కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

2వ అధ్యాయం

ఆయన ‘దేవునితో నడిచాడు’

ఆయన ‘దేవునితో నడిచాడు’

1, 2. నోవహు, ఆయన కుటుంబం ఏ భారీ పనిని చేపట్టారు? వాళ్లకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి?

 నోవహు ఒక్కసారి అలా ఒళ్లు విరుచుకున్నాడు. పనితో ఆయన ఒళ్లంతా నలిగిపోయింది. కాసేపు సేదదీరుదామని అక్కడున్న ఓ వెడల్పాటి దిమ్మ మీద మెల్లగా కూర్చున్నాడు. తల పైకెత్తి అక్కడ జరుగుతున్న భారీ ఓడ నిర్మాణాన్ని చూశాడు. ఆ ప్రాంతమంతా ఘాటైన తారు వాసనతో నిండిపోయింది, చెక్కపని చేస్తున్న శబ్దాలు ప్రతిధ్వనిస్తున్నాయి. కనుచూపుమేరలో ఆయన కుమారులు చెక్కల్ని ఒకదానిమీద ఒకటి పేరుస్తూ, ఓడను ఒక ఆకారానికి తేవడానికి ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. ఆయన, ఆయన కుమారులు, కోడళ్లు, ఆయన ప్రియాతిప్రియమైన భార్య అంతా కలిసి ఎన్నో సంవత్సరాలుగా ఈ భారీ నిర్మాణం కోసం కష్టపడుతున్నారు. పని దాదాపు పూర్తికావచ్చింది, అయినా చేయాల్సింది ఇంకెంతో ఉంది!

2 చుట్టుపక్కలవాళ్లంతా వాళ్లను పిచ్చివాళ్లను చూసినట్టు చూశారు. ఓడ ఒక ఆకారానికి వచ్చే కొద్దీ వాళ్ల ఎగతాళి ఇంకా ఎక్కువైంది, జలప్రళయంతో భూమంతా మునిగిపోతుందన్న వార్తే వాళ్లకు నవ్వు తెప్పించింది. ఆ నాశనం గురించి నోవహు ఎంత హెచ్చరించినా, వాళ్లకది నమ్మశక్యంగా అనిపించలేదు! ఒక వ్యక్తి తన జీవితాన్ని, తన కుటుంబ సభ్యుల జీవితాలను ధారపోసి అలాంటి పనికి పూనుకోవడం వాళ్లకు వెర్రితనంగా అనిపించింది. అయితే నోవహు దేవుడైన యెహోవా ఆయనను మరో కోణంలో చూశాడు.

3. నోవహు ఎలా దేవునితో నడిచాడు?

3 ‘నోవహు దేవునితో నడిచాడు’ అని బైబిలు చెబుతోంది. (ఆదికాండము 6:9 చదవండి.) ఈ మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి? దేవుడు భూమ్మీద నడిచాడనో, నోవహు ఏదోరకంగా పరలోకానికి వెళ్లాడనో దానర్థం కాదు. నోవహు తన దేవునికి లోబడ్డాడు, ఆయనను ప్రేమించాడు, ఎంతగా అంటే ఒక స్నేహితునితో కలిసి నడుస్తున్నంతగా. ఎన్నో శతాబ్దాల తర్వాత నోవహు గురించి బైబిలు ఇలా చెప్పింది: ‘విశ్వాసాన్ని బట్టి అతను లోకం మీద నేరస్థాపన చేశాడు.’ (హెబ్రీ. 11:7) అదెలా? ఆయన విశ్వాసం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

దుష్టలోకంలో ఒక నీతిమంతుడు

4, 5. నోవహు కాలంలో పరిస్థితులు అంతకంతకూ ఎందుకు దిగజారాయి?

