కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని ప్రజల మధ్య భద్రతను కనుగొనండి

దేవుని ప్రజల మధ్య భద్రతను కనుగొనండి

అధ్యాయము 17

దేవుని ప్రజల మధ్య భద్రతను కనుగొనండి

1, 2. తుపాను విధ్వంసానికి గురైన ప్రజల పరిస్థితిలా మానవజాతి పరిస్థితి ఎలా ఉంది?

మీరు నివసించే ప్రాంతాన్ని భయంకరమైన తుపాను విధ్వంసం చేసినట్లు ఊహించండి. మీ ఇల్లు నాశనం చేయబడింది, మీ వస్తువులన్నీ పోయాయి. ఆహారం లేదు. పరిస్థితి నిరాశాజనకంగా ఉంది. ఆ తర్వాత అనుకోని పునరావాస సహాయాలు వచ్చాయనుకోండి. ఆహారం మరియు వస్త్రాలు పుష్కలంగా అందజేయబడ్డాయి. మీ కొరకు ఒక క్రొత్త ఇల్లు నిర్మించబడింది. ఇవన్నీ లభ్యమయ్యేలా చేసిన వ్యక్తి ఎడల మీరు తప్పకుండా కృతజ్ఞత కలిగివుంటారు.

2 అటువంటి దానికి పోల్చదగినదే నేడు జరుగుతోంది. ఆ తుపానులాగానే, ఆదాము హవ్వల తిరుగుబాటు మానవజాతికి గొప్ప నాశనాన్ని కలిగించింది. మానవజాతి యొక్క పరదైసు గృహం పోయింది. అప్పటి నుండి, మానవ ప్రభుత్వాలు యుద్ధం, నేరం, అన్యాయం వంటివాటినుండి ప్రజలను కాపాడడంలో విఫలులయ్యాయి. మతం, మంచి ఆత్మీయాహారం కొరకు కోట్లకొలది మంది ఆకలిగొనేలా చేసింది. అయితే, ఆత్మీయపరంగా చెప్పాలంటే, యెహోవా దేవుడు ఇప్పుడు ఆహారం, వస్త్రాలు, వసతి అందజేస్తున్నాడు. ఆయన వాటినెలా అందజేస్తున్నాడు?

“నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు”

3. మానవజాతి కొరకు యెహోవా ఏర్పాట్లను ఎలా అందజేశాడు, అవి ఏ ఉదాహరణల ద్వారా చూపబడ్డాయి?

3 పునరావాస సహాయాలు సాధారణంగా సంస్థీకరింపబడిన మధ్యవర్తుల ద్వారా అందజేయబడతాయి, అలాగే యెహోవా తన ప్రజల కొరకు ఆత్మీయ ఏర్పాట్లను చేశాడు. ఉదాహరణకు, ఇశ్రాయేలీయులు దాదాపు 1,500 సంవత్సరాల వరకు “యెహోవా సమాజము”గా ఉండిరి. వారిలో దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించేందుకు ఆయనకు మధ్యవర్తులుగా పనిచేసినవారుండిరి. (1 దినవృత్తాంతములు 28:8; 2 దినవృత్తాంతములు 17:7-9) సా.శ. మొదటి శతాబ్దంలో, యెహోవా క్రైస్తవ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. సంఘాలు స్థాపించబడ్డాయి, అపొస్తలులు మరియు పెద్దలచే రూపొందించబడిన పరిపాలక సభ నడిపింపు క్రింద అవి పనిచేశాయి. (అపొస్తలుల కార్యములు 15:22-31) అలాగే నేడు యెహోవా తన ప్రజలతో ఒక సంస్థీకరింపబడిన గుంపు ద్వారా వ్యవహారిస్తున్నాడు. ఇది మనకెలా తెలుసు?

4. ఆధునిక కాలాల్లో ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునిగా’ ఎవరు నిరూపించబడ్డారు, దేవుని ఆత్మీయ ఏర్పాట్లు ఎలా లభ్యం చేయబడుతున్నాయి?

