కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఇవి అంత్యదినాలు!

ఇవి అంత్యదినాలు!

అధ్యాయము 11

ఇవి అంత్యదినాలు!

1. ప్రపంచ పరిస్థితిని గూర్చి ఆలోచిస్తున్నప్పుడు అనేకులు ఎందుకు కలత చెందుతారు, కాని ప్రపంచ సంఘటనలను గూర్చిన నమ్మదగిన వివరణను ఎక్కడ కనుగొనవచ్చు?

మన దౌర్జన్యపూరితమైన లోకం ఈ స్థితికి ఎలా చేరింది? మనమెటు పయనిస్తున్నాము? మీరెప్పుడైనా అలాంటి ప్రశ్నలు అడిగారా? అనేకులు ప్రపంచ పరిస్థితిని చూసి అలాగే కలత చెందుతుంటారు. యుద్ధం, వ్యాధి, నేరం వంటి వాస్తవాలు భవిష్యత్తులో ఏమి జరుగనైయుందా అని ప్రజలు ఆశ్చర్యపోయేలా చేస్తాయి. ప్రభుత్వ నాయకులు ఏ నిరీక్షణనివ్వలేరు. అయితే, ఈ బాధాకరమైన దినాలను గూర్చిన నమ్మదగిన వివరణ దేవుని ద్వారా ఆయన వాక్యమందు లభిస్తుంది. మనం కాలగమనంలో ఎక్కడ ఉన్నామో తెలుసుకోవడానికి బైబిలు మనకు నమ్మకంగా సహాయం చేస్తుంది. మనం ప్రస్తుత విధానం యొక్క “అంత్యదినములలో” ఉన్నామని అది మనకు చూపిస్తుంది.—2 తిమోతి 3:1.

2. యేసును ఆయన శిష్యులు ఏ ప్రశ్న అడిగారు, దానికి ఆయనెలా సమాధానమిచ్చాడు?

2 ఉదాహరణకు, తన శిష్యులు వేసిన కొన్ని ప్రశ్నలకు యేసు ఇచ్చిన సమాధానాన్ని పరిశీలించండి. యేసు మరణించడానికి మూడు దినాల ముందు, వారు ఆయననిలా అడిగారు: “నీ ప్రత్యక్షతకు ఈ విధానాంతానికి సూచనలేవి?” * (మత్తయి 24:3, NW) దానికి సమాధానంగా, ఈ భక్తిహీన విధానం దాని అంత్యదినాల్లోకి ప్రవేశించిందని స్పష్టంగా చూపించే ప్రత్యేకమైన ప్రపంచ సంఘటనలు మరియు పరిస్థితుల గురించి యేసు చెప్పాడు.

3. యేసు పరిపాలనను ప్రారంభించినప్పుడు భూమిపై పరిస్థితులు ఎందుకు ఇంకా క్షీణించిపోయాయి?

3 ముందటి అధ్యాయంలో చూపబడినట్లుగా, బైబిలు కాల వృత్తాంతము దేవుని రాజ్యం ఇప్పటికే పరిపాలనను ప్రారంభించిందనే నిర్ధారణకు నడిపిస్తుంది. అయితే అదెలా అవుతుంది? పరిస్థితులు మెరుగుపడడంలేదు గాని క్షీణిస్తున్నాయి. నిజానికి, ఇది దేవునిరాజ్య పరిపాలన ప్రారంభం అయ్యింది అనే దానికి గట్టి సూచన. ఎందుకలా? యేసు కొంతకాలం వరకు ‘తన శత్రువుల మధ్యన’ పరిపాలన చేస్తాడని కీర్తన 110:2 మనకు తెలియజేస్తుంది. వాస్తవానికి, సాతానును దయ్యాలైన అతని దూతలను భూమిపైకి పడద్రోయడమే పరలోక రాజుగా ఆయన మొదటి చర్యయైయుండెను. (ప్రకటన 12:9) దాని ఫలితమేమిటి? సరిగ్గా ప్రకటన 12:12 ప్రవచించినదే జరిగింది: ‘భూమీ, సముద్రమా, మీకు శ్రమ; అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహుక్రోధము గలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నాడు.’ మనం ఇప్పుడు ఆ ‘కొంచెం సమయంలో’ జీవిస్తున్నాము.

