కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పిల్లలకు బాల్యంనుండే శిక్షణనిచ్చుట

పిల్లలకు బాల్యంనుండే శిక్షణనిచ్చుట

అధ్యాయము 9

పిల్లలకు బాల్యంనుండే శిక్షణనిచ్చుట

1-4. పసికందు నేర్చుకొనుటకు అత్యంత శక్తి కల్గియున్నాడనుటకు రుజువేమిటి?

క్రొత్తగా జన్మించిన శిశువు మనస్సు ఏమీ వ్రాయబడని తెల్లని కాగితంతో పోల్చబడింది. నిజానికి, శిశువు తల్లిగర్భంలో ఉన్నప్పుడే అనేక విషయాలు ఆ శిశువు మనస్సునందు ముద్రింపబడ్డాయి. జన్యుసంబంధ పారంపర్యాన్ని బట్టి కొన్ని లక్షణాలు ఆ శిశువు మనస్సులో మాయని రీతిగా లిఖించబడ్డాయి. అయితే పుట్టిన క్షణం నుండి నేర్చుకోవడానికి కావలసినంత శక్తి అంతకు మునుపే దానియందు దాచబడింది. ఒక కాగితంవలె కాదుగానీ అది, సమాచారాన్ని దాని పుటలలో ముద్రింపబడుటకు సిద్ధంగావున్న ఒక గ్రంథాలయంవలె వుంది.

2 పుట్టినపుడు పసిపాప మెదడు, పెద్దవారి మెదడు బరువులో నాల్గోవంతు మాత్రమే ఉంటుంది. అయితే ఆ మెదడు ఎంత త్వరగా పెరుగుతుందంటే, రెండు సంవత్సరాల లోపల అది పెద్దవారి మెదడులో మూడువంతుల బరువౌతుంది! జ్ఞానాభివృద్ధి అంచెలంచలుగా వుంటుంది. పరిశోధకులు తెలిపేదేమంటే, శిశువుకు, రాబోవు పదమూడు సంవత్సరాలలో ఎలా జ్ఞానాభివృద్ధి చెందుతుందో ఆలాగే తన జీవితంలోని మొదటి నాలుగు సంవత్సరాలలో జ్ఞానాభివృద్ధి కలుగుతుంది. నిజానికి కొందరనేదేమంటే “శిశువు మొదటి ఐదు సంవత్సరాలలో నేర్చుకున్న విషయాలు, తాను జీవితంలో ఎదుర్కోనైయున్న వాటన్నిటి కంటె అత్యంత కష్టతరమైనవి.”

3 కుడి ఎడమ, పైన క్రింద, నిండు, ఖాళీ అని, మరియు హెచ్చు తగ్గులు, బరువులు, మొదలైన వాటి తారతమ్యాన్ని పోల్చి తెలిసికొనుట మనకు ఎంతో సహజంగా కనబడుతుంది. అయితే శిశువు ఇటువంటివాటిని, ఇంకా ఇతరమైనవాటిని నేర్చుకోవల్సివుంది. శిశువు మనస్సున భాషను నాటి, స్థిరపరచాలి.

4 భాష అనేది, “బహుశా మానవుడు చేయవలసినదానిలో అతిక్లిష్టమైన, తెలివైన కార్యసాధన”యని కొందరి భావన. నీ వెప్పుడైనా క్రొత్త భాషను నేర్చుకోవడానికి ప్రయాసపడితే ఇది సత్యమని నీవు అంగీకరిస్తావు. అయితే భాష ప్రభావమేమిటో కనీసం నీవు నేర్చుకొనగల తరుణమైనా నీకు దొరికింది. మరి శిశువుకు అదీ తెలియదు, అయినను శిశువు భాషయొక్క భావాన్ని గ్రహించి దాన్ని అమలుపరచడానికి ప్రయత్నిస్తుంది. అంతేగాక, ద్విభాషలున్న కుటుంబంలోనేగానీ, ఆ ప్రాంతంలోనేగానీ నివసించే పిల్లలు వారి చిన్న వయస్సులోనే అంటే, పాఠశాలకు వెళ్లకముందే రెండు భాషలను సులభంగా మాట్లాడగలరు! గనుక, జ్ఞానం ఉంది కానీ అది అభివృద్ధి చెందవలసివుంది.

ప్రారంభించు సమయమిదే!

5. శిశువు యొక్క శిక్షణ ఎంత త్వరగా ప్రారంభం కావాలి?

5 అపొస్తలుడైన పౌలు తన జతపనివాడైన తిమోతికి వ్రాస్తూ, అతడు ‘బాల్యమునుండియే’ పరిశుద్ధ లేఖనాలు ఎరిగియున్నవాడని అతనికి జ్ఞాపకముచేశాడు. (2 తిమోతి 3:15) పసివాడు సహజంగా నేర్చుకోవడానికి కుతూహలం చూపిస్తాడని తెలివిగల తండ్రి గ్రహిస్తాడు. పసివారెంతో పరిశీలిస్తారు, వారి శరీరమంతా కన్నులు, చెవులే. తలిదండ్రులు గమనిస్తున్నా గమనించకపోయినా, యీ చిన్నారి బాలలు సమాచారాన్ని సేకరించి, భద్రపరచుకొని దానికి యింకను కొంత కలుపుకొని వారే నిర్ణయాలు చేసుకుంటారు. నిజానికి, తలిదండ్రులే జాగ్రత్తగా వుండకపోతే, కొద్దికాలంలోనే ఆ చిన్నారి తన ఇష్ట ప్రకారం చేయవలసిన పద్ధతిని పసిగట్టిదాన్ని అద్భుతంగా నేర్చుకుంటుంది. కావున, దేవునివాక్యమందున్న హెచ్చరిక బాల్యం నుండియే వర్తిస్తుంది: “బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు.” (సామెతలు 22:6) మొదటి పాఠాలు సహజంగా ప్రేమపూర్వకమై, ఎంతో మమతానురాగాలతో నిండినవైయుండాలి. అయితే దీనితోపాటు ఎంతో సున్నితంగా, స్థిరంగా అవసరమైన దిద్దుబాటు చేస్తుండాలి.

6. (ఏ) పసివానితో ఏ విధంగా మాట్లాడుట శ్రేష్ఠం? (బి) పసివాడు వేసే అనేక ప్రశ్నల ఎడల మన దృష్టి ఎలా వుండాలి?

6 “పిల్లవానివలె మాట్లాడక” సులభమైన భాషలో, నీ శిశువు నేర్చుకోవాలని నీవు కోరుకునే భాషతో మాట్లాడండి. ఆ చిన్నారి మాట్లాడటానికి నేర్చుకునేటపుడు నిన్ను ప్రశ్నలతో ముంచివేస్తుంది: ‘వర్షమెందుకు వస్తుంది? నేనెక్కడనుండి వచ్చాను? నక్షత్రాలు పగలు ఎక్కడికి వెళ్తాయి? నీవేమి చేస్తున్నావు? ఇదెందుకు? అదెందుకు?’ ఈ విధంగా ప్రశ్నల పరంపరలు బయలు దేరుతాయి! ప్రశ్నలను వినండి, ఎందుకంటే పసివారు నేర్చుకోవడానికి ప్రశ్నలే మంచి పనిముట్లు. ప్రశ్నకు ప్రత్యుత్తరమీయకుండ బిర్రబిగుసుకుపోతే చిన్నవారి మానసిక అభివృద్ధికూడ మందగిస్తుంది.