4 తన రాజ్యాధికార ప్రత్యక్షత సమయంలో “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” తన అనుచరులకు “తగినవేళ అన్నము” పెడుతూ ఉంటాడని యేసు చెప్పాడు. (మత్తయి 24:45-47) యేసు 1914 లో పరలోక రాజుగా నియమించబడినప్పుడు, ఎవరు ఈ “దాసుని”గా నిరూపించుకున్నారు? క్రైస్తవమత సామ్రాజ్య మత నాయకులు మాత్రం కాదు. మొదటి ప్రపంచ యుద్ధంలో తమ స్వంత జాతీయ ప్రభుత్వాలకు మద్దతునిచ్చిన ప్రచారంతో ఎక్కువగా వారు తమ మందలను మేపారు. కాని దేవుని పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన, “చిన్న మందా” అని యేసు పిలిచినదానిలో భాగమైన నిజ క్రైస్తవుల గుంపు సరైన, సమయోచితమైన ఆత్మీయాహారాన్ని పంచిపెట్టింది. (లూకా 12:32) ఈ అభిషక్త క్రైస్తవులు మానవ ప్రభుత్వాలకు బదులు దేవుని రాజ్యాన్ని గూర్చి ప్రకటించారు. తత్ఫలితంగా, గడిచిన సంవత్సరాలలో, నీతియుక్తంగా నిర్ణయించబడిన లక్షలాదిమంది “వేరే గొఱ్ఱెలు” నిజమైన మతాన్ని అవలంబించడంలో అభిషేకించబడిన “దాసునితో” కలిశారు. (యోహాను 10:16) ‘నమ్మకమైన దాసున్ని’ మరియు అతని ప్రస్తుత దిన పరిపాలక సభను ఉపయోగిస్తూ, ఈ ఏర్పాట్లు పొందాలనుకొనే వారందరికీ ఆత్మీయ సంబంధమైన ఆహారాన్ని వస్త్రాలను వసతిని అందుబాటులో ఉంచేలా చేసేందుకు దేవుడు సంస్థీకరింపబడిన తన ప్రజలకు నడిపింపునిస్తాడు.

“తగినవేళ అన్నము”

5. నేడు లోకంలో ఏ ఆత్మీయ స్థితి ఉంది, కాని దీని గురించి యెహోవా ఏమి చేస్తున్నాడు?

5 యేసు ఇలా చెప్పాడు: “మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని యెహోవా నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును.” (మత్తయి 4:4, NW) అయితే, విచారకరంగా, అధికశాతం మంది దేవుని మాటలకు శ్రద్ధనివ్వడం లేదు. యెహోవా ప్రవక్తయైన ఆమోసు ప్రవచించినట్లుగా, “అన్నపానములు లేకపోవుటచేత కలుగు క్షామముకాక యెహోవా మాటను వినకపోవుటవలన కలుగు క్షామము” ఉంది. (ఆమోసు 8:11) మత సంబంధమైన ప్రజలు కూడా ఆత్మీయాకలితో అలమటిస్తున్నారు. అయినా “మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండ” వలెనన్నది యెహోవా చిత్తం. (1 తిమోతి 2:3, 4) అందుకే ఆయన ఆత్మీయాహారాన్ని పుష్కలంగా అందజేస్తున్నాడు. కాని దాన్ని ఎక్కడ నుండి పొందవచ్చు?

6. గత కాలాల్లో యెహోవా తన ప్రజలను ఆత్మీయంగా ఎలా పోషించాడు?

6 చరిత్రంతటిలో, యెహోవా తన ప్రజలకు ఆత్మీయాహారాన్ని ఒక గుంపుగా అందజేశాడు. (యెషయా 65:13) ఉదాహరణకు, దేవుని ధర్మశాస్త్రాన్ని గూర్చి ఒక గుంపుగా వారు బోధింపబడేందుకు ఇశ్రాయేలు యాజకులు పురుషులను స్త్రీలను పిల్లలను సమావేశపర్చేవారు. (ద్వితీయోపదేశకాండము 31:9, 12) పరిపాలక సభ నడిపింపు క్రింద, మొదటి శతాబ్దపు క్రైస్తవులు సంఘాలను సంస్థీకరించి, అందరికి ఉపదేశం మరియు ప్రోత్సాహం ఇచ్చేందుకు కూటాలు ఏర్పాటు చేసేవారు. (రోమీయులు 16:5; ఫిలేమోను 1, 2) యెహోవాసాక్షులు ఈ మాదిరిని అనుసరిస్తారు. వారి కూటాలన్నిటికి హాజరయ్యేందుకు మీరు హృదయపూర్వకంగా ఆహ్వానింపబడుతున్నారు.

