ముందుమాట
‘విశ్వాసము చేతను, ఓర్పుచేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనుడి.’—హెబ్రీయులు 6:11, 12.
1, 2. బైబిల్లోని విశ్వాసం గల వ్యక్తులను ఒక ప్రయాణ పర్యవేక్షకుడు ఎలా అనుకునేవాడు? అలాంటి స్త్రీపురుషులు మనకు మంచి స్నేహితులు అవుతారని ఎందుకు చెప్పవచ్చు?
ఒక వృద్ధ ప్రయాణ పర్యవేక్షకుని ప్రసంగం విన్న తర్వాత ఓ క్రైస్తవ స్త్రీ ఇలా అంది: “బైబిల్లోని వ్యక్తుల గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు విన్నవాళ్లెవరికైనా సరే వాళ్లు ఆయన చిరకాల మిత్రులేమో అనిపిస్తుంది.” ఆమె అన్నది నిజమే, ఎందుకంటే ఆ సహోదరుడు దశాబ్దాలుగా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తున్నాడు, బోధిస్తున్నాడు. అదీ ఎంతగా అంటే, బైబిల్లోని విశ్వాసం గల స్త్రీపురుషులు సుపరిచితులైన చిరకాల మిత్రులైపోయినట్లు ఆయనకు అనిపించింది.
2 బైబిల్లో ప్రస్తావించిన చాలామంది అలాంటి వ్యక్తులు మనకు స్నేహితులైతే ఎంత బాగుంటుందో! వాళ్లు మీ కళ్లెదుటే ఉన్నట్టు మీకూ అనిపిస్తోందా? నోవహు, అబ్రాహాము, రూతు, ఏలీయా, ఎస్తేరు వంటి స్త్రీపురుషులతో కలిసి నడుస్తూ మాట్లాడడం, వాళ్ల గురించి తెలుసుకుంటూ వాళ్లతో సమయం గడపడం ఎలావుంటుందో ఊహించుకోండి. వాళ్లు మీమీద ఎలాంటి ప్రభావం చూపగలరో ఆలోచించండి. వాళ్లు మీకు ఆణిముత్యాల్లాంటి సలహాలను, ప్రోత్సాహాన్ని ఇవ్వగలరు!—సామెతలు 13:20 చదవండి.
3. (ఎ) బైబిల్లోని విశ్వాసంగల స్త్రీపురుషుల గురించి నేర్చుకుంటూ మనం ఎలా ప్రయోజనం పొందుతాం? (బి) మనం ఏ ప్రశ్నలను పరిశీలిస్తాం?
3 ‘నీతిమంతుల పునరుత్థానమప్పుడు’ ప్రోత్సాహాన్నిచ్చే అలాంటి స్నేహాలు పూర్తిస్థాయిలో సాధ్యమౌతాయి. (అపొ. 24:14, 15) అయితే, ప్రస్తుతానికి మనం బైబిల్లోని విశ్వాసంగల ఆ స్త్రీపురుషుల గురించి నేర్చుకుంటూ ప్రయోజనం పొందవచ్చు. అదెలాగో అపొస్తలుడైన పౌలు ఈ మాటల్లో చెబుతున్నాడు: ‘విశ్వాసము చేతను, ఓర్పుచేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనుడి.’ (హెబ్రీ. 6:11, 12) విశ్వాసం గల స్త్రీపురుషుల గురించి మనం అధ్యయనం మొదలుపెట్టే ముందు, పౌలు మాటలు లేవదీసే ఈ ప్రశ్నలను పరిశీలిద్దాం: విశ్వాసం అంటే ఏమిటి? అది మనకు ఎందుకు అవసరం? ప్రాచీన కాలంలోని నమ్మకమైన ప్రజల్లా మనం ఎలా విశ్వాసం చూపించవచ్చు?
విశ్వాసం అంటే ఏమిటి? అది మనకు ఎందుకు అవసరం?
4. విశ్వాసం గురించి ప్రజలు ఏమి అనుకుంటున్నారు? కానీ వాళ్లు అనుకునేది ఎందుకు తప్పు?
