కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సంతానం కలిగియుండుట—ఒక బాధ్యత, ఒక బహుమానం

సంతానం కలిగియుండుట—ఒక బాధ్యత, ఒక బహుమానం

అధ్యాయము 7

సంతానం కలిగియుండుట—ఒక బాధ్యత, ఒక బహుమానం

1-4. (ఎ) గర్భంలోని శిశువు పెరుగుటలోగల కొన్ని వింతగొల్పే విషయాలేమిటి? (బి) వీటిని గూర్చిన జ్ఞానం నీవు కల్గియున్నపుడు కీర్తన 127:3ను నీవు గ్రహించడానికి అదెలా సహాయపడుతుంది?

పిల్లలనుకనుట ఆనందావేశం, అనుభూతితో కూడిన అపేక్ష. అది మానవజాతిలో ప్రతినిత్యమూ జరుగు వాస్తవమే. అయినను ప్రతి పుట్టుక ఆశ్చర్యంగొల్పే చిత్రవిచిత్రమైన పద్ధతివలన కల్గుతుంది. వీటిని గూర్చి మనం కొంతవరకు గ్రహిస్తే పేర్రేపితుడగు కీర్తనల రచయిత ఎందుకలా చెప్పడానికి పూనుకున్నాడో మనమింకా బాగుగా అభినందించగలం: “కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే.” (కీర్తన 127:3) ఇదెలా సంభవిస్తుందో గమనించండి.

2 పురుషుని వీర్యాణువు స్త్రీలోని అండాణువుతో సమ్మిళితమౌతుంది. ఈ రెండు అణువులు ఒకటైన తర్వాత అది విచ్ఛిన్నమగుట కారంభిస్తుంది. ఒకటి రెండు, రెండు నాలుగు, నాలుగు ఎనిమిది, యీలాగున చివరకు యీ ఒక్క అణువుపెరిగి, పెద్దవారిలో 60,00,000,00,00,000 అణువులుగా మారతాయి! మొదట క్రొత్త అణువులన్నీ ఒకే రకానికి చెందివుంటాయి తదుపరి అవి వివిధరకాలుగా మారతాయి—ఆస్తికాణువులు, కండరాణువులు, నరములాణువులు, నేత్రాణువులు, చర్మాణువులు, యీ విధంగా యింకా ఎన్నెన్నో తయారౌతాయి.

3 సంతానోత్పత్తి మరియు విభిన్నమార్పులను గూర్చి కొన్ని మర్మాలు బయల్పడినవి, అయినను తెలిసికోవలసినవి ఎన్నో ఇంకను మిగిలిపోయినవి. ఆ తొలి అణువును విచ్ఛిన్నం చేసేదేమిటి? అది విచ్ఛిన్నమగుట కారంభము కాగానే అణువులను వివిధరకాలుగా మార్చేదేమిటి? కాలేయం, ముక్కు, చిన్నబొటనవ్రేలు మొదలగునవి తయారుకావడానికి, ప్రత్యేక ఆకృతిలోను పరిమాణములలోను పనులలోను యీ వివిధరకాలను కలిపేదేమిటి? ఈ మార్పులు నిర్ణీతకాలంలో మార్పుచెందుట కారంభిస్తాయి. వాటి కాలమానములు దేని స్వాధీనమందున్నవి? మరియు తల్లిగర్భంలో పెరిగే యీ పిండం దాని తల్లికి వేరై ప్రత్యుత్పాదనతో తయారైన ఒక శరీరమైయుంది. సర్వసాధారణంగా ఆమె శరీరము పరులనుండి వచ్చు చర్మపు అతుకులు లేదా అవయవ మార్పిడివంటి జీవధాతువులను అంగీకరించదు. జన్యుసంబంధంగా వేరొకపిండమైన దీన్ని తిరస్కరించడానికి బదులు, 280 దినములు ఎందుకు పోషిస్తుంది?

4 ఈ విచిత్రములన్నీ నియమితకాలంలో సంభవిస్తాయి, ఎందుకంటే యెహోవా దేవుడు, ఆ వీర్యాణువు అండం మిళితముకాగా తయారైన ఒక్క సంయుక్త బీజములో వీటన్నిటిని అమర్చాడు. కీర్తనల రచయిత సృష్టికర్తకు విజ్ఞప్తి చేసినపుడు దీనిని బయలుపరచాడు: “నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితములాయెను.”—కీర్తన 139:16.

పిండం ఎదిగి జన్మించుట

5-8. గర్భందాల్చిన నాల్గవ వారానికి, శిశువును ప్రసవించడానికి మధ్యగల సమయంలో గర్భమందు సంభవించే కొన్ని మార్పులేమిటి?

5 పిండం అతిత్వరగా ఎదుగుతుంది. నాలుగో వారానికే దానికి మెదడు, నాడీమండలం మరియు గుండె అంతకుమునుపే తయారైన కవాటముల ద్వారా రక్తాన్ని ప్రవహింపజేసే ప్రసరణమండలం తయారైవుంటుంది. ఆరు వారాలవరకు పీతకోశము ద్వారా రక్తము ఉత్పత్తియగును; తదుపరి యీ పనిని కాలేయము చేపడుతుంది, చివరకు ఎముకల్లోని మూలుగు యీ పనిని నిర్వహిస్తుంది. ఐదోవారంలో చేతులు కాళ్లు ఏర్పడతాయి; అటుతర్వాత మూడు వారాలకు వ్రేళ్లు, కాలిబొటనవ్రేళ్లు ఏర్పడతాయి. ఏడవవారానికి పెద్దకండరాల సముదాయాలు, వీటితోపాటు నేత్రాలు, చెవులు, ముక్కు మరియు నోరు ఏర్పడతాయి.

