కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 13

“చాలాసేపు తీవ్రమైన వాద ప్రతివాదాలు జరిగాయి”

“చాలాసేపు తీవ్రమైన వాద ప్రతివాదాలు జరిగాయి”

సున్నతి గురించిన వివాదాంశం పరిపాలక సభ ముందుకు వెళ్లింది

అపొస్తలుల కార్యాలు 15:1-12 ఆధారంగా

1-3. (ఎ) మొదటి శతాబ్దంలోని క్రైస్తవ సంఘంలో ఏ తీవ్రమైన వివాదం మొదలైంది? (బి) దీని గురించి పరిశీలించడం వల్ల మనం ఏం నేర్చుకుంటాం?

 పౌలు బర్నబాలు తమ మొట్టమొదటి మిషనరీ యాత్రను పూర్తి చేసుకుని సిరియాలోని అంతియొకయకు సంతోషంగా తిరిగొచ్చారు. యెహోవా అన్యజనుల కోసం ‘విశ్వాసమనే తలుపు తెరవడం’ చూసి వాళ్లు ఆనందంతో ఉప్పొంగిపోయారు. (అపొ. 14:26, 27) ఇక్కడ అంతియొకయలో కూడా ప్రకటనా పని ఊపందుకుంది, “చాలామంది” అన్యజనులు విశ్వాసులౌతూ ఉన్నారు.—అపొ. 11:20-26.

2 ఆ వార్త చాలా త్వరగానే యూదయకు చేరింది. కానీ దాన్ని విని సంతోషించే బదులు, క్రైస్తవులుగా మారిన అన్యజనులు సున్నతి చేయించుకోవాలని కొంతమంది పట్టుబట్టారు. ఇంకొంతమందేమో, అలా చేయించుకోవాల్సిన అవసరం లేదు అన్నారు. దాంతో ఒక వివాదం మొదలైంది. క్రైస్తవులుగా మారిన యూదులు, క్రైస్తవులుగా మారిన అన్యజనులు ఒకరితో ఒకరు ఎలా ఉండాలి? క్రైస్తవులుగా మారిన అన్యజనులు మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలా? అనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మారి, క్రైస్తవ సంఘాన్ని ముక్కలు ముక్కలు చేసే ప్రమాదం ఉంది. మరి దీన్ని ఎలా పరిష్కరించాలి?

3 అపొస్తలుల కార్యాలు పుస్తకంలో దీని గురించి పరిశీలిస్తుండగా ఎన్నో ముఖ్యమైన పాఠాల్ని నేర్చుకుంటాం. నేడు మన ఐక్యతను పాడుచేసే సమస్యలు వచ్చినప్పుడు, వాటిని ఎలా తెలివిగా పరిష్కరించవచ్చో తెలుసుకుంటాం.

“సున్నతి చేయించుకుంటేనే” (అపొ. 15:1)

4. కొంతమంది యూదా క్రైస్తవులు ఏమని బోధించడం మొదలుపెట్టారు? మనకు ఏ ప్రశ్న రావచ్చు?

4 అసలేం జరిగిందో చెప్తూ లూకా ఇలా రాశాడు: “యూదయ నుండి కొంతమంది [సిరియాలోని] అంతియొకయకు వచ్చి, ‘మీరు మోషే ధర్మశాస్త్రం ప్రకారం సున్నతి చేయించుకుంటేనే రక్షించబడతారు’ అని సహోదరులకు బోధించడం మొదలుపెట్టారు.” (అపొ. 15:1) ‘యూదయ నుండి వచ్చిన ఆ కొంతమంది’ క్రైస్తవులుగా మారకముందు పరిసయ్యులో కాదో మనకు తెలియదు. కానీ ధర్మశాస్త్రం విషయంలో, వాళ్ల ఆలోచన పరిసయ్యుల్లాగే కఠినంగా ఉంది. అంతేకాదు యెరూషలేములో ఉన్న అపొస్తలుల, పెద్దల తరఫున మాట్లాడుతున్నామని వాళ్లు చెప్పి ఉండవచ్చు, కానీ అది నిజం కాదు. (అపొ. 15:23, 24) దేవుని నిర్దేశం ప్రకారం అపొస్తలుడైన పేతురు సున్నతి పొందని అన్యజనుల్ని క్రైస్తవ సంఘంలోకి ఆహ్వానించి, అప్పటికే 13 సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా, సున్నతి చేయించుకోవాల్సిందే అని యూదా క్రైస్తవులు ఎందుకు పట్టుబట్టుతున్నారు? aఅపొ. 10:24-29, 44-48.