7. చిన్న వారి ప్రశ్నలకెట్లు ప్రత్యుత్తరమీయాలి, ఎందుకు?

7 అయితే అపొస్తలుడైన పౌలువలె ఈ విషయాన్ని జ్ఞాపకముంచుకోండి “నేను పిల్లవాడనై యున్నప్పుడు పిల్లవానివలె మాటలాడితిని, పిల్లవానివలె తలంచితిని, పిల్లవానివలె యోచించితిని.” (1 కొరింథీయులు 13:11) నీకు వీలైనంతవరకు వారి ప్రశ్నలకు సమాధానాలివ్వండి. అయితే అవి సులభంగాను, క్లుప్తంగాను వుండాలి. ‘వర్షమెందుకు వస్తుంది?’ అని అడిగితే, దానికి క్లిష్టమైన, వివరంతో కూడిన సమాధానం అవసరంలేదు. ‘మేఘాలు నీళ్ళతోనిండి బరువెక్కినపుడు ఆ నీళ్లు క్రిందపడతాయి’ అని చెప్పే సమాధానం సంతృప్తినిస్తుంది. పసివారి మనస్సు స్థిమితంగా వుండదు, వెంటవెంటనే వేరే విషయాలకు వెళ్తారు. పసివానికి బలమైన ఆహారమిచ్చేంత వరకు పాలను ఇచ్చినట్లే, వివరంతోకూడిన జ్ఞానాన్ని గ్రహించగల్గేంతవరకు సులభమైనరీతిలో సమాచార మందించండి.—హెబ్రీయులు 5:13, 14 పోల్చండి.

8, 9. పసివాడు క్రమేణి చదివేలా నేర్పించుటకేమి చేయవచ్చును?

8 నేర్చుకొనుట యనేది క్రమేణి జరుగవలసిన క్రియ. ముందు తెల్పిన రీతిగా తిమోతి తన బాల్యం నుండియే పరిశుద్ధ లేఖనాలను ఎరిగిన వాడు. చిన్ననాడు నేర్చుకున్న వాటిని జ్ఞాపకం చేసికొనుటలో బైబిలునుండి నేర్చుకున్నవి కూడ ఇమిడివున్నాయి. ఈనాడు తలిదండ్రులు తమ శిశువుకు చదవడానికి నేర్పినట్లే ఆనాడు అది క్రమేణి జరిగిన అభివృద్ధి. నీ పసివానికి నీవు చదివి వినిపించు. అతడు పసివాడైతే నీ తొడమీద కూర్చుండబెట్టుకొని, వాని భుజంచుట్టు నీ చేయివేసి మృదువైన కంఠంతో చదివి వినిపించు. ఆ సమయంలో వాడెంత కొద్దిగా గ్రహించగల్గినను, తాను మాత్రం భద్రంగా వున్నానని సంతోషిస్తాడు, చదివి వినిపించుట వానికెంతో ఆనందాన్ని కల్గిస్తుంది. తదుపరి నీవు వానికి అక్షరాలను బహుశ ఒక ఆట మాదిరి నేర్పించాలి. ఆ పిదప పదాలను, చివరకు ఆ పదాలను కూర్చి వాక్యాలుగా మార్చి నేర్పించండి. సాధ్యమైనంతవరకు నేర్చుకొనే పద్ధతిని ఆనందభరితంగా చేయండి.

9 ఉదాహరణకు, ఒక దంపతులు, తమ మూడేండ్ల కుమారునికి బిగ్గరగా చదివి వినిపిస్తూ, వారు చదువునప్పుడు గమనించేలాగున వానికి ప్రతీ పదాన్ని చూపిస్తూ వచ్చారు. కొన్ని పదాల దగ్గర కొంచెం ఆగినప్పుడు, పిల్లవాడు “దేవుడు,” “యేసు,” “మానవుడు,” “వృక్షం” అనే పదాలను పల్కుతాడు. క్రమేణి వాడు చదువగల పదాల సంఖ్య పెరిగింది, మరి నాలుగు సంవత్సరాల వయస్సులో తాను అనేకపదాలను చదువగలిగాడు. చదవడంతోపాటు వ్రాయడం కూడ నేర్చుకుంటాడు, మొదట అక్షరాలు, తదుపరి పూర్తి పదాలను వ్రాస్తాడు. తన స్వంత పేరును వ్రాయడానికి పిల్లవాడు ఎంతో మురిసిపోతాడు!

10. పసివారు తమ స్వశక్తిని వృద్ధిచేసికొనుటలో సహాయపడుట ఎందుకు జ్ఞానయుక్తమైంది?

10 ప్రతి పసివాడు తన ప్రత్యేక వ్యక్తిత్వంతో వేర్వేరుగా వుంటాడు గనుక వానివాని సహజ శక్తికి, సామర్థ్యములకు తగినట్లుగా అభివృద్ధి చేసుకోవడానికి సహాయపడాలి. తాను సహజంగా పొందిన శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి వానికి నీవు తర్ఫీదు నిస్తే, ఇతర పిల్లల కార్యసాధనలు చూచి తాను మత్సరపడాలనే తలంపు వానికి రాదు. ప్రతి పిల్లవాడు తాను కల్గియున్న దానినిబట్టి ప్రేమించబడాలి, అభినందించబడాలి. చెడు తలంపులను అధిగమించుటకు సహాయపడునపుడు నీవు ముందుగానే తలంచిన పద్ధతిలోనికి అతన్ని బలవంతంగా లాగకూడదు. బదులుగా, తన వ్యక్తిగత లక్షణాలను బాగుగా వుపయోగించేలా అతనికి సహాయపడండి.

11. ఒకరినిమరొక పిల్లవానితో అనవసరంగా పోల్చుట ఎందుకు అజ్ఞానం?

