవర్ణ చిత్రాల్లో, పాలరాతి విగ్రహాల్లో కనిపించే లెక్కలేనన్ని ఆమె “రూపాలను” మనం కాసేపు మర్చిపోదాం. వినయస్థురాలైన ఈ స్త్రీకి “దేవుని తల్లి,” “పరలోకపు రాణి” వంటి పెద్దపెద్ద బిరుదులు ఆపాదించిన సంశ్లిష్టమైన మతసిద్ధాంతాలను కూడా కాసేపు పక్కనబెడదాం. బైబిలు నిజంగా ఏమి చెబుతోందనే దాని గురించి మాత్రమే ఆలోచిద్దాం. మరియ విశ్వాసం గురించి, ఆమెలా విశ్వాసం చూపించడానికి మనం ఏమి చేయాలనే దానిగురించి బైబిలు మనకు చక్కని అవగాహన కల్పిస్తోంది.

దేవదూత ఆమెను సందర్శించాడు

5. (ఎ) గబ్రియేలు సంబోధనకు మరియ స్పందించిన తీరు నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? (బి) మరియ ఉదాహరణ మనకు ఏమి నేర్పిస్తోంది?

5 మరియ దగ్గరకు వచ్చిన వ్యక్తి మానవమాత్రుడు కాదు, దేవదూత. ఆయన పేరు గబ్రియేలు. ఆయన మరియను “దయాప్రాప్తురాలా” అని సంబోధించినప్పుడు, ఆమె “బహుగా తొందరపడి” ఈ కొత్త సంబోధన ఏమిటా అని ఆశ్చర్యపోయింది. (లూకా 1:29, 30) ఇంతకీ ఆమె ఎవరి దయను పొందింది? మనుషుల దయనైతే ఆమె ఆశించలేదు. నిజానికి, దేవదూత మాట్లాడింది యెహోవా దేవుని దయ గురించి. మరియ దేవుని దయను పొందాలని కోరుకుంది. అయితే, తనమీద దేవుని దయ ఉందని గర్వించలేదు. మనం కూడా దేవుని దయ కోసం కృషిచేయాలి కానీ, అది మనమీద ఉందని గర్వించకూడదు అని మరియ ఉదాహరణ నేర్పిస్తోంది. దేవుడు గర్విష్ఠులను లేదా అహంకారులను దూరంగా ఉంచుతాడు. దీనులను, వినయస్థులను ప్రేమిస్తాడు, వాళ్లకు సహాయం చేస్తాడు.—యాకో. 4:6.

మరియ తన మీద దేవుని దయ ఉందని గర్వపడలేదు

6. దేవదూత ఏ సువర్ణావకాశాన్ని మరియ ముందుంచాడు?

6 మరియకు అలాంటి వినయం అవసరం. ఎందుకంటే ఊహించని సువర్ణావకాశాన్ని దేవదూత ఆమె ముందుంచాడు. మనుషులందరిలో అత్యంత ప్రముఖుడు కానున్న వ్యక్తికి ఆమె జన్మనిస్తుందని ఆయన వివరించాడు. గబ్రియేలు ఇలా చెప్పాడు: “ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండును.” (లూకా 1:32, 33) దావీదు వంశస్థుల్లో ఒకరు నిరంతరం పరిపాలిస్తారని దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం దేవుడు దావీదుతో చేసిన వాగ్దానం గురించి మరియకు తెలిసేవుంటుంది. (2 సమూ. 7:12, 13) అంటే ఆమె కుమారుడే, శతాబ్దాలుగా దేవుని ప్రజలు ఎదురుచూస్తున్న మెస్సీయ అవుతాడు!

ఊహించలేని సువర్ణావకాశాన్ని గబ్రియేలు దూత మరియ ముందుంచాడు

7. (ఎ) మరియ అడిగిన ప్రశ్నను బట్టి ఆమె గురించి ఏమి తెలుస్తోంది? (బి) మరియ నుండి నేటి యువతీయువకులు ఏమి నేర్చుకోవచ్చు?

