కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

8వ అధ్యాయం

ఆశాభంగాలు ఎదురైనా చివరివరకు నమ్మకంగా ఉన్నాడు

ఆశాభంగాలు ఎదురైనా చివరివరకు నమ్మకంగా ఉన్నాడు

1. షిలోహు పట్టణమంతా ఎందుకు శోకసముద్రంలో మునిగిపోయింది?

 సమూయేలు, షిలోహులో ప్రజలు పడుతున్న దుఃఖాన్ని చూసి తనూ ఎంతో దుఃఖపడ్డాడు. దాదాపు ఆ పట్టణమంతా శోకసముద్రంలో మునిగిపోయింది. తమ తండ్రులు, భర్తలు, కుమారులు, అన్నదమ్ముళ్లు ఇక ఇంటికి రారని విలపిస్తున్న స్త్రీల, పిల్లల ఏడుపులు ఎన్నో ఇళ్లల్లో నుండి వినిపిస్తున్నాయి. ఇశ్రాయేలీయులు ఒక యుద్ధంలో 4,000 మంది సైనికులను పోగొట్టుకున్న కొంతకాలానికే ఫిలిష్తీయుల చేతుల్లో చిత్తుగా ఓడిపోయారని, దాదాపు 30,000 మంది సైనికులు చనిపోయారని మాత్రమే మనకు తెలుసు.—1 సమూ. 4:1, 2, 10.

2, 3. వరుసగా చోటుచేసుకున్న ఏ విషాద సంఘటనల వల్ల షిలోహు తన వైభవాన్ని కోల్పోయింది?

2 వాళ్ల మీద విరుచుకుపడిన విపత్తుల్లో అది ఒకటి మాత్రమే. ప్రధానయాజకుడు ఏలీ చెడ్డ కుమారులు హొఫ్నీ, ఫీనెహాసులు పరిశుద్ధ నిబంధన మందసంతోపాటు షిలోహులో నుండి బయటకు వచ్చారు. ఈ అమూల్యమైన పెట్టె, సాధారణంగా గుడారంలాంటి మందిరంలోని అతిపరిశుద్ధ స్థలంలో ఉంటుంది. యెహోవా తన ప్రజలతో ఉన్నాడనడానికి అది గుర్తుగా ఉండేది. మందసం తమ మధ్యవుంటే చాలు విజయం తమను వరిస్తుందని మూర్ఖంగా అనుకుంటూ ప్రజలు దాన్ని యుద్ధభూమికి తీసుకువెళ్లారు. కానీ, ఫిలిష్తీయులు ఆ మందసాన్ని పట్టుకొని హొఫ్నీని, ఫీనెహాసును చంపేశారు.—1 సమూ. 4:3-11.

3 శతాబ్దాలుగా ఆ మందసం షిలోహులోని మందిరంలో ఉండడంవల్ల ఆ మందిరానికే ఘనత వచ్చింది. అది ఇప్పుడు లేకుండా పోయింది. ఆ వార్త చెవినపడగానే, 98 ఏళ్ల ఏలీ తను కూర్చున్న పీఠం మీద నుండి వెనక్కిపడి చనిపోయాడు. అదేరోజు భర్తను కోల్పోయిన ఏలీ కోడలు కూడా ప్రసవిస్తూ చనిపోయింది. చనిపోకముందు ఆమె ఇలా అంది: “ప్రభావం ఇశ్రాయేలీయులలోనుండి చెరపట్టబడి పోయెను.” నిజంగానే షిలోహుకు, పూర్వ వైభవం ఎప్పటికీ రాదు.—1 సమూ. 4:12-22.

4. ఈ అధ్యాయంలో మనం ఏమి చర్చిస్తాం?

4 సమూయేలు తీవ్రమైన ఈ ఆశాభంగాలను ఎలా తట్టుకున్నాడు? యెహోవా సంరక్షణను, ఆమోదాన్ని కోల్పోయిన ప్రజలకు సహాయం చేయడమనే సవాలును ఎదుర్కొనేంత గట్టి విశ్వాసం ఆయనకు ఉందా? కొన్నిసార్లు విశ్వాసాన్ని పరీక్షించే కష్టాలు, ఆశాభంగాలు మనందరికీ ఎదురవుతాయి కాబట్టి సమూయేలు నుండి ఇంకా మనం ఏమి నేర్చుకోవచ్చో చూద్దాం.

ఆయన ‘నీతికార్యాలు జరిగించాడు’

5, 6. సమూయేలు ప్రస్తావన లేని 20 ఏళ్లలో జరిగిన ఏ సంగతుల గురించి బైబిలు తెలియజేస్తోంది? ఆ సమయంలో సమూయేలు ఏమి చేశాడు?

