అధ్యాయం 9
“దేవునికి పక్షపాతం లేదు”
సున్నతి పొందని అన్యజనులకు క్రైస్తవులు ప్రకటించడం మొదలుపెట్టారు
అపొస్తలుల కార్యాలు 10:1–11:30 ఆధారంగా
1-3. పేతురుకు ఏ దర్శనం వచ్చింది? దాని అర్థాన్ని మనం ఎందుకు తెలుసుకోవాలి?
పేతురు ఇంకా యొప్పే నగరంలోనే ఉన్నాడు. అది క్రీస్తు శకం 36, ఆకురాలే కాలం. సముద్రతీరం దగ్గర ఉన్న ఒక మేడ మీద పేతురు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అది సీమోను అనే చర్మకారుడి ఇల్లు. పేతురు కొన్ని రోజులుగా అతని ఇంట్లోనే ఉంటున్నాడు. యూదులు సాధారణంగా అలాంటివాళ్ల ఇళ్లలో ఉండడానికి ఇష్టపడరు. a అయినా పేతురు అతని ఇంట్లో ఉంటున్నాడంటే, ఆయన ఇతరుల్ని చిన్నచూపు చూసే మనిషి కాదని అర్థమౌతుంది. అయినప్పటికీ, ఆ విషయంలో పేతురు ఇంకో మెట్టు ఎక్కాలని యెహోవా కోరుకున్నాడు. యెహోవాకు అందరూ సమానమే అనే ముఖ్యమైన పాఠాన్ని పేతురు నేర్చుకోబోతున్నాడు.
2 పేతురు ప్రార్థన చేస్తూచేస్తూ ఒక దర్శనాన్ని చూశాడు. ఆయన చూసిన దర్శనం ఏ యూదునికైనా ఇబ్బంది కలిగిస్తుంది. ఆ దర్శనంలో, ఒక దుప్పటి లాంటిది ఆకాశం నుండి కిందికి రావడం పేతురు చూశాడు. అందులో ధర్మశాస్త్రం ప్రకారం అపవిత్రమైన జంతువులు ఉన్నాయి. వాటిని చంపుకొని తినమని ఒక స్వరం ఆయనకు చెప్పింది. కానీ పేతురు, “ధర్మశాస్త్రం ప్రకారం నిషిద్ధమైనదేదీ, అపవిత్రమైనదేదీ నేను ఎప్పుడూ తినలేదు” అన్నాడు. అప్పుడు ఆ స్వరం ఒక్కసారి కాదు, మూడుసార్లు ఇలా అంది: “దేవుడు పవిత్రపర్చిన వాటిని నిషిద్ధమైనవని అనొద్దు.” (అపొ. 10:14-16) ఆ దర్శనం పేతురును అయోమయంలో పడేసింది, కానీ దాన్ని అర్థం చేసుకోవడానికి యెహోవా పేతురుకు సహాయం చేశాడు.
3 పేతురుకు వచ్చిన దర్శనం అర్థమేంటి? దాని అర్థాన్ని నేడు మనం ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకంటే, ప్రజల్ని యెహోవా ఎలా చూస్తాడనే విషయానికి సంబంధించి ఒక ముఖ్యమైన పాఠాన్ని అది నేర్పిస్తుంది. అంతేకాదు, దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో సాక్ష్యం ఇవ్వాలంటే కూడా అది మనకు తెలిసుండాలి. ఆ దర్శనాన్ని అర్థం చేసుకోవడం కోసం దానికి ముందు ఏం జరిగిందో, తర్వాత ఏం జరిగిందో చూద్దాం.
“ఎప్పుడూ పట్టుదలగా దేవునికి ప్రార్థించేవాడు” (అపొ. 10:1-8)
4, 5. కొర్నేలి ఎవరు, అతను ప్రార్థిస్తున్నప్పుడు ఏం జరిగింది?