7 ఆమె కుమారుడు “గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును” అని కూడా దేవదూత మరియతో చెప్పాడు. ఒక మానవ స్త్రీ దేవుని కుమారునికి ఎలా జన్మనివ్వగలదు? అసలు మరియకు బిడ్డ పుట్టడం ఏమిటి? ఆమెకు యోసేపుతో పెళ్లి నిశ్చయమైందే కానీ ఇంకా పెళ్లి కాలేదు. అందుకే మరియ సూటిగా ఇలా అడిగింది: ‘నేను పురుషుని ఎరుగనిదాననే, ఇదేలాగు జరుగును?’ (లూకా 1:34) తానింకా కన్యకనని చెప్పుకోవడానికి ఆమె సిగ్గుపడలేదని గమనించండి. కానీ అలా ఉన్నందుకు ఆమె గర్వపడింది. నేడు చాలామంది యువతీయువకులు తమ కన్యాత్వాన్ని పోగొట్టుకోవడానికి తొందరపడుతున్నారు, అలా చేయనివాళ్లను ఎగతాళి చేస్తున్నారు. లోకం నిజంగా చాలా మారిపోయింది. కానీ, యెహోవా మారలేదు. (మలా. 3:6) నేటికీ, తన నైతిక ప్రమాణాలను అంటిపెట్టుకుని ఉండేవాళ్లకు ఆయన ఎంతో విలువిస్తాడు.హెబ్రీయులు 13:4 చదవండి.

8. అపరిపూర్ణురాలైన మరియ పరిపూర్ణుడైన బిడ్డకు ఎలా జన్మనివ్వగలదు?

8 మరియ దేవుని నమ్మకమైన సేవకురాలే అయినా ఆమె కూడా అపరిపూర్ణురాలే. అలాంటప్పుడు, ఆమె దేవుని పరిపూర్ణ కుమారునికి ఎలా జన్మనివ్వగలదు? గబ్రియేలు ఇలా వివరించాడు: “పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.” (లూకా 1:35) పరిశుద్ధుడు అంటే “నిర్మలమైనవాడు,” “స్వచ్ఛమైనవాడు,” “పవిత్రమైనవాడు” అని అర్థం. సాధారణంగా తల్లిదండ్రుల అపరిపూర్ణత పిల్లలకు సంక్రమిస్తుంది. అయితే ఇక్కడ యెహోవా ఒక విశేషమైన అద్భుతాన్ని చేయనున్నాడు. ముందు ఆయన పరలోకంలోవున్న తన కుమారుని జీవాన్ని మరియ గర్భంలోకి మారుస్తాడు, ఆ తర్వాత తన పరిశుద్ధాత్మ మరియను ‘కమ్ముకునేలా’ చేస్తాడు. శిశువుకు అపరిపూర్ణత ఇసుమంతైనా సంక్రమించకుండా అది ఓ రక్షణ కవచంలా పనిచేస్తుంది. దేవదూత చేసిన వాగ్దానాన్ని మరియ నమ్మిందా? ఆమె ఎలా స్పందించింది?

గబ్రియేలు చెప్పినదానికి మరియ స్పందన

9. (ఎ) మరియ విషయంలో సంశయవాదుల అభిప్రాయం ఎందుకు సరైనదికాదు? (బి) మరియ విశ్వాసాన్ని గబ్రియేలు ఎలా బలపర్చాడు?

9 ఒక కన్యక తల్లి కావడమనే విషయం క్రైస్తవమత సామ్రాజ్యంలోని కొంతమంది పండితులకు, సంశయవాదులకు మింగుడుపడడంలేదు. వాళ్లెంతో విద్యావంతులైనా, సరళమైన ఓ సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. గబ్రియేలు అన్నట్లు, “దేవుడు చెప్పిన యే మాటయైనను నిరర్థకము కానేరదు.” (లూకా 1:37) మరియ ఎంతో విశ్వాసమున్న స్త్రీ కాబట్టి గబ్రియేలు మాటలు సత్యమని నమ్మింది. అయితే ఆమెది అంధవిశ్వాసం కాదు. సహేతుకంగా ఆలోచించే ఏ వ్యక్తయినా రుజువులు ఉంటేనే దేన్నైనా నమ్ముతాడు. మరియ విషయంలో కూడా అంతే. అయితే ఆమె విశ్వాసాన్ని బలపర్చడానికి గబ్రియేలు ఇంకొన్ని రుజువులు ఇస్తూ, ఆమె వృద్ధ బంధువురాలు ఎలీసబెతు గురించి చెప్పాడు. దేవుడు అద్భుతం చేసి, పిల్లలు లేని ఎలీసబెతు గర్భం దాల్చేలా చేశాడు!