5 ఆ తర్వాత బైబిలు సమూయేలు గురించి కాకుండా పరిశుద్ధ మందసం గురించి మాట్లాడుతోంది. మందసాన్ని పట్టుకున్నందుకు ఫిలిష్తీయులు పడిన బాధల గురించి, దాన్ని బలవంతంగా ఎలా తిరిగి ఇచ్చేయాల్సి వచ్చిందనే వైనం గురించి వివరిస్తోంది. బైబిలు మళ్లీ సమూయేలు గురించి ప్రస్తావించేసరికి దాదాపు 20 ఏళ్లు గడిచిపోయాయి. (1 సమూ. 7:2) అయితే ఆ సంవత్సరాల్లో ఆయన ఏమి చేశాడు? దాని గురించి బైబిలు చెబుతోంది.

తీవ్రమైన దుఃఖాన్ని, ఆశాభంగాన్ని తట్టుకోవడానికి సమూయేలు ఎలా సహాయం చేశాడు?

6 “సమూయేలు తాను బ్రదికిన దినములన్నియు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను” అని బైబిలు చెబుతోంది. (1 సమూ. 7:15-17) ఆ 20 ఏళ్ల తర్వాత, ప్రజలకు న్యాయం తీర్చడానికి, వాళ్ల ప్రశ్నలకు జవాబు చెప్పడానికి సమూయేలు ప్రతీ సంవత్సరం ఇశ్రాయేలులోని మూడు పట్టణాలను సందర్శించి, సొంతూరు రామాకు తిరిగి వచ్చేవాడని బైబిలు తెలియజేస్తోంది. సమూయేలు ఎప్పుడూ ఖాళీగా ఉండేవాడు కాదు, కాబట్టి ఆ 20 ఏళ్లలో కూడా ఆయన ఎంతో సేవచేసి ఉంటాడని అర్థమౌతోంది.

సమూయేలు జీవితంలో ఓ 20 ఏళ్ల గురించి బైబిలు ఏమీ చెప్పకపోయినా, అప్పుడు కూడా ఆయన యెహోవా సేవలోనే నిమగ్నమైవుంటాడు

7, 8. (ఎ) రెండు దశాబ్దాలు కృషి చేసిన తర్వాత సమూయేలు ప్రజలకు ఏ సందేశం ప్రకటించాడు? (బి) సమూయేలు ఇచ్చిన హామీకి ప్రజలు ఎలా స్పందించారు?

7 ఏలీ కుమారుల అనైతికత, మోసం వల్ల ప్రజల్లో విశ్వాసం తగ్గిపోయింది. దానివల్లే, చాలామంది విగ్రహారాధన మొదలుపెట్టివుంటారు. అయితే, రెండు దశాబ్దాలు కృషి చేసిన తర్వాత సమూయేలు ప్రజలకు ఈ సందేశం ప్రకటించాడు: ‘మీ పూర్ణ హృదయంతో యెహోవావైపు మళ్లితే, అన్యదేవతలను అష్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి, పట్టుదలతో యెహోవావైపు మీ హృదయాలను తిప్పి ఆయనను సేవిస్తే, ఆయన ఫిలిష్తీయుల చేతిలోనుండి మిమ్మల్ని విడిపిస్తాడు.’—1 సమూ. 7:3.

8 ‘ఫిలిష్తీయుల చేయి’ ప్రజలకు భారంగా తయారైంది. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల సైన్యం చిత్తుగా ఓడిపోవడంతో, ఇక వాళ్లను అణగద్రొక్కినా తమను శిక్షించేవాళ్లు ఎవరూ ఉండరని ఫిలిష్తీయులు అనుకొనివుంటారు. కానీ యెహోవావైపు తిరిగితే పరిస్థితి చక్కబడుతుందని సమూయేలు ఇశ్రాయేలీయులకు హామీ ఇచ్చాడు. వాళ్లు దానికి సుముఖంగా ఉన్నారా? అవును. వాళ్లు తమ విగ్రహాలను తీసేసి, ‘యెహోవాను మాత్రమే సేవించడం’ మొదలుపెట్టారు. అది చూసి సమూయేలు చాలా సంతోషించాడు. ఆయన యెరూషలేముకు ఉత్తరాన పర్వతప్రాంతంలోవున్న మిస్పా అనే పట్టణంలో సమావేశం ఏర్పాటు చేశాడు. అక్కడ సమావేశమైన ఇశ్రాయేలీయులు ఉపవాసముండి, విగ్రహారాధనకు సంబంధించి చేసిన ఎన్నో పాపాల విషయంలో పశ్చాత్తాపపడ్డారు.—1 సమూయేలు 7:4-6 చదవండి.

