కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వార్ధక్యదశ

వార్ధక్యదశ

అధ్యాయము 13

వార్ధక్యదశ

1, 2. (ఎ) పిల్లలు పెద్దవారై వెళ్లిపోయిన తదుపరి ఏ సమస్యలు రావచ్చును? (బి) వృద్ధాప్యం వచ్చేకొలది ఆ సమస్యలను కొందరెలా తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు?

మన జీవితం ఏదొకక్రియతో అంటే, భౌతిక సంబంధమైన క్రియతోనేగాని, మానసిక సంబంధమైన క్రియతోనేగాని నిండియుండకపోతే మనకు విసుగు వస్తుంది. జీవితం శూన్యమై, మనం అశాంతితో నిండియుంటాం. పిల్లలు పెరిగి పెద్దవారై ఇల్లువదలి వెళ్లినపుడు దంపతులకు కొన్నిసార్లు ఇదొక సమస్యగా తయారౌతుంది. గతించిన సంవత్సరాలన్నీ తలిదండ్రులుగా వారి జీవితం ఎన్నో బాధ్యతలతో నిండియుండెను. ఇప్పుడు ఇక, కుటుంబాన్ని పోషించే బాధ్యతంతా ఒక్కసారి అకస్మాత్తుగా ఆగిపోవలసి వుంటుంది.

2 దానితోపాటు, సంవత్సరాలు గడిచే కొలది, శరీరం మార్పు చెందడాని కారంభిస్తుంది, శరీరంపై ముడతలు ఏర్పడతాయి, వెంట్రుకలు నెరసిపోవడానికి కారంభిస్తాయి. వెంట్రుకలు ఊడిపోవడానికి ఉపక్రమిస్తాయి, ఎన్నడూ ఎరుగని బాధలు, నొప్పులు ఆరంభమౌతాయి. అసలు కారణమేమంటే మనం వృద్ధాప్యానికి చేరుకుంటున్నాం. జీవిత వాస్తవాలను ఎదుర్కోవడానికి తిరస్కరిస్తూ కొందరు, ముందటికన్న ఇప్పుడే యౌవనస్థులుగా ఉన్నట్లు కనబడటానికి వారు విశ్వప్రయత్నం చేస్తారు. తక్షణమే వారు సాంఘిక కార్యకలాపములలో ప్రవేశిస్తారు—అనగా కొన్ని సంస్థలలో చేరిపోవడం, క్రీడలలో పాల్గొనడం లాంటివి చేస్తారు. ఇలా చేయడంవల్ల, ఏదో ఒక పనిలో నిమగ్నులై వుండటానికి అవకాశం లభిస్తుంది, కాని ఇది శాశ్వతకాల సంతృప్తినివ్వగలదా? తన జీవితానికి వాస్తవమైన ధ్యేయమున్నదనడానికి, ఆ పని అతనికి నిజంగా అవసరమున్నట్లు స్ఫురింపజేస్తుందా?

3. వినోదం ఆనందదాయకమైనప్పటికీ, ఇందులో దేనిని విడిచిపెట్టాలి?

3 వినోదం ఆనందించదగినది, వాస్తవమే. నీ పిల్లలు చిన్నవారై యున్నపుడు నీవు చేయలేని కొన్ని పనులు నీ వృద్ధాప్యంలో చేయడానికి నీకు సమయం ఉండవచ్చు. అయితే వినోదాన్ని ముఖ్యమైందిగా పరిగణించడంవల్ల అది తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది.—2 తిమోతి 3:4, 5; లూకా 8:4-8, 14.

నమ్మకస్థునిగా రుజువు పరచుకొనుటలోగల సంతృప్తి

4, 5. వృద్ధుడు తాను ఇంకను స్త్రీలచేత ఆకర్షింపబడాలని తలస్తే ఏమి సంభవించగలదు?

