అధ్యాయం 23
“ఏం జరిగిందో నేను చెప్తాను, వినండి”
పౌలు అల్లరిమూకల ముందు, మహాసభ ముందు సత్యాన్ని సమర్థించాడు
అపొస్తలుల కార్యాలు 21:18–23:10 ఆధారంగా
1, 2. పౌలు యెరూషలేముకు ఎందుకు వెళ్లాలనుకున్నాడు? అక్కడ ఆయనకు ఏం ఎదురౌతాయి?
మరోసారి పౌలు యెరూషలేములో, జనంతో కిటకిటలాడుతున్న ఇరుకు వీధుల్లో నడుస్తున్నాడు! వందల సంవత్సరాలుగా యెరూషలేము యెహోవా ఆరాధనకు కేంద్రంగా ఉంది. భూమ్మీద వేరే ఏ నగరానికీ లేని ఆ గొప్ప చరిత్రను చూసుకుని అక్కడి ప్రజలు సంబరపడిపోతున్నారు. అయితే, అక్కడున్న చాలామంది క్రైస్తవులు ఇంకా మోషే ధర్మశాస్త్రాన్నే అంటిపెట్టుకుని ఉన్నారని, వాళ్లు యెహోవా తెచ్చిన కొత్త ఆరాధనా పద్ధతికి మారట్లేదని పౌలుకు తెలుసు. అందుకే, పౌలు ఇంకా ఎఫెసులో ఉండగానే ఆ గొప్ప నగరానికి మరోసారి వెళ్లాలనుకున్నాడు. అక్కడి క్రైస్తవులకు విరాళాలు అందించాలనే కాదు, వాళ్ల ఆలోచనను సరిదిద్దాలని కూడా ఆయన అనుకున్నాడు. (అపొ. 19:21) అందుకే, ప్రాణ హాని ఉందని తెలిసినా ఆయన యెరూషలేములో అడుగుపెట్టాడు.
2 పౌలు యెరూషలేముకు వచ్చాక ఏం జరుగుతుంది? ఒక సమస్య, క్రీస్తు అనుచరుల నుండి వస్తుంది. వాళ్లలో కొంతమంది పౌలు గురించి విన్న పుకార్లు నిజం అనుకుంటున్నారు. అయితే అంతకంటే పెద్ద సమస్యలు, క్రీస్తు శత్రువుల నుండి రాబోతున్నాయి. వాళ్లు పౌలు మీద లేనిపోని నిందలేసి, ఆయన్ని కొట్టి, చంపుతామని బెదిరిస్తారు. ఈ పరిస్థితులన్నీ, పౌలుకు సత్యాన్ని సమర్థించే అవకాశాన్ని ఇస్తాయి. ఆ సమయంలో ఆయన చూపించిన వినయం, ధైర్యం, విశ్వాసం నుండి ఇప్పుడున్న క్రైస్తవులు ఎంతో నేర్చుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
“వాళ్లు దేవుణ్ణి మహిమపర్చడం మొదలుపెట్టారు” (అపొ. 21:18-20ఎ)
3-5. (ఎ) పౌలు యెరూషలేములో ఎవర్ని కలిశాడు? వాళ్లు ఏం మాట్లాడుకున్నారు? (బి) దానినుండి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు?
3 యెరూషలేముకు వచ్చిన తర్వాతి రోజు పౌలు, ఆయనతో పాటు ఉన్నవాళ్లు అక్కడున్న బాధ్యతగల పెద్దల్ని కలవడానికి వెళ్లారు. ఆ సమయంలో బ్రతికున్న అపొస్తలుల గురించి బైబిలు మాట్లాడట్లేదు, బహుశా వాళ్లు అప్పటికే వేర్వేరు దేశాల్లో ప్రకటించడానికి వెళ్లుంటారు. అయితే, యేసు తమ్ముడైన యాకోబు మాత్రం అక్కడే ఉన్నాడు. (గల. 2:9) “పెద్దలందరూ” పౌలుతో మాట్లాడుతున్నప్పుడు, ఆ కూటానికి నాయకత్వం వహించింది యాకోబే అయ్యుంటాడు.—అపొ. 21:18.
