కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దైవభక్తిగల జీవితాన్ని గడపడం ఎందుకు సంతోషాన్ని తెస్తుంది

దైవభక్తిగల జీవితాన్ని గడపడం ఎందుకు సంతోషాన్ని తెస్తుంది

అధ్యాయము 13

దైవభక్తిగల జీవితాన్ని గడపడం ఎందుకు సంతోషాన్ని తెస్తుంది

1. యెహోవా మార్గం సంతోషాన్ని తెస్తుందని మనం ఎందుకు చెప్పవచ్చు?

యెహోవా “సంతోషంగల దేవుడు,” మీరు జీవితాన్ని ఆనందించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. (1 తిమోతి 1:11, NW) ఆయన మార్గంలో నడవడం ద్వారా, మీకై మీరు ప్రయోజనం చేకూర్చుకోగలరు, నిరంతరం ప్రవహించే నదిలాంటి లోతైన నిత్య శాంతిని పొందగలరు. దేవుని మార్గంలో నడవడం, “సముద్రతరంగములవలె” తదేకంగా నీతియుక్తమైన క్రియలు చేసేందుకు కూడా ఒకరిని పురికొల్పుతుంది. ఇది నిజమైన సంతోషాన్ని కలుగజేస్తుంది.—యెషయా 48:17, 18.

2. క్రైస్తవులు కొన్నిసార్లు సరైన విధంగా చూడబడక పోయినప్పటికీ, వారు ఎలా సంతోషంగా ఉండగలరు?

2 ‘సరైనది చేసినందుకు ప్రజలు కొన్నిసార్లు బాధపడతారు’ అని కొంతమంది అభ్యంతరం చెప్పవచ్చు. నిజమే, యేసు అపొస్తలులకు అదే జరిగింది. అయితే, హింసింపబడినప్పటికీ వాళ్లు ఆనందించి, ‘క్రీస్తును గూర్చిన సువార్తను ప్రకటించడంలో’ కొనసాగారు. (అపొస్తలుల కార్యములు 5:40-42) దీని నుండి మనం ప్రాముఖ్యమైన పాఠాలను నేర్చుకోవచ్చు. ఒక విషయమేమిటంటే, మనం దైవభక్తిగల జీవితాన్ని గడపడం, మనమెల్లప్పుడు మంచిగా చూడబడతామనే దానికి ఏ హామీ ఇవ్వదు. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదుక నుద్దేశించువారందరు హింసపొందుదురు.” (2 తిమోతి 3:12) దీనికి కారణమేమిటంటే, దైవభక్తిగల మార్గంలో జీవించేవారు సాతానుకు, అతని లోకానికి వ్యతిరేకులు. (యోహాను 15:18, 19; 1 పేతురు 5:8) కాని నిజమైన ఆనందం బాహ్య విషయాలపై ఆధారపడి ఉండదు. బదులుగా అది, మనం సరైనది చేస్తున్నాము గనుక మనకు దేవుని అంగీకారం లభిస్తుందనే నమ్మకం నుండి వస్తుంది.—మత్తయి 5:10-12; యాకోబు 1:2, 3; 1 పేతురు 4:13, 14.

3. యెహోవాను ఆరాధించడం ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా ప్రభావితం చేయాలి?

3 అప్పుడప్పుడు దైవభక్తి గల క్రియలు చేయడం ద్వారా దేవుని అంగీకారాన్ని పొందవచ్చని, కాని ఇతర సమయాల్లో ఆయన గురించి మరచిపోవచ్చని భావించే ప్రజలు ఉన్నారు. యెహోవా దేవున్ని నిజంగా ఆరాధించడం అటువంటిది కాదు. ఒక వ్యక్తి మేలుకొని ఉన్న అన్ని గంటలలోను, దినదినానికి, ప్రతి సంవత్సరం అతని ప్రవర్తనపై ప్రభావం చూపుతుంది. అందుకే అది “మార్గము” అని కూడా పిలువబడింది. (అపొస్తలుల కార్యములు 19:9; యెషయా 30:21) మనం దేవుని వాక్యానికి అనుగుణంగా ప్రవర్తించడం మరియు మాట్లాడడం అవసరమైన దైవభక్తితో కూడిన మార్గం.

4. దేవుని మార్గాల ప్రకారం జీవించడానికి మార్పులు చేసుకోవడం ఎందుకు ప్రయోజనకరమైనది?

4 యెహోవాను ప్రీతిపర్చేందుకు కొన్ని మార్పులు చేసుకోవలసిన అవసరం ఉందని బైబిలును క్రొత్తగా పఠిస్తున్న విద్యార్థులు తెలుసుకున్నప్పుడు, ‘దైవభక్తిగల జీవితాన్ని గడపడం నిజంగా యోగ్యమైనదేనా?’ అని వారు ఆలోచించవచ్చు. అది యోగ్యమైనదే అని మీరు నిశ్చయత కలిగివుండవచ్చు. ఎందుకు? ఎందుకంటే “దేవుడు ప్రేమాస్వరూపి,” గనుక ఆయన మార్గాలు మన ప్రయోజనం కొరకు రూపొందించబడ్డాయి. (1 యోహాను 4:8) దేవుడు జ్ఞానంగలవాడు కూడా, మనకు శ్రేష్ఠమైనది ఏదో ఆయనకు తెలుసు. యెహోవా దేవుడు సర్వశక్తిగలవాడు గనుక, ఒక చెడు అలవాటును మానుకోవడం ద్వారా ఆయన అనుగ్రహాన్ని పొందాలనే మన కోరిక నెరవేర్చబడేలా ఆయన మనల్ని బలపర్చగలడు. (ఫిలిప్పీయులు 4:13) దైవభక్తిగల జీవితాన్ని గడపడంలో చేరివున్న కొన్ని సూత్రాలను మనం పరిశీలించి, వాటిని అన్వయించుకోవడం వల్ల ఆనందమెలా కల్గుతుందో చూద్దాము.

