కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని గూర్చిన జ్ఞానముతో భూమి నిండియుండే కాలం

దేవుని గూర్చిన జ్ఞానముతో భూమి నిండియుండే కాలం

అధ్యాయము 19

దేవుని గూర్చిన జ్ఞానముతో భూమి నిండియుండే కాలం

1, 2. యెహోవా సృష్టి ఎలా నాశనం చేయబడింది?

ఒక గొప్ప కళాకారుడు ఇప్పుడే ఒక అద్భుతమైన చిత్రాన్ని వేయటం ముగించాడనుకోండి. ఆయన దాన్ని ఎంతో బాగున్నట్లు—ఒక అద్భుత కళాఖండంగా పరిగణించడం సబబే! కాని రాత్రికిరాత్రి ఒక అసూయగల విరోధి వచ్చి దాన్ని పాడుచేస్తాడు. ఇది ఆ కళాకారునికి ఎంతో వేదనను కలిగిస్తుందన్నది అర్థం చేసుకొనదగినదే. ఆ దుర్మార్గుడు నిర్బంధింపబడడం చూడాలని ఆ కళాకారుడు ఎంత ఆసక్తి కలిగివుంటాడు! తన సృష్టి గతవైభవాన్ని తిరిగి సంతరించుకోవాలని ఎంతగా కోరుకుంటాడో మీరు ఊహించవచ్చు.

2 ఆ కళాకారుని వలెనే, భూమిని సిద్ధంచేసి దానిపై మానవజాతిని ఉంచడం ద్వారా యెహోవా ఒక ఉత్కృష్టమైన కార్యాన్ని సృష్టించాడు. ఆదాము హవ్వలను సృష్టించిన తర్వాత, తన భూసంబంధమైన పని అంతా “చాలమంచిదిగ” నున్నట్లు ఆయన ప్రకటించాడు. (ఆదికాండము 1:31) ఆదాము హవ్వలు దేవుని స్వంత పిల్లలు, ఆయన వారిని ప్రేమించాడు. ఆయన వారి కొరకు సంతోషభరితమైన, అద్భుతమైన భవిష్యత్తును గూర్చి తలంచాడు. నిజమే, సాతాను వారిని తిరుగుబాటుకు నడిపించాడు, కాని దేవుని అద్భుతమైన సృష్టి బాగుపర్చలేనంతగా పాడుచేయబడలేదు.—ఆదికాండము 3:23, 24; 6:11, 12.

3. “వాస్తవమైన జీవం” అంటే ఏమిటి?

3 పరిస్థితులను చక్కబరచాలని దేవుడు నిశ్చయించుకున్నాడు. తాను ఆదిలో సంకల్పించినట్లుగా మనం జీవించడాన్ని చూడాలని ఆయన ఎంతగానో కోరుతున్నాడు. మన స్వల్ప కష్టభరితమైన ఉనికే “వాస్తవమైన జీవము” కాదు ఎందుకంటే ఇది యెహోవా ఉద్దేశించినదానికంటే ఎంతో అల్పమైంది. మన కొరకు దేవుడు కోరుకొనే “వాస్తవమైన జీవము” పరపూర్ణమైన పరిస్థితుల క్రింద “నిత్యజీవము.”—1 తిమోతి 6:12, 19.

4, 5. (ఎ) పరదైసు నిరీక్షణ ఎలా వాస్తవమౌతుంది? (బి) భవిష్యత్తు కొరకైన మన నిరీక్షణ గురించి మనం ఎందుకు తలంచాలి?