10. దేవుడు మరియకు అప్పగించిన బాధ్యత ఎందుకు సులువైనది కాదు?

10 ఇప్పుడు మరియ ఏమి చేస్తుంది? దేవుడు అప్పగించిన బాధ్యత ఆమె ముందుంది, గబ్రియేలు చెప్పినవన్నీ దేవుడు చేస్తాడని నమ్మడానికి రుజువు కూడా ఉంది. కానీ అదంత సులువైనదైతే కాదు. ఒకటేమిటంటే, యోసేపుతో తనకు పెళ్లి నిశ్చయమైన విషయం గురించి ఆమె ఆలోచించాలి. మరియ గర్భవతి అయిందని తెలిసిన తర్వాత కూడా యోసేపు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడా? ఇక ఆమె బాధ్యత విషయానికొస్తే, అది భీతిగొలిపే బాధ్యతని ఆమెకు అనిపించివుంటుంది. దేవుడు సృష్టించిన సమస్త జీవకోటిలో అత్యంత అమూల్యమైన వ్యక్తి జీవాన్ని, అంటే దేవుని ప్రియకుమారుని జీవాన్ని ఆమె మోయాలి! ఆ బిడ్డ నిస్సహాయ శిశువుగా ఉన్నప్పుడు ఆమె శ్రద్ధ తీసుకోవాలి, ఈ దుష్టలోకంలో ఆ బిడ్డను కాపాడాలి. నిజంగా అది బరువైన బాధ్యతే!

11, 12. (ఎ) బలవంతులైన, నమ్మకమైన పురుషులు కూడా దేవుడిచ్చిన బరువైన బాధ్యతలకు ఎలా స్పందించారు? (బి) గబ్రియేలు మాటలకు స్పందించిన తీరులో తన వైఖరి ఎలాంటిదని మరియ చూపించింది?

11 బలవంతులైన, నమ్మకమైన పురుషులు కూడా దేవుడిచ్చిన బరువైన బాధ్యతలను నిర్వర్తించడానికి కొన్నిసార్లు జంకారని బైబిలు చూపిస్తోంది. మోషే తనకు నోటి మాంద్యం ఉందంటూ దేవుని ప్రతినిధిగా ఉండలేనన్నట్లు మాట్లాడాడు. (నిర్గ. 4:10) యిర్మీయా, “నేను బాలుడనే” అంటూ, దేవుడు తనకు అప్పగించిన పని చేసేంత పెద్దవాణ్ణి కాదన్నాడు. (యిర్మీ. 1:6) అదే యోనా అయితే, దేవుడు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించకుండా ఏకంగా పారిపోయాడు! (యోనా 1:3) ఇంతకీ మరియ ఏమి చేసింది?

12 వినయవిధేయతలతో ఆమె స్పందించిన తీరు విశ్వాసులందరికీ తెలుసు. ఆమె గబ్రియేలుతో ఇలా అంది: “ఇదిగో ప్రభువు [“యెహోవా,” NW] దాసురాలను; నీ మాట చొప్పున నాకు జరుగును గాక.” (లూకా 1:38) అప్పట్లో, సేవకులందరిలో తక్కువస్థాయి స్త్రీని దాసురాలు అనేవాళ్లు, ఆమె జీవితం పూర్తిగా యజమాని చేతుల్లోనే ఉండేది. మరియ కూడా తన జీవితం యెహోవా చేతుల్లో ఉందని అనుకుంది. తాను ఆయనపై పూర్తి భారాన్ని వేస్తే సురక్షితంగా ఉంటానని ఆమె నమ్మింది. ఆయన యథార్థవంతులకు యథార్థవంతునిగా ఉంటాడని, ఈ బరువైన బాధ్యత నిర్వర్తించడానికి శాయశక్తులా కృషిచేస్తే ఆయన తనను ఆశీర్వదిస్తాడని ఆమెకు తెలుసు.—కీర్త. 18:25.

యథార్థవంతుడైన తన దేవుని సంరక్షణలో తాను సురక్షితంగా ఉన్నానని మరియ నమ్మింది

13. దేవుడు చెప్పినవి చేయడం మనకు కష్టమనిపిస్తే, చివరికి మనవల్ల కాదనిపిస్తే మరియ ఉదాహరణ మనకు ఎలా సహాయం చేస్తుంది?