4. అంత్యదినాలను గూర్చిన కొన్ని సూచనలు ఏవి, అవి ఏమి సూచిస్తాయి? (బాక్సు చూడండి.)

4 కాబట్టి, ఆయన ప్రత్యక్షతకు, విధానాంతానికి సూచన ఏమిటని యేసును అడిగినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం గంభీరమైందిగా ఉండటంలో ఆశ్చర్యంలేదు. సూచన యొక్క వివిధ అంశాలు 102 పేజీ నందలి బాక్సులో ఉన్నాయి. మీరు చూడబోతున్నట్లుగా, క్రైస్తవ అపొస్తలులైన పౌలు, పేతురు మరియు యోహాను అంత్య దినాలను గూర్చిన మరిన్ని వివరాలను మనకు అందిస్తున్నారు. నిజంగా, సూచన మరియు అంత్యదినాల యొక్క అనేక అంశాలలో బాధాకరమైన పరిస్థితులు చేరివున్నాయి. అయినప్పటికీ, ఈ ప్రవచనాల నెరవేర్పు ఈ దుష్టవిధానం దాని అంతానికి సమీపిస్తోందనే విషయంలో మనల్ని ఒప్పించాలి. అంత్య దినాలను గూర్చిన కొన్ని ముఖ్యమైన అంశాలను మనం నిశితంగా పరిశీలిద్దాము.

అంత్యదినాల అంశాలు

5, 6. యుద్ధం మరియు కరవుకు సంబంధించిన ప్రవచనాలు ఎలా నెరవేర్చబడుతున్నాయి?

5“జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును.” (మత్తయి 24:7; ప్రకటన 6:4) రచయితయైన అర్‌నస్ట్‌ హెమింగ్‌వే మొదటి ప్రపంచ యుద్ధాన్ని “అత్యంత పెద్దది, నాశనకరమైనది, అది భూమిపై మునుపెన్నడూ జరగని అక్రమముగా నిర్వహించబడిన ఊచకోతవంటిది” అని అన్నాడు. ది వరల్డ్‌ ఇన్‌ ది క్రూసిబుల్‌—1914-1919 అనే పుస్తకం ప్రకారం, ఇది “క్రొత్తరకమైన యుద్ధం, మానవజాతి ఎరిగిన మొట్టమొదటి సంపూర్ణ యుద్ధం. దాని కాలనిడివి, తీవ్రత మరియు విస్తీర్ణత ముందు తెలిసిన దానికన్నా లేక సాధారణంగా ఎదురుచూసే దేని కన్నా కూడా మించిపోయింది.” ఆ తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది, అది మొదటి ప్రపంచ యుద్ధంకన్నా మరింత నాశనకరమైనదిగా నిరూపించబడింది. “ఇరవయ్యవ శతాబ్దం మెషీన్‌ గన్ను, యుద్ధ శకటము, బి-52, అణుబాంబు, చివరికి క్షిపణి వంటివాటితో నిండిపోయింది. మరే యుగంలోను లేనంత రక్తపాతమైన, నాశనకరమైన యుద్ధాలచే అది గుర్తించబడింది” అని చరిత్ర అధ్యాపకుడైన హ్యూ థామస్‌ చెబుతున్నాడు. నిజమే ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత నిరాయుధీకరణ గురించి చాలా మాటలు జరిగాయి. అయినప్పటికీ, తలంచినన్ని తగ్గింపులు అమలు చేయబడిన తర్వాత దాదాపు 10,000 నుండి 20,000 అణు ఆయుధాలు మిగిలివుంటాయని—అది రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఉపయోగింపబడిన మందుగుండు సామాను కంటే 900 రెట్లు అధికమని ఒక నివేదిక అంచనావేస్తోంది.

