కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

20వ అధ్యాయం

‘నేను నమ్ముతున్నాను’

‘నేను నమ్ముతున్నాను’

1. మార్త పరిస్థితి ఎలా ఉంది? దానికి కారణం ఏమిటి?

 మార్త తన సోదరుడి సమాధిని మర్చిపోలేకపోతోంది. అది రాయితో మూసిన ఒక గుహ. దుఃఖంతో ఆమె గుండె బరువెక్కింది. తానెంతో ప్రేమించిన తన సోదరుడు లాజరు ఇకలేడనే విషయం అస్సలు నమ్మలేకపోతోంది. లాజరు తుది శ్వాస విడిచిన తర్వాతి నాలుగు రోజులూ ఇల్లంతా రోదనలతో, ఓదార్చడానికి వచ్చిపోయే వాళ్లతో, పరామర్శలతో నిండిపోయింది.

2, 3. (ఎ) యేసును చూసినప్పుడు మార్తకు ఏమి అనిపించివుంటుంది? (బి) ఆమె మాట్లాడిన అత్యంత ప్రాముఖ్యమైన మాటలు ఆమె గురించి ఏమి తెలియజేస్తున్నాయి?

2 ఇప్పుడు మార్త కళ్లముందు ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు, ఆయన లాజరుకు బాగా కావాల్సినవాడు. ఆయనెవరో కాదు యేసే. ఆయనను చూసినప్పుడు ఆమెలో దుఃఖం కట్టలు తెంచుకునివుంటుంది, ఎందుకంటే ప్రపంచంలో ఆయనొక్కడే తన సోదరుణ్ణి కాపాడగలిగివుండేవాడు. వాళ్లు ఇప్పుడు ఒలీవల కొండ దగ్గర బేతనియ అనే చిన్న గ్రామానికి సమీపంలో ఉన్నారు. యేసు తనతో ఉన్నందుకు ఆమెకు కొంత ఊరట దొరికింది, ఆ కొన్ని నిమిషాల్లో ఆయన ముఖంలో ఉట్టిపడుతున్న దయను చూసినప్పుడు మార్తకు మరోసారి ప్రోత్సాహం కలిగింది. ఆమె విశ్వాసం గురించి, పునరుత్థానం మీద ఆమెకున్న నమ్మకాల గురించి ఆలోచింపజేస్తూ యేసు ఆమెను కొన్ని ప్రశ్నలు అడిగాడు. మాటల మధ్యలో ఆమె ఇలా అంది: ‘నీవు లోకానికి రావాల్సిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముతున్నాను.’ ఆమె మాట్లాడిన అత్యంత ప్రాముఖ్యమైన మాటల్లో అదొకటి.—యోహా. 11:27.

3 మార్తకు ఎంత విశ్వాసముందో ఆ మాటలు చూపిస్తున్నాయి. బైబిలు ఆమె గురించి కొన్ని విషయాలే చెబుతున్నా వాటిలో మనకు ఎన్నో పాఠాలు ఉన్నాయి, అవి మన విశ్వాసాన్ని బలపరచుకోవడానికి సహాయం చేస్తాయి. అదెలాగో తెలుసుకోవడానికి, మార్తకు సంబంధించిన మొదటి బైబిలు వృత్తాంతం ఇప్పుడు చూద్దాం.

‘విచారం, తొందర’

4. మార్తవాళ్ల ఇంట్లో ఎవరెవరు ఉండేవాళ్లు? యేసుతో ఆ కుటుంబానికి ఉన్న బంధమేమిటి?

