కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ముగింపు మాట

ముగింపు మాట

‘విశ్వాసము చేతను, ఓర్పుచేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనుడి.’—హెబ్రీయులు 6:11, 12.

1, 2. విశ్వాసాన్ని ఇప్పుడే బలపర్చుకోవడం ఎందుకు ప్రాముఖ్యం? ఉదాహరించండి.

 విశ్వాసం. అదెంతో ఆహ్లాదకరమైన మాట, ఇతరులను ఇట్టే ఆకట్టుకునే లక్షణం. అయితే “విశ్వాసం” అనే పదాన్ని చూసినా, ఆ మాట విన్నా మనం “వెంటనే!” అనే మాట గురించి కూడా ఆలోచించాలి. ఎందుకంటే, మనకు విశ్వాసం లేకపోతే వెంటనే దాన్ని పెంపొందించుకోవాలి. ఒకవేళ ఉంటే దాన్ని నిలబెట్టుకోవడానికి, బలపర్చుకోవడానికి వెంటనే చర్య తీసుకోవాలి. ఎందుకని?

2 మీరు ఓ ఎడారి గుండా పయనిస్తున్నారని అనుకోండి. మీ దగ్గరున్న నీళ్లు అయిపోయాయి. మీకు ఎక్కడైనా నీళ్లు కనబడితే, ఎండకు ఆ నీళ్లు ఆవిరైపోకుండా చూసుకోవాలి. అలాగే, కావాల్సినన్ని నీళ్లు మీ దగ్గరున్న వాటిల్లో నింపుకోవాలి, అప్పుడే మీ గమ్యం చేరేంతవరకు మీరు ఆ నీళ్లను ఉపయోగించుకోవచ్చు. ఈనాడు మనం ఆధ్యాత్మిక ఎడారి లాంటి లోకంలో జీవిస్తున్నాం. ఆ నీళ్లలాగే, నేటి లోకంలో నిజమైన విశ్వాసం కొరవడుతోంది. మనం గనుక దాన్ని జాగ్రత్తగా నిలబెట్టుకొని, బలపర్చుకోకపోతే అది వెంటనే కనుమరుగైపోగలదు. అందుకే మనం త్వరగా స్పందించాలి. నీళ్లు లేకపోతే మనం జీవించలేం, అలాగే విశ్వాసం లేకపోతే యెహోవాతో మన సంబంధం తెగిపోతుంది.—రోమా. 1:17.

3. విశ్వాసం పెంపొందించుకోవడానికి మనకు తోడ్పడే ఎలాంటి ఏర్పాటు యెహోవా చేశాడు? మనం చేయాల్సిన ఏ రెండు పనుల్ని గుర్తుంచుకోవాలి?

3 మనకు విశ్వాసం ఎందుకంత అత్యవసరమో యెహోవాకు తెలుసు. మన కాలంలో ఆ గుణాన్ని పెంపొందించుకోవడం, దాన్ని నిలబెట్టుకోవడం ఎంత కష్టమో కూడా ఆయనకు తెలుసు. అందుకే మనం చదివి, నేర్చుకుని, అనుకరించేందుకు వీలుగా ఎందరో వ్యక్తుల జీవితగాథలను బైబిల్లో రాయించిపెట్టాడు. అపొస్తలుడైన పౌలును ప్రేరేపించి యెహోవా ఇలా రాయించాడు: ‘విశ్వాసము చేతను, ఓర్పుచేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనుడి.’ (హెబ్రీ. 6:11, 12) ఈ పుస్తకంలో మనం చూసినలాంటి విశ్వాసులైన స్త్రీపురుషుల అడుగుజాడల్లో నడవడానికి గట్టిగా కృషిచేయమని యెహోవా సంస్థ మనల్ని ప్రోత్సహించడానికి కారణం కూడా అదే. అయితే మనం ఇప్పుడు ఏమి చేయాలి? ఈ రెండు విషయాల్ని గుర్తుంచుకుందాం: (1) మన విశ్వాసాన్ని బలపర్చుకుంటూ ఉండాలి, (2) మనం ఎదురుచూసే వాటిని మనసులో స్పష్టంగా ఉంచుకోవాలి.