4 పౌలు ఆ పెద్దల్ని పలకరించి, “తన పరిచర్య ద్వారా దేవుడు అన్యజనుల మధ్య చేసినవాటి గురించి వివరంగా చెప్పడం మొదలుపెట్టాడు.” (అపొ. 21:19) అది విన్నప్పుడు ఆ పెద్దలకు చాలా ప్రోత్సాహంగా అనిపించి ఉంటుంది. ఇప్పుడు మనం కూడా, వేరే దేశాల్లో ప్రకటనా పని ఎలా దూసుకెళ్తుందో విన్నప్పుడు ఎంత పులకరించిపోతామో కదా!—సామె. 25:25.
5 మాటల మధ్యలో పౌలు, ఐరోపాలోని సహోదరులు పంపిన విరాళాల గురించి మాట్లాడి ఉంటాడు. అక్కడెక్కడో ఉన్న సహోదరులు తమ మీద ఇంత శ్రద్ధ చూపించడం చూసి, ఆ పెద్దల హృదయాలు కృతజ్ఞతతో ఉప్పొంగి ఉంటాయి. ఎంతగా అంటే, ఆ మాటలు విన్నప్పుడు “వాళ్లు దేవుణ్ణి మహిమపర్చడం మొదలుపెట్టారు”! (అపొ. 21:20ఎ) ఇప్పుడు కూడా, విపత్తుల్ని లేదా పెద్దపెద్ద జబ్బుల్ని ఎదుర్కొంటున్న ఎంతోమందికి తోటి సహోదర సహోదరీలు సరైన సమయంలో మాట సాయం, చేతి సాయం చేస్తున్నారు. అది చూసి, వాళ్ల హృదయాలు నిజంగా సంతోషంతో ఉప్పొంగుతాయి.
చాలామంది ఇంకా ‘ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు’ (అపొ. 21:20బి, 21)
6. పౌలుకు ఏ సమస్య గురించి తెలిసింది?
6 తర్వాత పెద్దలు, యూదయలో ఉన్న ఒక సమస్య గురించి పౌలుకు చెప్పారు. అది ఆయనకు సంబంధించినదే. వాళ్లు ఇలా అన్నారు: “సహోదరుడా, యూదుల్లో ఎన్ని వేలమంది విశ్వాసులయ్యారో చూస్తున్నావు కదా. వాళ్లందరూ ధర్మశాస్త్రాన్ని ఉత్సాహంగా పాటిస్తున్నారు. అయితే వాళ్లు నీ గురించి కొన్ని పుకార్లు విన్నారు. నువ్వు అన్యజనుల మధ్య ఉన్న యూదులందరితో తమ పిల్లలకు సున్నతి చేయించవద్దని, ఇతర ఆచారాలు పాటించవద్దని చెప్తూ మోషే ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టమని బోధించావని వాళ్లు విన్నారు.” a—అపొ. 21:20బి, 21.
7, 8. (ఎ) యూదయలో చాలామంది క్రైస్తవులు ఏ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు? (బి) అంతమాత్రాన వాళ్లు మతభ్రష్టులు అయిపోయినట్టు కాదని ఎందుకు చెప్పవచ్చు?
7 మోషే ధర్మశాస్త్రం రద్దు అయ్యి 20 సంవత్సరాలు దాటిపోయినా, చాలామంది క్రైస్తవులు ఇంకా దాన్ని ఎందుకు ఉత్సాహంగా పాటిస్తున్నారు? (కొలొ. 2:14) క్రీస్తు శకం 49 లో యెరూషలేములో ఉన్న అపొస్తలులు, పెద్దలు సంఘాలకు ఉత్తరం రాస్తూ, అన్యజనుల్లో విశ్వాసులైన వాళ్లు సున్నతి చేయించుకోవాల్సిన, ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన అవసరం లేదని చెప్పారు. (అపొ. 15:23-29) కానీ, యూదుల్లో విశ్వాసులైన వాళ్ల ప్రస్తావన ఆ ఉత్తరంలో లేదు. అందుకే వాళ్లలో చాలామంది, మోషే ధర్మశాస్త్రాన్ని ఇక పాటించాల్సిన అవసరం లేదని అర్థం చేసుకోలేకపోయారు.