4 దేవుని గూర్చిన జ్ఞానము యెహోవా ఎదుట మనకు బాధ్యతను తెస్తుంది. (యాకోబు 4:17) మీరు ఆ జ్ఞానాన్ని అన్వయించుకొని, నిత్యజీవం పొందడానికి ప్రయత్నిస్తే మీరు పొందగల ఆశీర్వాదాల గురించి ఆలోచించండి. ఆయన వాక్యమైన బైబిలునందు, సమీపంలో ఉన్న పరదైసునందలి జీవితం ఎలా ఉంటుందనే దాని గురించి యెహోవా దేవుడు ఒక సుందరమైన చిత్రాన్ని చిత్రించాడు. అయితే, యెహోవా ప్రజలముగా మనం ప్రతిఫలం పొందాలనే కోరికతో మాత్రమే దేవున్ని సేవించము. మనం దేవున్ని ప్రేమిస్తున్నాము గనుక మనమాయనను సేవిస్తాము. (మార్కు 12:29, 30) అంతేగాక, మనం యెహోవాను సేవించడం ద్వారా జీవాన్ని సంపాదించు కోలేము. నిత్యజీవం దేవుడిచ్చే బహుమానం. (రోమీయులు 6:23) అలాంటి జీవితాన్ని గూర్చి ధ్యానించడం మనకు ప్రయోజనకరమైనది, ఎందుకంటే పరదైసు నిరీక్షణ యెహోవా దేవుడు ఎటువంటి దేవుడో అంటే—“తన్ను వెదకువారికి ఫలము దయచేయు” ప్రేమగల వాడని—మనకు గుర్తుచేస్తుంది. (హెబ్రీయులు 11:6) మన మనస్సుల్లోను హృదయాల్లోను వాస్తవమైయున్న నిరీక్షణ సాతాను లోకంలోని కష్టాలను సహించేందుకు మనకు సహాయం చేస్తుంది.—యిర్మీయా 23:20.

5 భవిష్యత్తులో రానైయున్న భూ పరదైసులో నిత్యజీవమనే బైబిలు ఆధారిత నిరీక్షణపై ఇప్పుడు మనం మన అవధానాన్ని నిలుపుదాము. దేవుని గూర్చిన జ్ఞానం భూమంతటా నిండినప్పుడు జీవితం ఎలా ఉంటుంది?

అర్మగిద్దోను తర్వాత—ఒక పరదైసు భూమి

6. అర్మగిద్దోను అంటే ఏమిటి, మానవజాతికి దాని భావమేమిటి?

6 ఇంతకు మునుపు చూపబడినట్లుగా, యెహోవా దేవుడు ఈ ప్రస్తుత దుష్ట విధానాన్ని త్వరలోనే నాశనం చేస్తాడు. హార్‌ మెగిద్దోను లేక అర్మగిద్దోను అని బైబిలు పిలిచేదాని వైపుకు లోకం త్వరితంగా పయనిస్తోంది. ఆ పదం, పోరాటం సాగిస్తున్న దేశాలు తీసుకువచ్చే అణు విధ్వంసాన్ని గూర్చి కొంతమంది ప్రజలు తలంచేలా చేయవచ్చు, కాని అర్మగిద్దోను దానికి ఎంతో భిన్నంగా ఉంటుంది. ప్రకటన 16:14-16 చూపిస్తున్నట్లు, అర్మగిద్దోను అంటే “సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధము.” అది ‘లోకమంతట ఉన్న రాజులు’ లేక దేశాలు ఇమిడివుండే యుద్ధం. యెహోవా దేవుని కుమారుడగు నియమిత రాజు, త్వరలోనే యుద్ధంలోకి ప్రవేశిస్తాడు. ఫలితం కచ్చితంగా సంపూర్ణమైనది. దేవుని రాజ్యాన్ని వ్యతిరేకించే వారందరు, సాతాను దుష్ట విధానంలో భాగమైన వారు నిర్మూలింపబడతారు. యెహోవా ఎడల యథార్థంగా ఉన్నవారే కాపాడబడతారు.—ప్రకటన 7:9, 14; 19:11-21.

7. క్రీస్తు యొక్క వెయ్యేండ్ల పరిపాలన కాలంలో సాతాను అతని దయ్యాలు ఎక్కడ ఉంటారు, ఇది మానవజాతికి ఎలా ప్రయోజనం చేకూరుస్తుంది?

