3వ అధ్యాయం
విశ్వాసమున్న వాళ్లందరికీ తండ్రి
1, 2. నోవహు కాలం తర్వాత లోకం ఎలా మారుతూ వచ్చింది? అది చూసిన అబ్రాహాముకు ఏమనిపించింది?
అబ్రాహాము ఊరు పట్టణంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు, అది ఆయన స్వస్థలం. a ఉన్నట్టుండి ఆయన చూపు జిగరాట్ (పిరమిడ్‌లాంటి ఆలయం) మీద పడింది. ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. అక్కడనుండి పెద్దపెద్దగా అరుపులు వినిపిస్తున్నాయి, పొగ పైకి లేస్తూవుంది. పూజారులు ఎప్పటిలాగే ఆ రోజు కూడా చంద్ర దేవునికి అర్పణలు అర్పిస్తున్నారు. అబ్రాహాము కనుబొమ్మలు చిట్లిస్తూ ముఖం పక్కకు తిప్పుకున్నాడు. ఆ పట్టణం విగ్రహారాధనలో ఎంతగా మునిగితేలుతుందో ఆలోచిస్తూ, జనసంచారంతో కిక్కిరిసిన వీధులగుండా ఆయన ఇంటిముఖం పట్టాడు. నోవహు కాలం తర్వాత అబద్ధ ఆరాధన ఎంత పెచ్చుపెరిగిపోయిందో!
2 నోవహు చనిపోయిన రెండేళ్లకు అబ్రాహాము పుట్టాడు. జలప్రళయం తర్వాత నోవహు, ఆయన కుటుంబం ఓడలో నుండి బయటకు వచ్చినప్పుడు, నోవహు యెహోవా దేవునికి దహనబలి అర్పించాడు. అప్పుడు యెహోవా ఆకాశంలో వర్షధనుస్సు కనిపించేలా చేశాడు. (ఆది. 8:20; 9:12-14) ఆ కాలంలో అందరూ యెహోవానే ఆరాధించారు. కానీ, నోవహు నుండి పదో తరం వాడైన అబ్రాహాము కాలానికి వచ్చేసరికి స్వచ్ఛారాధన చేసేవాళ్ల సంఖ్య క్రమేణా తగ్గుతూ వచ్చింది. ఎక్కడ చూసినా అబద్ధ దేవుళ్లను ఆరాధించే ప్రజలే. అబ్రాహాము తండ్రి తెరహు కూడా విగ్రహారాధన చేసేవాడు, బహుశా వాటిని తయారు కూడా చేసివుంటాడు.—యెహో. 24:2.
అంత విశ్వాసాన్ని అబ్రాహాము ఎలా చూపించాడు?
3. కాలం గడుస్తుండగా, అబ్రాహాముకున్న ఏ లక్షణం స్పష్టంగా కనిపిస్తూ వచ్చింది? దాన్నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
3 కానీ అబ్రాహాము వాళ్లలా లేడు. కాలం గడుస్తుండగా ఆయన అందరిలోకి ఇంకా ప్రత్యేకంగా కనిపించాడు. దానికి కారణం యెహోవా మీద ఆయనకున్న విశ్వాసమే. అందుకే ఆ తర్వాత, దేవుని ప్రేరణతో అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు: ‘నమ్మిన [“విశ్వాసమున్న,” NW] వాళ్లందరికీ ఆయన తండ్రి.’ (రోమా. 4:11) అబ్రాహాము విశ్వాసం ఎందుకంత దృఢమౌతూ వచ్చిందో చూద్దాం. అప్పుడు మనం కూడా మన విశ్వాసాన్ని ఎలా బలపర్చుకోవచ్చో తెలుస్తుంది.
జలప్రళయం తర్వాతి కాలంలో యెహోవా ఆరాధన
4, 5. యెహోవా గురించి అబ్రాహాముకు ఎవరు నేర్పించివుంటారు? అలాగని మనం ఎందుకు చెప్పవచ్చు?
