పరిపాలక సభ నుండి ఉత్తరం
ప్రియమైన రాజ్య ప్రచారకులకు:
కాసేపు మిమ్మల్ని మీరు, ఒలీవల కొండ మీద ఉన్న అపొస్తలుల్లో ఒకరిగా ఊహించుకోండి. యేసు మీ కళ్ల ముందుకు వచ్చి నిలబడ్డాడు. కాసేపట్లో ఆయన పరలోకానికి వెళ్లిపోతాడు. అప్పుడు ఆయన ఇలా అన్నాడు: “పవిత్రశక్తి మీ మీదికి వచ్చినప్పుడు మీరు బలం పొందుతారు; అప్పుడు యెరూషలేములో, యూదయ అంతటిలో, సమరయలో, భూమంతటా మీరు నా గురించి సాక్ష్యమిస్తారు.” (అపొ. 1:8) ఆ మాట వినగానే, మీకు ఎలా అనిపిస్తుంది?
‘అమ్మో, ఇంత పని చేయడం మా వల్ల అవుతుందా? మేము కొద్దిమంది శిష్యులమే ఉన్నాం. “భూమంతటా” సాక్ష్యం ఇవ్వడం మా వల్ల అయ్యే పనేనా?’ అని మీకు అనిపించవచ్చు. అంతేకాదు, చనిపోవడానికి ముందు రోజు రాత్రి యేసు చెప్పిన ఈ విషయం మీకు గుర్తుకురావచ్చు: “దాసుడు తన యజమాని కన్నా గొప్పవాడు కాడు . . . వాళ్లు నన్ను హింసించారంటే మిమ్మల్ని కూడా హింసిస్తారు; నా మాటలు పాటించారంటే మీ మాటలు కూడా పాటిస్తారు. అయితే మీరు నా శిష్యులు కాబట్టి వాళ్లు ఇవన్నీ మీకు చేస్తారు; ఎందుకంటే నన్ను పంపించిన వ్యక్తి వాళ్లకు తెలీదు.” (యోహా. 15:20, 21) ఆ విషయం గురించి ఆలోచించినప్పుడు, ‘హింస, వ్యతిరేకత వచ్చినా నేనెలా పూర్తిస్థాయిలో సాక్ష్యమివ్వగలను?’ అనే ప్రశ్న మీకు రావచ్చు.
అపొస్తలులకే కాదు, ఇప్పుడున్న క్రైస్తవులకు కూడా అలాగే అనిపించవచ్చు. “భూమంతటా” ఉన్న “అన్నిదేశాల” ప్రజలకు పూర్తిస్థాయిలో సాక్ష్యమివ్వాల్సిన బాధ్యత, యెహోవాసాక్షులమైన మనకు ఉంది. (మత్త. 28:19, 20) యేసు చెప్పినట్టు వ్యతిరేకత వచ్చినా, మనం ఈ పనిని ఎలా చేయవచ్చు?
క్రీస్తు శకం మొదటి శతాబ్దంలోని అపొస్తలులు, మిగతా క్రైస్తవులు యెహోవా సహాయంతో ప్రకటనా పనిని ఎలా చేయగలిగారో తెలిపే ఆసక్తికరమైన కథే, బైబిల్లోని అపొస్తలుల కార్యాలు పుస్తకం. దాన్ని లోతుగా పరిశీలించడానికి, అందులో ఉన్న సంఘటనలు మీ కళ్ల ముందే జరుగుతున్నట్టు ఊహించుకోవడానికి మీ చేతుల్లో ఉన్న ఈ పుస్తకం సహాయం చేస్తుంది. అలా చదువుతున్నప్పుడు అప్పటి క్రైస్తవులకు, ఇప్పుడున్న మనకు మధ్య చాలా పోలికలు ఉన్నాయని తెలుసుకుని మీరు ఆశ్చర్యపోతారు. కేవలం ప్రకటనా పని చేయడంలోనే కాదు, ఒక సంస్థగా మనం ఆ పని చేసే తీరులో కూడా పోలికలు ఉన్నాయని మీరు గమనిస్తారు. ఆ పోలికల గురించి ఆలోచించినప్పుడు, తన సంస్థలోని భూభాగాన్ని ఇప్పుడు కూడా యెహోవాయే నడిపిస్తున్నాడు అని మీరు ఇంకా గట్టిగా నమ్ముతారు.
అపొస్తలుల కార్యాలు పుస్తకం చదవడం వల్ల యెహోవా మీకు సహాయం చేస్తాడనే, తన పవిత్రశక్తితో మిమ్మల్ని బలపరుస్తాడనే నమ్మకం మీలో పెరగాలని మేము కోరుకుంటున్నాం. అలా, “దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో సాక్ష్యమిస్తూ” రక్షణ పొందేలా ఇతరులకు సహాయం చేయాలనే మీ కోరిక రెట్టింపు అవ్వాలని మేము ప్రార్థిస్తున్నాం.—అపొ. 28:23; 1 తిమో. 4:16.
మీ సహోదరులు,
యెహోవాసాక్షుల పరిపాలక సభ