పశ్చాత్తాపపడిన యెహోవా ప్రజలు మిస్పాలో సమావేశమయ్యారని తెలుసుకున్న ఫిలిష్తీయులు, వాళ్లను అణగద్రొక్కడానికి మంచి అవకాశం దొరికిందనుకున్నారు

9. ఫిలిష్తీయులు ఏ మంచి అవకాశం దొరికిందని అనుకున్నారు? రానున్న ప్రమాదాన్ని గుర్తించిన ఇశ్రాయేలీయులు ఏమి చేశారు?

9 అయితే, ఇశ్రాయేలీయులు సమావేశమయ్యారని తెలుసుకున్న ఫిలిష్తీయులు, వాళ్ల మీద దండెత్తడానికి మంచి అవకాశం దొరికిందని అనుకున్నారు. వాళ్లు ఆ యెహోవా ఆరాధకులను మట్టుపెట్టడానికి తమ సైన్యాన్ని మిస్పాకు పంపారు. రానున్న ప్రమాదం గురించి ఇశ్రాయేలీయులకు తెలిసింది. వాళ్లు భయపడిపోయి, తమ కోసం ప్రార్థన చేయమని సమూయేలును అడిగారు. ఆయన ప్రార్థన చేసి, బలి కూడా అర్పించాడు. ఆ పవిత్రమైన కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఫిలిష్తీయుల సైన్యం మిస్పా దగ్గరకు వచ్చింది. అప్పుడు యెహోవా సమూయేలు ప్రార్థనకు జవాబిచ్చాడు, ఉరుముల శబ్దంతో తన కోపాన్ని వెళ్లగక్కాడు. ఆయన ఆ రోజు, ‘మహా ఉరుముల ధ్వనితో ఫిలిష్తీయుల్లో భయాందోళనలు కలిగించాడు.’—1 సమూ. 7:7-10, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

10, 11. (ఎ) ఫిలిష్తీయుల సైన్యం మీదికి యెహోవా రప్పించిన ఉరుము ఎందుకు అసాధారణమైనది అయ్యుంటుంది? (బి) మిస్పాలో మొదలైన యుద్ధం వల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయి?

10 ఉరుముల శబ్దానికి భయపడిపోయి తల్లి చాటున దాక్కునే పిల్లల్లా ఆ ఫిలిష్తీయులు ఉన్నారని మనం అనుకోవాలా? లేదు. వాళ్లు శరీర దారుఢ్యమున్న, యుద్ధంలో రాటుదేలిన సైనికులు. కాబట్టి ఆ ఉరుము ఇంతకుముందు వాళ్లు విన్న ఉరుములాంటిది కాకపోవచ్చు. ఆ ‘మహా ఉరుము’ వల్ల వచ్చిన భీకరమైన శబ్దానికి వాళ్లు భయపడ్డారా? ఆ శబ్దం నిర్మలమైన వినీలాకాశం నుండి వచ్చిందా? లేదా ఆ పర్వతప్రాంతంలో అది ప్రతిధ్వనించిందా? ఏదేమైనా అది ఫిలిష్తీయులను గడగడలాడించింది. వాళ్లలో పెద్ద గందరగోళం ఏర్పడింది. అప్పటిదాకా వాళ్లు హింసించిన ఇశ్రాయేలీయులకు వాళ్లే ఎరగా మారారు. మిస్పా నుండి దూసుకొచ్చిన ఇశ్రాయేలీయులు వాళ్లను ఓడించి యెరూషలేముకు నైరుతి దిక్కున ఎన్నో మైళ్ల వరకు వాళ్లను తరుముకుంటూ వెళ్లారు.—1 సమూ. 7:11.

11 ఆ యుద్ధం దేవుని ప్రజలకు ఓ మైలురాయి లాంటిది. సమూయేలు న్యాయాధిపతిగా ఉన్న ఆ తర్వాతి కాలమంతట్లో ఫిలిష్తీయులు పారిపోతూనే ఉన్నారు. దేవుని ప్రజలు ఒక్కో పట్టణాన్ని మళ్లీ స్వాధీనం చేసుకున్నారు.—1 సమూ. 7:13, 14.

12. సమూయేలు ఎలాంటి ‘నీతికార్యాలను జరిగించాడు’? ఏ లక్షణాల వల్ల ఆయన చివరివరకు అలా చేయగలిగాడు?