4 ముందురోజు ఏం జరిగిందో పేతురుకు అస్సలు తెలీదు. యొప్పేకు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కైసరయలో, కొర్నేలి అనే అతనికి కూడా ఒక దర్శనం వచ్చింది. ఈ కొర్నేలి, రోమా సైన్యంలో సైనికాధికారి. b అతను “దైవభక్తి గలవాడు,” కుటుంబాన్ని చాలా బాగా చూసుకునేవాడు. “అతను, అతని ఇంటివాళ్లందరూ దేవునికి భయపడేవాళ్లు.” కొర్నేలి యూదుడు కాదు; అతను సున్నతి పొందని అన్యజనుడు. అయినా, అవసరంలో ఉన్న యూదులకు అతను దానధర్మాలు చేస్తుండేవాడు. మంచి మనసున్న ఈ కొర్నేలి, “ఎప్పుడూ పట్టుదలగా దేవునికి ప్రార్థించేవాడు.”—అపొ. 10:2.
5 మధ్యాహ్నం దాదాపు మూడు గంటలప్పుడు, కొర్నేలి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు అతనికి దర్శనంలో ఒక దేవదూత కనిపించి ఇలా అన్నాడు: “నీ ప్రార్థనలు, దానధర్మాలు దేవుని సన్నిధికి చేరాయి. దేవుడు వాటిని గుర్తుచేసుకున్నాడు.” (అపొ. 10:4) అపొస్తలుడైన పేతురును తీసుకురావడానికి మనుషుల్ని పంపించమని కూడా దేవదూత అతనికి చెప్పాడు. దేవదూత చెప్పినట్టే కొర్నేలి చేశాడు. సున్నతిపొందని అన్యజనులకు అప్పటిదాకా మూసుకుపోయి ఉన్న ఒక తలుపు ఇప్పుడు తెరుచుకోబోతుంది. అందులోకి మొట్టమొదట అడుగు పెట్టబోయేది కొర్నేలే.
6, 7. (ఎ) దేవుని గురించిన సత్యం తెలుసుకోవాలని కోరుకునే వాళ్ల ప్రార్థనల్ని యెహోవా వింటాడని చూపించే ఒక అనుభవం చెప్పండి? (బి) ఈ అనుభవాలు ఏ రెండు విషయాల్ని స్పష్టం చేస్తున్నాయి?
6 ఈ రోజుల్లో కూడా మంచి మనసున్న చాలామంది దేవుని గురించిన సత్యం తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నారు. మరి దేవుడు వాళ్ల ప్రార్థనలకు జవాబిస్తున్నాడా? ఆల్బేనియాలో ఉంటున్న ఒకామె అనుభవం పరిశీలించండి. ఇద్దరు సాక్షులు ఇంటింటి పరిచర్యలో ఆమెను కలిసి, పిల్లల్ని ఎలా పెంచాలో చెప్పే ఒక కావలికోట ఇచ్చారు. c ఆమె వాళ్లతో ఇలా అంది: “మీకు తెలుసా! నేను ఇంతకుముందే, నా కూతుళ్లను పెంచే విషయంలో సహాయం చేయమని దేవునికి ప్రార్థించాను. ఇంతలోనే ఆయన మిమ్మల్ని పంపించాడు! ఇది నాకు చాలా నచ్చింది, నిజంగా నాకు కావాల్సింది ఇదే!” వెంటనే ఆమె తన ఇద్దరు కూతుళ్లతో పాటు బైబిలు స్టడీ తీసుకుంది. కొంతకాలానికి ఆమె భర్త కూడా స్టడీ తీసుకోవడం మొదలుపెట్టాడు.
7 ఇలాంటి అనుభవాలు చాలా దేశాల్లో తరచూ కనిపిస్తుంటాయి, ఇవేవో అనుకోకుండా జరిగేవైతే కాదు. ఇవి మనకు రెండు విషయాల్ని స్పష్టం చేస్తున్నాయి. మొదటిది, మంచి మనసుతో తనను వెదికేవాళ్ల ప్రార్థనలకు యెహోవా జవాబిస్తాడు. (1 రాజు. 8:41-43; కీర్త. 65:2) రెండు, ప్రకటనా పనిలో మనకు దేవదూతల మద్దతు ఉంది.—ప్రక. 14:6, 7.
‘పేతురు కలవరపడ్డాడు’ (అపొ. 10:9-23ఎ)
8, 9. పవిత్రశక్తి పేతురుకు ఏమని నిర్దేశం ఇచ్చింది? అప్పుడు ఆయన ఏం చేశాడు?
