అధ్యాయం 27
“పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వడం
పౌలు రోములో బందీ అయ్యాడు, అయినా ప్రకటిస్తూనే ఉన్నాడు
అపొస్తలుల కార్యాలు 28:11-31 ఆధారంగా
1. పౌలు, ఆయన స్నేహితులు ఏ నమ్మకంతో ఉన్నారు? ఎందుకు?
అది దాదాపు క్రీస్తు శకం 59. మధ్యధరా సముద్రంలో, “ద్యుపతి కుమారుల” చిహ్నం ఉన్న ఒక ఓడ మెలితే ద్వీపం నుండి ఇటలీకి వెళ్తుంది. అది బహుశా పెద్ద ధాన్యపు ఓడ అయ్యిండవచ్చు. ఆ ఓడలో సైనికుల కాపలా కింద ఉన్న పౌలు, ఆయన స్నేహితులైన లూకా, అరిస్తార్కు ప్రయాణిస్తున్నారు. (అపొ. 27:2) గ్రీకు దేవుడైన ద్యుపతి కుమారులు అంటే కాస్టర్, పొలక్స్ అనే కవల సహోదరులు తమను కాపాడతారని ఓడ సిబ్బంది నమ్మకం పెట్టుకున్నారు. (అపొ. 28:11, nwtsty-E స్టడీ నోట్ చూడండి.) కానీ పౌలు, ఆయన స్నేహితులు మాత్రం యెహోవా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఎందుకంటే పౌలు రోములో సాక్ష్యం ఇస్తాడని, కైసరు ముందు నిలబడతాడని యెహోవా ముందే చెప్పాడు.—అపొ. 23:11; 27:24.
2, 3. పౌలు ఎక్కిన ఓడ ఏ దారిలో వెళ్లింది? ఈ ప్రయాణం అంతటిలో పౌలుకు ఎవరు తోడుగా ఉన్నారు?
2 ఓడ సురకూసై అనే ఓడరేవుకు చేరుకుంది. సిసిలిలో ఉండే ఈ అందమైన నగరం ఏథెన్సుకు, రోముకు ఏమాత్రం తీసిపోదు. అక్కడికి చేరుకున్న మూడు రోజుల తర్వాత, ఓడ ఇటలీ అడుగున ఉన్న రేగియుకు వెళ్లింది. తర్వాత, దక్షిణం వైపు నుండి గాలి అనుకూలంగా వీయడంతో, ఓడ దాదాపు 320 కిలోమీటర్లు ప్రయాణించి, ఒక్కరోజులోనే ఇటలీలోని (ఇప్పటి నేపెల్స్ దగ్గర) పొతియొలీ అనే ఓడరేవుకు చేరుకుంది.—అపొ. 28:12, 13.
3 పౌలు రోముకు చేస్తున్న ప్రయాణం ఇప్పుడు చివరి దశకు వచ్చింది. ఆయన రోములో నీరో చక్రవర్తి ముందు నిలబడాల్సి ఉంది. ఈ ప్రయాణం అంతటిలో, “ఎలాంటి పరిస్థితిలోనైనా ఓదార్పును ఇచ్చే దేవుడు” పౌలుకు తోడుగా ఉన్నాడు. (2 కొరిం. 1:3) ఇప్పుడు మనం చూడబోతున్నట్లు, యెహోవా పౌలుకు సహాయం చేయడం ఆపలేదు, అలాగే మిషనరీగా పౌలుకున్న ఉత్సాహం రవ్వంత కూడా తగ్గలేదు.
“పౌలు . . . దేవునికి కృతజ్ఞతలు చెప్పి, ధైర్యం తెచ్చుకున్నాడు” (అపొ. 28:14, 15)
4, 5. (ఎ) పొతియొలీలో పౌలుకు, ఆయన స్నేహితులకు ఎలాంటి ఆతిథ్యం దొరికింది? సైనికులు పౌలుకు ఎందుకంత స్వేచ్ఛ ఇచ్చి ఉండవచ్చు? (బి) జైల్లో ఉన్నా కూడా, క్రైస్తవులు వాళ్ల మంచి ప్రవర్తన నుండి ఎలా ప్రయోజనం పొందవచ్చు?
4 పొతియొలీ దగ్గర కొంతమంది సహోదరులు పౌలును, ఆయన స్నేహితుల్ని కలిశారు. “వాళ్లు ఒక వారం రోజులు తమతో ఉండమని బ్రతిమాలడంతో” ఏడు రోజులు అక్కడే ఉన్నారు. (అపొ. 28:14) ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఆ సహోదరులు ఎంత చక్కని ఆదర్శమో కదా! పౌలు, ఆయన స్నేహితులు ప్రోత్సాహకరమైన విషయాలు పంచుకుంటూ వాళ్లను బలపర్చి ఉంటారు. అలా, వాళ్లు ఆతిథ్యం ఇచ్చినందుకు ఎన్నోరెట్లు ఎక్కువ ప్రతిఫలం పొందారు. ఇంతకీ, సైనికుల అదుపులో ఉన్న ఒక ఖైదీకి అంత స్వేచ్ఛ ఎలా దొరికింది? బహుశా అపొస్తలుడైన పౌలు తనకు కాపలా కాస్తున్న రోమా సైనికుల దగ్గర పూర్తి నమ్మకం సంపాదించుకుని ఉంటాడు.
5 మన కాలంలో కూడా జైళ్లలో, కాన్సన్‌ట్రేషన్ క్యాంపుల్లో యెహోవా సేవకుల మంచి ప్రవర్తన అధికారుల్ని ఆకట్టుకుంది. అధికారులు వాళ్లకు ప్రత్యేకమైన స్వేచ్ఛను, బాధ్యతల్ని ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, రొమేనియాలో దొంగతనాలు చేసినందుకు 75 ఏళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్న ఒకతను, బైబిలు స్టడీ తీసుకోవడం మొదలుపెట్టాడు. ఆ బైబిలు స్టడీ అతని జీవితాన్నే మార్చేసింది. అతని మంచి ప్రవర్తన చూసిన జైలు అధికారులు, ఏ పోలీసుల నిఘా లేకుండా అతనొక్కడినే టౌనుకు పంపించి జైలుకు కావాల్సిన సరుకుల్ని తీసుకురమ్మనే వాళ్లు! మన మంచి ప్రవర్తన అధికారుల నమ్మకాన్ని సంపాదించడమే కాదు, యెహోవాకు కూడా మహిమ తెస్తుంది.—1 పేతు. 2:12.
6, 7. రోములోని సహోదరులు ఎలా అపారమైన ప్రేమ చూపించారు?
6 పౌలు, ఆయన స్నేహితులు పొతియొలీ నుండి బహుశా 50 కిలోమీటర్లు నడిచి కాపువాకు చేరుకున్నారు. అది రోముకు తీసుకెళ్లే అప్పీయా రహదారిలో ఉంటుంది. అప్పీయా రహదారికి ఎంతో పేరు ఉంది. బల్లపరుపుగా ఉన్న పెద్దపెద్ద లావా ముక్కలతో ఆ రోడ్డు వేశారు. ఆ రోడ్డులో వెళ్తున్నప్పుడు పచ్చటి పొలాలు, అక్కడక్కడ మధ్యధరా సముద్రపు తీరాలు కనువిందు చేస్తాయి. అంతేకాదు ఆ రోడ్డులో వెళ్తుంటే, రోము నుండి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాంటైన్ మార్షస్ వస్తుంది. అక్కడ నేలంతా తడిగా, బురదగా ఉంటుంది. అక్కడే అప్పీయా సంత కూడా ఉంది. ఇంకాస్త ముందుకెళ్తే, రోము నుండి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రిసత్రములు వస్తుంది. అక్కడ ప్రయాణికులు తరచూ విశ్రాంతి తీసుకోవడానికి ఆగుతారు. పౌలు, ఆయన స్నేహితులు వస్తున్నారని రోములోని సహోదరులు విన్నప్పుడు, కొంతమంది త్రిసత్రముల వరకు, ఇంకొంతమందైతే ఏకంగా అప్పీయా సంత వరకు వచ్చారని లూకా రాశాడు. వాళ్లకు పౌలు మీద ఎంత అపారమైన ప్రేమ ఉందో కదా!—అపొ. 28:15.
7 అప్పీయా సంత, ప్రయాణికులు అలుపు తీర్చుకోవడానికి అంత అనువైన చోటు కాదు. “అది పడవలు నడిపేవాళ్లతో, సత్రాలను నడిపే మొరటు వ్యాపారులతో కిక్కిరిసి ఉంటుంది. అక్కడ నీళ్లు కూడా కంపు కొడతాయి” అని రోమా కవి హోరెస్ రాశాడు. ఆయన కనీసం అక్కడ తినడానికి కూడా ఇష్టపడలేదు! రోము నుండి వచ్చిన సహోదరులు మాత్రం అలాంటి చోట పౌలు కోసం, ఆయన స్నేహితుల కోసం సంతోషంగా వేచి ఉన్నారు. ప్రయాణంలోని ఈ చివరి భాగంలో వాళ్లను సురక్షితంగా వెంటబెట్టుకుని తీసుకెళ్లాలని ఆ సహోదరులు వచ్చారు.
8. సహోదరుల్ని “చూడగానే” పౌలు దేవునికి ఎందుకు కృతజ్ఞతలు చెప్పాడు?
8 పౌలు సహోదరుల్ని “చూడగానే దేవునికి కృతజ్ఞతలు చెప్పి, ధైర్యం తెచ్చుకున్నాడు.” (అపొ. 28:15) అవును, ఆ ప్రియమైన సహోదరుల్ని చూసిన వెంటనే ఆయనకు కొండంత బలం వచ్చింది, ఓదార్పు దొరికింది. వాళ్లలో కొంతమంది పౌలుకు ముందే తెలిసి ఉండవచ్చు. ఇంతకీ పౌలు దేవునికి ఎందుకు కృతజ్ఞతలు చెప్పాడు? ఎందుకంటే, నిస్వార్థమైన ప్రేమ పవిత్రశక్తి పుట్టించే లక్షణం అని ఆయనకు తెలుసు. (గల. 5:22) ఇప్పుడు కూడా క్రైస్తవులు ఒకరికోసం ఒకరు త్యాగాలు చేసేలా, అవసరంలో ఉన్నవాళ్లను ఓదార్చేలా పవిత్రశక్తి కదిలిస్తుంది.—1 థెస్స. 5:11, 14.
9. పౌలును కలిసిన సహోదరుల్లాగే, మీరు కూడా ఏం చేయవచ్చు?
9 ఉదాహరణకు ప్రాంతీయ పర్యవేక్షకులకు, మిషనరీలకు, ఇతర పూర్తికాల సేవకులకు ఆతిథ్యం ఇచ్చేలా పవిత్రశక్తి మనల్ని కదిలిస్తుంది. వాళ్లు యెహోవా సేవను ఎక్కువ చేయడానికి పెద్దపెద్ద త్యాగాలు చేశారు. కాబట్టి ఇలా ప్రశ్నించుకోండి: ‘ప్రాంతీయ పర్యవేక్షకుని సందర్శనానికి మద్దతు ఇవ్వడానికి నేను ఇంకా ఏం చేయవచ్చు? ఆయనకు ఒకవేళ పెళ్లయితే, ఆయనకు-ఆయన భార్యకు నేను ఆతిథ్యం ఇవ్వగలనా? వాళ్లతో కలిసి పరిచర్య చేయడానికి ఏర్పాటు చేసుకోగలనా?’ అలా చేస్తే, మీరు తిరిగి ఎన్నోరెట్లు ఎక్కువ ఆశీర్వాదాలు పొందుతారు. పౌలు, ఆయన స్నేహితులు చెప్పిన ఎన్నో ప్రోత్సాహకరమైన అనుభవాలు విని, రోములోని సహోదరులు ఎంత సంతోషించి ఉంటారో ఊహించండి.—అపొ. 15:3, 4.
“ప్రతీచోట ప్రజలు ఈ తెగకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు” (అపొ. 28:16-22)
10. రోములో పౌలు పరిస్థితి ఏంటి? అక్కడికి వచ్చీరాగానే ఏం చేశాడు?
10 మొత్తానికి పౌలు, ఆయన స్నేహితులు రోములో అడుగుపెట్టారు. అక్కడ “ఒక సైనికుడి కాపలాలో పౌలు తన ఇంట్లో ఒంటరిగా ఉండడానికి అనుమతి దొరికింది.” (అపొ. 28:16) సాధారణంగా అలాంటి గృహ నిర్బంధంలో, ఖైదీ తప్పించుకోకుండా ఉండడానికి ఖైదీకి, సైనికుడికి మధ్య ఒక గొలుసును కట్టేసి ఉంచుతారు. గొలుసులతో పౌలు చేతుల్ని కట్టేయగలరేమో గానీ, ఆయన నోటిని కాదు. ఆయన ఒక రాజ్య ప్రచారకుడు. అందుకే అంత దూర ప్రయాణం చేసి అలసిపోయినా, పౌలు మూడే మూడు రోజులు విశ్రాంతి తీసుకుని రోములోని యూదుల ప్రముఖుల్ని పిలిపించుకున్నాడు. వాళ్లకు తనను తాను పరిచయం చేసుకుని, సాక్ష్యం ఇచ్చాడు.
11, 12. పౌలు తోటి యూదులతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ల మనసులో ఉన్న తప్పుడు అభిప్రాయాలు తీసేయడానికి ఎలా ప్రయత్నించాడు?
11 పౌలు వాళ్లతో ఇలా అన్నాడు: “సహోదరులారా, మన ప్రజలకు గానీ, మన పూర్వీకుల ఆచారాలకు గానీ వ్యతిరేకంగా నేనేమీ చేయకపోయినా, నన్ను యెరూషలేములో బంధించి రోమీయుల చేతికి అప్పగించారు. నన్ను విచారణ చేసిన తర్వాత, మరణశిక్ష వేయడానికి ఏ కారణం లేకపోవడంతో వాళ్లు నన్ను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ యూదులు అందుకు ఒప్పుకోకపోయేసరికి, నేను కైసరుకు విన్నవించుకుంటానని చెప్పాల్సి వచ్చింది. అంతేగానీ నా ప్రజల మీద ఆరోపణలు చేయాలనేది నా ఉద్దేశం కాదు.”—అపొ. 28:17-19.
12 పౌలు ఆ యూదుల్ని “సహోదరులారా” అని పిలవడం ద్వారా, తాను కూడా వాళ్లలో ఒకడినని చెప్పడానికి ప్రయత్నించాడు. ఒకవేళ వాళ్ల మనసులో పౌలు మీద ఏవైనా తప్పుడు అభిప్రాయాలు ఉన్నా, ఈ మాటతో అవన్నీ పటాపంచలైపోతాయి. (1 కొరిం. 9:20) అంతేకాదు, తను యూదయలో ఉన్న యూదుల మీద చాడీలు చెప్పడానికి రాలేదు గానీ, కైసరుకు విన్నవించుకోవడానికే వచ్చానని పౌలు స్పష్టం చేశాడు. అయితే, పౌలు కైసరుకు విన్నవించుకుంటాడు అనే విషయం ఇక్కడ రోములో ఉన్న యూదులకు తెలీదు. (అపొ. 28:21) మరి యూదయలో ఉన్న యూదులు ఆ విషయాన్ని వీళ్లకు ఎందుకు చెప్పలేదు? దానిగురించి ఒక రెఫరెన్సు పుస్తకం ఇలా అంటుంది: “బహుశా చలికాలం తర్వాత ఇటలీకి వచ్చిన ఓడల్లో, పౌలు ప్రయాణించిన ఓడే మొదటిది అయ్యుంటుంది. కాబట్టి యెరూషలేములోని యూదా అధికారుల తరఫున మాట్లాడేవాళ్లు ఇంకా రాలేదు. అలాగే ఈ విచారణకు సంబంధించిన ఉత్తరాలేవీ అందలేదు.”
13, 14. పౌలు రాజ్య సందేశాన్ని ఎలా పరిచయం చేశాడు? ఆయనలాగే మనమూ ఏం చేయవచ్చు?
13 పౌలు ఆసక్తి రేకెత్తించే ఈ మాటలతో తన అతిథులకు రాజ్య సందేశాన్ని పరిచయం చేశాడు: “ఇందుకే మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలని వేడుకున్నాను. ఇశ్రాయేలీయులు ఎవరి కోసం ఎదురుచూస్తున్నారో ఆయన వల్లే నేను ఇలా సంకెళ్లతో బంధించబడి ఉన్నాను.” (అపొ. 28:20) ఇంతకీ ఎవరి కోసం వాళ్ల ఎదురుచూపులు? మెస్సీయ కోసం, ఆయన రాజ్యం కోసం. అప్పటి క్రైస్తవ సంఘం ప్రకటిస్తూ వచ్చింది దాని గురించే. పౌలు మాటలు విన్న ఆ యూదుల ప్రముఖులు ఇలా అన్నారు: “నీ ఆలోచనలు ఏమిటో నీ నోటి నుండే వినడం సరైనదని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే, నిజంగానే ప్రతీచోట ప్రజలు ఈ తెగకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మాకు తెలుసు.”—అపొ. 28:22.
14 పౌలులాగే మనం కూడా మంచివార్త ప్రకటిస్తున్నప్పుడు, ఆసక్తి రేకెత్తించే మాటలతో లేదా ప్రశ్నలతో మొదలుపెట్టవచ్చు. దీనికి సంబంధించి కొన్ని మంచి సలహాలు లేఖనాల నుండి తర్కించడం (ఇంగ్లీషు), దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి, చక్కగా చదువుదాం, బోధిద్దాం వంటి బైబిలు ప్రచురణల్లో ఉన్నాయి. ఈ ప్రచురణల్ని మీరు చక్కగా ఉపయోగించుకుంటున్నారా?
అపొ. 28:23-29)
‘పౌలు పూర్తిస్థాయిలో సాక్ష్యమిచ్చి’ ఆదర్శంగా నిలిచాడు (15. పౌలు సాక్ష్యమిచ్చిన విధానం నుండి మనం ఏ నాలుగు విషయాలు నేర్చుకోవచ్చు?
15 “అంతకుముందు కన్నా ఎక్కువమంది” యూదులు ఒకరోజు అనుకుని, పౌలు ఉంటున్న ఇంటికి వచ్చారు. అప్పుడు, “పౌలు ఉదయం నుండి సాయంత్రం వరకు దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో సాక్ష్యమిస్తూ వాళ్లకు ప్రకటించాడు. అలా మోషే ధర్మశాస్త్రంలో, ప్రవక్తల పుస్తకాల్లో రాసివున్న వాటిని ఉపయోగిస్తూ యేసు గురించి వాళ్లను ఒప్పించడానికి ప్రయత్నించాడు.” (అపొ. 28:23) పౌలు సాక్ష్యమిచ్చిన విధానంలో నాలుగు విషయాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఒకటి, ఆయన దేవుని రాజ్యం గురించి నొక్కి చెప్పాడు. రెండు, ఆయన వాళ్లను ఒప్పించేలా మాట్లాడడానికి ప్రయత్నించాడు. మూడు, ఆయన లేఖనాల నుండి తర్కించాడు. నాలుగు, “ఉదయం నుండి సాయంత్రం వరకు” సాక్ష్యం ఇవ్వడం ద్వారా తన అవసరాల కన్నా వాళ్ల అవసరాలకే ప్రాముఖ్యత ఇచ్చాడు. ఎంత మంచి ఆదర్శమో కదా! మరి అప్పుడు ఏమైంది? “కొంతమంది నమ్మారు,” కొంతమంది నమ్మలేదు. “వాళ్లకు వేర్వేరు అభిప్రాయాలు ఉండడంతో వాళ్లు అక్కడి నుండి వెళ్లిపోవడం మొదలుపెట్టారు” అని లూకా రాశాడు.—అపొ. 28:24, 25ఎ.
16-18. కొంతమంది యూదులు తను చెప్పేది నమ్మనప్పుడు పౌలు ఎందుకు ఆశ్చర్యపోలేదు? ఎవరైనా మన సందేశాన్ని వినకపోతే ఏం చేయాలి?
16 వాళ్లు అలా వెళ్లిపోవడం చూసి పౌలు ఏమీ ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే, అది బైబిలు ప్రవచన నెరవేర్పు అని ఆయనకు తెలుసు. పైగా ఇంతకుముందు కూడా ఆయనకు అలా జరిగింది. (అపొ. 13:42-47; 18:5, 6; 19:8, 9) అందుకే, స్పందించకుండా వెళ్లిపోతున్న తన అతిథులతో పౌలు ఇలా అన్నాడు: “పవిత్రశక్తి యెషయా ప్రవక్త ద్వారా మీ పూర్వీకులతో చెప్పిన ఈ మాట నిజమే: ‘ఈ ప్రజల దగ్గరికి వెళ్లి ఇలా చెప్పు: “మీరు వినడం వరకు వింటారు కానీ మీకు ఏమాత్రం అర్థంకాదు, మీరు చూడడం వరకు చూస్తారు కానీ మీకు ఏమీ కనిపించదు. ఈ ప్రజల హృదయాలు మొద్దుబారిపోయాయి.”’” (అపొ. 28:25బి-27) ఇక్కడ “మొద్దుబారిపోయాయి” అనే పదానికి, గ్రీకులో “మందంగా తయారైన” లేదా “కొవ్వు పేరుకుపోయిన” అనే అర్థం కూడా ఉంది. కాబట్టి రాజ్య సందేశం వాళ్ల హృదయాల్లోకి వెళ్లట్లేదు. (అపొ. 28:27) వాళ్లు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారో కదా!
17 ఆ యూదుల్లా కాకుండా, రాజ్య సందేశాన్ని ‘అన్యజనులు తప్పకుండా వింటారు’ అని పౌలు చివర్లో అన్నాడు. (అపొ. 28:28; కీర్త. 67:2; యెష. 11:10) పౌలు అంత ఖచ్చితంగా ఎందుకు చెప్పగలుగుతున్నాడు? ఎందుకంటే, చాలామంది అన్యజనులు రాజ్య సందేశానికి స్పందించడం ఆయన కళ్లారా చూశాడు!—అపొ. 13:48; 14:27.
18 పౌలులాగే మనం కూడా, ఎవరైనా మంచివార్త వినకపోతే బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, జీవానికి నడిపించే దారిని కొంతమందే కనుక్కుంటారని మనకు తెలుసు. (మత్త. 7:13, 14) కాబట్టి సరైన హృదయస్థితి ఉన్న వాళ్లెవరైనా యెహోవాను ఆరాధించడం మొదలుపెట్టినప్పుడు మనం సంతోషిద్దాం, మనసారా వాళ్లను సంఘంలోకి ఆహ్వానిద్దాం.—లూకా 15:7.
“దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ . . . ఉన్నాడు” (అపొ. 28:30, 31)
19. ఇంట్లో బందీగా ఉన్నా, పౌలు ఏం చేశాడు?
19 లూకా అపొస్తలుల కార్యాలు పుస్తకాన్ని ఎంతో ప్రోత్సాహకరమైన మాటలతో ముగించాడు. ఆయన ఇలా రాశాడు: “పౌలు తన అద్దె ఇంట్లో నివసిస్తూ పూర్తిగా రెండు సంవత్సరాలు అక్కడే ఉండిపోయాడు. అతను తన దగ్గరికి వచ్చే వాళ్లందర్నీ సాదరంగా ఆహ్వానిస్తూ, ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి ధైర్యంతో దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు గురించి బోధిస్తూ ఉన్నాడు.” (అపొ. 28:30, 31) పౌలుకున్న ఆతిథ్య స్ఫూర్తి, విశ్వాసం, ఉత్సాహం గురించి ఎంత చెప్పినా తక్కువే!
20, 21. రోములో పౌలు చేసిన పరిచర్య వల్ల ఎవరెవరు ప్రయోజనం పొందారు?