4 జీవితంలోని యీ దశలో కూడ అనేకులు ఎదుటి వ్యక్తికి యింకా ఆకర్షణీయంగా కనబడాలని తలస్తుంటారు. ఇలా చేయడానికి, వారు సభలలోను, ఇతర స్థలాల్లో సరసాలాడుతుంటారు. ప్రత్యేకంగా పురుషులు యౌవన స్త్రీలతో “అక్రమ సంబంధాన్ని” కొనసాగిస్తారు, మరి “నూతన నైతికత్వం” అనే నినాదమున్న ఈ కాలంలో కొందరు స్త్రీలు కూడ కొంతవరకు పరపురుషులతో “అక్రమ సంబంధాలను” కల్గివున్నారు. వివాహమై చాలా సంవత్సరాలు గడచిననూ, కొందరు “క్రొత్త జతతో,” “క్రొత్త జీవితంలో” కులుకుతూ వుండాలని ఉబలాట పడుతుంటారు. తన జతచేసే తప్పులను వ్రేలెత్తిచూపుతూ, తాము చేసేపనిలో దోషములేదని నిరూపించ యత్నించవచ్చు. సాధారణంగా ఇలాంటివారు వారి జతకు, నీతి సూత్రాలకు ద్రోహం చేస్తూ, నమ్మకత్వాన్ని పోగొట్టుకొని వారి స్వంత తప్పిదాలను తేలికగా పరిగణిస్తారు.

5 యేసు చెప్పిన యీ విషయం వారికితెలిసే ఉండవచ్చు: “వ్యభిచారము [పోర్నియా: ఘోరమైన లైంగిక దుర్నీతి] నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడు.” “ప్రతి కారణమునుబట్టి” విడాకులివ్వకూడదని యేసు చెబుతున్నప్పటికీ తమ దేశచట్టం అనుమతించేమేరకు ఏ విధంగానైనా విడాకులివ్వడానికి వారు ఇష్టపడుతున్నారు. (మత్తయి 19:3-9) అప్పుడు వారు క్రొత్తవారిని తెచ్చుకుంటారు, సాధారణంగా విడాకులు ఇవ్వకమునుపు ఎవరితో అక్రమ సంబంధాన్ని కల్గియున్నారో అట్టివారినే వీరు ఇప్పుడు వివాహమాడతారు. దేవుని వాక్యం అలాంటి ప్రవర్తనను ఖండిస్తుందని ఎరిగియుండికూడ దేవుడు కరుణామయుడు తన పరిస్థితిని ఆయన “అర్థం చేసికుంటాడు” అని వారు తలంచవచ్చు.

6. వివాహ ఒప్పందాన్ని అగౌరవపరచే క్రియను యెహోవా దేవుడెలా పరిగణిస్తాడు?

6 అట్టి అవినీతితో కూడిన ఆలోచనవల్ల మోసగించబడకుండేలా మనం, యెహోవా తన ప్రవక్తయగు మలాకీ ద్వారా ఇశ్రాయేలీయులకు చెప్పినదాన్ని లక్ష్యపెట్టాలి: “యెహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోను కన్నీళ్లతోను రోదనముతోను తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు, తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయు నున్నాడు. అది ఎందుకని మీరడుగగా, యౌవనకాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి యాయెను . . . కాగా మిమ్మును మీరే జాగ్రత చేసికొని, యౌవనమున పెండ్లి చేసికొనిన మీ భార్యల విషయములో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ యని ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.” (మలాకి 2:13-16) అవును, భార్యను మోసగించడం, వివాహ ఒప్పందాన్ని అగౌరవపరచడం మొదలైన క్రియలను దేవుడు ఖండిస్తున్నాడు. తద్వారా జీవదాతతో వారికిగల సంబంధం తెగిపోతుంది.

7. వివాహ కట్టుబాటునకు అగౌరవం చూపడం ఎందుకు సంతోషాన్నివ్వజాలదు?