8 మేడ మీద ఉన్న పేతురు తనకు వచ్చిన దర్శనానికి అర్థం ఏమై ఉంటుందా అని ‘కలవరపడుతున్నాడు.’ ఇంతలో, కొర్నేలి పంపించిన మనుషులు సీమోను ఇంటి దగ్గరికి వచ్చారు. (అపొ. 10:17) ధర్మశాస్త్రం ప్రకారం అపవిత్రమైన వాటిని తినను అని మూడుసార్లు చెప్పిన పేతురు, ఇప్పుడు ఈ మనుషులతో వెళ్లడానికి ఇష్టపడతాడా? అన్యజనుల ఇంట్లో అడుగు పెడతాడా? తన ఇష్టం ఏంటో అర్థం చేసుకునేలా దేవుడు తన పవిత్రశక్తి ద్వారా పేతురుకు ఇలా చెప్పాడు: “ఇదిగో! ముగ్గురు మనుషులు నీ గురించి అడుగుతున్నారు. నువ్వు లేచి, కిందికి దిగి, ఏమాత్రం సందేహించకుండా వాళ్లతో వెళ్లు. ఎందుకంటే నేనే వాళ్లను పంపించాను.” (అపొ. 10:19, 20) పవిత్రశక్తి నడిపింపుకు లోబడేలా, ఆ దర్శనం పేతురుకు ఖచ్చితంగా సహాయం చేసి ఉంటుంది.
9 ఈ మనుషుల్ని తన దగ్గరికి పంపించమని దేవదూతే కొర్నేలికి చెప్పాడని తెలుసుకున్నప్పుడు, పేతురు వాళ్లను ఇంట్లోకి పిలిచి, “అతిథి మర్యాదలు చేశాడు.” (అపొ. 10:23ఎ) దేవుని ఇష్టం ఏంటో అర్థం చేసుకుంటున్న పేతురు తన ఆలోచనా విధానం మార్చుకోవడం మొదలుపెట్టాడు.
10. యెహోవా తన ప్రజల్ని ఎలా నడిపిస్తున్నాడు? మనం ఏమని ప్రశ్నించుకోవాలి?
10 ఈ రోజుల్లో కూడా, తన ఇష్టాన్ని అర్థం చేసుకునేలా యెహోవా తన సేవకులకు మెల్లమెల్లగా సహాయం చేస్తున్నాడు. (సామె. 4:18) యెహోవా తన పవిత్రశక్తి ద్వారా ‘నమ్మకమైన బుద్ధిగల దాసుడిని’ నిర్దేశిస్తూ తన ప్రజల్ని నడిపిస్తున్నాడు (మత్త. 24:45) కొన్నిసార్లు ఏదైనా లేఖనానికి సంబంధించిన అవగాహనలో లేదా సంస్థలోని ఏర్పాట్లలో మార్పులు రావచ్చు. మనం ఇలా ప్రశ్నించుకోవడం మంచిది: ‘అలాంటి మార్పులు వచ్చినప్పుడు నేను ఏం చేస్తున్నాను? పవిత్రశక్తి నిర్దేశానికి ఇష్టంగా లోబడుతున్నానా?’
పేతురు ‘బాప్తిస్మం తీసుకోమని ఆజ్ఞాపించాడు’ (అపొ. 10:23బి-48)
11, 12. కైసరయకు వచ్చాక పేతురు ఏం చేశాడు? ఆయన ఏం అర్థం చేసుకున్నాడు?