8 యూదుల్లో విశ్వాసులైన వాళ్లు ఆ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోనంత మాత్రాన, వాళ్లకు క్రైస్తవులుగా ఉండే అర్హత లేదనా? కాదు. వాళ్లేమీ గతంలో అన్యదేవుళ్లను పూజించి, ఇంకా ఆ అబద్ధ ఆచారాల్నే పాటిస్తున్నవాళ్లు కాదు. నిజానికి, వాళ్లు అంటిపెట్టుకుని ఉన్న ఆ ధర్మశాస్త్రం యెహోవా ఇచ్చిందే. దాన్ని పాటించినంత మాత్రాన వాళ్లు మతభ్రష్టులు అయిపోయినట్టు కాదు, అదేం పెద్ద పాపమూ కాదు. కాకపోతే ఆ ధర్మశాస్త్రం పాత ఒప్పందం మీద ఆధారపడి ఉంది. కానీ ఇప్పుడు క్రైస్తవులు కొత్త ఒప్పందం కిందికి వచ్చారు. స్వచ్ఛారాధన విషయానికొస్తే, ఆ మోషే ధర్మశాస్త్రం చెప్పిన ఆచారాలేవీ ఇప్పుడు పాటించాల్సిన అవసరం లేదు. మోషే ధర్మశాస్త్రం మీద అమితమైన ప్రేమ ఉన్న హెబ్రీ క్రైస్తవులు ఆ విషయాన్ని అర్థం చేసుకోవట్లేదు. అందుకే వాళ్లు క్రైస్తవ సంఘాన్ని నమ్మలేకపోతున్నారు. యెహోవా క్రమక్రమంగా వెల్లడి చేస్తున్న సత్యానికి తగ్గట్టు, వాళ్లు తమ ఆలోచనను మార్చుకోవాల్సి ఉంది. b—యిర్మీ. 31:31-34; లూకా 22:20.
“పుకార్లు నిజం కాదు” (అపొ. 21:22-26)
9. మోషే ధర్మశాస్త్రాన్ని పాటించడం గురించి పౌలు ఏం చెప్పాడు?
9 అన్యజనుల మధ్య, అంటే వేరే దేశాల్లో ఉన్న యూదులతో “తమ పిల్లలకు సున్నతి చేయించవద్దని, ఇతర ఆచారాలు పాటించవద్దని” పౌలు చెప్పాడన్న పుకార్లు వచ్చాయి కదా, వాటి సంగతేంటి? పౌలు అన్యజనులకు మంచివార్త ప్రకటించాడు, వాళ్లు ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన అవసరం లేదని వివరించాడు. అంతేకాదు, సున్నతి చేయించుకుంటేనే మోషే ధర్మశాస్త్రాన్ని పాటించినట్టు అని క్రైస్తవులుగా మారిన అన్యజనుల్ని ఒత్తిడి చేయడం తప్పని చెప్పాడు. (గల. 5:1-7) అయితే, పౌలు తాను వెళ్లిన నగరాల్లో యూదులకు కూడా మంచివార్త ప్రకటించాడు. యేసు మరణంతో ధర్మశాస్త్రం రద్దు అయిపోయిందని, నీతిమంతులుగా తీర్పు తీర్చబడేది విశ్వాసం వల్లే కానీ ధర్మశాస్త్రానికి తగ్గట్టు చేసే పనుల వల్ల కాదని ఆయన వాళ్లకు తప్పకుండా వివరించి ఉంటాడు.—రోమా. 2:28, 29; 3:21-26.
10. ధర్మశాస్త్రం విషయంలో, సున్నతి విషయంలో పౌలు మొండిపట్టు పట్టలేదని ఎలా చెప్పవచ్చు?
