21వ అధ్యాయం
భయపడడం, సందేహించడం అనే బలహీనతలతో ఆయన పోరాడాడు
1-3. ఆ రోజు పేతురు కళ్లముందు ఏమేమి జరిగాయి? ఆ రాత్రి ఎలా గడిచింది?
పేతురు ఆ చీకటిలో తన శక్తినంతా కూడగట్టుకుని పడవను నడుపుతున్నాడు. తూర్పున కనుచూపుమేరలో ఏదో లీలగా కనిపిస్తోంది, ఉషోదయం అవుతోందా? రాత్రంతా పడవను నడిపీనడిపీ ఆయన భుజాలు, నడుము ఎక్కడికక్కడ పట్టేశాయి. హోరైన గాలి గలిలయ సముద్రంలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఆ ధాటికి ఆయన తలవెంట్రుకలు విపరీతంగా రేగుతున్నాయి. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ఒక్కో కెరటం ఆ పడవను ఢీ కొడుతోంది, చల్లటి నీళ్లు చిమ్ముతూ పేతురును నిలువునా తడిపేస్తోంది. ఆయన మాత్రం పడవను నడుపుకుంటూ ముందుకెళ్తున్నాడు.
2 పేతురు, ఆయన స్నేహితులు యేసును సముద్ర తీరం దగ్గరే వదిలి ఇప్పుడు మరోచోటుకు వెళ్తున్నారు. ఆ రోజున, ఆకలితో ఉన్న వేలమందికి యేసు కొన్ని రొట్టెలు,చేపలతో ఆహారం పెట్టడం వాళ్లు చూశారు. దాంతో ప్రజలు యేసును రాజుగా చేయాలని ప్రయత్నించారు, కానీ ఆయన రాజకీయాల్లో తలదూర్చడానికి ఇష్టపడలేదు. తన అనుచరులను కూడా అలాంటి వాటికి దూరంగా ఉంచాలని ఆయన నిశ్చయించుకున్నాడు. గుంపు నుండి యేసు దారిచేసుకుంటూ, పడవలో సముద్రానికి అవతలివైపుకు వెళ్లమని శిష్యులను తొందరపెట్టి, ప్రార్థన చేయడానికి ఒంటరిగా కొండకు వెళ్లాడు.—మార్కు 6:35-45; యోహాను 6:14-17 చదవండి.
3 శిష్యులు బయలుదేరిన సమయానికి నిండు చంద్రుడు సరిగ్గా వాళ్ల నడినెత్తి మీద ఉన్నాడు, కానీ ఇప్పుడు మెల్లమెల్లగా పడమర వైపుగా దిగిపోతున్నాడు. వాళ్లు ఎలాగోలా కొన్ని కిలోమీటర్లు ప్రయాణించగలిగారు. గాలి, కెరటాలు భీకరంగా చేస్తున్న శబ్దం అప్పటికే అలసిపోయివున్న శిష్యులను మాట్లాడుకోనివ్వడం లేదు. అప్పుడు పేతురు మనసులో ఎన్నో ఆలోచనలు మెదిలివుంటాయి.
రెండేళ్లలో యేసు దగ్గర పేతురు ఎంతో నేర్చుకున్నాడు, కానీ ఆయన నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది
4. పేతురు మనకు మంచి ఆదర్శమని ఎందుకు చెప్పవచ్చు?
4 ఆలోచించడానికి ఎన్నో విషయాలున్నాయి! పేతురుకు నజరేయుడైన యేసుతో పరిచయమై రెండు సంవత్సరాలకు పైనే కావస్తోంది. ఈ రెండేళ్లలో ఎన్నో జరిగాయి. పేతురు ఎంతో నేర్చుకున్నాడు, కానీ ఆయన నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది. భయపడడం, సందేహించడం అనే బలహీనతలతో ఆయన పోరాడాలి, దానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే మనకు ఆదర్శప్రాయుడు అయ్యాడు. అదెలాగో చూద్దాం.
“మేము మెస్సీయను కనుగొంటిమి”!
5, 6. పేతురు జీవితం ఎలా ఉండేది?