11 పేతురుకు దర్శనం వచ్చిన తర్వాతి రోజు మొత్తం పదిమంది, అంటే పేతురు, కొర్నేలి పంపించిన ముగ్గురు మనుషులు, యొప్పేలోని “ఆరుగురు సహోదరులు” కలిసి కైసరయకు బయల్దేరారు. (అపొ. 11:12) పేతురు వస్తాడని ఎదురుచూస్తున్న కొర్నేలి “తన బంధువుల్ని, దగ్గరి స్నేహితుల్ని” పిలిపించాడు. వాళ్లంతా అన్యజనులే అయ్యుంటారు. (అపొ. 10:24) కొర్నేలి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత, పేతురు కలలో కూడా ఊహించని ఒక పని చేశాడు. ఆయన సున్నతి పొందని అన్యజనుల ఇంట్లో అడుగు పెట్టాడు! పేతురు వాళ్లతో ఇలా అన్నాడు: “యూదుల చట్టం ప్రకారం, ఒక యూదుడు వేరే జాతికి చెందిన వ్యక్తితో సహవాసం చేయడం గానీ, అతన్ని కలవడం గానీ ఎంత తప్పో మీకు బాగా తెలుసు. అయినాసరే, నేను ఏ మనిషినీ అపవిత్రుడిగా ఎంచకూడదని దేవుడు నాకు చూపించాడు.” (అపొ. 10:28) తనకు వచ్చిన దర్శనం ఎలాంటి ఆహారం తినవచ్చు అనేదానికి సంబంధించినది మాత్రమే కాదని, పేతురుకు ఈ సమయానికల్లా అర్థమై ఉంటుంది. ఆయన, “ఏ మనిషినీ [ఆఖరికి అన్యజనులను కూడా] అపవిత్రుడిగా ఎంచకూడదు.”
12 పేతురు చెప్పేవి వినడానికి అక్కడున్న వాళ్లంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. “ఏ విషయాల్ని చెప్పమని యెహోవా నీకు ఆజ్ఞాపించాడో వాటిని వినడానికి మేమంతా ఇప్పుడు దేవుని ముందు సిద్ధంగా ఉన్నాం” అని కొర్నేలి అన్నాడు. (అపొ. 10:33) ఎవరైనా అలాంటి ఆసక్తి చూపిస్తూ మీతో ఆ మాట అంటే మీకు ఎలా అనిపిస్తుంది! పేతురు మాట్లాడడం మొదలుపెట్టి, కనువిప్పు కలిగించే ఈ మాట అన్నాడు: “దేవునికి పక్షపాతం లేదని నాకు ఇప్పుడు నిజంగా అర్థమైంది. ప్రతీ జనంలో, తనకు భయపడి సరైనది చేసేవాళ్లను ఆయన అంగీకరిస్తాడు.” (అపొ. 10:34, 35) దేశం, జాతి, రంగు, రూపం లాంటి ఏ తేడాలూ దేవునికి లేవని పేతురు అర్థం చేసుకున్నాడు. తర్వాత యేసు చేసిన పరిచర్య గురించి, ఆయన చనిపోవడం-తిరిగి బ్రతకడం గురించి పేతురు వివరించాడు.
13, 14. (ఎ) క్రీస్తు శకం 36లో, అన్యజనులు క్రీస్తు శిష్యులుగా అయినప్పుడు ఏ మార్పు జరిగింది? (బి) పైకి కనిపించేదాన్ని బట్టి, ప్రజల విషయంలో మనం ఎందుకు ఒక ముగింపుకు రాకూడదు?
13 అప్పుడు, కనీవినీ ఎరుగని ఒక సంఘటన జరిగింది: పేతురు ఇంకా “మాట్లాడుతుండగానే” పవిత్రశక్తి అన్యజనుల మీద కుమ్మరించబడింది. (అపొ. 10:44, 45) బాప్తిస్మానికి ముందే పవిత్రశక్తి కుమ్మరించబడడం బైబిల్లో ఇక్కడ మాత్రమే చూస్తాం. దేవుడు వాళ్లను అంగీకరించాడని అర్థం చేసుకున్న పేతురు, ఆ అన్యజనుల్ని ‘బాప్తిస్మం తీసుకోమని ఆజ్ఞాపించాడు.’ (అపొ. 10:48) క్రీస్తు శకం 36లో, అన్యజనులు క్రీస్తు శిష్యులుగా అయినప్పుడు ఒక ముఖ్యమైన మార్పు జరిగింది, దేవుడు యూదుల్ని ప్రత్యేక ప్రజలుగా చూడడం అప్పటితో ముగిసిపోయింది. (దాని. 9:24-27) ఆ సమయంలో పేతురు ‘పరలోక రాజ్యం తాళంచెవుల్లో’ చివరిదైన మూడో తాళంచెవిని ఉపయోగించాడు. (మత్త. 16:19) సున్నతి పొందని అన్యజనులు కూడా అభిషిక్త క్రైస్తవులయ్యే అవకాశాన్ని ఈ మూడో తాళంచెవి తెరిచింది.
