అధ్యాయం 26
“మీలో ఏ ఒక్కరూ చనిపోరు”
పౌలు ఎక్కిన ఓడ బద్దలైంది, ఆయన చెక్కుచెదరని విశ్వాసాన్ని అలాగే ప్రజల మీద ప్రేమను చూపించాడు
అపొస్తలుల కార్యాలు 27:1–28:10 ఆధారంగా
1, 2. పౌలు ముందు ఏ ప్రయాణం ఉంది? ఆయన ఏ విషయాల గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు?
“కైసరు దగ్గరికే వెళ్తావు” అని అధిపతి అయిన ఫేస్తు అన్న మాటలే, పౌలు చెవిలో మారుమోగుతున్నాయి. ఎందుకంటే, ఇప్పుడు ఆయన భవిష్యత్తు దానిమీదే ఆధారపడి ఉంది. పౌలు రెండు సంవత్సరాలుగా చెరసాల గోడల మధ్యే మగ్గుతున్నాడు. ఇప్పుడు చాలా దూరప్రయాణం చేసి రోముకు వెళ్లాలి. ఇలా అయినా, ఆయన నాలుగు గోడల మధ్య నుండి కాస్త బయటికొచ్చినట్టు అవుతుంది. (అపొ. 25:12) అయితే పౌలు సముద్ర ప్రయాణం చేయడం ఇదేం మొదటిసారి కాదు, చాలాసార్లు చేశాడు. స్వచ్ఛమైన గాలి, విశాలమైన ఆకాశం, అందమైన సముద్ర తీరాల్ని చూడడం లాంటి తీపి గుర్తుల కన్నా చేదు జ్ఞాపకాలే ఆయనకు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ ఓడ ప్రయాణం ఎలా ఉంటుందో, కైసరు దగ్గరికి వెళ్లి ఏం మాట్లాడాలో అని పౌలు ఆలోచిస్తూ ఉండవచ్చు.
2 పౌలు ఎన్నోసార్లు ‘సముద్రంలో ప్రమాదాలు’ ఎదుర్కొన్నాడు. మూడు సందర్భాల్లో ఆయన ఎక్కిన ఓడ బద్దలైంది, ఒకసారైతే రాత్రీ పగలూ నడిసముద్రంలో ఉన్నాడు. (2 కొరిం. 11:25, 26) అలాంటి మిషనరీ యాత్రలన్నిటిలో ఆయన కనీసం స్వేచ్ఛగా తిరిగాడు. కానీ ఇప్పుడు ఒక ఖైదీగా కైసరయ నుండి రోముకు 3,000 కన్నా ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణించబోతున్నాడు. ఈ సుదూర ప్రయాణంలో ఆయన బ్రతికి బయటపడతాడా? ఒకవేళ బయటపడినా, రోముకు చేరుకున్నాక ఆయనకు మరణశిక్ష పడుతుందా? గుర్తుంచుకోండి, అప్పట్లో సాతాను లోకంలో ఉన్న అత్యంత శక్తివంతమైన చక్రవర్తి ముందు పౌలు నిలబడాల్సి ఉంది.
3. పౌలు ఏ పట్టుదలతో ఉన్నాడు? ఈ అధ్యాయంలో ఏం చూస్తాం?
3 పౌలు గురించి ఇంత తెలుసుకున్నాక మీకు ఏమనిపిస్తుంది? ఆయన తన ముందున్న పరిస్థితుల్ని బట్టి డీలాపడి, కుమిలిపోయి ఉంటాడా? కానేకాదు! కష్టాలు వస్తాయని ఆయనకు తెలుసు, కానీ ఎలాంటి కష్టాలు వస్తాయో, అవి ఎటువైపు నుండి వస్తాయో ఆయనకు తెలీదు. ఆయన తన చేతుల్లో లేని విషయాల గురించి ఆందోళనపడుతూ, పరిచర్యలో దొరికే ఆనందాన్ని ఎందుకు పోగొట్టుకుంటాడు? (మత్త. 6:27, 34) తాను ప్రతీఒక్కరికి, చివరికి అధికారులకు కూడా దేవుని రాజ్యం గురించిన మంచివార్త ప్రకటించాలన్నదే యెహోవా కోరిక అని పౌలుకు తెలుసు. (అపొ. 9:15) అందుకే పౌలు, ఆరు-నూరైనా సరే తనకు అప్పగించిన పనిని పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. మనం కూడా అదే పట్టుదలతో ఉంటాం కదా! కాబట్టి రండి, పౌలుతో కలిసి కాసేపు ఓడలో ప్రయాణిస్తూ ఆయన నుండి ఏం నేర్చుకోవచ్చో చూద్దాం.