4 అబ్రాహాముకు యెహోవా గురించి ఎవరు నేర్పించారు? ఆ కాలంలో కూడా భూమ్మీద యెహోవాను నమ్మకంగా ఆరాధించినవాళ్లు ఉన్నారని మనకు తెలుసు. వాళ్లలో షేము ఒకడు. నోవహు ముగ్గురు కుమారుల్లో షేము పెద్దవాడు కాకపోయినా బైబిల్లో ఎక్కువసార్లు ఆయన పేరే ముందు కనిపిస్తుంది. షేము ఎంతో విశ్వాసం చూపించాడు కాబట్టే ఆయనకు ఆ గౌరవం దక్కివుంటుంది. b జలప్రళయం వచ్చిన కొంతకాలానికి నోవహు యెహోవాను “షేము దేవుడు” అని అన్నాడు. (ఆది. 9:26) ఎందుకంటే షేము యెహోవా పట్ల, స్వచ్ఛారాధన పట్ల ఎంతో గౌరవం చూపించాడు.
5 అబ్రాహాముకు షేము తెలుసా? అవుననే చెప్పవచ్చు. అబ్రాహాము బాలుడిగా ఉన్నప్పుడు, దాదాపు నాలుగు శతాబ్దాల మానవ చరిత్రను కళ్లారా చూసిన పూర్వీకుడు ఒకరు ఇంకా బ్రతికే ఉన్నారని తెలుసుకొని ఆయన ఎంత సంబరపడి ఉంటాడో కదా! జలప్రళయం ముందున్న దుష్టత్వం, జలప్రళయంతో యెహోవా భూమిని శుభ్రం చేయడం షేము చూశాడు. భూమ్మీద అప్పుడప్పుడే జనాంగాలు విస్తరించడాన్ని, అలాగే నిమ్రోదు కాలంలో బాబెలు గోపురం దగ్గర తిరుగుబాటు జరిగిన చీకటి రోజులను కూడా ఆయన చూశాడు. నమ్మకస్థుడైన షేము ఆ తిరుగుబాటుదారులకు దూరంగా ఉన్నాడు. అందుకే, గోపురాన్ని నిర్మిస్తున్నవాళ్ల భాషను యెహోవా తారుమారు చేసినప్పుడు షేము ఇంటివాళ్ల భాష మారలేదు. వాళ్లు మొదటినుండీ మానవులు మాట్లాడుతూ వచ్చిన భాషనే మాట్లాడారు. అబ్రాహాము కూడా ఆ కుటుంబానికి చెందినవాడే. కాబట్టి చిన్నప్పటినుండి ఆయనకు షేము మీద ఖచ్చితంగా ఎంతో గౌరవం ఉండివుంటుంది. పైగా, అబ్రాహాము వృద్ధుడయ్యేంత వరకు షేము బ్రతికే ఉన్నాడు. కాబట్టి ఆయనే యెహోవా గురించి అబ్రాహాముకు నేర్పించివుంటాడు.
6. (ఎ) జలప్రళయం నేర్పిన గొప్ప పాఠం అబ్రాహాము మనసులో బలంగా నాటుకుపోయిందని ఎలా చెప్పవచ్చు? (బి) పెళ్లయిన తర్వాత అబ్రాహాము, శారాల జీవితం ఎలా సాగింది?
6 జలప్రళయం నేర్పిన గొప్ప పాఠం అబ్రాహాము మనసులో బలంగా నాటుకుపోయింది. ఆయన కూడా నోవహులాగే దేవునితో నడవడానికి గట్టిగా కృషిచేశాడు. విగ్రహారాధనకు దూరంగా ఉన్నాడు. ఆ పట్టణస్థులందర్లోకి ప్రత్యేకంగా కనిపించాడు. బహుశా తన ఇంటివాళ్లలో కూడా ప్రత్యేకంగా కనిపించివుంటాడు. అయితే జీవితంలో ఆయనకు ఒక మంచి తోడు దొరికింది. ఆయన శారాను పెళ్లి చేసుకున్నాడు. c ఆమె చాలా అందగత్తె. అంతేకాదు, యెహోవా మీద దృఢ విశ్వాసమున్న స్త్రీ కూడా. పిల్లలు లేకపోయినా వాళ్లిద్దరూ కలిసి సంతోషంగా యెహోవాను సేవించారు. అబ్రాహాము అన్న చనిపోవడంతో ఆయన కుమారుడైన లోతును వాళ్లు దత్తత తీసుకున్నారు.