4 విశ్వాసం అనేది ఆకట్టుకునే లక్షణం. ఈ పుస్తకంలో మనం అధ్యయనం చేయబోయే స్త్రీపురుషులంతా దాన్ని ఎంతో విలువైనదిగా ఎంచారు. ఈ రోజుల్లో చాలామందికి అసలైన విశ్వాసం అంటే ఏమిటో తెలియదు. విశ్వాసమంటే వాళ్ల దృష్టిలో ఎలాంటి ఆధారాలూ, రుజువులూ లేకుండా ఒకదాన్ని గుడ్డిగా నమ్మడం. కానీ వాళ్లు అనుకునేది తప్పు. విశ్వాసం అంటే గుడ్డి నమ్మకం కాదు, వట్టి భావన అంతకన్నా కాదు. ఏదైనా ఒకదాన్ని గుడ్డిగా నమ్మేయడం ప్రమాదకరం. భావన ఒకసారి కలుగుతుంది, ఆ తర్వాత పోతుంది. దేవుని విషయానికి వస్తే, వట్టి నమ్మకం కూడా సరిపోదు, ఎందుకంటే, “దయ్యములును నమ్మి వణకుచున్నవి.”—యాకో. 2:19.
5, 6. (ఎ) విశ్వాసంలో ఉన్న రెండు అంశాలు ఏవి? (బి) మన విశ్వాసం ఎంత బలంగా ఉండాలి? ఉదాహరించండి.
5 విశ్వాసం అలాంటి వాటి కన్నా ఎక్కువే. బైబిలు దాన్ని ఎలా నిర్వచిస్తుందో గుర్తుచేసుకోండి. (హెబ్రీయులు 11:1 చదవండి.) విశ్వాసంలో రెండు అంశాలున్నాయి. మొదటిది, ‘అదృశ్యంగా’ ఉన్న ప్రస్తుత వాస్తవాలను నమ్మడం. పరలోకంలోవున్న వాస్తవాలను అంటే యెహోవా దేవుణ్ణి, ఆయన కుమారుణ్ణి, పరలోకంలో ఇప్పుడు పరిపాలిస్తున్న దేవుని రాజ్యం వంటివాటిని మనం మన కళ్లతో చూడలేం. రెండవది, ‘నిరీక్షింపబడువాటిని’ అంటే ఇంకా జరగని వాటిని నమ్మడం. దేవుని రాజ్యం త్వరలో తీసుకురానున్న కొత్తలోకాన్ని మనం ఇప్పుడు చూడలేం. అంటే ఆ వాస్తవాల మీద, ఇంకా జరగని వాటి మీద ఉంచే విశ్వాసానికి ఎలాంటి ఆధారాలూ లేవని దానర్థమా?
6 కానేకాదు! అసలైన విశ్వాసం గట్టి రుజువుల మీద ఆధారపడివుంటుంది. విశ్వాసాన్ని “నిజ స్వరూపము” అని అంటున్నప్పుడు పౌలు ఉపయోగించిన మాటను “ఆస్తి హక్కు దస్తావేజు” అని కూడా అనువదించవచ్చు. ఎవరైనా మీకు ఒక ఇల్లు ఇద్దామని అనుకున్నారనుకోండి. దాని దస్తావేజు మీకు ఇచ్చి, “ఇదిగోండి మీ కొత్త ఇల్లు” అన్నారు. మీరు ఆ పేపర్లలో నివసిస్తారని ఆయన ఉద్దేశం కాదు. ఆ చట్టపరమైన దస్తావేజు ఎంత బలమైన రుజువంటే అది మీ చేతుల్లో ఉంటే ఇక ఆ ఇల్లు మీది అయినట్టే. అలాగే, దేవుడు తన వాక్యంలో వాగ్దానం చేసిన ప్రతీది దాదాపు నెరవేరిందనే హామీని మన విశ్వాసం మనకిస్తుంది.
7. అసలైన విశ్వాసం అంటే ఏమిటి?