4. విశ్వాసానికి సాతాను బద్ధశత్రువని ఎలా చూపించుకున్నాడు? అయినా మనం ఎందుకు నిరాశపడకూడదు?

4 మీ విశ్వాసాన్ని బలపర్చుకుంటూ ఉండండి. విశ్వాసానికి బద్ధశత్రువు సాతాను. ఈ లోక పాలకుడైన సాతాను, ప్రస్తుత వ్యవస్థను విశ్వాసం నిలబెట్టుకోవడం ఎంతో కష్టమయ్యే స్థలంగా మార్చేశాడు. అతడు మనకన్నా ఎంతో శక్తిమంతుడు. అలాగని మనం విశ్వాసాన్ని పెంపొందించుకోవడం, దాన్ని బలపర్చుకోవడం అసాధ్యమని అనుకుంటూ నిరాశపడాలా? అస్సలు పడకూడదు! నిజమైన విశ్వాసం చూపించాలని అనుకునేవాళ్లకు యెహోవా గొప్ప స్నేహితుడు. ఆయన సహాయంతో మనం అపవాదిని ఎదిరించగలమని, అతగాణ్ణి మన దగ్గర నుండి పారద్రోలగలమని ఆయన మనకు హామీ ఇస్తున్నాడు! (యాకో. 4:7) ప్రతీరోజు మన విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి, దాన్ని అధికం చేసుకోవడానికి సమయం కేటాయిస్తే అతణ్ణి ఎదిరించగలం. ఎలా?

5. బైబిల్లో ప్రస్తావించిన విశ్వాసులైన స్త్రీపురుషులు తమ విశ్వాసాన్ని ఎలా పెంపొందించుకున్నారు? వివరించండి.

5 మనం చూసినట్టు, బైబిల్లో నమోదైన విశ్వాసులైన స్త్రీపురుషులు పుట్టుకతోనే విశ్వాసులేం కాదు. విశ్వాసం యెహోవా పరిశుద్ధాత్మ ఫలమని చెప్పడానికి వాళ్ల జీవితాలే నిదర్శనం. (గల. 5:22-24) వాళ్లు సహాయం కోసం ప్రార్థించారు, యెహోవా వాళ్ల విశ్వాసాన్ని బలపరుస్తూ వచ్చాడు. పరిశుద్ధాత్మ కోసం అడిగేవాళ్లకు, తమ ప్రార్థనలకు తగ్గట్టు నడుచుకునేవాళ్లకు యెహోవా దాన్ని పుష్కలంగా ఇస్తాడని గుర్తుంచుకుంటూ మనమూ వాళ్లలాగే చేద్దాం. (లూకా 11:13) మనం చేయాల్సింది ఇంకా ఏమైనా ఉందా?

6. బైబిలు వృత్తాంతాలను అధ్యయనం చేస్తున్నప్పుడు ఎక్కువ ప్రయోజనం పొందాలంటే ఏమి చేయాలి?

6 ఈ పుస్తకంలో, సాటిలేని విశ్వాసానికి ఆదర్శంగా నిలిచినవాళ్లలో కేవలం కొంతమంది గురించే మనం చర్చించాం. అలాంటివాళ్లు ఇంకా బోలెడుమంది ఉన్నారు! (హెబ్రీయులు 11:32 చదవండి.) మనసు లగ్నం చేసి, జాగ్రత్తగా బైబిలు అధ్యయనం చేస్తే వాళ్లలో ప్రతీ ఒక్కరి గురించి మనం ఇంకా ఎంతో నేర్చుకోవచ్చు. బైబిల్లోని వృత్తాంతాలను గబగబ చదివేసుకుంటూ వెళ్తే మన విశ్వాసాన్ని అంతగా బలపర్చుకోలేం. మనం చదివే దాని నుండి పూర్తిగా ప్రయోజనం పొందాలంటే బైబిల్లోని వృత్తాంతాల సందర్భాన్ని, నేపథ్యాన్ని లోతుగా పరిశీలించడానికి సమయం కేటాయించాలి. వాళ్లు కూడా ‘మనవంటి స్వభావముగల’ అపరిపూర్ణ మనుషులేనని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటే, వాళ్లు మన కళ్లెదుటే ఉన్నట్టు అనిపిస్తుంది. (యాకో. 5:17) మనం వాళ్ల స్థానంలో ఉండి, మనలాంటి సవాళ్లూ సమస్యలూ ఎదురైనప్పుడు వాళ్లకు ఎలా అనిపించివుంటుందో అర్థంచేసుకోగలుగుతాం.