6 కీర్తనల రచయిత యెహోవాదేవునితో మాట్లాడుచు, “నేను రహస్యమందు పుట్టిననాడు . . . నాకు కలిగిన యెముకలును నీకు మరుగైయుండ లేదు” అని అంటున్నాడు. (కీర్తన 139:15) తొమ్మిదవ నెలకు అస్థిపంజరం ఏర్పడుచుండగా తరుణాస్తి ఎముకగా మారిపోతుంది. మరి ఇప్పుడు పెరుగుచున్న శిశువు, పిండము అనబడక శిశువు అనబడును. “నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి.” (కీర్తన 139:13) నాల్గవ నెలలో సంభవించే యీ మార్పులు దేవుడేర్పరచిన పద్ధతి ప్రకారం జరుగుతాయి మరియు మూత్రపిండాలు రక్తాన్ని వడపోస్తాయి.

7 ఈ సమయానికి పెరుగుచున్న శిశువుకదిలి చుట్టూ తిరుగగలదు, తన అరచేయిగానీ అరికాళ్లుగాని దురదపెట్టగా దాని చేతివ్రేళ్లను లేక కాళ్ల బొటనవ్రేళ్లను అటుఇటు ఆడించగలదు. చేతి వ్రేళ్లతోను, బొటనవ్రేలితోను వేటినైనా పట్టుకొనగలదు మరియు నోటిలో బొటనవ్రేలిని వేసికొని, తర్వాత తన తల్లిరొమ్మున పాలు త్రాగేటపుడు వుపయోగించనైయున్న కండరాల కదలికను ఇప్పుడే కనబరస్తుంది. దానికి వెక్కిళ్లు వస్తాయి, అదివేసే గంతులను తల్లి గమనించగలదు. ఆరవనెల లోపల అనేక అవయవాలు పూర్తిగా తయారౌతాయి. నాసికారంధ్రాలు తెరచుకుంటాయి, కనుబొమలు కనబడతాయి, త్వరలో నేత్రాలు తెరచుకుంటాయి మరియు చెవులు వినడాని కారంభించడంవల్ల గర్భమందున్న శిశువు బయటనుండి వచ్చే పెద్దపెద్ద శబ్దాలను భరించలేక తల్లడిల్లుతుంది.

8 నలభయవ వారంలో నొప్పులు వస్తాయి. తల్లి గర్భాశయ కండరాలు సడలి, శిశువు యీలోకములో అడుగిడుటకు ఆరంభిస్తుంది. శిశువు జన్మించేటపుడు ఒత్తిడివలన దాని తల ఆకారము తరచూ వంకరటింకరౌతుంది, అయితే, దాని పుర్రెనందలి ఎముకలు అప్పటికి ఇంకను సంయోజనం చెందలేదు గనుకనే, పుట్టిన తర్వాతదాని తల మామూలు ఆకారానికి వస్తుంది. ఇప్పుటివరకు తల్లి, శిశువునకు అవసరమైన వాటన్నిటిని అనగా ప్రాణవాయువు, ఆహారం, పరిరక్షణ, వెచ్చదనాన్ని అందించి, మలిన విసర్జన పని కూడ చేసింది. ఇప్పుడిక శిశువే తక్షణం తన పనినారంభించాలి, లేకపోతే అది చనిపోతుంది.

9. గర్భంనుండి బయటపడిన శిశువు జీవించి యుండడానికి తక్షణమే ఎలాంటి మార్పులు జరుగవలసి వున్నాయి?

9 ఊపిరితిత్తులు రక్తానికి ప్రాణవాయువు నందించేలా అది శ్వాసించుట కారంభించాలి. ఇది జరగాలంటే తక్షణమే మరొక గొప్పమార్పు జరుగవలసి వుంది: రక్త ప్రసరణ మార్గం మారాలి! శిశువు తల్లి గర్భమందున్నప్పుడు దాని హృదయ కవాటమందొక రంధ్రముండేది. ఆ కవాటము, కుడి ఎడమనున్న గదులను వేరుపరచి, రక్తం ఊపిరితిత్తులవైపు ఎప్పుడూ పోకుండ కాపాడింది. అలా పోయిన రక్తంలోని అధికభాగాన్ని ఒక పెద్దనాళం ఊపిరితిత్తులను దాటిపోయేట్లు చేసింది. గర్భంలో 10 శాతము రక్తం మాత్రమే ఊపిరితిత్తుల ద్వారా ప్రవహించేది; పుట్టిన తర్వాత రక్తమంతయు వీటిగుండానే ప్రవహించాలి, మరి అది తక్షణమే జరగాలి! ఇలా జరగటానికి పుట్టిన కొన్ని క్షణాలలోనే రక్తాన్ని ఊపిరితిత్తులగుండా దాటవేసిన ఆ పెద్ద నాళం మూసికొనిపోతుంది, మరి దానిద్వారా ప్రవహించిన రక్తం ఇప్పుడు ఊపిరితిత్తులకు ప్రవహిస్తుంది. ఇంతలో హృదయకవాటం మూసుకుంటుంది, మరి గుండె కుడివైపునుండి ప్రవహించిన రక్తమంతా ఇప్పుడు ప్రాణవాయువును నింపుకోవడానికి ఊపిరితిత్తులలోనికి ప్రవహిస్తుంది. శిశువు శ్వాసిస్తుంది, రక్తం ప్రాణవాయువుతో నిండిపోతుంది, ఎంతో ఆశ్చర్యకరమైన మార్పులు జరిగాయి, మరి శిశువు జీవింప నారంభించింది! ప్రేరేపితుడైన కీర్తనల రచయిత దానినెంతో శ్రావ్యంగా క్లుప్తీకరించాడు: “నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి.”—కీర్తన 139:13, 14.

10. గర్భంలో శిశువు ఆశ్చర్యకరంగా ఎదిగే పద్ధతిని పరిశీలించినపుడు తలిదండ్రులు వారి సంతానాన్ని గూర్చి ఏ రీతిగా తలంచాలి?