7. క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరు కావడం జ్ఞానం మరియు విశ్వాసంతో ఎలా సంబంధాన్ని కలిగివుంది?

7 నిజమే, మీరు మీ వ్యక్తిగత బైబిలు పఠనం ద్వారా ఇప్పటికే ఎంతో నేర్చుకొని ఉండవచ్చు. బహుశా ఎవరైనా మీకు సహాయం చేసివుండవచ్చు. (అపొస్తలుల కార్యములు 8:30-35) అయితే అందుకు తగిన శ్రద్ధనివ్వకపోతే ఎండి చచ్చిపోయే మొక్కతో మీ విశ్వాసాన్ని పోల్చవచ్చు. కాబట్టి, మీరు సరైన ఆత్మీయ పోషణను పొందాలి. (1 తిమోతి 4:6) మిమ్మల్ని ఆత్మీయంగా పోషించి, దేవుని గూర్చిన జ్ఞానాన్ని మీరు అధికం చేసుకొంటుండగా విశ్వాసమందు అభివృద్ధి చెందుతూ ఉండేందుకు మీకు సహాయపడేలా రూపొందించబడిన క్రమమైన శిక్షణా కార్యక్రమాలను క్రైస్తవ కూటాలు అందజేస్తాయి.—కొలొస్సయులు 1:9, 10.

8. యెహోవాసాక్షుల కూటాలకు హాజరు కావడానికి మనం ఎందుకు ప్రోత్సహించబడుతున్నాము?

8 కూటాలు మరో ప్రాముఖ్యమైన సంకల్పాన్ని నెరవేరుస్తాయి. పౌలు ఇలా వ్రాశాడు: “సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, . . . ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.” (హెబ్రీయులు 10:24, 25) “పురికొల్పడం” అని అనువదించబడిన గ్రీకు పదానికి “పదును” పెట్టడం అనే భావం కూడా ఉంది. ఒక బైబిలు సామెత ఇలా చెబుతుంది: “ఇనుముచేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును.” (సామెతలు 27:17) మనందరకీ తదేకంగా ‘పదును’ పెట్టడం అవసరం. లోకం నుండి వచ్చే ప్రతిదిన ఒత్తిళ్ల వలన మన విశ్వాసం మొద్దుబారిపోతుంది. మనం క్రైస్తవ కూటాలకు హాజరైనప్పుడు, పరస్పరం ప్రోత్సహించుకుంటాము. (రోమీయులు 1:11, 12) సంఘ సభ్యులు “యొకనినొకడు ఆదరించి యొకనికొకడు క్షేమాభివృద్ధి కలుగ” జేసుకొనుడని అపొస్తలుడైన పౌలు ఇచ్చిన సలహాను అనుసరిస్తారు, అలాంటి విషయాలు మన విశ్వాసానికి పదునుపెడతాయి. (1 థెస్సలొనీకయులు 5:11) మనం క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరు కావడం మనం దేవున్ని ప్రేమిస్తున్నామని కూడా సూచిస్తుంది మరియు ఆయనను స్తుతించేందుకు మనకు అవకాశాలనిస్తుంది.—కీర్తన 35:18.

“ప్రేమను ధరించుకొనుడి”

9. ప్రేమను ప్రదర్శించడంలో యెహోవా ఎలా మాదిరినుంచాడు?

9 పౌలు ఇలా వ్రాశాడు: “పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి.” (కొలొస్సయులు 3:14) యెహోవా దయాపూర్వకంగా మనకు ఈ వస్త్రధారణను అందజేస్తున్నాడు. ఏ విధంగా? క్రైస్తవులు ప్రేమను ప్రదర్శించవచ్చు, ఎందుకంటే అది యెహోవా యొక్క పరిశుద్ధాత్మ ఫలాల్లో దేవుడిచ్చిన ఒక ఫలం. (గలతీయులు 5:22, 23) మనం నిత్య జీవం పొందగలిగేలా తన అద్వితీయ కుమారున్ని పంపించడం ద్వారా యెహోవా తానే అత్యంత గొప్ప ప్రేమను ప్రదర్శించాడు. (యోహాను 3:16) ప్రేమ యొక్క ఈ అత్యున్నతమైన ప్రదర్శన, ఈ లక్షణాన్ని చూపించడంలో మనకు ఒక మాదిరిని అందించింది. అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనమొకనినొకడు ప్రేమింపబద్ధులమై యున్నాము.”—1 యోహాను 4:11.