10 అయినప్పటికీ, విశ్రాంతి రోజున పని చేయకుండా ఉండడం, కొన్నిరకాల ఆహార పదార్థాల్ని తినకుండా ఉండడం వంటి యూదుల ఆచారాల్ని పాటించాలనుకునే వాళ్లను పౌలు విమర్శించలేదు. (రోమా. 14:1-6) అలాగే, ఆయన సున్నతి విషయంలో లేనిపోని నియమాలు పెట్టలేదు. నిజానికి, యూదులకు అభ్యంతరం కలిగించకుండా ఉండడం కోసం పౌలు తిమోతికి సున్నతి చేయించాడు. ఎందుకంటే, తిమోతి వాళ్ల నాన్న గ్రీకువాడని అందరికీ తెలుసు. (అపొ. 16:3) సున్నతి చేయించుకోవాలా వద్దా అనేది వ్యక్తిగత నిర్ణయం. పౌలు గలతీయులకు ఇలా చెప్పాడు: “సున్నతి చేయించుకోవడంలో గానీ చేయించుకోకపోవడంలో గానీ ఏమీలేదు, కానీ ప్రేమతో పనిచేసే విశ్వాసమే ముఖ్యం.” (గల. 5:6) అయితే, ఒక వ్యక్తి ధర్మశాస్త్రాన్ని పాటించడం కోసమని సున్నతి చేయించుకోవడం, లేదా యెహోవా ఆమోదం పొందాలంటే సున్నతి చేయించుకోవాల్సిందే అని ఇతరులకు చెప్పడం తప్పు. అలాచేస్తే, అతనికి విశ్వాసం లేనట్టే లెక్క.
11. పెద్దలు పౌలును ఏం చేయమన్నారు? ఆయన ఏం చేసి ఉండకపోవచ్చు? (అధస్సూచి కూడా చూడండి.)
11 పౌలు మీద వచ్చిన పుకార్లు నిజం కాకపోయినా, అవి యూదుల్లో విశ్వాసులైన వాళ్లను తొలిచేస్తున్నాయి. అందుకే, పెద్దలు పౌలును ఇలా చేయమన్నారు: “మొక్కుబడి చేసుకున్న నలుగురు పురుషులు మా దగ్గర ఉన్నారు. వాళ్లను నీతో తీసుకెళ్లి, ఆచారబద్ధంగా వాళ్లతోపాటు నువ్వు కూడా శుద్ధి చేసుకో; వాళ్లు తలవెంట్రుకలు కత్తిరించుకోవడానికి అయ్యే ఖర్చులు నువ్వే పెట్టుకో. అప్పుడు నీ గురించి విన్న పుకార్లు నిజం కాదని, నువ్వు క్రమపద్ధతిలో నడుచుకుంటున్నావని, నువ్వు కూడా ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నావని అందరికీ తెలుస్తుంది.” c—అపొ. 21:23, 24.
12. పౌలు ఎలా ఒక మెట్టు దిగి, యెరూషలేములో ఉన్న పెద్దలకు సహకరించాడు?
12 అప్పుడు పౌలు, ‘ఇక్కడ సమస్య నేను కాదు. ఇంకా మోషే ధర్మశాస్త్రాన్నే పట్టుకుని వేలాడుతున్న ఆ యూదా క్రైస్తవులది’ అని అనవచ్చు. కానీ ఆయన అలా అనలేదు. దేవుని సూత్రాలకు వ్యతిరేకం కానంతవరకు, ఆయన ఒక మెట్టు దిగడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతకుముందు ఆయన ఇలా రాశాడు: “నేను ధర్మశాస్త్రం కింద లేకపోయినా, ధర్మశాస్త్రం కింద ఉన్నవాళ్లను సంపాదించుకోవడానికి ధర్మశాస్త్రం కింద ఉన్నవాడిలా అయ్యాను.” (1 కొరిం. 9:20) ఈ సందర్భంలోనైతే, పౌలు యెరూషలేములో ఉన్న పెద్దలకు సహకరించడం ద్వారా “ధర్మశాస్త్రం కింద ఉన్నవాడిలా” అయ్యాడు. అలా చేసి ఆయన మనకు చక్కని ఆదర్శం ఉంచాడు. కాబట్టి మనం కూడా పెద్దలకు సహకరించాలి గానీ, మనం అనుకున్నట్టే పనులు జరగాలని మొండిపట్టు పట్టకూడదు.—హెబ్రీ. 13:17.
“ఇతను బ్రతకడానికి అర్హుడు కాడు!” (అపొ. 21:27–22:30)
13. (ఎ) కొంతమంది యూదులు ఆలయంలో ఎందుకు గొడవ చేశారు? (బి) పౌలు ఎలా ప్రాణాలతో బయటపడ్డాడు?