10 వివాహితులైన దంపతులు యెహోవా అనుగ్రహించిన యీ బహుమానాన్ని ఎంతటి కృతజ్ఞతతో చూడాలి! ఇద్దరినుండి వచ్చిననూ ఇద్దరికి వేరైయున్న మరొక మానవుని ఉత్పత్తిచేసే శక్తి ఎంత విచిత్రమైంది! నిజంగా అది “యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము”!

“స్వాస్థ్యమును” పరిరక్షించుట

11. సంతానం కావలెనని కోరుకునేవారు తమకు తామే ఎలాంటి ప్రశ్నలను వేసికోవాలి, ఎందుకు?

11 వివాహదంపతుల మధ్యనే దాంపత్య జీవిత సుఖం పరిమితమై యుండాలని యెహోవా దేవుడు నియమాన్నేర్పరచుటలో నైతిక విలువకంటె అధికమైన దొకటుంది. రాబోయే సంతానం కూడ ఆయన దృష్టిలోవుండెను. పరస్పరంగా ప్రేమించుకొని వారి సంతానాన్ని ప్రేమించి పోషించే తలిదండ్రులిరువురు శిశువుకు కావాలి. క్రొత్తగా జన్మించిన శిశువుకు ఇంటిలో ఆప్యాయత, భద్రత అవసరం మరియు తన పెరుగుదలకు, వ్యక్తిగా తాను వృద్ధిచెందడానికి అతనికి అవసరమయ్యే వాతావరణాన్ని ఏర్పాటు చేస్తూ, అతడు అవసరమని అపేక్షించే ఒక తల్లి, తండ్రి అతనికి కావాలి. శిశువు కావలెనని కోరుకొను భార్యాభర్తలు తమకు తామే ఇలా ప్రశ్నించుకోవాలి: మనకు శిశువు కావాలా? శరీర అవసరతలేగాక దాని మానసిక ఆత్మీయ అవసరతలను మనము తీర్చగలమా? శిశువు అనుకరించులాగున మనం తనకు మంచి మాదిరిని కనబరస్తూ, సరియైన తర్ఫీదునిస్తామా? తలిదండ్రులుగా మన బాధ్యతలను అంగీకరించి, అవసరమైన త్యాగములు చేయడానికి సమ్మతిస్తారా? మనం పిల్లలుగా వున్నపుడు మన తలిదండ్రులు మనలను కట్టిపడేశారన్నట్లు భావించి యుండవచ్చును గాని మనం తలిదండ్రులమైన తర్వాత, అసలు పిల్లలను పెంచుటలో నిజంగా ఎంత సమయం వ్యయమౌతుందో మనం గ్రహించవచ్చు. అయినను, తలిదండ్రులుగా బాధ్యతను చేపట్టుటతోపాటు ఎంతో ఆనందం కూడ కలుగుతుంది.

12-14. స్త్రీ గర్భం దాల్చినపుడు (ఎ) తన ఆహారం ద్వారా (బి) మత్తుపానీయాలు, పొగాకు, మత్తుపదార్థాలను వినియోగం చేసే విషయంలో ఆమె చేసే పనుల ద్వారా (సి) ఆమె ఆవేశాలను అణచుకొనుట ద్వారా ఎట్లు తన శిశువు ఆరోగ్యవంతంగా ఎదగటానికి సహాయపడగలదు?

12 తలిదండ్రులవల్ల గానీ, జీవప్రక్రియల పరిస్థితుల మూలంగా కాని—నిర్ణయము తీసికొనబడింది. భార్యవైన నీవు ఇప్పుడు గర్భిణీ స్త్రీవి. “యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము”ను నీవు పోషించు సమయమారంభ మయ్యింది. కొన్ని ఆహారపదార్థాలను నీవు తినాలి, మరి కొన్నిటిని మానుకోవాలి లేదా మితంగా తినాలి. పుష్టికరమైన ఆహారపదార్థాలను * తినుట ముఖ్యం ఎందుకంటే శిశువు తాను జన్మించిన తర్వాత ఆరు నెలలవరకు కావలసినంత పోషకపదార్థాలను తనలో దాచుకుంటుంది. నీవు ఎక్కువ పాలు త్రాగాలి, (జున్ను కూడా మంచిదే) నీ శిశువు తన ఎముకలను గట్టిపరచుకోవడాని కవసరమయ్యే కాల్షియం పాలవలన లభిస్తుంది. శిశువు అత్యధిక బరువుండుటకుగాను సమపాళ్లలో తీసికున్న పిండిపదార్థములు * సహాయపడతాయి. నిజమే, నీవు ఇద్దరికొరకు తింటూవుండాలి గానీ మీ ఇద్దరిలో ఒకరు మాత్రం చాలా చిన్నవారు!

13 నీవు జీవించేపద్ధతిపై ఆధారపడి, ఇతర విషయాలను పరిశీలించవచ్చును లేదా పరిశీలించ నగత్యత ఉండకపోవచ్చును. మత్తుపానీయాలు శిశువుకు మత్తునివ్వగలవు కనుక జాగ్రత్త వహించుట అవసరం ఎందుకంటే వాటిని అధికంగా సేవిస్తే మానసిక, శారీరక పెరుగుదల మందగిస్తుంది. తల్లులు అతిగా త్రాగినందున కొందరు శిశువులు మత్తులోనే జన్మించారు. పొగత్రాగుటవల్ల శిశువుయొక్క రక్త ప్రసరణలోనికి నికొటిన్‌ అను విషపదార్థము చేరిపోతుంది మరియు అది శిశువు రక్తములో ప్రాణవాయువునకు బదులు కార్బన్‌మోనాక్సైడ్‌ అనే విషవాయువు చేర్చుతుంది. అలా, శిశువు జన్మించకముందే, దాని ఆరోగ్యం నయం చేయనశక్యమగురీతిగా పాడైపోవచ్చును. పొగత్రాగే స్త్రీలలో తరచు గర్భస్రావము జరుగుట, నెల తక్కువ పిల్లలు పుట్టుట అధికంగా జరుగుతుంది. మత్తుపదార్థాలకు అలవాటైన తల్లులు, పిల్లలను మత్తుపదార్థాలకు అలవాటుపడిన వారిగనే ప్రసవిస్తారు, మత్తుపదార్థంకాని మందుల వలన కూడ అపాయముంది, బహుశ శిశువు అంగవిహీనంగా జన్మించవచ్చును. అధికంగా కాఫీ త్రాగుటంకూడ కొంత నష్టం కల్గిస్తుందని అనుమానిస్తున్నారు.