7మీరు ఆ వినాశనాన్ని తప్పించుకున్నారనుకోండి. దేవుడు వాగ్దానం చేసిన నూతన లోకంలో భూమిపై జీవితం ఎలా ఉంటుంది? (2 పేతురు 3:13) మనం ఊహించనవసరం లేదు ఎందుకంటే బైబిలే ఆ జీవితం ఎలా ఉంటుందో మనకు చెబుతుంది, అది చెప్పేది ఎంతో ఉత్తేజకరంగా ఉంటుంది. యేసుక్రీస్తు యొక్క వెయ్యేండ్ల పరిపాలనా సమయంలో నిర్వీర్యమైన స్థితియనే అగాధములో బంధింపబడడం ద్వారా సాతాను అతని దయ్యాలు నిష్క్రియులుగా చేయబడతారని మనం తెలుసుకుంటాము. ఆ దుష్ట, మోసకరమైన జీవులు కష్టాలు తెస్తూ, దేవునికి వ్యతిరేకంగా అవిశ్వాస క్రియలు చేసేందుకు మనల్ని పురికొల్పుతూ మోసగించడానికి పొంచివుండరు. ఎంతటి ఉపశమనం!—ప్రకటన 20:1-3.

8, 9. నూతన లోకంలో, బాధలు, అనారోగ్యం, వృద్ధాప్యాలకు ఏమి సంభవిస్తుంది?

8 తగిన సమయంలో, అన్ని విధాలైన అస్వస్థతలు తొలగింపబడతాయి. (యెషయా 33:24) అప్పుడు కుంటివారు మంచి బలమైన కాళ్లతో నిలబడతారు, నడుస్తారు, పరుగెత్తుతారు మరియు నాట్యమాడతారు. అనేక సంవత్సరాలు బధిరులుగా ఉన్న తర్వాత చెవిటి వారు తమ చుట్టూ ఉన్న ఆనందకరమైన శబ్దాలను వింటారు. అద్భుతమైన రంగులు, రూపాలు గల లోకం తమ కళ్ల ఎదుట రూపుదిద్దుకోవడాన్ని చూసి గ్రుడ్డివారు నిశ్చేష్టులౌతారు. (యెషయా 35:5, 6) చివరికి, వారు తమ ప్రియమైనవారి ముఖాలను చూస్తారు! బహుశా అప్పుడు ఆనందబాష్పాలతో వారి దృష్టి కేవలం తాత్కాలికంగా మసకబారుతుంది.

9 ఒకసారి ఊహించండి! కళ్లద్దాలు, ఊతకఱ్ఱలు, చేతికఱ్ఱలు, దంత వైద్య శాలలు లేక చికిత్సాలయాలు ఇక ఉండవు! మరెన్నడూ మానసిక అనారోగ్యం మరియు నిరుత్సాహం ప్రజల సంతోషాన్ని దోచుకోవు. బాల్యము అనారోగ్యం చేత బాధింపబడదు. వృద్ధాప్యపు దుష్పరిణామాలకు కాలం చెల్లుతుంది. (యోబు 33:25) మనం ఆరోగ్యవంతంగా, దృఢంగా తయారవుతాము. సుఖనిద్ర పొందినవారమై ప్రతి రోజు ఉదయం లేస్తాము, ఉత్సాహవంతమైన జీవితం, సంతృప్తికరమైన పనితోనిండిన ఓ క్రొత్తరోజు కొరకు శక్తి, ఆసక్తులతో నిండుకొని ఉంటాము.

10. అర్మగిద్దోను నుండి కాపాడబడేవారు ఏ పని నియామకాన్ని చేపడతారు?

10 అర్మగిద్దోనునుండి కాపాడబడే వారు చేయవలసిన ఆనందభరితమైన పని ఎంతో ఉంటుంది. వారు భూమిని పరదైసుగా మారుస్తారు. కలుషితమైన పాత విధానం యొక్క గుర్తులు ఏవైనా ఉంటే అవి తుడిచివేయబడతాయి. మురికివాడలు, పాడైపోయిన స్థలాలవంటివి తోటలు, నందనవనాలుగా మార్చబడతాయి. అందరూ అనుకూలమైన, ఆహ్లాదకరమైన వసతిని కలిగివుంటారు. (యెషయా 65:21) సమయం గడుస్తుండగా, భూమి యొక్క అలాంటి పరదైసు పరిస్థితులు వృద్ధి చెంది, ఏదెను తోటలో రమ్యత కొరకు సృష్టికర్త ఏర్పాటు చేసిన ప్రమాణాలకు సరిపోయేలా భూమి అంతటికీ వ్యాపిస్తాయి. ఆ పునఃస్థాపన పనిలో భాగం వహించడం ఎంత సంతృప్తికరంగా ఉంటుందో కదా!

