కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

5వ అధ్యాయం

“యోగ్యురాలు”

“యోగ్యురాలు”

1, 2. (ఎ) రూతు పని గురించి వివరించండి. (బి) ఆమె దేవుని ధర్మశాస్త్రం గురించి, ఆయన ప్రజల గురించి ఏ మంచి విషయాలు తెలుసుకుంది?

 రూతు, రోజంతా ఏరి పోగేసిన యవల పనల పక్కన మోకాళ్లమీద కూర్చుంది. ఎండ ప్రతాపం తగ్గి వాతావరణం చల్లబడింది. బేత్లెహేము చుట్టూవున్న పొలాల్లోని కూలీలంతా పనులు ముగించుకుని ఎత్తులో ఉన్న ఆ చిన్న పట్టణపు గవిని వైపు నిదానంగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారు. రోజంతా నిర్విరామంగా పనిచేయడం వల్ల రూతు శరీరం ఏమాత్రం సహకరించడం లేదు. అయినా ఆమె అదేమీ లెక్కచేయడంలేదు. ధాన్యాన్ని వేరుచేయడానికి పనలను దుళ్లగొడుతోంది. పని సంగతి పక్కనపెడితే, ఊహించిన దానికన్నా ఆ రోజు ఎంతో చక్కగా గడిచింది.

2 ఇంతకీ ఈ యౌవన విధవరాలి పరిస్థితి ఏమైనా మెరుగైందా? మనం ముందు అధ్యాయంలో చూసినట్టు, రూతు తన అత్త నయోమితోనే ఎప్పటికీ ఉంటానని, ఆమె దేవుడైన యెహోవానే ఆరాధిస్తానని మాటిచ్చింది. ఆమె ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. భర్తలను పోగొట్టుకున్న ఆ అత్తాకోడళ్లు మోయాబు దేశం నుండి బేత్లెహేముకు వచ్చారు. ఇశ్రాయేలీయుల మధ్యవున్న పేదవాళ్లు, పరదేశులు గౌరవంగా బ్రతికేలా వాళ్లకోసం యెహోవా ధర్మశాస్త్రంలో చక్కని ఏర్పాట్లు ఉన్నాయని రూతు తెలుసుకుంది. ఆ ధర్మశాస్త్రాన్ని పాటించే దేవుని ప్రజల్లో కొందరి ప్రవర్తనను ఆమె గమనించింది. వాళ్లకు యెహోవా నియమాల మీద ఎంతో ప్రేమవుందని, వాళ్లు దయగలవాళ్లని తెలుసుకుంది. అదంతా ఆమె మనసుకు ఎంతో సాంత్వననిచ్చింది.

3, 4. (ఎ) బోయజు రూతును ఎలా ప్రోత్సహించాడు? (బి) ఆర్థిక ఇబ్బందులు ఎక్కువౌతున్న ఈ కాలంలో, రూతు మనకు ఎలా ఆదర్శంగా ఉంది?

3 బోయజు అలాంటి వ్యక్తే. ఈయన ధనికుడు, వయసులో పెద్దవాడు. రూతు పరిగె ఏరుకున్నది కూడా ఆయన పొలాల్లోనే. ఆయన ఆ రోజు ఒక తండ్రిలా ఆమె మీద శ్రద్ధ తీసుకున్నాడు. పైగా నయోమి బాగోగులు చూసుకుంటున్నందుకు, సత్యదేవుడైన యెహోవా రెక్కల కింద ఆశ్రయం పొందాలని నిర్ణయించుకున్నందుకు మెచ్చుకోలుగా మాట్లాడాడు. ఆ మాటలు గుర్తుకొచ్చి ఆమె మనసులో చిన్నగా నవ్వుకుంది.—రూతు 2:11-14 చదవండి.