6“అక్కడక్కడ కరవులును . . . కలుగును.” (మత్తయి 24:8; ప్రకటన 6:5, 6, 8) పందొమ్మిది వందల పధ్నాలుగు నుండి కనీసం 20 పెద్ద కరవులు సంభవించాయి. ఇండియా, ఇథియోపియా, కంబోడియా, గ్రీసు, చైనా, నైజీరియా, బంగ్లాదేశ్‌, బురుండీ, రష్యా, రువాండా, సూడాన్‌ మరియు సొమాలియా వంటి దేశాలు కరవుకు గురయ్యాయి. కాని కరవు ఎప్పుడు ఆహార కొరత వల్ల ఏర్పడినదే కాదు. “ఇటీవలి దశాబ్దాలలో ప్రపంచ ఆహార సరఫరా దాని జనాబా కంటే త్వరితంగా పెరిగింది, కాని 80 కోట్లమంది ప్రజలు తీవ్ర పేదరికంలోనే ఉన్నారు గనుక, . . . తాము సుదీర్ఘమైన కుపోషణ నుండి బయటపడటానికి తగినంత కొనుగోలు చేయలేకపోతున్నారని” వ్యవసాయ శాస్త్రజ్ఞులు మరియు ఆర్థికవేత్తల బృందమొకటి నిర్ధారించింది. ఇతర విషయాల్లో రాజకీయ జోక్యం చేరివుంది. టోరంటో విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ ఆబ్దెల్‌గలీల్‌ ఎల్‌మెక్కీ, తమ దేశాలు అధిక మోతాదుల్లో ఆహారాన్ని ఎగుమతి చేస్తుండగా వేలాది మంది ఆకలితో అలమటిస్తున్న రెండు ఉదాహరణలను గూర్చి తెలియజేస్తున్నాడు. ఆ ప్రభుత్వాలు తమ పౌరులకు ఆహారాన్ని అందజేసే బదులు, తమ యుద్ధాలకు ఆర్థికపరమైన సహాయం కొరకు విదేశీ ద్రవ్యాన్ని సేకరించడంలో అధిక శ్రద్ధ కలిగివున్నట్లు కనిపిస్తుంది. డాక్టర్‌ ఎల్‌మెక్కీ ముగింపేమిటి? కరవు అనేది తరచూ “పంపిణీ మరియు ప్రభుత్వ విధానానికి సంబంధించిన విషయము.”

7. నేడు తెగుళ్లను గూర్చిన వాస్తవాలేమిటి?

7తెగుళ్లు.” (లూకా 21:11; ప్రకటన 6:8) మరి 1918-19 లో వచ్చిన స్పానిష్‌ విషజ్వరం సుమారు 2.1 కోట్లమంది జీవితాలను బలిగొన్నది. “చరిత్రలో ఎన్నడూ ఇంత త్వరగా ఇంతమంది మానవులను సంహరించిన హంతకి చేత ప్రపంచం నాశనం చేయబడలేదని,” ది గ్రేట్‌ ఎపిడమిక్‌ నందు ఏ. ఏ. హోలెన్‌ వ్రాస్తున్నాడు. నేడు తెగుళ్లు ప్రబలమౌతున్నాయి. ప్రతి సంవత్సరం, క్యాన్సర్‌ 50 లక్షల మందిని చంపుతోంది, అతిసార వ్యాధులు 30 లక్షలకంటే ఎక్కువమంది శిశువులు మరియు బాలల జీవితాలను బలిగొంటున్నాయి, క్షయ వ్యాధి 30 లక్షల మందిని సంహరిస్తోంది. శ్వాసకోశ సంబంధిత అంటురోగాలు, ప్రాముఖ్యంగా నిమోనియా సంవత్సరానికి 35 లక్షలమంది ఐదేళ్లలోపు బాలలను చంపుతోంది. భీతిగొల్పేరీతిగా 250 కోట్లమంది—అంటే ప్రపంచ జనాబాలో సగంమంది—నీటి కొరత లేక కలుషితమైన నీరు మరియు సరైన పారిశుద్ధత లేకపోవడం వంటివాటినుండి వచ్చే రోగాలతో బాధపడుతున్నారు. మనిషి ప్రాముఖ్యంగా వైద్యపరమైన ఎన్ని విజయాలను సాధించినప్పటికీ, తెగుళ్లను నిర్మూలించడంలో అసమర్థంగా ఉన్నాడనేదాన్ని ఎయిడ్స్‌ జ్ఞాపకం చేస్తుంది.