13 ఆలయంలో అంతా సాఫీగా సాగలేదు. శుద్ధి చేసుకునే రోజులు పూర్తి కావస్తుండగా, ఆసియా నుండి వచ్చిన యూదులు పౌలును చూసి, ఆయన అన్యజనుల్ని ఆలయంలోకి తెచ్చాడని నిందలేసి పెద్ద గొడవ చేశారు. ఒకవేళ రోమా సహస్రాధిపతి రాకపోయుంటే, వాళ్లు పౌలును కొట్టి చంపేసేవాళ్లు. అందుకే, ఆ సహస్రాధిపతి పౌలును బంధించమని ఆజ్ఞాపించాడు. ఆ రోజు నుండి పౌలు విడుదల అవ్వడానికి నాలుగేళ్ల కంటే ఎక్కువ సమయం పడుతుంది. అయితే, పౌలుకు ప్రమాదం ఇంకా తప్పిపోలేదు. పౌలు మీద ఎందుకు దాడిచేస్తున్నారని సహస్రాధిపతి యూదుల్ని అడిగినప్పుడు, వాళ్లు ఒక్కొక్కరు ఒక్కోలా ఆరోపించారు. ఆ గోలలో సహస్రాధిపతికి ఏమీ అర్థం కాలేదు. చివరికి, పౌలును అక్కడినుండి తరలించాల్సి వచ్చింది. రోమా సైనికులు పౌలును తీసుకుని సైనికుల కోటలోకి అడుగుపెట్టబోతుండగా, పౌలు సహస్రాధిపతితో ఇలా అన్నాడు: “ప్రజలతో మాట్లాడడానికి నాకు అనుమతి ఇవ్వమని నిన్ను వేడుకుంటున్నాను.” (అపొ. 21:39) దానికి అతను ఒప్పుకోవడంతో, పౌలు తన విశ్వాసం గురించి ధైర్యంగా మాట్లాడాడు.
14, 15. (ఎ) పౌలు యూదులకు ఏం చెప్పాడు? (బి) యూదులు ఎందుకు కోపంగా ఉన్నారో తెలుసుకోవడానికి రోమా సహస్రాధిపతి ఏమేం చేశాడు?
14 “ఏం జరిగిందో నేను చెప్తాను, వినండి” అని పౌలు మొదలుపెట్టాడు. (అపొ. 22:1) పౌలు ఆ జనంతో హీబ్రూ భాషలో మాట్లాడేసరికి, వాళ్లంతా నిశ్శబ్దం అయిపోయారు. తాను ఇప్పుడు ఎందుకు క్రీస్తు అనుచరుడు అయ్యాడో ఆయన స్పష్టంగా వివరించాడు. ఆయన తెలివిగా ఎలాంటి విషయాలు చెప్పాడంటే, కావాలనుకుంటే యూదులు వెళ్లి అవి నిజమో కాదో తెలుసుకోవచ్చు. అవేంటంటే, పౌలు గమలీయేలు అనే ప్రసిద్ధ బోధకుని దగ్గర చదువుకున్నాడు, క్రీస్తు అనుచరుల్ని హింసించాడు. అక్కడున్న కొంతమందికి కూడా అది తెలిసేవుంటుంది. అయితే, దమస్కుకు వెళ్తున్న దారిలో, పునరుత్థానమైన క్రీస్తు ఒక దర్శనంలో పౌలుతో మాట్లాడాడు. ఆయనతో ప్రయాణిస్తున్న వాళ్లు ఒక ప్రకాశవంతమైన వెలుగును చూశారు, ఒక స్వరం విన్నారు. కానీ ఆ స్వరం ఏం చెప్తుందో వాళ్లకు అర్థం కాలేదు. (అపొ. 9:7; 22:9, nwtsty-E స్టడీ నోట్స్ చూడండి.) ఆ దర్శనం చూశాక పౌలుకు కంటిచూపు పోయింది. ఆయనతోపాటు వచ్చినవాళ్లు పౌలును దమస్కుకు వెంటబెట్టుకుని తీసుకెళ్లారు. అక్కడ యూదుల్లో మంచి పేరున్న అననీయ అనే వ్యక్తి, అద్భుతరీతిలో ఆయనకు కంటిచూపు తిరిగొచ్చేలా చేశాడు.