నిజాయితీ సంతోషాన్ని తెస్తుంది

5. అబద్ధమాడడం గురించి మరియు దొంగతనం చేయడం గురించి బైబిలు ఏమి చెబుతుంది?

5 యెహోవా ‘సత్యదేవుడు.’ (కీర్తన 31:5) నిస్సందేహంగా, మీరు ఆయన మాదిరిని అనుకరించి, సత్యవంతుడైన వ్యక్తిగా గుర్తింపబడాలని కోరుకుంటారు. నిజాయితీ ఆత్మ గౌరవానికి, మంచిగా ఉన్నాననే భావనకు నడిపిస్తుంది. అయితే ఈ పాపభరితమైన లోకంలో వంచన సర్వసాధారణమైయుంది గనుక, క్రైస్తవులకు ఈ జ్ఞాపిక అవసరం: “ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను. . . . దొంగిలువాడు ఇకమీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలుకలుగు నిమిత్తము . . . కష్టపడవలెను.” (ఎఫెసీయులు 4:25, 28) క్రైస్తవ ఉద్యోగస్థులు మెచ్చుకొనదగినట్లుగా పని చేస్తారు. తమ యజమాని అనుమతి ఇవ్వనిదే, ఆయనకు చెందిన వస్తువులను తీసుకోరు. ఉద్యోగ స్థలంలోనైనా, పాఠశాలలోనైనా, లేక ఇంటివద్దనైనా యెహోవా ఆరాధికుడు ‘అన్ని విషయములలో నిజాయితీగా’ ఉండాలి. (హెబ్రీయులు 13:18) అబద్ధం చెప్పడం లేక దొంగతనం చేయడం వంటివాటికి అలవాటుపడిన వారెవరైనా దేవుని అనుగ్రహాన్ని పొందలేరు.—ద్వితీయోపదేశకాండము 5:19; ప్రకటన 21:8.

6. దైవభక్తిగల వ్యక్తి యొక్క నిజాయితీ యెహోవాకు మహిమను ఎలా తేగలదు?

6 నిజాయితీగా ఉండడం అనేక ఆశీర్వాదాలను తెస్తుంది. ఆఫ్రికా దేశస్థురాలు, అవసరతలోవున్న విధవరాలైన సలీన యెహోవా దేవున్ని ఆయన నీతియుక్తమైన సూత్రాలను ప్రేమిస్తుంది. ఒకరోజు ఆమెకు ఒక బ్యాంకు పుస్తకము, పెద్ద మొత్తంలో డబ్బు ఉన్న సంచి దొరికింది. టెలిఫోను డైరెక్టరీని ఉపయోగించి, ఆమె ఆ సంచి సొంతదారున్ని తెలుసుకోగలిగింది—అతడు దోపిడీకి గురైన దుకాణాదారుడు. ఎంతో జబ్చుతో ఉన్నప్పటికీ సలీన అతని వద్దకు వెళ్లి వస్తువులన్నిటితో సహా సంచిని అతనికి అప్పగించినప్పుడు ఆ వ్యక్తి తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. “అలాంటి నిజాయితీ ప్రతిఫలం పొందదగినది” అని చెప్పి, అతడు ఆమెకు కొంత డబ్బు ముట్టజెప్పాడు. అంతకంటే ప్రాముఖ్యంగా ఆ వ్యక్తి సలీన మతాన్ని కొనియాడాడు. అవును, నిజాయితీ కార్యాలు బైబిలు బోధను అలంకరిస్తాయి, యెహోవా దేవున్ని మహిమపరుస్తాయి, నిజాయితీపరులైన ఆయన ఆరాధికులకు సంతోషాన్ని తెస్తాయి.—తీతు 2:10; 1 పేతురు 2:12.

ఉదారత సంతోషాన్ని తెస్తుంది

7. జూదమాడడంలో ఉన్న తప్పేమిటి?

7 ఉదారంగా ఉండడంలో సంతోషం ఉంది, అయితే దురాశపరులు “దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.” (1 కొరింథీయులు 6:10) అత్యాశ యొక్క ఒక సాధారణ రూపం జూదం, అది ఇతరుల నష్టాల ద్వారా లాభం పొందాలని ప్రయత్నించడమే. “దుర్లాభమునపేక్షించు” వారిని యెహోవా అంగీకరించడు. (1 తిమోతి 3:8) జూదం చట్టబద్ధమైన స్థలంలో సహితం ఒక వ్యక్తి కేవలం ఆనందం కొరకు జూదమాడినప్పటికీ, అతడు దానికి బానిస కాగలడు, అనేకుల జీవితాలను నాశనం చేసిన అభ్యాసాన్ని పురికొల్పిన వాడౌతాడు. జూదం, జూదమాడే వ్యక్తి కుటుంబానికి తరచూ కష్టాలను తెస్తుంది, ఆ కుటుంబ సభ్యులకు అన్నవస్త్రాల వంటి అవసరతల కొరకు తగినంత డబ్బు లేకుండా పోవచ్చు.—1 తిమోతి 6:10.