7-9. (ఎ) బైబిల్లో ప్రస్తావించిన కొందరు విశ్వాసులైన స్త్రీపురుషులకు నేడు మనలా యెహోవాను ఆరాధించే అవకాశం దొరికివుంటే ఎలా భావించివుండేవాళ్లు? (బి) విశ్వాసాన్ని మన నిర్ణయాల్లో, మన పనుల్లో చూపిస్తూ ఎందుకు బలపర్చుకోవాలి?

7 మనం తీసుకునే నిర్ణయాల ద్వారా, చేసే పనుల ద్వారా కూడా మన విశ్వాసాన్ని బలపర్చుకోవచ్చు. ఎంతైనా, ‘క్రియలు లేని విశ్వాసం మృతం’ కదా? (యాకో. 2:26) మనం ఈ పుస్తకంలో పరిశీలించిన స్త్రీపురుషులకు, యెహోవా నేడు మనకు అప్పగించిన లాంటి పనిని అప్పగిస్తే వాళ్లెంత సంతోషిస్తారో ఒక్కసారి ఆలోచించండి!

8 ఉదాహరణకు, అరణ్యంలో గరుకైన రాతి బలిపీఠాల మీద కాకుండా, తాను “దూరమునుండి” మాత్రమే చూసిన వాగ్దానాల గురించి విపులంగా చర్చించే, వివరించే చోట అంటే ఆహ్లాదకరమైన రాజ్యమందిరాల్లో, పెద్ద సమావేశాల్లో ఒక పద్ధతి ప్రకారం సమకూడే తోటి ఆరాధకులతో కలిసి యెహోవాను ఆరాధించే అవకాశం అబ్రాహాముకు దొరికివుంటే? (హెబ్రీయులు 11:13 చదవండి.) దుష్టుడైన మతభ్రష్ట రాజు పాలనలో యెహోవాను ఆరాధించడానికి కృషిచేస్తూ దుష్టులైన బయలు ప్రవక్తలను చంపడం కాకుండా, ప్రశాంతంగా ప్రజలను కలుసుకొని వాళ్లకు ఊరటనిచ్చే, భవిష్యత్తు మీద ఆశ చిగురింపజేసే సందేశాన్ని చేరవేసే అవకాశం ఏలీయాకు దొరికివుంటే? బైబిల్లో ప్రస్తావించిన విశ్వాసులైన స్త్రీపురుషులకు మనలా యెహోవాను ఆరాధించే అవకాశమే గనుక దొరికివుంటే ఎగిరిగంతేసి ఉండేవాళ్లు కదా!

9 అందుకే మనం తీసుకునే నిర్ణయాల్లో, చేసే పనుల్లో మన విశ్వాసాన్ని చూపిస్తూ దాన్ని బలపర్చుకుందాం. అలాచేస్తే, దేవుని ప్రేరేపిత వాక్యంలో నమోదైన విశ్వాసులైన స్త్రీపురుషుల ఆదర్శాన్ని మన జీవితాల్లోని అవసరమైన రంగాల్లో పాటించినవాళ్లమౌతాం. ముందుమాటలో చూసినట్లు, స్నేహితుల్లా వాళ్లకు మనం ఇంకా దగ్గరయ్యామన్న భావన కలుగుతుంది. అలాంటి స్నేహాలు త్వరలోనే వాస్తవరూపం దాల్చనున్నాయి!

10. పరదైసులో ఎలాంటి ఆనందం మన సొంతమౌతుంది?

10 మీరు ఎదురుచూసే వాటిని మనసులో స్పష్టంగా ఉంచుకోండి. నమ్మకమైన స్త్రీపురుషులు మొదటినుండీ, దేవుడు చేసిన వాగ్దానాల వల్ల బలం పొందుతూ వచ్చారు. మీరు కూడా అంతేనా? ఉదాహరణకు, ‘నీతిమంతుల పునరుత్థానమప్పుడు’ తిరిగి బ్రతికే దేవుని నమ్మకమైన సేవకులను కలుసుకోవడం ఎంత ఆనందాన్నిస్తుందో ఒకసారి ఆలోచించండి. (అపొస్తలుల కార్యములు 24:14, 15 చదవండి.) వాళ్లను మీరు అడగాలనుకుంటున్న కొన్ని ప్రశ్నలు ఏమిటి?