5, 6. (ఎ) కొంతమంది యూదా క్రైస్తవులు ఎందుకు సున్నతి గురించి పట్టుబట్టారు? (బి) సున్నతి ఒప్పందం అబ్రాహాము ఒప్పందంలో భాగమా? వివరించండి. (అధస్సూచి చూడండి.)

5 అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు. ఒకటేంటంటే, యెహోవాయే తన ప్రజల్లోని పురుషులందర్నీ సున్నతి చేయించుకోమని చెప్పాడు. సున్నతి చేయించుకోవడం యెహోవాతో వాళ్లకున్న ప్రత్యేకమైన బంధానికి గుర్తుగా ఉండేది. అబ్రాహాము, ఆయన ఇంటివాళ్లందరూ సున్నతి చేయించుకోవాలని యెహోవా ఆజ్ఞాపించాడు. b తర్వాత ఇశ్రాయేలీయులకు కూడా యెహోవా ఆ ఆజ్ఞ ఇచ్చాడు. (లేవీ. 12:2, 3) ధర్మశాస్త్రం ప్రకారం పస్కా లాంటి పండుగల్లో పాల్గొనాలంటే, పరదేశులు సైతం సున్నతి చేయించుకోవాల్సిందే. (నిర్గ. 12:43, 44, 48, 49) నిజానికి యూదులు సున్నతి పొందని వాళ్లను అపవిత్రులుగా, దేవుని సేవకు అర్హులు కాదన్నట్టుగా చూసేవాళ్లు.—యెష. 52:1.

6 కాబట్టి యెహోవా ఆలోచనలకు తగ్గట్టు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవడానికి క్రైస్తవులుగా మారిన యూదులకు విశ్వాసం, వినయం అవసరమైంది. ధర్మశాస్త్రం స్థానంలో కొత్త ఒప్పందం వచ్చాక, ఒక వ్యక్తి యూదునిగా పుట్టినంత మాత్రాన దేవుని ప్రజల్లో ఒకడు అవ్వలేడు. అంతేకాదు యూదయ లాంటి ప్రాంతాల్లో నివసిస్తున్న యూదా క్రైస్తవులకు ధైర్యం కూడా అవసరమైంది. ఎందుకంటే, యూదుల మధ్య ఉంటూ క్రీస్తును మెస్సీయగా అంగీకరించడం, సున్నతి పొందని వాళ్లతో కలిసి దేవుణ్ణి ఆరాధించడం అనేది చిన్న విషయమేం కాదు.—యిర్మీ. 31:31-33; లూకా 22:20.

7. ‘యూదయ నుండి వచ్చిన కొంతమంది’ ఏ విషయాన్ని అర్థం చేసుకోలేకపోయారు?

7 అయితే ధర్మశాస్త్రంలో ఉన్న ప్రాథమిక సత్యాలన్నీ కొత్త ఒప్పందంలో కూడా ఉన్నాయి, కాబట్టి యెహోవా ప్రమాణాల్లో ఏ మార్పూ రాలేదని చెప్పవచ్చు. (మత్త. 22:36-40) సున్నతి గురించి చెప్తూ పౌలు ఒక సందర్భంలో ఇలా రాశాడు: “హృదయంలో యూదునిగా ఉన్నవాడే అసలైన యూదుడు; అతని సున్నతి హృదయానికి సంబంధించినది. ఆ సున్నతి పవిత్రశక్తి ద్వారా జరుగుతుంది, ధర్మశాస్త్రం ద్వారా కాదు.” (రోమా. 2:29; ద్వితీ. 10:16) ‘యూదయ నుండి వచ్చిన కొంతమంది’ ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోయారు. అందుకే యెహోవా ఇప్పటికీ తన ప్రజలు సున్నతి చేయించుకోవాలనే కోరుకుంటున్నాడని వాదిస్తున్నారు. మరి వాళ్లు తమ ఆలోచనను మార్చుకుంటారా?