5 యేసును కలుసుకున్న రోజును పేతురు ఎప్పటికీ మర్చిపోడు. ఆయన సోదరుడు అంద్రెయనే ముందు ఆయనకు ఈ గొప్పవార్తను వినిపించాడు: “మేము మెస్సీయను కనుగొంటిమి.” ఆ మాటలతో పేతురు జీవితం మలుపు తిరగడం మొదలైంది. ఇక ఆయన పాత జీవితానికి స్వస్తి చెప్పేసినట్లే.—యోహా. 1:41.
6 గలిలయ సముద్రమనే మంచినీటి సరస్సుకు ఉత్తర తీరానవున్న కపెర్నహూము పట్టణంలో పేతురు నివసించేవాడు. జెబెదయి కుమారులైన యాకోబు, యోహానులతో కలిసి పేతురు, అంద్రెయ చేపల వ్యాపారం చేసేవాళ్లు. పేతురువాళ్ల ఇంట్లో ఆయన భార్య, అత్త, సోదరుడు అంద్రెయ ఉండేవాళ్లు. చేపలను పట్టి కుటుంబాన్ని పోషించాలంటే ఎంతో శారీరక శ్రమ, బలం, పనిలో నైపుణ్యం అవసరమయ్యుంటాయి. జాలర్లు రెండు పడవల మధ్య వలలను వేస్తూ, పట్టిన చేపల్ని తీరానికి లాక్కునివెళ్తూ అలా ఎన్నో రాత్రుళ్లు కష్టపడివుంటారు. పగటి పూట కూడా, పట్టిన చేపల్ని వేరుచేసి అమ్మడం, వలల్ని బాగుచేసుకోవడం, వాటిని కడగడం వంటివి చేస్తూ గంటల కొద్దీ కష్టపడివుంటారు.
7. యేసు గురించి పేతురు ఏమి విన్నాడు? ఆ వార్త ఎందుకు సంతోషకరమైంది?
7 మొదట్లో అంద్రెయ బాప్తిస్మమిచ్చే యోహాను శిష్యుడని బైబిలు చెబుతోంది. యోహాను సందేశం గురించిన విశేషాలు తన సోదరుడు చెబుతున్నప్పుడు పేతురు చెవులు రిక్కించుకుని మరీ వినివుంటాడు. ఒకరోజు యోహాను నజరేయుడైన యేసును చూపిస్తూ “ఇదిగో దేవుని గొఱ్ఱెపిల్ల” అనడం అంద్రెయ చూశాడు. వెంటనే అంద్రెయ యేసు అనుచరుడయ్యాడు, మెస్సీయ వచ్చేశాడనే సంతోషకరమైన వార్తను ఉత్సాహంగా పేతురుకు చెప్పాడు. (యోహా. 1:35-41) అప్పటికి దాదాపు 4,000 సంవత్సరాల క్రితం ఏదెను తోటలో తిరుగుబాటు జరిగిన తర్వాత, మానవులందరి హృదయాల్లో ఆశను చిగురింపజేసే ఒక ప్రత్యేకమైన వ్యక్తి వస్తాడని యెహోవా దేవుడు వాగ్దానం చేశాడు. (ఆది. 3:15) అంద్రెయ కలిసింది స్వయాన ఆ రక్షకుణ్ణే! పేతురు కూడా యేసును కలవడానికి పరుగెత్తాడు.
8. పేతురుకు యేసు పెట్టిన పేరుకు అర్థమేమిటి? ఆ పేరు విషయంలో కొందరు ఎందుకు ఇప్పటికీ అభ్యంతరం తెలుపుతారు?
8 ఆ రోజు వరకు పేతురును అందరూ సీమోను అనేవాళ్లు. కానీ యేసు ఆయనను చూసి ఇలా అన్నాడు: “నీవు యోహాను కుమారుడవైన సీమోనువు; నీవు కేఫా అనబడుదువు.” కేఫా అనే పేరును పేతురుగా అనువదించారు. (యోహా. 1:42) “కేఫా” అనే మాటకు “రాయి” లేదా “రాతిబండ” అని అర్థం. యేసు మాటలు ప్రవచనార్థకమైనవని తెలుస్తోంది. పేతురు రాతిబండలా నిలకడగా, దృఢంగా, నమ్మదగిన వ్యక్తిగా ఉంటూ క్రీస్తు అనుచరులమీద మంచి ప్రభావం చూపిస్తాడని యేసు ముందే గ్రహించాడు. పేతురుకు కూడా తన గురించి తనకు అలాగే అనిపించివుంటుందా? అనిపించి ఉండకపోవచ్చు. నేడు సువార్త వృత్తాంతాలను చదివే కొంతమందికి కూడా పేతురు నిలకడగలవాడని, నమ్మదగినవాడని అనిపించదు. పేతురు గురించి బైబిల్లో ఉన్న దాన్నిబట్టి చూస్తే ఆయన నిలకడ లేనివాడని, చపలచిత్తుడని, సందేహపరుడని అనిపిస్తోందని కొందరు అంటారు.