12 చాలా శతాబ్దాల తర్వాత అపొస్తలుడైన పౌలు, ‘నీతికార్యాలను జరిగించిన’ నమ్మకమైన న్యాయాధిపతుల గురించి, ప్రవక్తల గురించి మాట్లాడుతున్నప్పుడు సమూయేలు పేరు కూడా ప్రస్తావించాడు. (హెబ్రీ. 11:32, 33) సమూయేలు దేవుని దృష్టికి మంచిది, సరైనది చేస్తూ వచ్చాడు. అలా చేసేందుకు ప్రజలకు సహాయపడ్డాడు. ఆశాభంగాలు ఎదురైనా ఓర్పుగా యెహోవా మీద ఆధారపడి, తన పనికి నమ్మకంగా అంటిపెట్టుకొని ఉన్నాడు కాబట్టే, చివరివరకు అలా చేయగలిగాడు. అంతేకాదు, ఆయన కృతజ్ఞతా స్ఫూర్తిని కూడా కనబర్చాడు. మిస్పా దగ్గర విజయం సాధించిన తర్వాత, యెహోవా తన ప్రజలకు చేసిన సహాయానికి గుర్తుగా సమూయేలు ఒక రాయిని ప్రతిష్ఠించాడు.—1 సమూ. 7:12.

13. (ఎ) సమూయేలును ఆదర్శంగా తీసుకోవాలంటే మనకు ఏ లక్షణాలు ఉండాలి? (బి) సమూయేలులాంటి లక్షణాలు పెంపొందించుకోవడానికి ఏది సరైన సమయమని మీరు అనుకుంటున్నారు?

13 మీరు కూడా ‘నీతికార్యాలను జరిగించాలని’ అనుకుంటున్నారా? అలాగైతే, మీరు సమూయేలు చూపించిన ఓర్పు, వినయం, కృతజ్ఞతా స్ఫూర్తి నుండి నేర్చుకోవాలి. (1 పేతురు 5:6 చదవండి.) మనలో ఎవరికి మాత్రం ఆ లక్షణాలు అవసరంలేదు? సమూయేలు చిన్నవయసులోనే అలాంటి లక్షణాలను అలవర్చుకోవడం, వాటిని చూపించడం మంచిదైంది. ఎందుకంటే, ఆ తర్వాతి సంవత్సరాల్లో ఆయనకు మరెన్నో ఆశాభంగాలు ఎదురయ్యాయి.

‘నీ కుమారులు నీ ప్రవర్తనలాంటి ప్రవర్తనగలవాళ్లు కాదు’

14, 15. (ఎ) “వృద్ధుడైన” సమూయేలుకు ఎలాంటి తీవ్ర నిరుత్సాహం ఎదురైంది? (బి) ఏలీలా సమూయేలు బాధ్యత మర్చిపోయిన తండ్రా? వివరించండి.

14 బైబిల్లో సమూయేలు ప్రస్తావన మళ్లీ వచ్చేసరికి ఆయన “వృద్ధుడు.” ఆ సమయానికల్లా సమూయేలుకు ఎదిగిన కుమారులు ఇద్దరు ఉన్నారు. వాళ్ల పేర్లు యోవేలు, అబీయా. న్యాయం తీర్చే పనిలో తనకు సహాయకులుగా వాళ్లను నియమించాడు. అయితే విచారకరంగా, వాళ్లు సమూయేలు నమ్మకాన్ని వమ్ముచేశారు. సమూయేలు నిజాయితీపరుడూ నీతిమంతుడూ అయినా ఆయన కుమారులు మాత్రం న్యాయాన్ని వక్రీకరిస్తూ, లంచాలు తీసుకుంటూ తమ అధికారాన్ని స్వార్థానికి వాడుకున్నారు.—1 సమూ. 8:1-3.

15 ఒకరోజు, ఇశ్రాయేలు పెద్దలు వృద్ధ ప్రవక్తయైన సమూయేలు దగ్గరకు వచ్చి ఇలా ఫిర్యాదు చేశారు: ‘నీ కుమారులు నీ ప్రవర్తనలాంటి ప్రవర్తనగలవాళ్లు కాదు.’ (1 సమూ. 8:4, 5) ఆయనకు ఆ విషయం ముందే తెలుసా? దాని గురించి బైబిలు చెప్పడం లేదు. అయితే సమూయేలు ఏలీలా బాధ్యత మర్చిపోయిన తండ్రి మాత్రం కాదు. ఏలీ తన కుమారుల చెడు ప్రవర్తనను సరిదిద్దకుండా, దేవుని కన్నా వాళ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినందుకు యెహోవా ఆయనను గద్దించి, శిక్షించాడు. (1 సమూ. 2:27-29) యెహోవాకు సమూయేలులో అలాంటి తప్పు ఎప్పుడూ కనబడలేదు.

చెడు మార్గంలో ఉన్న కుమారుల వల్ల కలిగిన ఆశాభంగాన్ని సమూయేలు ఎలా తట్టుకున్నాడు?

16. పిల్లలు ఎదురు తిరిగినప్పుడు తల్లిదండ్రులకు ఏమనిపిస్తుంది? సమూయేలు ఉదాహరణ నుండి వాళ్లు ఎలాంటి ఊరటను పొందవచ్చు, ఏమి నేర్చుకోవచ్చు?