14 అంతేగాక తల్లిలో కలిగే ఆవేశం, ఆమెలోని హార్మోనులను మార్చగల్గి, శిశువు అధిక చురుకుదనం చూపేలా చేస్తుంది, అలా క్రొత్తగా జన్మించిన శిశువు విశ్రాంతిలేక, క్షోభిస్తుంది. పెరుగుతున్న శిశువు ‘తన తల్లి గర్భంలో దాచబడియుండ’వచ్చును, అయితే దాని చుట్టున్న లోకంనుండి అది పూర్తిగా దూరమైందని తలంచుట తప్పు. తల్లి ద్వారా దానికి ప్రభావం కలుగవచ్చు; తల్లి ద్వారానే బయటి ప్రపంచంతో సంబంధమేర్పడుతుంది మరియు దాని ప్రభావం మంచిదిగా వుంటుందో లేక చెడ్డదిగా వుంటుందో చూడటానికది ఆమెను డ్రైవర్‌ స్థానమందుంచుతుంది. తల్లి తన్ను తాను జాగ్రత్తగా చూచుకొనుటలోను, పరిస్థితుల ప్రభావానికి ప్రతి క్రియ చేయు పద్ధతిలోను ఆ విషయం బయల్పడుతుంది. ఇందులో ఆమె చుట్టున్న వారి సహకారం, ప్రత్యేకంగా తన భర్త ప్రేమ, అతని పరామర్శ ఆమెకు అవసరమనుట నిస్సందేహము.—1 సమూయేలు 4:19 పోల్చండి.

నీవు తీసికోవాల్సిన నిర్ణయాలు

15, 16. శిశువును ప్రసవించడానికి స్థలాన్ని, పద్ధతిని గూర్చి ఎట్టి నిర్ణయాలు తీసికోవాల్సిన అవసరముంటుంది?

15 నీ శిశువు ఆసుపత్రిలోనా, ఇంటిలోనా ఎచ్చట జన్మించాలి? కొన్ని సందర్భాల్లో ఏదో ఒకటి ఎన్నుకొనడానికి అవకాశముండ వచ్చును. అనేకస్థలాల్లో ఆసుపత్రులు కూడ వుండకపోవచ్చును. మరికొన్ని స్థలాల్లో శిశువును ఇంటిలోనే ప్రసవించుట అరుదు మరియు మంత్రసానివంటి అనుభవజ్ఞులు లేనందువలన చిక్కులు రావచ్చు. సాధ్యమైనంతవరకు గర్భంతో నున్నపుడే డాక్టరు దగ్గరికి వెళ్లి, నీవు మామూలుగా ప్రసవించగలవా లేక ఏదైనా కష్టంగా వుంటుందాయని సంప్రదించి తెలుసుకొనుట ఎప్పుడూ శ్రేయస్కరము.

16 నీవు మైకంలో వుండి శిశువును ప్రసవించదలచితివా లేక సహజమైన కాన్పుద్వారా కనదలచితివా? మేలు కీడులను పరిశీలించిన మీదట భార్య భర్తలైన మీరిరువురు ఆ విషయాన్ని తీర్మానించుకోవాలి. సహజమైన కాన్పు, ఆ మధుర సంఘటనలో భర్తను పాల్గొనేటట్లు చేస్తుంది. శిశువు వెంటనే తల్లి ప్రక్కకు చేర్చబడుతుంది. డాక్టరు చేసిన పరీక్షలనుబట్టి కాన్పు కష్టములేకుండ జరుగుతుందని తెలిసినపుడు ఇలాంటి అవకాశాలను అతి జాగ్రత్తగా పరిశీలించి చూడాలని కొందరు నమ్ముతారు. సహజమైన ప్రశాంత పరిస్థితులందు జన్మించిన శిశువులు ఏ కొద్దిపాటి ఆవేశంతోనో, మనోశ్శరీర సంబంధమైన వ్యాధులతోనో జన్మిస్తారని కొందరు పరిశోధకులు నమ్ముతున్నారు.

17-19. శిశువు పుట్టిన తోడనే తల్లి ప్రక్కన వుండవలసిన అవసరాన్ని గూర్చి పరిశోధనల ఫలితమేమి తెల్పుతుంది?

17సైకాలజీ టుడే అనే పత్రిక 1977 డిశంబరు సంచికలో ఇలా తెల్పుతుంది:

“శిశువు జీవితంలోని మొదటి సంవత్సరం, అతని మానసిక పెరుగుదల మీద ఎంతో ప్రభావం కల్గియుండగలదని కొన్ని దశాబ్దాలుగా మనస్తత్వశాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. ఇప్పుడు, శిశువు మొదటిరోజు—బహుశ అతని మొదటి 60 నిమిషాలు సహితం—ఎంతో క్లిష్టంగా కనబడుతుంది. తల్లి తన శిశువు ఎడల చూపే అనురాగపూరిత అనుబంధం మరియు తాను శిశువును పరామర్శించే పద్ధతులు ఆమె ప్రసవించిన అనంతరం చాలా ముఖ్యం. ఇటీవలి పరిశోధనలు తెలియజేసేదేమంటే తొలి ఘడియలలో తల్లి తన పిల్లల ఎడల చూపే అభిప్రాయంలోను, అతన్ని పరామర్శించుటలోను ఆమె చూపే శక్తి, అంకితభావం మరియు స్తన్యమిచ్చి పెంచుటలో గల సమర్థతలో ఎంతో విలువుంది.”

