కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు సంతోషకరమైన భవిష్యత్తును కలిగివుండవచ్చు!

మీరు సంతోషకరమైన భవిష్యత్తును కలిగివుండవచ్చు!

అధ్యాయము 1

మీరు సంతోషకరమైన భవిష్యత్తును కలిగివుండవచ్చు!

1, 2. మీరు ఏమి కలిగివుండాలని మీ సృష్టికర్త కోరుతున్నాడు?

మీరు ప్రేమించే వ్యక్తి యొక్క వాత్సల్యపూరితమైన ఆలింగనం. ప్రియమైన స్నేహితులతో మంచి భోజనాన్ని ఆరగిస్తున్నప్పుడు హృదయపూర్వకమైన నవ్వు. మీ పిల్లలు కేరింతలతో ఆడుకుంటుండగా చూసే ఆనందం. ఇలాంటి క్షణాలు జీవితంలోని మధురమైన క్షణాలు. అయితే, చాలామందికి జీవితం ఒకదాని తర్వాత ఒక గంభీరమైన సమస్యను కలుగజేస్తున్నట్లుగా ఉంటుంది. మీ పరిస్థితి అదే అయితే, ధైర్యం వహించండి.

2 అద్భుతమైన పరిసరాల్లో, శ్రేష్ఠమైన పరిస్థితుల్లో మీరు నిత్య సంతోషాన్ని అనుభవించాలన్నదే దేవుని చిత్తం. ఇది కేవలం కల కాదు, ఎందుకంటే అలాంటి సంతోషకరమైన భవిష్యత్తుకు కీలకాన్ని దేవుడే మీకు అందజేస్తున్నాడు. ఆ కీలకమే జ్ఞానము.

3. సంతోషానికి ఏ జ్ఞానం కీలకము, దేవుడు ఆ జ్ఞానాన్ని ఇవ్వగలడని మనమెందుకు నమ్మవచ్చు?

3 మానవ బుద్ధికంటే ఎంతో గొప్పదైన, ప్రత్యేక రకమైన జ్ఞానం గురించి మేము మాట్లాడుతున్నాము. అది “దేవునిగూర్చిన విజ్ఞానము.” (సామెతలు 2:5) దాదాపు 2,000 సంవత్సరాల క్రితం, ఒక బైబిలు రచయిత ఇలా చెప్పాడు: “ప్రతి యిల్లును ఎవడైన ఒకనిచేత కట్టబడును; సమస్తమును కట్టినవాడు దేవుడే.” (హెబ్రీయులు 3:4) అన్నిటినీ చేసినవాడు కలిగివుండవలసిన జ్ఞానాన్ని గూర్చి ఆలోచించండి! దేవుడు నక్షత్రాలన్నిటినీ లెక్కించి, వాటికి పేర్లు పెడతాడని బైబిలు చెబుతుంది. ఎంతటి భీతిగొలిపే ఆలోచన, ఎందుకంటే మన స్వంత నక్షత్ర వీధిలోనే కోటానుకోట్ల నక్షత్రాలున్నాయి, ఇంకా దాదాపు పదివేల కోట్ల ఇతర నక్షత్రవీధులున్నాయని ఖగోళ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు! (కీర్తన 147:4) దేవునికి మన గురించి కూడా అంతా తెలుసు, కాబట్టి ప్రాముఖ్యమైన జీవిత ప్రశ్నలకు ఆయన కాక మరెవరు శ్రేష్ఠమైన సమాధానాలివ్వగలరు?—మత్తయి 10:30.

4. మనల్ని నడిపించేందుకు దేవుడు ఉపదేశాలివ్వాలని మనం ఎందుకు ఎదురుచూడాలి, ఈ అవసరతను ఏ పుస్తకం తీరుస్తుంది?