7. క్రీస్తు అనుచరులు అబ్రాహామును ఎలా ఆదర్శంగా తీసుకుంటారు?
7 అబ్రాహాము ఎప్పుడూ యెహోవాను విడిచి ఊరు పట్టణస్థుల్లా విగ్రహారాధన చేయలేదు. ఆయన, శారా ఆ సమాజం నుండి వేరుగా ఉండడానికే ఇష్టపడ్డారు. నిజమైన విశ్వాసం పెంపొందించుకోవాలంటే మనమూ అలాంటి స్ఫూర్తినే చూపించాలి, వేరుగా ఉండడానికి ఇష్టపడాలి. తన అనుచరులు ‘లోకసంబంధులు కారని’ అందుకే లోకం వాళ్లను ద్వేషిస్తుందని యేసు చెప్పాడు. (యోహాను 15:19 చదవండి.) మీరు యెహోవా సేవ చేయాలని నిర్ణయించుకున్నందువల్ల కుటుంబ సభ్యులకు, సమాజానికి దూరమయ్యారని మీకు ఎప్పుడైనా బాధ అనిపించిందా? అయితే, మీరు ఒంటరి వాళ్లు కాదు. దేవునికి నమ్మకంగా సేవ చేసిన అబ్రాహాము, శారాలు నడిచిన మంచి బాటలోనే మీరూ నడుస్తున్నారని గుర్తుంచుకోండి.
‘నీవు నీ దేశాన్ని విడిచి బయలుదేరు’
8, 9. (ఎ) మరపురాని ఏ అనుభవం అబ్రాహాముకు ఎదురైంది? (బి) అబ్రాహాము యెహోవా నుండి ఏ సందేశం అందుకున్నాడు?
8 ఒకరోజు అబ్రాహాముకు మర్చిపోలేని అనుభవం ఎదురైంది. యెహోవా దేవుని నుండి ఆయన ఒక సందేశాన్ని అందుకున్నాడు! ఆయన దాన్ని ఎలా అందుకున్నాడో బైబిలు వివరంగా చెప్పడం లేదు కానీ, “మహిమగల దేవుడు” నమ్మకస్థుడైన అబ్రాహాముకు కనిపించాడని మాత్రం చెబుతుంది. (అపొస్తలుల కార్యములు 7:2, 3 చదవండి.) బహుశా యెహోవా తరఫున ఒక దూత ప్రత్యక్షమైనప్పుడు, విశ్వసర్వాధిపతి అత్యంత గొప్ప మహిమను అబ్రాహాము లీలగా చూసివుంటాడు. సజీవుడైన దేవునికి, చుట్టుపక్కలవాళ్లు ఆరాధించే నిర్జీవ విగ్రహాలకు ఉన్న తేడాను చూసి అబ్రాహాము ఎంత ఆశ్చర్యపోయి ఉంటాడో!
9 అబ్రాహాము యెహోవా నుండి ఈ సందేశం అందుకున్నాడు: “నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి, నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్ము.” అబ్రాహాము ఖచ్చితంగా ఎక్కడికి వెళ్లాలో యెహోవా చెప్పలేదు, కానీ ఆయన వెళ్లాల్సిన దేశాన్ని చూపిస్తానని మాత్రం చెప్పాడు. అయితే అబ్రాహాము ముందుగా తన స్వదేశాన్ని, బంధువుల్ని విడిచి బయల్దేరాలి. ప్రాచీన మధ్య ప్రాచ్య సంస్కృతుల్లో, కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాళ్లు. బంధువుల్ని విడిచి దూరంగా వెళ్లాల్సిరావడం ఓ పెద్ద శాపమని అనుకునేవాళ్లు, కొందరైతే దానికన్నా చావే నయమనుకునేవాళ్లు!