4 దానికి కొన్ని నెలల ముందు అంటే, లాజరు మంచి ఆరోగ్యంతో ఉన్నప్పటి సంగతి చూద్దాం. బేతనియలోవున్న మార్త వాళ్లింటికి ఒక ప్రముఖ వ్యక్తి రాబోతున్నాడు, ఆయనే యేసుక్రీస్తు. మార్త, మరియ, లాజరు ఈ ముగ్గురు సోదరసోదరీలు ఒకే ఇంట్లో ఉండివుంటారు. వచ్చిన అతిథులకు మార్త సపర్యలు చేసేది. కొన్నిసార్లు బైబిలు ఆమె పేరును మొదట ప్రస్తావిస్తోంది కాబట్టి ఆమె వాళ్లలో పెద్దదై ఉంటుందని కొంతమంది పరిశోధకులు చెబుతున్నారు. (యోహా. 11:5) ఆ ముగ్గురిలో ఎవరికైనా పెళ్లయిందో లేదో మనం తెలుసుకోలేం. ఏదేమైనా, వాళ్లు యేసుకు ఆప్తమిత్రులయ్యారు. తనకెంతో వ్యతిరేకత, శత్రుత్వం ఎదురైన యూదయ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నప్పుడు యేసు వాళ్లింట్లోనే బస చేశాడు. శాంతికి నెలవైన ఆ ఇంట్లో ఉన్నందుకు, వాళ్లు చక్కగా మద్దతు ఇచ్చినందుకు యేసు ఎంతో సంతోషించాడు.

5, 6. (ఎ) ఈసారి యేసు వస్తున్నాడని తెలిసి మార్త ఎందుకు ప్రత్యేకంగా ఎక్కువ పనిపెట్టుకుంది? (బి) యేసు వచ్చినప్పుడు మరియ ఏమి చేసింది?

5 ఆ ఇంటిని సౌకర్యవంతంగా ఉంచడంలో, ఆతిథ్యం ఇవ్వడంలో మార్త ఎప్పుడూ ముందుండేది. ఆమె బాగా కష్టపడి పనిచేసే వ్యక్తి, ఎప్పుడూ ఏదో పని తొందరలో ఉన్నట్టు ఉండేది. యేసు వస్తున్నాడని తెలిసినప్పుడు కూడా అంతే. తమ ముఖ్య అతిథి కోసం బహుశా ఆయనతోపాటు వచ్చే కొంతమంది కోసం ఆమె వెంటనే ఎన్నో రకాల వంటకాలతో గొప్ప విందు ఏర్పాటు చేసింది. ఆ రోజుల్లో ఆతిథ్యానికి ఎంతో ప్రాధాన్యం ఉండేది. వచ్చిన అతిథికి ముద్దుపెట్టి లోపలికి ఆహ్వానించేవాళ్లు, చెప్పులు తీసి కాళ్లు కడిగేవాళ్లు, తలకు సుగంధ తైలాన్ని రాసేవాళ్లు. (లూకా 7:44-47 చదవండి.) అలాగే, వచ్చిన అతిథి కోసం మంచి విశ్రాంతి స్థలాన్ని, మంచి ఆహారాన్ని కూడా ఏర్పాటు చేసేవాళ్లు.

6 తమ ముఖ్య అతిథి కోసం మార్త, మరియలు చాలా పనులు చేయాల్సివుంది. ఆ ఇద్దరిలో మరియ మరింత సున్నిత మనస్కురాలని, ఆలోచనాపరురాలని కొన్ని సందర్భాల్ని బట్టి తెలుస్తోంది కాబట్టి, ఆమె మొదట్లో మార్తకు తప్పకుండా సహాయం చేసి ఉంటుంది. కానీ యేసు వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. ఆయన ఆ సందర్భం ఓ మంచి అవకాశం అనుకొని అక్కడున్న వాళ్లకు బోధించాడు. యేసు ఆ కాలంలోని మతనాయకుల్లాంటివాడు కాదు, ఆయన స్త్రీలను ఎంతో గౌరవించేవాడు. తన పరిచర్య ముఖ్యాంశమైన దేవుని రాజ్యం గురించి ఆయన వాళ్లకు మనస్ఫూర్తిగా బోధించాడు. యేసు బోధ వినే అవకాశం దొరికినందుకు మరియ ఎంతో సంతోషిస్తూ ఆయన పాదాల దగ్గర కూర్చుని, ఆయన చెప్పిన ప్రతీ మాటను జాగ్రత్తగా వింది.