4 ఇద్దరు వ్యక్తులు తమ కార్లను బాగుచేసుకోవాలని ప్రయత్నిస్తుండడాన్ని ఊహించండి. వారిలో ఒక వ్యక్తి విసుగుచెంది తన పనిముట్లను క్రింద పడేస్తాడు. మరో వ్యక్తి శాంతంగా దాన్ని బాగుచేసి, ఇగ్నీషన్‌ కీ త్రిప్పి, ఇంజను మొదలై నెమ్మదిగా కదలడంతో చిరునవ్వు చిందిస్తాడు. ఇద్దరిలో ఎవరి దగ్గర ఉత్పాదకుడు ఇచ్చిన సూచనల పుస్తకం ఉందో ఊహించడం మీకు కష్టమేమికాదు. జీవితంలో మనల్ని నడిపించేందుకు దేవుడు సూచనలివ్వడం సరియైనది కాదా? బహుశా మీకు తెలిసినట్లుగా, బైబిలు కచ్చితంగా అటువంటిదేనని చెప్పుకుంటోంది, అంటే దేవుని గూర్చిన జ్ఞానాన్ని అందజేయడానికి రూపొందించబడిన, మన సృష్టికర్త నుండి వచ్చిన ఉపదేశము, నడిపింపుగల పుస్తకం.—2 తిమోతి 3:16.

5. బైబిలులోవున్న జ్ఞానం ఎంత విలువైనది?

5 బైబిలు చెబుతున్నది నిజమే అయితే, ఆ పుస్తకంలో ఎంతటి జ్ఞాన సంపదలు ఉండాలో ఆలోచించండి! వివేకం కొరకు వెదకమని, మనం దాచబడిన సంపద కొరకు త్రవ్వి వెదకినట్లు అంటే మానవ ఆలోచన అనే నేలలో కాదుగాని దేవుని స్వంత వాక్యంలో త్రవ్వి దాని కొరకు వెదకమని సామెతలు 2:1-5 నందు అది మనల్ని కోరుతుంది. మనం అక్కడ వెదకితే మనకు “దేవునిగూర్చిన విజ్ఞానము . . . లభించును.” దేవుడు మన పరిమితులను, అవసరతలను అర్థం చేసుకుంటాడు కాబట్టి, మనం శాంతియుతమైన, సంతోషకరమైన జీవితాలు గడిపేందుకు సహాయం చేసే ఉపదేశాన్ని ఆయన మనకిస్తాడు. (కీర్తన 103:14; యెషయా 48:17) అంతేకాకుండా, దేవుని గూర్చిన జ్ఞానం మనకు ఉత్తేజకరమైన సువార్తను అందజేస్తుంది.

నిత్య జీవము!

6. దేవుని గూర్చిన జ్ఞానానికి సంబంధించి యేసుక్రీస్తు ఏ హామీ ఇచ్చాడు?

6 పేరుపొందిన చారిత్రాత్మక వ్యక్తియైన యేసుక్రీస్తు దేవుని గూర్చిన జ్ఞానానికి సంబంధించిన ఈ అంశాన్ని స్పష్టంగా వివరించాడు. ఆయనిలా చెప్పాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నునూ నీవు పంపిన యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని పొందడమే నిత్యజీవము.” (యోహాను 17:3, NW) ఊహించండి—నిత్యజీవానికి నడిపించే జ్ఞానము!

7. మనం మరణించాలని దేవుడు ఉద్దేశించలేదనడానికి ఏ సాక్ష్యాధారం ఉంది?