4 అయినా రూతు, ముందుముందు తమ జీవితాలు ఎలా ఉంటాయోనని ఆలోచించివుంటుంది. తనకా భర్త లేడు, పిల్లల్లేరు, ఏ ఆధారమూ లేదు. పైగా అక్కడ తనొక అన్యురాలు. అలాంటిది రానున్న రోజుల్లో తమ బతుకు బండిని ఎలా నెట్టుకురాగలదు? పరిగె ఏరుకుంటే అవసరాలు తీరతాయా? వృద్ధాప్యంలో తనను ఎవరు చూసుకుంటారు? కలవరపెట్టే అలాంటి ఆలోచనలు ఆమెకు రావడం సహజమే. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువౌతున్న ఈ కాలంలో, అలాంటి ఆలోచనలే చాలామందికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రూతు తన విశ్వాసంతో ఆ సవాళ్లను ఎలా అధిగమించిందో తెలుసుకుంటే, ఎన్నో విషయాల్లో ఆమెను ఆదర్శంగా తీసుకోవచ్చని గ్రహిస్తాం.

పరిపూర్ణ కుటుంబం అంటే ఏమిటి?

5, 6. (ఎ) బోయజు పొలంలో రూతుకు మొదటిరోజు ఎంత బాగా గడిచింది? (బి) రూతును చూసి నయోమి ఎలా స్పందించింది?

5 రూతు దుల్లగొట్టి పోగేసిన యవలు దాదాపు తూమెడు అయ్యాయి. అంటే మన లెక్కల్లో సుమారు 14 కిలోలు! చీకటిపడుతుండగా ఆమె వాటన్నిటినీ బహుశా ఒక గుడ్డలో మూటకట్టి, దాన్ని ఎత్తి తలమీద పెట్టుకొని ఇంటికి బయలుదేరింది.—రూతు 2:17.

6 కోడల్ని చూడగానే అత్త మొహం ఆనందంతో వెలిగిపోయింది. కోడలి తలమీద పెద్ద యవల మూట చూసి ఆమె కాస్త ఆశ్చర్యపోయి ఉంటుంది. పనివాళ్ల కోసం బోయజు ఏర్పాటు చేసిన ఆహారంలో తాను తినగా మిగిలిన దానిని కూడా రూతు తీసుకొచ్చింది. ఇద్దరూ చెరికాస్త తిన్నారు. నయోమి రూతుతో ఇలా అంది: “నేడు నీవెక్కడ ఏరుకొంటివి? ఎక్కడ పనిచేసితివి? నీయందు లక్ష్యముంచిన వాడు దీవింపబడునుగాక.” (రూతు 2:19) నయోమి జాగ్రత్తగా గమనించింది. కోడలు అంత పెద్ద మూటతో వచ్చిందంటే, ఎవరో ఆమె పరిస్థితిని అర్థంచేసుకొని, ఆమెతో దయగా వ్యవహరించారని నయోమికి అర్థమైంది.

7, 8. (ఎ) బోయజు దయ చూపించడానికి కారణం ఎవరని నయోమి అనుకుంది? ఎందుకు? (బి) అత్త మీద విశ్వసనీయమైన ప్రేమను రూతు ఇంకా ఎలా చూపించింది?

7 ఇద్దరూ మాటల్లో పడ్డారు. బోయజు దయాగుణం గురించి రూతు నయోమికి చెప్పింది. అప్పుడు నయోమి ఆనందంతో ఇలా అంది: “యెహోవా అతనిని ఆశీర్వదించునుగాక! బ్రతికినవాళ్లకు, చచ్చినవాళ్లకు అందరికీ దేవుడు దయ చూపెడుతూనే వుంటాడు.” (రూతు 2:19, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) బోయజు దయ చూపించడానికి కారణం యెహోవాయేనని నయోమికి అర్థమైంది. ఎందుకంటే ఉదార స్వభావం చూపించమని యెహోవా తన ప్రజలను ప్రోత్సహిస్తున్నాడు, దయ చూపించేవాళ్లకు ప్రతిఫలమిస్తానని కూడా ఆయన మాటిస్తున్నాడు. aసామెతలు 19:17 చదవండి.