11 ఒకరితో మరొకరి ఉన్నతస్థానాన్ని గాని హీనమైన స్థానాన్ని గాని పోల్చిచెప్పడంవల్ల తలిదండ్రులు స్వార్థంతో కూడిన పోటీస్వభావాన్ని పెంపొందించే అవకాశముంది. అయితే పసివారు తమకు పుట్టుకతో సహజంగా వచ్చిన స్వార్థాన్ని కనబరచవచ్చును. వారు మొదట్లో ప్రథమస్థానం, అధికారం, తానే గొప్పయనే తలంపులు కల్గివుండరు. అందుచేతనే యేసు, ఒకసారి ఆయన శిష్యులు వ్యక్తిగతస్థానం కొరకు పదవీ వ్యామోహాన్ని కనబరచినపుడు ఆయన ఒక చిన్న పిల్లవానిని తీసికొని వారికి గుణపాఠం నేర్పగలిగాడు. (మత్తయి 18:1-4) కావున పిల్లవానిని మరొకరితో అనవసరంగా పోల్చవద్దు. ఇలాచేస్తే పిల్లవాడు తనను ద్వేషిస్తున్నట్లు తలంచవచ్చు. మొదట బాధపడవచ్చు, మరి అదే కొనసాగితే బహుశ వాడు ఎదురు తిరుగవచ్చు. మరొకవైపు పిల్లవానికి తానే అందరికంటె గొప్పవాడనే తలంపును కల్గిస్తే గర్విష్టియై, ఇతరులంటే యిష్టపడడు. తలిదండ్రులుగా మీ ప్రేమ, అనురాగం, ఒకరు మరొకరితో పోల్చబడే విధానంపై ఆధారపడి యుండకూడదు. వివిధరకాలు ఆనందకరములు. వాద్యబృందములో, బహుముఖ వేడుక, వినోదంకల్గించే అనేకరకములైన, వాయిద్యాలున్నాయి, అయినను అవన్నీ అనుగుణ్యత కల్గివున్నాయి. వేర్వేరు వ్యక్తులున్నందున కుటుంబం కళకళలాడుతుంది అనురక్తికంగా వుంటుంది, అయినను అందరు వారి సృష్టికర్త నియమాలను పాటిస్తే ఏకత్వం దెబ్బతినదు.

నీ బిడ్డ ఎదుగునట్లు సహాయపడండి

12. పెద్దలను గూర్చిన ఏ వాస్తవాలు, పిల్లలకు సరియైన నడిపింపు అవసరమని కనబరస్తున్నవి?

12 ‘తమమార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదు,’ అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. (యిర్మీయా 10:23) అది అసాధ్యమని మనుష్యులనవచ్చును. అందుచేతనే వారు దేవుని నడిపింపును త్రోసిపుచ్చి నరుల నడిపింపు నంగీకరించి, ఒక దానివెంట ఒకటిగా వచ్చే కష్టాల్లోపడి, చివరకు దేవుడే సత్యవంతుడు అనే నిర్ణయానికి వస్తారు. యెహోవాదేవుడు తెల్పేదేమంటే, ఒకనికి సరియైనదిగా కనబడు మార్గముంది గానీ తుదకది మరణానికి దారితీస్తుంది. (సామెతలు 14:12) నరులు దీర్ఘకాలంగా తమకు మంచిదని తోచిన మార్గాన్ని అవలంబించడం పరిపాటే, అది వారిని యుద్ధం, కరవు, వ్యాధి, మరణానికి నడిపింది. పెద్దవాడైన అనుభవజ్ఞుని దృష్టిలో మంచిదిగా కనబడే మార్గం చివరకు మరణానికి దారితీస్తే మరి పిల్లవానికి మంచిదిగా కనబడే మార్గం వేరొక స్థలానికెలా నడుపగలదు? నరునికి తన మార్గము నేర్పరచుకొనుట సాధ్యం కాకపోతే, తూలితూలినడిచే పసివాడు తన జీవిత మార్గాన్నెలా నిర్దేశించుకోగలడు? సృష్టికర్త తన వాక్యం ద్వారా తలిదండ్రులకు బిడ్డకు ఇద్దరికీ నడిపింపు నందిస్తున్నాడు.

13, 14. ద్వితీయోపదేశకాండము 6:6, 7 నందలి సలహాననుసరించి తలిదండ్రులు వారి పిల్లలకెలా ఉపదేశించవచ్చును?

13 తలిదండ్రులతో దేవుడిలా అంటున్నాడు: “నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను.” (ద్వితీయోపదేశకాండము 6:6, 7) ఏ సమయంలోనైనా, అన్నివేళల, సరియైన అవకాశం దొరికినపుడెల్లా వారికి ఉపదేశ మివ్వాలి. చాలామందికి ఉదయం పూట ఉద్యోగానికి లేక స్కూలుకు వెళ్లడానికి సిద్ధపడటంలో తీరిక దొరక్క పోయినప్పటికీ, ప్రొద్దున నాస్త చేసే సమయంలో, భోజనం నిమిత్తం కృతజ్ఞత తెల్పుటవలన అది మన ఆలోచనలను సృష్టికర్తవైపు మళ్లించడానికి వీలుకల్గిస్తుంది. మరియు కుటుంబానికి అవసరమయ్యే ఇతర ఆత్మీయాంశాలను కూడ అందులో చేర్చవచ్చును. ఆ దినమున చేయనైయున్న కార్యక్రమాలు లేక పాఠశాలను గూర్చి, బహుశరానైయున్న సమస్యలను పరిష్కరించుకొనుటకు యుక్తమైన సలహాను గూర్చి వ్యాఖ్యానించడానికి కొందరికప్పుడు సమయం లభించవచ్చు. పడుకునేవేళలో “నీవు పండుకొనునప్పుడు” చిన్నపిల్లల విషయంలో తలిదండ్రులు కొంచెం ఎక్కువ శ్రద్ధవహిస్తే అదెంతో ఆనందంగా వుంటుంది. పడుకొనే సమయంలో చెప్పే కథలవలన పిల్లలకెంతో ప్రయోజనం కలుగుతుంది, మరియు వాటిని బోధించడానికి మంచి ఉపకరణాలుగా ఉపయోగించవచ్చు. పిల్లలు ఎంతో బాగుగా సంతోషించేలా చేయగల సమాచారం బైబిల్లో వుంది, అయితే దానిని అందించడానికి తలిదండ్రులు కొంత నైపుణ్యాన్ని, ఉత్తేజాన్ని కనబరచాలి. నీ జీవితంలో స్వంత అనుభవాలు నీ పిల్లలను విశేషంగా ఆకర్షిస్తాయి మంచి గుణపాఠాలను నేర్పిస్తాయి. క్రొత్త క్రొత్త కథలను చెప్పడం అంత సులభం కాకపోయిననూ, పిల్లవాడు తరచూ విన్నవాటినే మాటిమాటికి వినగోరతాడు. ఇలా అధిక సమయాన్ని వ్యయపరచుట మూలంగా నీకును నీ పిల్లలకు మధ్య సంభాషణకు సంబంధించిన విషయం యింకా కొంత మెరుగుపడగలదని నీవు కనుగొంటావు. పడుకొనే సమయంలో పిల్లలతో కలిసి ప్రార్థిస్తే, వారిని బాగుగా నడిపించి పరిరక్షించగల వానితో వారు త్వరగా సంబంధ బాంధవ్యాన్ని కల్గివుండటానికి కూడ అది సహాయపడగలదు.—ఎఫెసీయులు 3:20; ఫిలిప్పీయులు 4:6, 7.