8. ఉదారత విషయంలో యేసు ఎలా మంచి మాదిరిని ఉంచాడు, మనమెలా ఉదారత కలిగివుండగలము?

8 క్రైస్తవులు తమ ప్రేమపూర్వకమైన ఉదారతను బట్టి, ఇతరులకు ప్రాముఖ్యంగా అవసరతలో ఉన్న తోటి విశ్వాసులకు సహాయం చేయడంలో ఆనందాన్ని పొందుతారు. (యాకోబు 2:15, 16) యేసు భూమిపైకి రాకమునుపు, మానవజాతి ఎడల దేవుని ఉదారతను ఆయన గమనించాడు. (అపొస్తలుల కార్యములు 14:16, 17) యేసు తానే తన సమయాన్ని, సామర్థ్యాలను, చివరికి తన జీవితాన్ని మానవజాతి కొరకు అర్పించాడు. గనుక, ఆయనిలా చెప్పడానికి సరైన అర్హత కలిగివున్నాడు: “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము.” (అపొస్తలుల కార్యములు 20:35) ఆలయ ఖజానాలో రెండు చిన్న నాణెములను ఉదారంగా వేసిన బీద విధవరాలు ‘తన జీవనమంతా’ వేసిందని యేసు ఆమె గురించి కూడా మెచ్చుకోలుగా మాట్లాడాడు. (మార్కు 12:41-44) ప్రాచీన ఇశ్రాయేలీయులు మరియు మొదటి శతాబ్దపు క్రైస్తవులు సంఘానికి, రాజ్య పని కొరకు వస్తుదాయక మద్దతునివ్వడంలో ఆనందంతో కూడిన ఉదారతకు మాదిరులను అందిస్తున్నారు. (1 దినవృత్తాంతములు 29:9; 2 కొరింథీయులు 9:11-14) ఈ లక్ష్యాల కొరకు వస్తుదాయక విరాళాలను ఇవ్వడమేగాక, ప్రస్తుతదిన క్రైస్తవులు సంతోషంగా దేవునికి స్తుతి చెల్లించి, తమ జీవితాలను ఆయన సేవలో ఉపయోగిస్తున్నారు. (రోమీయులు 12:1; హెబ్రీయులు 13:15) సత్యారాధనకు మద్దతునిచ్చేందుకు మరియు ప్రపంచ వ్యాప్తంగా రాజ్య సువార్తను ప్రకటించే పనిని విస్తృతపర్చేందుకు వారు తమ సమయాన్ని, శక్తిని, తమ సంపదలతో సహా ఇతర వనరులను ఉపయోగిస్తున్నందుకు యెహోవా వారిని ఆశీర్వదిస్తున్నాడు.—సామెతలు 3:9, 10.

సంతోషాన్ని వృద్ధిచేసే ఇతర కారకాలు

9. మత్తుపానీయాలను అధికంగా సేవించడంలో ఉన్న తప్పేమిటి?

9 సంతోషంగా ఉండేందుకు, క్రైస్తవులు తమ ‘ఆలోచనా సామర్థ్యాలను కూడా కాపాడుకోవాలి.’ (సామెతలు 5:1, 2) దీని కొరకు వారు దేవుని వాక్యాన్ని, మంచి బైబిలు సాహిత్యాలను చదివి ధ్యానించడం అవసరం. అయితే విసర్జించవలసిన విషయాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, మత్తు పానీయాలను అధికంగా సేవించడం ఒక వ్యక్తి తన ఆలోచనా విధానంపై అదుపును కోల్పోయేలా చేయగలదు. అలాంటి స్థితిలో, అనేకమంది ప్రజలు అవినీతికరమైన ప్రవర్తన, దురుసుగా ప్రవర్తించడం, మరణకరమైన దుర్ఘటనలను కలిగించడం వంటివాటిలో చేరతారు. త్రాగుబోతులు దేవుని రాజ్యంలో ప్రవేశించరని బైబిలు చెప్పడంలో ఆశ్చర్యం లేదు! (1 కొరింథీయులు 6:10) “స్వస్థబుద్ధిగల” వారై ఉండేందుకు తీర్మానించుకొన్నవారై నిజక్రైస్తవులు త్రాగుబోతుతనాన్ని విడిచిపెడతారు, ఇది వారి మధ్య సంతోషాన్ని వృద్ధి చేసేందుకు సహాయపడుతుంది.—తీతు 2:2-6.

10. (ఎ) క్రైస్తవులు పొగాకును ఎందుకు ఉపయోగించరు? (బి) వ్యసనకరమైన అలవాట్లను మానుకోవడంవల్ల ఏ ప్రయోజనాలు కలుగుతాయి?

10 పరిశుభ్రమైన శరీరం సంతోషానికి దోహదపడుతుంది. అయినప్పటికీ, అనేకులు హానికరమైన పదార్థాలకు బానిసలౌతారు. ఉదాహరణకు, పొగాకు ఉపయోగాన్ని పరిశీలించండి. ధూమపానం “ప్రతి సంవత్సరం మూడు కోట్ల మంది ప్రజలను చంపుతోందని” ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిస్తోంది. పొగాకు మానివేయడం వల్ల ఏర్పడే తాత్కాలిక ప్రభావాలను బట్టి పొగాకు అలవాటును మానడం కష్టమే కావచ్చు. మరో వైపు, మునుపు పొగత్రాగేవారు అనేకులు తాము ఇప్పుడు మంచి ఆరోగ్యాన్ని కలిగివున్నట్లు, కుటుంబ అవసరతల కొరకు ఎక్కువ డబ్బు కలిగివున్నట్లు కనుగొన్నారు. అవును, పొగాకు అలవాటును లేక ఇతర హానికరమైన పదార్థాలకు బానిసలవ్వడాన్ని అధిగమించడం పరిశుభ్రమైన శరీరం, నిర్మలమైన మనస్సాక్షి, నిజమైన సంతోషాలకు దోహదపడగలదు.—2 కొరింథీయులు 7:1.