13 కొన్నిసార్లు దేవుడు చెప్పిన పనులు చేయడం మనకు కష్టమనిపించవచ్చు, చివరకు మనవల్ల కాదని కూడా అనిపించవచ్చు. అయితే, మరియలా మనం కూడా తన మీద పూర్తి నమ్మకం ఉంచడానికి గల ఎన్నో కారణాల్ని దేవుడు తన వాక్యంలో రాయించి పెట్టాడు. (సామె. 3:5, 6) మనం ఆయనపై నమ్మకం ఉంచుతామా? అలాచేస్తే, తన మీద మనకున్న విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి మరిన్ని ఆధారాల్నిస్తూ ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు.

ఎలీసబెతును కలిసింది

14, 15. (ఎ) ఎలీసబెతు, జెకర్యాల ఇంట్లోకి మరియ ప్రవేశించినప్పుడు యెహోవా ఆమెకు ఎలాంటి రుజువును చూపించాడు? (బి) లూకా 1:46-55⁠లో నమోదైన మరియ మాటలు ఆమె గురించి ఏమి చెబుతున్నాయి?

14 ఎలీసబెతు గురించి గబ్రియేలు తనతో చెప్పిన విషయాలు మరియకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చాయి. మరియ పరిస్థితిని ఎలీసబెతుకన్నా బాగా ఇంకే స్త్రీ అర్థంచేసుకోగలదు? మరియ యూదా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి బయలుదేరింది, ఆ ప్రయాణానికి బహుశా మూడు నాలుగు రోజులు పట్టవచ్చు. ఎలీసబెతు, యాజకుడైన జెకర్యాల ఇంట్లోకి మరియ ప్రవేశించగానే యెహోవా ఆమె విశ్వాసాన్ని బలపర్చే మరో గట్టి రుజువును చూపించాడు. మరియ పలకరించగానే, తన గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేయడం ఎలీసబెతు గ్రహించింది. ఆమె పరిశుద్ధాత్మతో నిండుకొని, మరియను “నా ప్రభువు తల్లి” అని సంబోధించింది. మరియ కుమారుడు ఆమెకు ప్రభువు అవుతాడని, ఆయనే వాగ్దత్త మెస్సీయ అని దేవుడు ఎలీసబెతుకు వెల్లడిచేశాడు. అంతేకాదు, నమ్మకంగా విధేయత చూపించిన మరియను దైవప్రేరణతో ఆమె ఇలా మెచ్చుకుంది: “నమ్మిన ఆమె ధన్యురాలు.” (లూకా 1:39-45) అవును, మరియకు యెహోవా వాగ్దానం చేసినవన్నీ నెరవేరతాయి!

మరియ, ఎలీసబెతుల స్నేహం వాళ్లిద్దరికీ ఒక వరమైంది

15 ఆ తర్వాత మరియ మాట్లాడింది. ఆమె మాటల్ని దేవుడు తన వాక్యంలో జాగ్రత్తగా భద్రపర్చాడు. (లూకా 1:46-55 చదవండి.) ఆమె మాట్లాడిన కొన్ని సందర్భాల గురించి బైబిలు ప్రస్తావిస్తోంది. వాటిలో, ఆమె ఎక్కువసేపు మాట్లాడిన సందర్భం అదే. అప్పుడు ఆమె మాట్లాడిన మాటల్లో ఆమె గురించి ఎన్నో విషయాలు తెలుస్తాయి. మెస్సీయకు తల్లి అయ్యే గొప్ప అవకాశాన్ని తనకు ఇచ్చినందుకు యెహోవాను స్తుతించింది, అప్పుడు ఆమె పలికిన మాటల్లో ఎంతో కృతజ్ఞతాభావం ధ్వనిస్తుంది. యెహోవా గర్విష్ఠులను, బలవంతులను పడద్రోసి, తనను సేవించే దీనులను, బీదలను ఆదుకుంటాడని ఆమె అంది. ఆమె మాటల్ని చూస్తే ఆమెకు ఎంత విశ్వాసముందో, లేఖనాలపై ఆమెకు ఎంత పట్టు ఉందో తెలుస్తుంది. ఒక అంచనా ప్రకారం, ఆమె హెబ్రీ లేఖనాలను దాదాపు 20 కన్నా ఎక్కువసార్లు ఎత్తిచెప్పింది. a

16, 17. (ఎ) మరియలా, ఆమె కుమారునిలా మనం కూడా ఏ స్ఫూర్తిని చూపించాలి? (బి) మరియ ఎలీసబెతుతో గడిపిన సమయం మనకు ఏ వరాన్ని గుర్తుచేస్తుంది?

