9వ అధ్యాయం
ఆమె సుబుద్ధితో వ్యవహరించింది
1-3. (ఎ) అబీగయీలు ఇంటిమీదికి ప్రమాదం ముంచుకురావడానికి కారణం ఏమిటి? (బి) సమర్థవంతురాలైన ఈ స్త్రీ గురించి మనం ఏమి నేర్చుకుంటాం?
అబీగయీలు, ఆ యువకుడు భయంతో పరుగెత్తుకు రావడం చూసింది. అతను భయంతో నిలువునా వణికిపోతున్నాడు. అతను ఎందుకు అంతలా భయపడుతున్నాడు? ఓ పెద్ద ప్రమాదం ముంచుకొస్తోంది. వాళ్ల ఇంట్లో మగవాళ్లందర్నీ చంపడానికి దాదాపు 400 మంది సైనికులు అప్పటికే బయలుదేరారు. ఎందుకు?
2 ముంచుకొస్తున్న ఆ ప్రమాదానికి కారణం అబీగయీలు భర్త నాబాలే. అతను క్రూరంగా, నిర్దయగా ప్రవర్తించాడు, అతను ఎప్పుడూ అంతే. కానీ ఈసారి అతను అవమానించింది మామూలు వ్యక్తిని కాదు, దావీదును! నమ్మకస్థులూ సుశిక్షితులూ అయిన యోధులకు ప్రియతమ నాయకుడాయన. బహుశ నాబాలు గొర్రెలను కాసే పనివాడొకడు అబీగయీలు దగ్గరకు వచ్చి జరిగింది చెప్పాడు. నాబాలు ఇంటివాళ్ల మీదకు వస్తున్న ఆ ప్రమాదాన్ని ఆమె తప్పించగలదనే నమ్మకంతోనే అతనలా చెప్పాడు. కానీ అంత సైన్యాన్ని ఒక స్త్రీ ఎలా ఆపగలదు?
అంత సైన్యాన్ని ఒక స్త్రీ ఎలా ఆపగలదు?
3 ముందుగా మనం సమర్థవంతురాలైన ఈ స్త్రీ గురించి కొంత తెలుసుకుందాం. అబీగయీలు ఎవరు? అసలు ఈ కష్టాలన్నిటికీ కారణం ఏమిటి? విశ్వాసంతో ఆమె చేసిన పనినుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
‘సుబుద్ధిగలది, రూపవతి’
4. నాబాలు ఎలాంటివాడు?
4 అబీగయీలు, నాబాలు ఒకరికొకరు సరైన జోడీ కాదు. నాబాలుకు ఆమెకన్నా మంచి భార్య దొరకదు, కానీ అబీగయీలుకు మాత్రం అంతకన్నా చెడ్డ భర్త దొరికే అవకాశం లేదు. అతను చాలా ధనవంతుడు, అందుకేనేమో తాను చాలా ప్రముఖుణ్ణని అనుకునేవాడు. కానీ అతని గురించి అందరూ ఏమనుకునేవాళ్లు? బైబిలు అతని గురించి చెప్పినంత ఘోరంగా మరెవరి గురించీ చెప్పడంలేదు. అతని పేరుకు ‘మోటువాడు’ లేదా ‘మూర్ఖుడు’ అని అర్థం. అతని తల్లిదండ్రులే అతనికి ఆ పేరు పెట్టారో, అతనికున్న అవలక్షణాల వల్ల అతనికి ఆ పేరు వచ్చిందో మనకు తెలీదు. ఏదేమైనా అతను తన పేరుకు తగ్గట్టే ప్రవర్తించేవాడు. నాబాలు ‘మోటువాడు, దుర్మార్గుడు.’ అతను చీటికిమాటికి గొడవలు పెట్టుకునేవాడు, పైగా తాగుబోతు. అతనంటే అందరికీ భయం, అందుకే అతణ్ణి ఎవరూ ఇష్టపడేవాళ్లు కాదు.—1 సమూ. 25:2, 3, 17, 21, 25.