9. యెహోవా, ఆయన కుమారుడు ఏమి గమనిస్తారు? వాళ్ల ఆలోచనా విధానం మీద మనం నమ్మకం ఉంచాలని మీకు ఎందుకు అనిపిస్తుంది?
9 నిజమే పేతురులో లోపాలు ఉన్నాయి. ఆ విషయం యేసుకూ తెలుసు. అయితే యేసు, తన తండ్రి యెహోవాలా ఎప్పుడూ ప్రజల్లో మంచిని గమనించాడు. పేతురులో ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయని యేసుకు తెలుసు. ఆ లక్షణాల్ని వృద్ధిచేసుకోవడానికి పేతురుకు సహాయం చేయాలనుకున్నాడు. నేడు కూడా యెహోవా, ఆయన కుమారుడు మనలోని మంచిని గమనిస్తారు. వాళ్లు గమనించడానికి మనలో అంత మంచి ఏమి ఉంటుందని మనకు అనిపించవచ్చు. అయితే, వాళ్ల ఆలోచనా విధానం మీద మనం నమ్మకముంచాలి. వాళ్లు మనకు ఏదైనా నేర్పించినప్పుడు పేతురులా నేర్చుకుని, మార్పులు చేసుకోవడానికి సుముఖంగా ఉండాలి.—1 యోహాను 3:19, 20 చదవండి.
“భయపడకుము”
10. పేతురు ఏయే విషయాలు గమనించివుంటాడు? అయినా ఆయన మళ్లీ ఏమి చేశాడు?
10 ఆ తర్వాత యేసు మొదలుపెట్టిన ప్రచార యాత్రలో పేతురు ఆయనతో కొంతకాలం వెళ్లివుంటాడు. కాబట్టి, యేసు చేసిన మొదటి అద్భుతాన్ని అంటే, కానాలో జరిగిన ఓ పెళ్లి విందులో నీళ్లను ద్రాక్షారసంగా మార్చడాన్ని ఆయన చూసివుంటాడు. దానికన్నా ముఖ్యంగా, దేవుని రాజ్యం గురించిన అద్భుతమైన, ఆశను చిగురింపజేసే యేసు సందేశాన్ని చెవులారా విన్నాడు. అయినా, పేతురు యేసుతో వెళ్లడం మానేసి, యథావిధిగా చేపల వ్యాపారం కొనసాగించాడు. కొన్ని నెలలు గడిచాక, పేతురు మళ్లీ యేసును కలిశాడు. ఈసారి పూర్తిగా తనను అనుసరించమని యేసు పేతురును ఆహ్వానించాడు.
11, 12. (ఎ) పేతురు రాత్రంతా పడిన కష్టం గురించి వివరించండి. (బి) యేసు చెబుతున్న దాన్ని వింటున్నప్పుడు పేతురు మనసులో ఏ ప్రశ్నలు తలెత్తివుంటాయి?
11 పేతురు రాత్రంతా కష్టపడ్డాడు, కానీ ఫలితం శూన్యం. జాలరులు మళ్లీమళ్లీ వలల్ని సముద్రంలో వేశారు, అయినా ఒక్క చేప కూడా పడలేదు. సాధారణంగా చేపలు ఎక్కడ గుంపులుగుంపులుగా తిరుగుతాయో తెలుసుకోవడానికి, వలవేసి వాటిని పట్టుకోవడానికి పేతురు తన అనుభవాన్ని, నైపుణ్యాన్ని ఉపయోగించివుంటాడు. చీకటి అలుముకున్న ఆ నీళ్లలో చేపల గుంపు ఎక్కడుందో చూసి, అవి వలలో వచ్చిపడేలా చేయగలిగితే ఎంతబావుణ్ణోనని చాలామంది జాలరుల్లాగే ఆయన కూడా అప్పుడప్పుడు అనుకునివుంటాడు. అలాంటి ఆలోచనలు ఆయన చికాకును ఇంకా పెంచివుంటాయి. పేతురు ఏదో సరదాకో, వినోదానికో చేపలు పట్టడం లేదు. కుటుంబాన్ని పోషించుకోవడానికి చేపలు పడుతున్నాడు. చివరకు ఖాళీ చేతులతో తీరానికి తిరిగొచ్చాడు. ఇప్పుడు వలలు శుభ్రం చేయాలి. అందుకే, యేసు వచ్చినప్పుడు ఆయన ఆ పనిలో మునిగిపోయివున్నాడు.