8. ప్రజలు “ధనాపేక్షులుగా” ఎలా నిరూపించుకుంటున్నారు?

8“మనుష్యులు . . . ధనాపేక్షులు . . . నైయుందురు.” (2 తిమోతి 3:2) ప్రపంచవ్యాప్తంగా దేశాలలోని ప్రజలు అధిక ధనం కొరకై అసంతుష్టమైన కోరిక కలిగివున్నట్లుగా కనిపిస్తుంది. తరచూ ఒకరి పేచెక్‌ యొక్క పరిమాణాన్ని బట్టి “విజయం” మరియు ఒకరికున్న దాన్నిబట్టి “సాఫల్యత” అనేవి కొలవబడతాయి. “అమెరికా సమాజంలో ధనాపేక్ష ప్రేరణా శక్తుల్లో ఒకటిగా కొనసాగుతుంది . . . మరియు మరితర పెద్ద వ్యాపారాల్లో మరీ ముఖ్యమైన శక్తిగా కొనసాగుతుంది,” అని వ్యాపార ప్రకటనల సంస్థ యొక్క ఉపాధ్యక్షుడు ప్రకటించాడు. మీరు నివసించే ప్రాంతంలో ఇది జరుగుతోందా?

9. తలిదండ్రులకు అవిధేయతను గూర్చి ప్రవచింపబడిన దాని గురించి ఏమి చెప్పవచ్చు?

9‘తలిదండ్రులకు అవిధేయులు.’ (2 తిమోతి 3:2) అనేకమంది పిల్లలు గౌరవంలేని వారిగా, అవిధేయులుగా ఉన్నారనే దానికి ప్రస్తుత దిన తలిదండ్రులు, ఉపాధ్యాయులు మరితరులు ప్రత్యక్ష నిదర్శనాలను కలిగివున్నారు. ఈ యౌవనులలో కొందరు తమ తలిదండ్రుల తప్పుడు ప్రవర్తనకు ప్రతిస్పందించడమో లేక దానిని అనుకరించడమో చేస్తున్నారు. అధిక సంఖ్యలో పిల్లలు పాఠశాల, చట్టం, మతం మరియు తమ తలిదండ్రుల యందు విశ్వాసాన్ని కోల్పోతున్నారు—ఎదురు తిరుగుతున్నారు. అనుభవజ్ఞుడైన ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఇలా చెబుతున్నాడు: “వారు దేనికీ ఎటువంటి గౌరవమీయడంలేదనే ధోరణి కనబడుతోంది.” అయితే సంతోషకరంగా, అనేకమంది దైవభయంగల పిల్లలు ప్రవర్తన విషయంలో మాదిరికరంగా ఉన్నారు.

10, 11. ప్రజలు క్రూరులుగా, అనురాగరహితులుగా ఉన్నారనడానికి ఏ నిదర్శనం ఉంది?

10క్రూరులు.” (2 తిమోతి 3:3) “క్రూరులు” అని అనువదింపబడిన గ్రీకు పదానికి ‘సాధుచేయజాలని, పాశవికమైన, మానవ కరుణ, సానుభూతి లేని’ అని భావం. నేటి దౌర్జన్యానికి కారకులైన అనేకులకు ఇది ఎంత బాగా సరిపోతుంది! “జీవితం ఎంత బాధాకరమైనదిగా, భీతితో రక్తసిక్తమైనదిగా తయారైందంటే, అనుదిన వార్తలను చదవాలంటే ఒకరు ఎంతో కఠినమనస్కులై ఉండాల్సి వస్తుందని” ఒక సంపాదకీయం తెలియజేసింది. అనేకమంది యౌవనులు తమ చర్యల పరిణామాలను గ్రహించడానికి నిరాకరిస్తున్నట్లుగా ఉందని ఒక కాపలాదారుడు చెబుతున్నాడు. ఆయనిలా చెప్పాడు: “‘నాకు రేపటి గురించి తెలియదు. నాకు ఈ రోజు కావలసినదాన్ని నేను పొందుతాను’ అన్న భావనే ఉంది.”