7 యెహోవా గురించి మనం నేర్చుకున్న వాటి ఆధారంగా ఆయన మీద ఏర్పడే అచంచలమైన, గట్టి నమ్మకమే అసలైన విశ్వాసం. అది ఉంటే మనం ఆయనను ఒక ప్రేమగల తండ్రిలా చూస్తాం, ఆయన చేసిన వాగ్దానాలన్నీ తప్పకుండా నెరవేరతాయని పూర్తిగా నమ్ముతాం. కానీ సరైన విశ్వాసం అంటే ఇంకా ఎక్కువే. సజీవంగా ఉండాలంటే ఏ ప్రాణికైనా పోషణ అవసరం. విశ్వాసం విషయంలో కూడా అంతే. దాన్ని మన పనుల్లో చూపించాలి, లేకపోతే అది చచ్చిపోతుంది.—యాకో. 2:26.
8. విశ్వాసం ఎందుకు ముఖ్యం?
8 విశ్వాసం ఎందుకంత అవసరం? దానికి పౌలు ఒక ముఖ్యమైన కారణం చెప్పాడు. (హెబ్రీయులు 11:6 చదవండి.) మనకు విశ్వాసం లేకపోతే యెహోవాను సమీపించలేం, ఆయనను సంతోషపెట్టలేం. తమ పరలోక తండ్రికి దగ్గరై, ఆయనను మహిమపర్చడమే వివేచనగల ప్రాణుల జీవిత పరమార్థం. దాన్ని చేరుకోవాలంటే విశ్వాసం తప్పనిసరి.
9. మనకు విశ్వాసం ఎంత అవసరమో తనకు తెలుసని యెహోవా ఎలా చూపించాడు?
9 మనకు విశ్వాసం ఎంత అవసరమో యెహోవాకు తెలుసు. అందుకే మనం విశ్వాసాన్ని ఎలా పెంపొందించుకోవాలో, ఎలా చూపించాలో నేర్పించడానికి ఎన్నో జీవితగాథలను బైబిల్లో పొందుపర్చివుంచాడు. నాయకత్వం వహించే నమ్మకమైన పురుషులతో ఆయన క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదిస్తున్నాడు. ఆయన వాక్యం ఇలా చెబుతోంది: “వారి విశ్వాసమును అనుసరించుడి.” (హెబ్రీ. 13:7) ఆయన మనకు ఇంకా ఎక్కువే చేశాడు. విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనాలుగా నిలిచిన ప్రాచీన కాలంలోని స్త్రీపురుషుల “గొప్ప సాక్షి సమూహము” గురించి పౌలు రాశాడు. (హెబ్రీ. 12:1, 2) పౌలు హెబ్రీయులు 11వ అధ్యాయంలో కొంతమంది యెహోవా నమ్మకమైన సేవకుల గురించి పేర్కొన్నాడు. అయితే, అలాంటివాళ్లు ఇంకా చాలామంది ఉన్నారు. అన్ని వయసులకు, నేపథ్యాలకు చెందిన విశ్వాసంగల స్త్రీపురుషుల నిజ జీవితగాథలు బైబిల్లో కోకొల్లలుగా ఉన్నాయి. నేటి అవిశ్వాస లోకంలో ఆ స్త్రీపురుషుల నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు.
ఇతరుల్లా మనం విశ్వాసం ఎలా చూపించవచ్చు?
10. బైబిల్లో నమోదైన విశ్వాసంగల స్త్రీపురుషులను అనుకరించడానికి వ్యక్తిగత అధ్యయనం మనకు ఎలా సహాయం చేస్తుంది?
10 ముందు ఒక వ్యక్తిని దగ్గరగా పరిశీలించకపోతే ఆయనను అనుకరించడం కష్టం. మీరు ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు, విశ్వాసం గల స్త్రీపురుషులను పరిశీలించేందుకు మీకు సహాయం చేయడానికి చాలా పరిశోధన జరిగిందని గమనిస్తారు. మీరు కూడా అలాగే వాళ్ల గురించి ఇంకా ఎక్కువ పరిశోధన చేసిచూడండి. వ్యక్తిగత అధ్యయనం చేస్తున్నప్పుడు, మీకు అందుబాటులో ఉన్న ప్రచురణల సహాయంతో బైబిల్లో లోతుగా పరిశీలించండి. మీరు అధ్యయనం చేస్తున్న దాని గురించి లోతుగా ఆలోచిస్తున్నప్పుడు ఆ వ్యక్తులున్న ప్రాంతాన్ని, పరిసరాలను ఊహించుకోవడానికి ప్రయత్నించండి. మీరు అక్కడ ఉన్నారనుకోండి, ఆ ప్రదేశాన్ని చూడండి, శబ్దాలను వినండి, సువాసనలను ఆఘ్రాణించండి. ముఖ్యంగా, వ్యక్తుల మనోభావాలను గ్రహించడానికి ప్రయత్నించండి. విశ్వాసం గల ఆ స్త్రీపురుషుల పరిస్థితిని అర్థంచేసుకుంటుండగా, వాళ్లు మీ కళ్లముందే ఉన్నట్టుంటారు, మీకు సుపరిచితులుగా అనిపిస్తారు, అంతెందుకు వాళ్లలో కొందరు మీకు చిరకాల నేస్తాల్లా కూడా అనిపిస్తారు.