18 కాన్పు సమయంలో తల్లి మైకంలో లేనట్లయితే, శిశువు హుషారుగా వుండి, కళ్లు తెరచి, చుట్టూ పరికించి చూస్తూ, కదిలికలను గమనిస్తూ, మనుష్యుల శబ్దములను, ముఖ్యంగా పెద్దగా పిలిచే స్త్రీల అరుపులను వింటుంది. తల్లి, పిల్లమధ్య చూపు వెంటనే ప్రారంభమౌతుంది. ఇదెంతో ప్రాముఖ్యమని అనిపిస్తుంది; కొన్ని పరిశోధనల ప్రకారం తల్లులు తెల్పేదేమంటే వారి శిశువులు వారివైపు చూస్తే వారింకా సన్నిహితులౌతున్నట్లుగా భావిస్తున్నారు. పుట్టిన తోడనే తల్లీ పిల్లల శరీరాలు ఒక దానికొకటి తాకగా వారిద్దరికి కలిగే అనుభూతివల్ల ప్రయోజనముందని పరిగణింపబడింది.

19 ఆసుపత్రులలో ప్రసవించిన శిశువుల సమస్యలు కొన్నిసార్లు శిశువు పుట్టిన కొన్ని గంటలవరకు కలిగే సమస్యలేనని పరిశోధకుల భావన. మంచి సదుపాయములున్న ఆసుపత్రి పరామర్శ పొందిన శిశువులను, జన్మించిన వెంటనే తమతల్లుల యొద్దకు చేర్చబడిన శిశువులను పోల్చితే, ఒకనెల తరువాత మామూలుగా జన్మించిన శిశువులే ఆరోగ్యముగా వున్నట్లు కనబడుతుంది. సైకాలజీ టుడే అనే పత్రిక తెల్పేదేమంటే, “అంతకంటె ఆశ్చర్యకరమైన దేమనగా, ఐదు సంవత్సరాల వయస్సులో పరీక్షిస్తే కూడ మంచి ఆసుపత్రిలో పరామర్శింపబడిన వారికంటె సహజపరిస్థితులందు జన్మించిన వారికి ఎంతో ఎక్కువ జ్ఞానస్థాయి (జ్ఞానమున్నదనే నిదర్శనం) గలదని భాషాపరిజ్ఞాన పరిశోధనలుకూడ తెలియజేస్తున్నాయి.”

20. ఈ విషయంలో జ్ఞానయుక్తమగు తీర్మానాలు చేయడానికి దేనిని కూడ మనస్సునందుంచుకోవాలి?

20 అయినను ఈ విషయాలన్నిటిలో, పరిస్థితులను గంభీరంగా సరిపోల్చి చూసుకోవాలి. మన ఆది తలిదండ్రులు మనకు అపవిత్రతను అందించిరనే వాస్తవాన్ని మరువకూడదు. ఇందువల్లనే యీనాడు “సహజంగా జన్మించుటలోని” సహజత్వం కోల్పోతున్నాం, మరియు మనం వారసత్వంగా పొందిన లోపాలు చిక్కులను కల్గించగలవు. (ఆదికాండము 3:16; 35:16-19; 38:27-29) ఇతరులు తలంచే యీ “ఆదర్శవంతమైన” పుట్టుకతో ఇది సరిపోయిననూ, సరిపోకపోయినాసరే నీ నిర్ణయాలు మాత్రం నీ పరిస్థితులకు అనుకూలంగా నీ దృష్టికి ఏది ఉత్తమమో ఆ పద్ధతి చొప్పున జరిగించండి.

21, 22. తల్లిపాలవలన కలుగు కొన్ని ప్రయోజనాలేమిటి?

21 నీ పాపకు నీపాలిస్తావా? ఇలా చేయడంవల్ల నీకు, నీపాపకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. తల్లిపాలు శిశువులకు సంపూర్ణాహారం. ఆ పాలు అతి సులభంగా జీర్ణమౌతాయి, అవి అంటురోగాలు, ఆంత్రముల అవరోధాలు, ఉచ్ఛ్వాసనిశ్వాసలకు సంబంధించిన చిక్కుల నుండి కాపాడుతాయి. మొదటకొన్ని రోజులవరకు పసుపు పచ్చగా ద్రవరూపంలో వచ్చే చనుబాలు ప్రత్యేకంగా పసిపిల్లలకు శ్రేష్ఠం, ఎందుకంటే అందులో (1) క్రొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు తక్కువగా వుండుటవల్ల సులభంగా జీర్ణమగును, (2) తల్లినుండి తర్వాతవచ్చు పాలకంటె ఇవెంతో ప్రతిరక్షితమైనవి, (3) జన్మించకముందు శిశువు ప్రేగుల్లో చేరిన కణములు, జిగురువంటి పదార్థం, పైత్యరసములను బహిర్గతం చేయగలిగే కొద్దిపాటి శక్తి ఆ పాలకున్నది.

22 చనుబాలిచ్చుట తల్లికి మంచిది. పసిపాప పాలు త్రాగడం వల్ల తల్లి గర్భాశయం సంకోచించి రక్తస్రావం తగ్గుతుంది. పాలు త్రాగడంవల్ల తల్లిరొమ్ములు ఇంకా అధికముగా పాలనుత్పత్తి చేస్తాయి, సరిగ్గా పాలులేవని తలంచే తల్లులకు ఇక కొరతవుండదు. క్రమంగా చనుబాలివ్వడంవల్ల కొందరిలో అండోత్పాదన, రుతుస్రావంయొక్క క్రమం తప్పి అవే సహజ గర్భనిరోధకములౌతాయి. “పాలిచ్చే తల్లులలో ఏ కొద్దిమందికో రొమ్ముకు సంబంధించిన క్యాన్సర్‌ వస్తుందని” అమెరికన్‌ క్యాన్సర్‌ సొసైటి తెల్పుతుంది, చనుబాలిచ్చుటవల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితికూడ మెరుగుపడుతుంది!