11. భూ పర్యావరణం మరియు జంతుజాలాలతో మానవజాతి భవిష్యత్‌ సంబంధం ఎలా ఉంటుంది?

11 పర్యావరణానికి హాని కలుగకుండేలా ఇదంతా దైవిక నడిపింపు క్రింద జరుగుతుంది. మానవులు జంతువులతో సమాధానాన్ని కలిగివుంటారు. వాటిని బుద్ధిపూర్వకంగా వధించే బదులు, వాటి గురించి మంచి శ్రద్ధ తీసుకుంటూ మనిషి భూమిపై బాధ్యతాయుతమైన అజమాయిషీని పునఃప్రారంభిస్తాడు. తోడేళ్లు మరియు గొర్రె పిల్లలు, సింహాలు మరియు మేకపిల్లలు కలిసి మేయడాన్ని దృశ్యీకరించుకోండి—పెంపుడు జంతువులు పూర్తిగా సురక్షితమైనవే. క్రూర మృగాల గురించి చిన్న పిల్లవాడు కూడా భయపడడు, లేక క్రూరమైన భయంకరమైన ప్రజలచే నూతన లోకం యొక్క శాంతి చెరిగిపోదు. (యెషయా 11:6-8) అది ఎంతటి సమాధానకరమైన నూతన లోకమై ఉంటుందోకదా!

మారిన మానవజాతి

12. యెషయా 11:9 ఈనాడు ఎలా నెరవేరుతుంది, పరదైసులో ఎలా నెరవేర్చబడుతుంది?

12 భూమి అంతటిలో ఏ హాని ఎందుకు జరగదో యెషయా 11:9 మనకు తెలియజేస్తుంది. అదిలా చెబుతుంది: “సముద్రము జలముతో నిండియున్నట్లు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండియుండును.” ఇది ప్రజలకే వర్తిస్తుంది ఎందుకంటే జంతువులు వాటి సహజ లక్షణంచే నడిపింపబడతాయి గనుక అవి “యెహోవాను గూర్చిన జ్ఞానమును” పొంది మార్పులు చేసుకోలేవు. అయితే మన సృష్టికర్తను గూర్చిన జ్ఞానం ప్రజలను తప్పకుండా మార్చగలదు. మీ జీవితంలో దేవుని గూర్చిన జ్ఞానాన్ని అన్వయించుకోవడం వల్ల మీకై మీరు ఇప్పటికే కొన్ని మార్పులు చేసుకున్నారన్నదానిలో సందేహం లేదు. లక్షలాదిమంది అలాగే చేశారు. గనుక, యెహోవాను సేవిస్తున్నవారిలో ఈ ప్రవచనం ఇప్పటికే నెరవేరడం ప్రారంభించింది. అయినా, ప్రపంచమంతటిలోనున్న ప్రజలు ఎటువంటి పాశవికమైన లేక దౌర్జన్యపూరితమైన లక్షణాలనైనా విడిచిపెట్టి, నిరంతరం సమాధానం గలవారిగా తయారయ్యే సమయాన్ని గూర్చి కూడా అది తెలియజేస్తుంది.

13. భూమిపై ఏ విద్యా కార్యక్రమం జరుగనైయుంది?

13 దేవుని గూర్చిన జ్ఞానం భూమిని నింపినప్పుడు అది ఎంత అద్భుతంగా ఉంటుందో కదా! రాజైన యేసుక్రీస్తు మరియు ఆయన సహపరిపాలకులైన 1,44,000 మంది నడిపింపు క్రింద విస్తృతమైన విద్యా కార్యక్రమం ఉంటుంది. అప్పుడు క్రొత్త “గ్రంథములు” ఉపయోగించబడతాయి. స్పష్టంగా, దేవుని ఈ లిఖిత ఉపదేశాలు భూనివాసులకు బోధించేందుకు మూలాధారమై ఉంటాయి. (ప్రకటన 20:12) మానవజాతి యుద్ధం కాదుగాని శాంతిని నేర్చుకుంటుంది. నాశనకరమైన ఆయుధాలన్నీ మరెన్నడూ ఉండకుండా పోతాయి. (కీర్తన 46:9) నూతన లోక నివాసులకు తమ తోటి మానవులను ప్రేమ, గౌరవ మర్యాదలతో చూడడం నేర్పబడుతుంది.