16 కుమారుల చెడు ప్రవర్తన గురించి తెలిశాక సమూయేలు తలవంపుతో, ఆందోళనతో, ఆశాభంగంతో ఎంత వేదనకు గురైవుంటాడో బైబిలు చెప్పడం లేదు. అయితే, ఆయన బాధతో ఎంత కుమిలిపోయివుంటాడో చాలామంది తల్లిదండ్రులు అర్థం చేసుకోగలుగుతారు. ఈ కష్టకాలాల్లో పిల్లలు తల్లిదండ్రులను ఎదిరించడం, క్రమశిక్షణను పట్టించుకోకపోవడం సర్వసాధారణం అయిపోయింది. (2 తిమోతి 3:1-5 చదవండి.) అలాంటి మానసిక క్షోభను అనుభవిస్తున్న తల్లిదండ్రులు సమూయేలు ఉదాహరణ నుండి కాస్త ఊరటను పొందవచ్చు, ఎంతో నేర్చుకోవచ్చు. కుమారుల చెడు ప్రవర్తనను చూసి ఆయన ఏమాత్రం తప్పుదోవ పట్టలేదు. మాటలకు, క్రమశిక్షణకు లొంగని కఠిన హృదయాలు తల్లిదండ్రుల మంచి ప్రవర్తనకు లొంగవచ్చు. సమూయేలులా, నేటి తల్లిదండ్రులకు కూడా తమ తండ్రి యెహోవాను సంతోషపర్చే అవకాశం ఎప్పుడూ ఉంటుంది.

“మాకు ఒక రాజును నియమించు”

17. ఇశ్రాయేలు పెద్దలు సమూయేలును ఏమని అడిగారు? దానికి ఆయన ఎలా స్పందించాడు?

17 తమ అత్యాశ వల్ల, స్వార్థం వల్ల ఎంతటి ఘోరమైన పరిణామాలు చోటుచేసుకుంటాయో సమూయేలు కుమారులు ఊహించి ఉండకపోవచ్చు. ఇశ్రాయేలు పెద్దలు సమూయేలును ఇలా అడిగారు: ‘సకలజనుల్లా మాకు ఒక రాజును నియమించు.’ వాళ్లు అలా అడిగినప్పుడు, వాళ్లు తనని తిరస్కరిస్తున్నారని ఆయనకు అనిపించిందా? ఎంతైనా, ఆయన దశాబ్దాలుగా యెహోవా పక్షాన వాళ్లకు న్యాయం తీరుస్తూ వచ్చాడు. ఇప్పుడు వాళ్లకు న్యాయాధిపతిగా ఉండడానికి ఓ మామూలు ప్రవక్త సరిపోలేదు, వాళ్లకు ఒక రాజు కావాల్సివచ్చింది. తమ చుట్టుపక్కల రాజ్యాలకు రాజులున్నారు కాబట్టి తమకు కూడా ఒక రాజు కావాలనుకున్నారు! దానికి సమూయేలు ఎలా స్పందించాడు? అది “సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను.”—1 సమూ. 8:5, 6.

18. యెహోవా సమూయేలుకు ఎలా ఊరటను ఇచ్చాడు? ఇశ్రాయేలీయులు చేసింది పెద్ద తప్పని యెహోవా ఎలా చూపించాడు?

18 ఈ విషయం గురించి సమూయేలు ప్రార్థించినప్పుడు యెహోవా ఎలా స్పందించాడో చూడండి: ‘జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగించు. వాళ్లు నిన్ను విసర్జించలేదు కానీ తమను ఏలకుండా నన్నే విసర్జించారు.’ ఆ మాటలు సమూయేలుకు ఎంతో ఊరటను ఇచ్చివుంటాయి. ఆ ప్రజలు సర్వశక్తిమంతుడైన యెహోవాను ఎంత ఘోరంగా అవమానించారో! మానవుడు వాళ్లమీద రాజుగా ఉంటే వాళ్లు ఎంతో గొప్ప మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని ఇశ్రాయేలీయులను హెచ్చరించమని యెహోవా తన ప్రవక్తకు చెప్పాడు. సమూయేలు అలా హెచ్చరించాలని చూసినప్పుడు వాళ్లు, ‘అలా కాదు, మాకు ఒక రాజు కావాలి’ అని పట్టుబట్టారు. సమూయేలు మళ్లీ యెహోవా చెప్పినట్టే చేశాడు, యెహోవా ఎన్నుకున్న రాజును అభిషేకించాడు.—1 సమూ. 8:7-20.

19, 20. (ఎ) సౌలును ఇశ్రాయేలు రాజుగా అభిషేకించమని యెహోవా ఇచ్చిన నిర్దేశానికి సమూయేలు ఎలా లోబడ్డాడు? (బి) యెహోవా ప్రజలకు సమూయేలు ఎలా సహాయం చేస్తూనే ఉన్నాడు?