శిశువు పెంపకం విషయంలో—నీ లక్ష్యమేమిటి?

23. కీర్తన 127:4, 5 నందు పిల్లలకిచ్చు శిక్షణను గూర్చి ఏ సూత్రములు సూచించబడ్డాయి?

23 “యౌవనకాలమందు పుట్టిన కుమారులు బలవంతునిచేతిలోని బాణములవంటివారు. వారితో తన అంబులపొది నింపుకొనినవాడు ఎంతో ధన్యుడు.” (కీర్తన 127:4, 5, యాన్‌ అమెరికన్‌ ట్రాన్స్‌లేషన్‌) విల్లును ఎక్కుపెట్టి బాణాన్ని వదలినపుడే దాని విలువ తెలుస్తుంది. జాగ్రత్తగా, ఎంతో నేర్పుతో విల్లును ఎక్కుపెట్టి గురిచూచి బాణాన్ని వదలాలి. అలాగే, తలిదండ్రులుగా మీరు మీ బిడ్డల జీవితాన్ని ప్రారంభించే పద్ధతిని గూర్చి జ్ఞానంతో ప్రార్థనాపూర్వకంగా యోచించాలి. నీ పెంపకం నుండి వేరైన తదుపరి అతడుగానీ ఆమెగానీ తుల్యశక్తిగల్గి అనుభవజ్ఞులైన వయోజనులగుదురా, ఇతరుల మన్ననలను పొంది దేవునికి మహిమ తేగలరా?

24. (ఎ) తలిదండ్రులు తమపిల్లల కొరకు యింటిలో ఎట్టి వాతావరణాన్ని నెలకొల్పడానికి కృషిచేయాలి? (బి) ఇది ఎందుకు ప్రాముఖ్యం?

24 శిశువు పుట్టకమునుపే దాని పెంపకం, శిక్షణను గూర్చిన నిర్ణయాలు తీసుకోవాలి. ప్రథమ సంతానం యొక్క ప్రపంచమంతా తలిదండ్రులే. ఆ ప్రపంచం దేనివలె వుండాలి? తలిదండ్రులు, “సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి” అనే దేవుని వాక్యమందలి యీ హెచ్చరికను లక్ష్యపెడుతున్నారని అది చూపిస్తుందా? (ఎఫెసీయులు 4:31, 32) గృహజీవిత మెలాంటిదైననుసరే, అది ఆ పసికందులో ప్రతిబింబిస్తుంది. నీ శిశువుయొక్క ప్రపంచమంతా ప్రశాంతంగా, సురక్షితంగా, ప్రేమానురాగాలతో నిండినదిగా చేయండి. మమకారంతో పెంచబడే బిడ్డ యీ లక్షణాలనన్నిటిని నేర్చుకుంటుంది, ఇవి ఆ శిశువును కూడ అదేరీతిగా తీర్చిదిద్దుతాయి. నీ మనోభావాలను శిశువు గ్రహిస్తుంది, నీ ఆదర్శాలను అనుకరిస్తుంది. శిశువు తల్లి గర్భంలో ఎదగటానికి సృష్టికర్త అద్భుతకరమైన జీవోత్పత్తి నియమాలు ఏర్పరచాడు; మరి గర్భమునుండి బయటపడినతర్వాత ఆ శిశువును నీవెలా పెంచుతావు? నీవు ఏర్పరచే గృహపరిస్థితిపై నీ శిశువు పెరుగుదల ఎంతగానో ఆధారపడివుంది. ఇది, జన్యు క్రమమువలె శిశువు ఎట్టి వయోజనుడౌతాడో నిర్ణయిస్తుంది. “బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు.”—సామెతలు 22:6.

25, 26. తలిదండ్రులు వారి పిల్లలకొరకు ఎక్కువ సమయాన్ని వినియోగించి వారి ఎడల శ్రద్ధవహించుట ఎందుకు కారణసహితమై యున్నది?

25 పురుషుడే గాని స్త్రీయేగాని ఒక గడ్డిపోచనుకూడ ఉత్పత్తి చేయలేరు, గాని వారిరువురుకలిసి, భూమిపైనున్న ఏ ఒక్కరితోను సరిపోల్చలేని మరొక మనుష్యుని ఉత్పత్తి చేయగలరు! ఇదెంతో ఆశ్చర్యకరమగు క్రియ, ఈనాడు అనేకులు ఇందుమూలంగా వచ్చే బాధ్యతలోని పవిత్రతను గుణగ్రహించలేక పోతున్నారన్నంత నమ్మశక్యంకాని ఆశ్చర్యమగు క్రియ! ప్రజలు పూలమొక్కలను నాటి, నీరుపోసి, పెంచి, కలుపు తీస్తారు—ఇదంతా ఒక అందమైన తోటకొరకే చేస్తారు. మరి పిల్లలు అందంగా తయారగుటకై అంతకంటె ఎక్కువ సమయాన్ని వ్యయపరచి వారి కొరకు ఎక్కువగా కృషిచేయవద్దా?