14 నీవెచ్చట వున్ననూ, ‘ఇంటిలో కూర్చున్ననూ’ లేక ప్రయాణం చేస్తున్ననూ నీ పిల్లవానికి ఆసక్తికరమైన రీతిగా, ప్రయోజనకరమగు పద్ధతిలో నీవు తర్ఫీదునిచ్చే అవకాశాలున్నాయి. చిన్నపిల్లల విషయంలోనైతే ఇలాంటివి ఆటల రూపంలో చెప్పవచ్చును. బైబిలు స్టడీ కూటంలో నేర్చుకున్నవాటిని పిల్లలకు జ్ఞాపకం చేయడానికి యీ పద్ధతి ఎలా ఉపయోగపడిందో ఒక దంపతులు యీ క్రింది విధంగా తెలిపారు:

‘ఒక రోజు సాయంకాలం మేము మా ఆరు సంవత్సరాల అబ్బాయిని బయటికి తీసికొని వెళ్లాం. వాడు కూటములు జరిగే సమయంలో సరిగ్గాకూర్చోడు వినడు. హాలుకు వెళ్ళేప్పుడు నేను వానితో, “మనమొక ఆట ఆడుకుందాం. కూటంనుండి తిరిగి వచ్చేటప్పుడు కూటంలో పాడిన పాటలను, కొన్ని ముఖ్యాంశాలను జ్ఞాపకం చేసికొనగలమో లేదో పరిశీలిద్దాం” అని అన్నాను. ఇంటికి వెళ్లేటప్పుడు మేం ఆశ్చర్యపోయాం. అందరికంటె చిన్నవాడు అనగా సర్వసాధారణంగా సరిగ్గా విననివాడిని, మొదటిగా వ్యాఖ్యానించమని చెప్పాం. వాడు అనేక ముఖ్యాంశాలను జ్ఞాపకం చేసుకొని చెప్పాడు. మిగిలిన పిల్లలు వారి వారి వ్యాఖ్యానాలను వానికి తోడు చేశారు, పెద్దవారమైన మేమిద్దరం కూడ వ్యాఖ్యానించాం. అదొకపనిలా కాకుండా వారికది తమాషాగా వుంది.’

15. పిల్లవాడు కార్యసాధన చేయునట్లు అతనినెలా పురికొల్పవచ్చును?

15 పిల్లవాడు పెద్దవాడయ్యేకొలది అతడు తన అభిప్రాయాలను వ్యక్తపర్చడం, సమాచారాన్ని రాబట్టడం, ఏదొక పని చేయడం, వాయిద్యంపై ఏదొక సంగీతాన్ని వాయించడం నేర్చుకుంటాడు. ఏదో సాధిస్తున్నాననే భావన అతనికి కల్గుతుంది. ఒక విధంగా తన పని ఏమంటే, స్వయంవృద్ధి చేసుకొనుటే అది వ్యక్తిగతంగా అతనికి సంబంధించిందే. అది చూచి నీవు ‘శభాష్‌,’ అని అంటే ఆ పిల్లవాడు గంతులేస్తాడు. తాను చేసేపనిలో ఏదొక విషయాన్ని గమనించి మనస్ఫూర్తిగా అతన్ని పొగడండి. అతడింకా హుషారుగా పనిచేస్తాడు. గ్రుడ్డిగా విమర్శిస్తే, అప్పుడతడు బహుశ దాన్ని చేయడానికి నిరాకరించి, దానిమీద అతనికి మనస్సు విరిగి పోతుంది. అవసరమైతే ఆ పనికి సంబంధించిన ఏదొక విషయంపై ప్రశ్నించండి, గానీ నీవు అడిగే ప్రశ్న అతని పనిని తిరస్కరించేదిగా వుండకూడదు. ఉదాహరణకు, తాను వేసిన బొమ్మను తీసికొని మరల దాన్ని సరిదిద్దటానికి బదులు నీవొక కాగితాన్ని తీసికొని దాని మీద నీవే అటువంటి బొమ్మను వేసి ఎలా అభివృది చేసికోవాలో అతనికి చూపండి. ఇలా చేస్తే ఒకవేళ బొమ్మలు గీసుకోవాలని తానే ఇష్టపడినపుడు వాటిని సరిదిద్దుకోవడానికి అది అతనికి సహాయపడుతుంది. అతని ప్రయత్నాన్ని పురికొల్పడంవల్ల అతని పురోగాభివృద్ధిని ప్రోత్సహించినట్లవుతుంది; అతన్ని కఠినంగా విమర్శించడంవల్ల నీవతన్ని అధైర్యపరచవచ్చు లేక ప్రయత్నించకుండ అతన్ని నిరుత్సాహపరచినట్లవుతుంది. అవును గలతీయులు 6:4 నందున్న సూత్రం పిల్లలకు కూడ వర్తిస్తుంది: “ప్రతివాడును తాను చేయుపనిని పరీక్షించి చూచుకొనవలెను; అప్పుడు ఇతరునిబట్టి కాక తననుబట్టియే అతనికి అతిశయము కలుగును.” పిల్లవానికి అతి ముఖ్యంగా తొలి ప్రయత్నానికి ప్రోత్సాహం అవసరం! తన వయస్సుకు తగినట్లుంటే అతన్ని మెచ్చుకోండి. అలాకాకపోతే అతని ప్రయత్నాన్ని మెచ్చుకొని, మరొక పర్యాయం ప్రయత్నించాలని పురికొల్పండి. తప్పటడుగులు వేయకుండానే నడక నేర్వలేదు కదా.

లైంగిక విషయాలను నేనెలా చెప్పాలి?

16. బైబిలు తెల్పుదాని దృష్ట్యా, పిల్లవాడు లైంగిక సంబంధమైన విషయాలను అడిగినపుడు ఎలాంటి సమాధానములనివ్వాలి?

16 మీ బాబు వేసే ప్రశ్నలకు సమాధానాలిస్తూ, ఇంకా వాడు మాట్లాడాలని వాన్ని ప్రోత్సహిస్తారు. అయితే అకస్మాత్తుగా వాడు లైంగిక విషయాలను గూర్చి నిన్నడుగుతాడు. అప్పుడు నీవు యథార్థంగా ఉన్నది ఉన్నట్లే చెప్తావా లేక నీ చిన్న తమ్మున్ని లేక చెల్లిని ఆసుపత్రినుండి తెచ్చాం అని డొంకతిరుగుడు సమాధానమిస్తావా? పిల్లలకు సరియైన సమాధానమిస్తావా లేక పెద్దపిల్లలనుండి బహుశ అసందర్భానుసారమైన, తప్పుడు సమాధానాలిప్పిస్తావా? లైంగిక సంబంధాన్ని గూర్చి లేక లైంగిక అవయవాలను గూర్చి బైబిలు అనేక విషయాలను యథార్థంగా తెల్పుతుంది. (ఆదికాండము 17:11; 18:11; 30:16, 17; లేవీయకాండము 15:2) ఆయన వాక్యం బహిరంగంగా చదువబడుచుండగా తన ప్రజలు సమకూడే సమావేశాలను గూర్చి ఉపదేశిస్తూ దేవుడు ఇలా అన్నాడు: “పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి . . . వాటిని విని నేర్చుకొనుటకై అందరిని పోగుచేయవలెను.” (ద్వితీయోపదేశకాండము 31:12) కావున పిల్లలు అతి గంభీరమైన, మర్యాదతో కూడిన పరిస్థితులందు అట్టివాటిని వింటారు, గానీ “వీధి సంభాషణ” రూపంలో వున్నవాటిని వినరు.