7 నిత్యజీవమంటే కేవలం ఒక కల అని వెంటనే కొట్టిపారేయకండి. బదులుగా, మానవ శరీరం నిర్మింపబడిన రీతిని పరిశీలించండి. అది రుచి, వినికిడి, వాసన, చూపు, స్పర్శ వంటివాటితో అత్యద్భుతంగా రూపొందించబడింది. మన జ్ఞానేంద్రియాలకు ఆనందం కలుగజేసేవి భూమిపై ఎన్నో ఉన్నాయి—రుచికరమైన ఆహారం, ఆహ్లాదకరమైన పక్షుల గానం, సువాసనలు వెదజల్లే పువ్వులు, సుందరమైన దృశ్యాలు, ఆనందభరితమైన సాహచర్యం! మన అద్భుతమైన మెదడు సూపర్‌ కంప్యూటర్‌ కంటే ఎంతో గొప్పది, ఎందుకంటే మనం అలాంటి వాటినన్నిటినీ మెచ్చుకొనేందుకు, అనుభవించేందుకు అది మనకు సహాయం చేస్తుంది. మనం మరణించాలని, ఇవన్నీ కోల్పోవాలని మన సృష్టికర్త కోరుకుంటాడని మీరనుకుంటారా? మనం సంతోషంగా జీవించాలని, జీవితాన్ని నిరంతరం ఆనందించాలని ఆయనిష్టపడుతున్నాడనే ముగింపుకు రావడం మరింత కారణసహితంగా ఉండదంటారా? అయితే, దేవుని గూర్చిన జ్ఞానం అంటే మీ కొరకు దాని భావం అదే.

పరదైసులో జీవితం

8. మానవజాతి భవిష్యత్తు గురించి బైబిలు ఏమి చెబుతుంది?

8 భూమి మరియు మానవజాతి భవిష్యత్తు గురించి బైబిలు చెబుతున్నదాన్ని ఒక్క మాటలో పొందుపర్చవచ్చు—పరదైసు! యేసుక్రీస్తు, మరణిస్తున్న ఒక వ్యక్తితో “నీవు నాతోకూడ పరదైసులో ఉందువని” చెప్పినప్పుడు దాని గురించే మాట్లాడాడు. (లూకా 23:43) పరదైసు గురించి చెప్పడం, నిస్సందేహంగా ఆ వ్యక్తికి, మన మొదటి తలిదండ్రులైన ఆదాము హవ్వల సంతోషకరమైన స్థితిని గుర్తు చేసివుండవచ్చు. దేవుడు వారిని సృష్టించినప్పుడు, వారు పరిపూర్ణులైయుండి, సృష్టికర్త రూపొందించి నాటిన తోటవంటి ఉద్యానవనంలో నివసించారు. అది తగినట్లుగానే ఏదెను తోట అని పిలువబడింది, ఆ పేరుకు ఆనందం అని భావం.

9. మొదటి పరదైసులో జీవించడం ఎలా ఉండేది?

9 ఆ తోట ఎంత ఆనందభరితంగా ఉండేదోకదా! అది నిజమైన పరదైసై ఉండింది. దాని రమ్యమైన వృక్షాలలో రుచికరమైన ఫలాలనిచ్చే వృక్షాలుండేవి. ఆదాము హవ్వలు తమ సామ్రాజ్యాన్ని పరిశోధిస్తూ, దాని తియ్యని నీళ్లను త్రాగుతూ, దాని వృక్ష ఫలాలను సేకరిస్తుండగా, వాళ్లు చింతించేందుకు లేక భయపడేందుకు కారణమేమీ లేదు. చివరికి జంతువులు కూడా హాని కలిగించేవికావు, ఎందుకంటే దేవుడు మానవునికి అతని భార్యకు వాటన్నిటిపై ప్రేమపూర్వకమైన ఆధిపత్యానిచ్చాడు. అంతేగాక, మొదటి మానవజతకు సంపూర్ణమైన ఆరోగ్యం ఉండేది. వాళ్లు దేవునికి విధేయులుగా ఉన్నంతకాలం, వారి కొరకు నిత్య, సంతోషకరమైన భవిష్యత్తు వేచివుంది. తమ అద్భుతమైన పరదైసు గృహాన్ని గూర్చి శ్రద్ధ వహించే సంతృప్తికరమైన పని వారికివ్వబడింది. ఆ తర్వాత, దేవుడు ఆదాము హవ్వలకు “భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి” అనే ఆదేశాన్నిచ్చాడు. మన గ్రహం అంతా ఒక చక్కని, సుందరమైన స్థలంగా మారేవరకు వాళ్లు, వాళ్ల పిల్లలు పరదైసు సరిహద్దులను విస్తరింపజేయవలసి ఉండిరి.—ఆదికాండము 1:28.