4 అంతకంతకూ దిగజారుతున్న పరిస్థితుల మధ్య నోవహు పెరిగాడు. ఆయన ముత్తాత హనోకు. దేవునితో నడిచిన ఈ నీతిమంతుని రోజుల్లో లోకం చెడుగా ఉండేది. భక్తిహీనులకు దేవుడు తీర్పు తీరుస్తాడని ఆయన ప్రవచించాడు. నోవహు కాలానికి వచ్చేసరికి దుష్టత్వం తారాస్థాయికి చేరుకుంది. నిజానికి, యెహోవా దృష్టిలో భూమి పూర్తిగా చెడిపోయింది, దౌర్జన్యంతో నిండిపోయింది. (ఆది. 5:22; 6:11; యూదా 14, 15) భూమ్మీద పరిస్థితులు ఎందుకంత విషమించాయి?

5 దేవుని ఆత్మకుమారుల మధ్య, అంటే దేవదూతల మధ్య ఘోరమైన పరిస్థితి ఒకటి చోటుచేసుకుంది. వాళ్లలో ఒక దూత అప్పటికే యెహోవా మీద తిరుగుబాటు చేసి సాతానుగా మారాడు. ఈ తిరుగుబాటుదారుడు దేవుని మీద లేనిపోని నిందలేసి, ఆదాముహవ్వలకు మాయమాటలు చెప్పి, పాపం చేసేలా వాళ్లను పురికొల్పాడు. అలా అతడికి అపవాది అనే పేరు కూడా వచ్చింది. నోవహు కాలంలో, కొందరు దేవదూతలు కూడా సాతానుతో చేతులు కలిపి దేవుని మీద తిరుగుబాటు చేశారు. వీళ్లు పరలోకంలో దేవుడు తమకు అప్పగించిన బాధ్యతలను వదిలేసి భూమ్మీదకు వచ్చారు, మానవరూపం దాల్చుకుని అందమైన స్త్రీలను పెళ్లిచేసుకున్నారు. గర్విష్ఠులు, స్వార్థపరులు అయిన ఈ దేవదూతలు మానవ సమాజం మీద విషప్రభావం చూపించారు.—ఆది. 6:1, 2; యూదా 6, 7.

6. నెఫీలులు లోకాన్ని ఎలా ప్రభావితం చేశారు? యెహోవా ఏ నిర్ణయానికొచ్చాడు?

6 మానవరూపం దాల్చుకున్న దేవదూతల, మానవ స్త్రీల సృష్టి విరుద్ధమైన కలయిక వల్ల సంకరజాతి కుమారులు పుట్టారు. వీళ్లు భారీకాయులు, బలవంతులు. బైబిలు వీళ్లను “నెఫీలులు” అని పిలుస్తోంది, ఆ మాటకు “బలాత్కారులు” లేదా ఇతరులపై బలప్రయోగం చేసేవారని అర్థం. క్రూర ప్రవృత్తిగల నెఫీలులు తమ వికృత చేష్టలతో లోకాన్ని తలక్రిందులు చేశారు. ‘నరుల చెడుతనం భూమ్మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడు కేవలం చెడ్డదని’ యెహోవాకు అనిపించింది. అందుకే ఆయన, ఇంక 120 సంవత్సరాల్లో ఆ దుష్ట వ్యవస్థను నామరూపాల్లేకుండా చేయాలనే నిర్ణయానికొచ్చాడు.—ఆదికాండము 6:3-5 చదవండి.

7. తమ పిల్లల్ని చెడు ప్రభావాల నుండి కాపాడడం నోవహుకు, ఆయన భార్యకు ఎందుకు కష్టమైవుంటుంది?