“తీవ్రమైన వాద ప్రతివాదాలు జరిగాయి” (అపొ. 15:2)

8. సున్నతి గురించిన వివాదం పరిపాలక సభ ముందుకు ఎందుకు వెళ్లింది?

8 లూకా ఇంకా ఇలా రాశాడు: “వాళ్లకు [అంటే, యూదయ నుండి వచ్చిన కొంతమందికి], పౌలు బర్నబాలకు మధ్య చాలాసేపు తీవ్రమైన వాద ప్రతివాదాలు జరిగాయి. అప్పుడు సహోదరులు ఈ వివాదం గురించి యెరూషలేములో ఉన్న అపొస్తలులతో, పెద్దలతో మాట్లాడడానికి పౌలును, బర్నబాను, ఇంకొంతమందిని పంపాలని నిర్ణయించారు.” c (అపొ. 15:2) “తీవ్రమైన వాద ప్రతి వాదాలు జరిగాయి” అంటే, రెండువైపుల వాళ్లు తాము చెప్పేదే సరైనదని బలంగా నమ్మారని, ఎదుటివాళ్లు చెప్పేదాన్ని ఒప్పుకోలేకపోయారని అర్థమౌతుంది. అందుకే అంతియొకయ సంఘం దాన్ని పరిష్కరించలేకపోయింది. శాంతిని, ఐక్యతను కాపాడడం కోసం ఆ సమస్యను యెరూషలేములో ఉన్న ‘అపొస్తలులు, పెద్దల’ ముందుకు అంటే పరిపాలక సభ ముందుకు తీసుకెళ్లాలి అనే తెలివైన నిర్ణయాన్ని సంఘం తీసుకుంది. అంతియొకయలో ఉన్న పెద్దల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

‘మోషే ధర్మశాస్త్రాన్ని పాటించమని అన్యజనులకు ఆజ్ఞాపించాలి’ అని కొంతమంది పట్టుబట్టారు

9, 10. అంతియొకయలో ఉన్న సహోదరులు, పౌలు, బర్నబా మనకు ఎలాంటి ఆదర్శాన్ని ఉంచారు?

9 మనం నేర్చుకునే ఒక విలువైన పాఠం ఏంటంటే, దేవుని సంస్థను పూర్తిగా నమ్మాలి. ఒకసారి ఆలోచించండి: పరిపాలక సభలోని క్రైస్తవులందరూ యూదులే అన్న విషయం అంతియొకయలోని సహోదరులకు తెలుసు. అయినా, సున్నతి విషయంలో లేఖనాల ప్రకారం పరిపాలక సభ ఒక మంచి నిర్ణయం తీసుకుంటుందని వాళ్లు నమ్మారు. ఎందుకు? యెహోవా తన పవిత్రశక్తి ద్వారా, సంఘానికి శిరస్సయిన యేసుక్రీస్తు ద్వారా మంచి నిర్ణయం తీసుకునేలా వాళ్లకు సహాయం చేస్తాడని వాళ్లు పూర్తిగా నమ్మారు. (మత్త. 28:18, 20; ఎఫె. 1:22, 23) నేడు తీవ్రమైన సమస్యలు వచ్చినప్పుడు, మనం కూడా అంతియొకయలోని సహోదరుల మంచి ఆదర్శాన్ని పాటిద్దాం. వాళ్లలాగే దేవుని సంస్థ మీద, అభిషిక్త సహోదరులున్న పరిపాలక సభ మీద పూర్తి నమ్మకం ఉంచుదాం.