15 యెరూషలేముకు తిరిగొచ్చిన తర్వాత ఆలయంలో ప్రార్థిస్తున్నప్పుడు యేసు తనకు కనిపించాడని పౌలు చెప్పాడు. అప్పటివరకు బానే ఉన్న యూదులు, ఆ మాట వినగానే కోపమొచ్చి ఇలా అరిచారు: “ఇతన్ని భూమ్మీద ఉండకుండా చంపేయండి. ఇతను బ్రతకడానికి అర్హుడు కాడు!” (అపొ. 22:22) పౌలును కాపాడడం కోసం, సహస్రాధిపతి ఆయన్ని సైనికుల కోటలోకి తీసుకెళ్లమని చెప్పాడు. అసలు పౌలు మీద యూదులు ఎందుకంత కోపంగా ఉన్నారో తెలుసుకోవడానికి, ఆయన్ని కొరడాలతో కొట్టి విచారించమని సహస్రాధిపతి ఆదేశించాడు. కానీ పౌలు తనకు అందుబాటులో ఉన్న ఒక చట్టాన్ని ఉపయోగించుకుని, తానొక రోమా పౌరుణ్ణని చెప్పాడు. మన కాలంలోని యెహోవాసాక్షులు కూడా సత్యాన్ని సమర్థించడం కోసం, వాళ్లకు అందుబాటులో ఉన్న చట్టాల్ని ఉపయోగించుకున్నారు. (“ రోమా చట్టం, రోమా పౌరులు” అనే బాక్సు, అలాగే “ మన కాలంలో కోర్టు కేసులు” అనే బాక్సు చూడండి.) పౌలు రోమా పౌరుడని తెలియగానే, సహస్రాధిపతి ఆయన గురించి ఆరా తీయడానికి వేరే పద్ధతిని వాడాలనుకున్నాడు. అందుకే తర్వాతి రోజు, పౌలును విచారించడం కోసం యూదుల ఉన్నత న్యాయస్థానమైన మహాసభ సభ్యుల్ని రమ్మని చెప్పాడు.
“నేనొక పరిసయ్యుణ్ణి” (అపొ. 23:1-10)
16, 17. (ఎ) మహాసభలో మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు పౌలుకు ఏం జరిగింది? (బి) తనను కొట్టినా పౌలు ఎలా వినయం చూపించాడు?
16 పౌలు మహాసభ ముందు తన వాదనను ఇలా మొదలుపెట్టాడు: “సహోదరులారా, ఈ రోజు వరకు నేను దేవుని ముందు ఏ తప్పూ చేయకుండా నడుచుకున్నానని నా మనస్సాక్షి నాకు చెప్తుంది.” (అపొ. 23:1) అంతకుమించి ఒక్కమాట కూడా మాట్లాడక ముందే, “ప్రధానయాజకుడు అననీయ, పౌలును నోటి మీద కొట్టమని పౌలు పక్కన నిలబడివున్న వాళ్లకు ఆజ్ఞాపించాడు.” (అపొ. 23:2) ఎంత అవమానం! పౌలు వాదనను పూర్తిగా వినకముందే, ప్రధానయాజకుడు ఆయన్ని అబద్ధికుడు అని ముద్రవేశాడు. అది అన్యాయం! అందుకే పౌలు, “సున్నం కొట్టిన గోడా, దేవుడు నిన్ను కొడతాడు. ధర్మశాస్త్రం ప్రకారం నాకు తీర్పు తీర్చడానికి కూర్చున్న నువ్వు, నన్ను కొట్టమని ఆజ్ఞాపించి ధర్మశాస్త్రాన్ని మీరతావా?” అన్నాడు.—అపొ. 23:3.