8 బోయజు చెప్పినట్టు పరిగె ఏరుకోవడానికి ఆయన పొలానికే వెళ్తూ ఉండమనీ, అక్కడ పని చేసే కుర్రాళ్లు ఇబ్బంది పెట్టే అవకాశముంది కాబట్టి ఆయన పనికత్తెలతోనే ఉండమనీ నయోమి రూతుకు సలహా ఇచ్చింది. ఆ సలహా పాటిస్తూ రూతు, ‘అత్త ఇంట్లో నివసించింది.’ (రూతు 2:22, 23) ఈ మాటల్లో కూడా ఆమె విశిష్ట లక్షణం, అదే విశ్వసనీయమైన ప్రేమ స్పష్టంగా ధ్వనిస్తోంది. రూతు గురించి చదివినప్పుడు ఇలాంటి ప్రశ్నలు మన మనస్సులో మెదలవచ్చు: ‘కుటుంబ బంధాల మీద నాకు గౌరవం ఉందా? నావాళ్లకు మద్దతునిస్తూ, కష్టసుఖాల్లో తోడుగా ఉంటున్నానా?’ మనం అలాంటి విశ్వసనీయమైన ప్రేమను చూపిస్తే, యెహోవా దాన్ని ఖచ్చితంగా గమనిస్తాడు.

మన కుటుంబం చిన్నదైనా, పెద్దదైనా దాన్ని అమూల్యంగా ఎంచాలని రూతు, నయోమిల ఉదాహరణ గుర్తుచేస్తోంది

9. కుటుంబం విషయంలో రూతు, నయోమిల నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

9 రూతు, నయోమిలను కలిపి ఒక కుటుంబం అనవచ్చా? భార్యాభర్తలు, కొడుకూ కూతురూ, తాతామామ్మలు ఇలా అందరూ ఉంటేనే “పరిపూర్ణ” కుటుంబం అవుతుందని కొందరు అంటారు. యెహోవా సేవకులు మనసు విప్పి మాట్లాడుకుంటూ తమ చిన్ని కుటుంబాలను కూడా దయకు, ప్రేమానురాగాలకు నెలవుగా చేసుకోవచ్చని రూతు, నయోమిల ఉదాహరణ చూపిస్తోంది. మీ కుటుంబం చిన్నదైనా, పెద్దదైనా మీరు దాన్ని అమూల్యంగా ఎంచుతున్నారా? కుటుంబం లేనివాళ్లకు క్రైస్తవ సంఘం ఆ లోటు తీరుస్తుందని యేసు తన అనుచరులకు గుర్తుచేశాడు.—మార్కు 10:29, 30.

రూతు, నయోమి ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉన్నారు, ఒకరినొకరు ప్రోత్సహించుకున్నారు

“మనలను విడిపింపగల వాళ్లలో ఒకడు”

10. నయోమి రూతు కోసం ఏమి చేయాలనుకుంది?

10 ఏప్రిల్‌లో జరిగే యవల కోత నుండి జూన్‌లో జరిగే గోధుమ కోత వరకూ, రూతు బోయజు పొలాల్లో పరిగె ఏరుకొంటూ వచ్చింది. వారాలు గడిచేకొద్దీ, ముద్దుల కోడలి కోసం తాను చేయగలిగినదాని గురించి నయోమి బాగా ఆలోచించివుంటుంది. మోయాబులో ఉన్నప్పుడు రూతుకు మళ్లీ పెళ్లి చేయలేనని అనుకుంది. (రూతు 1:11-13) కానీ ఇప్పుడు ఆమె ఆలోచన మారింది. ఆమె రూతుతో ఇలా అంది: “నా కుమారీ, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా.” (రూతు 3:1) నయోమి తన కోడల్ని సొంత కూతురిలా చూసుకుంది కాబట్టి, ఆమెకు “విశ్రాంతి” దొరికేలా చేయాలనుకుంది. అంటే కోడల్ని ఒక ఇంటిదాన్ని చేసి భద్రత, రక్షణ కల్పించాలని అనుకుంది. కానీ నయోమి ఏమి చేయగలదు?

11, 12. (ఎ) ధర్మశాస్త్రంలోని ఏ ఏర్పాటును మనసులో ఉంచుకొని, బోయజు ‘విడిపింపగల వారిలో ఒకడు’ అని నయోమి అంది? (బి) అత్త సలహాకు రూతు ఎలా స్పందించింది?