7 శ్రేష్ఠమైన జీవితానికున్న మార్గమిదేనా? కానేకాదు. అలాంటి వ్యక్తులు చేసుకునే క్రొత్తపెండ్లి, కదిలే నేలపై వుంది. ఒకటి మాత్రం నిజం, అదేమంటే, ఇంత ప్రశస్తమైన సంబంధంలో సభ్యులుగా వారు పరిగణింపబడ నేరరని వారు రుజువుపరచుకొని యున్నారు, నిజమే ముందున్న వ్యక్తిలో లేని ఆకర్షణ ఏదో యీ క్రొత్త జతలోవారు చూచియుండొచ్చు. అందుకే అట్టిదాన్ని అనుభవించడానికి వారు తమ జతకు వేదన, బాధ కలిగిందని లెక్క చేయకుండానే తమ స్వంతసుఖాన్ని అపేక్షించారు. నిశ్చయంగా ఇది వివాహ జీవితంలో సంతోషాన్ని పొందడానికి చూపే లక్షణం కాదు.

8. వివాహ జీవితంలో శరీర సౌందర్యంకన్న మిన్నయైనదేది?

8 తన వివాహజతతో నమ్మకంగా కాపురం చేయడమే ఎటువంటి శరీరసౌందర్యంకన్న మిన్నయైంది. శరీరసౌందర్యాలు సంవత్సరాలు గడిచేకొలది సన్నగిల్లిపోతాయి. కానీ ఇద్దరిమధ్య గల యథార్థతతో కూడిన అనుబంధం ప్రతి సంవత్సరం పెరుగుతూ వుంటుంది. ఇతరుల సంతోషాన్ని కోరి, వారికున్న ఆశలను నీకంటె ముందుగా తీర్చుటవలన శాశ్వత సంతృప్తి కల్గుతుంది, ఎందుకంటే, “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము,” అనేది సత్యం. (అపొస్తలుల కార్యములు 20:35) ఇద్దరు వివాహమాడి ఎన్నో సంవత్సరాలైతే, పరస్పరంగా ఇద్దరూ ఒకరితోనొకరు సంభాషించుకుంటూ, మంచితనముతో వారిద్దరు కలిసి కష్టసుఖాల్లో సాధకబాధలలో పాలుపొందితే, దీనిని ప్రేమతో సాధిస్తే వారి జీవితాలు నిజంగా ఏకమై ఒకటిగా కలిసిపోతాయి. వారి మానసిక భావోద్రేక, ఆధ్యాత్మిక చింతన ఒక్కటే. వివాహానికి ముందున్న తప్పిదాలు వారి ప్రేమకలాపాలవలన కొంతవరకు కప్పివేయబడినందున ఇప్పుడు వారు ఒకరి తప్పులొకరు గమనించే అవకాశం లభించినపుడెల్ల వాటిని క్షమించడానికి, అవసరాలు తీర్చుకోవడానికి ఇది మార్గమేర్పరస్తుంది. వారిద్దరి మధ్య నిజమైన నమ్మకము, భద్రత వున్నాయి, ఏ సమస్యలు వచ్చినను ఒకరికొకరు తోడునీడగా జీవించగలరని వారికి తెలుసు. వారి దృష్టిలో వారిద్దరు ఒకరికొకరు నమ్మకంగా జీవించుటే వారికున్న సహజత్వం. మీకా 6:8 ఇలా తెల్పుతుంది: “మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సుకలిగి నీ దేవునియెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు?”—మార్జినల్‌ రీడింగ్‌.

ఎదిగిన పిల్లలు—ఒక క్రొత్త సంబంధం

9-11. (ఎ) తలిదండ్రులు, పిల్లలు జీవితాంతం కలిసి వుండాలని దేవుని సంకల్పమా? (బి) తలిదండ్రులు తమ ఎదిగిన పిల్లలకిచ్చే సలహాపై ఇదెటువంటి ప్రభావం కల్గివుంది? (సి) వారి పిల్లలకు వివాహమైనపుడు, తలిదండ్రులు ఎవరి యాజమాన్యాన్ని గౌరవించాలి?