5, 6. (ఎ) అబీగయీలుకు ఎలాంటి విశేష లక్షణాలు ఉన్నాయి? (బి) అంత పనికిమాలినవాణ్ణి అబీగయీలు ఎందుకు పెళ్లిచేసుకుంది?
5 కానీ నాబాలుకు, అబీగయీలుకు భూమికీ ఆకాశానికీ ఉన్నంత తేడా ఉంది. ఆమె పేరుకు “నా తండ్రి నన్ను చూసి సంతోషిస్తున్నాడు” అని అర్థం. అందమైన కూతుర్ని చూసుకుని చాలామంది తండ్రులు గర్వపడుతుంటారు, అయితే జ్ఞానవంతుడైన తండ్రి తన కూతురు మంచి మనసున్నదైతే ఇంకా ఎక్కువ సంతోషిస్తాడు. చాలావరకు, అందంగా ఉన్నవాళ్లు బుద్ధి, వివేచన, ధైర్యం, విశ్వాసం వంటి సుగుణాలను అలవర్చుకోవడం ఎందుకు అవసరమో అర్థం చేసుకోరు. అబీగయీలు అలా కాదు. బైబిలు ఆమె సుబుద్ధిని, అందాన్ని పొగడుతోంది.—1 సమూయేలు 25:3 చదవండి.
6 మరి, అంత తెలివైన అమ్మాయి అంత పనికిమాలినవాణ్ణి ఎందుకు చేసుకుందని కొంతమంది అనుకుంటారేమో. అయితే, నాబాలు ఆస్తిపాస్తులు చూసి అబీగయీలు తల్లిదండ్రులు ఈ పెళ్లి చేసివుంటారా లేక పేదరికాన్ని తట్టుకోలేక ఈ పెళ్లికి ఒప్పుకొనివుంటారా? ఏదేమైనా నాబాలుకున్న డబ్బు అతణ్ణి ఒక మంచి భర్తను చేయలేకపోయింది.
7. (ఎ) పిల్లలు వివాహం పట్ల సరైన వైఖరిని అలవర్చుకునేలా సహాయం చేయాలంటే తల్లిదండ్రులు ఏమి చేయకూడదు? (బి) అబీగయీలు ఏమని నిర్ణయించుకుంది?
7 వివాహం పట్ల సరైన వైఖరిని అలవర్చుకునేలా జ్ఞానవంతులైన తల్లిదండ్రులు తమ పిల్లలకు సహాయం చేస్తారు. డబ్బుకు ఆశపడి పెళ్లి చేసుకోమని వాళ్లని బలవంతం చేయరు. అలాగే భార్యాభర్తలుగా తమ బాధ్యతలను నిర్వర్తించేంత పరిణతి, వయసు రాకముందే పెళ్లి చేసుకోమని పిల్లలను తొందరపెట్టరు. (ప్రసం. 5:2-5) అయితే అబీగయీలుకు ఆ విషయాల గురించి ఆలోచించే అవకాశం దొరికివుండదు. ఆమె నాబాలును పెళ్లి చేసుకోవడానికి కారణం ఏదైనా, ఇప్పుడు ఆమె నాబాలు భార్య కాబట్టి ఎన్ని కష్టాలొచ్చినా మంచి భార్యగా ఉండాలని నిర్ణయించుకుంది.
‘అతడు వాళ్లతో కఠినంగా మాట్లాడాడు’
8. నాబాలు ఎవర్ని అవమానించాడు? అది చాలా బుద్ధితక్కువ పనని మీరెందుకు అంటారు?