వివాహంలో సంతోషం

11. చట్టబద్ధమైన, నిరంతరం నిలిచే ఘనమైన వివాహం కొరకు ఏమి అవసరము?

11 భార్యాభర్తలుగా కలిసి జీవిస్తున్న వారు తమ వివాహం చట్ట ప్రకారం సరైన విధంగా నమోదు చేయబడినదై ఉండేలా నిశ్చయపర్చుకోవాలి. (మార్కు 12:17) వారు వివాహ బంధాన్ని గంభీరమైన బాధ్యతగా భావించడం కూడా అవసరం. నిజమే, ఇష్టపూర్వకంగా మద్దతునివ్వకపోవడం, బహుగా తిట్టుకోవడం, కొట్టుకోవడం లేక ఆత్మీయత పూర్తిగా ప్రమాదంలో ఉండడం వంటి సందర్భాలలో విడిపోవడం అవసరం కావచ్చు. (1 తిమోతి 5:8; గలతీయులు 5:19-21) కాని 1 కొరింథీయులు 7:10-17 నందలి అపొస్తలుడైన పౌలు మాటలు కలిసివుండాలని వివాహ జంటలను ప్రోత్సహిస్తున్నాయి. అయితే, నిజమైన సంతోషం కొరకు వారు ఒకరి ఎడల ఒకరు విశ్వాసంగా ఉండాలి. పౌలు ఇలా వ్రాశాడు: “వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను; వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.” (హెబ్రీయులు 13:4) “పానుపు” అనే పదం చట్టబద్ధంగా ఒకరికొకరు వివాహమైన స్త్రీ పురుషుల మధ్య ఉండే లైంగిక సంబంధాన్ని సూచిస్తుంది. ఒకరి కంటే ఎక్కువమంది భార్యలను వివాహం చేసుకోవడంలాంటి ఏ ఇతర లైంగిక సంబంధం “అన్ని విషయములలో ఘనమైనదిగా” వర్ణించబడనేరదు. అంతేకాదు, వివాహానికి ముందు ఉండే లైంగిక సంబంధాన్ని మరియు సలింగ సంయోగాన్ని బైబిలు ఖండిస్తుంది.—రోమీయులు 1:26, 27; 1 కొరింథీయులు 6:18.

12. వ్యభిచారం యొక్క కొన్ని చెడు ఫలాలు ఏవి?

12 వ్యభిచారం కొద్ది క్షణాల శారీరక ఆనందాన్ని తీసుకురావచ్చు, కాని అది నిజమైన సంతోషాన్ని ఇవ్వదు. అది దేవునికి అప్రీతికరమైనది, ఒక వ్యక్తి మనస్సాక్షిని గాయపర్చగలదు. (1 థెస్సలొనీకయులు 4:3-5) చట్టవిరుద్ధమైన లైంగిక సంబంధం యొక్క బాధాకరమైన పరిణామాలు ఎయిడ్స్‌ మరియు ఇతర సుఖ వ్యాధులు కావచ్చు. “ప్రపంచ వ్యాప్తంగా సంవత్సరానికి 25 కోట్ల కంటే ఎక్కువమంది గనేరియా మరియు దాదాపు 5 కోట్ల మంది సిఫిలిస్‌ రోగాలకు గురౌతున్నారని అంచనా వేయబడిందని” ఒక వైద్య నివేదిక తెలియజేస్తుంది. కోరని గర్భధారణల సమస్య కూడా ఉంది. ప్రపంచమంతటిలో, ప్రతి సంవత్సరం 15 నుండి 19 సంవత్సరాల వయస్సుగల ఒక కోటి యాభై లక్షలకంటే ఎక్కువమంది అమ్మాయిలు గర్భవతులౌతున్నారు, వారిలో మూడొంతుల మంది గర్భస్రావం చేయించుకుంటున్నారని ఇంటర్నేషనల్‌ ప్లాన్డ్‌ పేరెంట్‌హుడ్‌ ఫెడరేషన్‌ నివేదిస్తోంది. ఒక ఆఫ్రికా దేశంలో, యువతుల మరణాల్లో 72 శాతం గర్భస్రావ సమస్యల ఫలితమేనని ఒక అధ్యయనం చూపించింది. కొంతమంది వ్యభిచారులు వ్యాధిని, గర్భధారణను తప్పించుకోవచ్చు కాని మానసిక వ్యధను తప్పించుకోలేరు. అనేకులు తమ ఆత్మగౌరవాన్ని కోల్పోయి తమను తాము ద్వేషించుకుంటారు కూడా.

13. జారత్వం మూలంగా ఏ అదనపు సమస్యలు కలుగుతాయి, వ్యభిచారులుగా, జారులుగా కొనసాగే వారికి ఏమి జరుగనైయుంది?