11 బోయజు గురించి మొదటిసారి రూతు దగ్గర విన్నప్పుడు నయోమి ఇలా అంది: “ఆ మనుష్యుడు మనకు సమీపబంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడు.” (రూతు 2:20) ఆమె ఎందుకలా అంది? బీదరికంతో, ఆత్మీయుల మరణంతో కష్టాలపాలైన కుటుంబాల కోసం ధర్మశాస్త్రంలో ప్రేమపూర్వక ఏర్పాట్లున్నాయి. ఆ రోజుల్లో, పిల్లలు పుట్టకముందే విధవరాలైన స్త్రీ పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. ఎందుకంటే ఆమె భర్త పేరు, వంశం అక్కడితో ఆగిపోయేవి. అయితే ధర్మశాస్త్రంలోని ఒక ఏర్పాటు ప్రకారం, చనిపోయిన వ్యక్తి సహోదరుడు ఆ విధవరాలిని పెళ్లి చేసుకోవచ్చు. వాళ్లకు పుట్టే పిల్లవాడు, చనిపోయిన ఆ వ్యక్తి పేరును, వంశాన్ని, స్వాస్థ్యాన్ని నిలబెట్టేవాడు. bద్వితీ. 25:5-7.

12 రూతు ఏమి చేయాలో నయోమి వివరించింది. అత్త చెబుతుంటే ఆ యువతి కళ్లు విప్పార్చి వినివుంటుంది. ధర్మశాస్త్రం, అందులోని ఆచారాలు రూతుకు ఇంకా కొత్తే. అయినా, ఆమెకు నయోమిమీద ఎంత గౌరవముందంటే, అత్త చెప్పే ప్రతీ మాట జాగ్రత్తగా విన్నది. అత్త చేయమన్న పనులు రూతుకు ఎబ్బెట్టుగా, అవమానకరంగా అనిపించివుంటాయి. అయినా రూతు కాదనలేదు. వినయంగా, “నీవు సెలవిచ్చినదంతయు చేసెదను” అంది.—రూతు 3:5.

13. పెద్దవాళ్ల సలహాలు పాటించే విషయంలో రూతు నుండి ఏమి నేర్చుకోవచ్చు? (యోబు 12:12 కూడా చూడండి.)

13 కొన్నిసార్లు పెద్దవాళ్లు, అనుభవజ్ఞులు ఇచ్చే సలహాలు వినడం యువతీయువకులకు కష్టమనిపిస్తుంది. తమకు ఎదురయ్యే సమస్యలు, సవాళ్లు పెద్దవాళ్లకు సరిగా అర్థంకావని వాళ్లకు అనిపించవచ్చు. మనల్ని ప్రేమించే పెద్దవాళ్లు, మన శ్రేయస్సు కోరి ఇచ్చే జ్ఞానవంతమైన సలహాలు పాటిస్తే మేలు జరుగుతుందని రూతు జీవితం చూపిస్తుంది. (కీర్తన 71:17, 18 చదవండి.) ఇంతకీ, నయోమి ఇచ్చిన సలహా ఏమిటి? దాన్ని పాటించడంవల్ల రూతుకు నిజంగా మేలు జరిగిందా?

కళ్లం దగ్గర రూతు

14. కళ్లం అంటే ఏమిటి? అక్కడ ఏమి చేసేవాళ్లు?

14 రూతు ఆ రోజు సాయంత్రం కళ్లం దగ్గరకు వెళ్లింది. చాలామంది రైతులు ధాన్యాన్ని అక్కడకు తీసుకువెళ్లి నూర్చి, తూర్పారబట్టేవాళ్లు. సాధారణంగా కొండప్రాంతంలో గానీ కొండమీద గానీ, సాయంకాల వేళల్లో గాలులు బలంగా వీచే స్థలాన్ని కళ్లంగా ఉపయోగించేవాళ్లు. పనివాళ్లు పెద్దపెద్ద పారలతో ధాన్యాన్ని అక్కడ తూర్పారబట్టేవాళ్లు. గింజలు నేలమీద పడేవి, పొట్టు గాలికి ఎగిరిపోయేది.

15, 16. (ఎ) బోయజు పని పూర్తయిన తర్వాత ఏమి జరిగిందో వివరించండి. (బి) రూతు తన కాళ్ల దగ్గర పడుకొనివుందని బోయజుకు ఎలా తెలిసింది?