14. మానవజాతి ఒకే ఐక్య కుటుంబం అయినప్పుడు, లోకం ఎలా భిన్నంగా ఉంటుంది?

14 మానవజాతి ఒకే ఐక్య కుటుంబం అవుతుంది. ఐక్యత మరియు సహోదరత్వాలకు ఏ అడ్డంకులు ఉండవు. (కీర్తన 133:1-3) దొంగలు రాకుండా ఉండేందుకు ఎవరింటికీ తాళం వేయనవసరం లేదు. ప్రతి హృదయంలోను, ప్రతి గృహంలోను, భూమి యొక్క ప్రతి భాగంలోను శాంతి ఏలుతుంది.—మీకా 4:4.

ఆనందభరితమైన పునరుత్థానం

15. ఏ రెండు గుంపులవారు భూమిపైకి పునరుత్థానం చేయబడతారు?

15 ఆ వెయ్యేండ్ల పరిపాలనలో పునరుత్థానం జరుగుతుంది. దేవుని పరిశుద్ధాత్మకు లేక చురుకైన శక్తికి వ్యతిరేకంగా ఇష్టపూర్వకంగా పాపం చేసి, అది ప్రత్యక్షపరచిన విషయాలకు నడిపింపులకు విరుద్ధమైన విధంగా పశ్చాత్తాపం లేకుండా ప్రవర్తించేవారు పునరుత్థానం చేయబడరు. (మత్తయి 23:15, 33; హెబ్రీయులు 6:4-6) అయితే ఎవరలా పాపం చేశారనేది దేవుడే నిర్ణయిస్తాడు. కాని రెండు విశేషమైన గుంపులు—‘నీతిమంతులు, అనీతిమంతులు’ పునరుత్థానం చేయబడతారు. (అపొస్తలుల కార్యములు 24:15) అక్కడ ఓ క్రమ పద్ధతి ఉంటుంది గనుక, నీతిమంతులు మరియు యెహోవాను యథార్థంగా సేవించిన వారు భూమిపై తిరిగి జీవించడానికి మొదట ఆహ్వానింపబడతారని నిర్ధారించడం సహేతుకమైనది.—హెబ్రీయులు 11:35-39.

16. (ఎ) భూమిపైకి పునరుత్థానం చేయబడే “నీతిమంతులలో” ఎవరెవరు ఉంటారు? (బి) ప్రాముఖ్యంగా, ప్రాచీన కాలం యొక్క ఏ నమ్మకమైన వ్యక్తిని కలవాలని మీరు కోరుకుంటారు, ఎందుకు?

16 యుద్ధాలు, వినాశనాలు, మరణం వంటివాటిని గూర్చిన వార్తలు వినే బదులు యెహోవా సేవకులు పునరుత్థానాన్ని గూర్చిన అద్భుతమైన నివేదికలు వింటారు. హేబెలు, హనోకు, నోవహు, అబ్రాహాము, శారా, యోబు, మోషే, రాహాబు, రూతు, దావీదు, ఏలీయా, ఎస్తేరు వంటి నమ్మకమైన స్త్రీపురుషులు తిరిగి రావడాన్ని తెలుసుకోవడం ఎంతో ఉత్తేజకరంగా ఉంటుంది. అనేక బైబిలు వృత్తాంతాలను గూర్చిన పూర్వచరిత్రను గూర్చిన వివరణలు వారు తెలియజేస్తుండగా, వారు ఎంతటి పురికొల్పే చారిత్రాత్మకమైన వాస్తవాలను తెలియజేస్తారో కదా! సాతాను యొక్క దుష్టవిధానాన్ని గూర్చి తెలుసుకోవాలని, యెహోవా తన పరిశుద్ధ నామాన్ని ఎలా పరిశుద్ధపరిచాడో, తన సర్వాధిపత్యాన్ని ఎలా ఉన్నతపర్చాడో తెలుసుకోవాలని వారు మరియు ఇటీవలి కాలాల్లో మరణించిన నీతిమంతులు ఎంతో ఆసక్తి కలిగివుంటారు.