20 అలా పౌలు ‘సాదరంగా ఆహ్వానించిన’ వాళ్లలో ఒనేసిము ఒకడు. అతను కొలొస్సయి నుండి రోముకు పారిపోయి వచ్చిన దాసుడు. పౌలు అతనికి క్రైస్తవుడయ్యేలా సహాయం చేశాడు, అతను పౌలుకు ‘నమ్మకమైన ప్రియ సహోదరుడు’ అయ్యాడు. నిజానికి పౌలు అతన్ని “నా కుమారుడు” అని, “నేను అతనికి తండ్రినయ్యాను” అని వర్ణించాడు. (కొలొ. 4:9; ఫిలే. 10-12) ఒనేసిము విషయంలో పౌలుకు ఎంత సంతోషం కలిగివుంటుందో కదా! a
21 వేరేవాళ్లు కూడా పౌలు చక్కని ఆదర్శం నుండి ప్రయోజనం పొందారు. ఫిలిప్పీయులకు ఆయన ఇలా రాశాడు: “నా పరిస్థితి నిజానికి మంచివార్తను వ్యాప్తి చేయడానికే తోడ్పడింది. నేను క్రీస్తు కోసం ఖైదీగా ఉన్నాననే విషయం ప్రేతోర్య సైనికులందరికీ, మిగతా వాళ్లందరికీ తెలిసింది. ప్రభువు సేవలో ఉన్న చాలామంది సహోదరులు నా సంకెళ్ల వల్ల ప్రోత్సాహం పొంది చాలా ధైర్యంగా, ఏమాత్రం భయపడకుండా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు.”—ఫిలి. 1:12-14.
22. పౌలు రోములో బందీగా ఉన్న సమయాన్ని ఎలా ఉపయోగించుకున్నాడు?
22 రోములో బందీగా ఉన్న సమయాన్ని, పౌలు చక్కగా కొన్ని ముఖ్యమైన ఉత్తరాలు రాయడానికి ఉపయోగించాడు. అవే ఇప్పుడు క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో భాగమయ్యాయి. b ఆయన ఎవరికైతే ఆ ఉత్తరాలు రాశాడో, ఆ మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు వాటినుండి ప్రయోజనం పొందారు. పౌలు దైవప్రేరణతో రాసిన సలహాలు అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి మనం కూడా పౌలు రాసిన ఉత్తరాల నుండి ప్రయోజనం పొందవచ్చు.—2 తిమో. 3:16, 17.
23, 24. పౌలులాగే మన కాలంలో చాలామంది క్రైస్తవులు, అన్యాయంగా జైలుపాలైనా ఎలా సంతోషాన్ని కాపాడుకుంటున్నారు?
23 అపొస్తలుల కార్యాలు పుస్తకంలో లేదు గానీ, పౌలు దాదాపు నాలుగేళ్ల తర్వాత విడుదలయ్యాడు. ఆయన కైసరయలో రెండేళ్లు, రోములో రెండేళ్లు బందీగా ఉన్నాడు. c (అపొ. 23:35; 24:27) కానీ ఆ సమయమంతటిలో, పౌలు ఆనందాన్ని కోల్పోకుండా యెహోవా సేవలో చేయగలిగింది చేశాడు. ఇప్పుడు కూడా చాలామంది యెహోవా సేవకులు అన్యాయంగా జైలుపాలైనా, వాళ్ల ఆనందాన్ని కోల్పోకుండా ప్రకటిస్తూనే ఉన్నారు. స్పెయిన్‌కు చెందిన అడాల్ఫో ఉదాహరణ పరిశీలించండి. తటస్థంగా ఉన్నందుకు ఆయన్ని జైల్లో వేశారు. ఒక జైలు అధికారి ఇలా అన్నాడు: “నిన్ను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. మేము నిన్ను చాలా ఇబ్బందిపెడుతున్నాం. కానీ, నిన్ను ఎంత ఎక్కువ కష్టపెడితే నువ్వు అంత ఎక్కువ సంతోషంగా ఉంటున్నావ్, దయగా మాట్లాడుతున్నావ్.”