16 మరియ దేవుని వాక్యం గురించి లోతుగా ఆలోచించేదని స్పష్టంగా తెలుస్తోంది. అయినా ఆమె తన స్థితి గురించి సొంత మాటల్లో చెప్పకుండా వినయంగా లేఖనాలను ఉపయోగించి వివరించింది. అప్పుడు ఆమె గర్భంలో ఎదుగుతున్న కుమారుడు కూడా ఒకనాడు, “నేను చేయు బోధ నాది కాదు; నన్ను పంపినవానిదే” అంటూ అదే స్ఫూర్తి చూపిస్తాడు. (యోహా. 7:16) మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవడం మంచిది: ‘దేవుని వాక్యం మీద నాకు అలాంటి భక్తిగౌరవాలు ఉన్నాయా? లేక నా సొంత ఆలోచనలకు, బోధలకు ప్రాధాన్యమిస్తున్నానా?’ ఈ విషయంలో, మరియ సరైన వైఖరి చూపించింది.

17 మరియ ఎలీసబెతు వాళ్లింట్లో ఉన్న దాదాపు ఆ మూడు నెలల్లో ఇద్దరూ ఒకరినొకరు ఎంతో ప్రోత్సహించుకొనివుంటారు. (లూకా 1:56) ఎలీసబెతు ఇంటికి మరియ వెళ్లిన సందర్భం గురించిన ఈ చక్కని వృత్తాంతం స్నేహం ఎంత చక్కని వరమో గుర్తుచేస్తుంది. మన దేవుడైన యెహోవాను మనస్ఫూర్తిగా ప్రేమించే వాళ్లతో స్నేహం చేస్తే యెహోవాతో మనకున్న బంధం బలపడుతుంది. (సామె. 13:20) ఇప్పుడు మరియ ఇంటిముఖం పట్టింది. ఆమె గురించి తెలిస్తే యోసేపు ఏమంటాడు?

మరియ, యోసేపు

18. మరియ యోసేపుకు ఏ విషయం చెప్పింది? దానికి ఆయన ఎలా స్పందించాడు?

18 మరియ తాను గర్భవతినని నలుగురికీ తెలిసేంతవరకు మౌనంగా ఉండివుండదు. ఆమె ఎలాగూ యోసేపుకు ఆ విషయం చెప్పక తప్పదు. అయితే మర్యాదస్థుడు, భక్తిపరుడు అయిన యోసేపు తాను చెప్పేది విని ఏమంటాడోనని ఆమె ఆలోచించివుంటుంది. ఏదేమైనా, ఆమె ఆయన దగ్గరికెళ్లి జరిగినదంతా చెప్పింది. యోసేపు చాలా కలవరపడ్డాడు. ఆయన స్థానంలో ఎవరున్నా అలాగే స్పందిస్తారు. ఆయన ఆమె చెబుతున్నదాన్ని నమ్మాలనే అనుకున్నాడు. కానీ ఆమె తనను మోసం చేసిందేమోనని మనసులో ఎక్కడో సందేహం. ఆయనలో ఎలాంటి ఆలోచనలు మెదిలాయో, విషయాన్ని ఆయన ఎలా చూశాడో బైబిలు చెప్పడం లేదు. అయితే, ఆయన ఆమెకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడని మాత్రం బైబిలు చెబుతోంది. పెళ్లికాకముందే విడాకులేమిటని మనకు అనిపించవచ్చు కానీ, ఆ కాలంలో పెళ్లి నిశ్చయమైతే దాదాపు పెళ్లి అయిపోయినట్లే పరిగణించేవాళ్లు. మరియ నలుగురిలో నవ్వులపాలు కావడం, ఆమెకు మచ్చరావడం ఆయనకు ఇష్టంలేదు, అందుకే గుట్టుచప్పుడు కాకుండా ఆమెను వదిలేయాలని అనుకున్నాడు. (మత్త. 1:18, 19) ఊహించని ఈ పరిస్థితిలో, దయాపరుడైన యోసేపు పడుతున్న బాధను చూసి మరియకు కూడా బాధగా అనిపించివుంటుంది. అయితే ఆమె కోపం తెచ్చుకోలేదు.

19. యోసేపు సరైన నిర్ణయం తీసుకోవడానికి యెహోవా ఎలా సహాయం చేశాడు?