17. పునరుత్థానం చేయబడే ఇతరులకు విశ్వాసులైన వారు ఏ సహాయాన్ని అందజేస్తారు?

17 వందలకోట్లమంది “అనీతిమంతులు” మరణబంధకాల నుండి విడిపింపబడినప్పుడు పునరుత్థానం యొక్క తర్వాతి ఘట్టంలో విశ్వాసులైన వీరు ఎంత సహాయకంగా ఉంటారో కదా! మానవజాతిలోని అనేకులకు యెహోవాను తెలుసుకొనే అవకాశం ఎన్నడూ లభించలేదు. సాతాను వారి “మనస్సులకు గ్రుడ్డితనం కలుగజేస్తుండెను.” (2 కొరింథీయులు 4:4) అపవాది పనులన్నీ అసలు జరుగలేదేమో అన్నట్లు తీసివేయబడతాయి. అనీతిమంతులు సుందరమైన, శాంతియుతమైన భూమ్మీదికి తిరిగివస్తారు. యెహోవాను గూర్చి, పరిపాలిస్తున్న ఆయన కుమారుడైన యేసుక్రీస్తును గూర్చి వారికి బోధించేందుకు చక్కగా సంస్థీకరించబడిన ప్రజలచే వారు ఆహ్వానింపబడతారు. పునరుత్థానులైన వందలకోట్లమంది తమ సృష్టికర్తను తెలుసుకొని ప్రేమిస్తారు గనుక, యెహోవాను గూర్చిన జ్ఞానము భూమియంతటిలో విశేషమైన విధంగా నింపబడుతుంది.

18. పునరుత్థానమైన ప్రియమైన వారిని ఆహ్వానించేటప్పుడు మీరు ఎలా భావిస్తారని మీరనుకుంటున్నారు?

18 పునరుత్థానం మన హృదయాలకు ఎంత ఆనందాన్ని తెస్తుందో కదా! మన శత్రువైన మరణంవల్ల ఎవరు బాధపడలేదు? వాస్తవానికి, అనారోగ్యం, వృద్ధాప్యం, దుర్ఘటన, లేక దౌర్జన్యం ప్రియమైన వారిని బలిగొనడంతో ప్రేమబంధం లేక స్నేహబంధం విచ్ఛిన్నమై పోయినప్పుడు మనలో ఎవరు చలించిపోలేదు? కాబట్టి, పరదైసులో జరిగే పునఃకలయికల ఆనందాన్ని ఊహించండి. తల్లులు తండ్రులు, కుమారులు కుమార్తెలు, స్నేహితులు బంధువులు, నవ్వుతూ ఆనందబాష్పాలతో ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటారు.

చివరికి పరిపూర్ణత!

19. వెయ్యేండ్ల పరిపాలనలో ఏ సూచక క్రియ జరుగుతుంది?

19 వెయ్యేండ్ల పరిపాలనంతటిలో, ఒక అద్భుతమైన సూచక క్రియ జరుగుతూ ఉంటుంది. మానవజాతికి, క్రీస్తు యొక్క వెయ్యేండ్ల పరిపాలనలోని పులకింపజేసే అంశం బహుశా అదే అయివుండవచ్చు. నమ్మకమైన, విధేయులైన ప్రతి స్త్రీపురుషునికి విమోచన క్రయధన బలి ప్రయోజనాలను అన్వయించేలా యెహోవా తన కుమారునికి నడిపింపునిస్తాడు. ఆ విధంగా, పాపమంతా తీసివేయబడుతుంది, మానవజాతి పరిపూర్ణతకు ఎదుగుతుంది.—1 యోహాను 2:2; ప్రకటన 21:1-4.

20. (ఎ) పరిపూర్ణులు కావడమంటే భావమేమిటి? (బి) అర్మగిద్దోనునందు కాపాడబడేవారు మరియు పునరుత్థానమైనవారు పూర్తి భావంలో ఎప్పుడు జీవించడం ప్రారంభిస్తారు?