7, 8. మార్తలో ఎందుకు కంగారు పెరిగింది? చివరకు ఆమె ఏమి అంది?

7 మార్త ఎంత కంగారు పడివుంటుందో మనం ఊహించుకోవచ్చు. ఆమె చాలా వంటకాలను, అతిథులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేయాలి కాబట్టి ఆమెలో ఆందోళన, కలవరం ఎక్కువయ్యాయి. పని తొందరలో ఆమె అటూఇటూ తిరుగుతూ తన సోదరి సహాయం చేయకుండా కూర్చొని ఉండడం చూసి ఆమె ముఖం ఎర్రబడిందా, గట్టిగా నిట్టూర్చిందా, కనుబొమ్మలు చిట్లించిందా? ఆమె అలా చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే పనులన్నీ తాను ఒక్కతే చేసుకోలేదు!

8 మార్త ఇక ఎంతమాత్రం కోపాన్ని అణచుకోలేకపోయింది. యేసు మాటలకు అంతరాయం కలిగిస్తూ ఇలా అనేసింది: “ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సోదరి నన్ను విడిచిపెట్టినందున, నీకు చింతలేదా? నాకు సహాయము చేయుమని ఆమెతో చెప్పుము.” (లూకా 10:40) అవి కఠినమైన మాటలు. మరియను సరిదిద్దమనీ, పనిచేయమని ఆమెకు చెప్పమనీ మార్త యేసును అడిగింది.

9, 10. (ఎ) యేసు మార్తతో ఎలా మాట్లాడాడు? (బి) మంచి వంటకాల్ని తయారుచేయడానికి అంతగా కష్టపడాల్సిన అవసరం లేదని యేసు అన్నాడా?

9 యేసు ఇచ్చిన జవాబు చాలామంది బైబిలు పాఠకులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. మార్త విషయంలో కూడా అదే జరిగివుంటుంది. యేసు ఆమెతో మృదువుగా ఇలా అన్నాడు: “మార్తా, మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైనదానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్దనుండి తీసివేయబడదు.” (లూకా 10:41, 42) ఆయన మాటలకు అర్థమేమిటి? మార్త అనవసరమైన వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తోందనో మంచి వంటకాల్ని తయారుచేయడానికి అంతగా కష్టపడాల్సిన అవసరం లేదనో ఆయన అంటున్నాడా?

మార్త ‘అనేకమైన పనుల గురించి విచారం కలిగి, తొందరపడుతున్నా’ దిద్దుబాటును సవినయంగా స్వీకరించింది

10 యేసు మాటలకు అర్థం అది కాదు. మార్త ఉద్దేశాలు మంచివని, ప్రేమతోనే ఆమె అలా చేస్తోందని ఆయనకు బాగా తెలుసు. అలాగే గొప్ప ఆతిథ్యం అన్నిసార్లూ తప్పని ఆయన ఉద్దేశం కాదు. ఎందుకంటే, కొంతకాలం ముందు మత్తయి (ఆయనకు లేవీ అనే పేరు కూడా ఉంది) ఏర్పాటు చేసిన ‘గొప్ప విందుకు’ ఆయన సంతోషంగా వెళ్లాడు. (లూకా 5:29) మార్త తయారుచేస్తోన్న భోజనం గురించి కాదుగానీ, ఆమె దేనికి ఎక్కువ ప్రాధాన్యమిస్తోందనే దానిగురించి యేసు మాట్లాడుతున్నాడు. ఆమె ఏవి ప్రాముఖ్యమైన విషయాలో గుర్తించలేనంతగా భారీ భోజన ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇంతకీ ఏవి ప్రాముఖ్యమైన విషయాలు?

యేసు మార్త ఆతిథ్యాన్ని గౌరవించాడు, ఆమె ఉద్దేశాలు మంచివని, ప్రేమతోనే ఆమె అలా చేస్తోందని ఆయనకు తెలుసు

11, 12. యేసు మార్తను సున్నితంగా ఎలా సరిదిద్దాడు?