13 జారత్వం క్షమించబడేదే అయినప్పటికీ, విడాకులు తీసుకొనేందుకు నిర్దోషియైన వివాహజతకు అదే సరియైన లేఖనాధారం. (మత్తయి 5:32; హోషేయ 3:1-5 పోల్చండి.) అలాంటి అవినీతి మూలంగా వివాహం విచ్ఛినమైతే, నిర్దోషియైన జతపై మరియు పిల్లలపై ఇది లోతైన మానసిక ముద్రలను మిగల్చవచ్చు. మానవ కుటుంబ మేలు నిమిత్తం, పశ్చాత్తాపపడని వ్యభిచారులకు మరియు జారులకు దేవుని ప్రతికూలమైన తీర్పు వస్తుందని ఆయన వాక్యం తెలియజేస్తుంది. అంతేగాక, లైంగిక అవినీతిని అభ్యసించేవారు “దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని” అది స్పష్టంగా చూపిస్తుంది.—గలతీయులు 5:19, 21.

“లోకసంబంధులు కారు”

14. (ఎ) దైవభక్తిగల వ్యక్తి నివారించవలసిన కొన్ని విధాలైన విగ్రహారాధనలు ఏవి? (బి) యోహాను 17:14 మరియు యెషయా 2:4 నందు ఏ నడిపింపు అందజేయబడింది?

14 యెహోవాను ప్రీతిపర్చాలని, రాజ్య ఆశీర్వాదాలను ఆనందించాలని కోరుకొనేవారు ఏ విధమైన విగ్రహారాధననైనా విసర్జిస్తారు. క్రీస్తు ప్రతిమను, లేక యేసు తల్లియైన మరియ ప్రతిమలతోసహా, విగ్రహాలను చేసుకోవడం వాటిని ఆరాధించడం తప్పని బైబిలు చూపిస్తుంది. (నిర్గమకాండము 20:4, 5; 1 యోహాను 5:21) గనుక, నిజ క్రైస్తవులు బొమ్మలను సిలువలను విగ్రహాలను పూజించరు. జెండాలను ఆరాధించడం, దేశభక్తి గీతాలను పాడడం వంటి బహు మోసకరమైన విగ్రహారాధనా విధానాలను కూడా వారు విసర్జిస్తారు. అలాంటి క్రియలు చేయుమని ఒత్తిడి చేయబడినప్పుడు, యేసు సాతానుతో చెప్పిన ఈ మాటలను వారు జ్ఞాపకం చేసుకుంటారు: “ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను.” (మత్తయి 4:8-10) తన అనుచరులు “లోకసంబంధులు కారు” అని యేసు చెప్పాడు. (యోహాను 17:14) అంటే దీని భావం రాజకీయ విషయాల్లో తటస్థంగా ఉండడం మరియు యెషయా 2:4 నందు చెప్పబడిన దీనికి అనుగుణంగా శాంతితో జీవించడం: “ఆయన [యెహోవా దేవుడు] మధ్యవర్తియై అన్యజనులకు న్యాయము తీర్చును అనేక జనములకు తీర్పుతీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.”

15. మహాబబులోను అంటే ఏమిటి, క్రొత్తగా బైబిలు పఠించే అనేకమంది విద్యార్థులు దానిలో నుండి బయటికి రావడానికి ఏమి చేస్తారు?

15 “లోకసంబంధులు” కాకుండా ఉండడమంటే, అబద్ధ మత సామ్రాజ్యమైన “మహా బబులోను”తో అన్ని సంబంధాలను తెంచుకోవడమని కూడా భావం. అపరిశుద్ధమైన ఈ ఆరాధన ప్రాచీన బబులోను నుండి బయలుదేరి భూవ్యాప్తంగా ప్రజలపై హానికరమైన ఆత్మీయ ఆధిపత్యాన్ని సాధించేంత వరకు వ్యాపించింది. దేవుని గూర్చిన జ్ఞానంతో పొందిక కల్గిలేని సిద్ధాంతాలు, ఆచారాలు గల మతాలన్నీ “మహా బబులోను”లో చేరివున్నాయి. (ప్రకటన 17:1, 5, 15) యెహోవా యొక్క నమ్మకమైన ఆరాధికులెవ్వరూ వివిధ మతాల ఆరాధనలో భాగం వహించడం ద్వారా లేక మహా బబులోను యొక్క ఏ భాగంతోనైనా ఆత్మీయ సహచర్యం కలిగివుండడం ద్వారా మిశ్రమ విశ్వాసకార్యాలలో ఇమిడివుండరు. (సంఖ్యాకాండము 25:1-9; 2 కొరింథీయులు 6:14) అందుచేత, అనేకమంది క్రొత్తగా బైబిలు పఠిస్తున్న విద్యార్థులు తాము ఏ మత సంస్థకు చెందేవారో దానికి ఒక రాజీనామా లేఖ పంపుతారు. వాగ్దానం చేయబడినట్లుగా, ఇది వారిని నిజమైన దేవునికి మరింత సన్నిహితులను చేసింది: “వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైనదానిని ముట్టకుడని ప్రభువు [“యెహోవా,” NW] చెప్పుచున్నాడు.—మరియు నేను మిమ్మును చేర్చుకొందును.” (2 కొరింథీయులు 6:18; ప్రకటన 18:4, 5) మన పరలోక తండ్రిచే అలా అంగీకరించబడడం మీరు ఎంతో కోరుకునేది కాదా?

వార్షిక ఆచారాలను తూచిచూచుట

16. నిజ క్రైస్తవులు క్రిస్టమస్‌ను ఎందుకు జరుపుకోరు?