20 పరిపూర్ణత! దాని భావమేమిటి? ఆదాము హవ్వలు యెహోవా దేవునికి వ్యతిరేకంగా పాపం చేయక ముందు అనుభవించినలాంటి జీవితానికి తిరిగి చేరడమని భావం. శారీరకంగా, మానసికంగా, భావోద్రేకపరంగా, నైతికంగా, ఆత్మీయంగా—ఊహించగల ప్రతి విధంలోను—పరిపూర్ణ మానవులు దేవుని ప్రమాణాలకు పూర్తిగా సరిపోతారు. అప్పుడు ప్రజలందరూ ఒకేలా ఉంటారా? ఎంతమాత్రం కాదు! యెహోవా సృష్టి—చెట్లు, పువ్వులు, జంతువులు—ఇవన్నీ ఆయన వివిధ రకాలను ప్రేమిస్తున్నాడని మనకు బోధిస్తాయి. పరిపూర్ణమానవులకు భిన్నమైన వ్యక్తిత్వాలు, సామర్థ్యాలు ఉంటాయి. జీవితం ఎలా ఉండాలని దేవుడు ఉద్దేశించాడో ప్రతి ఒక్కరు అలాగే ఆనందిస్తారు. ప్రకటన 20:5 ఇలా చెబుతుంది: “ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు కడమ మృతులు బ్రదుకలేదు.” అర్మగిద్దోను నుండి కాపాడబడే గొప్ప సమూహమువలె, పునరుత్థానమైన వారు పాపంలేని పరిపూర్ణతకు చేరినప్పుడు సమృద్ధిగా జీవం పొందుతారు.

21. (ఎ) క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనాంతంలో ఏమి జరుగుతుంది? (బి) సాతానుకు మరియు అతని మద్దతుదారులందరికి చివరికి ఏమి జరుగుతుంది?

21 పరిపూర్ణ మానవులు ఒక అంతిమ పరీక్షనెదుర్కొంటారు. వెయ్యేండ్ల పరిపాలనాంతములో, సాతాను అతని దయ్యాలు కొంత సమయం కొరకు అగాధము నుండి విడిపింపబడి, ప్రజలను యెహోవా నుండి దూరం చేయడానికి ప్రయత్నించేందుకు వారికి అవకాశం ఇవ్వబడుతుంది. కొందరు దేవున్ని ప్రేమించడం కంటే తప్పుడు కోరికలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు, కాని ఈ తిరుగుబాటు తీసివేయబడుతుంది. యెహోవా ఈ స్వార్థపరులను సాతాను అతని దయ్యాలన్నిటితోపాటు శిక్షిస్తాడు. అప్పుడు తప్పిదస్థులందరు మరెన్నడూ ఉండరు.—ప్రకటన 20:7-10.

మీరేమి చేస్తారు?

22. పరదైసులో ఏమి చేయడానికి మీరు నిరీక్షిస్తున్నారు?

22 యెహోవా దేవున్ని ప్రేమించేవారికి నిత్యత్వం ఇవ్వబడుతుంది, వారు పరదైసు భూమిపై నివసిస్తారు. వారి ఆనందాన్ని మనం ఊహించడం కష్టం, మీరు కూడా దానిలో భాగం వహించవచ్చు. సంగీతం, కళ, చేతిపనులు—అంతెందుకు, పరిపూర్ణ మానవజాతి సాధించేవి పాత ప్రపంచంలో అత్యంత గొప్ప కళాకారులు చేసిన అత్యంత శ్రేష్ఠమైన పనులకంటే ఉన్నతంగా ఉంటాయి. చివరికి, మానవులు పరిపూర్ణులౌతారు, వారికి అమితమైన సమయం ఉంటుంది. పరిపూర్ణ మానవులుగా మీరేమి చేయగలుగుతారో ఊహించండి. యెహోవా సృష్టిని గూర్చి—విశ్వంలో ఉన్న వందలకోట్ల నక్షత్ర వీధుల నుండి అతి చిన్న ఉప అణులేశము వరకు—మీరు మీ తోటి మానవులు ఏమి నేర్చుకుంటారో కూడా తలంచండి. మానవజాతి సాధించే ప్రతిదీ మన ప్రేమగల పరలోక తండ్రియైన యెహోవా హృదయాన్ని మరింత ఆనందపరుస్తుంది.—కీర్తన 150:1-6.