11 యెహోవా దేవుని అద్వితీయ కుమారుడైన యేసు మార్త ఇంట్లో సత్యాన్ని బోధిస్తున్నాడు. ఆమె చేస్తున్న ఏర్పాట్లు గానీ రుచికరమైన భోజనం గానీ మరేదైనా గానీ అంతకన్నా ప్రాముఖ్యం కాదు. విశ్వాసం బలపర్చుకోవడానికి దొరికిన ప్రత్యేకమైన అవకాశాన్ని మార్త పోగొట్టుకుంటోందని యేసు బాధపడ్డాడు, కానీ దేనికి ప్రాధాన్యమివ్వాలో నిర్ణయించుకునే అవకాశాన్ని ఆమెకే వదిలేశాడు. a అయితే, మరియ దేనికి ప్రాధాన్యమివ్వాలో నిర్ణయించే హక్కు మార్తకు లేదు.

12 అందుకే యేసు, మార్తను దయగా సరిదిద్దుతూ ఆమెను శాంతపర్చడానికి రెండుసార్లు ఆమెను మృదువుగా పేరుపెట్టి పిలిచాడు, ‘అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడాల్సిన’ అవసరం లేదని చెప్పాడు. ముఖ్యంగా ఆధ్యాత్మిక విందు దొరుకుతున్నప్పుడు ఒకట్రెండు వంటకాలైనా సరిపోతాయి. అందుకే ఆయన, మరియ ఎన్నుకున్న ‘ఉత్తమమైన దాన్ని’ ఆమె చేజారనివ్వలేదు, అంటే తన దగ్గర నేర్చుకోవడానికి ఆయన అడ్డుచెప్పలేదు.

13. యేసు మార్తను సరిదిద్దిన తీరు నుండి మనం ఏయే విషయాలు నేర్చుకోవచ్చు?

13 మార్త ఇంట్లో జరిగిన ఆ సంఘటన నుండి నేటి క్రీస్తు అనుచరులు ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా మన “ఆధ్యాత్మిక అవసరం” తీర్చుకోవడానికి ప్రాధాన్యమివ్వాలి. (మత్త. 5:3, NW) మార్త ఉదార స్వభావాన్ని, కష్టపడి పనిచేసే స్ఫూర్తిని మనం పాటించాలనుకుంటాం. అయినా, ఆతిథ్యం ఇస్తున్నప్పుడు అత్యంత ప్రాముఖ్యమైన విషయాలను నిర్లక్ష్యం చేసేంతగా అల్పమైన విషయాల గురించి ‘విచారపడకూడదు, తొందరపడకూడదు.’ ఎన్నో వంటకాలతో భోజనం పెడదామనో తిందామనో కాకుండా ముఖ్యంగా ఒకరి విశ్వాసంతో ఒకరం ప్రోత్సహించుకోవడానికి, ఆధ్యాత్మిక కృపావరాలు ఇవ్వడానికి మనం తోటి విశ్వాసులతో సహవసిస్తాం. (రోమీయులు 1:11, 12 చదవండి.) అలాంటి సందర్భాల్లో అల్పాహారం ఏర్పాటు చేసినా సరిపోవచ్చు.

ప్రియ సోదరుడు చనిపోయాడు, మళ్లీ బ్రతికాడు

14. దిద్దుబాటు స్వీకరించే విషయంలో మార్త మనకు మంచి ఆదర్శమని ఎందుకు చెప్పవచ్చు?

14 యేసు ఇచ్చిన మృదువైన మందలింపుకు మార్త సరిగ్గా స్పందించి, పాఠం నేర్చుకుందా? తప్పకుండా నేర్చుకుని ఉంటుంది. అపొస్తలుడైన యోహాను మార్త సోదరుని గురించి ఆసక్తికరమైన ఒక వృత్తాంతాన్ని పరిచయం చేస్తున్నప్పుడు ఇలా అన్నాడు: “యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను.” (యోహా. 11:5) బేతనియలో యేసు మార్తను మందలించిన సంఘటన జరిగి అప్పటికి కొన్ని నెలలు గడిచాయి. ప్రేమతో సరిదిద్దిన యేసు మీద కోపం పెంచుకోవడం, ముఖం మాడ్చుకోవడం లాంటివేవీ చేయకుండా మార్త దిద్దుబాటును స్వీకరించిందని తెలుస్తోంది. దిద్దుబాటు అవసరంకానివాళ్లు మనలో ఎవరుంటారు? ఈ విషయంలో కూడా మార్త విశ్వాసం మనకు ఆదర్శప్రాయం.

15, 16. (ఎ) తన సోదరునికి జబ్బు చేసినప్పుడు మార్త ఆయనను ఎలా చూసుకొనివుంటుంది? (బి) మార్త, మరియల ఆశలు ఎందుకు పటాపంచలయ్యాయి?

15 సోదరునికి జబ్బు చేసినప్పుడు మార్త ఆయనను చూసుకోవడంలో తప్పకుండా మునిగిపోయుంటుంది. ఆయనకు ఉపశమనం కలిగించడానికి, ఆయన ఆరోగ్యం కుదుటపడడానికి తనకు చేతనైనదంతా చేసింది. అయినా లాజరు ఆరోగ్యం అంతకంతకూ క్షీణించింది. ఆయన సోదరీలు గంటల తరబడి, రోజుల తరబడి పక్కనే ఉండి ఆయనను చూసుకున్నారు. ఎన్నోసార్లు మార్త పీక్కుపోయిన తన సోదరుని ముఖం చూస్తూ, చిన్నప్పటి నుండి తాము కలిసి అనుభవించిన కష్టసుఖాలను గుర్తుచేసుకొని ఉంటుంది.

16 ఇక లాజరు పరిస్థితి చేయిదాటిపోయిందని అనిపించినప్పుడు మార్త, మరియలు యేసుకు వర్తమానం పంపారు. అక్కడ నుండి రెండ్రోజుల ప్రయాణమంత దూరంలో యేసు సువార్త ప్రకటిస్తున్నాడు. వాళ్లు ఆయనకు ఈ వర్తమానం పంపారు: “ప్రభువా, యిదిగో నీవు ప్రేమించువాడు రోగియైయున్నాడు.” (యోహా. 11:1, 3) తమ సోదరుణ్ణి యేసు ప్రేమిస్తున్నాడని వాళ్లకు తెలుసు, తన స్నేహితునికి సహాయం చేయడానికి ఆయన చేయగలిగినదంతా చేస్తాడని వాళ్లకు గట్టి నమ్మకం. పరిస్థితి చేయిదాటిపోకముందే యేసు వస్తాడని వాళ్లు ఆశించారా? అలాగైతే, వాళ్ల ఆశలు పటాపంచలయ్యాయి, లాజరు చనిపోయాడు.

17. మార్త ఎందుకు ఆందోళన పడింది? యేసు బేతనియ దగ్గరకు వచ్చేశాడని తెలిసినప్పుడు మార్త ఏమి చేసింది?

17 మార్త, మరియలు శోకసముద్రంలో మునిగిపోయినా లాజరు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు, బేతనియ నుండీ చుట్టుప్రక్కల ప్రాంతాల నుండీ వచ్చిన అనేకమంది సందర్శకులను చూసుకున్నారు. అప్పటికీ యేసు గురించి ఏ వార్తా లేదు. సమయం గడిచేకొద్దీ మార్తలో ఆందోళన ఎక్కువైవుంటుంది. చివరకు, లాజరు చనిపోయిన నాలుగు రోజులకు యేసు వస్తున్నాడని, ఆయన బేతనియ దగ్గర్లో ఉన్నాడని మార్తకు తెలిసింది. ఎప్పుడూ చురుగ్గా ఉండే మార్త అంత దుఃఖంలో కూడా మరియతో చెప్పకుండా యేసును కలవడానికి పరుగెత్తింది.—యోహాను 11:18-20 చదవండి.

18, 19. మార్త ఏ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది? ఆమె విశ్వాసం ఎందుకు గొప్పది?

18 మార్త యేసును చూడగానే కొన్ని రోజులుగా తమను వేధించిన ఈ విషయాన్ని ఆయనతో చెప్పింది: “ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండును.” అయితే, మార్తలో విశ్వాసం, ఆశ ఇంకా సజీవంగానే ఉన్నాయి. కాబట్టి ఆమె ఇలా అంది: “ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకనుగ్రహించునని యెరుగుదును.” వెంటనే యేసు ఆమె విశ్వాసాన్ని బలపర్చడానికి ఈ మాట అన్నాడు: “నీ సహోదరుడు మరల లేచును.”—యోహా. 11:21-23.

19 భవిష్యత్తులో జరగబోయే పునరుత్థానం గురించి యేసు మాట్లాడుతున్నాడని మార్త అనుకుంది, అందుకే ఇలా అంది: “అంత్యదినమున పునరుత్థానమందు లేచునని యెరుగుదును.” (యోహా. 11:24) పునరుత్థానం మీద ఆమెకున్న విశ్వాసం చాలా గొప్పది. ఎందుకంటే, సద్దూకయ్యులు అనే యూదా మతనాయకులు, పునరుత్థానం గురించి ప్రేరేపిత లేఖనాల్లో ఉన్న స్పష్టమైన బోధను నమ్మేవాళ్లు కాదు. (దాని. 12:13; మార్కు 12:18) అయితే యేసు, పునరుత్థానం గురించి బోధించాడని, కొందరిని పునరుత్థానం కూడా చేశాడని మార్తకు తెలుసు. కానీ లాజరు విషయం వేరు, ఎందుకంటే ఆయన చనిపోయి అప్పటికి నాలుగు రోజులైంది. కాబట్టి ఏమి జరగనుందో ఆమెకు తెలియదు.

20. యోహాను 11:25-27⁠లో యేసు అన్న మరపురాని మాటల అర్థాన్ని, దానికి మార్త ఇచ్చిన జవాబు అర్థాన్ని వివరించండి.

20 అప్పుడు యేసు మరపురాని ఈ మాటలు అన్నాడు: “పునరుత్థానమును జీవమును నేనే.” నిజానికి భూవ్యాప్తంగా చనిపోయిన వాళ్లను భవిష్యత్తులో పునరుత్థానం చేసే అధికారాన్ని యెహోవా దేవుడు తన కుమారునికి ఇచ్చాడు. యేసు మార్తను ఇలా అడిగాడు: “ఈ మాట నమ్ముచున్నావా?” అప్పుడు మార్త, ఈ అధ్యాయం మొదట్లో ప్రస్తావించిన జవాబిచ్చింది. ప్రవక్తలు ప్రవచించినట్లు లోకంలోకి రాబోయే క్రీస్తు (మెస్సీయ) యేసేనని, ఆయన యెహోవా దేవుని కుమారుడని మార్త నమ్మింది.—యోహా. 5:28, 29; యోహాను 11:25-27 చదవండి.

21, 22. (ఎ) దుఃఖిస్తున్న వాళ్ల పట్ల తనకున్న భావాలను యేసు ఎలా చూపించాడు? (బి) లాజరు పునరుత్థానమైన వైనాన్ని వివరించండి.

21 మార్తకున్నలాంటి విశ్వాసం యెహోవా దేవుని దృష్టిలో, ఆయన కుమారుని దృష్టిలో విలువైనదేనా? ఆ తర్వాత మార్త కళ్ల ముందు జరిగిన సంఘటనలు దానికి స్పష్టమైన జవాబిస్తాయి. ఆమె తన సోదరిని తీసుకురావడానికి పరుగెత్తింది. యేసు మరియతో, అక్కడ దుఃఖిస్తున్న వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చాలా బాధపడడం మార్త గమనించింది. ఒక వ్యక్తి చనిపోతే ఎంత బాధ కలుగుతుందో చూసిన యేసు, దుఃఖాన్ని లోపలే దాచుకోకుండా కన్నీళ్లు పెట్టుకోవడం ఆమె చూసింది. తన సోదరుడు ఉన్న సమాధి రాయి తీసివేయమని యేసు ఆజ్ఞ ఇవ్వడం ఆమె వింది.—యోహా. 11:28-39.

22 ఎప్పుడూ వాస్తవికంగా ఆలోచించే మార్త, లాజరు చనిపోయి అప్పటికే నాలుగు రోజులైంది కాబట్టి వాసన రావచ్చని అంటూ అభ్యంతరం చెప్పింది. అందుకు యేసు ఆమెతో ఇలా అన్నాడు: ‘నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావని నేను నీతో చెప్పలేదా?’ ఆమె నమ్మింది, యెహోవా దేవుని మహిమను కూడా చూసింది. అప్పటికప్పుడు అక్కడ లాజరును తిరిగి బ్రతికించేందుకు దేవుడు తన కుమారునికి శక్తినిచ్చాడు. ‘లాజరూ, బయటకు రా!’ అని యేసు ఆజ్ఞాపించడం; ప్రేతవస్త్రాలు చుట్టివున్న లాజరు లేచి అడుగులో అడుగువేసుకుంటూ సమాధి నుండి బయటకు వస్తున్నప్పుడు లీలగా వినిపించిన శబ్దం; ‘అతని కట్లు విప్పి వెళ్లనివ్వండి’ అని యేసు చెప్పడం; ఆమె, ఆమె సోదరి ఒక్క ఉదుటున తమ సోదరుని దగ్గరకు వెళ్లి సంతోషంతో కౌగలించుకోవడం; ఇవన్నీ మార్త బ్రతికి ఉన్నంతకాలం ఆమె మనసులో ముద్రించుకుపోయివుంటాయి. (యోహాను 11:40-44 చదవండి.) మార్త గుండెలోని భారం దిగిపోయింది!

మార్త, మరియలు తమ సోదరుడు పునరుత్థానమవడం చూసినప్పుడు, యేసు మీద మార్త ఉంచిన విశ్వాసానికి ప్రతిఫలం దొరికింది

23. యెహోవా, యేసు మీ కోసం ఏమి చేయాలని కోరుకుంటున్నారు? దాని కోసం మీరు ఏమి చేయాలి?

23 చనిపోయినవాళ్లు పునరుత్థానమవడం కేవలం ఒక కల కాదని ఈ వృత్తాంతం నుండి తెలుస్తోంది. ఈ బైబిలు బోధ మనకు ఎంతో ఊరటనిస్తుంది. పునరుత్థానాలు నిజంగా జరిగాయని చరిత్ర కూడా రుజువు చేస్తోంది. (యోబు 14:14, 15) విశ్వాసం చూపించేవాళ్లకు ప్రతిఫలమివ్వడమంటే యెహోవాకు, ఆయన కుమారుడైన యేసుకు ఎంతో ఇష్టం. మార్త, మరియ, లాజరులకు వాళ్లు అలాగే ప్రతిఫలమిచ్చారు. మీరూ బలమైన విశ్వాసాన్ని పెంపొందించుకుంటే మీ కోసం కూడా అలాంటి ప్రతిఫలమే వేచివుంటుంది.

‘మార్త ఉపచారం చేసింది’

24. బైబిలు మార్త గురించి చివరిసారి ఏమి చెప్పింది?

24 బైబిలు మార్త గురించి ఇంకొక్కసారి మాత్రమే ప్రస్తావిస్తోంది. అది యేసు భూమ్మీద జీవించిన ఆఖరి వారం. తాను అనుభవించనున్న శ్రమల గురించి యేసుకు బాగా తెలుసు కాబట్టి ఆయన ఈసారి కూడా, సంతోషానికి నెలవైన బేతనియలోని మార్తవాళ్ల ఇంట్లోనే ఉండాలనుకున్నాడు. అక్కడ నుండి సుమారు 3 కి.మీ. దూరంలోవున్న యెరూషలేముకు ఆయన నడిచివెళ్లేవాడు. కుష్ఠరోగియైన సీమోను ఇంట్లో యేసు, లాజరులు భోజనం చేస్తున్నప్పుడు బైబిలు మార్త గురించి చివరిసారి ఇలా చెప్పడం చూస్తాం: ‘మార్త ఉపచారం చేసింది.’—యోహా. 12:2.

25. మార్తలాంటి స్త్రీలు నేటి సంఘాల్లో ఉండడం ఎందుకు ఒక ఆశీర్వాదం?

25 ఆమె కష్టపడి పనిచేసేదని అనడానికి ఆ మాటలే నిదర్శనం! బైబిలు మొదటిసారి ఆమె గురించి ప్రస్తావించినప్పుడు ఆమె పనిచేస్తోంది, చివరిసారి ప్రస్తావించినప్పుడు కూడా ఆమె పనిచేస్తూ తన చుట్టూవున్న వాళ్ల అవసరాలను తీర్చడానికి శాయశక్తులా కృషి చేస్తోంది. నేడు మార్తలాంటి ధైర్యం, ఔదార్యం చూపిస్తూ, కష్టపడి పనిచేస్తూ ఎల్లప్పుడూ తమ విశ్వాసాన్ని క్రియల్లో వ్యక్తం చేసే స్త్రీలు క్రైస్తవ సంఘాల్లో ఉండడం ఒక ఆశీర్వాదం. మార్త ఎప్పుడూ అలాగే చేస్తూ వచ్చిందా? అలాగే అనిపిస్తోంది. ఒకవేళ ఆమె అలా చేసివుంటే, ఆమె తెలివిగా నడుచుకున్నట్టే, ఎందుకంటే ఆమె అనుభవించాల్సిన కష్టాలు ఇంకా ఉన్నాయి.

26. తనకున్న విశ్వాసంతో మార్త ఏమి చేయగలిగింది?

26 ఆ తర్వాత కొన్ని రోజులకే, తాను ఎంతో అభిమానించిన ప్రభువైన యేసు ఘోరంగా చనిపోయినప్పుడు ఆ దుఃఖాన్ని మార్త భరించాల్సి వచ్చింది. అంతేకాదు, యేసును క్రూరంగా చంపిన వేషధారులే లాజరును కూడా చంపాలని చూశారు. లాజరు పునరుత్థానంతో చాలామంది విశ్వాసం బలపడుతుంది కాబట్టే వాళ్లు ఆయనను చంపాలనుకున్నారు. (యోహాను 12:9-11 చదవండి.) మరణం వల్ల చివరకు తన సోదరితో, సోదరునితో మార్తకున్న ప్రేమానుబంధాలు తెగిపోయాయి. అది ఎప్పుడు, ఎలా జరిగిందో మనకు తెలియదు కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితం: ఆమెకున్న బలమైన విశ్వాసం వల్లే ఆమె చివరి వరకు సహించగలిగింది. అందుకే నేటి క్రైస్తవులు మార్తలా విశ్వాసం చూపించడం మంచిది.

a మొదటి శతాబ్దపు యూదా సమాజంలో, రబ్బీల పాదాల దగ్గర కూర్చొని నేర్చుకునే అవకాశం సాధారణంగా స్త్రీలకు ఉండేది కాదు. ఇంటి పనులు మాత్రమే వాళ్లకు నేర్పించేవాళ్లు. అందుకే నేర్చుకోవడానికి ఒక స్త్రీ, పండితుని పాదాల దగ్గర కూర్చోవడం మార్తకు చాలా వింతగా అనిపించివుంటుంది.