అపొ. 27:1-7ఎ)
‘ఎదురుగాలి వీచింది’ (4. పౌలు ఎలాంటి ఓడలో ప్రయాణం మొదలుపెట్టాడు? ఆయనతో పాటు ఉన్న ఇద్దరు స్నేహితులు ఎవరు?
4 పౌలును, ఇంకొంతమంది ఖైదీల్ని యూలి అనే రోమా సైనికాధికారికి అప్పగించారు. కైసరయకు వచ్చిన సరుకుల ఓడలో, యూలి వాళ్లను తీసుకుని ఎక్కాడు. ఆ ఓడ, ఆసియా మైనరుకు పశ్చిమ తీరాన ఉన్న అద్రముత్తియ అనే ఓడరేవు నుండి బయల్దేరింది. అక్కడి నుండి లెస్‌బోస్ ద్వీపంలో ఉన్న మితులేనే అనే నగరాన్ని దాటుకుంటూ కైసరయకు వచ్చింది. ఇప్పుడు ఆ ఓడ కైసరయ నుండి ఉత్తరానికి వెళ్లి, ఆ తర్వాత పశ్చిమం వైపుగా ప్రయాణిస్తూ, మధ్యమధ్యలో ఆగి సరుకుల్ని ఎక్కించడం, దించడం చేస్తుంది. అలాంటి ఓడలు ప్రయాణికుల కోసం కాదు, ఖైదీల కోసమైతే అస్సలు కాదు. (“ సముద్ర ప్రయాణం, వ్యాపార మార్గాలు” అనే బాక్సు చూడండి.) ఒక మంచి విషయం ఏంటంటే ఆ ఖైదీల మధ్య ఉన్న క్రైస్తవుడు, పౌలు ఒక్కడే కాదు. ఆయనతో పాటు కనీసం ఇద్దరు ఉన్నారు: వాళ్లే అరిస్తార్కు, లూకా. అపొస్తలుల కార్యాలు పుస్తకాన్ని రాసింది ఈ లూకానే. నమ్మకమైన ఆ ఇద్దరు స్నేహితులు ప్రయాణికులుగా డబ్బులు కట్టి ఓడ ఎక్కారో, లేకపోతే పౌలుకు సహాయం చేసేవాళ్లుగా ఎక్కారో మనకు తెలీదు.—అపొ. 27:1, 2.
5. సీదోను దగ్గర పౌలు ఎవర్ని కలిశాడు? దానినుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
5 ఓడ ప్రయాణం మొదలై ఒక రోజు గడిచింది. ఓడ దాదాపు 110 కిలోమీటర్లు ఉత్తరం వైపుగా ప్రయాణించి, సిరియా తీరాన ఉన్న సీదోను దగ్గర ఆగింది. పౌలు ఒక రోమా పౌరుడు, పైగా ఆయన నేరం ఇంకా రుజువు అవ్వలేదు. కాబట్టి యూలి ఆయన్ని ఒక మామూలు ఖైదీలా చూసి ఉండకపోవచ్చు. (అపొ. 22:27, 28; 26:31, 32) తీరం దగ్గరున్న సహోదర సహోదరీల్ని కలవడానికి యూలి పౌలును వెళ్లనిచ్చాడు. చాలాకాలంగా చెరసాలలో ఉండి బయటికి వచ్చిన పౌలు బాగోగుల్ని చూసుకుని, వాళ్లు ఎంత సంతోషించి ఉంటారో కదా! మీరు కూడా ఎవరికైనా ప్రేమతో ఆతిథ్యం ఇవ్వవచ్చేమో ఆలోచించండి. అలా చేస్తే, మీరు కూడా ప్రోత్సాహం పొందుతారు.—అపొ. 27:3.
6-8. సీదోను నుండి క్నీదు వరకు పౌలు ప్రయాణం ఎలా సాగింది? ప్రకటించడానికి పౌలుకు ఎలాంటి అవకాశాలు దొరికి ఉంటాయి?