10. ఊరు పట్టణం విడిచివెళ్తున్నప్పుడు అబ్రాహాము, శారాలు ఎలాంటి త్యాగాలు చేయాల్సివచ్చింది?
10 ఊరు పట్టణంలోని వసతులను విడిచివెళ్లడం అబ్రాహాముకు నిజంగా ఎంతో కష్టమైవుంటుంది. ఎందుకంటే, ఊరు ఎప్పుడూ సందడిగా ఉండే సంపన్న నగరమని రుజువులు చూపిస్తున్నాయి. (“ అబ్రాహాము, శారాలు వదిలివెళ్లిన పట్టణం” అనే బాక్సు చూడండి.) ప్రాచీన ఊరు పట్టణంలో ఇళ్లు చాలా సౌకర్యవంతంగా ఉండేవని తవ్వకాల్లో బయటపడింది. కొన్ని ఇళ్లల్లో అయితే మధ్యలో ప్రాంగణం, దాని చుట్టూ 12 లేదా అంతకన్నా ఎక్కువ గదులు ఉండేవి. వాటిలో కుటుంబ సభ్యులు, పనివాళ్లు ఉండేవాళ్లు. వాళ్ల ప్రాథమిక సదుపాయాల్లో నీటి సరఫరా, మరుగుదొడ్లు, డ్రైనేజీ వంటి సౌకర్యాలు ఉండేవి. పైగా అబ్రాహాము, శారాలు పడుచువాళ్లు కూడా కాదు. బహుశా ఆయన 70వ పడిలో, ఆమె 60వ పడిలో ఉండివుంటారు. తన భార్యకు ఏ లోటూ రాకుండా చూసుకోవాలని అందరు భర్తల్లాగే ఆయన కూడా తప్పకుండా కోరుకొనివుంటాడు. దేవుడు చెప్పిన దాని గురించి, తమ ప్రయాణం గురించి వాళ్లు ఎన్నో విషయాలు మాట్లాడుకొనివుంటారు. ఇన్ని త్యాగాలు చేయడానికి శారా కూడా సంతోషంగా సిద్ధపడినప్పుడు అబ్రాహాము ఎంతో ఆనందించివుంటాడు.
11, 12. (ఎ) అబ్రాహాము, శారాలు ఊరు పట్టణాన్ని విడిచివెళ్లడానికి ఎలాంటి ఏర్పాట్లు చేసుకొనివుంటారు? వాళ్లు ఏమేమి ఆలోచించుకొనివుంటారు? (బి) వాళ్లు బయల్దేరిన రోజు ఎలా గడిచివుంటుంది?
11 ఊరు పట్టణం విడిచివెళ్లాలని నిర్ణయించుకున్న అబ్రాహాము, శారాలకు చేయాల్సిన పని ఎంతో ఉంది. తీసుకెళ్లాల్సినవన్నీ పక్కన పెట్టి, వాటిని ఓ పద్ధతి ప్రకారం సర్దుకోవాలి. గమ్యం తెలియని ఆ ప్రయాణంలో తమతోపాటు ఏమేమి తీసుకెళ్లాలి? ఏమేమి వదిలేయాలి? కుటుంబంలో, పనివాళ్లలో ఎవరెవర్ని తమతో తీసుకెళ్లాలి? అవన్నీ పక్కనపెడితే, వయసు పైబడిన తెరహు సంగతేమిటి? తెరహును తమతోపాటే తీసుకెళ్లి, చివరివరకు ఆయన బాగోగులు చూసుకోవాలని వాళ్లు నిర్ణయించుకున్నారు. తెరహు కూడా వాళ్లతో వెళ్లడానికి సంతోషంగా ఒప్పుకొనివుంటాడు. ఎందుకంటే, కుటుంబ పెద్దగా తెరహు తన కుటుంబాన్ని ఊరు పట్టణం నుండి తీసుకువెళ్లాడని బైబిలు చెబుతోంది. తెరహు విగ్రహారాధనను కూడా విడిచిపెట్టివుంటాడు. అబ్రాహాము తన అన్న కుమారుడు లోతును కూడా తమతో తీసుకెళ్లాడు.—ఆది. 11:31.