10. “సహోదరుల పూర్తి సహవాసం” నుండి మనం ఎలా ప్రయోజనం పొందగలము?

10 మీరు రాజ్యమందిరంలోని కూటాలకు హజరు కావడం ప్రేమ చూపించడానికి మీకు చక్కని అవకాశాన్ని ఇస్తుంది. అక్కడ మీరు వివిధ రకాలైన ప్రజలను కలుస్తారు. నిస్సందేహంగా మీరు వెంటనే అనేకుల వైపు ఆకర్షించబడినట్లుగా భావిస్తారు. నిజమే, యెహోవాను సేవించేవారిలో కూడా వ్యక్తివ్యక్తికి మధ్య తేడాలు ఉంటాయి. బహుశా గతంలో, కేవలం మీ ఆసక్తులను లేక లక్షణాలను పంచుకోని వారిని మీరు నివారించి ఉండవచ్చు. అయితే, క్రైస్తవులు “సహోదరుల పూర్తి సహవాసాన్ని ప్రేమించాలి.” (1 పేతురు 2:17, NW) వయస్సు, వ్యక్తిత్వం, జాతి, లేక విద్యాస్థాయి వంటివాటిలో మీనుండి భిన్నంగా ఉండే వ్యక్తులతో సహా, రాజ్య మందిరం వద్దనున్న వారందరితో పరిచయం ఏర్పరచుకోవడాన్ని మీ లక్ష్యంగా చేసుకోండి. ప్రతి ఒక్కరు ఏదో ఒక ప్రీతిపాత్రమైన గుణాన్ని కలిగివున్నట్లు మీరు కనుగొంటారు.

11. యెహోవా ప్రజల మధ్యనున్న విభిన్న వ్యక్తిత్వాలను బట్టి మీరెందుకు కలత చెందకూడదు?

11 సంఘంలో ఉన్న భిన్నవ్యక్తిత్వాలు మీ శాంతిని భంగపర్చనవసరం లేదు. ఉదాహరణకు, మీతోపాటు రోడ్డు మీద వాహనాలనేకం ప్రయాణిస్తున్నట్లుగా ఊహించండి. అందరూ ఒకే వేగంతో వెళ్లరు, లేక అందరూ ఒకే స్థితిలో ఉండరు. కొందరు ఎన్నో మైళ్లు ప్రయాణించారు, కాని కొందరు మీలా ఇప్పుడే ప్రయాణం మొదలుపెట్టారు. అయితే, ఈ భేదాలు ఉన్నప్పటికీ, అందరూ అదే రోడ్డుపై ప్రయాణిస్తున్నారు. ఒక సంఘంలో ఉన్న వ్యక్తుల విషయం కూడా అలాగే ఉంటుంది. అందరూ ఒకే వేగంతో క్రైస్తవ లక్షణాలను పెంపొందించుకోలేరు. అంతేగాక, అందరూ ఒకే శారీరక లేక మానసిక స్థితిలో ఉండరు. కొందరు యెహోవాను అనేక సంవత్సరాలుగా ఆరాధిస్తున్నారు; ఇతరులు ఇప్పుడే ప్రారంభించారు. అయినప్పటికీ, అందరూ “యేక మనస్సుతోను ఏకతాత్పర్యముతోను” నిత్యజీవానికి నడిపే మార్గంలోనే ప్రయాణిస్తున్నారు. (1 కొరింథీయులు 1:10) గనుక, సంఘంలోనున్న వారి బలహీనతల కంటే, ఉన్నతమైన లక్షణాలను చూడండి. అలా చేయడం, దేవుడు నిజంగా ఈ ప్రజల మధ్య ఉన్నాడని మీరు గ్రహించేలా చేస్తుంది గనుక మీ హృదయాన్ని ఉత్తేజపరుస్తుంది. మీరు ఉండాలని కోరుకునేది నిశ్చయంగా ఇక్కడే.—1 కొరింథీయులు 14:25.

12, 13. (ఎ) సంఘంలో ఎవరైనా మీకు అభ్యంతరం కలుగజేస్తే, మీరేమి చేయవచ్చు? (బి) విరోధాన్ని మనస్సునందుంచుకోక పోవడం ఎందుకు ప్రాముఖ్యము?

12 మానవులందరూ అపరిపూర్ణులే గనుక, కొన్నిసార్లు సంఘంలోని ఎవరైనా మిమ్మల్ని కలతపర్చే మాట అనడం గాని లేక ఏదైనా చేయడం గాని జరుగవచ్చు. (రోమీయులు 3:23) శిష్యుడైన యాకోబు వాస్తవికంగానే ఇలా వ్రాశాడు: “అనేకవిషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము. ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపములేనివాడై” యుండును. (యాకోబు 3:2) ఎవరైనా మీకు కోపం రప్పిస్తే మీరెలా ప్రతిస్పందిస్తారు? ఒక బైబిలు సామెత ఇలా చెబుతుంది: “ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును.” (సామెతలు 19:11) సుబుద్ధి కలిగివుండడమంటే ఒక పరిస్థితి యొక్క లోతును చూడడం, ఒక వ్యక్తి ఫలానా విధంగా మాట్లాడేలా లేక ప్రవర్తించేలా చేసే ముఖ్య కారణాలను అర్థం చేసుకోవడం. మనలో అనేకులం మన స్వంత తప్పులను క్షమించుకోవడంలో ఎంతో సుబుద్ధిని ఉపయోగిస్తాము. ఇతరుల అపరిపూర్ణతలను అర్థం చేసుకోవడానికి, వాటిని కప్పడానికి దాన్ని ఎందుకు ఉపయోగించకూడదు?—మత్తయి 7:1-5; కొలొస్సయులు 3:13.

13 మనం యెహోవా క్షమాపణను పొందాలంటే మనం ఇతరులను క్షమించాలని ఎన్నడూ మరచిపోకండి. (మత్తయి 6:9, 12, 14, 15) మనమా సత్యాన్ని ఆచరిస్తున్నట్లయితే, మనం ఇతరులతో ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తాము. (1 యోహాను 1:6, 7; 3:14-16; 4:20, 21) కాబట్టి, మీరు సంఘంలోని ఒక వ్యక్తితో ఏదైనా సమస్యను ఎదుర్కొంటే, విరోధము పెరగకుండా ఉండేందుకు పోరాడండి. మీరు ప్రేమను ధరించుకొంటే, సమస్యను పరిష్కరించడానికి మీరు ప్రయత్నిస్తారు, ఒకవేళ మీరు తప్పుచేసి ఉంటే క్షమాపణ చెప్పడానికి మీరు వెనుకాడరు.—మత్తయి 5:23, 24; 18:15-17.

14. మనం ఏ లక్షణాలను ధరించుకోవాలి?

14 మన ఆత్మీయ వస్త్రధారణలో, ప్రేమతో సన్నిహిత సంబంధం గల ఇతర లక్షణాలు కూడా చేరి ఉండాలి. పౌలు ఇలా వ్రాశాడు: “మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి.” ప్రేమచే కప్పబడిన ఈ లక్షణాలు, దైవికమైన “నవీన స్వభావము”లో ఒక భాగం. (కొలొస్సయులు 3:10, 12) మీరు ఈ విధమైన వస్త్రధారణకు కృషి చేస్తారా? ప్రాముఖ్యంగా మీరు సహోదర ప్రేమను ధరిస్తే, మీకు యేసు శిష్యులను సూచించే గుర్తింపు చిహ్నం ఉన్నట్లే, ఎందుకంటే ఆయనిలా చెప్పాడు: ‘మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు.’—యోహాను 13:35.

ఒక భద్రత గల స్థలం

15. సంఘం ఎలా ఒక వసతి వంటిది?

15 సంఘం మీరు సురక్షితంగా ఉన్నట్లు భావించగలిగేలాంటి రక్షణకరమైన ఆశ్రయమగు వసతిగా కూడా పనిచేస్తుంది. దేవుని దృష్టిలో సరైనది చేయడానికి ప్రయాసపడుతున్న యథార్థ హృదయంగల ప్రజలను మీరు దానిలో కనుగొంటారు. మీరు అధిగమించాలని పోరాడుతున్న చెడు అలవాట్లను దృక్పథాలను వారిలో అనేకులు నిర్మూలించారు. (తీతు 3:3) వారు మీకు సహాయం చేయగలరు, ఎందుకంటే మనకిలా చెప్పబడింది: ‘ఒకని భారముల నొకడు భరించుడి.’ (గలతీయులు 6:2) సహజంగా, నిత్యజీవానికి నడిపించే విధానాన్ని చేపట్టడం చివరికి మీ స్వంత బాధ్యతే. (గలతీయులు 6:5; ఫిలిప్పీయులు 2:12) అయినా, యెహోవా క్రైస్తవ సంఘాన్ని సహాయం మరియు మద్దతు విషయంలో ఒక అద్భుతమైన మార్గంగా అందజేశాడు. మీ సమస్యలు ఎంత వేదన కలిగించేవిగా ఉన్నప్పటికీ, మీకు ఒక విలువైన మూలం అందుబాటులో ఉంది, అది బాధ లేక వంచన సమయాల్లో మీ ప్రక్కన నిలబడడానికి ఉన్న ప్రేమగల సంఘమే.—లూకా 10:29-37; అపొస్తలుల కార్యములు 20:35 పోల్చండి.

16. సంఘ పెద్దలు ఏ సహాయన్ని అందజేస్తారు?

16 మీకు మద్దతునిచ్చేందుకు ముందుకు వచ్చేవారిలో ‘మనుష్యులలో ఈవులు’ ఎవరంటే మందను ఇష్టపూర్వకంగా, ఆసక్తితో కాచే నియమిత సంఘ పెద్దలు లేక అధ్యక్షులే. (ఎఫెసీయులు 4:8, 11, 12; అపొస్తలుల కార్యములు 20:28; 1 పేతురు 5:2, 3) వారి గురించి యెషయా ఇలా ప్రవచించాడు: “మనుష్యుడు గాలికి మరుగైనచోటువలెను, గాలివానకు చాటైన చోటువలెను ఉండును ఎండినచోట నీళ్లకాలువలవలెను అలసట పుట్టించు దేశమున గొప్పబండ నీడవలెను ఉండును.”—యెషయా 32:2.

17. (ఎ) యేసు ప్రాముఖ్యంగా ఏ విధమైన సహాయాన్ని ఇవ్వాలని ఇష్టపడ్డాడు? (బి) దేవుడు తన ప్రజల కొరకు ఏ ఏర్పాటును చేస్తానని వాగ్దానం చేశాడు?

17 యేసు భూమిపై ఉన్నప్పుడు, మత నాయకుల ప్రేమపూర్వకమైన పర్యవేక్షణ కొరవడటం దుఃఖకరం. ప్రజల పరిస్థితి ఆయనను తీవ్రంగా కదలించింది, వారికి ప్రాముఖ్యంగా ఆత్మీయ సహాయాన్నివ్వాలని ఆయన ఇష్టపడ్డాడు. “వారు కాపరిలేని గొఱ్ఱెలవలె విసికి చెదరి” ఉన్నందున యేసు వారిపై జాలిపడ్డాడు. (మత్తయి 9:36) ఆత్మీయ సహాయం మరియు ఓదార్పునిచ్చే వారెవరూలేక, వేదనతో కూడిన సమస్యలను సహిస్తున్న అనేకుల ప్రస్తుతదిన స్థితిని ఇది ఎంత చక్కగా వర్ణిస్తుందోకదా! కాని యెహోవా ప్రజలకు ఆత్మీయ సహాయం ఉంది, ఎందుకంటే ఆయనిలా వాగ్దానం చేశాడు: “నేను వాటిమీద కాపరులను నియమించెదను; ఇకమీదట అవి భయపడకుండను బెదరిపోకుండను వాటిలో ఒకటైనను తప్పిపోకుండను వీరు నా గొఱ్ఱెలను మేపెదరు.”—యిర్మీయా 23:4.

18. మనకు ఆత్మీయ సహాయం అవసరమైతే మనం ఒక పెద్దను ఎందుకు సమీపించాలి?