6 ఓడ సీదోను నుండి కదిలి, తీరం వెంబడి ప్రయాణిస్తూ కిలికియను దాటింది. కిలికియ, పౌలు సొంత ఊరైన తార్సు దగ్గర ఉంది. ఈ మధ్యలో ఓడ ఎక్కడెక్కడ ఆగిందో లూకా చెప్పట్లేదు గానీ, ‘ఎదురుగాలి వీస్తుంది’ అనే చిన్న వివరణ మాత్రం చెప్పాడు. (అపొ. 27:4, 5) అయితే, పౌలు తనకు దొరికిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుని మంచివార్త ప్రకటించడం మనం ఊహించుకోవచ్చు. ఆయన తోటి ఖైదీలకు, ఓడ సిబ్బందికి, సైనికులకు, అలాగే రేవుల దగ్గర ఆగినప్పుడల్లా అక్కడున్న ప్రజలకు ఖచ్చితంగా ప్రకటించి ఉంటాడు. మనం కూడా ప్రతీ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుని ప్రకటిస్తున్నామా?
7 తర్వాత ఓడ మూర అనే రేవుకు చేరుకుంది, అది ఆసియా మైనరు దక్షిణ తీరాన ఉంది. అక్కడ పౌలు, ఇతరులు రోముకు వెళ్లే ఇంకో ఓడకు మారాలి. (అపొ. 27:6) అప్పట్లో రోముకు ఐగుప్తే గోధుమల్ని సరఫరా చేసేది. ఐగుప్తు నుండి వచ్చే ధాన్యపు ఓడలన్నీ మూర దగ్గర ఆగేవి. అలాంటి ఒక ఓడ చూసుకొని యూలి సైనికుల్ని, ఖైదీల్ని ఎక్కించాడు. ఈ ఓడ ఇంతకుముందు ఎక్కిన ఓడ కన్నా ఎంతో పెద్దది అయ్యుంటుంది. అందులో విలువైన గోధుమ సరుకే కాదు, ఓడ సిబ్బంది, సైనికులు, ఖైదీలు, బహుశా రోముకు వెళ్లే ప్రయాణికులు అందరూ కలిపి 276 మంది ఉన్నారు. కాబట్టి, ఓడ మారడం పౌలుకు ఇంకా ఎక్కువమందికి ప్రకటించే అవకాశాన్ని ఇచ్చింది. ఖచ్చితంగా దాన్ని పౌలు వదులుకొని ఉండడు.
8 తర్వాత ఓడ క్నీదులో ఆగింది, అది ఆసియా మైనరుకు నైరుతి దిక్కున ఉంది. గాలులు అనుకూలిస్తే, మూర నుండి క్నీదుకు ఒక్కరోజులో వచ్చేయవచ్చు. కానీ ఎంత సమయం పట్టిందో చెప్తూ, లూకా ఇలా రాశాడు: “మేము చాలా రోజులు ఓడలో నెమ్మదిగా ప్రయాణించి, కష్టం మీద క్నీదుకు వచ్చాం.” (అపొ. 27:7ఎ) వాతావరణం అల్లకల్లోలంగా మారడం వల్ల వాళ్ల ప్రయాణం కష్టంగా సాగింది. (“ మధ్యధరా సముద్రంలో ఎదురుగాలులు” అనే బాక్సు చూడండి.) భీకరమైన గాలులు, రాకాసి అలలు ఓడను కుదిపేస్తుంటే ప్రయాణికుల గుండెలు అదిరివుంటాయి.
‘తుఫాను బలంగా కొడుతూ ఉంది’ (అపొ. 27:7బి-26)
9, 10. క్రేతు దగ్గర ఏం జరిగింది?