26 దంపతులకు సంతానం కల్గియుండే హక్కున్నది. ఆలాగే వారి పిల్లలు తలిదండ్రులను పొందే హక్కున్నది, పేరుకు మాత్రమేకాదు నిజానికి వారికట్టి హక్కున్నది. దేవునికి సమర్పించుకున్న క్రైస్తవుడు ఒకవ్యక్తిని శిష్యునిగా తయారుచేసే నిరీక్షణతో అతనికి బైబిలు జ్ఞానము నందించడానికి ఎంతో సమయాన్ని శక్తిని వినియోగించవచ్చును, అయిననూ అందులో ఎల్లప్పుడు విజయమొందడు. మరి తలిదండ్రులు కూడ వారి పిల్లలను ‘యెహోవా యొక్క శిక్షలోను బోధలోను పెంచుటకు’ అంత కంటె ఎక్కువ సమయాన్ని గడుపవలెనుగదా? (ఎఫెసీయులు 6:4) వారు కనీసం ఒక్కబిడ్డను జీవదాతయైన యెహోవా దేవునికి శ్రేష్ఠమైన సేవకునిగా పెంచితే అదెంతో ఆనందానికి కారణముకాదా? అప్పుడు నిశ్చయంగా, ఆ కుమారుని లేక ఆ కుమార్తెను కనినందుకు వారికది బహుదీవెనకరమౌతుంది.—సామెతలు 23:24, 25.

27. శిశువును పెంచే పద్ధతిలో, శిశువు వ్యక్తిత్వాన్ని ఎందుకు లక్ష్యపెట్టాలి?

27కీర్తన 128:3 పిల్లలను ఒలీవ మొక్కలతో పోల్చుతుంది: “నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లివలె నుండును. నీ భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కలవలె నుందురు.” చెట్లనుపెంచే విధానాన్ని బట్టి వాటికి వివిధ ఆకారాలొస్తాయి. కొన్నిటిని గోడకు నిట్టనిలువుగా పెంచవచ్చు. మరికొన్ని నేలమీద ప్రాకుతాయి, ఇంకాకొన్నిటిని చిన్నవిగా చేసి వాటి మొదళ్లను కత్తిరించి బొన్‌సాయి మొక్కలవలె అందంగా అమర్చవచ్చు. శిశువుకు బాల్యమందే ఇచ్చుశిక్షణ వలన ఆ శిశువు ఎదిగే పద్ధతిని గూర్చి ఒక పురాతన సామెత ఇలా నొక్కి తెల్పుతుంది: “లేతమొక్కను ఎలా వంచితే చెట్టు అలా పెరుగుతుంది.” ఇచ్చట సమతూకం అవసరం. మరోవైపు, నీతిసూత్రాల కనుగుణంగా నడుచుకొనడానికి ఆ బిడ్డకు నడిపింపు అవసరం. అదే సమయంలో తలిదండ్రులు ఫలానిరీతిగా ఆ శిశువు పెరగాలని, ముందే ఊహించినట్లే జరగాలని అనుకోకూడదు. ఒలీవచెట్టు అంజూరపు పండ్లు ఫలించేలా నీవు చేయలేవు. నీ బిడ్డను సన్మార్గంలో పెంచు కానీ నీవు శిశువు జన్మించక ముందే పెంపకాన్ని గూర్చి ఊహించిన రీతిగానే పెరగాలని యీ పద్ధతిని మార్చడానికి బలవంత పెట్టొద్దు. అలా చేస్తే తన ప్రత్యేక వ్యక్తిత్వం, జన్మతావచ్చిన వరాలను ఆ శిశువు సర్వసాధారణంగా కనబరచలేకపోవచ్చు. నీవు కనిన యీ శిశువును అర్థంచేసికోవడానికి సమయాన్ని వెచ్చించండి. ఆ పిదప, మొక్కవలె, నీ బిడ్డ సన్మార్గంలో నడుచుకొని, బలపడడానికి అవసరమైన నడిపింపు నందించండి. అయితే ఆ నడిపింపు శిశువు ఉత్తముడు కావడానికి పూర్ణంగా పెరగడానికి ఆటంకం కల్గించకుండునంత సున్నితంగా వుండాలి.

యెహోవా అనుగ్రహించు బహుమానము

28. ఆదికాండము 33:5, 13, 14 తెల్పుతున్నట్లు, యాకోబు తన పిల్లలయెడల చూపిన శ్రద్ధనుబట్టి మనమెలా ప్రయోజనం పొందగలం?

28 పూర్వకాలమందున్న యాకోబు తన పిల్లల పెంపకంలో శ్రద్ధవహించాడు. ప్రయాణ ఏర్పాట్లు చేస్తుండగా ఆ ప్రయాణం మధ్య వ్యవధి వారికెంతో దీర్ఘకాలంగా వుంటుందని తలంచి, ప్రయాణ ఏర్పాట్లు చేసే వ్యక్తితో యాకోబు ఇలా అన్నాడు: “నాయొద్ద నున్న పిల్లలు పసిపిల్లలనియు, గొఱ్ఱెలు మేకలు పశువులు పాలిచ్చునవి అనియు నా ప్రభువుకు తెలియును. ఒక్కదినమే వాటిని వడిగా తోలినయెడల ఈ మంద అంతయు చచ్చును. నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్లవలెను. నేను నా ప్రభువునొద్దకు శేయీరునకు వచ్చువరకు, నా ముందర నున్న మందలు నడువగలిగిన కొలదిని, ఈ పిల్లలు నడువగలిగినకొలదిని వాటిని మెల్లిగా నడిపించుకొని వచ్చెదను.” అంతకుముందు తన అన్నయైన ఏశావును కలిసికొన్నప్పుడు, “వీరు నీకేమి కావలెనని” ఏశావు అడిగాడు, అందుకు యాకోబు “వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే” అని చెప్పాడు. (ఆదికాండము 33:5, 13, 14) యాకోబువలె యీనాడు తలిదండ్రులు, వారి పిల్లల ఎడల దయ చూపుటయేగాక ఆయనవలెవారు—పిల్లలు యెహోవా దయచేసినవారేనని—తలంచాలి. వివాహము చేసికొనక పూర్వమే సహజంగా ఒకడు తన భార్యను పిల్లలను పోషించగలడా లేదాయని తీవ్రంగా తలంచాలి. బైబిలు ఇలా హెచ్చరిస్తుంది: “బయట నీ పని చక్కబెట్టుకో, ముందుగా పొలములో దాని సిద్ధంచేసుకో, ఆ తరువాత ఇల్లు కట్టుకోవచ్చు.” (సామెతలు 24:27, న్యూ ఇంగ్లీష్‌ బైబిలు) అభ్యాసయోగ్యమైన యీ సలహామేరకు, ఒకడు తన వివాహం, వివాహానంతర జీవితంకొరకు సిద్ధపడాలి. అప్పుడు అనుకొనని రీతిగా భార్య గర్భం ధరిస్తే అతడు సంతోషపడతాడు మరి దాన్ని ఆర్థిక సంబంధమైన భారంగా భావించడు.