12 చివరికి, బయల్దేరే రోజు రానేవచ్చింది. వెళ్లే వాళ్లంతా ఒక్కొక్కరిగా పట్టణ ప్రాకారాన్ని, కందకాన్ని దాటి ఒకచోట గుమికూడడం ఊహించుకోండి. సామానంతా ఒంటెలమీద, గాడిదలమీద ఎక్కించారు. d మందల్ని ఒకచోట చేర్చారు. ఇంట్లోవాళ్లు, పనివాళ్లు తమతమ స్థానాల్లో నిలబడి బయల్దేరడానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ అబ్రాహాము సైగ కోసం ఆత్రంగా వేచివున్నారు. ఆయన సైగ చేయగానే అందరూ బయల్దేరారు. అలా వాళ్లు ఊరు పట్టణాన్ని శాశ్వతంగా విడిచిపెట్టారు.
13. నేడు చాలామంది యెహోవా సేవకులు అబ్రాహాము, శారాల స్ఫూర్తిని ఎలా చూపిస్తున్నారు?
13 నేడు యెహోవా సేవకుల్లో చాలామంది, రాజ్యప్రచారకుల అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్లి సేవ చేయాలని నిర్ణయించుకుంటున్నారు. కొందరేమో ఎక్కువమందితో సువార్త పంచుకోవడానికి కొత్త భాష నేర్చుకోవాలని, ఏదైనా కొత్త పద్ధతిలో లేదా తమకు కాస్త కష్టమనిపించే పద్ధతిలో ప్రకటించాలని నిర్ణయించుకుంటున్నారు. అలాంటి నిర్ణయాలు తీసుకునేవాళ్లు కొన్ని త్యాగాలు చేయాల్సివుంటుంది, అదీ మనస్ఫూర్తిగా. అబ్రాహాము, శారాలను ఆదర్శంగా తీసుకొని వాళ్లు చూపించే స్ఫూర్తి నిజంగా అభినందనీయం! మనం కూడా అలాంటి విశ్వాసం చూపిస్తే, మనం యెహోవాకు ఇచ్చేదానికన్నా ఎన్నోరెట్లు ఎక్కువ ఆయన మనకు ఇస్తాడనే ధీమాతో ఉండవచ్చు. ఆయన ఎప్పుడూ మాటతప్పడు. (హెబ్రీ. 6:10; 11:6) మరి అబ్రాహాము విషయంలో కూడా దేవుడు అలాగే చేశాడా?
యూఫ్రటీసు నది దాటినప్పుడు . . .
14, 15. ఊరు నుండి హారాను వరకు ప్రయాణం ఎలా సాగింది? కొంతకాలం హారానులో బసచేయాలని అబ్రాహాము ఎందుకు అనుకున్నాడు?
14 అందరూ మెల్లమెల్లగా ప్రయాణానికి అలవాటుపడ్డారు. అబ్రాహాము, శారాల ప్రయాణం కాసేపు జంతువుల మీద, కాసేపు కాలినడకన సాగింది. వాళ్ల మాటలు జంతువుల గంటల శబ్దాలతో కలిసిపోయాయి. ప్రయాణం చేయడంలో అంతగా అనుభవం లేనివాళ్లు కూడా గుడారాలు వేయడంలో, తీయడంలో ఆరితేరిపోయారు. వయసు పైబడిన తెరహును ఒంటెమీదో గాడిదమీదో జాగ్రత్తగా కూర్చోబెట్టడంలో మంచి నేర్పరులయ్యారు. వాళ్ల ప్రయాణం వాయవ్య దిశలో యూఫ్రటీసు నది వెంబడి సాగింది. అలా రోజులూ, వారాలూ గడిచిపోయాయి.
15 చివరికి దాదాపు 960 కిలోమీటర్లు ప్రయాణించాక వాళ్లు హారానుకు చేరుకున్నారు. అది తూర్పు-పశ్చిమ వర్తక మార్గాల కూడలిని ఆనుకొనివున్న వర్ధమాన నగరం. వాళ్లు ఆగిన ప్రాంతంలో ఇళ్లు తేనెతెట్టు ఆకారంలో ఉండేవి. బహుశా తెరహు ఆరోగ్యం ప్రయాణానికి సహకరించనందువల్ల కావచ్చు వాళ్లు అక్కడే కొంతకాలం బసచేశారు.
16, 17. (ఎ) ఏ నిబంధన వల్ల అబ్రాహాముకు ఎంతో ఆనందం కలిగింది? (బి) అబ్రాహాము హారానులో ఉన్నప్పుడు యెహోవా ఆయనను ఎలా ఆశీర్వదించాడు?
16 కొంతకాలానికి తెరహు చనిపోయాడు, అప్పుడు ఆయన వయసు 205 ఏళ్లు. (ఆది. 11:32) దుఃఖంలో ఉన్న అబ్రాహాముతో యెహోవా మళ్లీ మాట్లాడాడు. అప్పుడు ఆయనకు ఎంతో ఊరట కలిగింది. ఈసారి యెహోవా ఊరు పట్టణంలో ఇచ్చిన నిర్దేశాలనే మళ్లీ ఇచ్చాడు, అలాగే తన వాగ్దానాలకు సంబంధించి ఇంకొన్ని విషయాలు కూడా చెప్పాడు. అబ్రాహాము “గొప్ప జనముగా” అవుతాడని, భూమ్మీది వంశాలన్నీ ఆయన వల్ల ఆశీర్వాదాలు పొందుతాయని అన్నాడు. (ఆదికాండము 12:2, 3 చదవండి.) దేవుడు తనతో చేసిన నిబంధనను స్థిరపర్చినందుకు అబ్రాహాము ఎంతో ఆనందించాడు. ఇక అక్కడనుండి బయల్దేరే సమయం వచ్చిందని గ్రహించాడు.
17 హారానులో ఉన్నప్పుడు యెహోవా ఆశీర్వాదంతో అబ్రాహాము చక్కగా వర్ధిల్లాడు. అందుకే, ఈసారి సర్దుకోవాల్సిన సామాన్లు చాలా ఉన్నాయి. ‘హారానులో వారు ఆర్జించిన యావదాస్తి, వారు సంపాదించిన సమస్తమైనవాళ్ల’ గురించిన ప్రస్తావన బైబిల్లో ఉంది. (ఆది. 12:5) అబ్రాహాము ఒక జనాంగంగా ఏర్పడాలంటే ఒక పెద్ద కుటుంబానికి సరిపడా వస్తుపరమైన వనరులు, సేవకులు ఆయనకు ఉండాలి. యెహోవా తన సేవకులను అన్నిసార్లూ ఆస్తిపాస్తులతో ఆశీర్వదించడు కానీ, తన చిత్తం నెరవేర్చడానికి వాళ్లకు ఏమేమి అవసరమో అవన్నీ ఇస్తాడు. అలా బలపడిన అబ్రాహాము అందర్నీ తీసుకొని బయల్దేరాడు. కానీ అప్పటికీ ఎక్కడికి వెళ్లాలో ఆయనకు తెలియదు.