9 ఓడ నాయకుడు క్నీదు నుండి పశ్చిమం వైపుగా ఓడను నడిపించాలనుకున్నాడు. కానీ, ఏం జరిగిందో కళ్లారా చూసిన లూకా ఇలా చెప్పాడు: “గాలి మమ్మల్ని నేరుగా ముందుకు వెళ్లనివ్వలేదు.” (అపొ. 27:7బి) ఓడ తీరం నుండి దూరం వెళ్తుండగా, అప్పటివరకు ఓడకు సహకరించిన తీరపు గాలులు ఆగిపోయాయి. అప్పుడు వాయువ్య దిక్కు (నార్త్ వెస్ట్) నుండి వచ్చిన బలమైన గాలి ఓడను చాలా వేగంగా దక్షిణం వైపుకు నెట్టేసింది. ఇంతకుముందు ఎదురుగాలులు వీచినప్పుడు కుప్ర ద్వీపం ఓడకు రక్షణ ఇచ్చినట్టే, ఈసారి క్రేతు ద్వీపం రక్షణ ఇచ్చింది. ఓడ, ద్వీపానికి తూర్పు అంచున ఉన్న సల్మోనేను దాటినప్పుడు పరిస్థితి కాస్త కుదుటపడింది. ఎందుకు? ఓడ ద్వీపానికి దక్షిణం వైపు రావడం వల్ల, ఆ ద్వీపమే బలమైన గాలుల నుండి కొంతవరకు రక్షణను ఇచ్చింది. ఆ క్షణం, ఓడలో ఉన్నవాళ్లు కాస్త ఊపిరి పీల్చుకుని ఉంటారు! గాలుల నుంచైతే ఓడ తప్పించుకుంది, కానీ వచ్చేది చలికాలం. అప్పుడు పరిస్థితులు ఇంకా ఘోరంగా తయారౌతాయి. కాబట్టి ఓడ సిబ్బంది భయపడడంలో తప్పులేదు.
10 లూకా ఖచ్చితమైన వివరాలు చెప్తూ ఇలా రాశాడు: “మేము కష్టం మీద [క్రేతు] తీరం వెంబడి ప్రయాణిస్తూ మంచిరేవులు అనే చోటికి వచ్చాం.” వాళ్లు ద్వీపం చాటున ప్రయాణించినా, ఓడను అదుపు చేయడం కష్టమైంది. చివరికి, ఎలాగోలా లంగరు వేసి ఓడను కొంచెంసేపు ఆపడానికి మంచిరేవుల్లో చిన్న స్థలం దొరికింది. ఆ స్థలం, బహుశా తీరం ఉత్తరం వైపుకు తిరగడానికి కాస్త ముందు ఉండివుంటుంది. వాళ్లు ఎంతసేపు అక్కడ ఆగారు? “చాలా రోజులు” అని లూకా చెప్పాడు. కానీ పరిస్థితి మెరుగయ్యే సూచనలు లేవు. ఎందుకంటే, చలికాలంలో అంటే సెప్టెంబరు/అక్టోబరు నెలల్లో ఓడ ప్రయాణం చాలా ప్రమాదకరంగా ఉంటుంది.—అపొ. 27:8, 9.
11. పౌలు ఓడలోని వాళ్లకు ఏ సలహా ఇచ్చాడు? కానీ వాళ్లు ఏం చేశారు?
11 పౌలుకు మధ్యధరా సముద్రంలో ప్రయాణించిన అనుభవం ఉంది కాబట్టి, కొంతమంది ప్రయాణికులు ఆయన్ని సలహా అడిగి ఉండవచ్చు. అప్పుడు పౌలు ఓడను ఇక్కడ ఆపడం మంచిదని, ముందుకు తీసుకెళ్తే ఓడకే కాదు “ప్రాణాలకు కూడా హాని, గొప్ప నష్టం” జరుగుతుందని చెప్పాడు. అయితే ఓడ నడిపే వ్యక్తి, ఓడ యజమాని ఇద్దరూ దానికి ఒప్పుకోలేదు. బహుశా ఓడను ఇంకా సురక్షితమైన స్థలానికి తీసుకెళ్లాలనే తొందరలో వాళ్లు ఉండుంటారు. అందుకే వాళ్లు యూలిని ఒప్పించారు. అలాగే చాలామంది ప్రజలు కూడా, తీరం వెంబడి కాస్త దూరంలో ఉన్న ఫీనిక్సుకి చేరుకోవడం మంచిదని అనుకున్నారు. ఆ ఓడరేవు పెద్దగా, చలికాలంలో తల దాచుకోవడానికి వీలుగా ఉండి ఉంటుంది. అందుకే, దక్షిణం నుండి గాలి మెల్లగా వీచేసరికి వాళ్లు సురక్షితంగా ఫీనిక్సుకి చేరుకోవచ్చని పొరబడి ప్రయాణం మొదలుపెట్టారు.—అపొ. 27:10-13.