19 అయితే, సమూయేలు ఆయన చెప్పింది అయిష్టంగా, ఏదో చేయాలికదా అన్నట్లు చేశాడా? తనకు ఆశాభంగం ఎదురైనందుకు మనసులో కోపం పెంచుకున్నాడా? ఆ పరిస్థితిలో చాలామంది అలాగే చేస్తారు కానీ సమూయేలు మాత్రం అలా చేయలేదు. సౌలును అభిషేకించి, ఆయన యెహోవా స్వయంగా ఎన్నుకున్న వ్యక్తని సమూయేలు అంగీకరించాడు. కొత్త రాజును ఆహ్వానిస్తున్నానని, ఆయనకు లోబడివుంటానని చూపించడానికి సమూయేలు ఆయనను ముద్దుపెట్టుకున్నాడు. ఆ తర్వాత ప్రజలతో ఇలా అన్నాడు: ‘యెహోవా ఏర్పరచుకున్న వ్యక్తిని మీరు చూశారా? జనులందరిలో అతనిలాంటివాళ్లు ఒక్కరూ లేరు.’—1 సమూ. 10:1, 24.

20 యెహోవా ఎన్నుకున్న వ్యక్తిలోని మంచి లక్షణాల్నే సమూయేలు చూశాడు కానీ లోపాలను కాదు. ఆయన విషయానికొస్తే, తాను ఎప్పుడూ దేవునికి విశ్వసనీయంగా ఉండాలనుకున్నాడే తప్ప నిలకడలేని ప్రజల మెప్పు కోసం ప్రాకులాడలేదు. (1 సమూ. 12:1-4) అంతేకాదు, తమకు ఆధ్యాత్మిక ప్రమాదాలు ఎందుకు ఎదురయ్యాయో దేవుని ప్రజలకు తెలియజేస్తూ, యెహోవాకు నమ్మకంగా ఉండమని వాళ్లను ప్రోత్సహిస్తూ తన నియామకాన్ని నమ్మకంగా నిర్వర్తించాడు. ఆయన చెప్పింది వాళ్ల హృదయాలను చేరుకుంది. దాంతో వాళ్లు తమ కోసం ప్రార్థన చేయమని ఆయనను వేడుకున్నారు. అప్పుడు ఆయన వాళ్లతో ఈ చక్కని మాట అన్నాడు: ‘నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయడం మానేస్తే యెహోవాకు విరోధంగా పాపం చేసినవాణ్ణవుతాను. అది నాకు దూరమగునుగాక. కానీ శ్రేష్ఠమైన చక్కని మార్గాన్ని మీకు బోధిస్తాను.’—1 సమూ. 12:21-24.

మన మనసుల్లో అసూయా ద్వేషాలకు చోటివ్వకూడదని సమూయేలు ఉదాహరణ గుర్తుచేస్తోంది

21. ఏదైనా ఒక బాధ్యతాయుత స్థానం లేదా సేవావకాశం మరొకరికి దక్కినందుకు మీరు నిరాశపడితే సమూయేలు ఉదాహరణ ఎలా సహాయం చేస్తుంది?

21 ఏదైనా ఒక బాధ్యతాయుత స్థానం లేదా సేవావకాశం మరొకరికి దక్కినందుకు మీరు నిరాశపడ్డారా? మన మనసుల్లో అసూయాద్వేషాలకు చోటివ్వకూడదని సమూయేలు ఉదాహరణ గుర్తుచేస్తోంది. (సామెతలు 14:30 చదవండి.) తన నమ్మకమైన సేవకుల్లో ప్రతీ ఒక్కరికి సరిపడా ప్రతిఫలదాయకమైన, సంతృప్తినిచ్చే పని దేవుని దగ్గర ఉంది.

‘సౌలు గురించి నువ్వు ఎంతకాలం దుఃఖిస్తావు?’

22. మొదట్లో సమూయేలు సౌలులో మంచి లక్షణాలను చూడడం సబబేనని ఎందుకు చెప్పవచ్చు?

22 సమూయేలు సౌలులో మంచి లక్షణాలను చూడడం సబబే. ఎందుకంటే సౌలు నిజంగానే అసామాన్యుడు. ఆయన మంచి పొడగరి, అందగాడు, ధైర్యవంతుడు, తెలివైనవాడు. అంతేకాదు మొదట్లో వినయంగా, అణకువగా ఉండేవాడు. (1 సమూ. 10:22, 23, 27) ఆయనకు ఆ లక్షణాలతోపాటు, జీవిత గమనాన్ని నిర్దేశించుకుని సొంతగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా ఉంది. అది దేవుడిచ్చిన అమూల్యమైన బహుమతి. (ద్వితీ. 30:19, 20) ఆయన దాన్ని సరిగ్గా ఉపయోగించుకున్నాడా?