11అనురాగరహితులు.” (2 తిమోతి 3:3) ఈ పదం “నిర్దయ, అమానుషమైన” అనే భావాలుకల్గి “సహజమైన, కుటుంబ సంబంధమైన వాత్సల్యంలేని” అని సూచించే గ్రీకు పదం నుండి అనువదించబడింది. (ది న్యూ ఇంటర్‌నేషనల్‌ డిక్షనరీ ఆఫ్‌ న్యూ టెస్ట్‌మెంట్‌ థియాలజీ) అవును, వాత్సల్యం వెల్లివిరయాల్సిన గృహంలోనే అది తరచూ కొరవడుతోంది. వివాహ జతలను పిల్లలను వృద్ధులైన తలిదండ్రులను కూడా అమర్యాదగా చూడడం వంటివాటిని గూర్చిన నివేదికలు బాధ కలిగించే విధంగా సర్వసాధారణమౌతున్నాయి. ఒక పరిశోధనా బృందం ఇలా వ్యాఖ్యానించింది: “మానవ దౌర్జన్యం—అది చెంపదెబ్బ లేక గెంటడమైనా, కత్తిపోటు లేక కాల్చివేత అయినా—మన సమాజంలోని మరే స్థలంలో కంటే కుటుంబ వలయంలోనే ఎంతో తరచుగా జరుగుతుంది.”

12. ప్రజలకు పైకి మాత్రమే భక్తి ఉందని ఎందుకు చెప్పవచ్చు?

12“పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు.” (2 తిమోతి 3:5) జీవితాలను మంచిగా మార్చే శక్తి బైబిలుకుంది. (ఎఫెసీయులు 4:22-24) అయినప్పటికీ, అనేకులు నేడు దేవున్ని అప్రీతిపర్చే అవినీతికరమైన కార్యాలు చేసేందుకు తమ మతాన్ని ఒక ముసుగుగా ఉపయోగించుకుంటారు. అబద్ధమాడడం, దొంగతనం మరియు లైంగిక దుష్‌ప్రవర్తన వంటివాటిని తరచూ మత నాయకులు క్షమిస్తున్నారు. అనేక మతాలు ప్రేమను ప్రకటిస్తాయి కాని యుద్ధానికి మద్దతునిస్తాయి. ఇండియా టుడే పత్రికలోని సంపాదకీయం, “సర్వోన్నతుడైన సృష్టికర్త పేరిట, . . . మానవులు తమ తోటి మానవుల ఎడల అతి దుష్టమైన దుర్మార్గాన్ని జరిగించారు” అని తెలియజేస్తుంది. వాస్తవానికి, ఇటీవల జరిగిన రెండు అత్యంత క్రూరమైన యుద్ధాలు—మొదటి మరియు రెండవ ప్రపంచ యుద్ధాలు—క్రైస్తవమత సామ్రాజ్యం నుండే ఆరంభమయ్యాయి.

13. భూమి నాశనం చేయబడుతుందనడానికి ఏ నిదర్శనం ఉంది?