17 అక్కడ నిలబడి ఉన్న కొంతమంది ఖంగుతిన్నారు! పౌలును కొట్టినందుకు కాదుగానీ, పౌలు ప్రధానయాజకునితో అలా మాట్లాడినందుకు వాళ్లు అవాక్కయ్యారు. దాంతో వాళ్లు, “నువ్వు దేవుని ప్రధానయాజకుణ్ణి అవమానిస్తున్నావా?” అన్నారు. అప్పుడు పౌలు ఇచ్చిన జవాబులో ఆయనకు ఎంత వినయం ఉందో, ధర్మశాస్త్రం మీద ఎంత గౌరవం ఉందో తెలుస్తుంది. ఆయన ఇలా అన్నాడు: “సహోదరులారా, అతను ప్రధానయాజకుడని నాకు తెలీదు. ఎందుకంటే, ‘నీ ప్రజల అధికారి గురించి అవమానకరంగా మాట్లాడకూడదు’ అని రాయబడి ఉంది.” d (అపొ. 23:4, 5; నిర్గ. 22:28) ఇప్పుడు పౌలు ఒక కొత్త పాచిక వదిలాడు. మహాసభలో పరిసయ్యులు, సద్దూకయ్యులు ఉంటారని తెలిసి ఆయన ఇలా అన్నాడు: “సహోదరులారా, నేనొక పరిసయ్యుణ్ణి. పరిసయ్యుల కుటుంబంలో పుట్టాను. నేను చనిపోయినవాళ్లు తిరిగి బ్రతుకుతారనే బోధను నమ్ముతాను, అందుకే ఇప్పుడు నాకు తీర్పు జరుగుతోంది.”—అపొ. 23:6.
18. పౌలు తానొక పరిసయ్యుణ్ణి అని ఎందుకు చెప్పుకున్నాడు? మనం కూడా పౌలులాగే తెలివిగా ఎలా మాట్లాడవచ్చు?
18 పౌలు తానొక పరిసయ్యుణ్ణి అని ఎందుకు చెప్పుకున్నాడు? ఎందుకంటే, ఆయన “పరిసయ్యుల కుటుంబంలో” పుట్టాడు. కాబట్టి జనాల దృష్టిలో ఆయన ఇంకా పరిసయ్యుడే. e మరి పరిసయ్యులకు పునరుత్థానం విషయంలో తప్పుడు నమ్మకాలు ఉన్నాయి కదా, వాటి సంగతేంటి? ఒక వ్యక్తి చనిపోయాక ఆత్మ బ్రతికే ఉంటుందని, దానికి చావు లేదని, నీతిమంతులు చనిపోతే వాళ్ల ఆత్మలు తిరిగి మానవ శరీరాల్లోకి వచ్చి జీవిస్తాయని పరిసయ్యులు నమ్మేవాళ్లు. అయితే, పౌలు ఆ అబద్ధాల్ని నమ్మలేదు గానీ యేసు బోధించిన పునరుత్థానాన్ని నమ్మాడు. (యోహా. 5:25-29) సద్దూకయ్యుల్లా కాకుండా పరిసయ్యులు అలాగే పౌలు నమ్మేది ఏంటంటే, చనిపోతే ఇక అంతా అయిపోయినట్టు కాదు. మనం కూడా క్యాథలిక్కులతో లేదా ప్రొటస్టెంట్లతో పౌలులాగే మాట్లాడవచ్చు. వాళ్లలా మనం త్రిత్వాన్ని నమ్మకపోయినా, వాళ్లలాగే దేవుడు ఉన్నాడు అనైతే నమ్ముతాం. కాబట్టి ఆ విషయాన్నే చెప్పి వాళ్లతో మాట్లాడవచ్చు.
19. మహాసభ ఎందుకు ముక్కలైపోయింది?
19 పౌలు మాటలకు మహాసభ రెండు ముక్కలైపోయింది. బైబిలు ఇలా చెప్తుంది: “అక్కడ పెద్ద అలజడి రేగింది. పరిసయ్యుల తెగకు చెందిన కొంతమంది శాస్త్రులు లేచి చాలా కోపంగా ఇలా వాదించడం మొదలుపెట్టారు: ‘ఇతనిలో మాకు ఏ తప్పూ కనిపించలేదు. ఒకవేళ అతనితో ఒక అదృశ్యప్రాణి గానీ, దేవదూత గానీ మాట్లాడివుంటే—.’” (అపొ. 23:9) పౌలుతో దేవదూత మాట్లాడాడేమో అన్న ఆలోచనే, సద్దూకయ్యులకు మింగుడుపడలేదు. ఎందుకంటే వాళ్లు దేవదూతల్ని నమ్మరు! (“ సద్దూకయ్యులు, పరిసయ్యులు” అనే బాక్సు చూడండి.) అలా గొడవ పెద్దదయ్యేసరికి, మళ్లీ రోమా సహస్రాధిపతి వచ్చి పౌలును కాపాడాడు. (అపొ. 23:10) అయితే, పౌలుకు ప్రమాదం ఇంకా తప్పిపోలేదు. తర్వాత ఏం జరుగుతుంది? దాని గురించి తర్వాతి అధ్యాయంలో చూస్తాం.