17-19. లైంగిక సంబంధమైన వాటిని గూర్చి ఎలా క్రమక్రమేణి వివరించి చెప్పవచ్చును?

17 వాస్తవంగా, లైంగిక విషయాలను వివరించి చెప్పడం అనేకమంది తలిదండ్రులు అనుకునేంత కష్టమేమీ కాదు. పిల్లలువారి వివిధ శరీరాంగములను గుర్తెరిగి, ఎంతో చిన్న వయస్సులోనే వారి శరీరాలను గూర్చి తెలుసుకుంటారు. నీవు పిల్లవానికి వాటి పేర్లను చెప్పు: చేతులు, పాదాలు, ముక్కు కడుపు, పిరుదులు, శిశ్నము, యోని మొదలైనవి. నీవు లింగ సంబంధమైన మాటలు చెప్పేటప్పుడు “తడబడితే” తప్ప, ఆ చిన్న వాడేమి ఇబ్బందిపడడు. పిల్లలు ప్రశ్నలడిగిన వెంటనే ప్రతిదానిని వివరించి చెప్పవలసి వస్తుందని తలిదండ్రులు తలంచుటే ఆశ్చర్యకరంగా వుంది. నిజానికి, పిల్లవాడు వివిధ దశలలో పెరుగుతూ ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రశ్నవేస్తాడు. వాడు వివిధ దశలకు చేరుకున్నపుడు ఆ దశకు తగిన సరియైన పదజాలాన్ని, అతి సులభమైన మాటలను అందిస్తూ, సాధారణరీతిలో విషయాన్ని వివరిస్తే సరిపోతుంది.

18 ఉదాహరణకు, ‘పిల్లలు ఎలా పుడతారు?’ అని నిన్ను అడిగాడనుకో అప్పుడు నీవు, ‘వారు అమ్మ కడుపులో పెరుగుతారు’ అని సులభమైన సమాధానమివ్వొచ్చు. సాధారణంగా ఆ సమాధానం అప్పటికి సరిపోతుంది. తర్వాత మీ అబ్బాయి, ‘బాబు ఎలా బయటికి వస్తాడు?’ అని అడుగవచ్చు. అప్పుడు ‘దానికొక ప్రత్యేక ద్వారమున్నది’ అనే సమాధానం ఇస్తే అప్పటికది అతన్ని సాధారణంగా సంతృప్తిపరుస్తుంది.

19 ఇంక కొంత కాలమైన తర్వాత ‘బాబు ఎలా తయారయ్యాడు?’ అనే ప్రశ్నవేస్తాడు. నీ సమాధానం యిలా వుండవచ్చు: ‘తలిదండ్రులిద్దరు ఒక బాబు కావలెనని కోరుకుంటారు. నేలలో విత్తనం మొలకెత్తి ఒక పుష్పంగా లేక వృక్షంగా ఎలా పెరుగుతుందో అలాగే తండ్రి నుండివచ్చే బీజము తల్లినందున్న అండాణువుతో కలసినపుడు లోపల ఒక బాబు పెరగటానికారంభిస్తాడు’ కావున ఇదంతా ఒక కథానిక, ఇందులోని ప్రతి భాగం ఆ దశకు తగిన సమాధానం అప్పటికి సరిపోతుంది. అటు పిదప వాడు ‘తండ్రి బీజము తల్లిలోనికి ఏలాపోతుంది?’ అని అడుగవచ్చును. ‘మగ పిల్లవాడు ఏలావుంటాడో నీకు తెలుసు. వానికొక లింగమున్నది, ఆడపిల్ల శరీరములో యీ లింగమునకు సరిపడు రంధ్రమొకటున్నది. స్త్రీ పురుషులు లైంగికముగా ఏకమైనపుడు యీ బీజోత్పత్తి జరుగుతుంది. ఆ విధంగా జరగటానికే మనుష్యులు సృష్టింపబడ్డారు, అప్పుడు పిల్లలు తల్లిగర్భంలో పెరుగుటకారంభిస్తారు. చివరికి వారు శిశువులుగా బయటికి వస్తారు.’ అని నీవు సులభరీతిలో చెప్పవచ్చును.

20. తమ పిల్లలకు లైంగిక విషయాలను గూర్చి వివరించే తలిదండ్రులుగా ఉండుట ఎందుకు ఉత్తమమైంది?

20 తప్పుడు కథలు లేక “తడబడు” సమాధానం వలన కలిగే అసంతృప్తికన్న యథార్థంగా చెప్పే యీ సమాధానం నిశ్చయంగా ఉత్తమమైంది. (తీతు 1:15 పోల్చండి.) ఒకరినొకరు ప్రేమించుకొని బిడ్డను ప్రేమించి పోషిస్తామనే బాధ్యతను చేపట్టిన వివాహదంపతుల నుండి మాత్రమే ఎందుకు పిల్లలు వస్తారో వారు కారణసహితంగా వీరితో వివరంగా చెప్తారు గనుక తలిదండ్రుల నుండి సత్యాలను విని తెలిసికొనుట పిల్లలకు ఉత్తమం. పిల్లవాడు, అపవిత్రంగా కనబడు ధోరణిలో నేర్చుకొనుటకన్నా ఇది విషయాన్ని సంపూర్ణంచేసి, మంచి ఆత్మీయ స్థితిలో వుంచుతుంది.

జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన పాఠాలను నేర్పుట

21. పిల్లలకున్న ఏ స్వభావం దృష్ట్యా తలిదండ్రులు తమ పిల్లలకు మంచి మాదిరియుంచుట ప్రాముఖ్యమేనా?

21 యేసు ఒకసారి తన తరమువారిని ఇలా పోల్చాడు: “సంత వీధులలో కూర్చునియుండి—మీకు పిల్లనగ్రోవి ఊదితిమిగాని మీరు నాట్యమాడరైతిరి; ప్రలాపించితిమి గాని మీరు రొమ్ముకొట్టుకొనరైతిరని తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలియున్నారు.” (మత్తయి 11:16, 17) పిల్లల ఆటలు, పెద్దవారు చేసుకునే, వారి పండుగలను, అంత్యక్రియల కార్యక్రమాలను పోలివుంటాయి. అనుకరణ అనేది పిల్లలకు సహజసిద్ధం గనుక శిశు శిక్షణలో తలిదండ్రుల ఆదర్శం ఎంతో శక్తివంతమైన పాత్రను నిర్వహిస్తుంది.

22. తలిదండ్రుల ప్రవర్తన పిల్లలపై ఎట్టి ప్రభావం కల్గియుండవచ్చును?