8 నాబాలు ఇప్పుడు చేసిన పనివల్ల అబీగయీలుకు మరో కష్టం వచ్చిపడింది. అతను దావీదంతటివాణ్ణి అవమానించాడు. దావీదు యెహోవాకు నమ్మకమైన సేవకుడు. సౌలు తర్వాత రాజుగా ఉండడానికి దేవుడు ఆయనను ఎంచుకున్నాడని చూపించడానికి సమూయేలు ప్రవక్త ఆయనను అభిషేకించాడు. (1 సమూ. 16:1, 2, 11-13) అసూయతో తన ప్రాణాలు తీయాలని చూస్తున్న సౌలు నుండి పారిపోతూ, దావీదు తన 600 మంది నమ్మకస్థులైన యోధులతో అరణ్యంలో తలదాచుకున్నాడు.
9, 10. (ఎ) దావీదు, ఆయన మనుష్యులు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జీవించారు? (బి) వాళ్లు చేస్తున్న దానిపట్ల నాబాలు ఎందుకు కృతజ్ఞత చూపించి ఉండాల్సింది? (10వ పేరా అధస్సూచి కూడా చూడండి.)
9 నాబాలు మాయోనులో ఉండేవాడు, అయితే దగ్గర్లోని కర్మెలులో పని చేసుకునేవాడు. a బహుశా, అతనికి అక్కడ భూములు ఉండివుంటాయి. ఆ పట్టణాల్లో గొర్రెలకు మంచి మేత దొరికే పచ్చికబయళ్లున్న ఎత్తైన ప్రాంతాలు ఉండేవి. నాబాలుకు కూడా 3,000 గొర్రెలు ఉండేవి. ఆ చుట్టుపక్కలంతా నిస్సారమైన భూమే. దక్షిణాన పారాను అరణ్యం ఉంది. తూర్పున ఉన్న ఉప్పు సముద్రం (ఇప్పటి వాడుకలో మృత సముద్రం) దగ్గరికి వెళ్లే మార్గంలో లోయలు, గుహలు ఉన్న బంజరు భూములు ఉండేవి. దావీదు, ఆయన మనుషులు వేటాడి ఆహారాన్ని సంపాదించుకుంటూ, ఎన్నో కష్టాలుపడుతూ ఈ ప్రాంతాల్లోనే ఉండేవాళ్లు. ధనవంతుడైన నాబాలు కోసం పనిచేసే గొర్రెల కాపరులు తరచూ అక్కడే వాళ్లకు ఎదురుపడుతుండేవాళ్లు.
10 ఎంతో కష్టపడి పనిచేసే ఆ సైనికులు గొర్రెల కాపరులతో ఎలా ఉండేవాళ్లు? వాళ్ల మందల్లో నుండి అప్పుడప్పుడు ఒక గొర్రెను సునాయాసంగా ఎత్తుకెళ్లిపోయి ఉండగలిగేవాళ్లే. కానీ వాళ్లు అలా చేయకుండా నాబాలు మందలకు, పనివాళ్లకు ఎలాంటి ఆపదా రాకుండా చూసుకున్నారు. (1 సమూయేలు 25:15, 16 చదవండి.) సాధారణంగా గొర్రెలకు, గొర్రెల కాపరులకు ఎన్నో ప్రమాదాలు పొంచి ఉండేవి, క్రూర జంతువులు తరచూ దాడి చేసేవి. ఇశ్రాయేలు దక్షిణ సరిహద్దు చాలా దగ్గర్లో ఉండేది కాబట్టి, వేరే ప్రాంతాల నుండి వచ్చే గజదొంగలు తరచూ దాడిచేసేవాళ్లు. b
11, 12. (ఎ) నాబాలుతో మాట్లాడాల్సిన మాటల్ని ఎంచుకుంటున్నప్పుడు దావీదు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడు? నాబాలంటే గౌరవముందని ఎలా చూపించాడు? (బి) దావీదు చెప్పి పంపిన మాటలకు నాబాలు స్పందించిన తీరులో తప్పేమిటి?