10 వినయం, ఓర్పు గురించి కూడా మనం నేర్చుకోవచ్చు. అన్యజనులకు ప్రకటించేలా పవిత్రశక్తే పౌలు, బర్నబాలను నియమించింది. ఆ అధికారాన్ని ఉపయోగించి అక్కడికక్కడే ఈ వివాదాన్ని పరిష్కరించాలని వాళ్లు అనుకోలేదు. (అపొ. 13:2, 3) నిజానికి తర్వాతి రోజుల్లో పౌలు ఇలా రాశాడు: “[యెరూషలేముకు] వెళ్లాలని నాకు బయల్పర్చబడింది కాబట్టే వెళ్లాను.” అంటే పవిత్రశక్తే ఆయన్ని అలా నిర్దేశించింది. (గల. 2:2) నేడు సంఘంలో శాంతిని, ఐక్యతను దెబ్బతీసే సమస్యలు ఎదురైనప్పుడు, అలాంటి వినయాన్ని, ఓర్పును చూపించడానికి పెద్దలు ప్రయత్నించాలి. అంతేకాదు, తాము చెప్పేదే సరైనదని వాదించకుండా యెహోవా ఆలోచన ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. దానికోసం బైబిల్ని జాగ్రత్తగా అధ్యయనం చేయాలి, నమ్మకమైన దాసుడు ఇచ్చిన ప్రచురణల్లో పరిశోధన చేయాలి.—ఫిలి. 2:2, 3.

11, 12. దేన్నైనా యెహోవా స్పష్టం చేసేంతవరకు ఓపిగ్గా ఎదురుచూడడం ఎందుకు ప్రాముఖ్యం?

11 కొన్నిసార్లు ఏదైనా ఒక విషయంలో యెహోవా నిర్దేశం ఏంటో తెలుసుకోవడానికి మనం ఓపిగ్గా ఎదురుచూడాల్సి రావచ్చు. నిజానికి క్రీస్తు శకం 36 లో నే కొర్నేలి పవిత్రశక్తితో అభిషేకించబడ్డాడు. ఇప్పుడు క్రీస్తు శకం 49 లో వాళ్లు సున్నతి గురించి చర్చించుకుంటున్నారు. అంటే, సున్నతి విషయంలో యెహోవా స్పష్టమైన నిర్దేశం ఇచ్చేంతవరకు ఆ సహోదరులు దాదాపు 13 ఏళ్లు వేచి ఉండాల్సి వచ్చింది. యెహోవా ఎందుకు వెంటనే స్పష్టమైన నిర్దేశాలు ఇవ్వలేదు? మంచి మనసున్న యూదులు ఈ పెద్ద మార్పుకు అలవాటుపడేలా, తన అభిప్రాయానికి తగ్గట్టు వాళ్ల ఆలోచనను మార్చుకునేలా కొంత సమయాన్ని ఇవ్వాలని యెహోవా అనుకుని ఉంటాడు. యెహోవా అబ్రాహాముతో చేసిన సున్నతి ఒప్పందాన్ని యూదులు 1900 ఏళ్లుగా పాటిస్తూ వస్తున్నారు. వాళ్లు అబ్రాహామును ఎంతో గౌరవించేవాళ్లు, ప్రేమించేవాళ్లు. ఇప్పుడు ఉన్నట్టుండి సున్నతి ఏర్పాటును పాటించాల్సిన అవసరం లేదంటే, ఆ మార్పును అంగీకరించడం యూదులకు కష్టంగానే ఉంటుంది!—యోహా. 16:12.

12 ఇంత ఓర్పుగా, దయగా బోధించే పరలోక తండ్రి దగ్గర నేర్చుకునే అవకాశం దొరకడం నిజంగా ఒక గొప్ప వరం! ఆయన బోధించేది ఎప్పుడూ మన మంచికోసమే. (యెష. 48:17, 18; 64:8) సంస్థ ఏర్పాట్లలో గానీ, లేఖనాల అవగాహనలో గానీ ఏదైనా మార్పు వచ్చినప్పుడు, గర్వంతో మనం అనుకునేదే సరైనదని పట్టుబట్టకుండా, విమర్శించకుండా ఉందాం. (ప్రసం. 7:8) మీలో అలాంటి స్వభావం రవ్వంత ఉందని అనిపించినా, అపొస్తలుల కార్యాలు 15వ అధ్యాయం నుండి ఏం నేర్చుకోవచ్చో లోతుగా ఆలోచించండి. దాన్నుండి నేర్చుకున్న వాటిని పాటించడానికి సహాయం చేయమని యెహోవాను అడగండి. d

13. యెహోవాలాగే మనం పరిచర్యలో ఎలా ఓపిక చూపించవచ్చు?