యేసు తన ప్రకటనా పనికి ముఖ్యాంశమైన దేవుని రాజ్యం గురించి ఎన్నో విషయాలు చెబుతున్నప్పుడు పేతురు అస్సలు విసుక్కోకుండా విన్నాడు
12 ప్రజలంతా యేసు చుట్టూ గుమికూడి, ఆయన చెప్పే ప్రతీమాటను ఎంతో ఆసక్తిగా వింటున్నారు. విపరీతమైన జనం ఉండడంతో యేసు, పడవ ఎక్కి ఒడ్డు నుండి దాన్ని కాస్త నీళ్లలోకి తోయమని పేతురుకు చెప్పాడు. నీళ్ల మీద నుండి ఆయన మాటలు వాళ్లకు స్పష్టంగా వినబడుతున్నాయి కాబట్టి, ఆయన వాళ్లకు బోధించడం మొదలుపెట్టాడు. ఒడ్డునున్న వాళ్లలాగే, పేతురు కూడా ఎంతో ఆసక్తిగా విన్నాడు. యేసు తన ప్రకటనా పనికి ముఖ్యాంశమైన దేవుని రాజ్యం గురించి ఎన్నో విషయాలు చెబుతున్నప్పుడు పేతురు అస్సలు విసుక్కోకుండా విన్నాడు. ఆశను చిగురింపజేసే సందేశాన్ని ఆ ప్రాంతమంతా ప్రకటించే విషయంలో క్రీస్తుకు సహాయం చేయడం అరుదైన గౌరవమని పేతురుకు అనిపించివుంటుంది. మరి పేతురు దాన్ని చేయగలడా? ఆయన కుటుంబం సంగతేమిటి? రాత్రంతా పడిన కష్టం గురించి, ఎదురైన నిరుత్సాహం గురించి పేతురు మళ్లీ ఒకసారి ఆలోచించివుంటాడు.—లూకా 5:1-3.
13, 14. పేతురు కోసం యేసు ఏ అద్భుతం చేశాడు? దానికి పేతురు ఎలా స్పందించాడు?
13 బోధించడం పూర్తయ్యాక యేసు పేతురుతో ఇలా చెప్పాడు: “దోనెను లోతునకు నడిపించి, చేపలు పట్టుటకు మీ వలలు వేయుడి.” పేతురుకు ఏమీ అర్థం కాక అయోమయంలో పడి ఇలా అన్నాడు: “ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమియు దొరకలేదు; అయినను నీ మాట చొప్పున వలలు వేతును.” పేతురు అప్పుడే వలలు కడిగిపెట్టుకున్నాడు. పైగా అది చేపలు దొరికే సమయం కూడా కాదు కాబట్టి, మళ్లీ వల వేయడం ఆయనకు ససేమిరా ఇష్టంలేదు. కానీ, యేసు చెప్పాడనే ఒకే ఒక్క కారణంతో ఆయన మళ్లీ వలవేయడానికి సిద్ధమై, తన వెనకాలే ఇంకో పడవలో రమ్మని బహుశా తోటి జాలర్లకు సైగచేసి బయలుదేరాడు.—లూకా 5:4, 5.