11 ఆ అరణ్యంలో వాళ్లందరికీ ఆహారం సమకూర్చడం పెద్ద పనే. అందుకే దావీదు ఒకరోజు, సహాయం కోసం పదిమంది మనుషులను నాబాలు దగ్గరికి పంపించాడు. దావీదు బాగా ఆలోచించాకే అలా చేశాడు. అది గొర్రెల బొచ్చు కత్తిరించే సమయం, ఆ సమయంలో సాధారణంగా అందరూ ధారాళంగా ఇస్తూ పండుగ జరుపుకుంటారు. వాళ్లు నాబాలుతో చెప్పాల్సిన మాటల్ని కూడా దావీదే జాగ్రత్తగా ఎంపిక చేశాడు. నాబాలు మీద గౌరవంతో, దావీదు మర్యాదపూర్వకంగా ఉండే పదాలను ఎంచుకున్నాడు. నాబాలు వయసును గౌరవిస్తూ ఆయన తనను తాను “నీ కుమారుడైన దావీదు” అని కూడా చెప్పుకున్నాడు. మరి నాబాలు ఎలా స్పందించాడు?—1 సమూ. 25:5-8.
12 అతడు కోపంతో ఊగిపోయాడు. మొదటి పేరాలో మనం చూసిన యువకుడు అబీగయీలుతో చెప్పినట్లుగా ‘అతడు వాళ్లతో కఠినంగా మాట్లాడాడు.’ పిసినిగొట్టు నాబాలు తన రొట్టెలు, నీళ్లు, మాంసం చాలా విలువైనవని వాళ్ల మీద గట్టిగా అరిచాడు. దావీదును పనికిరాని వాడని అవమానిస్తూ, యజమానిని విడిచి పారిపోయిన దాసునితో ఆయనను పోల్చాడు. నాబాలు కూడా, దావీదును ద్వేషించిన సౌలులాగే ఆలోచించివుంటాడు. ఆ ఇద్దరూ దావీదును యెహోవా చూసినట్లు చూడలేదు. దేవుడు దావీదును ప్రేమించాడు. యెహోవా దావీదును తిరుగుబాటు చేసిన దాసునిగా చూడలేదు కానీ, ఇశ్రాయేలీయులను ఏలబోయే రాజుగా చూశాడు.—1 సమూ. 25:10, 11, 14.
13. (ఎ) నాబాలు చేసిన అవమానానికి దావీదు మొదట్లో ఎలా స్పందించాడు? (బి) యాకోబు 1:20లోని సూత్రం, దావీదు స్పందించిన తీరు గురించి మనకు ఏమి తెలియజేస్తోంది?
13 దావీదు పంపిన మనుషులు తిరిగొచ్చి జరిగినదంతా చెప్పినప్పుడు దావీదుకు పట్టరానంత కోపం వచ్చింది. “మీరందరు మీ కత్తులను ధరించుకొనుడి” అని ఆజ్ఞాపించాడు. దావీదు కూడా ఆయుధాలను ధరించి, తన మనుషుల్లో 400 మందిని తీసుకుని బయలుదేరాడు. నాబాలు ఇంట్లోని మగవాళ్లందర్నీ మట్టుపెడతానని శపథం చేశాడు. (1 సమూ. 25:12, 13, 21, 22) దావీదుకు కోపం రావడం సబబే, కానీ ఆయన ఆ కోపాన్ని చూపించాలనుకున్న తీరు మాత్రం తప్పు. “నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు” అని బైబిలు చెబుతోంది. (యాకో. 1:20) మరి అబీగయీలు తన ఇంటివాళ్లను ఎలా కాపాడగలిగింది?
“నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక”
14. (ఎ) నాబాలు చేసిన తప్పును సరిదిద్దడానికి అబీగయీలు ముందు ఎలాంటి చర్య తీసుకుంది? (బి) నాబాలుకు, అబీగయీలుకు మధ్య ఉన్న తేడా నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు? (అధస్సూచి కూడా చూడండి.)