10. యేసు పరదైసు గురించి మాట్లాడినప్పుడు, ఆయన ఉద్దేశం ఏమై ఉండెను?

10 అయితే, యేసు పరదైసు గురించి చెప్పినప్పుడు, మరణిస్తున్న వ్యక్తితో చాలా పూర్వపు విషయం గురించి తలంచమని ఆయన చెప్పడంలేదు. యేసు భవిష్యత్తు గురించి మాట్లాడుతుండెను! మన భూ గృహమంతా పరదైసుగా మారుతుందని ఆయనకు తెలుసు. దేవుడు అలా మానవజాతిని మరియు మన భూమిని గురించిన తన ఆది సంకల్పాన్ని నెరవేరుస్తాడు. (యెషయా 55:10, 11) అవును, పరదైసు పునఃస్థాపించబడుతుంది! అదెలా ఉంటుంది? దేవుని వాక్యమైన పరిశుద్ధ బైబిలును జవాబు చెప్పనివ్వండి.

పునఃస్థాపిత పరదైసులో జీవితం

11. పునఃస్థాపిత పరదైసులో, అనారోగ్యం, వృద్ధాప్యం మరియు మరణానికి ఏమి సంభవిస్తుంది?

11అనారోగ్యం, వృద్ధాప్యం మరియు మరణం ఇక ఉండవు. “గ్రుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును. కుంటివాడు దుప్పివలె గంతులువేయును, మూగవాని నాలుక పాడును.” (యెషయా 35:5, 6) “దేవుడు తానే . . . వారికి [మానవజాతికి] తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను.”—ప్రకటన 21:3, 4.

12. భవిష్యత్‌ పరదైసులో నేరం, దౌర్జన్యం, దుష్టత్వం ఉండవని మనమెందుకు నిశ్చయత కలిగివుండవచ్చు?

12నేరం, దౌర్జన్యం, దుష్టత్వం మరెన్నడూ ఉండకుండా తీసివేయబడతాయి. “కీడు చేయువారు నిర్మూలమగుదురు . . . ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు . . . వారు కనబడకపోవుదురు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు.” (కీర్తన 37:9-11) “భక్తిహీనులు దేశములో నుండకుండ నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలోనుండి పెరికివేయబడుదురు.”—సామెతలు 2:22.

13. దేవుడు శాంతిని ఎలా తీసుకువస్తాడు?

13భూవ్యాప్తంగా శాంతి నెలకొంటుంది. “ఆయనే [దేవుడు] భూదిగంతములవరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే.” (కీర్తన 46:9) “అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు చంద్రుడు లేకపోవువరకు క్షేమాభివృద్ధి కలుగును.”—కీర్తన 72:7.

14, 15. పునఃస్థాపిత పరదైసులో గృహవసతి, పని మరియు ఆహారం గురించి బైబిలు ఏమి చెబుతుంది?

14సురక్షితమైన గృహవసతి, సంతృప్తికరమైన పని ఉంటాయి. “జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు. . . . వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరు. వారు నాటుకొన్నవాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును; నేను ఏర్పరచుకొనినవారు తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. వారు వృథాగా ప్రయాసపడరు ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు.”—యెషయా 65:21-23.

15ఆరోగ్యకరమైన ఆహారం సమృద్ధిగా లభ్యమౌతుంది. “దేశములోను పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధి కలుగును.” (కీర్తన 72:16) “అప్పుడు భూమి దాని ఫలములిచ్చును దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును.”—కీర్తన 67:6.

16. పరదైసులో జీవితం ఎందుకు ఆనందదాయకంగా ఉంటుంది?

16పరదైసు భూమిపై నిత్యజీవం ఆనందదాయకంగా ఉంటుంది. “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.” (కీర్తన 37:29) “అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరిపుష్పమువలె పూయును.”—యెషయా 35:1.

జ్ఞానము మరియు మీ భవిష్యత్తు

17. (ఎ) పరదైసులో జీవితం మిమ్మల్ని ఆకర్షిస్తే మీరు ఏమి చేయాలి? (బి) దేవుడు భూమిపై గొప్ప మార్పులు తెస్తాడని మనకెలా తెలుసు?

17 పరదైసులో జీవితం మిమ్మల్ని ఆకర్షిస్తే, దేవుని గూర్చిన జ్ఞానాన్ని పొందడం నుండి ఏదీ మిమ్మల్ని ఆటంకపర్చనివ్వకండి. ఆయన మానవజాతిని ప్రేమిస్తున్నాడు, భూమిని పరదైసుగా మార్చడానికి అవసరమైన మార్పులను ఆయన తీసుకువస్తాడు. లోకంలో విస్తృతంగా ఉన్న దురవస్థ, అన్యాయాన్ని అంతంచేసే శక్తి ఒకవేళ మీకుంటే మీరలా చేయరా? దేవుడేమైనా తక్కువ చేస్తాడని మనమనుకోవచ్చా? నిజానికి, దేవుడు ఈ అల్లకల్లోల విధానాన్ని తీసివేసి, దానికి బదులుగా పరిపూర్ణమైన, నీతియుక్తమైన పరిపాలనను ఏర్పాటు చేసే సమయం గురించి బైబిలు స్పష్టంగా తెలియజేస్తుంది. (దానియేలు 2:44) కాని, వీటన్నిటి గురించి చెప్పడం కంటే బైబిలు ఇంకా ఎక్కువే చేస్తుంది. వాగ్దానం చేయబడిన దేవుని నూతన లోకంలోకి మనమెలా తప్పించబడవచ్చో అది చూపిస్తుంది.—2 పేతురు 3:13; 1 యోహాను 2:17.

18. దేవుని గూర్చిన జ్ఞానం మీ కొరకు ఇప్పుడు ఏమి చేయగలదు?

18 దేవుని గూర్చిన జ్ఞానం ఇప్పుడు కూడా మీకు ఎంతో ప్రయోజనకరం కాగలదు. జీవితం యొక్క లోతైన, ఎంతో కలవరపర్చే ప్రశ్నలకు బైబిలులో సమాధానమివ్వబడింది. దాని నడిపింపును అంగీకరించడం మీరు దేవునితో స్నేహాన్ని పెంపొందింపజేసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. ఎంతటి ఘనమైన ఆధిక్యత! దేవుడు మాత్రమే ఇవ్వగల శాంతిని అనుభవించేందుకు ఇది మీకు సహాయం చేస్తుంది. (రోమీయులు 15:13, 33) మీరు ఈ ప్రాముఖ్యమైన జ్ఞానాన్ని పొందనారంభించడం ద్వారా మీరు మీ జీవితంలోని అత్యంత ప్రాముఖ్యమైన, ప్రతిఫలదాయకమైన ప్రయత్నానికి పూనుకుంటున్నారు. నిత్యజీవానికి నడిపే దేవుని గూర్చిన జ్ఞానాన్ని పొందడం గురించి మీరు ఎన్నడూ విచారపడరు.

19. తరువాతి అధ్యాయంలో మనమే ప్రశ్నను పరిశీలిస్తాము?

19 బైబిలు దేవుని గూర్చిన జ్ఞానంగల పుస్తకమని మనం ప్రస్తావించాము. అయితే, అది మానవ బుద్ధి గల పుస్తకం కాదుగాని అంతకంటే ఎంతో గొప్పదని మనకెలా తెలుసు? తరువాతి అధ్యాయంలో మనం ఈ ప్రశ్నను పరిశీలిస్తాము.

మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి

దేవుని గూర్చిన జ్ఞానం మిమ్మల్ని నిరంతర సంతోషానికి ఎందుకు నడిపించగలదు?

రాబోయే భూ పరదైసులో జీవితం ఎలా ఉంటుంది?

ఇప్పుడు దేవుని గూర్చిన జ్ఞానాన్ని పొందడం వలన మీరెందుకు ప్రయోజనం పొందుతారు?

[అధ్యయన ప్రశ్నలు]