9 భార్యాభర్తలు జీవితాంతం కలిసి జీవించాలనే ఏర్పాటు ఉన్ననూ, పిల్లలు తలిదండ్రులు ఆలాగే ఎల్లప్పుడూ కలిసి జీవించాలని సృష్టికర్త సంకల్పించలేదు. నిజమే మీ పిల్లలు ఎదుగుతున్నపుడు ప్రతిరోజు మీ అవసరత వారికి కావలసియుండెను. వారికి భౌతికావసరాలేగాక, నడిపింపు కూడ అవసరమైయుండెను. వారు నీ మాట వెంటనే విననపుడు వారి క్షేమం నిమిత్తం నీవు కొన్నిటిని వారు తప్పనిసరిగా చేయాలని ఆజ్ఞాపించియుంటావు. అయితే వారి స్వంత కుటుంబాలు ఏర్పడినపుడు నీకూ వారికి గల సంబంధంలో కొంత మార్పు వస్తుంది. (ఆదికాండము 2:24) వారి ఎడల నీకున్న భావాలు మారిపోయాయని దీని అర్థం కాదు, కానీ బాధ్యతలలో కొన్ని మార్పులు వచ్చాయి. కావున వారికొరకు నీవు చేసే పద్ధతులలో మార్పులు అవసరమేగదా.

10 కొన్నిసార్లు వారికి ఇంకను సలహా అవసరమై వుంటుంది. జీవితంలో అనుభవంగల వారిచ్చే మంచి సలహాను లక్ష్యపెట్టుట జ్ఞానయుక్తం. (సామెతలు 12:15; 23:22) తమ స్వంతకాళ్లపై నిలుచున్న కుమారులకు లేక కుమార్తెలకు సలహా ఇచ్చేటప్పుడు, తీర్మానాలు చేసే బాధ్యత వారిదేనని నీకు తెలుసు అన్నట్లుగా వారు గ్రహించేలా నీవు వారికి సలహా ఇస్తే అదెంతో తెలివైన పని.

11 వారు వివాహమాడిన వ్యక్తులైతే ఇది చాల ప్రాముఖ్యం. కొన్ని దేశాలలో దీర్ఘకాలంగానున్న ఆచారం ప్రకారం పెండ్లికూతురు తన అత్త అధీనమందుంచబడుతుంది. మరికొన్ని ప్రాంతాలలో అత్తింటివారు, కుటుంబ కార్యకలాపాలను నడిపించడంలో పైచెయ్యిగా వుంటారు. అయితే ఇందువలన సంతోషం కలుగుతుందా? కుటుంబ సృష్టికర్తయైన వానికి ఏది శ్రేష్ఠమో తెలుసు, మరియు ఆయన ఇలా అంటున్నాడు: “పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును.” (ఆదికాండము 2:24) ఇప్పుడు తీర్మానాలు చేయవలసిన బాధ్యత ఇటు భర్త తలిదండ్రులమీద గాని లేదు, అటు భార్య తలిదండ్రుల మీద గానీ లేదు. ఆ బాధ్యత భర్తపై వుంది. “క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై యున్నాడు,” అని దేవుని వాక్యం చెబుతుంది. (ఎఫెసీయులు 5:23) నీ పిల్లలకు, తదుపరి నీ మనుమలు మనుమరాండ్రకు సహాయం చేయడంలో గల ఆనందం యీ ఏర్పాటునకు గౌరవమిచ్చినపుడే అధికమౌతుంది.

ఇతరులకు సహాయపడుటలో ఆనందించండి

12. (ఎ) తమ పిల్లలు వారి స్వంత కుటుంబాలలో స్థిరపడిన తదుపరి, తలిదండ్రులు ఒకరికొకరు ఎలా వారి ప్రేమను యింకను పెంపారజేసుకోగలరు? (బి) వారి జీవితాలు ఇంకను అర్థవంతం కావడానికి వారు మరేమి కూడ చేయవచ్చు?