23. పరదైసులో జీవితం ఎందుకు ఎన్నడూ విసుగు కలిగించేదిగా ఉండదు?

23 అప్పుడు జీవితం విసుగు కలిగించేదిగా ఉండదు. సమయం గడుస్తుండగా అది మరీ మరీ ఆసక్తికరమైనదౌతుంది. చూడండి, దేవుని గూర్చిన జ్ఞానానికి అంతం లేదు. (రోమీయులు 11:33) ఆ నిత్యత్వమంతటిలో, ఎల్లప్పుడూ నేర్చుకోవడానికి ఎంతో ఉంటుంది, కనుగొనవలసిన క్రొత్త గమ్యాలు ఉంటాయి. (ప్రసంగి 3:11) మీరు యెహోవా దేవుని గురించి నేర్చుకోవడాన్ని కొనసాగిస్తే, మీరు—కేవలం కొన్ని సంవత్సరాలు కాదు గాని నిరంతరం జీవిస్తూనే ఉంటారు!—కీర్తన 22:26.

24, 25. దేవుని గూర్చిన జ్ఞానానికి అనుగుణంగా ఇప్పుడు మీరెందుకు జీవించాలి?

24 పరదైసు భూమిపై ఆనందకరమైన భవిష్యత్తు మీరు చేసే ఏ ప్రయత్నానికైనా లేక త్యాగానికైనా తగినదికాదా? అది నిశ్చయంగా తగినదే! అయితే, ఆ అద్భుతమైన భవిష్యత్తు యొక్క కీలకాన్ని యెహోవా మీకు అందజేస్తున్నాడు. ఆ కీలకమే దేవుని గూర్చిన జ్ఞానం. మీరు దాన్ని ఉపయోగించుకుంటారా?

25 మీరు యెహోవాను ప్రేమిస్తే, ఆయన చిత్తాన్ని చేయడంలో మీరు ఆనందాన్ని కనుగొంటారు. (1 యోహాను 5:3) మీరు ఆ విధానాన్ని చేపడితే, మీరు ఎంతటి ఆశీర్వాదాలను పొందుతారో కదా! మీరు దేవుని గూర్చిన జ్ఞానాన్ని అన్వయించుకొంటే, అది ఈ కష్టభరిత లోకంలో కూడా మీకు ఆనందభరితమైన జీవితాన్ని ఇవ్వగలదు. భవిష్యత్‌ ప్రతిఫలాలు మితిలేనివి, ఎందుకంటే ఇది నిత్యజీవానికి నడిపించే జ్ఞానము! మీరు చర్య తీసుకోవడానికి ఇది తగిన సమయం. దేవుని గూర్చిన జ్ఞానంతో పొందిక కలిగి జీవించడానికి నిశ్చయించుకోండి. యెహోవా ఎడల మీ ప్రేమను ప్రదర్శించండి. ఆయన పరిశుద్ధ నామాన్ని ఘనపర్చి, సాతానును అబద్ధికునిగా నిరూపించండి. ఫలితంగా, నిజమైన జ్ఞానవివేకములకు మూలమైన యెహోవా దేవుడు తన గొప్ప ప్రేమగల హృదయంలో మీ గురించి ఆనందిస్తాడు. (యిర్మీయా 31:3; జెఫన్యా 3:17) ఆయన మిమ్మల్ని నిరంతరం ప్రేమిస్తాడు!

మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి

“వాస్తవమైన జీవం” అంటే ఏమిటి?

అర్మగిద్దోను తర్వాత, భూమిపై ఏమి జరుగుతుంది?

భూమిపైకి ఎవరు పునరుత్థానం చేయబడతారు?

మానవజాతి పరిపూర్ణతకు ఎలా చేరుతుంది, చివరికి ఎలా పరీక్షించబడుతుంది?

పరదైసు గురించి మీ నిరీక్షణ ఏమిటి?

[అధ్యయన ప్రశ్నలు]

[188, 189వ పేజీలోని చిత్రం]

దేవుని గూర్చిన జ్ఞానం భూమిని నింపినప్పుడు, పరదైసులో జీవించాలని మీరు నిరీక్షిస్తున్నారా?