29. సంతానం కల్గియుండే విషయాన్ని గూర్చి ఎందుకు ముందుగానే తీవ్రంగా తలంచాలి?

29 సంతానం కలిగియుండే విషయంలో తొలి సంతానాన్ని గూర్చియేగాక అటు తర్వాత కలుగబోవు పిల్లల విషయం కూడ అత్యంత తీవ్రంగా తలంచే అవసరముంది. తలిదండ్రులు ముందువారికి కల్గిన సంతానాన్ని పోషించి, పెంచి శిక్షణ యివ్వడానికి కష్టపడుతున్నారా? ఆలాగైతే వారి సృష్టికర్తయెడల గౌరవం, ప్రేమయనే లక్షణాలనుబట్టి వారిక సంతానోత్పత్తిని తగ్గించుకొనుటకై ఎంతవరకు ఆశానిగ్రహం కల్గియుండవలెనో తలంచుటకది నిశ్చయంగా వారిని పురికొల్పాలి.

30. (ఎ) శిశువు నిజంగా దేవునికే చెందిందని మనమెందుకు చెప్పగలం? (బి) ఇది తలిదండ్రుల దృష్టిపై ఎలాంటి ప్రభావం కల్గివుంటుంది?

30 నిజంగా ఆ బిడ్డ ఎవరికి చెందుతుంది? ఒక విధంగా చూస్తే అది నీ బిడ్డయే. కానీ మరొక విధంగా చూస్తే ఆ బిడ్డ సృష్టికర్తకు చెందింది. ఒక శిశువుగా నిన్ను సంరక్షించుటకు నీ తలిదండ్రులకు నిన్ను అప్పగించినట్లే, నీవు నీ శిశువును పెంచడానికి దేవుడు నీకప్పగించి యున్నాడు. నీ తలిదండ్రులు నిన్ను వారి యిష్టమొచ్చినట్లు పెంచడానికి నీవు వారి స్వాస్థ్యమెట్లుకావో, అలా నీ శిశువును నీ యిష్టమొచ్చినట్లు పెంచడానికి నీకు అప్పగించబడలేదు. తలిదండ్రులు గర్భమందలి పిండముయొక్క కదలికను గానీ శిశువు ఎదుగుదలనుగానీ నడిపించలేరు, నిర్వహించలేరు. దానికి సంబంధించిన అద్భుత విధానాన్ని పూర్తిగా గ్రహించలేరు లేదా తెలిసికోలేరు. (కీర్తన 139:13, 15; ప్రసంగి 11:5) ఏదొక శరీర అసంపూర్ణతవల్ల గర్భస్రావం జరిగితే లేదా కడుపులోని బిడ్డ చనిపోతే వారాశిశువును మరల బ్రతికించలేరు. ఆ విధంగా మనందరికి దేవుడు ప్రాణదాతయని, మనమందరం ఆయనకు చెందిన వారమని మనం వినయంగా ఒప్పుకొనే అవసరతవుంది: “భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులును యెహోవావే.”—కీర్తన 24:1.

31, 32. (ఎ) తలిదండ్రులు దేవుని ఎదుట ఎలాంటి బాధ్యతను కల్గియున్నారు? (బి) ఆ బాధ్యతను సరిగ్గా నిర్వహించుటవలన కల్గు ఫలితాలేవి?

31 లోకమందు నీవు కనేపిల్లల ఎడలను, వారిని పెంచే విధానంలోను నీవు సృష్టికర్తకు ఉత్తరవాదివైయున్నావు. ఆయన భూమిని సృజించి, మానవులతో దాన్ని నింపాలని సంకల్పించాడు, మరియు ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆయన మన మొదటి తలిదండ్రులు సంతానోత్పత్తి చేసే శక్తిని కల్గియుండేలా వారిని ఆశీర్వదించాడు. వారాయననుండి తొలగిపోయి, పరలోకమందును భూలోకమందును దేవునికున్న సర్వోన్నతాధిపత్యపు హక్కును ధిక్కరించిన శత్రువుతో వారు చేయి కలిపారు. నీ సంతానం వారి సృష్టికర్తకు యథార్థవంతులుగా వుండేటట్లు వారికి శిక్షణ యివ్వడం ద్వారా నీవు, నీ కుటుంబం, యెహోవా దేవుడు సత్యవంతుడని అపవాది అబద్ధికుడని రుజువు చేయగలరు. సామెతలు 27:11 తెల్పినట్లు చేయండి: “నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును.”

32 నీ సంతానం యెడల, దేవునియెడల నీ బాధ్యతను నిర్వహించుటవలన జీవితంలో ఒక కర్తవ్యాన్ని సాధించావనే సంతృప్తి నీకు కలుగుతుంది. నీవు కీర్తన 127:3 నందున్న వాక్యాన్ని హృదయపూర్వకంగా అభినందించగలవు: “గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే.”

[అధస్సూచీలు]

^ పేరా 12 మాంసం, ఆకుకూరలు, కాయగూరల వంటివి.

^ పేరా 12 పిండి పదార్థాలతో కూడిన ఆహారం మరియు పంచదార మితంగా వున్న పదార్థాలు.

[అధ్యయన ప్రశ్నలు]

[93వ పేజీలోని చిత్రం]

ఇప్పటి సన్నిహిత సంబంధం, భవిష్యత్తులోవచ్చే తరాల అంతరాన్ని తొలగిస్తుంది