16 దైవభక్తిగల జీవితం తరచూ మనల్ని లోకసంబంధమైన సెలవుదినాలను ఆచరించే భారం నుండి స్వతంత్రులను చేస్తుంది. ఉదాహరణకు, యేసు జననాన్ని గూర్చిన కచ్చితమైన దినాన్ని బైబిలు తెలియజేయడంలేదు. ‘యేసు డిశంబరు 25న జన్మించాడని నేను అనుకున్నానే’ అని కొందరు ఆశ్చర్యపోవచ్చు. ఇలా జన్మించడం సాధ్యం కాదు ఎందుకంటే, ఆయన 33 1/2 సంవత్సరాల వయస్సులో అంటే సా.శ. 33 వసంతకాలంలో మరణించాడు. అంతేగాక, ఆయన జనన సమయంలో, గొర్రెల కాపరులు ‘పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండిరి.’ (లూకా 2:8) ఇశ్రాయేలు దేశంలో, డిశంబరు నెలాఖరులో చలిగా ఉండి వర్షాలు కురిసే కాలం, చలికాల వాతావరణం నుండి గొర్రెలను కాపాడడానికి అవి రాత్రిపూట గొర్రెల దొడ్లలో ఉంచబడతాయి. వాస్తవానికి, రోమన్లు డిశంబరు 25ను తమ సూర్య దేవుని జన్మదినంగా కేటాయించుకున్నారు. యేసు భూమిపై ఉన్న కాలానికి శతాబ్దాల తర్వాత, క్రీస్తు జననాన్ని పండుగగా చేసుకోవడానికి మత భ్రష్ట క్రైస్తవులు ఈ తేదీని ఎన్నుకున్నారు. గనుక, నిజ క్రైస్తవులు క్రిస్టమస్‌ను లేక అబద్ధ మత నమ్మకాలపై ఆధారపడిన ఇతర సెలవు దినాలను ఆచరించరు. వారు యెహోవాకు ఏకభక్తిని చూపిస్తారు గనుక, పాపభరితులైన మానవులను లేక దేశాలను పూజించే సెలవుదినాలను వారు ఆచరించరు.

17. దైవభక్తిగల ప్రజలు జన్మదిన వేడుకలను ఎందుకు చేయరు, అయితే కూడా క్రైస్తవ పిల్లలు ఎందుకు సంతోషంగా ఉంటారు?

17 బైబిలు కేవలం రెండు జన్మదిన ఆచరణలను గురించే ప్రాముఖ్యంగా తెలియజేస్తుంది, ఆ రెండింటిలో ఇమిడివున్నవారు దేవున్ని సేవించని వ్యక్తులే. (ఆదికాండము 40:20-22; మత్తయి 14:6-11) పరిపూర్ణ మానవుడైన యేసుక్రీస్తు జన్మదిన తేదీని లేఖనాలు తెలియజేయడం లేదు గనుక, అపరిపూర్ణ మానవుల జన్మదినాలకు మనం ఎందుకు ప్రత్యేక శ్రద్ధనివ్వాలి? (ప్రసంగి 7:1) అయితే, దైవభక్తిగల తలిదండ్రులు తమ పిల్లల ఎడల ప్రేమ చూపించడానికి ఒక ప్రత్యేకమైన దినం కొరకు వేచివుండరు. ఓ 13 సంవత్సరాల బాలిక ఇలా చెబుతోంది: “నేను మా కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటాము. . . . నేను మా తలిదండ్రులకు ఎంతో సన్నిహితంగా ఉంటాను, నేను సెలవుదినాలను ఎందుకు ఆచరించనని ఇతర పిల్లలు అడిగినప్పుడు, నేను ప్రతి దినం పండుగ చేసుకుంటానని వారికి చెబుతాను.” పదహేడు సంవత్సరాల ఒక క్రైస్తవ యువకుడు ఇలా చెబుతున్నాడు: “మా ఇంట్లో, బహుమానాలు ఇవ్వడం సంవత్సరమంతా జరుగుతూనే ఉంటుంది.” బహుమానాలు తరచూ ఇవ్వబడితే గొప్ప సంతోషం కలుగుతుంది.

18. ఆచరించుమని యేసు తన అనుచరులకు ఆజ్ఞాపించిన ఒక వార్షిక ఆచరణ ఏమిటి, అది మనకు దేన్ని గుర్తు చేస్తుంది?