13భూమిని నశింపజేయుట.’ (ప్రకటన 11:18) యూనియన్‌ ఆఫ్‌ కన్‌సర్నడ్‌ సైంటిస్ట్స్‌ (యుసిఎస్‌) వెలువర్చిన ఒక హెచ్చరికను ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన 104 మంది నోబుల్‌ బహుమతి గ్రహీతలతో సహా 1,600 కంటే ఎక్కువమంది శాస్త్రవేత్తలు బలపర్చారు, అదిలా ఉంది: “మానవుల మరియు పర్యావరణం యొక్క నాశనం జరుగబోతుంది . . . ఈ దుర్ఘటన జరగడానికి ఇంకా కేవలం కొన్ని దశాబ్దాలు మాత్రమే మిగిలివున్నాయి.” మానవుని ప్రాణాపాయకరమైన పద్ధతులు “మనకు తెలిసిన రీతిలో జీవాన్ని కాపాడడం అసాధ్యమయ్యేలా ప్రపంచాన్ని మార్చివేయవచ్చని” ఆ నివేదిక తెలియజేసింది. ఓజోన్‌ పొర విచ్ఛిన్నం, నీటి కాలుష్యం, అటవీ నిర్మూలన, భూమి సామర్థ్యాన్ని కోల్పోవడం, అనేక జంతు మరియు వృక్ష జాతులు అంతరించిపోవడం వంటివి తక్షణమే చర్య తీసుకోవలసిన సమస్యలుగా చూపించబడ్డాయి. “పరస్పర ఆధారితమైన జీవన అల్లికతో మనం ఆటలాడుకోవడమనేది, మనం అసంపూర్ణంగా అర్థం చేసుకొనే జీవశాస్త్ర సంబంధిత మార్పుల విధానాల నాశనంతోపాటు ఇతరరత్రా విస్తృతమైన ప్రభావాలను చూపించగలదు” అని యుసిఎస్‌ చెప్పింది.

14. మత్తయి 24:14 మన కాలంలో నెరవేరుతుందని మీరెలా నిరూపించగలరు?

14“ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును.” (మత్తయి 24:14) రాజ్య సువార్త సాక్ష్యాధారంగా అన్ని జనాంగాలకు భూవ్యాప్తంగా ప్రకటింపబడుతుందని యేసు ప్రవచించాడు. దైవిక సహాయం మరియు ఆశీర్వాదంతో, లక్షలాదిమంది యెహోవాసాక్షులు ఈ ప్రకటించే పనిలోను శిష్యులను చేసేపనిలోను వందలకోట్ల గంటలు వెచ్చిస్తున్నారు. (మత్తయి 28:19, 20) అవును, సువార్త ప్రకటించకుంటే ఆ రక్తాపరాధం తమపైకి వస్తుందని సాక్షులు గ్రహిస్తారు. (యెహెజ్కేలు 3:18, 19) కాని, ప్రతి సంవత్సరం వేలాదిమంది రాజ్య వర్తమానానికి కృతజ్ఞతాపూర్వకంగా ప్రతిస్పందించి, నిజక్రైస్తవులుగా అంటే యెహోవాకు సాక్షులుగా తయారౌతున్నందుకు వారు ఆనందిస్తున్నారు. యెహోవాను సేవిస్తూ తద్వారా దేవుని గూర్చిన జ్ఞానాన్ని వ్యాప్తి చేయడం ఉత్కృష్టమైన ఆధిక్యత. భూవ్యాప్తంగా ఈ సువార్త ప్రకటించబడిన తర్వాత, ఈ దుష్ట విధానాంతం వస్తుంది.

నిదర్శనానికి స్పందించండి

15. ప్రస్తుత దుష్ట విధానం ఎలా అంతమౌతుంది?