7 అలాంటి లోకంలో పిల్లల్ని పెంచడం ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి! అయితే నోవహు అందులో సఫలుడయ్యాడు. ఆయనకు ఒక మంచి భార్య దొరికింది. నోవహుకు 500 ఏళ్లు వచ్చాక వాళ్లకు ముగ్గురు కుమారులు పుట్టారు. a వాళ్ల పేర్లు షేము, హాము, యాపెతు. ఆ తల్లిదండ్రులు, చుట్టూవున్న చెడు ప్రభావాలు తమ పిల్లల మీద పడకుండా వాళ్లను కంటికిరెప్పలా ఎంతో జాగ్రత్తగా కాపాడాల్సివచ్చింది. ‘పేరుపొందినవాళ్లను, బలశూరులను’ చూస్తే చిన్నపిల్లలు సహజంగానే ఎంతో ఆశ్చర్యానికి గురౌతారు, వాళ్లను ఆసక్తిగా గమనిస్తారు. నెఫీలులు ఆ కోవలోకే వస్తారు కాబట్టి వాళ్లను చిన్నపిల్లలు ఇష్టపడివుంటారు. ఆ భారీకాయులు చేసిన ఘనకార్యాల గురించిన వార్తలు పిల్లల చెవిన పడకుండా చూసుకోవడం ఆ తల్లిదండ్రులకు అసాధ్యమైవుంటుంది. అయితే, దుష్టత్వాన్ని ద్వేషించే యెహోవా దేవుని గురించిన ఆకట్టుకునే సత్యాన్ని వాళ్లు తమ పిల్లలకు తప్పక బోధించివుంటారు. లోకంలోని హింసను, తిరుగుబాటును చూసి యెహోవా బాధపడుతున్నాడని ఆ పసి మనసులకు అర్థమయ్యేలా నేర్పించాల్సి వచ్చింది.—ఆది. 6:6.

చుట్టూవున్న చెడు ప్రభావాలు తమ పిల్లల మీద పడకుండా నోవహు, ఆయన భార్య వాళ్లను చాలా జాగ్రత్తగా కాపాడాల్సివచ్చింది

8. బాధ్యత తెలిసిన నేటి తల్లిదండ్రులు నోవహును, ఆయన భార్యను ఎలా ఆదర్శంగా తీసుకోవచ్చు?

8 నోవహు దంపతుల పరిస్థితిని నేటి తల్లిదండ్రులు అర్థంచేసుకోగలరు. మన చుట్టూవున్న లోకం కూడా హింసతో, తిరుగుబాటు ధోరణితో విషపూరితమైపోయింది. అదుపుతప్పిన కుర్రాళ్ల ముఠాల గుప్పిట్లో నగరాలు అట్టుడికిపోతున్నాయి. ఆఖరికి, చిన్నపిల్లలకు సంబంధించిన వినోద కార్యక్రమాలు కూడా హింసను నూరిపోస్తున్నాయి. బాధ్యత తెలిసిన తల్లిదండ్రులు, హింసను శాశ్వతంగా తీసివేయాలని అనుకుంటున్న శాంతికాముకుడైన యెహోవా దేవుని గురించి తమ పిల్లలకు బోధిస్తూ, అలాంటి చెడు ప్రభావాల నుండి వాళ్లను కాపాడడానికి శాయశక్తులా కృషిచేస్తారు. (కీర్త. 11:5; 37:10, 11) ఈ విషయంలో నోవహు, ఆయన భార్య సఫలులయ్యారు కాబట్టి, నేటి తల్లిదండ్రులు కూడా సఫలులవ్వగలరు! నోవహు పిల్లలు మంచి వ్యక్తుల్లా ఎదిగారు, సత్యదేవుడైన యెహోవాకే ప్రాధాన్యం ఇవ్వడానికి సుముఖంగా ఉన్న స్త్రీలను పెళ్లి చేసుకున్నారు.

‘నీ కోసం ఓడ చేసుకో’

9, 10. (ఎ) యెహోవా అప్పగించిన ఏ పనితో నోవహు జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది? (బి) యెహోవా నోవహుతో ఓడను ఎలా చేయమన్నాడు? ఎందుకు చేయమన్నాడు?