12 మన జీవితాలు ఉపయోగకరమైనవని, అర్థసహితమైనవని మనందరం తలంచే అవసరత వుంది. మన క్షేమం నిమిత్తం యీ అవసరతను తీర్చుకొనుట ముఖ్యం. నీ పిల్లల జీవితావసరాలను తీర్చుటయేగాక నీవు సహాయపడగల ఇతరులు ఇంకా చాలమంది ఉన్నారు. నీవు వివాహమాడిన నీ జత విషయమేమిటి? నీ పిల్లలు ఎదిగేటప్పుడు నీ అవధానమంతా ఎక్కువ వారిపైనే వుంటుంది. ఇప్పుడు ఒకరికొకరు మరెక్కువగా పనిలో సహాయం చేసికొనే అవకాశముంది. ఇది మీ ఇద్దరి బంధం ఇంకా బలపడేలా చేయడానికి తోడ్పడుతుంది. అయితే నీ దయగల క్రియలు, నీ కుటుంబానికే ఎందుకు పరిమితమై వుండాలి? ఇరుగుపొరుగు వారెవరైనా వ్యాధిగ్రస్థులైతే వారికి సహాయం చేస్తూ లేక ఒంటరిగానున్న వృద్ధులతో సమయాన్ని గడుపుతూ లేక తమ తప్పిదం లేకుండా ఆర్థికావసరతగల వారికి నీ శక్తికొలది సహాయం చేయుటవలన నీవు ‘నీ చెయ్యినందించవచ్చును.’ (2 కొరింథీయులు 6:11, 12) బైబిలు, దొర్కా అనే స్త్రీని గూర్చి తెల్పుతుంది. ఆమె ఎంతో ప్రేమను సంపాదించింది, ఎందుకంటే ఆమె విధవరాండ్రకు “సత్‌ క్రియలను ధర్మకార్యములను బహుగా చేసియుండెను.” (అపొస్తలుల కార్యములు 9:36, 39) బాధపడువారికి సహాయం చేసేవారిని బైబిలు మెచ్చుకుంటుంది. (సామెతలు 14:21) ‘తలిదండ్రులు లేనివారిని, విధవరాండ్రను ఇబ్బందులలో పరామర్శించుట’ దేవునికి అంగీకృతమైన ఆరాధనలో ఒక ముఖ్యభాగమని కూడ లేఖనాలు తెల్పుతున్నాయి. (యాకోబు 1:27) మరియు బైబిలు మనందరిని ఇలా ప్రోత్సహిస్తుంది: “ఉపకారమును ధర్మమును చేయుట మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికిష్టమైనవి.”—హెబ్రీయులు 13:16.

13. ఇతరులకు సహాయం చేయడంలో ఏ దృక్పథం యోగ్యమైంది?

13 తోటి మానవులకు సేవ చేయుటలో నిమగ్నులై యుండుటయే సంతోషానికి కీలకమని దీని అర్థమా? నిజానికి ప్రేమ చూపడంలో దేవుని అనుకరించే కోరికయుంటేనే అంటే ఆత్మీయ దృష్టిగల స్వభావమైతేనే తప్ప, అది దుఃఖానికే దారితీస్తుంది. (1 కొరింథీయులు 13:3; ఎఫెసీయులు 5:1, 2) ఎందుచేత? ఎందుకంటే నీ దయను వారు అభినందించక పోతే లేదా నీ దాతృత్వమును అన్యాయంగా అలక్ష్యపరచడానికి ప్రయత్నిస్తే అప్పుడు అసంతృప్తిపొందే అవకాశాలు ఉండవచ్చు.

14, 15. ఏది నిజంగా జీవితాన్ని సంతోషభరితంచేసి, సంతృప్తినిస్తుంది?