12. క్రేతు దాటిన తర్వాత ఓడ ఎలాంటి ప్రమాదాలు ఎదుర్కొంది? దాన్ని తప్పించుకోవడానికి ఓడ సిబ్బంది ఏం చేశారు?
12 వాళ్లకు పెద్ద ప్రమాదం వచ్చిపడింది: ఈశాన్యం (నార్త్ ఈస్ట్) నుండి “భయంకరమైన గాలి” వీచింది. మంచిరేవులకు దాదాపు 65 కిలోమీటర్ల దూరంలో, “కౌద అనే చిన్న ద్వీపం చాటున” వాళ్లు కొంతకాలం తలదాచుకున్నారు. అయితే ఓడ దక్షిణం వైపు కొట్టుకుపోయి, ఆఫ్రికా తీరం దగ్గరున్న సూర్తిసు అనే ఇసుకతిప్పల మీదికి దూసుకెళ్లే ప్రమాదం ఉంది. అలా జరగకుండా, నావికులు ఓడ వెనకాల ఉన్న చిన్న పడవను పైకి ఎక్కించాలనుకున్నారు. బహుశా ఆ పడవ నీళ్లతో నిండిపోయి ఉంటుంది, కాబట్టి వాళ్లు తిప్పలుపడి దాన్ని పైకి ఎక్కించారు. తర్వాత ఓడ కింద ఉన్న చెక్కలు ఊడిపోకుండా, అడుగు నుండి పై వరకు తాళ్లతో లేదా గొలుసులతో కష్టపడి దాన్ని బిగించారు. అలాగే తెరచాపల్ని దించారు, గాలి వీస్తున్న వైపుకు ఓడను తిప్పడానికి తంటాలు పడ్డారు. ఇదంతా చేస్తున్నప్పుడు వాళ్లకు వెన్నులో వణుకు పుట్టివుంటుంది! ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ‘తుఫాను ఓడను బలంగా కొడుతూనే ఉంది.’ ఓడను తేలిక చేయడం కోసం, వాళ్లు మూడో రోజున ఓడ పరికరాల్ని సముద్రంలో పడేశారు.—అపొ. 27:14-19.
13. తుఫానులో ఓడ ప్రయాణం ఎలా సాగింది?
13 ఓడలోని వాళ్లందరూ భయంతో బిక్కుబిక్కుమంటూ ఉండుంటారు. కానీ పౌలు, ఆయన స్నేహితులు ధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే, పౌలు రోముకు వెళ్లి అక్కడ ప్రకటిస్తాడని అంతకుముందు యేసు చెప్పాడు. ఆ విషయాన్నే తర్వాత దేవదూత కూడా చెప్పాడు. (అపొ. 19:21; 23:11) అయితే, రెండు వారాలపాటు పగలూరాత్రీ వాళ్లు తుఫానులోనే గడిపారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో, కారుమబ్బులు కమ్మేయడంతో వాళ్లు కొన్ని రోజులు సూర్యుణ్ణి, నక్షత్రాలను చూడలేదు. దానివల్ల ఓడ ఎక్కడుందో, ఎటు వెళ్తుందో ఓడ నడిపే వ్యక్తికి అర్థం కావట్లేదు. ఓడలో ఉన్న వాళ్లకు తిండి మీద ధ్యాసే లేదు. ఒకవైపు చలి, వర్షం, సముద్ర ప్రయాణం వల్ల కడుపులో వికారం. ఇంకోవైపేమో, గుండెల నిండా భయం. వీటన్నిటి మధ్య ఎవరికైనా తినాలని ఎందుకు అనిపిస్తుంది?