18. (ఎ) దేవుని ప్రజల చరిత్రలో చాలా ప్రాముఖ్యమైన సమయానికి అబ్రాహాము ఎప్పుడు చేరుకున్నాడు? (బి) ఆ తర్వాతి కాలాల్లో నీసాను 14వ తేదీన ఇంకా ఎలాంటి ముఖ్యమైన సంఘటనలు జరిగాయి? (“ బైబిల్లో నమోదైన చరిత్రలో ఒక ప్రాముఖ్యమైన తేదీ” అనే బాక్సు చూడండి.)
18 హారాను నుండి చాలా రోజులు ప్రయాణిస్తే కర్కెమీషు వస్తుంది. సాధారణంగా ప్రయాణికులు అక్కడే యూఫ్రటీసు నది దాటేవాళ్లు. బహుశా అబ్రాహాము కూడా అక్కడే నది దాటివుంటాడు, అది సా.శ.పూ. 1943వ సంవత్సరం. ఆయన నది దాటిన నెలకు ఆ తర్వాత నీసాను అనే పేరు వచ్చింది, తేదీ స్పష్టంగా నీసాను 14 అయ్యుంటుంది. ఇది చాలా ప్రత్యేకమైన తేదీ. ఎందుకంటే, తర్వాతి కాలంలో దేవుని ప్రజలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు అదే తేదీన జరిగాయి. (నిర్గ. 12:40-43) అబ్రాహాముకు యెహోవా చూపిస్తానని చెప్పిన దేశం దక్షిణాన ఉంది. ఆయన అబ్రాహాముతో చేసిన నిబంధన ఆ రోజు నుండే అమలులోకి వచ్చింది.
19. ఈసారి యెహోవా తన వాగ్దానంలో ఏమి ప్రస్తావించాడు? అది అబ్రాహాముకు ఏమి గుర్తుచేసివుంటుంది?
19 వాళ్లు ఆ దేశంలో దక్షిణం వైపుగా ప్రయాణించి, చివరికి షెకెము దగ్గరున్న మోరేలోని వృక్షాల వద్ద ఆగారు. అక్కడ యెహోవా మళ్లీ అబ్రాహాముతో మాట్లాడాడు. ఈసారి ఆయన, ఆ దేశాన్ని స్వాధీనం చేసుకునే అబ్రాహాము సంతానం గురించి తన వాగ్దానంలో ప్రస్తావించాడు. ఆ మాట వినగానే, మానవులను రక్షించే “సంతానము” గురించి ఏదెను తోటలో యెహోవా చేసిన వాగ్దానం అబ్రాహాముకు గుర్తుకొచ్చివుంటుందా? (ఆది. 3:15; 12:7) బహుశా వచ్చివుంటుంది. యెహోవా దేవుని గొప్ప సంకల్పంలో తనకు కూడా పాత్ర ఉందని ఆయనకు కొంతమేర అర్థమైవుంటుంది.
20. యెహోవా తనకిచ్చిన గొప్ప అవకాశానికి అబ్రాహాము ఎలా కృతజ్ఞత చూపించాడు?
20 ఆ గొప్ప అవకాశం యెహోవా తనకు ఇచ్చినందుకు అబ్రాహాము ఆయనపట్ల ఎంతో కృతజ్ఞత చూపించాడు. ఆ దేశంలో కనానీయులు ఇంకా ఉన్నారు కాబట్టి ఆయన దానిలో జాగ్రత్తగా సంచరించివుంటాడు. అబ్రాహాము మొదట మోరేలోని సింధూర వృక్షాల దగ్గర, ఆ తర్వాత బేతేలు దగ్గర ఆగి యెహోవాకు బలిపీఠాలు కట్టాడు. యెహోవా నామమున ప్రార్థించాడు. ఆ సమయంలో అబ్రాహాము తన సంతానపు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ, తన దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపివుంటాడు. చుట్టుపక్కలవున్న కనానీయులకు ఆయన ప్రకటించివుంటాడు కూడా. (ఆదికాండము 12:7, 8 చదవండి.) నిజానికి, విశ్వాసానికి సంబంధించిన పెద్దపెద్ద సవాళ్లు అబ్రాహాముకు ఆ తర్వాతి కాలంలో ఎదురయ్యాయి. అయినా, ఊరు పట్టణంలో సొంత ఇంటిని, సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలిపెట్టి వచ్చినందుకు అబ్రాహాము ఎప్పుడూ బాధపడలేదు. యెహోవా తనకు చేసిన వాగ్దానం మీదే ఆయన దృష్టి నిలిపాడు. అందుకే, అబ్రాహాము గురించి హెబ్రీయులు 11:10 ఇలా చెబుతోంది: ‘దేవుడు దేనికి శిల్పియు, నిర్మాణకుడునైయున్నాడో పునాదులుగల ఆ పట్టణము కొరకు ఆయన ఎదురుచూచుచుండెను.’