14 వలలను లాగుతున్నప్పుడు పేతురుకు ఎంతో బరువుగా అనిపించింది. నమ్మలేకపోతూనే, ఎంతో కష్టపడి గట్టిగా లాగాడు. చూస్తే, వల నిండా కుప్పలుతెప్పలుగా చేపలు! ఆ క్షణంలో ఆయనకు కాళ్లుచేతులు ఆడలేదు. వెనకాలే పడవలో వస్తున్న జాలర్లను సహాయానికి రమ్మని సైగ చేశాడు. వాళ్లు వచ్చి వలను పైకి లాగారు, ఆ చేపలకు ఒక్క పడవ సరిపోదని అర్థమైంది. రెండు పడవల్లో నింపారు, కానీ అవి కూడా సరిపోలేదు. ఆ బరువుకి పడవలు మునిగిపోసాగాయి. పేతురు ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. పేతురు అంతకుముందు క్రీస్తు శక్తిని కళ్లారా చూశాడు కానీ ఇప్పుడు ఆయన చేసిన అద్భుతం ప్రత్యేకంగా తనకోసం, తన కుటుంబం కోసం. ఈ మనిషి, చేపలు కూడా వచ్చి వలలో పడేలా చేయగలడు! పేతురులో భయం మొదలైంది. మోకాళ్లూని ఇలా అన్నాడు: “ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడను.” దేవుని శక్తితో అలాంటి అద్భుతాలు చేసే వ్యక్తితో సహవాసం చేయడానికి తాను ఎప్పటికైనా అర్హుడౌతాడా?—లూకా 5:6-9 చదవండి.
15. పేతురు సందేహాలు, భయాలు వట్టివేనని యేసు ఎలా బోధించాడు?
15 యేసు దయగా ఇలా అన్నాడు: “భయపడకుము, ఇప్పటినుండి నీవు మనుష్యులను పట్టువాడవై యుందువు.” (లూకా 5:10, 11) ఇది సందేహించాల్సిన, భయపడాల్సిన సమయం కాదు. చేపలు పట్టడం వంటివాటి గురించి పేతురు మనసులో పుట్టిన సందేహాలు తీరిపోయాయి. తన పొరపాట్ల గురించి, లోపాల గురించి మితిమీరి భయపడడంలో అర్థంలేదని ఆయన గ్రహించాడు. యేసు ఒక బృహత్తర కార్యం చేయాల్సివుంది. అది మానవాళి భవిష్యత్తునే మార్చేస్తుంది. ఆయన సేవించే దేవుడు ‘బహుగా క్షమించువాడు.’ (యెష. 55:7) పేతురు భౌతిక, ఆధ్యాత్మిక అవసరాలను యెహోవా తీరుస్తాడు.—మత్త. 6:33.
16. యేసు ఆహ్వానానికి పేతురు, యాకోబు, యోహానులు ఎలా స్పందించారు? అది వాళ్లు తీసుకోగలిగిన నిర్ణయాల్లో అత్యుత్తమమైనదని ఎందుకు చెప్పవచ్చు?
16 యాకోబు, యోహానుల్లా పేతురు కూడా వెంటనే స్పందించాడు. “వారు దోనెలను దరికిచేర్చి, సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.” (లూకా 5:11) పేతురు యేసు మీద, ఆయనను పంపినవాని మీద విశ్వాసం ఉంచాడు. ఆయన తీసుకోగలిగిన నిర్ణయాల్లో అది అత్యుత్తమమైనది. నేడు తమ సందేహాలను, భయాలను వదిలేసి దేవుణ్ణి సేవించే క్రైస్తవులు అలాంటి విశ్వాసాన్నే చూపిస్తున్నారు. తన మీద అలాంటి విశ్వాసం ఉంచేవాళ్ల గురించి యెహోవా శ్రద్ధ తీసుకుంటాడు.—కీర్త. 22:4, 5.
‘ఎందుకు సందేహించావు?’
17. యేసుతో పరిచయమైన రెండేళ్లలో పేతురుకు ఎలాంటి జ్ఞాపకాలు మిగిలాయి?
17 యేసును కలిసిన దాదాపు రెండేళ్లకు, ఈ అధ్యాయం మొదట్లో చూసినట్లు, పేతురు ఆ రాత్రి గలిలయ సముద్రం మీద పడవలో వెళ్తున్నాడు. అప్పుడు ఆయన ఏయే విషయాల గురించి ఆలోచించాడో మనం చెప్పలేం. ఆలోచించడానికి చాలా విషయాలే ఉన్నాయి! యేసు పేతురు అత్తను బాగుచేశాడు. కొండమీది ప్రసంగం ఇచ్చాడు. ఎన్నోసార్లు తన బోధల ద్వారా, శక్తిమంతమైన కార్యాల ద్వారా యెహోవా ఎన్నుకున్న మెస్సీయ తనేనని చూపించాడు. నెలలు గడిచేకొద్దీ, పేతురులోని లోపాలు అంటే త్వరగా భయాలకు, సందేహాలకు లోనవ్వడం వంటివి తప్పకుండా కొంతమేరకు తగ్గివుంటాయి. 12 మంది అపొస్తలుల్లో ఒకడిగా కూడా యేసు పేతురును ఎన్నుకున్నాడు! అయినా తనలో భయాలు, సందేహాలు పూర్తిగా పోలేదని పేతురు త్వరలోనే తెలుసుకుంటాడు.