13 మన బైబిలు విద్యార్థులు కొన్ని అబద్ధమత నమ్మకాల్ని, ఆచారాల్ని చాలాకాలంగా, ఎంతో ఇష్టంగా పాటిస్తుండవచ్చు. కాబట్టి వాళ్ల విషయంలో మనం కూడా యెహోవాలా ఓపిక చూపించాలి. దేవుని ఆలోచనకు తగ్గట్టు వాళ్ల హృదయాల్ని మార్చుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. అప్పటివరకు మనం వాళ్లకు ఓపిగ్గా సహాయం చేస్తూ ఉండాలి. (1 కొరిం. 3:6, 7) అంతేకాదు వాళ్ల గురించి ప్రార్థించాలి. వాళ్లకు ఎలా సహాయం చేస్తే మంచిదో యెహోవాయే సరైన సమయంలో మనకు తెలియజేస్తాడు.—1 యోహా. 5:14.

వాళ్లు ప్రోత్సాహకరమైన అనుభవాల్ని “వివరంగా” చెప్పారు (అపొ. 15:3-5)

14, 15. పౌలు, బర్నబా, ఇతర ప్రయాణికుల మీద అంతియొకయ సంఘం ప్రేమను, గౌరవాన్ని ఎలా చూపించింది? పౌలు, అతనితో ఉన్నవాళ్లు ఫేనీకే, సమరయ గుండా ప్రయాణిస్తూ సహోదరుల్ని ఎలా ప్రోత్సహించారు?

14 తర్వాత ఏం జరిగిందో చెప్తూ లూకా ఇలా రాశాడు: “సంఘం వాళ్లను సాగనంపింది. వాళ్లు ఫేనీకే, సమరయ గుండా ప్రయాణిస్తూ, అన్యజనులు దేవుని వైపుకు తిరగడం గురించి అక్కడి సహోదరులకు వివరంగా చెప్తూ వాళ్లకు ఎంతో సంతోషం కలిగించారు.” (అపొ. 15:3) అలా సాగనంపడం ద్వారా వాళ్లంటే సంఘానికి ఎంత ప్రేమ, గౌరవం ఉందో చూపించారు. అలాగే దేవుని ఆశీర్వాదం వాళ్ల మీద ఉండాలని కోరుకుంటున్నట్టు తెలియజేశారు. ఈ విషయంలో కూడా అంతియొకయలోని సహోదరులు మంచి ఆదర్శం ఉంచారు! మీరు కూడా సహోదర సహోదరీల మీద, ముఖ్యంగా “మాట్లాడే విషయంలో, బోధించే విషయంలో” కష్టపడి పనిచేసే పెద్దల మీద గౌరవం చూపిస్తున్నారా?—1 తిమో. 5:17.

15 పౌలు, అతనితో ఉన్నవాళ్లు ఫేనీకే, సమరయ మీదుగా ప్రయాణిస్తూ అక్కడున్న క్రైస్తవులతో ప్రోత్సాహకరమైన అనుభవాలు పంచుకున్నారు, అన్యజనులకు ప్రకటించినప్పుడు ఎలాంటి మంచి ఫలితాలు వచ్చాయో “వివరంగా” చెప్పారు. ఫేనీకే, సమరయ ప్రాంతాల్లోని క్రైస్తవుల్లో, స్తెఫను చనిపోయాక వేర్వేరు ప్రాంతాలకు చెదిరిపోయిన యూదా క్రైస్తవులు కూడా ఉండి ఉంటారు. అదేవిధంగా, నేడు కూడా ప్రకటనా పనిని యెహోవా ఎలా దీవిస్తున్నాడో చెప్పే అనుభవాల్ని విన్నప్పుడు మనకు, ముఖ్యంగా కష్టాల్ని ఎదుర్కొంటున్న వాళ్లకు చాలా ప్రోత్సాహంగా అనిపిస్తుంది. మనం అలాంటి అనుభవాల్ని మీటింగ్స్‌లో, సమావేశాల్లో వింటాం; పత్రికల్లో, jw.orgలో చూస్తాం. మరి వాటినుండి మీరు పూర్తి ప్రయోజనం పొందుతున్నారా?

16. సున్నతి గురించిన విషయం ఒక పెద్ద సమస్యగా మారిందని ఎందుకు చెప్పవచ్చు?