14 అయితే ఒకడు తన జీవితాన్ని నిజంగా దేవుని సేవయందు వుపయోగిస్తున్నపుడు, తాను చేసేపని తన సృష్టికర్తకు ఎంతో ఇష్టమైందని తెలిసికొనుటలో అతనికి అత్యంత ఆనందం కల్గుతుంది, ఇతరులకు తాను సహాయపడగల తన సామర్థ్యత, ధన సహాయానికే పరిమితమైయుండదు. తాను, యెహోవాను గూర్చిన అనగా ‘శ్రీమంతుడగు దేవుని గూర్చిన సువార్తను’ దానిని ఇతరులతో చెప్పే ఆధిక్యతను కల్గియున్నాడు. (1 తిమోతి 1:11) ప్రస్తుతం జీవితసమస్యల నెలా ఎదుర్కొని పరిష్కరించుకోవాలో తాను బైబిలు ద్వారా తెలిసికున్నాడు, దేవుడు భవిష్యత్తుకొరకు ఎలాంటి మహిమగల నిరీక్షణను దాచియుంచాడో తెలిసికున్నాడు. ఆ సువార్తను ఇతరులకు అందించి, దాని మూలకారకుడైన యెహోవావైపు వారి ధ్యానాన్ని మళ్లించుటలో భాగం వహించుట ఎంత సంతోషదాయకమైయుంది! కీర్తన 147:1 నందు ప్రేరేపితుడైన రచయిత ఇలా అన్నాడు: “యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. అది మనోహరము స్తోత్రముచేయుట ఒప్పిదము.”

15 జీవాన్నిగూర్చి యెహోవా చిత్తమేమిటో మనం గ్రహించినపుడు, మనమాయనను మహిమపరచినపుడు మన జీవితాలు అర్థవంతమౌతాయి. (ప్రకటన 4:11) నీ పరిస్థితులు అనుమతించినంత వరకు, నీవు ఇతరులకు బైబిలు సత్యాన్ని గూర్చి తెలియజేయడంలో పూర్తిగా పాల్గొంటే నీకు నిజమైన సంతృప్తి కలుగుతుంది. నీ పిల్లలు పెరిగి పెద్దవారైనను, ‘ఆత్మీయ పిల్లలుగా’ అభివృద్ధి చెందేలా వారికి సహాయపడవచ్చు. వారు అనుభవంగల క్రైస్తవులు కావడం నీవు గమనించినపుడు, అపొస్తలుడైన పౌలు తాను సహాయపడిన వారికి పత్రిక వ్రాసినపుడు ఆయన సంతోషించినట్లే నీవును ఉల్లసించగలవు: “మా నిరీక్షణయైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? . . . మీరే గదా, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై యున్నారు.”—1 థెస్సలొనీకయులు 2:19, 20.

పరిస్థితులు మారినపుడు వాటికి తగినట్లు ప్రవర్తించండి

16, 17. (ఎ) సమస్యల విషయం వచ్చినపుడు, దేనిని విడిచిపెట్టాలి? (బి) తన భార్య మరణించినను, క్రొత్తగా పరిణమించు సమస్యలను ఎదుర్కోవడానికి అతనికేది సహాయపడుతుంది?

16 కొంతకాలానికి కొందరు తాము అంతకుమునుపు చేసిన పనిని ఇక చేయలేకపోతారు. వారు మారడం అవసరం. సర్దుబాటు చేసుకోవడానికి ఇష్టపడాలి. ఆరోగ్య సమస్యలున్నపుడు వీటికి అవధానమీయాలి. అయితే వీటి ఎడల సమదృష్టిని కల్గియుండాలి, వీటిలో అధికంగా నిమగ్నులై ప్రతిదినంపొందే సదవకాశాలను జార విడుచుకోకుండా జాగ్రత్తపడాలి. సమస్యలనేవి ఎప్పుడూ వుంటాయి, మరి ఏదైనా ఉపయుక్తమైన పని ఉంటే దానినొకడు చేయడం యుక్తం. విచారపడితే ప్రయోజనంలేదు, పరిస్థితులు వేరుగా వున్నవేనని చింతించినంత మాత్రాన అవి మారవు. కావున గతించిన కాలంవైపు తిరిగి చూచే బదులు ప్రస్తుతం లభించే అవకాశాలను జారవిడువవొద్దు.