19 యోసేపు సరైన నిర్ణయం తీసుకోవడానికి యెహోవా దయతో ఆయనకు సహాయం చేశాడు. దేవుని దూత ఆయనకు కలలో కనిపించి మరియ పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించిందని చెప్పాడు. దాంతో ఆయన హాయిగా ఊపిరి పీల్చుకొని ఉంటాడు! మరియ ఎప్పుడూ యెహోవా నిర్దేశానికే కట్టుబడింది, ఇప్పుడు యోసేపు కూడా మరియ బాటలోనే నడిచాడు. ఆయన ఆమెను భార్యగా స్వీకరించాడు, యెహోవా కుమారుని గురించి శ్రద్ధ తీసుకునే అతి ప్రత్యేకమైన బాధ్యతను చేపట్టడానికి సిద్ధపడ్డాడు.—మత్త. 1:20-24.

20, 21. పెళ్లయిన వాళ్లు, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నవాళ్లు మరియ, యోసేపుల నుండి ఏమి నేర్చుకోవచ్చు?

20 పెళ్లయిన వాళ్లకు, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న వాళ్లకు 2,000 కన్నా ఎక్కువ సంవత్సరాల క్రితం జీవించిన ఈ యువ జంట చక్కని ఆదర్శం. కాలం గడుస్తుండగా, యౌవనురాలైన తన భార్య ఒక తల్లిగా తన బాధ్యతలను శ్రద్ధగా నిర్వర్తించడం యోసేపు చూశాడు. భార్య విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి యెహోవా దూత సహాయం చేసినందుకు ఆయన ఎంతో ఆనందించివుంటాడు. పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు యెహోవా మీద ఆధారపడడం ఎంత అవసరమో యోసేపుకు అర్థమైవుంటుంది. (కీర్త. 37:5; సామె. 18:13) కుటుంబ శిరస్సుగా ఆయన తన కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొనివుంటాడు.

21 ముందు తనను అనుమానించిన యోసేపును పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిన మరియ నుండి మనమేమి నేర్చుకోవచ్చు? మొదట్లో, ఆమె చెప్పిన విషయాల్ని అర్థంచేసుకోవడం ఆయనకు కష్టమైవుంటుంది. అయినా, ఆయన కాబోయే కుటుంబ శిరస్సు కాబట్టి ఆయనే నిర్ణయం తీసుకునేంతవరకు మరియ ఓపిగ్గా వేచివుంది. జీవితంలో అలా ఓపిక చూపించడం ఎంత అవసరమో ఆమె నేర్చుకుంది, నేటి క్రైస్తవ స్త్రీలకు కూడా అది ఒక మంచి పాఠం. చివరిగా, మనసు విప్పి నిజాయితీగా మాట్లాడుకోవడం ఎంత ప్రాముఖ్యమో ఆ సంఘటనలు యోసేపు, మరియలకు నేర్పించివుంటాయి.—సామెతలు 15:22 చదవండి.

22. యోసేపు, మరియల వైవాహిక జీవితానికి పునాది ఏమిటి?

22 ఆ యువ జంట తమ వైవాహిక జీవితాన్ని అత్యంత పటిష్ఠమైన పునాది మీద నిర్మించుకున్నారు. వాళ్లిద్దరూ అన్నిటికన్నా మిన్నగా యెహోవా దేవుణ్ణి ప్రేమించారు. అంతేకాదు తల్లిదండ్రులుగా తమ కర్తవ్యాన్ని శ్రద్ధగా నిర్వర్తిస్తూ ఆయనను సంతోషపెట్టాలని ఎంతో కోరుకున్నారు. అయితే మునుపటి కన్నా గొప్ప ఆశీర్వాదాలు, పెద్ద సవాళ్లు వాళ్ల ముందున్నాయి. ఈ ప్రపంచంలోనే అతి గొప్ప వ్యక్తి కానున్న యేసును పెంచే బాధ్యత వాళ్ల ముందుంది.

a మరియ అలా ఉటంకించినవాటిలో కొన్ని, అంతకుముందు యెహోవా ఆశీర్వాదంతో బిడ్డను కన్న విశ్వాసురాలైన హన్నా పలికిన మాటలు అయ్యుంటాయి.—6వ అధ్యాయంలోని, “రెండు విశేషమైన ప్రార్థనలు” అనే బాక్సు చూడండి.