14 నేడు మంచివార్తను ప్రకటిస్తున్న మనం కూడా “దేవునికి పక్షపాతం లేదు” అని గుర్తుంచుకుంటాం. (రోమా. 2:11) దేవుడు, ‘అన్నిరకాల ప్రజలు రక్షించబడాలని కోరుకుంటున్నాడు.’ (1 తిమో. 2:4) కాబట్టి పైకి కనిపించేదాన్ని బట్టి, ప్రజల విషయంలో మనం ఒక ముగింపుకు రాకూడదు. దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో సాక్ష్యం ఇవ్వాలని యేసు మనకు ఆజ్ఞాపించాడు. కాబట్టి జాతి, దేశం, మతం, రంగు, రూపం అనే తేడాలు లేకుండా మనం అన్నిరకాల ప్రజలకు ప్రకటించాలి.
‘వాళ్లు అడ్డు చెప్పడం మానేసి, దేవుణ్ణి మహిమపర్చారు’ (అపొ. 11:1-18)
15, 16. కొంతమంది యూదా క్రైస్తవులు పేతురును ఎందుకు విమర్శించారు? మరి ఆయన వాళ్లకు ఎలా జవాబిచ్చాడు?
15 జరిగిందంతా చెప్పడానికి, పేతురు చాలా ఉత్సాహంగా యెరూషలేముకు బయల్దేరాడు. అయితే, సున్నతి పొందని అన్యజనులు “దేవుని వాక్యాన్ని అంగీకరించారు” అన్న సంగతి, ఆయన కన్నా ముందే అక్కడికి చేరుకుంది. పేతురు అక్కడికి వెళ్లిన వెంటనే, ‘సున్నతిని సమర్థించేవాళ్లు అతన్ని విమర్శించడం మొదలుపెట్టారు.’ పేతురు ‘సున్నతి పొందని వాళ్ల ఇంటికి వెళ్లి, వాళ్లతో కలిసి భోంచేయడం’ ఆ యూదా క్రైస్తవులకు అస్సలు నచ్చలేదు. (అపొ. 11:1-3) అన్యజనులు క్రైస్తవులుగా మారడంలో వాళ్లకు ఎలాంటి సమస్యా లేదు. యెహోవాకు నచ్చినట్టు ఆరాధించాలంటే ఆ అన్యజనులు సున్నతి చేయించుకోవాలని, మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలని ఆ యూదా క్రైస్తవులు పట్టుబట్టారు. మోషే ధర్మశాస్త్రాన్ని పట్టుకుని వేలాడుతున్న కొంతమంది యూదా క్రైస్తవులకు దాన్నుండి బయటికి రావడం చాలా కష్టమైంది.
16 మరి పేతురు వాళ్లకు ఎలా జవాబిచ్చాడు? అపొస్తలుల కార్యాలు 11:4-16 చెప్తున్నట్టు, దేవుని ఇష్టప్రకారమే ఆయన ఆ పని చేశాడని నిరూపించే నాలుగు కారణాల్ని పేతురు వివరించాడు: (1) ఆయనకు వచ్చిన దర్శనం (4-10 వచనాలు); (2) వాళ్ల దగ్గరకు వెళ్లమని పవిత్రశక్తే ఆయనకు చెప్పడం (11, 12 వచనాలు); (3) కొర్నేలికి దేవదూత కనిపించడం (13, 14 వచనాలు); (4) అన్యజనుల మీద పవిత్రశక్తి కుమ్మరించబడడం. (15, 16 వచనాలు) పేతురు చివరికి వాళ్లను ఆలోచింపజేసే ఈ ప్రశ్న అడిగాడు: “ప్రభువైన యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచిన మనకు దేవుడు పవిత్రశక్తి అనే ఉచిత బహుమతిని ఇచ్చాడు. అదే ఉచిత బహుమతిని దేవుడు వాళ్లకు కూడా ఇచ్చాడు. అలాంటప్పుడు, దేవుణ్ణి అడ్డుకోవడానికి నేను ఎవర్ని?”—అపొ. 11:17.