14, 15. (ఎ) ఓడలోని వాళ్లు తన సలహా వినుంటే ఇలా జరిగేది కాదని పౌలు ఎందుకు అన్నాడు? (బి) పౌలు ఆశను నింపే సందేశం చెప్పడం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
14 పౌలు లేచి నిలబడి, తన సలహా వినుంటే ఇలా జరిగేది కాదు అన్నాడు. ఎందుకు? వాళ్లను వేలెత్తి చూపించడానికా? కాదు, తన మాటలు నమ్మవచ్చు అని చూపించడానికి. తర్వాత ఆయన ఇలా అన్నాడు: “ధైర్యం తెచ్చుకోమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఎందుకంటే, మీలో ఏ ఒక్కరూ చనిపోరు. ఓడ మాత్రం బద్దలౌతుంది.” (అపొ. 27:21, 22) ఆ మాటలు విన్నప్పుడు వాళ్ల మనసు తేలికపడి ఉంటుంది! యెహోవా తనతో ఆ మంచి మాటను చెప్పించినందుకు పౌలు కూడా సంతోషంతో పొంగిపోయి ఉంటాడు. యెహోవాకు ప్రతీఒక్కరి ప్రాణం ఎంతో విలువైనదని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. “ఎవ్వరూ నాశనమవ్వడం ఆయనకు ఇష్టంలేదు. ఆయన, అందరికీ పశ్చాత్తాపపడే అవకాశం దొరకాలని కోరుకుంటున్నాడు” అని అపొస్తలుడైన పేతురు రాశాడు. (2 పేతు. 3:9) కాబట్టి, ప్రజల్లో ఆశను నింపే మంచివార్తను వీలైనంత ఎక్కువమందికి చెప్పడం ఇప్పుడు అత్యవసరం! అమూల్యమైన ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి.
15 పౌలు ఓడలో ఉన్న చాలామందికి, ‘దేవుడు చేసిన వాగ్దానానికి’ సంబంధించిన నిరీక్షణ గురించి సాక్ష్యం ఇస్తుండవచ్చు. (అపొ. 26:6; కొలొ. 1:5) కానీ ఇప్పుడు ఓడ బద్దలయ్యే అవకాశం ఉంది కాబట్టి, అప్పటికప్పుడు వాళ్లలో నిరీక్షణ లేదా ఆశ నింపే ఒక సందేశాన్ని చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు: “నేను ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నానో . . . ఆ దేవుని దూత నిన్న రాత్రి నా పక్కన నిలబడి, ‘పౌలూ, భయపడకు. నువ్వు కైసరు ముందు నిలబడాలి. ఇదిగో! నీతోపాటు ప్రయాణిస్తున్నవాళ్ల ప్రాణాల్ని కూడా దేవుడు దయతో కాపాడతాడు’ అని చెప్పాడు.” పౌలు వాళ్లను ఇలా ప్రోత్సహించాడు: “కాబట్టి స్నేహితులారా, ధైర్యం తెచ్చుకోండి. నాకు దేవుని మీద నమ్మకం ఉంది, ఆయన ఆ దూత నాతో చెప్పినట్టే చేస్తాడు. అయితే మన ఓడ ఏదైనా ఒక ద్వీపానికి తగిలి బద్దలవ్వాల్సి ఉంది.”—అపొ. 27:23-26.
“అందరూ క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు” (అపొ. 27:27-44)
16, 17. (ఎ) పౌలు ఏ సందర్భంలో ప్రార్థన చేశాడు? దానివల్ల వచ్చిన ఫలితం ఏంటి? (బి) పౌలు ముందే చెప్పినట్టు ఏం జరిగింది?
16 రెండు వారాలపాటు ఓడ గాలికి కొట్టుకుపోతూ దాదాపు 870 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత, చివరికి నావికులు తీరం దగ్గరపడుతుందని గుర్తించారు. అలలు చేసే శబ్దాన్ని బట్టి వాళ్లు అలా గుర్తించి ఉంటారు. దాంతో వాళ్లు ఓడ వెనక భాగం నుండి లంగర్లను దించారు. దానివల్ల ఓడ కొట్టుకుపోకుండా ఉంటుంది, ఓడ ముందు భాగాన్ని తీరం వైపుగా నడిపించడం వీలౌతుంది. ఆ సమయంలో నావికులు ఓడలో నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించారు, కానీ సైనికులు వాళ్లను ఆపేశారు. ఎందుకంటే పౌలు సైనికాధికారితో, సైనికులతో ఇలా అన్నాడు: “వీళ్లు ఓడలో ఉంటేనే తప్ప మీరు ప్రాణాలతో బయటపడలేరు.” ఇప్పుడు ఓడ కాస్త నిలకడగా ఉండడంతో, పