కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

7వ అధ్యాయం

ఆయన ‘యెహోవా సన్నిధిలో ఎదిగాడు’

ఆయన ‘యెహోవా సన్నిధిలో ఎదిగాడు’

1, 2. ఎలాంటి పరిస్థితిలో సమూయేలు ఇశ్రాయేలీయులతో మాట్లాడాడు? వాళ్లు తమ తప్పు తెలుసుకునేలా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?

 సమూయేలు అక్కడ సమకూడిన ప్రజల ముఖాలను చూస్తున్నాడు. దశాబ్దాల పాటు ప్రవక్తగా, న్యాయాధిపతిగా సేవచేసిన నమ్మకస్థుడైన సమూయేలే వాళ్లను గిల్గాలు పట్టణంలో అలా సమావేశపర్చాడు. (1 సమూ. 11:14, 15) మన క్యాలెండరు ప్రకారం అది మే గానీ జూన్‌ గానీ అయ్యుంటుంది. ఎండలు ఒకటే మండిపోతున్నాయి. గోధుమ పంట తెల్లబారి కోతకు వచ్చింది. అక్కడ సమకూడిన ఇశ్రాయేలీయులంతా నిశ్శబ్దంగా సమూయేలు వైపు చూస్తున్నారు. వాళ్లను ఆలోచింపజేయడానికి సమూయేలు ఏమి చేశాడు?

2 తమ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఇశ్రాయేలీయులకు పూర్తిగా అర్థంకాలేదు. తమను పరిపాలించడానికి ఒక మానవ రాజును నియమించమని వాళ్లు పట్టుబట్టారు. తమ దేవుడైన యెహోవాను, ఆయన ప్రవక్తను ఘోరంగా అవమానించామన్న విషయాన్ని వాళ్లు గ్రహించలేదు. నిజానికి, తమ మీద రాజుగావున్న యెహోవానే వాళ్లు తిరస్కరించారు! సమూయేలు ఎలా వాళ్లు తమ తప్పు తెలుసుకునేలా చేశాడు?

చెడు ప్రభావాల మధ్య కూడా విశ్వాసాన్ని ఎలా బలపర్చుకోవచ్చో సమూయేలు బాల్యం చక్కగా చూపిస్తుంది

3, 4. (ఎ) సమూయేలు తన బాల్యం గురించి ఎందుకు మాట్లాడాడు? (బి) సమూయేలు చూపించిన విశ్వాసం మనకు ఎందుకు ప్రయోజనకరం?

3 సమూయేలు వాళ్లతో మాట్లాడాడు. ‘నేను తల నెరిసి ముసలివాడనయ్యాను’ అంటూ మొదలుపెట్టాడు. వయసు పైబడడం వల్ల వచ్చిన పెద్దరికం ఆయన మాటలకు బలాన్నిచ్చింది. ఆయన ఇలా అన్నాడు: ‘బాల్యం నుండి నేటి వరకు నేను మీ కార్యాలను జరిగిస్తూ వచ్చాను.’ (1 సమూ. 12:2) సమూయేలు వృద్ధుడైనా తన బాల్యాన్ని మర్చిపోలేదు. ఆ జ్ఞాపకాలు ఇంకా ఆయన మనసులో మెదులుతూనే ఉన్నాయి. సమూయేలు పెరిగి పెద్దవాడౌతుండగా తీసుకున్న నిర్ణయాలు తన దేవుడైన యెహోవా పట్ల భక్తివిశ్వాసాలతో జీవించడానికి ఆయనకు తోడ్పడ్డాయి.

4 సమూయేలు ఎన్నోసార్లు తన విశ్వాసాన్ని బలపర్చుకొని, కాపాడుకోవాల్సి వచ్చింది. విశ్వాసంలేనివాళ్ల మధ్య, విశ్వాసఘాతకుల మధ్య జీవిస్తున్నా ఆ విషయంలో పట్టువిడవలేదు. మనం కూడా విశ్వాసం కరువైన, భ్రష్టుపట్టిన లోకంలో జీవిస్తున్నాం కాబట్టి విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి అంతే కృషిచేయాల్సి ఉంటుంది. (లూకా 18:8 చదవండి.) సమూయేలు జీవితంలో మనకు ఉపయోగపడే అంశాలు ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఆయన బాల్యం నుండి మొదలుపెడదాం.

‘బాలునిగా యెహోవాకు పరిచర్య చేశాడు’

5, 6. సమూయేలు బాల్యం అందరి బాల్యంలా గడవలేదని ఎలా చెప్పవచ్చు? అయినా తమ కుమారుడు బాగానేవుంటాడని సమూయేలు తల్లిదండ్రులు ఎందుకు నమ్మకంతో ఉన్నారు?

5 సమూయేలు బాల్యం అందరి బాల్యంలా గడవలేదు. పాలు విడిచిన కొంతకాలానికే, అంటే దాదాపు నాలుగేళ్ల వయసులోనే షిలోహులోని యెహోవా పరిశుద్ధ మందిరంలో సేవచేయడం మొదలుపెట్టాడు. షిలోహుకు, సమూయేలు సొంతూరు రామాకు మధ్య దూరం 30 కిలోమీటర్ల పైనే. ఎల్కానా, హన్నా తమ కుమారుడు సమూయేలును ఒక ప్రత్యేకమైన సేవ కోసం అంటే జీవితాంతం నాజీరుగా ఉండడానికి యెహోవాకు సమర్పించారు. a అంటే సమూయేలు మీద వాళ్లకు ప్రేమలేదని, అతణ్ణి పూర్తిగా విడిచిపెట్టేశారని దానర్థమా?

6 కానే కాదు! షిలోహులో ఉన్నవాళ్లు తమ కుమారుణ్ణి బాగా చూసుకుంటారని వాళ్లకు తెలుసు. సమూయేలు ప్రధానయాజకుడైన ఏలీతో కలిసి పనిచేసేవాడు కాబట్టి, వాళ్లు అతనిమీద తగిన శ్రద్ధతీసుకునేలా ఆయన తప్పకుండా చూసివుంటాడు. మందిరానికి సంబంధించిన కొన్ని పనులు చూసుకోవడానికి అక్కడ చాలామంది స్త్రీలు కూడా ఉండేవాళ్లు. అక్కడ అన్నీ పద్ధతి ప్రకారం జరిగేవని తెలుస్తోంది.—నిర్గ. 38:8; న్యాయా. 11:34-40.

7, 8. (ఎ) ప్రతీ ఏడు హన్నా, ఎల్కానా తమ కుమారుణ్ణి ఎలా ప్రేమగా ప్రోత్సహించేవాళ్లు? (బి) వాళ్ల నుండి నేటి తల్లిదండ్రులు ఏమి నేర్చుకోవచ్చు?

7 హన్నా ప్రార్థన విని దేవుడు అనుగ్రహించిన తమ ప్రియమైన తొలి సంతానాన్ని ఆ తల్లిదండ్రులు ఎప్పుడూ మర్చిపోలేదు. హన్నా తనకొక కుమారుణ్ణి ఇవ్వమని వేడుకుంది. అలా ఇస్తే, ఆ కుమారుణ్ణి పరిశుద్ధ సేవ కోసం దేవునికి అంకితం చేస్తానని మొక్కుకుంది. హన్నా ప్రతీ ఏడు సమూయేలు దగ్గరకు వచ్చినప్పుడల్లా, బిడ్డ కోసం ఒక అంగీ కుట్టి తెచ్చేది. మందిరంలో సేవ చేసేటప్పుడు సమూయేలు దాన్ని వేసుకునేవాడు. తన తల్లిదండ్రులను చూసినప్పుడు సమూయేలు ఎంతో ఆనందించివుంటాడు. అలాంటి ప్రత్యేకమైన స్థలంలో యెహోవా సేవ చేయడం ఎంతో అమూల్యమైన అవకాశమని ఆ తల్లిదండ్రులు వివరంగా చెప్పివుంటారు. ప్రేమతో వాళ్లు మాట్లాడిన మాటలు, ఇచ్చిన నిర్దేశం సమూయేలును తప్పకుండా ప్రోత్సహించివుంటాయి.

8 నేటి తల్లిదండ్రులు ఎల్కానా, హన్నా నుండి చాలా నేర్చుకోవచ్చు. సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు వస్తుసంబంధమైన వాటిని సమకూర్చిపెట్టడం మీదే మనసుపెడతారు కానీ వాళ్లకు దేవుని విషయాలు నేర్పించడానికి ప్రాధాన్యమివ్వరు. అయితే సమూయేలు తల్లిదండ్రులు మాత్రం దేవుని విషయాలకే ప్రాధాన్యమిచ్చారు. సమూయేలు కూడా అలాంటి వ్యక్తిగా తయారవడానికి అదెంతో దోహదపడింది.—సామెతలు 22:6 చదవండి.

9, 10. (ఎ) మందిరం గురించి, ఆ పరిశుద్ధ స్థలం విషయంలో సమూయేలు మనోభావాల గురించి వివరించండి. (అధస్సూచి కూడా చూడండి.) (బి) సమూయేలు ఎలాంటి పనులు చేసివుంటాడు? నేటి పిల్లలు ఆయనను ఎలా ఆదర్శంగా తీసుకోవచ్చు?

9 చిన్నారి సమూయేలు అప్పుడప్పుడు షిలోహుకు చుట్టూవున్న కొండల పైకి వెళ్లి పరిసరాలను కలియచూసివుంటాడు. అక్కడి నుండి షిలోహు పట్టణాన్ని, దానికి ఒక వైపున విస్తరించివున్న లోయను చూస్తున్నప్పుడు ఆయన చూపు యెహోవా మందిరం మీద కూడా పడివుంటుంది. అప్పుడు ఆయన మనసు ఆనందంతో, గర్వంతో ఉప్పొంగివుంటుంది. ఆ మందిరం నిజంగా ఒక పరిశుద్ధ స్థలం. b దాదాపు 400 సంవత్సరాల క్రితం మోషే నిర్దేశంలో దాని నిర్మాణం జరిగింది. అప్పట్లో భూమ్మీద ఆ ఒక్క చోటే యెహోవా ఆరాధన జరిగేది.

10 సమూయేలుకు చిన్నప్పటినుండి ఆ మందిరమంటే ఎంతో ప్రేమ. పెద్దవాడయ్యాక ఆయన రాసిన వృత్తాంతంలో ఇలా ఉంది: “బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను.” (1 సమూ. 2:18) చేతుల్లేని అంగీని సమూయేలు వేసుకునేవాడు కాబట్టి మందిరపు పనుల్లో యాజకులకు సాయపడేవాడని అర్థమౌతుంది. సమూయేలు యాజకుడు కాకపోయినా, మందిర ఆవరణంలో ఉన్న తలుపులను ఉదయాన్నే తెరవడం లాంటి పనులు చేసేవాడు, వృద్ధుడైన ఏలీకి సాయపడేవాడు. అలాంటి పనులను సమూయేలు ఎంతో ఆనందంగా చేసేవాడు. కానీ ఆ తర్వాత జరిగిన కొన్ని విషయాలు ఆ పసిమనసును బాధపెట్టాయి. యెహోవా మందిరంలో ఘోరమైన చెడ్డ పనులు జరుగుతున్నాయి.

చుట్టూ చెడు జరుగుతున్నా పవిత్రంగా ఉన్నాడు

11, 12. (ఎ) హొఫ్నీ, ఫీనెహాసుల్లో ఉన్న పెద్ద లోపం ఏమిటి? (బి) వాళ్లు మందిరంలో ఎలాంటి చెడ్డపనులు చేసేవాళ్లు? (అధస్సూచి కూడా చూడండి.)

11 సమూయేలు చిన్న వయసులోనే ఎంతో చెడును, మోసాన్ని చూశాడు. ఏలీకి ఇద్దరు కుమారులు. వాళ్లు హొఫ్నీ, ఫీనెహాసు. సమూయేలు రాసిన వృత్తాంతంలో ఇలా ఉంది: ‘ఏలీ కుమారులు చెడ్డవాళ్లు. వాళ్లు యెహోవాను లక్ష్యపెట్టలేదు.’ (1 సమూ. 2:12, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌వర్షన్‌) ఈ వచనంలోని రెండు వాక్యాలు ఒకదానితో ఒకటి సంబంధం కల్గివున్నాయి. అందులో, ‘చెడ్డవాళ్లు’ అని అనువదించిన హెబ్రీ పదాన్ని ‘పనికిమాలిన వాళ్లు’ అని కూడా అనువదించవచ్చు. హొఫ్నీ, ఫీనెహాసులను చెడ్డవాళ్లని అనడం సబబే. ఎందుకంటే వాళ్లు యెహోవాను లక్ష్యపెట్టలేదు. దేవుని నీతి ప్రమాణాలను, నియమాలను లెక్కచేయలేదు. అలా వాళ్ల పాపాల చిట్టా పెరిగిపోయింది.

12 యాజకులు ఏయే పనులు చేయాలో, మందిరంలో బలులు ఎలా అర్పించాలో దేవుని ధర్మశాస్త్రం స్పష్టంగా తెలియజేసింది. అందుకు తగిన కారణమే ఉంది! ప్రజలు తన దృష్టిలో పవిత్రులుగా ఉండడానికీ, తన దీవెనలను, మార్గనిర్దేశాన్ని పొందడానికీ దేవుడు చేసిన ఏర్పాటే ఆ బలులు. కానీ హొఫ్నీ, ఫీనెహాసుల తప్పుడు ప్రవర్తన వల్ల మిగతా యాజకులు కూడా బలుల మీద చాలా అగౌరవం చూపించారు. c

13, 14. (ఎ) మందిరంలో జరుగుతున్న చెడు వల్ల సామాన్య ప్రజలకు ఎలాంటి పరిస్థితి ఎదురైవుంటుంది? (బి) ఒక తండ్రిగా, ప్రధానయాజకునిగా ఏలీ ఎలా విఫలమయ్యాడు?

13 అంత పెద్దపెద్ద తప్పులు జరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. సమూయేలు అదంతా కళ్లు విప్పార్చి చూస్తూ ఉండిపోయివుంటాడు. కాస్త మనశ్శాంతిని, ఆధ్యాత్మిక బలాన్ని పొందాలని కొండంత ఆశతో పరిశుద్ధ మందిరానికి వచ్చిన ఎంతోమంది దీనులు, పేదవాళ్లు, అణచివేతకు గురైనవాళ్లు అవమానంతో, నిరాశతో, బాధతో తిరిగి వెళ్లిపోవడం సమూయేలు చూసివుంటాడు! హొఫ్నీ, ఫీనెహాసు మందిరంలో సేవ చేయడానికి వచ్చిన కొంతమంది స్త్రీలతో లైంగిక సంబంధాలు పెట్టుకొని యెహోవా నైతిక నియమాలను పెడచెవిన పెట్టారని తెలుసుకున్నప్పుడు సమూయేలుకు ఎలా అనిపించివుంటుందో కదా! (1 సమూ. 2:22) ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి ఏలీ ఏదోకటి చేస్తాడని సమూయేలు ఆశించివుంటాడు.

ఏలీ కుమారుల చెడుతనం చూసి సమూయేలు ఎంతో నొచ్చుకొనివుంటాడు

14 తీవ్రరూపం దాలుస్తున్న ఈ సమస్యను పరిష్కరించడానికి సరైన స్థానంలో ఉన్నది ఏలీనే. ఆయన ప్రధానయాజకుడు కాబట్టి మందిరంలో జరుగుతున్న పనులకు ఆయనే బాధ్యుడు. ఒక తండ్రిగా తన కుమారులను సరిదిద్దాల్సిన బాధ్యత కూడా ఆయనకుంది. హొఫ్నీ, ఫీనెహాసు చేస్తున్న పనుల వల్ల వాళ్లకే కాదు ఎంతోమంది ఇతరులకు కూడా హాని జరుగుతోంది. తండ్రిగా, ప్రధానయాజకునిగా ఏలీ తన పాత్రను నిర్వర్తించడంలో విఫలమయ్యాడు. తన కుమారుల మనసు నొప్పించకుండా వాళ్లను కేవలం పైపైనే మందలించి వదిలేశాడు. (1 సమూయేలు 2:23-25 చదవండి.) కానీ వాళ్లకు గట్టి క్రమశిక్షణ అవసరం. నిజానికి, వాళ్లు మరణశిక్షకు తగిన పాపాలు చేశారు.

15. యెహోవా ఏలీకి ఎలాంటి తీవ్రమైన సందేశాన్ని పంపించాడు? దానికి ఆయన కుటుంబం ఎలా స్పందించింది?

15 పరిస్థితి విషమించడంతో స్వయంగా యెహోవాయే జోక్యం చేసుకున్నాడు. తీవ్రమైన తీర్పు సందేశాన్ని ప్రకటించడానికి ‘ఒక దైవజనుణ్ణి’ (ప్రవక్తను) ఏలీ దగ్గరకు పంపించాడు. ఆయన పేరు బైబిల్లో లేదు. యెహోవా ఏలీతో ఇలా అన్నాడు: “నాకంటె నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు.” ఏలీ చెడ్డ కుమారులిద్దరూ ఒకేరోజు చనిపోతారనీ, ఆయన కుటుంబం ఎంతో బాధ అనుభవిస్తుందనీ, వాళ్లు యాజక తరగతిలో తమకున్న గౌరవప్రదమైన స్థానాన్ని కోల్పోతారనీ యెహోవా తెలియజేశాడు. అయితే ఈ హెచ్చరిక వల్ల ఆ కుటుంబంలో ఏమైనా మార్పు వచ్చిందా? లేదని ఆ వృత్తాంతాన్ని చూస్తే తెలుస్తుంది.—1 సమూ. 2:27–3:1.

16. (ఎ) సమూయేలు ఎదుగుదల గురించి బైబిలు ఏమి చెబుతోంది? (బి) అది చదివినప్పుడు మీకు సంతోషం కలుగుతోందా? వివరించండి.

16 చుట్టూవున్న చెడు పరిస్థితులు సమూయేలు మీద ఏమైనా ప్రభావం చూపించాయా? ఆ చీకటి వృత్తాంతంలో సమూయేలు ప్రగతి, ఎదుగుదల గురించిన మంచి వార్తలు వెలుగు కిరణాల్లా ప్రకాశిస్తున్నాయి. 1 సమూయేలు 2:18లో ‘బాలుడైన’ సమూయేలు నమ్మకంగా ‘యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు’ అని బైబిలు చెబుతోందని గుర్తుచేసుకోండి. సమూయేలు అంత చిన్న వయసులో కూడా తన జీవితాన్ని యెహోవా సేవకే అంకితం చేశాడు. అదే అధ్యాయంలోని 21వ వచనంలో, మనకు ఎంతో సంతోషం కలిగించే మరో విషయాన్ని చదువుతాం. అదేమిటంటే, ‘బాలుడైన సమూయేలు యెహోవా సన్నిధిలో ఎదిగాడు.’ సమూయేలు పెరిగి పెద్దవాడవుతున్నకొద్దీ తన పరలోక తండ్రితో ఆయనకున్న సంబంధం కూడా బలపడుతూ వచ్చింది. యెహోవాతో అలాంటి దగ్గరి సంబంధం ఉంటే అన్ని రకాల చెడు ప్రభావాల నుండి తప్పించుకోవచ్చు.

17, 18. (ఎ) చుట్టూవున్నవాళ్లు తప్పులు చేస్తున్నప్పుడు, క్రైస్తవ పిల్లలు సమూయేలును ఎలా ఆదర్శంగా తీసుకోవచ్చు? (బి) సమూయేలు ఎంచుకున్న మార్గం సరైనదని ఎలా చెప్పవచ్చు?

17 ప్రధానయాజకుడు, ఆయన కుమారులే తప్పు చేయగా లేనిది తాను కూడా తనకు నచ్చినట్లు ఎందుకు జీవించకూడదని సమూయేలు అనుకొని ఉండగలిగేవాడే. అయితే అధికారంలో ఉన్నవాళ్లతో సహా అందరూ తప్పులు చేస్తున్నారు కాబట్టి మనం కూడా పాపం చేయవచ్చని అనుకోవడం సరికాదు. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవ యువతీయువకులు, తమ చుట్టూవున్న వాళ్లలో కొంతమంది ఆదర్శవంతంగా లేకపోయినా తాము మాత్రం సమూయేలును స్ఫూర్తిగా తీసుకుని ‘యెహోవా సన్నిధిలో ఎదుగుతున్నారు.’

18 అలా జీవించడం వల్ల సమూయేలుకు ఏదైనా మంచి జరిగిందా? బైబిలు ఇలా చెబుతోంది: ‘బాలుడైన సమూయేలు ఎదుగుతూ దేవుని దయయందు, మనుష్యుల దయయందు వర్ధిల్లుచుండెను.’ (1 సమూ. 2:26) ఆయన ఎవరి మాటలకైతే ప్రాధాన్యమివ్వాలో, కనీసం వాళ్లయినా సమూయేలును బాగా ఇష్టపడివుంటారు. సమూయేలు నమ్మకంగా ఉన్నందుకు యెహోవా కూడా ఆయనను చూసి ఎంతో సంతోషించాడు. షిలోహులో జరుగుతున్న చెడునంతటిని దేవుడు తీసివేస్తాడని సమూయేలుకు గట్టి నమ్మకం ఉంది. ‘కానీ అది ఎప్పుడు?’ అని ఆయన అనుకొనివుంటాడు. ఒకరోజు రాత్రి, అలాంటి ప్రశ్నలకు జవాబు దొరికింది.

‘మీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ ఇవ్వండి’

19, 20. (ఎ) ఒకరోజు మందిరంలో సమూయేలుకు ఏమి జరిగిందో వివరించండి. (బి) ఆయన ఏలీతో ఏమన్నాడు? (సి) ఆ స్వరం ఎవరిదో సమూయేలుకు ఎలా తెలిసింది?

19 తెల్లవారుజాము కావస్తోంది, అయినా ఇంకా చీకటిగానే ఉంది. మందిరంలోని పెద్ద దీపం రెపరెపలాడుతూ ఇంకా వెలుగుతూనే ఉంది. అంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడు సమూయేలుకు ఎవరో పిలిచినట్లు అనిపించింది. తనను పిలిచింది ఏలీయేనని సమూయేలు అనుకున్నాడు, అప్పటికి వృద్ధాప్యంతో ఏలీ చూపు బాగా మందగించింది. సమూయేలు వెంటనే లేచి ఏలీ దగ్గరకు “పరుగున పోయాడు.” సమూయేలు కనీసం చెప్పులు కూడా వేసుకోకుండా పరుగెత్తడం ఒక్కసారి ఊహించుకోండి. సమూయేలు ఎంతో గౌరవంతో, ప్రేమతో ఏలీకి సేవచేశాడన్న విషయం మన మనసును కదిలిస్తుంది. ఏలీ ఎన్నో పాపాలు చేసివుండొచ్చు, కానీ ఆయన యెహోవా ప్రధానయాజకుడు.—1 సమూ. 3:2-5, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

20 సమూయేలు ఏలీని లేపి, ‘మీరు పిలిచారు కదా వచ్చాను’ అన్నాడు. దానికి ఏలీ తాను పిలవలేదని, వెళ్లి పడుకోమని అన్నాడు. కానీ మళ్లీ అలాగే జరిగింది, మూడవసారి కూడా అలాగే జరిగింది! అప్పుడు ఏలీకి విషయం అర్థమైంది. అప్పటికి యెహోవా తన ప్రజలకు దర్శనాలు, ప్రవచనాత్మక సందేశాలు ఇవ్వడం తగ్గించాడు. అందుకు కారణం లేకపోలేదు. అయితే ఇప్పుడు యెహోవా మళ్లీ మాట్లాడడం మొదలుపెట్టాడనీ, సమూయేలుతో మాట్లాడింది ఆయనేననీ ఏలీకి అర్థమైంది. ఏలీ ఆ అబ్బాయిని వెళ్లి పడుకోమన్నాడు. ఈసారి ఆ స్వరం మళ్లీ వినిపిస్తే ఎలా మాట్లాడాలో చెప్పాడు. సమూయేలు వెళ్లి పడుకున్నాడు. కాసేపటికి, “సమూయేలూ, సమూయేలూ” అని ఎవరో పిలవడం ఆయనకు వినిపించింది. దానికి ఆ అబ్బాయి, ‘మీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ ఇవ్వండి’ అని బదులిచ్చాడు.—1 సమూ. 3:1, 5-10.

21. యెహోవా స్వరాన్ని నేడు మనం ఎలా వినవచ్చు? దానివల్ల వచ్చే ప్రయోజనమేమిటి?

21 మొత్తానికి, యెహోవా మాట ఆలకించే దాసుడొకడు షిలోహులో ఉన్నాడు. సమూయేలు జీవితాంతం యెహోవా చెప్పింది విన్నాడు. మీరూ అలాగే వింటారా? అలా వినాలంటే రాత్రిపూట ఏదో మానవాతీత స్వరం మనతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒకవిధంగా చెప్పాలంటే, దేవుని స్వరం మనతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంది. దేవుని సంపూర్ణ వాక్యంలో, అంటే బైబిల్లో ఆ స్వరం వినబడుతుంది. మనం దేవుడు చెప్పేది ఎంత ఎక్కువగా వింటామో, ఎంత ఎక్కువగా పాటిస్తామో మన విశ్వాసం కూడా అంత ఎక్కువగా బలపడుతుంది.

సమూయేలు మొదట్లో భయపడినా, యెహోవా తీర్పు సందేశాన్ని ఉన్నదున్నట్లు ఏలీకి తెలియజేశాడు

22, 23. (ఎ) సమూయేలు మొదట్లో ప్రకటించడానికి భయపడిన సందేశం ఎలా నెరవేరింది? (బి) సమూయేలు కీర్తి ఎలా ఎక్కువైంది?

22 సమూయేలుకు అది మర్చిపోలేని రోజు, ఎందుకంటే ఆ రోజే ఆయనకు యెహోవాతో ఒక ప్రత్యేకమైన సంబంధం ఏర్పడింది. అప్పటినుండి ఆయన దేవుని ప్రవక్తగా, ప్రతినిధిగా సేవచేశాడు. యెహోవా సందేశాన్ని ఏలీకి ప్రకటించడానికి చిన్నారి సమూయేలు మొదట్లో భయపడ్డాడు. ఎందుకంటే, అది మామూలు సందేశం కాదు. ఏలీ కుటుంబం నాశనమౌతుందనే ప్రవచనం నెరవేరే సమయం దగ్గరపడిందని ఆయనకు చెప్పాలి. అయినా ధైర్యం కూడగట్టుకుని సమూయేలు ఆ సందేశాన్ని ఏలీకి చెప్పేశాడు. ఆ దైవిక తీర్పును ఏలీ వినయంగా అంగీకరించాడు. కొంతకాలానికే యెహోవా చెప్పినదంతా జరిగింది. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు హొఫ్నీ, ఫీనెహాసు ఇద్దరూ ఒకేరోజు చనిపోయారు. యెహోవా పరిశుద్ధ మందసం ‘పట్టబడిందని’ విన్న వెంటనే ఏలీ కూడా చనిపోయాడు.—1 సమూ. 3:10-18; 4:1-18.

23 అయితే, నమ్మకస్థుడైన ప్రవక్త అని సమూయేలుకు ఉన్న కీర్తి ఇంకా ఎక్కువైంది. ‘యెహోవా అతనికి తోడైవున్నాడు’ అని బైబిలు చెబుతోంది. సమూయేలు ప్రవచించినవన్నీ నెరవేరేటట్లు యెహోవా చూశాడని కూడా అది చెబుతోంది.—1 సమూయేలు 3:19 చదవండి.

“సమూయేలు యెహోవాను వేడుకున్నాడు”

24. కొంతకాలానికి ఇశ్రాయేలీయులకు ఏమని అనిపించింది? అది ఎందుకు ఘోరమైన పాపం?

24 అయితే, ఇశ్రాయేలీయులందరూ సమూయేలు నిర్దేశం ప్రకారం నడుచుకుంటూ యెహోవాకు దగ్గరయ్యారా? ఆయనకు నమ్మకంగా ఉన్నారా? లేదు. కొంతకాలానికి, కేవలం ఒక ప్రవక్త తమ మీద న్యాయాధిపతిగా ఉంటే సరిపోదని వాళ్లకు అనిపించింది. దాంతో, ఇతర జనాంగాల్లా తమకూ ఒక మానవ రాజు కావాలని అడిగారు. యెహోవా చెప్పినట్లు సమూయేలు వాళ్ల విజ్ఞప్తిని అంగీకరించాడు. అయితే, వాళ్లు చేసిన పాపం ఎంత ఘోరమైనదో వాళ్లకు అర్థమయ్యేలా చేయాలి. వాళ్లు తిరస్కరిస్తున్నది ఏ మనిషినో కాదు, స్వయంగా యెహోవానే! అందుకే సమూయేలు వాళ్లను గిల్గాలులో సమావేశపర్చాడు.

సమూయేలు విశ్వాసంతో ప్రార్థించాడు, ఆ ప్రార్థనకు జవాబిస్తూ యెహోవా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాన్ని రప్పించాడు

25, 26. యెహోవాకు వ్యతిరేకంగా వాళ్లెంత ఘోరమైన పాపం చేశారో తెలుసుకునేలా వృద్ధుడైన సమూయేలు ఇశ్రాయేలీయులకు ఎలా సహాయం చేశాడు?

25 సమూయేలు గిల్గాలులో ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్న ఆ ఉద్వేగభరిత సన్నివేశానికి మనం మళ్లీ వెళ్దాం. వయసు పైబడిన సమూయేలు తాను నమ్మకంగా చేసిన సేవను ఇశ్రాయేలీయులకు గుర్తుచేశాడు. తర్వాత, “సమూయేలు యెహోవాను వేడుకొన్నాడు” అని మనం చదువుతాం. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిపించమని ఆయన యెహోవాను అడిగాడు.—1 సమూ. 12:17, 18.

26 ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? అదీ ఎండాకాలంలోనా? అలా జరగడం వాళ్లు ఎప్పుడూ వినలేదు! ఒకవేళ ప్రజల్లో ఎవరైనా సందేహించివుంటే, హేళన చేసివుంటే కాసేపట్లోనే వాళ్ల నోళ్లకు తాళంపడివుంటుంది. ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమైంది. గాలులు విపరీతంగా వీస్తుండడంతో గోధుమ చేలు అటూఇటూ ఊగిపోతున్నాయి. ఆ ప్రాంతమంతా ఉరుములు, మెరుపులతో హోరెత్తిపోతోంది. వర్షం మొదలైంది. అప్పుడు ప్రజలు ఎలా స్పందించారు? ‘జనులు యెహోవాకు, సమూయేలుకు చాలా భయపడ్డారు.’ చివరకు తామెంత ఘోరమైన పాపం చేశారో వాళ్లకు అర్థమైంది.—1 సమూ. 12:18, 19.

27. సమూయేలులా విశ్వాసం చూపించేవాళ్లతో యెహోవా ఎలా వ్యవహరిస్తాడు?

27 చెప్పాలంటే, సమూయేలు కాదుగానీ యెహోవా దేవుడే తిరుగుబాటుదారులైన ఆ ప్రజల హృదయాలను కదిలించాడు. నిజానికి, సమూయేలు చిన్నప్పటినుండి వృద్ధుడయ్యేంత వరకు తన దేవుని మీద విశ్వాసం చూపిస్తూ వచ్చాడు. అందుకు యెహోవా తగిన ప్రతిఫలం ఇస్తూ వచ్చాడు. యెహోవా మారలేదు. ఆయన ఇప్పటికీ, సమూయేలులా విశ్వాసం చూపించేవాళ్లకు తోడుగావుంటాడు.

a నాజీరులుగా ఉండేవాళ్లు ఒక ప్రత్యేక ప్రమాణం చేస్తారు. దాని ప్రకారం వాళ్లు ద్రాక్షారసం తాగకూడదు, తమ వెంట్రుకలు కత్తిరించుకోకూడదు. అయితే చాలామంది కొంతకాలంపాటు నాజీరులుగా ఉంటామని ప్రమాణం చేస్తారు. కానీ సమ్సోను, సమూయేలు, బాప్తిస్మమిచ్చు యోహాను వంటి కొందరు జీవితాంతం నాజీరులుగా ఉన్నారు.

b ఆ మందిరం దీర్ఘచతురస్రాకారంలో ఉండేది. అది కర్రల సహాయంతో నిలబెట్టిన ఒక గుడారం. కానీ అది చాలా విలువైన వస్తువులతో అంటే సముద్రవత్సల తోళ్లతో, అందమైన కుట్టుపని చేసిన బట్టలతో, బంగారం లేదా వెండితో పోతపోసిన అమూల్యమైన చెక్కలతో తయారైంది. ఆ మందిరం దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఒక ఆవరణంలో ఉండేది, అందులో బలులు అర్పించడానికి ఒక పెద్ద బలిపీఠం కూడా ఉండేది. కాలం గడిచేకొద్దీ యాజకుల కోసం మందిరం పక్కన కొన్ని గదులు కూడా ఏర్పాటుచేసి ఉంటారు. బహుశా అలాంటి ఒక గదిలోనే సమూయేలు పడుకునివుంటాడు.

c దానికి రెండు ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. మొదటిది, బలి అర్పించే జంతువులలో ఏయే భాగాలను యాజకులు తీసుకోవాలో ధర్మశాస్త్రం స్పష్టంగా తెలియజేసింది. (ద్వితీ. 18:2, 3) కానీ మందిరంలోని చెడ్డ యాజకులు మరో పద్ధతి పాటించేవాళ్లు. మాంసం ఉడుకుతున్నప్పుడు మూడు ముండ్లున్న కొంకిని గుచ్చి దానితోపాటు వచ్చే ఏ మంచి ముక్కనైనా తీసుకురమ్మని యాజకులు తమ పనివాళ్లను పురమాయించేవాళ్లు. రెండవది, బలిపీఠం మీద దహనబలిగా అర్పించడానికి ప్రజలు జంతువులను తీసుకువచ్చినప్పుడు, వాటి కొవ్వును యెహోవాకు అర్పించకముందే వాళ్లను బెదిరించి పచ్చిమాంసాన్ని బలవంతంగా తీసుకురమ్మని ఆ దుష్ట యాజకులు తమ పనివాళ్లను పంపించేవాళ్లు.—లేవీ. 3:3-5; 1 సమూ. 2:13-17.