23. సౌలుకు ఒకప్పుడున్న ఏ మంచి లక్షణం ఆ తర్వాత మాయమైపోయింది? ఆయనలో అహంకారం అంతకంతకూ ఎక్కువైందని ఎలా చెప్పవచ్చు?

23 విచారకరమైన విషయమేమిటంటే, సాధారణంగా ఒక వ్యక్తికి అధికారం చేతికొస్తే ఆయనలో వినయం మాయమైపోతుంది. సౌలు విషయంలో కూడా అదే జరిగింది, ఆయన కొంతకాలానికే అహంకారిగా మారాడు. సమూయేలు ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞలకు ఆయన లోబడలేదు. ఒకసారి సౌలు సహనం కోల్పోయి, సమూయేలు అర్పించాలనుకున్న దహనబలిని తానే అర్పించేశాడు. దాంతో సమూయేలు సౌలును గట్టిగా గద్దించాల్సివచ్చింది. అంతేకాదు సౌలు వారసులకు రాచరికం దక్కదని కూడా సమూయేలు ముందే చెప్పాడు. సమూయేలు తనను గద్దించినప్పుడు ఆయన తన తప్పు తెలుసుకొని మారే బదులు యెహోవా మాటను ధిక్కరిస్తూ ఇంకా ఘోరమైన తప్పులు చేశాడు.—1 సమూ. 13:8, 9, 13, 14.

24. (ఎ) అమాలేకీయులతో యుద్ధం చేసినప్పుడు సౌలు యెహోవాకు ఎలా అవిధేయుడయ్యాడు? (బి) దిద్దుబాటుకు సౌలు ఎలా స్పందించాడు? యెహోవా ఏ నిర్ణయం తీసుకున్నాడు?

24 అమాలేకీయులతో యుద్ధం చేయమని యెహోవా సమూయేలు ద్వారా సౌలుకు చెప్పాడు. అంతేకాదు, అమాలేకీయుల దుష్ట రాజైన అగగును ప్రాణాలతో విడిచిపెట్టవద్దని కూడా చెప్పాడు. అయితే, సౌలు అగగును చంపలేదు, యుద్ధంలో శత్రువుల నుండి స్వాధీనం చేసుకున్న వాటిని నాశనం చేయలేదు. పైగా వాటిలో మంచివి ఉంచుకున్నాడు. సమూయేలు సౌలును సరిదిద్దడానికి వచ్చినప్పుడు సౌలులో ఎంత మార్పు వచ్చిందో కొట్టొచ్చినట్లు కనిపించింది. వినయంతో గద్దింపును స్వీకరించాల్సిందిపోయి తన తప్పు ఏమీ లేదని వాదించాడు, సాకులు చెప్పాడు, చేసిన పనులను సమర్థించుకున్నాడు, విషయాన్ని పక్కకు మళ్లించాడు, తప్పును ప్రజల మీదకు నెట్టడానికి ప్రయత్నించాడు. యుద్ధంలో శత్రువుల నుండి స్వాధీనం చేసుకున్న వాటిలో కొన్ని మంచి వాటిని యెహోవాకు బలి అర్పించడానికి ఉంచానని చెప్పాడు. అలా ఆయన దిద్దుబాటును త్రోసిపుచ్చినప్పుడు, సమూయేలు ఈ సుపరిచిత మాటలు అన్నాడు: ‘బలులు అర్పించడం కన్నా ఆజ్ఞ గైకొనడం శ్రేష్ఠం.’ సమూయేలు ధైర్యంగా సౌలును గద్దించి, రాజ్యాధికారం సౌలు చేతుల్లో నుండి ఆయన కన్నా మంచి వ్యక్తి చేతుల్లోకి వెళ్తుందన్న యెహోవా నిర్ణయాన్ని తెలియజేశాడు. a1 సమూ. 15:1-33.

25, 26. (ఎ) సౌలు గురించి సమూయేలు ఎందుకు దుఃఖపడ్డాడు? యెహోవా తన ప్రవక్తను మృదువుగా ఏమని గద్దించాడు? (బి) సమూయేలు యెష్షయి ఇంటికి వెళ్లినప్పుడు ఏ పాఠం నేర్చుకున్నాడు?