17, 18. (ఎ) పేతురు చెప్పింది విన్నాక యూదా క్రైస్తవులు ఏం చేశారు? (బి) నేడు సంఘాల్లో ఐక్యతను కాపాడుకోవడం ఎందుకు కొంచెం కష్టం? మనం ఏ ప్రశ్నల గురించి ఆలోచించాలి?
17 పేతురు చెప్పింది విన్నాక యూదా క్రైస్తవులు ఏం చేశారు? వాళ్లల్లో ఉన్న పక్షపాతాన్ని పక్కన పెట్టేసి, కొత్తగా బాప్తిస్మం తీసుకున్న అన్యజనుల్ని తమ తోటి క్రైస్తవులుగా అంగీకరించారా? బైబిలు ఇలా చెప్తుంది: “వాళ్లు ఈ విషయాలు విన్నప్పుడు పేతురుకు అడ్డు చెప్పడం మానేసి, ‘అంటే, దేవుడు అన్యజనులు కూడా జీవాన్ని పొందేలా పశ్చాత్తాపపడాలని కోరుకుంటున్నాడన్న మాట’ అని అంటూ దేవుణ్ణి మహిమపర్చారు.” (అపొ. 11:18) వాళ్లు వెంటనే తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవడం వల్ల సంఘం ఐక్యంగా ముందుకు వెళ్లింది.
18 నేడు నిజ క్రైస్తవులమైన మనం, “అన్నిదేశాల నుండి, గోత్రాల నుండి, జాతుల నుండి, భాషల నుండి” వచ్చాం. కాబట్టి మన మధ్య ఐక్యతను కాపాడుకోవడం కొంచెం కష్టమే. (ప్రక. 7:9) చాలా సంఘాల్లో వేర్వేరు జాతుల, ప్రాంతాల, భాషల, సంస్కృతుల వాళ్లు ఉంటారు. కాబట్టి మనం ఈ ప్రశ్నల గురించి ఆలోచించాలి: ‘నాలో వివక్ష, పక్షపాతం లాంటివి ఇంకా ఏమైనా ఉన్నాయా? దేశం, భాష, జాతి, కులం, సంస్కృతి వంటి వాటిని బట్టి తేడాలు చూపిస్తున్న ఈ లోకంలోని ప్రజల్లా, నేను కూడా నా తోటి క్రైస్తవుల మధ్య తేడాలు చూపిస్తున్నానా?’ కొన్నేళ్ల తర్వాత, పేతురు (కేఫా) ఏ తప్పు చేశాడో గుర్తు తెచ్చుకోండి. ఒకసారి పేతురు, కొంతమంది యూదా క్రైస్తవులకు భయపడి “అన్యజనులకు దూరంగా ఉండడం మొదలుపెట్టాడు.” అప్పుడు పౌలు ఆయన్ని సరిదిద్దాడు. (గల. 2:11-14) అందుకే, వివక్ష అనే జబ్బు మనలో మళ్లీ మొదలవ్వకుండా మనందరం జాగ్రత్తపడాలి.
అపొ. 11:19-26ఎ)
‘చాలామంది విశ్వాసులయ్యారు’ (19. అంతియొకయలో ఉన్న యూదా క్రైస్తవులు ఎవరికి ప్రకటించడం మొదలుపెట్టారు? దానివల్ల ఏం జరిగింది?
19 మరి యేసు అనుచరులు సున్నతి పొందని అన్యజనులకు ప్రకటించడం మొదలుపెట్టారా? సిరియాలోని అంతియొకయలో ఏం జరిగిందో ఆలోచించండి. d అంతియొకయ నగరంలో చాలామంది యూదులు ఉండేవాళ్లు. ఈ యూదులకు, అన్యజనులకు మధ్య సంబంధాలు బానే ఉండేవి. కాబట్టి అన్యజనులకు ప్రకటించడానికి క్రైస్తవులకు అక్కడ ఒక మంచి అవకాశం దొరికింది. అంతియొకయలో ఉన్న కొంతమంది యూదా క్రైస్తవులు ‘గ్రీకు భాష మాట్లాడే ప్రజలకు’ మంచివార్త ప్రకటించడం మొదలుపెట్టారు. (అపొ. 11:20) వాళ్లు గ్రీకు భాష మాట్లాడే యూదులకే కాదు, గ్రీకు భాష మాట్లాడే అన్యజనులకు కూడా ప్రకటించారు. యెహోవా వాళ్ల పనిని ఆశీర్వదించాడు, ‘చాలామంది విశ్వాసులయ్యారు.’—అపొ. 11:21.