14 జరిగిన తప్పును సరిదిద్దడానికి అబీగయీలు అప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టిందని మనం తెలుసుకున్నాం. తన భర్తలా కాకుండా ఆమె వినడానికి మొగ్గుచూపింది. విషయాన్ని నాబాలుకు చెప్పినా లాభమేమీ ఉండదనే ఉద్దేశంతో పనివాడు ఇలా అన్నాడు: “మన యజమానుడు బహు పనికిమాలినవాడు, ఎవనిని తనతో మాటలాడనీయడు.” c (1 సమూ. 25:17) నాబాలు తన గురించి తాను ఎక్కువగా ఊహించుకోవడం వల్ల ఎవరి మాటా వినడానికి ఇష్టపడేవాడు కాదు. నేడు కూడా చాలామందిలో అలాంటి అహంకారం కనిపిస్తోంది. అయితే అబీగయీలు అలాంటిది కాదని తెలుసు కాబట్టే ఆ పనివాడు సమస్యను పరిష్కరించమని ఆమెను అడగడానికి వచ్చాడు.
నాబాలులా కాకుండా అబీగయీలు వినడానికి మొగ్గుచూపింది
15, 16. (ఎ) సామెతల గ్రంథంలోని గుణవతియైన భార్యలా ఉన్నట్లు అబీగయీలు ఎలా చూపించింది? (బి) కుటుంబ శిరస్సుగా భర్తకున్న అధికారాన్ని ఆమె ధిక్కరించలేదని ఎందుకు చెప్పవచ్చు?
15 అబీగయీలు ఆలోచించుకుని వెంటనే పనులు మొదలుపెట్టింది. ఆమె త్వరగా బయలుదేరిందని బైబిలు చెబుతోంది. ఆమె త్వరగా చర్య తీసుకుందనే విషయం ఈ ఒక్క వృత్తాంతంలోనే నాలుగుసార్లు ఉంది. దావీదు, ఆయన మనుషులు తినడానికి ఆమె రొట్టెలు, వండిన మాంసం, వేయించిన ధాన్యం, ద్రాక్షారసం, ఎండిన ద్రాక్ష పండ్ల గెలలు, అంజూరపు అడలు తీసుకువెళ్లింది. సామెతల గ్రంథంలోని గుణవతియైన భార్యలా అబీగయీలుకు తన ఇంట్లో ఏమేం ఉన్నాయో బాగా తెలుసని, ఇంటి బాధ్యతలన్నీ తనే స్వయంగా చూసుకునేదని మనకు అర్థమౌతోంది. (సామె. 31:10-31) ఆమె వాటన్నిటినీ పనివాళ్లకు ఇచ్చి పంపి, వాళ్ల వెనక తాను కూడా వెళ్లింది. అయితే ఆమె తన భర్త “నాబాలుతో ఏమియు చెప్పక” బయలుదేరిందని బైబిలు చెబుతోంది.—1 సమూ. 25:18, 19.
16 అంటే అబీగయీలు, కుటుంబ శిరస్సుగా తన భర్తకున్న అధికారాన్ని ధిక్కరించిందని అర్థమా? కాదు. యెహోవా అభిషేకించిన సేవకుణ్ణి నాబాలు అవమానించాడని గమనించండి. నాబాలు చేసిన పని వల్ల, కల్లాకపటం ఎరుగని అతని ఇంట్లోవాళ్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లింది. ఒకవేళ అబీగయీలు వెంటనే చేయాల్సింది చేసివుండకపోతే తన భర్తతో పాటు తానూ తప్పు చేసినట్లయ్యేది. ఈ విషయంలో, ఆమె తన భర్తకన్నా దేవునికే ఎక్కువగా లోబడాలి.
17, 18. దావీదు ఎదురవ్వగానే అబీగయీలు ఏమి చేసింది? ఏమి అంది? ఆమె మాటలు ఎందుకు శక్తిమంతంగా పని చేశాయి?
17 దారిలో దావీదు, ఆయన మనుషులు అబీగయీలుకు ఎదురయ్యారు. ఆమె వాళ్లను చూసిన వెంటనే గాడిద మీద నుండి దిగి దావీదుకు సాష్టాంగ నమస్కారం చేసింది. (1 సమూ. 25:20, 23) తన భర్త మీద, ఇంట్లోవాళ్ల మీద దయ చూపించమని వేడుకుంటూ దావీదుకు అన్ని విషయాలూ వివరించింది. ఆమె మాటలు ఎందుకు శక్తిమంతంగా పని చేశాయి?
18 తప్పును తన మీద వేసుకుని, జరిగినదానికి దావీదును క్షమాపణ కోరింది. తన భర్త, పేరుకు తగ్గట్టే మోటువాడని, మూర్ఖుడని అంటూ అలాంటివాణ్ణి శిక్షించడం దావీదుకే అవమానకరం అన్నట్లు మాట్లాడింది. దావీదు “యెహోవా యుద్ధములను” చేస్తున్నాడని, ఆయనను దేవుడే నియమించాడని తాను నమ్ముతున్నట్లు చెప్పింది. ‘యెహోవా నిన్ను ఇశ్రాయేలీయులమీద అధిపతిగా నిర్ణయించాడు’ అని చెబుతూ దావీదుకు రాజ్యాధికారం ఇస్తానని యెహోవా ఆయనకు చేసిన ప్రమాణం గురించి తనకు తెలుసని కూడా అంది. అంతేకాకుండా, ఆయన మీదకు రక్తాపరాధం తీసుకొచ్చే లేదా తర్వాతి కాలంలో ఆయనకు “మనోవిచారం” కలిగించే, అంటే తప్పు చేశాననే బాధను మిగిల్చే పనేదీ చేయవద్దని దావీదును బ్రతిమాలుకుంది. (1 సమూయేలు 25:24-31 చదవండి.) ఆమె దయగా, మనసును హత్తుకునేలా మాట్లాడింది.
19. అబీగయీలు మాటలు విని దావీదు ఏమన్నాడు? ఆమెను ఎందుకు మెచ్చుకున్నాడు?
19 దానికి దావీదు ఏమన్నాడు? అబీగయీలు తెచ్చినవి తీసుకుని దావీదు ఆమెతో ఇలా అన్నాడు: “నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. నేను పగ తీర్చుకొనకుండను ఈ దినమున ప్రాణము తీయకుండను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువు గాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక.” వెంటనే బయలుదేరి ధైర్యంగా తనను కలుసుకోవడానికి వచ్చినందుకు దావీదు ఆమెను మెచ్చుకున్నాడు. తన మీదికి రక్తాపరాధం రాకుండా ఆమె ఆపిందని అన్నాడు. ఆయన వినయంగా, “నీ మాటలు నేను ఆలకించితిని” అన్నాడు. ఆ తర్వాత, “సమాధానముగా నీ యింటికి పొమ్ము” అని ఆమెకు ధైర్యం చెప్పాడు.—1 సమూ. 25:32-35.
“నా యేలినవాని దాసురాలను”
20, 21. (ఎ) భర్త దగ్గరకు తిరిగి రావడానికి అబీగయీలు చూపిన సంసిద్ధత మీకు ఎందుకు నచ్చింది? (బి) నాబాలుతో ఎప్పుడు మాట్లాడాలో నిర్ణయించుకునే విషయంలో అబీగయీలు ఎలా ధైర్యాన్ని, తెలివిని చూపించింది?
20 దావీదు దగ్గర నుండి బయల్దేరిన తర్వాత అబీగయీలు ఆయన గురించి ఆలోచించకుండా ఉండలేకపోయింది. నమ్మకస్థుడు, దయామయుడు అయిన దావీదుకు, క్రూరుడైన తన భర్తకు ఎంత తేడా ఉందో ఆమె గమనించేవుంటుంది. అయితే ఆమె వాటి గురించే ఆలోచిస్తూ ఉండిపోలేదు. ‘అబీగయీలు తిరిగి నాబాలు వద్దకు వచ్చింది’ అని బైబిలు చెబుతోంది. కాబట్టి ఆమె ఎప్పటిలాగే భార్యగా తాను చేయగలిగినదంతా చేయడానికి తన భర్త దగ్గరకు తిరిగి వచ్చింది. దావీదుకు, ఆయన మనుషులకు తాను ఏమేమి ఇచ్చిందో ఆమె నాబాలుకు చెప్పాలి. నాబాలుకు తెలుసుకునే హక్కుంది. తప్పిన ఘోర ప్రమాదం గురించి అతను వేరెవరి దగ్గరో తెలుసుకునేకన్నా భార్యే ముందుగా చెబితే కనీసం ఆ గౌరవమన్నా అతనికి ఉంటుంది. అయితే ఆమె ఇప్పుడు అతనికి ఆ విషయం చెప్పలేదు. అతను అప్పటికి రాజులా విందు చేసుకుంటూ, పీకలవరకు తాగి మత్తులో ఉన్నాడు.—1 సమూ. 25:36.
21 ఆమె మళ్లీ ధైర్యంగా, తెలివిగా వ్యవహరించింది. ఎలాగంటే, నాబాలు మత్తు దిగేవరకు అంటే మరుసటి రోజు వరకు ఆగింది. అప్పుడైతేనే నాబాలు ఆమె చెబుతున్నది అర్థం చేసుకునే స్థితిలో ఉంటాడు. కాకపోతే అతని కోపం వల్ల ఆమెకు ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయినా ఆమె జరిగినదంతా అతనికి చెప్పింది. అతను కోపంతో రెచ్చిపోతాడని, బహుశా కొడతాడని కూడా ఆమె అనుకొనివుంటుంది. కానీ ఆమె చెప్పింది విన్నాక అతను కూర్చున్న చోటే బిగుసుకుపోయాడు.—1 సమూ. 25:37.
22. నాబాలుకు ఏమైంది? గృహ హింసకు, వేధింపులకు సంబంధించి దాన్నుండి మనం ఏమి నేర్చుకుంటాం?
22 అతనికి ఏమైంది? ‘గుండెపగిలి, రాయిలా బిగుసుకుపోయాడు.’ బహుశ అతనికి గుండెపోటు వచ్చివుంటుంది. దాదాపు పది రోజుల తర్వాత అతను చనిపోయాడు. కానీ అతను చనిపోయింది అనారోగ్యం వల్ల మాత్రమే కాదు. ఎందుకంటే “యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను” అని బైబిలు చెబుతోంది. (1 సమూ. 25:38) ఆ న్యాయమైన తీర్పు వల్ల, పీడకలలాంటి ఆమె వైవాహిక జీవితానికి తెరపడింది. ఈ రోజుల్లో యెహోవా అలా అద్భుతంగా తీర్పుతీర్చకపోయినా నేటి గృహ హింసను, వేధింపులను ఆయన గమనించకుండా ఉండడనే హామీని ఆ సంఘటన ఇస్తోంది. ఆయన అనుకున్న సమయంలో, తప్పకుండా న్యాయం జరిగేలా చేస్తాడు.—లూకా 8:17 చదవండి.
23. అబీగయీలుకు ఇంకా ఏ ఆశీర్వాదం దక్కింది? దావీదుకు భార్యనౌతానని తెలిసిన తర్వాత కూడా తను మారిపోలేదని ఆమె ఎలా చూపించింది?
23 క్రూరుడైన భర్త నుండి అబీగయీలుకు విముక్తి దొరికింది. అంతేకాదు, ఆమెకు మరో ఆశీర్వాదం కూడా దక్కింది. నాబాలు చనిపోయాడని తెలిసిన తర్వాత, తనను పెళ్లి చేసుకోమని అడగడానికి దావీదు ఆమె దగ్గరకు మనుషులను పంపించాడు. దానికి ఆమె “నా యేలినవాని సేవకుల కాళ్లు కడుగుటకు నా యేలినవాని దాసురాలనగు నేను సిద్ధముగానున్నాను” అని చెప్పింది. దావీదుకు భార్యనౌతానని తెలిసిన తర్వాత కూడా ఆమె మారిపోలేదు. అయితే ఆయన సేవకులకు సేవకురాలిగా ఉంటానంది. ఈసారి కూడా ఆమె వెంటనే బయలుదేరి దావీదు దగ్గరకు ప్రయాణమైందని బైబిలు చెబుతోంది.—1 సమూ. 25:39-42.