18, 19. (ఎ) గలిలయ సముద్రంలో పేతురు ఏమి చూశాడో వివరించండి. (బి) పేతురు అడిగినదానికి యేసు ఏమన్నాడు?
18 ఆ రాత్రి నాలుగవ జామున అంటే దాదాపు రాత్రి మూడింటి నుండి సూర్యోదయం మధ్యలో, పేతురు పడవ నడిపేవాడల్లా ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆగిపోయాడు. అల్లంతదూరాన అలల మీద ఏదో కదులుతోంది! ఎగసిపడుతున్న అలల తుంపర్ల మీద చంద్రకాంతి పడి అలా కనిపిస్తోందా? కాదు. అది నిలకడగా, నిటారుగా ఉంది. అది ఒక మనిషి ఆకారం! అవును నిజంగా మనిషే. సముద్రం మీద నడుస్తున్నాడు! ఆ ఆకారం దగ్గరపడే కొద్దీ అది తమవైపే వస్తున్నట్టు వాళ్లకు అనిపించింది. శిష్యులు దాన్ని ఏదో దయ్యం అనుకుని భయంతో గజగజ వణికిపోయారు. ఆ వ్యక్తి ఇలా అన్నాడు: “ధైర్యము తెచ్చుకొనుడి; నేనే, భయపడకుడి.” అది ఎవరోకాదు యేసే!—మత్త. 14:25-27.
19 పేతురు ఇలా అన్నాడు: “ప్రభువా, నీవే అయితే నీళ్లమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్ము.” (మత్త. 14:28) పేతురు ఏదో ఉత్సాహంలో ధైర్యంగా అలా అడిగేశాడు. పేతురు ఈ విశేషమైన అద్భుతాన్ని చూసిన ఆనందంలో, తన విశ్వాసాన్ని ఇంకా దృఢపర్చుకోవాలని అనుకున్నాడు. ఈ అద్భుతాన్ని స్వయంగా చవిచూడాలని అనుకున్నాడు. యేసు మృదువైన స్వరంతో పేతురును రమ్మన్నాడు. పేతురు పడవలో నుండి దిగి నీళ్ల మీద అడుగుపెట్టాడు. కాలు మోపగానే పాదం కింద ఏదో గట్టిగా ఉంది, అప్పుడు పేతురుకు ఎలా అనిపించివుంటుందో ఆలోచించండి. పేతురు నీళ్లమీద నిలబడ్డాడు. యేసువైపు అడుగులు వేసుకుంటూ వెళ్తున్నప్పుడు, అదంతా ఆయనకు ఎంతో అద్భుతంగా తోచింది. అయితే, కాసేపట్లో ఆయన స్పందన మారిపోయింది.—మత్తయి 14:29 చదవండి.
20. (ఎ) పేతురు ధ్యాస ఎలా పక్కకు మళ్లింది? దానివల్ల ఏమైంది? (బి) యేసు పేతురుకు ఏ పాఠం బోధించాడు?