9 ఆ తర్వాత ఉన్నట్టుండి నోవహు జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. యెహోవా ప్రియమైన తన సేవకునితో మాట్లాడుతూ అప్పుడున్న లోకాన్ని సమూలంగా నాశనం చేయబోతున్నానని చెప్పాడు. ఆయన నోవహుకు ఇలా ఆజ్ఞాపించాడు: “చితిసారకపు మ్రానుతో నీకొరకు ఓడను చేసికొనుము.”—ఆది. 6:14.

10 కొందరు అనుకున్నట్టు ఇది సముద్రంలో ప్రయాణించే ఓడ లాంటిది కాదు. ఎందుకంటే నోవహు చేసిన ఓడకు అమరముగానీ, తెడ్లుగానీ లేవు. పైగా దాని నిర్మాణం వంపులుగా కూడా లేదు. చెప్పాలంటే అదో పేద్ద పెట్టె. దాని పరిమాణం ఖచ్చితంగా ఎంత ఉండాలో, దాన్ని ఎలా తయారుచేయాలో యెహోవా చెప్పాడు. దాని లోపలా బయటా కీలు పూయమని కూడా చెప్పాడు. ఓడ కట్టడానికి గల కారణాన్ని యెహోవా ఇలా వివరించాడు: “ఇదిగో . . . భూమిమీదికి జలప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును.” అయితే యెహోవా నోవహుతో ఈ నిబంధన (ఒప్పందం) చేశాడు: “నీవును నీతోకూడ నీ కుమారులును, నీ భార్యయు, నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను.” ప్రతీ జాతిలో ఆడ, మగ జంతువులను ఓడలోకి తీసుకువెళ్లమని దేవుడు నోవహుకు చెప్పాడు. ఓడలోకి వెళ్లే మనుషుల, జంతువుల ప్రాణాలు మాత్రమే సురక్షితంగా ఉంటాయి!—ఆది. 6:17-20.

దేవుడు ఆజ్ఞాపించింది చేయడానికి నోవహు, ఆయన కుటుంబం కలిసికట్టుగా పనిచేశారు

11, 12. దేవుడు నోవహుకు అప్పగించిన పని ఎంత పెద్దది? ఆ పనికి నోవహు ఎలా స్పందించాడు?

11 దేవుడు నోవహుకు అప్పగించిన పని చాలా పెద్దది. ఆ ఓడను దాదాపు 437 అడుగుల పొడవుతో, 73 అడుగుల వెడల్పుతో, 44 అడుగుల ఎత్తుతో భారీగా నిర్మించాలి. సముద్రంలో ప్రయాణించే నేటి భారీ ఓడలకన్నా అదెంతో పెద్దది. మరి నోవహు సాకులు చెప్పి ఆ పని తప్పించుకున్నాడా? చాలా కష్టంగా ఉందంటూ గొణిగాడా? పనిని సులభతరం చేసుకోవడానికి తనకు నచ్చిన పద్ధతిలో కట్టుకుంటూ పోయాడా? బైబిలు ఇలా చెబుతోంది: “నోవహు అట్లు చేసెను, దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను.”—ఆది. 6:22.

12 అది పూర్తవడానికి చాలాకాలం పట్టింది, బహుశా నలభై యాభై సంవత్సరాలు పట్టివుంటుంది. ఆ ఓడను కట్టాలంటే ముందు చెట్లను నరికి, మొద్దులను ఈడ్చుకొని రావాలి. వాటిని కావాల్సిన ఆకారాల్లో చెక్కి, ఒకదానికొకటి బిగించాలి. ఓడలో మూడు అంతస్తులు, చాలా అరలు, ఒకవైపు తలుపు ఉండాలి. పై భాగంలో కిటికీలు ఉండాలి, నీళ్లు కిందికి పోయేలా పైకప్పు కొంచెం వాలుగా ఉండాలి.—ఆది. 6:14-16.

13. ఓడ నిర్మాణం కన్నా కష్టమైన ఏ పని నోవహు చేశాడు? దానికి ప్రజలు ఎలా స్పందించారు?

13 సంవత్సరాలు గడుస్తున్నకొద్దీ ఓడ క్రమేణా రూపుదిద్దుకుంటోంది, ఆ పనికి తన కుటుంబ సభ్యులు కూడా నడుం బిగించడం చూసి నోవహు ఎంతో సంతోషించివుంటాడు! అయితే నోవహు చేయాల్సిన పెద్ద పని మరొకటి కూడా ఉంది, అది ఓడ నిర్మాణం కన్నా కష్టమైనది. బైబిలు ఇలా చెబుతోంది: ‘నోవహు నీతిని ప్రకటించాడు.’ (2 పేతురు 2:5 చదవండి.) భక్తిహీనులైన దుష్ట ప్రజలకు నాశనం ముంచుకు రాబోతుందని ధైర్యంగా హెచ్చరించే పనిలో ఆయన నాయకత్వం వహించాడు. ఆయన హెచ్చరికకు ప్రజలు ఎలా స్పందించారు? యేసుక్రీస్తు దాని గురించి మాట్లాడుతూ, వాళ్లు ‘తింటూ, తాగుతూ, పెళ్లి చేసుకుంటూ’ దైనందిన వ్యవహారాల్లో పూర్తిగా మునిగిపోయి ఆ హెచ్చరికను పట్టించుకోలేదని చెప్పాడు. (మత్త. 24:37-39) చాలామంది నోవహును, ఆయన కుటుంబాన్ని ఎగతాళి చేసివుంటారు. కొందరు ఆయనను భయపెట్టివుంటారు, క్రూరంగా వ్యతిరేకించివుంటారు. ఇంకొందరు ఓడ నిర్మాణ పనికి తీవ్రమైన అవాంతరాలు తీసుకురావడానికి కూడా ప్రయత్నించివుంటారు.

యెహోవా నోవహును ఆశీర్వదిస్తున్నాడని స్పష్టంగా కనిపిస్తున్నా ప్రజలు ఆయనను ఎగతాళి చేశారు, ఆయన హెచ్చరికను పట్టించుకోలేదు

14. నోవహు, ఆయన కుటుంబం నుండి నేటి క్రైస్తవ కుటుంబాలు ఏమి నేర్చుకోవచ్చు?

14 అయినా సరే నోవహు, ఆయన కుటుంబం పట్టుదలగా ముందుకుసాగారు. ఓడ కట్టడం తెలివితక్కువ పనని, వృథాప్రయాసని అంతా అనుకున్నా వాళ్లవేవీ పట్టించుకోకుండా ఓడ కట్టడంలో నిమగ్నమైపోయారు. నోవహు, ఆయన కుటుంబం చూపించిన విశ్వాసం నుండి నేటి క్రైస్తవ కుటుంబాలు ఎంతో నేర్చుకోవచ్చు. ఎంతైనా మనం కూడా “అంత్యదినములలో” అంటే ఈ దుష్ట వ్యవస్థ అంతానికి దగ్గర్లో ఉన్నామని బైబిలు చెబుతోంది. (2 తిమో. 3:1) మనకాలం కూడా నోవహు ఓడ నిర్మించిన కాలంలాగే ఉంటుందని యేసు చెప్పాడు. దేవుని రాజ్య సందేశాన్ని క్రైస్తవులు ప్రకటిస్తున్నప్పుడు ప్రజలు ఎగతాళి చేసినా, సరిగ్గా స్పందించకపోయినా, చివరకు హింసించినా నోవహును గుర్తుచేసుకోవడం మంచిది. ఎందుకంటే, ఇలాంటివన్నీ మనకన్నా ముందు ఆయనకే ఎదురయ్యాయి.

‘ఓడలోకి ప్రవేశించు’

15. నోవహుకు 600 ఏళ్లు దగ్గరపడుతున్న సమయంలో ఎవరిని పోగొట్టుకున్నాడు?

15 కొన్ని దశాబ్దాలకు ఓడ నిర్మాణం దాదాపు పూర్తయింది. నోవహుకు 600 ఏళ్లు దగ్గరపడుతున్న సమయంలో ఆత్మీయులను పోగొట్టుకున్నాడు. ఆయన తండ్రి లెమెకు చనిపోయాడు. b ఆ తర్వాత ఐదేళ్లకు లెమెకు తండ్రి, నోవహు తాత అయిన మెతూషెల చనిపోయాడు. అప్పటికి మెతూషెల వయసు 969. బైబిల్లో నమోదైన వాళ్లందరిలో ఎక్కువకాలం బ్రతికిన వ్యక్తి ఈయనే. (ఆది. 5:27) మెతూషెల, లెమెకు ఇద్దరూ మొదటి మానవుడైన ఆదాము సమకాలీనులు.

16, 17. (ఎ) నోవహుకు 600 ఏళ్లు ఉన్నప్పుడు యెహోవా ఆయనకు ఏమి చెప్పాడు? (బి) నోవహు, ఆయన కుటుంబం చూసిన మరపురాని దృశ్యాన్ని వర్ణించండి.

16 నోవహుకు 600 ఏళ్లు ఉన్నప్పుడు యెహోవా దేవుడు ఆయనకు ఇలా చెప్పాడు: “నీవును నీ యింటివారును ఓడలో ప్రవేశించుడి.” అంతేకాదు, ఒక్కో జాతి నుండి ఒక్కో జత చొప్పున అన్ని జాతుల జంతువులను, బలికి పనికొచ్చే పవిత్ర జంతువుల్లో ఏడు జతలను ఓడలోకి తీసుకువెళ్లమని చెప్పాడు.—ఆది. 7:1-3.

17 అల్లంతదూరం నుండి రకరకాల పక్షులు, క్రూర జంతువులు, సాధు జంతువులు చిన్నవీ-పెద్దవీ ప్రవాహంలా ఓడవైపుకు వస్తున్నాయి. వాటిలో కొన్ని నడుచుకుంటూ, కొన్ని ఎగురుకుంటూ, కొన్ని చిన్నచిన్న అడుగులు వేసుకుంటూ, మరికొన్ని బరువైన అడుగులతో ఠీవిగా నడుచుకుంటూ వస్తున్నాయి. ఆ మరపురాని దృశ్యం నోవహు కుటుంబానికి కనువిందు చేసివుంటుంది! భూమ్మీద స్వేచ్ఛగా తిరిగే ఆ ప్రాణుల్ని గట్టిగట్టిగా గదమాయిస్తూనో, మెల్లగా బుజ్జగిస్తూనో ఓడలోని నాలుగు గోడల మధ్యకు తీసుకువెళ్లడానికి నోవహు నానా తంటాలు పడివుంటాడనుకుంటే మనం పొరపడినట్టే. ఎందుకంటే, అవన్నీ “ఓడలో నున్న నోవహు నొద్దకు చేరెను” అని బైబిలు చెబుతోంది.—ఆది. 7:8, 9.

18, 19. (ఎ) నోవహు కాలంలో జరిగిన వాటిపై సంశయవాదులు లేవదీసే ప్రశ్నలకు మనం ఎలాంటి వివరణలు ఇవ్వొచ్చు? (బి) తను సృష్టించిన జంతువులను కాపాడేందుకు యెహోవా ఎంచుకున్న పద్ధతిలో ఆయన జ్ఞానం ఎలా కనబడుతుంది?

18 కొందరు సంశయవాదులు ఇలా అంటారు: ‘అదెలా సాధ్యం? జంతువులన్నీ ఆ నాలుగు గోడల మధ్య కలిసిమెలిసి శాంతిగా ఎలా ఉండగలవు?’ ఒక్కసారి ఇది పరిశీలించండి: విశ్వాన్ని సృష్టించిన దేవుడు తాను చేసిన జంతువులను అదుపు చేయలేడా? కావాలనుకుంటే వాటిని సాధు జంతువుల్లా మార్చలేడా? జంతువులన్నిటినీ యెహోవా దేవుడే సృష్టించాడని మనం మర్చిపోకూడదు. ఆ తర్వాత చాలా కాలానికి ఆయన ఎర్రసముద్రాన్ని రెండు పాయలుగా విడగొట్టాడు, సూర్యుణ్ణి అస్తమించకుండా ఆపాడు. అలాంటప్పుడు, నోవహు వృత్తాంతంలోని సంఘటనలన్నీ జరిగేలా ఆయన చేయలేడా? తప్పకుండా చేయగలడు, చేశాడు కూడా!

19 దేవుడు తను సృష్టించిన జంతువులను మరోలా కూడా కాపాడగలిగేవాడే. అయితే ఆయన ఎంచుకున్న పద్ధతిని చూస్తే, భూమ్మీది ప్రతీ జీవిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యతను ఆయన మొదట్లో మనుషులకు అప్పగించిన విషయం గుర్తుకొస్తుంది. (ఆది. 1:28) తను సృష్టించిన జంతువులను, ప్రజలను యెహోవా ఎంతో అమూల్యంగా ఎంచుతాడని తమ పిల్లలకు బోధించేందుకు నేడు చాలామంది తల్లిదండ్రులు నోవహు కథను ఉపయోగిస్తారు.

20. జలప్రళయానికి ముందువారం నోవహు, ఆయన కుటుంబం ఏయే పనులు చేసివుంటారు?

20 ఇంకో వారంలో జలప్రళయం వస్తుందని యెహోవా నోవహుకు చెప్పాడు. నోవహు కుటుంబం చేయాల్సిన పని ఎంతో ఉంది. జంతువులన్నిటినీ, వాటి ఆహారాన్నీ, తమకు కావాల్సినవాటినీ ఓడలోకి ఎక్కించి పద్ధతి ప్రకారం సర్దాలి. నోవహు భార్య, ఆయన ముగ్గురు కోడళ్లు ఓడలో తాము ఉండబోయే స్థలాన్ని సిద్ధం చేసుకోవడానికి బాగా కష్టపడివుంటారు.

21, 22. (ఎ) నోవహు కాలంలోని ప్రజల వైఖరి చూసి మనం ఎందుకు ఆశ్చర్యపోకూడదు? (బి) అపహాసకుల నోటికి ఎప్పుడు తాళం పడింది?

21 మరి చుట్టుపక్కలవాళ్ల పరిస్థితి ఎలా ఉంది? నోవహును, ఆయన చేస్తున్న ప్రయత్నాలను యెహోవా ఆశీర్వదిస్తున్నాడని స్పష్టంగా కనిపిస్తున్నా వాళ్లు అవేవీ పట్టించుకోలేదు. జంతువులు ప్రవాహంలా ఓడలోకి వెళ్తుంటే వాళ్లు నిస్తేజంగా చూస్తూ నిలబడిపోయారు. వాళ్ల ప్రవర్తనను చూసి మనం ఆశ్చర్యపోకూడదు. ఎందుకంటే నేడు కూడా, మనం ఈ దుష్టలోకం చివరి రోజుల్లో ఉన్నామని అనడానికి బలమైన ఆధారాలున్నా ప్రజలు అవేవీ పట్టించుకోవడం లేదు. అపొస్తలుడైన పేతురు ముందే చెప్పినట్టు అపహాసకులు అపహాస్యం చేస్తూ, దేవుని హెచ్చరికను లక్ష్యపెడుతున్నవాళ్లను ఎగతాళి చేస్తున్నారు. (2 పేతురు 3:3-6 చదవండి.) అలాగే ఆ కాలంలో కూడా ప్రజలు నోవహును, ఆయన కుటుంబాన్ని తప్పక ఎగతాళి చేసివుంటారు.

22 మరి వాళ్ల నోటికి ఎప్పుడు తాళం పడింది? నోవహు కుటుంబం, జంతువులు ఓడలోకి ప్రవేశించగానే ఓడ తలుపును ‘యెహోవా మూసివేశాడు’ అని బైబిలు చెబుతోంది. ఆ సమయంలో అపహాసకులు ఎవరైనా దగ్గర్లో ఉండివుంటే, ఆ దైవచర్యకు వాళ్ల నోళ్లు మూతపడివుంటాయి. అప్పుడు కాకపోయినా కనీసం వర్షం వచ్చినప్పుడైనా వాళ్ల నోటికి తాళం పడివుంటుంది! చిన్నగా మొదలైన వర్షం కుండపోతగా మారింది, చివరకు యెహోవా చెప్పినట్టు జలప్రళయం లోకాన్నంతా ముంచేసింది.—ఆది. 7:16-21.

23. (ఎ) నోవహు కాలంలోని దుష్టులు చనిపోయినందుకు యెహోవా సంతోషించలేదని మనం ఎందుకు చెప్పవచ్చు? (బి) నేడు మనం నోవహులా విశ్వాసం చూపించడం ఎందుకు తెలివైన పని?

23 ఆ దుష్టులు చనిపోయినందుకు యెహోవా సంతోషించాడా? లేదు! (యెహె. 33:11) వాళ్లు తమ ప్రవర్తన మార్చుకుని సరైనది చేయడానికి ఆయన వాళ్లకు ఎంతో సమయం ఇచ్చాడు. వాళ్లు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఉండగలిగేవాళ్లా? నోవహు జీవితమే దానికి ఒక నిదర్శనం. యెహోవాతో నడుస్తూ, అన్నివిషయాల్లో ఆయనకు లోబడితే ప్రాణాలు కాపాడుకోవడం సాధ్యమేనని నోవహు చూపించాడు. అలా ఆయన తన విశ్వాసం ద్వారా ఆ లోకం మీద నేరస్థాపన చేశాడు, వాళ్ల దుష్టత్వాన్ని బట్టబయలు చేశాడు. అదే విశ్వాసం ఆయనను, ఆయన కుటుంబాన్ని కాపాడింది. మీరూ నోవహులా విశ్వాసం చూపిస్తే మిమ్మల్నీ, మీ ఆత్మీయులనూ కాపాడుకోగలుగుతారు. ఆయనలా మీరూ, ఒక స్నేహితునితో నడిచినట్టు యెహోవాతో నడవగలుగుతారు. ఆ స్నేహం కలకాలం వర్ధిల్లగలదు!

a ఆ రోజుల్లో ప్రజలు మనకన్నా ఎక్కువకాలం బ్రతికేవాళ్లు. వాళ్లు అంతకాలం బ్రతకడానికి, వాళ్లకంత శక్తి ఉండడానికి కారణం, ఒకప్పుడు ఆదాముహవ్వలకున్న పరిపూర్ణతకు వాళ్లు దగ్గరగా ఉండడమే.

b లెమెకు తన కుమారుడికి నోవహు అనే పేరు పెట్టాడు. బహుశా దానికి, “నెమ్మది” లేదా “ఊరట” అనే అర్థం ఉండివుంటుంది. నోవహు తన పేరుకు తగినట్టు, శాపానికి గురైన భూమ్మీద ప్రజలు పడుతున్న బాధల నుండి వాళ్లకు నెమ్మది కలుగజేస్తాడని లెమెకు ప్రవచించాడు. (ఆది. 5:28, 29) కానీ తన ప్రవచనం నెరవేరేవరకు ఆయన బ్రతికిలేడు. నోవహు తల్లి, తోబుట్టువులు కూడా బహుశా జలప్రళయంలో చనిపోయివుంటారు.