18 సంఘంలోని నియమిత పెద్దలతో పరిచయం ఏర్పరచుకోండి. బైబిలునందు, అధ్యక్షులకుండాలని తెలుపబడిన అర్హతలకు వారు తగినట్లు ఉన్నారు గనుక దేవుని గూర్చిన జ్ఞానాన్ని అన్వయించుకోవడంలో వారికి ఎంతో అనుభవం ఉంది. (1 తిమోతి 3:1-7; తీతు 1:5-9) దేవుడు కోరే అర్హతలకు వ్యతిరేకమైన అలవాటును లేక లక్షణాన్ని అధిగమించడానికి మీకు ఆత్మీయ సహాయం అవసరమైతే, వారిలో ఒకరిని సమీపించేందుకు వెనుకాడకండి. పెద్దలు పౌలు యొక్క ఈ సలహాను అనుసరిస్తారని మీరు కనుగొంటారు: “ధైర్యము చెడినవారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊత నియ్యుడి, అందరియెడల దీర్ఘశాంతముగలవారై యుండుడి.”—1 థెస్సలొనీకయులు 2:7, 8; 5:14.

యెహోవా ప్రజలతో భద్రతను అనుభవించండి

19. తన సంస్థలో భద్రతను వెదికే వారిపై యెహోవా ఏ ఆశీర్వాదాలను కుమ్మరించాడు?

19 మనం ఇప్పుడు అపరిపూర్ణ పరిస్థితులలో జీవిస్తున్నప్పటికీ, యెహోవా మనకు ఆత్మీయాహారాన్ని వస్త్రాలను వసతిని అందజేస్తున్నాడు. అయితే, మనం భౌతిక పరదైసు యొక్క ప్రయోజనాలను పొందాలంటే, దేవుడు వాగ్దానం చేసిన నూతన లోకం కొరకు ఎదురుచూడవలసిందే. కాని యెహోవా సంస్థలో భాగమైనవారు ప్రస్తుతం ఆత్మీయ పరదైసు యొక్క భద్రతను అనుభవిస్తున్నారు. వారి గురించి యెహెజ్కేలు ఇలా ప్రవచించాడు: “ఎవరివలనను భయము లేకుండ వారు సురక్షితముగా నివసించెదరు.”—యెహెజ్కేలు 34:28; కీర్తన 4:8.

20. యెహోవా ఆరాధన కొరకు మనం త్యాగం చేసే దేనినైనా ఆయన ఎలా తిరిగి ఇస్తాడు?

20 యెహోవా తన వాక్యం ద్వారా మరియు తన సంస్థ ద్వారా ప్రేమపూర్వకమైన ఆత్మీయ ఏర్పాట్లను చేస్తున్నాడని మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండవచ్చు! దేవుని ప్రజలకు సన్నిహితమవ్వండి. మీరు దేవుని గూర్చిన జ్ఞానాన్ని పొందుతుంటే స్నేహితులు లేక బంధువులు మీ గురించి ఏమనుకుంటారో అని అలా చేయడాన్ని మానివేయకండి. మీరు యెహోవాసాక్షులతో సహవసిస్తున్నారని, రాజ్యమందిరం వద్ద కూటాలకు హాజరౌతున్నారని కొందరు తృణీకరించవచ్చు. కాని తన ఆరాధన కొరకు మీరు ఏది త్యాగం చేసినా దేవుడు అంతకంటే ఎక్కువే మీకు ఉదారంగా ఇస్తాడు. (మలాకీ 3:10) అంతేగాక, యేసు ఇలా చెప్పాడు: ‘నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదములనైనను అక్కచెల్లెండ్రనైనను తలిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతోపాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను, రాబోవు లోకమందు నిత్యజీవమును పొందును.’ (మార్కు 10:29, 30) అవును, మీరు ఏది విడిచిపెట్టవలసి వచ్చినప్పటికీ లేక సహించవలసి వచ్చినప్పటికీ, మీరు దేవుని ప్రజల మధ్య ఆనందకరమైన సాహచర్యాన్ని, ఆత్మీయ భద్రతను పొందగలరు.

మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి

“నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” ఎవరు?

మనల్ని ఆత్మీయంగా పోషించేందుకు యెహోవా ఏ ఏర్పాటు చేశాడు?

క్రైస్తవ సంఘంలో ఉన్నవారు మనకు ఎలా సహాయం చేయగలరు?

[అధ్యయన ప్రశ్నలు]

[165వ పేజీలో పూర్తి-పేజీ చిత్రం ఉంది]