15 ఈ విధానం ఎలా అంతమౌతుంది? ప్రపంచ అబద్ధమతమైన “మహా బబులోను”పై ఈ ప్రపంచ రాజకీయ వ్యవస్థ దాడిచేయడంతో “మహా శ్రమ” ప్రారంభమౌతుందని బైబిలు ముందే తెలియజేస్తుంది. (మత్తయి 24:21; ప్రకటన 17:5, 16) ఈ కాలంలో ‘చీకటి సూర్యుని కమ్ముతుందని, చంద్రుడు కాంతినివ్వడని, ఆకాశమునుండి నక్షత్రములు రాలుతాయని, ఆకాశమందలి శక్తులు కదలింపబడతాయని’ యేసు చెప్పాడు. (మత్తయి 24:29) ఇది అక్షరార్థంగా ఆకాశమందు జరిగే సంభ్రమాశ్చర్య సంఘటనలను సూచించవచ్చు. ఏ విధంగానైనా, మతంలోని ప్రకాశమానమైన వెలుగులు బహిర్గతం చేయబడి నిర్మూలించబడతాయి. అప్పుడు “మాగోగు దేశపువాడగు గోగు” అని పిలువబడే సాతాను యెహోవా ప్రజలపై సంపూర్ణ దాడి చేసేందుకు దుష్ట మానవులను ఉపయోగించుకుంటాడు. కాని సాతాను విజయం సాధించలేడు, ఎందుకంటే దేవుడు వారిని కాపాడుతాడు. (యెహెజ్కేలు 38:1, 2, 14-23) ‘సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమైన’ అర్మగిద్దోను నందు “మహా శ్రమ” దాని తుది ఘట్టాన్ని చేరుకుంటుంది. అది సాతాను భూసంస్థ యొక్క చివరి ప్రతి చిహ్నాన్ని నిర్మూలిస్తూ, తప్పించుకొన్న మానవజాతికి నిత్య ఆశీర్వాదాలకు మార్గం సుగమం చేస్తుంది.—ప్రకటన 7:9, 14; 11:15; 16:14, 16; 21:3, 4.

16. అంత్యదినాలను గూర్చి ప్రవచింపబడిన అంశాలు మన కాలానికి సరిపోతాయని మనకెలా తెలుసు?

16 అంత్య దినాలను వర్ణించే ప్రవచనాలలోని కొన్ని అంశాలు చరిత్రలోని ఇతర కాలాలకు వర్తిస్తాయన్నట్లు కనిపించవచ్చు. కాని వాటన్నిటిని సమకూర్చినప్పుడు, ప్రవచింపబడిన నిదర్శనాలు మన కాలాన్ని సూచిస్తాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తి వేలి ముద్రను ఏర్పరచే గీతలు మరే వ్యక్తికి పోలిక లేనంత రీతిగా రూపొందించబడతాయి. అలాగే, అంత్యదినాలకు వాటిదైన స్వంత సూచనల లేక సంఘటనల మాదిరి ఉంది. వీటి ద్వారా ఏర్పడే “వేలిముద్ర” మరే ఇతర కాలవ్యవధికి చెందదు. దేవుని పరలోక రాజ్యం ఇప్పుడు పరిపాలిస్తుందనే బైబిలు సూచనలతోపాటు పరిశీలించినప్పుడు, నిజంగా ఇవే అంత్య దినాలని నిర్ధారించడానికి నిదర్శనం గట్టి ఆధారాన్నిస్తుంది. అంతేగాక, ప్రస్తుత దుష్ట విధానం త్వరలోనే నాశనం చేయబడుతుందనడానికి స్పష్టమైన లేఖనాధారమైన రుజువు ఉంది.

17. ఇవి అంత్యదినాలనే విషయాన్ని గూర్చిన జ్ఞానం మనం ఏమి చేయడానికి మనల్ని కదలించాలి?

17 ఇవి అంత్యదినాలనే నిదర్శనానికి మీరెలా ప్రతిస్పందిస్తారు? దీన్ని పరిశీలించండి: భయంకరంగా నాశనకరమైన తుపాను రాబోతుంటే, మనం ఆలస్యం చేయకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటాము. అలాగే, ఈ ప్రస్తుత విధానాన్ని గూర్చి బైబిలు ప్రవచిస్తున్నది కూడా మనం చర్య గైకొనడానికి మనల్ని కదలించాలి. (మత్తయి 16:1-3) ఈ ప్రపంచ విధానం యొక్క అంత్యదినాల్లో మనం జీవిస్తున్నామని మనం స్పష్టంగా చూడగలము. దేవుని అనుగ్రహం పొందేందుకు అవసరమైన ఏ మార్పులనైనా చేసుకునేందుకు ఇది మనల్ని పురికొల్పాలి. (2 పేతురు 3:3, 10-12) తనను తాను రక్షణకర్తగా సూచించుకుంటూ, యేసు ఈ అత్యవసరమైన పిలుపునిస్తున్నాడు: ‘మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమియందంతట నివసించు వారందరిమీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించుకొని, మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తిగలవారగునట్లు ఎల్లప్పుడును ప్రార్థనచేయుచు మెలకువగా ఉండుడి.’—లూకా 21:34-36.