11, 12. కొత్త లోకంలో (ఎ) హేబెలును, (బి) నోవహును, (సి) అబ్రాహామును, (డి) రూతును, (ఇ) అబీగయీలును, (ఎఫ్‌) ఎస్తేరును మీరు ఏమి అడగాలనుకుంటున్నారు?

11 మీరు హేబేలును కలిసినప్పుడు, “మీ తల్లిదండ్రులు ఎలా ఉండేవాళ్లు?” అని అడగాలనుకుంటున్నారా? లేకపోతే “ఏదెను ముఖద్వారం వద్ద కాపలాగా ఉన్న కెరూబులతో మీరు ఎప్పుడైనా మాట్లాడారా? వాళ్లు మీతో మాట్లాడారా?” అని అడగాలనుకుంటున్నారా? నోవహును కలిస్తే, “నెఫీలులను చూసి మీరు ఎప్పుడైనా భయపడ్డారా? ఓడలో ఉన్న జంతువులన్నిటినీ సంవత్సరంపాటు ఎలా చూసుకున్నారు?” అని మీరు అడగాలనుకోవచ్చు. ఒకవేళ అబ్రాహాము ఎదురుపడితే ఆయనను ఇలా అడగవచ్చు: “మీరు షేముతో ఎప్పుడైనా మాట్లాడారా? మీకు యెహోవా గురించి ఎవరు నేర్పించారు? ఊరును విడిచిపెట్టడం మీకు కష్టమనిపించిందా?”

12 అలాగే, పునరుత్థానమై వచ్చే నమ్మకమైన స్త్రీలను ఎలాంటి ప్రశ్నలు అడగవచ్చో చూడండి: “రూతూ, యెహోవా ఆరాధకురాలవ్వాలని మీకు ఎందుకు అనిపించింది?” “అబీగయీలూ, దావీదుకు మీరు ఎలా సహాయం చేశారో నాబాలుతో చెప్పడానికి భయపడ్డారా?” “ఎస్తేరూ, మీ గురించి, మొర్దెకై గురించి బైబిల్లో కొంతవరకే ఉంది, ఆ తర్వాత ఏమి జరిగిందో కాస్త చెబుతారా?”

13. (ఎ) పునరుత్థానమయ్యే వాళ్లు మిమ్మల్ని ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశముంది? (బి) ప్రాచీనకాల నమ్మకమైన స్త్రీపురుషులను కలుసుకోవడం గురించి ఆలోచించినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది?

13 నమ్మకమైన ఆ స్త్రీపురుషులు కూడా మిమ్మల్ని ప్రశ్నలతో ముంచెత్తుతుండవచ్చు. పాతలోక చరమాంకం గురించి, కష్టకాలాల్లో యెహోవా తన ప్రజల్ని ఎలా ఆశీర్వదించాడనే దానిగురించి చెప్పడం ఎంత బావుంటుందో కదా! యెహోవా తన వాగ్దానాలను ఎలా నెరవేర్చాడో తెలుసుకున్నప్పుడు వాళ్ల హృదయాలు తప్పకుండా ఉప్పొంగిపోతాయి. కొత్తలోకంలో, బైబిల్లో నమోదైన దేవుని నమ్మకమైన సేవకుల గురించి ఇక ఏమాత్రం ఊహించుకోనవసరం లేదు. ఎందుకంటే, పరదైసులో వాళ్లు మనతోనే ఉంటారు! అయితే అంతవరకు వాళ్లను మీ కళ్లముందే ఉన్నట్టు చూడడానికి శాయశక్తులా కృషిచేయండి. వాళ్లలా విశ్వాసం చూపిస్తూ ఉండండి. మీరూ వాళ్లూ కలిసి ఆప్తమిత్రుల్లా కలకాలం యెహోవాను సేవించుదురుగాక!