24. కొత్తగా మొదలైన అబీగయీలు జీవితంలో ఎలాంటి సమస్యలు తలెత్తాయి? అయితే ఆమె భర్త దావీదు, ఆమె దేవుడు యెహోవా ఆమెను ఎలా చూశారు?
24 అక్కడితో ఆమె కథ సుఖాంతమైందని అనలేం. దావీదుతో అబీగయీలు జీవితం ఎప్పుడూ సాఫీగా సాగుతుందని కూడా చెప్పలేం. దావీదుకు అప్పటికే అహీనోయముతో పెళ్లయింది. అప్పట్లో దేవుడు బహుభార్యాత్వాన్ని అనుమతించినా, నమ్మకస్థులైన స్త్రీలకు దానివల్ల ప్రత్యేకమైన సమస్యలు తలెత్తేవి. దానికితోడు దావీదు అప్పటికింకా రాజు కాలేదు. ఆయన రాజుగా యెహోవాను సేవించడం మొదలుపెట్టే లోపల ఇంకా ఎన్నో అడ్డంకులు, సమస్యలు తప్పకుండా వస్తాయి. కానీ అబీగయీలు జీవితాంతం దావీదుకు సహాయం చేస్తూ ఆయనకు తోడుగా నిలిచింది. కొంతకాలానికి ఆమెకొక కుమారుడు పుట్టాడు. తనను గౌరవించి కాపాడే భర్త దొరికాడని ఆమె గ్రహించింది. ఒక సందర్భంలోనైతే, ఆమెను ఎత్తుకుపోయిన దుండగుల చేతుల్లో నుండి దావీదు ఆమెను విడిపించి తీసుకొచ్చాడు. (1 సమూ. 30:1-19) చెప్పాలంటే దావీదు సుబుద్ధి, ధైర్యం, నమ్మకత్వం ఉన్న అలాంటి స్త్రీలను ప్రేమించి గౌరవించే యెహోవా దేవునిలా ప్రవర్తించాడు.
a ఇది ఉత్తరాన ఎంతో దూరంలోవున్న, ఏలీయా ప్రవక్త బయలు ప్రవక్తలతో తలపడిన ప్రఖ్యాత కర్మెలు పర్వతం కాదు. (10వ అధ్యాయం చూడండి.) ఈ కర్మెలు, పారాను అరణ్యం చివరన ఉన్న ఒక పట్టణం.
b ఆ ప్రాంతంలోని భూస్వాములను, వాళ్ల మందలను కాపాడడం యెహోవా దేవునికి సేవ చేసినట్లేనని దావీదు అనుకుని ఉండవచ్చు. ఆ రోజుల్లో అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల సంతతి ఆ ప్రాంతంలో నివసించాలని యెహోవా ఉద్దేశించాడు. కాబట్టి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి వచ్చే వేరే ప్రాంతాల వాళ్లనుండి, దోపిడీ దొంగల నుండి దాన్ని కాపాడడం ఒక విధంగా పరిశుద్ధ సేవగా పరిగణించేవాళ్లు.
c నిజానికి ఆ యువకుడు పలికిన మాటలకు “బెలియాలి కుమారుడు (పనికిరానివాడు)” అని అర్థం. వేరే బైబిలు అనువాదాలు నాబాలు ఎలాంటివాడో వివరిస్తూ “అతను ఎవరి మాటా వినడు” అందుకే “అతనితో మాట్లాడడం వ్యర్థం” అని చెబుతున్నాయి.