22 ఇక పుట్టిన నాటినుండి, నీ పసివాడు నీ ద్వారానే నేర్చుకుంటాడు, నీవు చెప్పే దాన్నిబట్టి మాత్రమే గాక నీవెలా చెబుతున్నావో దాన్నిబట్టి మాట్లాడేటపుడు నీవుపయోగించే స్వరాన్నిబట్టి: అనగా అది ఆ పిల్లవానితోనేగాని నీ జతతోనేగానీ మరియు ఇతరులతోనేగానీ ఎవరితో మాట్లాడినను సరే దాన్ని అతడు నీనుండి నేర్చుకుంటాడు. తలిదండ్రులు కుటుంబంలోని ఇతర సభ్యులతోను, సందర్శకులతో ఒకొక్కరితో వ్యవహరించు పద్ధతిని వాడు పసిగడతాడు. నీ పిల్లవాడు నడుచుట, లెక్కలు చెప్పుట, అ, ఆ, ఇ, ఈలు నేర్చుకొనుటకంటె యీ విషయాల్లో నీవు చూపే మంచి మాదిరి అంతకంటె శ్రేష్ఠమైన గుణపాఠాన్ని వానికి నేర్పగలదు. అది జ్ఞాన వివేచనలకు పునాదివేసి, వాస్తవమైన సంతోషభరితమగు జీవితాన్ని గడపడానికి నడిపిస్తుంది. పిల్లవాడు పెరిగి, పెద్దవాడై భాష, చదువునేర్చుకునే వయస్సుకు వచ్చినపుడు నీతి సూత్రాలను వినడానికి నీవు చూపిన మాదిరి అతనికి సహాయపడగలదు.

23, 24. తలిదండ్రులు, తమ పిల్లలు కొన్ని నియమాల ప్రకారం నడుచుకోవాలని కోరితే, తామేమి చేయడానికి ఇష్టాన్ని వ్యక్తపరచాలి?

23 “మీరు ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి నడుచుకొనుడి,” అని అపొస్తలుడు క్రైస్తవులకు ఉపదేశించాడు. దేవుని పోలి నడుచుకొనుటకేమి కావాలో తెలియజేస్తూ, దీనికంటెముందు యిలా అన్నాడు: “సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించినప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. కావున మీరు ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి నడుచుకొనుడి . . .” (ఎఫెసీయులు 4:31, 32; 5:1,, 2) శిశువు వినేమాటలు లేక తాను కళ్లారా చూసే పనులు, కోపాన్ని సూచించేవైతే, అంటే పెడబొబ్బలు, అరుపులు, సణుగుడు గొణుగుళ్లతో కూడిన కోపతాపాలు మొదలైనవాటిని వాడు వింటే, అవి అతనిలో చెరగని ముద్రవేస్తాయి. మరి నీ నైతిక లక్షణములు ఉన్నతమైనవై, నీ నీతి సూత్రాలు ఉత్తమములైతే నీ బిడ్డకూడ వాటిని అనుకరిస్తాడు. నీ పిల్లలు ఫలాని విధంగా చేయాలని నీవు ఆశించేరీతిగా నువ్వూ చేసి చూపాలి. నీ పిల్లలు ఎలా నడుచుకోవాలని నీవు కోరుకుంటావో ఆ పద్ధతిలో నువ్వూ నడుచుకోవాలి.

24 తలిదండ్రులకు రెండు నియమాలుండకూడదు, చెప్పడానికొకటి చేయడానికొకటి, ఒకటి పిల్లలకొరకు, మరొకటి తమకొరకు వుండకూడదు. నీవే అబద్ధమాడుచు, నీ పిల్లలను అబద్ధమాడకూడదని చెప్పడంలో ప్రయోజనమేమిటి? నీవే వారికి చేసిన వాగ్దానాలను నెరవేర్చకపోతే, వారుచేసిన ప్రమాణాలకు వారు కట్టుబడి యుండాలని నీవనుకుంటావా? తలిదండ్రులిద్దరూ పరస్పర గౌరవం చూపుకొనకపోతే, వారి పిల్లలు మర్యాద నేర్చుకోవాలని వారెట్లు ఎదురు చూస్తారు? అమ్మగానీ నాన్నగానీ వినయం చూపినట్లు పిల్లవాడెప్పుడూ గమనించకపోతే, వాడెలా వినయస్థుడౌతాడు? తలిదండ్రులు వారు చేసే ప్రతీది సరియైనదనే తలంపును కల్గించడంలో తీవ్రమైన అపాయముంది. ఎందుకంటే తలిదండ్రులు చేసే ప్రతీదీ మంచిదేనని వాడనుకుంటాడు—తలిదండ్రులు అసంపూర్ణమైన, పాప సహితమైన క్రియలను తప్పుడు పనులను చేసిననూ అవి సరియైనవేనని వాడనుకుంటాడు. చెప్పిచేయకుండ వుండేవారు వేషధారులైన పరిసయ్యులను పోలియున్నారు, యేసు పరిసయ్యులను గూర్చి ఇలా అన్నాడు: “వారు మీతో చెప్పువాటి నన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియలచొప్పున చేయకుడి; వారు చెప్పుదురే గాని చేయరు.” కావున తలిదండ్రులారా, మీ కుటుంబంలో చిన్న పరిసయ్యులు ఉండ కూడదని మీరనుకుంటే మరి మీరు మాత్రం పెద్ద పరిసయ్యులు కావద్దు.—మత్తయి 23:3.

25. ప్రేమనుగూర్చి పిల్లలకెలా ఉపదేశించాలి?

25 మొదట ఇతరులు కనబరచే ప్రేమను చూచే తదుపరి పిల్లలు నేర్చుకుంటారు, మరి వారైతే ప్రేమనుపొంది, దాన్నిబట్టి ఇతరులను ప్రేమించడం నేర్చుకుంటారు. ప్రేమను కొనలేము. తలిదండ్రులకు బహుమానాలు యివ్వవచ్చు. అయితే ప్రేమ ముఖ్యంగా ఆత్మీయ సంబంధమైంది, అది హృదయానికి సంబంధించింది, కానీ అది జేబులో పెట్టుకునే పుస్తకం కాదు, వాస్తవమైన ప్రేమకు ఎలాంటి బహుమతులైనను ఎన్నటికిని సాటిరావు. ప్రేమను కొనడానికి నీవు ప్రయత్నిస్తే అది చౌకబారిపోతుంది. వస్తువులిచ్చుటకన్న, నిన్ను, నీ సమయాన్ని, నీ శక్తిని, నీ ప్రేమను అర్పించుకొనుట మంచిది. తిరిగి నీవూ ఆలాగే పొందుతావు. (లూకా 6:38) దేవుని యెడల మనకున్న ప్రేమను గూర్చి 1 యోహాను 4:19 ఇలా తెల్పుతోంది: “ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము.”

26, 27. ఇచ్చుట మూలంగా వచ్చే సంతోషము ననుభవించడానికి పిల్లలకెలా ఉపదేశించవచ్చును?