18 దైవభక్తిగల జీవితాన్ని వెంబడించేవారికి, ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా ఆచరించేందుకు ఒక దినం ఉంది. అది తరచూ క్రీస్తు మరణ జ్ఞాపకార్థదినమని పిలువబడే ప్రభువు రాత్రి భోజనం. దానికి సంబంధించి యేసు తన అనుచరులకిలా ఆజ్ఞాపించాడు: ‘నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడి.’ (లూకా 22:19, 20; 1 కొరింథీయులు 11:23-25) సా.శ. 33 నీసాను 14 రాత్రి యేసు ఈ భోజనాన్ని ప్రారంభించినప్పుడు, పాపరహితమైన తన మానవ శరీరానికి మరియు తన పరిపూర్ణ రక్తానికి చిహ్నాలైన పొంగని రొట్టెను, ఎర్రని ద్రాక్షారసాన్ని ఆయన ఉపయోగించాడు. (మత్తయి 26:26-29) దేవుని పరిశుద్ధాత్మచే అభిషేకించబడిన క్రైస్తవులు ఈ చిహ్నాలలో భాగం వహిస్తారు. వారు క్రొత్త నిబంధనలోకి అంటే రాజ్యం కొరకైన నిబంధనలోకి తీసుకొనబడ్డారు, వారికి పరలోక నిరీక్షణ ఉంది. (లూకా 12:32; 22:20, 28-30; రోమీయులు 8:16, 17; ప్రకటన 14:1-5) అయినప్పటికీ, ప్రాచీన యూదా క్యాలెండరులోని నీసాను 14వ తేదీకి సరిపోయే సాయంకాలం ఈ ఆచరణకు హాజరైన వారందరు ప్రయోజనాలను పొందవచ్చు. దైవాంగీకారం ఉండే వారికి నిత్య జీవాన్ని సాధ్యపర్చే పాపపరిహార విమోచన క్రయధనబలిలో యెహోవా దేవుడు మరియు యేసు క్రీస్తులచే చూపబడిన ప్రేమ వారికి గుర్తు చేయబడుతుంది.—మత్తయి 20:28; యోహాను 3:16.

ఉద్యోగం మరియు వినోదం

19. జీవనోపాధిని పొందడంలో క్రైస్తవులు ఏ సవాలును ఎదుర్కొంటారు?

19 నిజ క్రైస్తవులు కష్టపడి పనిచేసి తమ అవసరతలు తీర్చుకోవలసిన బాధ్యత కలిగివున్నారు. దీన్ని సాధించడం కుటుంబ శిరస్సులకు సంతృప్తికరమైన భావనను కలిగిస్తుంది. (1 థెస్సలొనీకయులు 4:11, 12) అయితే, ఒక క్రైస్తవుని ఉద్యోగం బైబిలుతో పొందిక లేనిదైతే, ఇది అతనికి సంతోషం లేకుండా చేస్తుంది. అయినా, బైబిలు ప్రమాణాలతో పొందికగల ఉద్యోగాన్ని కనుగొనడం క్రైస్తవునికి కొన్నిసార్లు కష్టమౌతుంది. ఉదాహరణకు, కొంతమంది ఉద్యోగులు తమ కొనుగోలుదారులను మోసగించవలసి ఉంటుంది. మరో వైపున, నమ్మకస్థుడైన ఉద్యోగిని కోల్పోవడం ఇష్టంలేక, నిజాయితీగా పనిచేసే పనివాని మనస్సాక్షికి స్థానం కల్పించేందుకు అనేకమంది యజమానులు కొన్ని మినహాయింపులు ఇస్తారు. అయితే, ఏం జరిగినప్పటికీ, మీరు మంచి మనస్సాక్షి కలిగివుండేందుకు దోహదపడే ఉద్యోగాన్ని కనుగొనేటట్లు మీరు చేసే ప్రయత్నాలను దేవుడు ఆశీర్వదిస్తాడని మీరు నిశ్చయత కలిగివుండవచ్చు.—2 కొరింథీయులు 4:2.

20. వినోదాన్ని ఎంపిక చేసుకొనే విషయంలో మనమెందుకు జాగ్రత్తగా ఉండాలి?

20 తన సేవకులు సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు గనుక, మనం చేసే కష్టమైన పనిని వినోదం మరియు విశ్రాంతి పొందే సమయాలతో సమతూకం చేయవలసిన అవసరం ఉంది. (మార్కు 6:31; ప్రసంగి 3:12, 13) సాతాను ప్రపంచం భక్తిహీనమైన వినోదాన్ని ఉన్నతపరుస్తుంది. కాని దేవుని అంగీకారం పొందడానికి, మనం చదివే పుస్తకాలు, మనం వినే రేడియో కార్యక్రమాలు మరియు సంగీతం, మనం చూసే సంగీత కచ్చేరీలు, సినిమాలు, ఆటలు, దూరదర్శిని కార్యక్రమాలు వంటివాటి విషయంలో ఎంపిక చేసుకొనేవారమై ఉండాలి. మనం గతంలో ఎంపిక చేసుకొన్న వినోదం ద్వితీయోపదేశకాండము 18:10-12, కీర్తన 11:5 మరియు ఎఫెసీయులు 5:3-5 వంటి లేఖనాలలోని హెచ్చరికలను వ్యతిరేకించేదైతే, తగిన మార్పులు చేసుకుంటే యెహోవాను ప్రీతిపర్చగలము, మనం సంతోషంగా ఉండగలము.

జీవం మరియు రక్తం ఎడల గౌరవం

21. గర్భస్రావం మరియు మన అలవాట్లు, ప్రవర్తన వంటివాటిని గూర్చిన మన దృష్టిని జీవం ఎడల గౌరవం ఎలా ప్రభావితం చేయాలి?