11, 12. (ఎ) అబ్రాహాము, శారాలకు దగ్గరైనట్టు మీకు ఎప్పుడు అనిపిస్తుంది? (బి) హన్నా, ఏలీయా, సమూయేలు ఉదాహరణల నుండి మీరు ఎలా ప్రయోజనం పొందవచ్చు?
11 మీరు వాళ్ల గురించి బాగా తెలుసుకున్నప్పుడు వాళ్లను అనుకరించాలనే కోరిక మీలో కలుగుతుంది. ఉదాహరణకు, మీరు ఒక కొత్త నియామకం గురించి ఆలోచిస్తున్నారని అనుకోండి. ఎక్కువగా పరిచర్య చేసే అవకాశాన్ని ఇస్తూ యెహోవా సంస్థ మిమ్మల్ని ప్రచారకుల అవసరం ఎక్కువగా ఉన్న చోటకు వెళ్లమంది. లేదా మీరు ఎప్పుడూ చేయని ఒక కొత్త పద్ధతిలో, మీకు ఇబ్బందిగా అనిపించే పద్ధతిలో ప్రకటనా పని చేయడానికి ప్రయత్నించమంది. మీరు ఆ నియామకం గురించి ఆలోచిస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు అబ్రాహాము ఉదాహరణను తలపోయడం సహాయకరంగా ఉండదంటారా? ఆయన, శారా ఊరు పట్టణంలోని మంచిమంచి సౌకర్యాలను విడిచిపెట్టడానికి సిద్ధపడ్డారు, అందుకు యెహోవా వాళ్లను ఎంతో ఆశీర్వదించాడు. మీరు వాళ్ల అడుగుజాడల్లో నడుస్తుండగా, ముందుకన్నా ఇప్పుడు వాళ్లు మీకు బాగా తెలిసినవాళ్లలా అనిపిస్తారు.
12 అలాగే, మీకు బాగా కావల్సినవాళ్లే మిమ్మల్ని బాధపెట్టారని అనుకుందాం. దాంతో మీ మనసు బాగా నొచ్చుకుంది, కూటాలకు వెళ్లకుండా ఇంటిపట్టునే ఉండాలని మీకనిపిస్తోంది. అప్పుడు మీరు ఏమి చేస్తారు? హన్నా గురించి ఆలోచించండి. పెనిన్నా కత్తిపోటు వంటి మాటలతో, చేష్టలతో ఆమె మనసును ఎంతో గాయపర్చినా ఆమె యెహోవాను ఆరాధించడం మానుకోలేదు. హన్నా ఉదాహరణ, సరైన నిర్ణయం తీసుకునేలా మీకు స్ఫూర్తినివ్వగలదు. అలా ఆమె మీకు ఒక మంచి స్నేహితురాలిగా కూడా అనిపిస్తుంది. పనికిరానివాళ్లమనే భావాలు మిమ్మల్ని కృంగదీస్తుంటే ఏలీయా గురించి ఆలోచించండి. మీరు ఆయన దయనీయ స్థితి గురించి, యెహోవా ఆయనను ప్రోత్సహించడం గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు ఏలీయాకు దగ్గరైన భావన మీకు కలుగుతుంది. నైతిక విలువలు లేని తోటి విద్యార్థుల తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే యువతీయువకులు సమూయేలు గురించి అధ్యయనం చేయవచ్చు. యెహోవా మందిరంలో, ఏలీ కుమారుల చెడు ప్రవర్తనకు సమూయేలు ఎలా స్పందించాడో తెలుసుకున్నప్పుడు సమూయేలుకు ఇంకా దగ్గరైనట్టు మీకు అనిపిస్తుంది.