20 పేతురు తన దృష్టంతా యేసు మీద నిలపాలి. యేసు యెహోవా శక్తితో, హోరు గాలిలో ఎగసిపడుతున్న కెరటాల మీద పేతురు నడిచేలా చేశాడు. పేతురు యేసు మీద విశ్వాసం ఉంచాడు కాబట్టే ఆయన అలా చేశాడు. కానీ పేతురు ధ్యాస పక్కకుమళ్లింది. బైబిల్లో ఇలా ఉంది: ‘అతను గాలిని చూసి భయపడ్డాడు.’ కెరటాలు పడవను ఢీ కొడుతూ గాల్లోకి నీటి తుంపర్లని, నురగల్ని ఎగజిమ్ముతున్నాయి. పేతురు వాటినే తదేకంగా చూశాడు, భయంతో వణికిపోయాడు. సముద్రంలో మెల్లమెల్లగా మునిగిపోతున్నట్టు ఆయన ఊహించుకునివుంటాడు. గుండెల్లో దడ ఎక్కువౌతున్నకొద్దీ పేతురు విశ్వాసం మైనంలా కరిగిపోతోంది. నిలకడగా ఉంటాడనే ఉద్దేశంతో యేసు, రాతిబండ అనే అర్థమున్న పేరు పెట్టిన వ్యక్తి ఇప్పుడు విశ్వాసం ఊగిసలాడడంతో రాయిలా మునిగిపోతున్నాడు. పేతురు మంచి ఈతగాడు. కానీ ఆయన తన సామర్థ్యంపై ఆధారపడలేదు. ఆయన బిగ్గరగా ఇలా అరిచాడు: “ప్రభువా, నన్ను రక్షించు.” యేసు ఆయనకు చేయి అందించి, పైకి లాగాడు. ఇంకా నీళ్ల మీద ఉండగానే యేసు ఈ ప్రాముఖ్యమైన పాఠం పేతురుకు బోధించాడు: ‘అల్పవిశ్వాసీ, ఎందుకు సందేహపడితివి?’—మత్త. 14:30, 31.
21. సందేహం ఎందుకు ప్రమాదకరమైనది? మనం దానితో ఎలా పోరాడవచ్చు?
21 ‘సందేహపడడం’ అనే మాటలో ఎంత అర్థముందో! సందేహం శక్తిమంతమైన మారణాయుధం లాంటిది. మనం దానికి తావిస్తే మన విశ్వాసాన్ని హరించివేస్తుంది, ఆధ్యాత్మిక పతనానికి నడిపిస్తుంది. ఈ విషయంలో మనం గట్టి పోరాటమే చేయాలి. ఎలా? సరైనవాటి మీద మనసు లగ్నం చేయడంద్వారా. మనల్ని భయపెట్టే వాటి గురించి, నిరుత్సాహపర్చే వాటి గురించి, యెహోవా మీద నుండీ ఆయన కుమారుని మీద నుండీ మన దృష్టిని పక్కకు మళ్లించే వాటి గురించి ఆలోచిస్తూవుంటే మన సందేహాలు ఇంకా ఎక్కువౌతాయి. మనం యెహోవా మీద, ఆయన కుమారుని మీద, వాళ్లు ఇప్పటివరకు చేసినవాటి మీద, ఇప్పుడు చేస్తున్నవాటి మీద, తమను ప్రేమించేవాళ్లకోసం ముందుముందు చేయనున్న వాటిమీద దృష్టి పెడితే మన విశ్వాసాన్ని నీరుగార్చే సందేహాలు తీసేసుకోగలుగుతాం.
22. పేతురు విశ్వాసం ఎందుకు ఆదర్శప్రాయం?
22 పేతురు యేసుతో కలిసి పడవలోకి ఎక్కుతుండగా తుఫాను ఆగిపోయింది. గలిలయ సముద్రం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. తోటి శిష్యులతో కలిసి పేతురు ఇలా అన్నాడు: ‘నువ్వు నిజంగా దేవుని కుమారుడివి!’ (మత్త. 14:32, 33) ఉషోదయమైంది, సూర్యకిరణాల కాంతికి నీళ్లు మెరుస్తున్నాయి. పేతురు హృదయం కృతజ్ఞతతో నిండిపోయివుంటుంది. యెహోవామీద, యేసుమీద సందేహపడేలా చేసే భయానికి తావివ్వకూడదని ఆయన నేర్చుకున్నాడు. యేసు ప్రవచించినట్టు ఆయన రాతిబండలాంటి క్రైస్తవుడవ్వాలంటే ఆయన ఇంకా ఎన్నో మార్పులు చేసుకోవాల్సివుందన్నది నిజమే. అయితే పట్టువీడకుండా ప్రయత్నిస్తూ ఉండాలని, ప్రగతి సాధిస్తూ ఉండాలని పేతురు నిశ్చయించుకున్నాడు. మీరూ అలాగే నిశ్చయించుకున్నారా? అలాగైతే పేతురు విశ్వాసం నిజంగా ఆదర్శప్రాయమని మీరు తెలుసుకుంటారు.