25 సౌలు చేసిన తప్పులకు సమూయేలు ఎంతో బాధపడ్డాడు. రాత్రంతా ఆ విషయం గురించి యెహోవాకు ఏడుస్తూ ప్రార్థించాడు. అంతేకాదు, సౌలు గురించి విలపించాడు. సౌలు ఎంతో సమర్థవంతుడని, ఆయనలో ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయని సమూయేలు గ్రహించాడు. కానీ ఇప్పుడు ఆ ఆశలన్నీ అడియాసలయ్యాయి. సౌలు ఒకప్పటిలా లేడు, ఆయనలో ఉన్న మంచి లక్షణాలన్నీ పోయాయి, ఆయన యెహోవాకు ఎదురుతిరిగాడు. సమూయేలు మళ్లీ సౌలు ముఖాన్ని చూడదలచుకోలేదు. అయితే, కొంతకాలానికి యెహోవా సమూయేలును మృదువుగా ఇలా గద్దించాడు: ‘ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలు గురించి నీవు ఎంతకాలం దుఃఖిస్తావు? నీ కొమ్మును తైలముతో నింపు, బేత్లెహేమీయుడైన యెష్షయి వద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకనిని నేను రాజుగా నియమిస్తున్నాను.’—1 సమూ. 15:34, 35; 16:1.

26 యెహోవా చేయాలనుకున్నదేదైనా, స్థిరత్వంలేని అపరిపూర్ణ మానవుల మీద ఆధారపడివుండదు. ఒక వ్యక్తి నమ్మకద్రోహిగా మారితే, మరో వ్యక్తిని ఉపయోగించుకొని యెహోవా తాను చేయాలనుకున్నది చేస్తాడు. కాబట్టి వృద్ధుడైన సమూయేలు సౌలు గురించి ఇక దుఃఖించడం మానేశాడు. యెహోవా చెప్పినట్లు సమూయేలు బేత్లెహేములోని యెష్షయి ఇంటికి వెళ్లి, అక్కడ ఆయన కుమారుల్లో చాలామందిని చూశాడు. వాళ్లంతా అందగాళ్లే. కానీ పైరూపమొక్కటే చూడవద్దని యెహోవా ముందునుండి సమూయేలుకు గుర్తుచేస్తూనే ఉన్నాడు. (1 సమూయేలు 16:7 చదవండి.) చివరికి, సమూయేలు యెష్షయి చిన్న కుమారుడైన దావీదును కలిశాడు, ఈయనే యెహోవా ఎన్నుకున్న వ్యక్తి!

నిరుత్సాహపరిచే ఏ సమస్యనైనా, ఏ పరిస్థితినైనా యెహోవా సరిచేయగలడని, దాన్ని ఒక ఆశీర్వాదంగా మార్చగలడని సమూయేలు తెలుసుకున్నాడు

27. (ఎ) సమూయేలు విశ్వాసం ఇంకా బలపడడానికి కారణం ఏమిటి? (బి) సమూయేలు ఆదర్శం గురించి మీకు ఏమి అనిపిస్తోంది?

27 యెహోవా సౌలు స్థానంలో దావీదును ఎన్నుకోవడం ఎంత సరైనదో సమూయేలు తాను చనిపోవడానికి కొన్నేళ్ల ముందు మరింత బాగా అర్థం చేసుకోగలిగాడు. సౌలు దావీదు మీద అసూయ పెంచుకుని ఆయనను చంపాలని చూశాడు, అంతేకాదు సౌలు యెహోవాకు ఎదురుతిరిగాడు. అయితే దావీదు ధైర్యం, విధేయత, విశ్వాసం, నమ్మకం వంటి ఎన్నో మంచి లక్షణాలను చూపించాడు. చివరి దశలో సమూయేలు విశ్వాసం ఇంకా బలపడింది. నిరుత్సాహపరిచే ఏ సమస్యనైనా, ఏ పరిస్థితినైనా యెహోవా సరిచేయగలడని, దాన్ని ఒక ఆశీర్వాదంగా మార్చగలడని ఆయన తెలుసుకున్నాడు. సమూయేలు దాదాపు ఒక శతాబ్దంపాటు ఎన్నో మంచి లక్షణాలు చూపించి, మంచి పేరు సంపాదించుకుని చివరకు చనిపోయాడు. ఈ నమ్మకమైన వ్యక్తి చనిపోయినప్పుడు ఇశ్రాయేలీయులందరూ ఎందుకంత దుఃఖించారో మనం అర్థంచేసుకోవచ్చు. ఇప్పటికీ సమూయేలు మనకు ఆదర్శం కాబట్టి, యెహోవా సేవకులు ఈ ప్రశ్న వేసుకోవాలి: ‘నేను సమూయేలులా విశ్వాసం చూపిస్తానా?’

a స్వయంగా సమూయేలే అగగును చంపాడు. ఆ దుష్ట రాజుగానీ, ఆయన కుటుంబంగానీ కనికరానికి అర్హులు కారు. శతాబ్దాల తర్వాత, దేవుని ప్రజలందర్నీ సమూలంగా నాశనం చేయాలని చూసిన “అగాగీయుడైన హామాను” కూడా అగగు వంశీయుడేనని తెలుస్తోంది.—ఎస్తేరు 8:3; ఈ పుస్తకంలోని 15, 16 అధ్యాయాలుచూడండి.