13. మీరు ఇతరుల విశ్వాసాన్ని అనుకరించినప్పుడు, యెహోవా మీ విశ్వాసాన్ని ఏమైనా తక్కువ చేసి చూస్తాడా? వివరించండి.
13 మీరు ఇతరుల విశ్వాసాన్ని అనుకరించినప్పుడు, యెహోవా మీ విశ్వాసాన్ని ఏమైనా తక్కువ చేసి చూస్తాడా? అలా అస్సలు చూడడు! అలాంటి విశ్వాసం గల వ్యక్తులను అనుకరించమని ఆయన వాక్యమే మనల్ని ప్రోత్సహిస్తోందని గుర్తుంచుకోండి. (1 కొరిం. 4:15, 16; 11:1; 2 థెస్స. 3:7, 9) అంతెందుకు, మనం ఈ పుస్తకంలో అధ్యయనం చేయబోతున్న విశ్వాసంగల స్త్రీపురుషుల్లో కొందరు తమకన్నా ముందు జీవించిన వ్యక్తులను అనుకరించారు. ఉదాహరణకు, మరియ మాట్లాడుతున్నప్పుడు ఆమె హన్నా మాటలను ఉల్లేఖించి ఉంటుందని 17వ అధ్యాయంలో చూస్తాం. అంటే, మరియ ఆమెను ఆదర్శంగా తీసుకొనివుంటుంది. మరియ విశ్వాసం తక్కువని దానర్థమా? కాదు! నిజానికి హన్నా ఆదర్శం మరియ విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి సహకరించింది. అలా మరియ యెహోవా దృష్టిలో ప్రత్యేకమైన పేరు సంపాదించుకుంది.
14, 15. ఈ పుస్తకానికి ఉన్న కొన్ని విశిష్టతలు ఏమిటి? దాని నుండి మంచిగా ప్రయోజనం పొందాలంటే ఏమి చేయాలి?
14 మీ విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి మీకు సహాయం చేయడమే ఈ ప్రచురణ ఉద్దేశం. ఈ పుస్తకంలోని అధ్యాయాలు, 2008 నుండి 2013 వరకు “వారి విశ్వాసాన్ని అనుసరించండి” అనే పేరు కింద కావలికోటలో వచ్చిన ఆర్టికల్స్ నుండి తీసుకున్నవి. a అధ్యాయాన్ని చర్చించేందుకు, పాటించడానికి తోడ్పడే అంశాలను అందులో నుండి రాబట్టేందుకు వీలుగా ప్రశ్నలున్నాయి. ప్రత్యేకంగా ఈ పుస్తకం కోసమే రూపొందించిన రంగురంగుల, వర్ణనాత్మక చిత్రాలెన్నో ఇందులో ఉన్నాయి. ముందున్న చిత్రాలకు కొత్త హంగులద్ది పెద్దవిగా చేశాం. కాలరేఖ, మ్యాపుల వంటి ఉపయోగకరమైనవి కూడా ఉన్నాయి. వాళ్లలా విశ్వాసం చూపించండి అనే ఈ పుస్తకం వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా అధ్యయనం చేసేందుకు అనువుగా ఉంటుంది. కుటుంబంలో అందరూ కలిసి ఆ కథలను సరదాగా బయటకు చదువుకోవచ్చు.
15 యెహోవా ప్రాచీనకాల విశ్వసనీయ సేవకుల్లా విశ్వాసం చూపించడానికి ఈ పుస్తకం మీ అందరికీ తప్పకుండా తోడ్పడుతుంది. మీరు విశ్వాసంలో దినదిన ప్రవర్ధమానం చెందుతూ మీ పరలోక తండ్రి యెహోవాకు మీరు మరింత దగ్గరవ్వాలి! అందుకు ఈ పుస్తకం మీకు మంచి పనిముట్టుగా ఉపయోగపడాలని మనసారా కోరుకుంటున్నాం.
[అధస్సూచి]
a అయితే, తెలుగులో మాత్రం కొన్ని ఆర్టికల్సే ప్రచురితమయ్యాయి.