a యూదుల్లో క్రైస్తవులుగా మారినవాళ్లు చాలామంది ఉన్నారు కాబట్టి, అప్పుడు చాలా సంఘాలు సహోదరుల ఇళ్లల్లో కలుసుకుని ఉండవచ్చు.
b కొన్ని సంవత్సరాల తర్వాత, అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు ఉత్తరం రాస్తూ, కొత్త ఒప్పందం ఎంత గొప్పదో రుజువులతో సహా చెప్పాడు. ఆ ఉత్తరంలో, పాత ఒప్పందం స్థానంలో పూర్తిగా కొత్త ఒప్పందం వచ్చిందని స్పష్టం చేశాడు. పౌలు చక్కగా వివరించిన ఆ విషయాలు, తమతో వాదనకు దిగే తోటి యూదులతో ఒప్పించేలా మాట్లాడడానికి క్రైస్తవులకు ఉపయోగపడి ఉంటాయి, అలాగే మోషే ధర్మశాస్త్రానికి మరీ ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్న కొంతమంది క్రైస్తవుల విశ్వాసాన్ని బలపర్చి ఉంటాయి.—హెబ్రీ. 8:7-13.
c ఆ నలుగురు, నాజీరు మొక్కుబడి చేసుకుని ఉండొచ్చని పండితులు చెప్తారు. (సంఖ్యా. 6:1-21) నిజమే, మోషే ధర్మశాస్త్రం కింద ఉన్నవాళ్లే ఆ మొక్కుబడి చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఆ మోషే ధర్మశాస్త్రం రద్దు అయిపోయింది. అయినప్పటికీ, వాళ్లు యెహోవాకు చేసుకున్న మొక్కుబడిని తీర్చుకోవడం తప్పేం కాదని పౌలు అనుకుని ఉంటాడు. అందుకే దానికి అయ్యే ఖర్చులు చూసుకోవడం గానీ, వాళ్లను ఆయనతోపాటు తీసుకెళ్లడం గానీ తప్పు కాదు. వాళ్లు సరిగ్గా ఏ మొక్కుబడి చేసుకున్నారో మనకైతే తెలీదు. కానీ వాళ్లు (నాజీరులు చేసినట్టు) పాపాన్ని కడిగేసుకోవడానికి జంతుబలిని అర్పించి ఉంటే మాత్రం, పౌలు ఖచ్చితంగా దానికి మద్దతిచ్చి ఉండడు. ఎందుకంటే, క్రీస్తు తన పరిపూర్ణ శరీరాన్ని బలిగా అర్పించాడు కాబట్టి ఇకపై జంతుబలులు పాపాన్ని కడిగేయలేవు. ఏదేమైనా, పౌలు తన మనస్సాక్షిని బాధపెట్టే పని చేసి ఉండడని మనం నమ్మకంతో ఉండవచ్చు.
d పౌలుకు కంటిచూపు సరిగా లేకపోవడం వల్ల ప్రధానయాజకుణ్ణి గుర్తుపట్టలేదని కొందరు అంటారు. లేదా, ఆయన చాలాకాలంగా యెరూషలేములో లేడు కాబట్టి, ప్రస్తుతం ప్రధానయాజకుడిగా ఎవరు ఉన్నారో ఆయనకు తెలిసుండకపోవచ్చు. లేదా, అంతమంది జనంలో ఎవరు తనను కొట్టమన్నారో పౌలుకు కనిపించి ఉండకపోవచ్చు.
e క్రీస్తు శకం 49 లో అపొస్తలులు, పెద్దలు మోషే ధర్మశాస్త్రాన్ని అన్యజనులు పాటించాలా వద్దా అని చర్చించుకుంటున్నారు. అక్కడున్న కొంతమంది క్రైస్తవుల గురించి “పరిసయ్యుల తెగకు చెంది, ఆ తర్వాత విశ్వాసులుగా” మారినవాళ్లు అని బైబిలు చెప్తుంది. (అపొ. 15:5, అధస్సూచి) వాళ్లు క్రైస్తవులుగా మారడానికి ముందు పరిసయ్యులే కాబట్టి బైబిలు అలా చెప్పి ఉంటుంది.