26 పిల్లలు పుచ్చుకొనుటవలన ఇచ్చుట నేర్చుకొనగలరు. ఇచ్చుటలో, పరిచారం చేయుటలో, పనులలో భాగం వహించుటలోగల ఆనందాన్ని గూర్చి నేర్చుకొనుటకు వారికి సహాయపడవచ్చు. నీకు, ఇతర పిల్లలకు, పెద్దవారికి యిచ్చుటలో సంతోషమున్నదని వారు గ్రహించడానికి తోడ్పడండి. తరచూ పెద్దలు, పిల్లలిచ్చే బహుమతులను తీసుకోరు, తీసుకోకుండ వారి వస్తువులను వారియొద్దనే ఉంచుకోవాలని చెప్పుట ప్రేమచూపుటేయని వారు పొరబడుతున్నారు. ఒక వ్యక్తి ఇలా అన్నాడు:

“నా కుమారుడు తాను తినే మిఠాయి పెట్టినపుడు నేను తీసుకునే వాన్ని కాను. అది అతనికెంతో ఇష్టమైన వస్తువు అని నాకు తెలుసు గనుక దాన్ని తీసికోకుండ వుండటమే ప్రేమ చూపినట్లని నేను తలంచాను. నేను వద్దని అన్నపుడు వాడు దానినంతటిని తన యొద్దనే వుంచుకున్నాడు గానీ వాడు సంతోషించినట్లు నాకు కనబడలేదు. అప్పుడు నేను వాని దాతృత్వమును, వాడిచ్చే బహుమానములను, వానినే తిరస్కరిస్తున్నట్లు గ్రహించాను. ఆ తర్వాత నేను వాడిచ్చే వాటన్నిటిని స్వీకరిస్తూ, ఇచ్చుటలోగల సంతోషాన్ని వాడనుభవించేలా చేశాను.”

27 ఒక కుటుంబంలోని తలిదండ్రులు తమ పసివాడు బైబిలులోని 1 తిమోతి 6:18 నందు వ్రాయబడిన ‘ఔదార్యము, ఇతరులకు పాలిచ్చుట’ అని వర్ణించబడినవారిలా ఉండటానికై అతనికి సహాయపడాలని కోరుకున్నారు. కావున, బైబిలు పఠనం జరిగే కూటానికి హాజరైనపుడు వారు వేయదలచిన చందా డబ్బును ఆ పిల్లవాని చేతికిచ్చి ఆ చందా పెట్టెలో వేయమని చెప్పేవారు. ఇలా చేయడంవలన, ఆత్మీయ విషయాలకు చేయూతనిచ్చుటలోని విలువలను, ఇందుమూలంగా భౌతికావసరతలు ఏమైనా వుంటే వాటిని తీర్చుకోవడానికి సహాయపడుటలోగల విలువను వాడు గ్రహించగలిగాడు.

28, 29. తప్పులు ఒప్పుకొని క్షమాపణ అడిగే ప్రాముఖ్యతను గూర్చి పిల్లలకెలా బోధించవచ్చును?

28 మంచిమాదిరి చూపడంవల్ల సరియైన ఉపదేశం చేసినపుడు పిల్లలు ప్రేమించుటను ఔదార్యము చూపుటను ఎలా నేర్చుకొనగలరో అలాగే, తగిన సమయంలో తప్పులను ఒప్పుకొని క్షమాపణ అడుగుటను కూడా నేర్చుకొనగలరు. ఒక తండ్రి ఇలా అన్నాడు: “నేను నా పిల్లల విషయంలో తప్పు చేసినపుడు ఆ తప్పును వారి ఎదుటనే ఒప్పుకుంటాను. నేనెందుకు పొరపాటు చేశానో అదెందుకు తప్పో క్లుప్తంగా వారికి చెప్తాను. నేను పరిపూర్ణుడను కాదని, వాళ్లను అర్థం చేసుకుంటానని ఎరిగి వారు తమ తప్పులను నా ఎదుట ఒప్పుకొనుటకు అప్పుడు సులభంగా వుంటుంది.” ఇలాంటి అభిప్రాయాన్ని వర్ణిస్తూ జరిగిన ఒక సంఘటనలో, ఒకసారి ఒక కుటుంబాన్ని ఒకాయన దర్శించాడు. అప్పుడు తండ్రి కుటుంబ సభ్యులనందరికి ఆయనకు పరిచయం చేశాడు. ఆ సందర్శకుడు ఇలా వాఖ్యానించాడు:

“అక్కడున్నవారంతా పరిచయం చేయబడ్డారు. పిమ్మట చిరునవ్వుతో ఒక చిన్నవాడు ఆ గదిలోనికి వచ్చాడు. అప్పుడు తండ్రి ‘ఆ చొక్కామీద జామ్‌ పడింది చూడండి వాడే మా చిన్నకొడుకు’ అని పరిచయం చేశాడు. అప్పుడా బాలుని చిరునవ్వు మాయమైంది. వాడు బాధపడినట్లు వాని ముఖ కవళికల్లో కనబడింది. ఆ కలవరపాటులో వానికి కన్నీళ్ళు వచ్చే సూచనలను తండ్రి గమనించి వెంటనే వానిని తనవైపు లాగుకొని వానితో ‘నేనలా అనకూడదుకదా, నన్ను క్షమించు’ అని అన్నాడు. వాడు క్షణం వెక్కివెక్కి ఏడ్చి వెంటనే వెళ్ళిపోయి త్వరలోనే మరల పెద్దనవ్వుతో తిరిగివచ్చాడు—ఇప్పుడు వాడు శుభ్రమైన చొక్కా తొడుగుకొని వచ్చాడు.”

29 అలాంటి వినయంవల్ల అనురాగ బంధాలు నిశ్చయంగా బలపడతాయి. తర్వాత తండ్రి వానితో జీవిత సమస్యలను, అవి చిన్నవే గానీ పెద్దవేగాని సమదృష్టితో వాటిని చూడాలని వివరించవచ్చు. చిన్నవాటిని తీవ్రమైనవిగా భావించకూడదని, తమకు తామే నవ్వుకొని ఆనందించగల శక్తిమంతులౌనట్లు, వారేమి పరిపూర్ణులుకారు గనుక ఇతరులు పరిపూర్ణులై వుండాలని ఎన్నడును కోరుకొనకూడదని పిల్లలు నేర్చుకొనేలా తండ్రి వారికి తోడ్పడవచ్చును.

కొన్ని వాస్తవ విలువలను వారికనుగ్రహించుట

30-32. తలిదండ్రులు వారి పిల్లలకు జీవితవాస్తవ విలువలను గుర్తించేటట్లు బాల్యంనుండియే వారికి నేర్పించుట కారంభించుట ఎందుకు ముఖ్యము?