16 వాళ్లంతా అంతియొకయకు దక్షిణం వైపు దాదాపు 550 కిలోమీటర్లు ప్రయాణించి చివరికి యెరూషలేముకు చేరుకున్నారు. లూకా ఇలా రాశాడు: “వాళ్లు యెరూషలేముకు వచ్చినప్పుడు అక్కడి సంఘంలోని వాళ్లు, అపొస్తలులు, పెద్దలు వాళ్లను సాదరంగా ఆహ్వానించారు. పౌలు, బర్నబాలు దేవుడు తమ ద్వారా చేసిన వాటన్నిటి గురించి వాళ్లకు చెప్పారు.” (అపొ. 15:4) అయితే, “అంతకుముందు పరిసయ్యుల బోధల్ని అనుసరించి, ఆ తర్వాత విశ్వాసులుగా మారిన కొంతమంది లేచి నిలబడి ‘విశ్వాసులుగా మారిన అన్యజనులు సున్నతి చేయించుకోవాలి; మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలని వాళ్లకు ఆజ్ఞాపించాలి’ అని అన్నారు.” (అపొ. 15:5) సున్నతి గురించిన విషయం ఒక పెద్ద సమస్యగా మారిందని స్పష్టంగా అర్థమౌతుంది, దాన్ని పరిష్కరించడం చాలా ప్రాముఖ్యం.

“అపొస్తలులు, పెద్దలు సమావేశమయ్యారు” (అపొ. 15:6-12)

17. యెరూషలేములోని పరిపాలక సభలో ఎవరెవరు ఉన్నారు? అందులో “పెద్దలు” కూడా ఎందుకు ఉన్నారు?

17 “సలహా కోసం వెదికేవాళ్ల దగ్గర తెలివి ఉంటుంది” అని సామెతలు 13:10 చెప్తుంది. ఆ సూత్రాన్ని పాటిస్తూ, సున్నతి గురించి మాట్లాడడానికి “అపొస్తలులు, పెద్దలు సమావేశమయ్యారు.” (అపొ. 15:6) మనకాలంలోని పరిపాలక సభలాగే ఆ “అపొస్తలులు, పెద్దలు” అప్పటి క్రైస్తవ సంఘమంతటికీ ప్రతినిధులుగా సేవ చేశారు. అపొస్తలులతో పాటు “పెద్దలు” ఎందుకు ఉన్నారు? ఒకసారి గుర్తుచేసుకోండి: వ్యతిరేకులు అపొస్తలుడైన యాకోబును చంపేశారు, అపొస్తలుడైన పేతురును జైల్లో వేశారు. అదే పరిస్థితి మిగతా అపొస్తలులకు కూడా వస్తే, అప్పుడేంటి? అలాంటి పరిస్థితుల్లో పనిని క్రమంగా పర్యవేక్షించడం కోసం ఈ అభిషిక్త సహోదరుల సహాయం ఎంతో అవసరం.

18, 19. పేతురు ఏం మాట్లాడాడు? ఆయన మాటలు అక్కడున్న వాళ్లకు ఏం గుర్తు చేశాయి?

18 లూకా ఇంకా ఇలా రాశాడు: “చాలాసేపు తీవ్రంగా చర్చించుకున్న తర్వాత పేతురు లేచి నిలబడి ఇలా అన్నాడు: ‘సహోదరులారా, అన్యజనులు మొదట నా ద్వారా మంచివార్త విని విశ్వాసం ఉంచాలని దేవుడు మీలో నుండి నన్ను ఎంచుకున్నాడని మీకు బాగా తెలుసు. అయితే, దేవునికి హృదయాలు తెలుసు; ఆయన మనకు ఇచ్చినట్టే వాళ్లకు కూడా పవిత్రశక్తిని ఇచ్చి, తాను వాళ్లను ఆమోదించానని సాక్ష్యమిచ్చాడు. వాళ్లకున్న విశ్వాసాన్ని బట్టి వాళ్ల హృదయాల్ని పవిత్రపర్చడం ద్వారా దేవుడు మనల్ని, అన్యజనుల్ని ఒకేలా చూస్తున్నానని తెలియజేశాడు.’” (అపొ. 15:7-9) 7వ వచనంలో ‘తీవ్రంగా చర్చించుకున్నారు’ అని అనువదించిన గ్రీకు పదానికి, వాళ్లు ప్రశ్నలు అడుగుతూ ఆ విషయం గురించి లోతుగా పరిశీలించారు అనే అర్థం ఉంది. వాళ్లకు వేర్వేరు అభిప్రాయాలు ఉన్నప్పటికీ, మొహమాటం లేకుండా వాళ్లకు ఏమనిపిస్తుందో స్వేచ్ఛగా చెప్తూ దాని గురించి చర్చించుకున్నారు.

19 పేతురు మాటలు వాళ్లకు ఒక విషయాన్ని స్పష్టంగా గుర్తు చేశాయి: క్రీస్తు శకం 36 లో, దేవుడు మొట్టమొదటిసారి సున్నతి పొందని అన్యజనుల్ని, అంటే కొర్నేలిని, అతని ఇంటివాళ్లను పవిత్రశక్తితో అభిషేకించడాన్ని పేతురు కళ్లారా చూశాడు. స్వయంగా యెహోవాయే యూదులకు, యూదులు కానివాళ్లకు ఏ తేడా లేదని చూపించాడు. మరి అలా తేడాలు చూపించడానికి మనుషులకు ఏ అధికారం ఉంది? ధర్మశాస్త్రం పాటించడం వల్ల కాదుగానీ, క్రీస్తు మీద విశ్వాసం ఉంచడం వల్లే ఒకవ్యక్తి నీతిమంతుడిగా అవుతాడని కూడా పేతురు మాటలు చూపించాయి.—గల. 2:16.

20. సున్నతి గురించి పట్టుబట్టేవాళ్లు “దేవుణ్ణి ఎలా పరీక్షిస్తున్నారు”?

20 దేవుడు తన వాక్యం ద్వారా, పవిత్రశక్తి ద్వారా ఇచ్చిన తిరుగులేని సాక్ష్యం గురించి చెప్తూ పేతురు చివరికి ఇలా అన్నాడు: “మన పూర్వీకులు గానీ మనం గానీ మోయలేని బరువును శిష్యుల మీద పెడుతూ మీరెందుకు ఇప్పుడు దేవుణ్ణి పరీక్షిస్తున్నారు? యూదులమైన మనం ప్రభువైన యేసు అపారదయ ద్వారా రక్షణ పొందుతామని నమ్ముతున్నాం, శిష్యులుగా మారిన అన్యజనులు కూడా అదే నమ్ముతున్నారు.” (అపొ. 15:10, 11) సున్నతి గురించి వాదించేవాళ్లు “దేవుణ్ణి పరీక్షిస్తున్నారు,” ఇంకో మాటలో చెప్పాలంటే, ‘ఆయన సహనానికి పరీక్ష పెడుతున్నారు’ అని పేతురు అన్నాడు. క్రైస్తవులుగా మారిన అన్యజనులు ధర్మశాస్త్రాన్ని పాటించాలని వాళ్లు పట్టుబట్టారు, కానీ వాళ్లే ధర్మశాస్త్రాన్ని పూర్తిగా పాటించలేకపోతున్నారు. అందుకే వాళ్లు మరణశిక్షకు అర్హులని ధర్మశాస్త్రం తీర్పు తీర్చింది. (గల. 3:10) ఆ యూదా క్రైస్తవులు అలా పట్టుబట్టే బదులు, యేసు ద్వారా దేవుడు చూపించిన అపారదయను బట్టి కృతజ్ఞత చూపించి ఉండాల్సింది.

21. అపొస్తలులు, పెద్దలు సరైన ముగింపుకు రాగలిగేలా పౌలు, బర్నబా ఏం చేశారు?

21 పేతురు అన్న మాటలకు వాళ్లంతా ఆలోచనలో పడి “నిశ్శబ్దంగా ఉండిపోయారు.” ఆ తర్వాత పౌలు, బర్నబాలు “దేవుడు తమ ద్వారా అన్యజనుల మధ్య చేసిన ఎన్నెన్నో సూచనల గురించి, అద్భుతాల గురించి చెప్పారు.” (అపొ. 15:12) అలా చివరికి అపొస్తలులు, పెద్దలు అన్నీ పరిశీలించి సున్నతి విషయంలో దేవుని ఆలోచనలకు తగ్గట్టు ఒక సరైన ముగింపుకు రాగలిగారు.