21 నిజమైన సంతోషాన్ని పొందేందుకు, యెహోవా మాదిరే మనం కూడా మానవ జీవితాన్ని పవిత్రమైనదిగా దృష్టించవలసిన అవసరం ఉంది. మనం హత్య చేయకూడదని ఆయన వాక్యం మనకు తెలియజేస్తుంది. (మత్తయి 19:16-18) వాస్తవానికి, దేవుడు పిండమును ప్రశస్తమైన జీవంగా అంటే నాశనం చేయగూడని దానిగా దృష్టిస్తాడని ఇశ్రాయేలుకు ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రం చూపిస్తుంది. (నిర్గమకాండము 21:22, 23) దానికి సంబంధించినంత వరకు, పొగాకు ఉపయోగం, మన శరీరాన్ని మత్తు పదార్థాలు లేక మద్యం వంటివాటితో పాడుచేసుకోవడం లేక అనవసరమైన అపాయాలు కలుగజేసుకోవడం వంటివి చేయడం ద్వారా జీవానికి ఏమాత్రం విలువలేదన్నట్లు చూడకూడదు. జీవాన్ని ప్రమాదంలో పడవేసే పనులలో మనం చేరివుండకూడదు లేక రక్తాపరాధానికి దారితీసేలా భద్రతా చర్యలను అలక్ష్యం చేయకూడదు.—ద్వితీయోపదేశకాండము 22:8.

22. (ఎ) రక్తం, దాని ఉపయోగాన్ని గూర్చి దైవిక దృష్టి ఏమిటి? (బి) ఎవరి రక్తం మాత్రమే నిజంగా జీవాన్ని కాపాడుతుంది?

22 రక్తం ప్రాణాన్ని లేక జీవాన్ని సూచిస్తుందని యెహోవా నోవహుకు ఆయన కుటుంబానికి చెప్పాడు. గనుక, వారు ఏ విధమైన రక్తము తినకూడదని దేవుడు నిషేధించాడు. (ఆదికాండము 9:3, 4) మనం వారి సంతానం గనుక, ఆ ఆజ్ఞ మనందరికీ వర్తిస్తుంది. రక్తం నేలపై ఒలికించబడాలని, మానవుని స్వంత సంకల్పాల కొరకు ఉపయోగించకూడదని యెహోవా ఇశ్రాయేలీయులకు చెప్పాడు. (ద్వితీయోపదేశకాండము 12:15, 16) ‘రక్తమును విసర్జించుడి’ అని మొదటి శతాబ్దపు క్రైస్తవులకు చెప్పబడినప్పుడు రక్తం గురించి దేవుడిచ్చిన ఆజ్ఞ పునరుక్తి చేయబడింది. (అపొస్తలుల కార్యములు 15:28, 29) జీవం యొక్క పవిత్రత ఎడలగల గౌరవాన్నిబట్టి, దైవభక్తిగల ప్రజలు రక్త మార్పిడులను అంగీకరించరు, అలాంటి విధానం జీవాన్ని కాపాడగలదని ఇతరులు నొక్కి చెప్పినప్పటికీ కూడా వారు అంగీకరించరు. యెహోవాసాక్షులకు అంగీకృతమైన అనేక వైద్య ప్రత్యామ్నాయాలు ఎంతో ప్రభావవంతమైనవిగా నిరూపించబడ్డాయి మరియు అవి ఒకరు రక్తమార్పిడుల ప్రమాదాలకు గురి కాకుండా కాపాడుతాయి. కేవలం యేసు చిందించిన రక్తమే జీవాన్ని కాపాడగలదని క్రైస్తవులకు తెలుసు. దానియందు విశ్వాసముంచడం క్షమాపణను, నిత్యజీవ ఉత్తరాపేక్షను కలుగజేస్తుంది.—ఎఫెసీయులు 1:7.

23. దైవభక్తిగల జీవితాన్ని గడపడం వల్ల వచ్చే కొన్ని దీవెనలు ఏమిటి?

23 స్పష్టంగా, దైవభక్తిగల జీవితాన్ని గడపడానికి ప్రయత్నం అవసరం. దానివల్ల కుటుంబ సభ్యులనుండి లేక పరిచయస్థులనుండి ఎగతాళి రావచ్చు. (మత్తయి 10:32-39; 1 పేతురు 4:4) కాని అలాంటి జీవితాన్ని గడపడంవల్ల వచ్చే దీవెనలు ఏ శ్రమలకంటే కూడా ఎక్కువే. అది నిష్కళంకమైన మనస్సాక్షినిస్తుంది, యెహోవా యొక్క తోటి ఆరాధికుల హితకరమైన సహచర్యాన్ని అందజేస్తుంది. (మత్తయి 19:27, 29) ఆ తర్వాత, దేవుని నీతియుక్తమైన నూతన లోకంలో నిరంతరం జీవించడాన్ని గూర్చి కూడా ఊహించండి. (యెషయా 65:17, 18) బైబిలు ఉపదేశాన్ని అన్వర్తించుకోవడం ఎంతో ఆనందాన్నిస్తుంది, తద్వారా యెహోవా హృదయాన్ని ఎంతో ఆనందపరుస్తుంది! (సామెతలు 27:11) దైవభక్తిగల జీవితాన్ని గడపడం సంతోషాన్ని తెస్తుందనడంలో ఆశ్చర్యంలేదు!—కీర్తన 128:1, 2.

మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి

దైవభక్తిగల జీవితాన్ని గడపడం సంతోషాన్ని ఎందుకు తెస్తుందనేదానికి కొన్ని కారణాలు ఏవి?

దైవభక్తిగల జీవితాన్ని గడపడానికి ఏ మార్పులు అవసరం?

దైవభక్తిగల జీవితాన్ని గడపాలని మీరెందుకు కోరుకుంటున్నారు?

[అధ్యయన ప్రశ్నలు]

[124, 125వ పేజీలోని చిత్రం]

విశ్రాంతి సమయాలతో ఆత్మీయ కార్యాలను సమతూకం చేయడం దైవభక్తిగల జీవితాన్ని గడిపేవారికి సంతోషాన్ని కలుగజేస్తుంది