15 సాయంత్రం పనివాళ్లు పనులు ముగించుకుంటున్నారు. రూతు పరిసరాలను జాగ్రత్తగా గమనిస్తోంది. బోయజు తూర్పారబట్టే పనిని చూసుకున్నాడు, ధాన్యం పెద్ద కుప్ప అయింది. పని పూర్తయ్యాక కడుపార భోంచేసి, ధాన్యం కుప్పకు ఒకవైపున నడుం వాల్చాడు. చేతికందిన విలువైన పంట దొంగలు, దోపిడీదారుల బారినపడకుండా చూసుకోవడానికి కాబోలు అప్పట్లో అలా చేసేవాళ్లు. బోయజు నిద్రకు ఉపక్రమించడం రూతు చూసింది. నయోమి చెప్పినట్టు చేసే సమయం ఇప్పుడు ఆసన్నమైంది.

16 రూతు మెల్లగా బోయజు దగ్గరకు వెళ్తోంది, ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆయన గాఢనిద్రలో ఉన్నాడని నిర్ధారించుకున్నాక, నయోమి చెప్పినట్టు ఆయన దగ్గరికి వెళ్లి, ఆయన కాళ్లమీద దుప్పటి తొలగించి పాదాల దగ్గరే పడుకుంది. ఆయనకు మెలకువ వచ్చేవరకు కనిపెట్టుకొనివుంది. సమయం గడిచేకొద్దీ రూతుకు క్షణమొక యుగంలా అనిపించివుంటుంది. దాదాపు మధ్యరాత్రివేళ బోయజు కాస్త కదిలాడు. చలికి వణికిపోతూ, కాళ్లకు దుప్పటి కప్పుకోవడానికి కావచ్చు ముందుకు వంగాడు. అక్కడ ఎవరో ఉన్నట్టు అనిపించింది. ఆ సన్నివేశాన్ని బైబిలు ఇలా వివరిస్తోంది: ‘ఒక స్త్రీ అతని కాళ్లయొద్ద పండుకొనియుండెను!’—రూతు 3:8.

17. రూతు మాటల్లో, చేతల్లో చెడు ఉద్దేశం కనిపిస్తుందనేవాళ్లు ఏ రెండు వాస్తవాలను మరచిపోతున్నారు?

17 ‘నీవెవరవు?’ అని బోయజు అడిగాడు. అప్పుడు రూతు వణుకుతున్న స్వరంతో కావచ్చు ఇలా అంది: “నేను రూతు అను నీ దాసురాలిని; నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలిమీద నీ కొంగు కప్పుము.” (రూతు 3:9) ఇక్కడ రూతు మాటల్లో, చేతల్లో చెడు ఉద్దేశం కనిపిస్తుందని కొందరు ఆధునిక వ్యాఖ్యాతలు అంటారు. కానీ వాళ్లు రెండు వాస్తవాలను మరచిపోతున్నారు. మొదటిది, ఆ కాలపు ఆచారాల ప్రకారం రూతు ప్రవర్తించింది. అవి మనకు అర్థంకావు. కాబట్టి, ఆమె పనులను నేటి దిగజారిన నైతిక విలువల వెలుగులో వంకర దృష్టితో చూస్తూ తప్పుబట్టడం సరికాదు. రెండవది, బోయజు రూతు ప్రవర్తనను పవిత్రమైనదిగా, ప్రశంసనీయమైనదిగా ఎంచాడని ఆయన మాటల్లో తెలుస్తోంది.

రూతు ఏ స్వార్థమూ లేకుండా స్వచ్ఛమైన ఉద్దేశంతోనే బోయజు దగ్గరికి వెళ్లింది

18. రూతుకు ధైర్యం చెప్పడానికి బోయజు ఏమన్నాడు? ఆమె విశ్వసనీయమైన ప్రేమను చూపించిన ఏ రెండు సందర్భాల గురించి ఆయన మాట్లాడాడు?