[అధస్సూచీలు]

^ పేరా 2 కొన్ని బైబిళ్లు “విధానం” అనే పదానికి బదులు “ప్రపంచం” అనే పదాన్ని ఉపయోగిస్తాయి. ఏ·యాన్‌ʹ అనే గ్రీకు పదం “అనిర్దిష్ట కాల వ్యవధిని, లేక ఆ యుగంలో జరిగేవాటిని దృష్టించే సమయాన్ని సూచిస్తుందని” డబ్ల్యు. ఇ. వైన్‌ వ్రాసిన ఎక్స్‌పోసిటరీ డిక్షనరీ ఆఫ్‌ న్యూ టెస్ట్‌మెంట్‌ వర్డ్స్‌ చెబుతుంది. పర్‌కర్ట్‌ వ్రాసిన గ్రీక్‌ అండ్‌ ఇంగ్లీష్‌ లెక్సికాన్‌ టు ది న్యూ టెస్ట్‌మెంట్‌ (17వ పేజీ) హెబ్రీయులు 1:2 నందలి ఏ·యాʹన్స్‌ (బహువచనం) పద ఉపయోగాన్ని గూర్చి చర్చించడంలో “ఈ విధానం” అనే పదాన్ని చేర్చింది. కాబట్టి “విధానం” అనే పదం ఆదిమ గ్రీకు మూల గ్రంథంతో పొందిక కలిగివుంది.

మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి

క్రీస్తు పరిపాలన ప్రారంభంలోని ప్రపంచ పరిస్థితుల గురించి బైబిలు ఏమని తెల్పింది?

అంత్యదినాల కొన్ని సూచనలేవి?

ఇవి అంత్యదినాలని మిమ్మల్ని ఏది ఒప్పిస్తుంది?

[అధ్యయన ప్రశ్నలు]

[102వ పేజీలోని బాక్సు]

అంత్యదినాల యొక్క కొన్ని సూచనలు

• ముందెన్నడూ జరగనంతగా యుద్ధం.—మత్తయి 24:7; ప్రకటన 6:4.

• కరవు.—మత్తయి 24:8; ప్రకటన 6:5, 6, 8.

• తెగుళ్లు.—లూకా 21:11; ప్రకటన 6:8.

• అక్రమము విస్తరించుట.—మత్తయి 24:12.

• భూమిని నాశనం చేయుట.—ప్రకటన 11:18.

• భూకంపాలు.—మత్తయి 24:8.

• అపాయకరమైన కాలాలు.—2 తిమోతి 3:1.

• మితిమీరిన ధనాశ.—2 తిమోతి 3:2.

• తలిదండ్రులకు అవిధేయత.—2 తిమోతి 3:2.

• అనురాగం తగ్గిపోవడం.—2 తిమోతి 3:3.

• దేవుని కంటే సుఖానుభవాలను ఎక్కువగా ప్రేమించుట.—2 తిమోతి 3:4.

• ఆశానిగ్రహం కొరవడడం.—2 తిమోతి 3:3.

• మంచితనం ఎడల ప్రేమలేకపోవడం.—2 తిమోతి 3:3.

• రాబోయే ప్రమాదాన్ని పట్టించుకోకపోవడం.—మత్తయి 24:39.

• అపహాసకులు అంత్యదినాలను గూర్చిన నిదర్శనాన్ని నిరాకరించుట.—2 పేతురు 3:3, 4.

• దేవుని రాజ్యాన్ని గూర్చి భూవ్యాప్తంగా ప్రకటించుట.—మత్తయి 24:14.

[101వ పేజీలో పూర్తి-పేజీ చిత్రం ఉంది]