17 వృద్ధాప్యంలో నీవు ఒంటరివైతే అది నీకు వర్తిస్తుంది. నీవు సంతోషభరితమైన వివాహాన్ని గడిపితే, మరువరాని సంఘటనలు నీ జ్ఞాపకస్మృతుల్లో వుంటాయి. అయితే కాలం గడిచిపోతుంది, మరి నీవిప్పుడు సర్దుబాటు చేసికోవలసివుంది. క్రొత్త క్రొత్త సమస్యలను ఎదుర్కోవలసి వుంటుంది, మరి నీవు దేవునియందు విశ్వాసాన్ని వ్యక్తపరచు రీతిగా జీవిస్తున్నట్లయితే, అలాంటి సమస్యలను ఎదుర్కొనేది నీవొక్కడివేకాదని తెలిసికో.—కీర్తన 37:25; సామెతలు 3:5, 6.

18-20. ఏవి వృద్ధాప్యంలో కూడ జీవితాన్ని అర్థవంతం చేయగలవు?

18 జీవితంలో ఒడుదుడుకులు వచ్చినపుడు మనకు అందులో సంతోషం కల్గించేవి చాలావున్నాయి—మంచి స్నేహితులు, ఇతరులకు సహాయం చేసే అవకాశాలు పొందడం, రుచిగల భోజనం చేయడం, మనోరంజితమగు సూర్యాస్తమయాన్ని తిలకించడం, పక్షుల కోలాహలాన్ని వినడం మొదలైనవి. అంతేగాక, మనం జీవిస్తున్న యీనాటి పరిస్థితులు అంత వుపయోగకరంగా లేకపోయినను, దేవుడు యీ దుష్టత్వాన్ని అంతమొనర్చి, మానవజాతి నుండి దుఃఖం, వేదన, రోగం మరియు మరణాన్ని సహితం తీసివేస్తానని ఆయన చేసిన అభయం మనకుంది.—ప్రకటన 21:4.

19 జీవితం ధనప్రాధాన్యతగలదనే దృష్టిని కల్గియున్న వ్యక్తికి వృద్ధాప్యం శూన్యంగా కనబడుతుందనుట వాస్తవమే. ఆ దృష్టితో జీవించే వారికి కల్గే ఫలితాన్ని గూర్చి ప్రసంగి అనే పుస్తక రచయిత ఇట్లు వర్ణిస్తున్నాడు: “సమస్తము వ్యర్థము.” (ప్రసంగి 12:8) అయితే అబ్రాహాము, ఇస్సాకువంటి విశ్వాసులను గూర్చి బైబిలు వారు ‘వృద్ధులై సంతృప్తితో’ వారి జీవితాలను గడిపారని తెల్పుతుంది. (ఆదికాండము 25:8; 35:29) అప్పటికి ఇప్పటికి గల తేడా ఏమైయుంది? వారికి దేవునియందు విశ్వాసముంది. దేవుడు తన నియమితకాలంలో మృతులను తిరిగి బ్రతికిస్తాడని వారు విశ్వసించారు, దేవుడు తానే మానవజాతికొరకు ఒక నీతియుక్తమైన ప్రభుత్వాన్ని స్థాపించే సమయంకొరకు వేచియున్నారు.—హెబ్రీయులు 11:10, 19.

20 నీ విషయంలో కూడ, ఈనాడున్న సమస్యలు నీ చుట్టునున్న అనేక మంచి విషయాల్లోను దేవుడు తన సేవకుల కొరకు దాచియుంచిన అద్భుతమైన భవిష్యత్తు విషయంలోను, నిన్ను అంధుణ్ణి చేయకుండా నీవు శ్రమిస్తే, నీ జీవితానికి ఒక అర్థమంటూ వుంటుంది, వృద్ధాప్యం వరకు ప్రతిదినం నీకు సంతృప్తికలుగుతుంది.

[అధ్యయన ప్రశ్నలు]

[176వ పేజీలోని చిత్రం]

ఇరువురి జీవితాలు ఎంతగా ఉడిగిపోతాయో అంతగా వారిరువురు ఏకమౌతారు