20, 21. బర్నబా ఎలా వినయం చూపించాడు? మనం కూడా ఆయనలాగే పరిచర్యలో వినయం ఎలా చూపించవచ్చు?
20 అంతియొకయలో కోత విస్తారంగా ఉందని గుర్తించి, యెరూషలేములోని సంఘం బర్నబాను అక్కడికి పంపించింది. చాలామంది ఆసక్తి చూపిస్తుండడంతో, ఆ పనిని ఆయన ఒక్కడే చేయలేడని బర్నబాకు అర్థమైంది. మరి ఆయనకు ఎవరు సహాయం చేస్తారు? అన్యజనులకు అపొస్తలుడు అవ్వబోతున్న సౌలు కన్నా బాగా ఎవరు సహాయం చేయగలరు? (అపొ. 9:15; రోమా. 1:5) కానీ సౌలు తనకన్నా బాగా ప్రకటిస్తాడేమో అని భయపడి, బర్నబా వెనకడుగు వేశాడా? లేదు. ఆయన వినయం చూపిస్తూ తనకు సహాయం అవసరమని గుర్తించాడు. ఆయనే చొరవ తీసుకుని సౌలును వెదకడానికి తార్సుకు వెళ్లాడు. సౌలు కనిపించాక తనకు సహాయం చేయడానికి అంతియొకయకు రమ్మని అడిగాడు. వాళ్లిద్దరూ అక్కడ సంవత్సరంపాటు ఉండి, కొత్తగా క్రైస్తవులైన వాళ్లను ప్రోత్సహించారు, బలపర్చారు.—అపొ. 11:22-26ఎ.
21 మనం కూడా బర్నబాలాగే పరిచర్యలో ఎలా వినయం చూపించవచ్చు? వినయం ఉంటే మనకు సహాయం అవసరమని గుర్తిస్తాం. మనలో ఒక్కొక్కరికి ఒక్కో సామర్థ్యం, నైపుణ్యం ఉంటుంది. ఉదాహరణకు కొంతమంది అనియత సాక్ష్యం, ఇంటింటి పరిచర్య బాగా చేస్తుండవచ్చు. కానీ రిటన్ విజిట్‌లు చేయడం, బైబిలు స్టడీలు చేయడం వాళ్లకు కష్టంగా ఉండవచ్చు. ఇలాంటి విషయాల్లో మీకు సహాయం అవసరమా? అయితే వేరేవాళ్ల సహాయం తీసుకోండి. అప్పుడు మీరు పరిచర్యను ఇంకా బాగా, ఆనందంగా చేస్తారు.—1 కొరిం. 9:26.
“సహోదరులకు సహాయం” పంపించడం (అపొ. 11:26బి-30)
22, 23. అంతియొకయలో ఉన్న క్రైస్తవులు ఎలా ప్రేమ చూపించారు? నేడు దేవుని ప్రజలు కూడా వాళ్లలాగే ఏం చేస్తున్నారు?