21. అబ్రాహాముతో పోలిస్తే, దేవుని రాజ్యం గురించి మనకు ఎంత తెలుసు? ఏమి చేయాలనే ప్రేరణ మీలో కలిగింది?
21 ఆ సూచనార్థక పట్టణమే దేవుని రాజ్యం. దాని గురించి అప్పట్లో అబ్రాహాముకు తెలిసిన దానికన్నా ఇప్పుడు మనకు చాలా ఎక్కువ తెలుసు. దేవుని రాజ్యం పరలోకంలో పరిపాలిస్తోందనీ, అది త్వరలోనే ఈ దుష్ట వ్యవస్థను రూపుమాపుతుందనీ, అబ్రాహాముకు ఎంతోకాలం క్రితం దేవుడు వాగ్దానం చేసిన సంతానమైన యేసుక్రీస్తే ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడనీ మనకు తెలుసు. అబ్రాహాము బ్రతికొచ్చినప్పుడు యెహోవా సంకల్పం ఎలా నెరవేరిందో పూర్తిగా అర్థం చేసుకుంటాడు. అదంతా చూసే గొప్ప అవకాశం మనకు ఉంది! యెహోవా చేసిన ప్రతీ వాగ్దానం నెరవేరడం మీరు చూడాలనుకుంటున్నారా? అలాగైతే, అబ్రాహాములాగే మీరూ త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండండి. యెహోవాకు లోబడుతూ, ఆయన సేవలో మీకు దొరికే ఏ అవకాశాన్నైనా విలువైనదిగా ఎంచండి. మీరు అలాచేస్తూ, ‘విశ్వాసమున్న వాళ్లందరికీ తండ్రి’ అయిన అబ్రాహాములా విశ్వాసం చూపిస్తే ఆయన మీకూ తండ్రి అవుతాడు.
a ఆ సమయంలో ఆయన పేరు అబ్రాము. తర్వాత కొన్నేళ్లకు, దేవుడు ఆయన పేరును అబ్రాహాముగా మార్చాడు, ఆ పేరుకు “అనేక జనములకు తండ్రి” అని అర్థం.—ఆది. 17:5.
b తెరహు కుమారుల్లో అబ్రాహాము పెద్దవాడు కాకపోయినా, ఆయన పేరు బైబిల్లో ఎక్కువసార్లు ముందు కనిపించడానికి కారణం కూడా అదే.
c ఆ సమయంలో ఆమె పేరు శారయి. తర్వాత దేవుడు ఆమె పేరును శారాగా మార్చాడు, ఆ పేరుకు “రాజకుమారి” అని అర్థం.—ఆది. 17:15.
d అబ్రాహాము కాలంలో ఒంటెలను పెంచుకునేవాళ్లు కాదని కొందరు విద్వాంసులు వాదిస్తారు. కానీ వాళ్ల వాదనలకు ఎలాంటి ఆధారమూ లేదు. అబ్రాహాము ఆస్తిపాస్తుల్లో ఒంటెలు కూడా ఉన్నాయని బైబిలు చాలాచోట్ల ప్రస్తావించింది.—ఆది. 12:16; 24:34, 35.