22-24. (ఎ) మొదటి శతాబ్దంలోని పరిపాలక సభ ఆదర్శాన్ని నేటి పరిపాలక సభ ఎలా పాటిస్తుంది? (బి) సంస్థలోని ఏర్పాట్ల పట్ల నేడు పెద్దలు ఎలా గౌరవం చూపించవచ్చు?

22 నేడు కూడా పరిపాలక సభ సభ్యులు కలుసుకున్నప్పుడు నిర్దేశం కోసం దేవుని వాక్యం మీద ఆధారపడతారు, పవిత్రశక్తి కోసం పట్టుదలగా ప్రార్థిస్తారు. (కీర్త. 119:105; మత్త. 7:7-11) చర్చించుకోబోయే విషయాల గురించి ప్రతీ పరిపాలక సభ సభ్యునికి ముందుగానే తెలియజేయబడుతుంది. దేవుని ఆలోచనకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకునేలా వాళ్లు దానిగురించి ప్రార్థించి, ఆలోచించి మీటింగ్‌కి వస్తారు. (సామె. 15:28) వాళ్లు సమావేశమైనప్పుడు ఈ అభిషిక్త సహోదరులు తమ అభిప్రాయాన్ని గౌరవంగా, స్వేచ్ఛగా చెప్తారు; అలాగే బైబిల్ని ఎక్కువగా ఉపయోగిస్తారు.

23 పెద్దలు కూడా అదే ఆదర్శాన్ని పాటించాలి. ఏదైనా ముఖ్యమైన విషయం గురించి చర్చించుకున్న తర్వాత కూడా ఒక ముగింపుకు రాలేకపోతుంటే బ్రాంచి కార్యాలయాన్ని గానీ, దాని ప్రతినిధులుగా సేవ చేసే ప్రాంతీయ పర్యవేక్షకుల్లాంటి వాళ్లను గానీ పెద్దలు సంప్రదించవచ్చు. బ్రాంచి కార్యాలయం అవసరమైతే పరిపాలక సభ సహాయం తీసుకుంటుంది.

24 సంస్థ ద్వారా, సంఘం ద్వారా ఇచ్చే నిర్దేశాల్ని ఇష్టపూర్వకంగా పాటించేవాళ్లను; అలాగే వినయం, విశ్వసనీయత, ఓర్పు వంటి లక్షణాల్ని చూపించే వాళ్లను యెహోవా ఆశీర్వదిస్తాడు. అంతేకాదు సంఘంలో శాంతి-ఐక్యత పెరిగేలా, సంఘం అభివృద్ధి అయ్యేలా యెహోవా దీవిస్తాడు. దాని గురించి మనం తర్వాతి అధ్యాయంలో చూస్తాం.

a కపట సహోదరుల బోధలు” అనే బాక్సు చూడండి.

b సున్నతి ఒప్పందం అబ్రాహాము ఒప్పందంలో భాగం కాదు, అబ్రాహాము ఒప్పందం ఇప్పటికీ అమల్లోనే ఉంది. క్రీస్తు పూర్వం 1943 లో అబ్రాహాము, కనానుకు వెళ్లే దారిలో యూఫ్రటీసు నదిని దాటినప్పుడు ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. అప్పుడు అబ్రాహాము వయస్సు 75 సంవత్సరాలు. ఆ తర్వాత, అంటే క్రీస్తు పూర్వం 1919 లో అబ్రాహాముకు 99 ఏళ్ల వయసు ఉన్నప్పుడు సున్నతి ఒప్పందం మొదలైంది.—ఆది. 12:1-8; 17:1, 9-14; గల. 3:17.

c గ్రీకువాడైన తీతు క్రైస్తవుడిగా మారిన అన్యుడు. ఆయన పౌలుతో కలిసి పని చేశాడు. యెరూషలేముకు పంపించబడిన వాళ్లల్లో ఆయన కూడా ఉన్నాడు. (గల. 2:1; తీతు 1:4) తీతు సున్నతి చేయించుకోలేదు. అయినా పవిత్రశక్తి ద్వారా అభిషేకించబడ్డాడు, సంఘంలో మంచి పేరు తెచ్చుకున్నాడు.—గల. 2:3.