22 దేవుని నిర్దేశం ప్రకారం, “శిష్యులు క్రైస్తవులని మొట్టమొదట పిలవబడింది అంతియొకయలోనే.” (అపొ. 11:26బి) దేవుడు ఇచ్చిన ఆ పేరు క్రీస్తును అనుసరించే వాళ్లకు సరిగ్గా సరిపోతుంది. అన్యజనులు క్రైస్తవులుగా మారిన తర్వాత వాళ్లూ, యూదా క్రైస్తవులూ ఒకరినొకరు ప్రేమించుకోవడం మొదలుపెట్టారా? దాదాపు క్రీస్తు శకం 46లో, గొప్ప కరువు వచ్చినప్పుడు ఏం జరిగిందో పరిశీలించండి. e బైబిలు కాలాల్లో, కరువు వచ్చినప్పుడు పేదవాళ్లు చాలా ఇబ్బందిపడే వాళ్లు. ఎందుకంటే, వాళ్ల దగ్గర డబ్బులు గానీ ఆహారం గానీ ఎక్కువగా ఉండేవి కావు. యూదయలో కరువు వచ్చినప్పుడు, అక్కడున్న యూదా క్రైస్తవుల్లో చాలామంది పేదవాళ్లే. వాళ్లకు డబ్బు, ఆహారం లాంటివి అవసరమయ్యాయి. ఆ సంగతి తెలిసినప్పుడు, అంతియొకయలోని క్రైస్తవులు “యూదయలో ఉన్న సహోదరులకు సహాయం” పంపించారు. (అపొ. 11:29) అలా పంపించిన వాళ్లలో క్రైస్తవులుగా మారిన అన్యజనులు కూడా ఉన్నారు. వాళ్లు తమ తోటి సహోదర సహోదరీల పట్ల నిజమైన ప్రేమ చూపించారు!
23 ఇప్పుడు కూడా దేవుని ప్రజల్లో అలాంటి ప్రేమే కనిపిస్తుంది. వేరే దేశంలో గానీ మన ప్రాంతంలో గానీ సహోదరులకు సహాయం అవసరమని తెలిస్తే, మనం వెంటనే ముందుకొచ్చి సహాయం అందిస్తాం. తుఫానులు, భూకంపాలు, సునామీలు లాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు, సహోదరులకు సహాయం చేయడానికి బ్రాంచి కమిటీలు వెంటనే విపత్తు సహాయక కమిటీల్ని ఏర్పాటు చేస్తాయి. ఆ ఏర్పాట్లన్నీ, సహోదరుల మీద మనకు నిజంగా ప్రేమ ఉందని చూపిస్తాయి.—యోహా. 13:34, 35; 1 యోహా. 3:17.
24. పేతురుకు వచ్చిన దర్శనం అర్థాన్ని మనం ఎప్పుడూ మనసులో ఉంచుకుంటున్నామని ఎలా చూపించవచ్చు?
24 యొప్పేలో మేడ మీద పేతురుకు వచ్చిన దర్శనం అర్థాన్ని మనం ఎప్పుడూ మనసులో ఉంచుకుంటాం. ఎలాంటి తేడాలు లేకుండా, అందర్నీ సమానంగా చూసే దేవున్ని మనం ఆరాధిస్తున్నాం. జాతి, దేశం, కులం లాంటి తేడాలు లేకుండా మనం అందరికీ దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో సాక్ష్యం ఇవ్వాలన్నదే యెహోవా కోరిక. కాబట్టి యెహోవా గురించి తెలుసుకునేలా, ప్రజలందరికీ ప్రకటించాలని గట్టిగా నిర్ణయించుకుందాం.—రోమా. 10:11-13.
a చర్మకారులు తమ పని కోసం చనిపోయిన జంతువుల్ని, అసహ్యమైన పదార్థాల్ని ఉపయోగించేవారు. అందుకే యూదులు వాళ్లను చిన్నచూపు చూస్తూ, ఆలయంలో అడుగుపెట్టే అర్హత వాళ్లకు లేదని అనుకునేవాళ్లు. వాళ్లు పని చేసుకునే స్థలం, నగరానికి కనీసం 20 మీటర్ల దూరంలో ఉండేది. సీమోను ఇల్లు “సముద్రతీరాన” ఎందుకుందో దీన్నిబట్టి అర్థమౌతుంది.—అపొ. 10:6.
b “ కొర్నేలి, రోమా సైన్యం” అనే బాక్సు చూడండి.
c “పిల్లలను పెంచే విషయంలో నమ్మదగిన సలహా” అనే ఆర్టికల్ నవంబరు 1, 2006 కావలికోట, 4-7 పేజీల్లో ఉంది.
d “ సిరియాలోని అంతియొకయ” అనే బాక్సు చూడండి.
e ఈ “గొప్ప కరువు” క్లౌదియ చక్రవర్తి పరిపాలిస్తున్న కాలంలో వచ్చిందని యూదా చరిత్రకారుడైన జోసిఫస్ చెప్పాడు (క్రీస్తు శకం 41-54).