18 బోయజు ఊరడించే స్వరంతో మృదువుగా మాట్లాడేసరికి రూతుకు కాస్త ధైర్యం వచ్చివుంటుంది. ఆయన ఇలా అన్నాడు: “నా కుమారీ, యెహోవాచేత నీవు దీవెన నొందినదానవు; కొద్దివారినే గాని గొప్పవారినే గాని యౌవనస్థులను నీవు వెంబడింపక యుండుటవలన నీ మునుపటి సత్‌ ప్రవర్తనకంటె వెనుకటి సత్‌ ప్రవర్తన మరి ఎక్కువైనది.” (రూతు 3:10) ‘మునుపటి ప్రవర్తన’ అన్నప్పుడు రూతు నయోమి దేశానికి వచ్చి, ఆమె గురించి శ్రద్ధ తీసుకుంటూ విశ్వసనీయమైన ప్రేమ చూపించడం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ‘వెనుకటి ప్రవర్తన’ అంటే ఇప్పుడు ఆమె చేస్తున్నదని ఆయన ఉద్దేశం. రూతులాంటి అమ్మాయికి, ధనికుడో పేదవాడో మంచి వయసులో ఉన్న వ్యక్తి భర్తగా దొరకడం పెద్ద కష్టమేమీ కాదని బోయజుకు తెలుసు. అయితే ఆమె నయోమికే కాదు చనిపోయిన ఆమె భర్తకు కూడా మేలు చేయాలనుకుంది, స్వదేశంలో ఆయన పేరు నిలబెట్టాలనుకుంది. అందుకే, నిస్వార్థంగా ఈ యువతి చేసిన పనులను చూసి బోయజు ముగ్ధుడయ్యాడు.

19, 20. (ఎ) బోయజు రూతును వెంటనే ఎందుకు పెళ్లి చేసుకోలేదు? (బి) రూతు మీద దయ, ఆమె పరువు గురించి పట్టింపు ఉన్నాయని బోయజు ఎలా చూపించాడు?

19 బోయజు ఇంకా ఇలా అన్నాడు: “కాబట్టి నా కుమారీ, భయపడకుము; నీవు చెప్పినదంతయు నీకు చేసెదను. నీవు యోగ్యురాలవని నా జనులందరు ఎరుగుదురు.” (రూతు 3:11) రూతును పెళ్లిచేసుకోవడం బోయజుకు ఇష్టమే. కాబట్టి, విడిపించమని రూతు అడగడం ఆయనకు అంత కొత్తగా ఏమీ అనిపించివుండదు. అయితే బోయజు నీతిమంతుడు, అందుకే తనకు నచ్చినట్టు చేసుకుంటూ పోలేదు. ఆమెను విడిపించడానికి, చనిపోయిన నయోమి భర్త కుటుంబానికి మరింత దగ్గరి బంధువు ఒకతనున్నాడని రూతుకు చెప్పాడు. బోయజు, ముందు అతనితో మాట్లాడి, రూతును పెళ్లిచేసుకునే అవకాశం మొదట అతనికే ఇవ్వాలనుకున్నాడు.

ఇతరులను గౌరవిస్తూ, వాళ్లతో దయగా వ్యవహరిస్తూ రూతు మంచి పేరు సంపాదించుకుంది

20 పొద్దుపొడిచేవరకు అక్కడే పడుకోమని బోయజు రూతుకు చెప్పాడు. అప్పుడు ఆమె చీకటితోనే లేచి ఎవరికంటా పడకుండా ఇంటికి వెళ్లిపోవచ్చు. తమ మధ్య ఏదో జరిగిందని లోకులు తప్పుగా అనుకునే అవకాశముంది కాబట్టి, ఆయన తన పేరు, రూతు పేరు పాడవకుండా చూడాలనుకున్నాడు. బోయజు అంత దయగా స్పందించినందుకు రూతు చాలా ప్రశాంతంగా ఆయన కాళ్ల దగ్గర పడుకొనివుంటుంది. రూతు తెల్లవారకముందే లేచింది. బోయజు ఆమె తెచ్చుకున్న దుప్పటి నిండా యవలను పోశాడు, మూట తీసుకొని ఆమె బేత్లెహేముకు బయలుదేరింది.—రూతు 3:13-15 చదవండి.

21. రూతుకు “యోగ్యురాలు” అనే పేరు ఎలా వచ్చింది? మనం ఆమెను ఎలా ఆదర్శంగా తీసుకోవచ్చు?