24 అడాల్ఫో జైలు అధికారుల నమ్మకాన్ని ఎంతగా సంపాదించాడంటే, వాళ్లు ఆయన జైలు గదికి అసలు తాళమే వేసేవాళ్లు కాదు. జైలు గార్డులు బైబిలు ప్రశ్నలు అడగడానికి ఆయన దగ్గరికి వెళ్లేవాళ్లు. ఒక గార్డు అయితే, ఏకంగా అడాల్ఫో జైలు గదిలోకి వెళ్లి బైబిలు చదివేవాడు. ఆ సమయంలో ఎవరూ అతన్ని చూడకుండా అడాల్ఫో కాపలా కాసేవాడు. ఆ విధంగా, ఒక ఖైదీ జైలు గార్డుకి “గార్డు” అయ్యాడు! అలాంటి నమ్మకమైన సాక్షుల ఉదాహరణలు చూసినప్పుడు, కష్టమైన పరిస్థితుల్లో కూడా “చాలా ధైర్యంగా, ఏమాత్రం భయపడకుండా” దేవుని వాక్యాన్ని ప్రకటించాలని అనిపిస్తుంది.
25, 26. పౌలు ఏ ప్రవచనం నెరవేరడం చూశాడు? ఇప్పుడు మన కాలంలో కూడా ఆ ప్రవచనం ఎలా నెరవేరుతోంది?
25 అపొస్తలుల కార్యాలు పుస్తకంలో, మంచివార్తను ప్రకటించడమే ప్రాణంగా బ్రతికిన క్రైస్తవుల గాథలు ఉన్నాయి! ఇంట్లో బందీగా ఉన్నప్పుడు, తనను చూడడానికి వచ్చిన వాళ్లందరికీ “దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ” ఉన్న పౌలు ఉదాహరణతో ఈ పుస్తకం ముగుస్తుంది. అది నిజంగా ఒక మంచి ముగింపు! మొదటి అధ్యాయంలో యేసు తన అనుచరులకు ఇలా ఆజ్ఞాపించాడని చదివాం: “పవిత్రశక్తి మీ మీదికి వచ్చినప్పుడు మీరు బలం పొందుతారు; అప్పుడు యెరూషలేములో, యూదయ అంతటిలో, సమరయలో, భూమంతటా మీరు నా గురించి సాక్ష్యమిస్తారు.” (అపొ. 1:8) ఆ మాట చెప్పి 30 ఏళ్లు కూడా గడవకముందే, రాజ్య సందేశం “భూమంతటా ప్రకటించబడింది.” d (కొలొ. 1:23) నిజంగా పవిత్రశక్తికి ఎంత శక్తి ఉందో ఇది నిరూపిస్తుంది!—జెక. 4:6.
26 ఇప్పుడు కూడా, పవిత్రశక్తి ఇచ్చిన బలంతోనే క్రీస్తు సహోదరుల్లో మిగిలినవాళ్లు, వాళ్లకు మద్దతిచ్చే “వేరే గొర్రెలు” 240 దేశాల్లో, ద్వీపాల్లో “దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యమిస్తున్నారు! (యోహా. 10:16; అపొ. 28:23) ఆ పనిలో మీరు పూర్తిగా పాల్గొంటున్నారా?
a పౌలు ఒనేసిమును తనతోనే ఉంచుకోవాలనుకున్నాడు. కానీ అలా చేస్తే రోమా చట్టాన్ని మీరినట్లు అవుతుంది, ఫిలేమోను హక్కులకు భంగం కలిగించినట్టు అవుతుంది. ఎందుకంటే ఫిలేమోను ఒనేసిముకు యజమానే కాదు, పౌలుకు తోటి సహోదరుడు కూడా. అందుకే పౌలు ఒనేసిమును పంపించేస్తూ, అతన్ని దాసుడిగా కాకుండా ఒక సహోదరుడిగా దయతో చేర్చుకోమని ఫిలేమోనుకు ఉత్తరం రాశాడు. ఒనేసిము ఆ ఉత్తరాన్ని తీసుకుని ఫిలేమోను దగ్గరికి తిరిగెళ్లాడు.—ఫిలే. 13-19.
b “ పౌలు మొదటిసారి రోములో బందీగా ఉన్నప్పుడు రాసిన ఐదు ఉత్తరాలు” అనే బాక్సు చూడండి.
c “ క్రీస్తు శకం 61 తర్వాత పౌలు జీవితం” అనే బాక్సు చూడండి.
d “ మంచివార్త ‘భూమంతటా ప్రకటించబడింది’” అనే బాక్సు చూడండి.