30 ఈనాడు అనేకమంది తలిదండ్రులకు జీవితపు వాస్తవ విలువలేమిటో తెలియక తికమకపడుతున్నారు. తత్ఫలితంగా, అనేకమంది తమ పిల్లలకు ఎప్పుడూ జీవితపు వాస్తవ విలువలను అందించలేకపోతున్నారు. కొంతమంది తలిదండ్రులు వారి పిల్లల అభిప్రాయాలను మార్చే హక్కు తమకుందాయని అనుమానిస్తున్నారు. మరి తలిదండ్రులు మార్చలేకపోతే ఇతర పిల్లలు, పొరుగువారు, సినిమాలు, దూరదర్శిని వంటివి వారిని మార్చుతాయి. తరాల అంతరాలు, యౌవనస్థుల తిరుగుబాట్లు, మత్తుపదార్థాలను సేవించుట, నూతన నైతిక పద్ధతులు మరియు లైంగిక విషయాల్లో తీవ్రమైన మార్పులుచేయుట—ఇవన్నీ తలిదండ్రులను భయాబ్రాంతులను చేస్తున్నాయి. అయితే వాస్తవమేమంటే, ఇవన్నీ తన జీవితంలో తలెత్తకమునుపే వాని వ్యక్తిత్వం కొంత వరకు అభివృద్ధి చెందియున్నది.

31 ఒక విజ్ఞానశాస్త్ర పత్రికలో వెలువడిన అధ్యాయనాలు తెలిపేదేమంటే “పాఠశాలకు వెళ్లకమునుపే శిశువు వ్యక్తిగత స్వభావం అప్పటికే ఎంతో స్థిరపడింది. పాఠశాలకు వెళ్లే వయస్సు లేని పిల్లలు అమితంగా గ్రహించగల్గి, మార్పుచేయడానికి సులభమైన వారని అనుకొనుట సర్వసాధారణమే . . . అయినను, వారు చిన్నతనంలో చూపిన అభిప్రాయాలు, పొందిన అనుభవాలు తరుచు చిరస్థాయిగా, మరికొన్ని సార్లు మారని విధంగా నిలిచిపోవు ప్రవర్తనా పద్ధతులౌతాయని మేం పరిశోధన ద్వారా తెలుసుకున్నాము.”

32 తప్పుడు అలవాట్లను మార్చగలం, కానీ ప్రశస్తమైన సంవత్సరాలు ఊరకనే అలా జారిపోనిస్తే ఎంత అనర్థమో మరొక పరిశోధకుడు యిలా వివరిస్తున్నాడు: “శిశువు తన మొదటి ఏడు సంవత్సరాలలో మార్చ వీలగునట్లుగా వుంటాడు, అయితే కాలయాపన చేస్తే, వాని పరిస్థితిని మార్చుట కష్టతరం కావచ్చు—మారవచ్చుననే భావన ప్రతి సంవత్సరం తగ్గిపోతూ వుంటుంది.”

33. పిల్లల కుపదేశించవలసిన అతి ముఖ్యమైన నీతి సూత్రాలేవి?

33 చిన్నపిల్లలు ఎన్నో ముఖ్యమైన సూత్రాలను నేర్చుకోవాలి, అయితే అత్యంత ప్రాముఖ్యమైనవేమనగా, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది సరియైంది, ఏది తప్పు అనేవే. అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘ క్రైస్తవులకు వ్రాస్తూ వారు అనుభవజ్ఞానం సంపాదించుకోవాలని వారికిలా ఉపదేశించాడు: “మనమిక మీదట పసిపిల్లలమై యుండి, మనుష్యుల మాయోపాయములచేత వంచనతోను, తప్పుమార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగురగొట్టబడినవారమైనట్లుండక, ప్రేమగలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము.” (ఎఫెసీయులు 4:13-15) చిన్నవారు, సత్యం యథార్థత ఎడల ప్రేమను కనబరచుట సరియైనదే, మంచిదాని ఎడల ప్రేమకల్గియుండుటకు నేర్పించుటలో తలిదండ్రులు జాప్యం చేస్తే తప్పే. పొరపాట్లు చేయుటలో ఆటంకం ఏమీ ఉండదు. తలిదండ్రులు దీన్ని గ్రహించేలోపల పాఠశాలకు వెళ్లడానికి ముందున్న సంవత్సరాలు ఎగిరిపోతాయి. ఆ సంవత్సరాలను వూరకనే జారవిడువవద్దు, నీ పిల్లలకు జీవిత వాస్తవాలను కొన్నింటిని ఉపదేశించడానికి మొదట ఆ ప్రాముఖ్యమైన, చక్కదిద్దగల సంవత్సరాలను సద్వినియోగం చేయండి. అప్పుడు నీవు రాబోవు కాలంలో బాధపడకుండ వుండగలవు.—సామెతలు 29:15, 17.

34. స్థిరమైన నియమాలెందుకు ప్రాముఖ్యం, అలాంటి నియమాలకు శ్రేష్ఠమైన మూలమేది?

34 “ఈ లోకపు నటన గతించుచున్నది” అని ప్రేరేపితుడైన అపొస్తలుడు వ్రాశాడు, మరియు అది ఈ లోకవస్తురూపక, భావోద్రేక, నైతికవిలువల విషయంలో నిశ్చయంగా వాస్తవమే. (1 కొరింథీయులు 7:31) లోకంలో ఎంతో అస్థిరత ఉంది. తాము మానవులైవున్నందున యీ విషయంలో తాముకూడ తప్పిపోవచ్చునని తలిదండ్రులు గుర్తించాలి. తలిదండ్రులు నిజంగా వారి పిల్లలయెడల అత్యంత శ్రద్ధాశక్తులు కల్గియుండి, వారి భవిష్యత్‌ సంతోషాన్ని గూర్చిన శ్రద్ధకల్గివుంటే, వారి పిల్లలకు స్థిరంగా విలువగల కొన్ని నియమాలను గూర్చి చెప్తారు. ఏ ప్రశ్నవచ్చిననూ, ఏ సమస్యకు పరిష్కారం కావలెనన్ననూ, దేవుని వ్రాతపూర్వకమగు బైబిలు సమాధానాలిస్తుందని, అవి తీర్మానపూర్వకమైనవని, అత్యంత సహాయకరమైనవని తలిదండ్రులు పిల్లలకు బాల్యమునుండియే ఉపదేశించుట ద్వారా దీనిని చేయవచ్చును. కొన్నిసార్లు జీవితంలో పరిస్థితులెంత కలవరపరచేవిగాను అగమ్యగోచరంగానూ వున్ననూ, ఆ వాక్యం ‘వారి పాదములకు దీపమును, వారి త్రోవకు వెలుగునై’ వుంటుంది.—కీర్తన 119:105.

35. పిల్లలకు తర్ఫీదునిచ్చుట ఎంత ప్రాముఖ్యం?

35 అవును, నీ పిల్లల జీవితమంతటిలోను వారిని కాపాడగల విలువైన సూత్రాలను నిర్మించుటకు ఆరంభించగల అత్యంత విలువైన అవకాశమిదే. నీ పిల్లలకు తర్ఫీదునివ్వడంకన్న గొప్ప ఉద్యోగమే లేదు, ఏ పని అంత ప్రాముఖ్యమైందికాదు. వారు పుట్టినవెంటనే, బాల్యం నుండియే వారికి తర్ఫీదునివ్వడానికి అనుకూల సమయమిదే!

[అధ్యయన ప్రశ్నలు]

[117వ పేజీలోని చిత్రం]

నేర్చుకోవడాన్ని ఒక ఉల్లాసకరమైన అనుభవంగా చేయండి