21 తాను “యోగ్యురాలు” అనే విషయం అందరికీ తెలుసని బోయజు అన్న మాటల గురించి ఆలోచించినప్పుడు రూతుకు ఎంత సంతృప్తిగా అనిపించివుంటుందో కదా! యెహోవాను తెలుసుకుని, ఆయనను సేవించాలనే తపన ఉండడం వల్లే ముఖ్యంగా ఆమెకు ఆ పేరు వచ్చింది. అంతేకాదు రూతు నయోమిని, ఆమె ప్రజలను అర్థంచేసుకుని వాళ్లతో దయగా కూడా ప్రవర్తించింది. ఏమాత్రం పరిచయంలేని ఆచారవ్యవహారాలు పాటించడానికి సిద్ధపడింది. మనం రూతులా విశ్వాసం చూపిస్తే మనం కూడా ఇతరులను, వాళ్ల ఆచారవ్యవహారాలను మనస్ఫూర్తిగా గౌరవిస్తాం. మనమూ మంచి పేరు తెచ్చుకుంటాం.

రూతుకు విశ్రాంతి

22, 23. (ఎ) బోయజు రూతుకు ఏ ఉద్దేశంతో ఆరు కొలల యవలు బహుమానంగా ఇచ్చివుంటాడు? (అధస్సూచి చూడండి.) (బి) నయోమి రూతును ఏమి చేయమంది?

22 రూతు ఇంటికి రాగానే నయోమి ఇలా అడిగింది: ‘నా కుమారీ, నీ పని ఎట్లు జరిగెను?’ రూతు ఇంకా విధవరాలిగానే ఉందా లేక ఆమె పరిస్థితిలో ఏమైనా మార్పు రానుందా అని తెలుసుకోవాలనే అలా అడిగింది. బోయజు దగ్గరకు వెళ్లినప్పుడు జరిగినదంతా రూతు గుక్కతిప్పుకోకుండా అత్తకు చెప్పేసింది. బోయజు ఇచ్చి పంపిన యవలను కూడా ఆమెకు చూపించింది. cరూతు 3:16, 17.

23 నయోమి తెలివిగా, ఆ రోజు పరిగె ఏరుకోవడానికి పొలాలకు వెళ్లకుండా ఇంటిపట్టునే ఉండమని రూతుతో అంది. “నా కుమారీ, యీ సంగతి నేటిదినమున నెరవేర్చితేనే కాని ఆ మనుష్యుడు ఊరకుండడు” అంటూ రూతులో ధైర్యం నింపింది.—రూతు 3:18.

24, 25. (ఎ) బోయజు నిస్వార్థపరుడని, నిజాయితీపరుడని ఎలా చెప్పవచ్చు? (బి) రూతు ఎలాంటి ఆశీర్వాదాలు పొందింది?

24 బోయజు గురించి నయోమి చెప్పినట్టే జరిగింది. ఆయన ఊరి పెద్దలు కలుసుకునే పురద్వారం దగ్గరకు వెళ్లి ఆ సమీప బంధువు వచ్చేవరకు అక్కడే కనిపెట్టుకొనివున్నాడు. అతను వచ్చిన తర్వాత, రూతును పెళ్లిచేసుకొని ఆమెను విడిపించే ప్రతిపాదనను సాక్షుల సమక్షంలో అతని ముందుంచాడు. ఆ బంధువు తన స్వాస్థ్యం ఎక్కడ పోతుందోననే భయంతో ఆ ప్రతిపాదనను నిరాకరించాడు. అప్పుడు బోయజు తాను ఆమెను విడిపిస్తాననీ, చనిపోయిన నయోమి భర్త ఎలీమెలెకు స్వాస్థ్యాన్ని కొంటాననీ, విధవరాలైన ఆయన కోడలిని పెళ్లిచేసుకుంటాననీ ఆ సాక్షుల సమక్షంలో చెప్పాడు. దానివల్ల, ‘చనిపోయినవాని పేరట అతని స్వాస్థ్యము స్థిరపడుతుందనే’ ఆశాభావాన్ని బోయజు వ్యక్తంచేశాడు. (రూతు 4:1-10) బోయజు నిజంగా నిస్వార్థపరుడు, నిజాయితీపరుడు.

25 బోయజు రూతును పెళ్లిచేసుకున్నాడు. ఆ తర్వాత జరిగినదాని గురించి బైబిలు ఇలా చెబుతోంది: “యెహోవా ఆమె గర్భవతి యగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారుని కనెను.” బేత్లెహేము స్త్రీలు నయోమిని ఆశీర్వదించారు, నయోమికి ఏడుగురు కుమారులకన్నా రూతు ఎక్కువని అంటూ ఆమెను పొగిడారు. రూతు కుమారుని వంశంలోనే గొప్ప రాజైన దావీదు వచ్చాడని మనం చదువుతాం. (రూతు 4:11-21) దావీదు వంశంలోనే ఆ తర్వాత యేసుక్రీస్తు పుట్టాడు.—మత్త. 1:1. d

మెస్సీయకు పూర్వీకురాలయ్యేలా యెహోవా రూతును ఆశీర్వదించాడు

26. రూతు, నయోమిల గురించి చదివినప్పుడు మనకు ఏమి తెలుస్తుంది?

26 యెహోవా రూతును, నయోమిని నిజంగా ఆశీర్వదించాడు. రూతు కుమారుణ్ణి నయోమి తన కన్నబిడ్డలా పెంచింది. అయినవాళ్ల కోసం కష్టపడేవాళ్లను, తన ప్రజలతో కలిసి నమ్మకంగా తనను సేవించేవాళ్లను యెహోవా దేవుడు తప్పక గమనిస్తాడు. అందుకు ఆ ఇద్దరి స్త్రీల జీవితాలే తిరుగులేని నిదర్శనాలు. బోయజు, నయోమి, రూతు లాంటి నమ్మకమైన సేవకులను ఆయన తప్పకుండా ఆశీర్వదిస్తాడు.

a నయోమి అర్థంచేసుకున్నట్టు, యెహోవా కేవలం బ్రతికివున్నవాళ్ల మీదే కాదు చనిపోయినవాళ్ల మీద కూడా దయ చూపిస్తాడు. ఆమె తన భర్తను, ఇద్దరు కుమారులను పోగొట్టుకుంది. రూతు కూడా తన భర్తను పోగొట్టుకుంది. ఆ ముగ్గురు పురుషులు తమ భార్యల యోగక్షేమాల గురించి బాగా ఆలోచించివుంటారు. కాబట్టి నయోమి, రూతుల మీద ఏ కాస్త దయ చూపించినా, అది ఆ ముగ్గురు పురుషుల మీద చూపించినట్లే.

b స్వాస్థ్యపు హక్కులాగే, అలాంటి విధవరాలిని పెళ్లిచేసుకునే హక్కు ముందుగా చనిపోయిన వ్యక్తి సహోదరులకు, ఆ తర్వాత దగ్గరి బంధువులకు ఉండేది.—సంఖ్యా. 27:5-11.

c బోయజు రూతుకు ఆరు కొలల యవలు ఇచ్చాడు. బహుశా ఆరు పనిరోజుల తర్వాత విశ్రాంతి దినం వచ్చినట్లే, ఎన్నో రోజుల నుండి కష్టపడుతూ వస్తున్న రూతుకు త్వరలో “విశ్రాంతి” లభిస్తుందని అంటే ఆమెకో తోడు, నీడ లభించనున్నాయనే ఉద్దేశంతో అలా ఇచ్చివుంటాడు. ఆ ఆరు కొలలు బహుశా పెద్ద పారతో ఆరుసార్లు పోస్తే వచ్చేన్ని యవలైవుంటాయి. ఎందుకంటే రూతు మోయగలిగింది అంత బరువే అయ్యుంటుంది.

d బైబిల్లోని యేసు వంశావళిని గమనిస్తే, అందులో ఐదుగురు స్త్రీల ప్రస్తావన ఉంది. వాళ్లలో ఒకరు రూతు. మరొకరు బోయజు తల్లి రాహాబు. (మత్త. 1:3, 5, 6, 16) రూతులాగే ఈమె కూడా ఇశ్రాయేలీయురాలు కాదు.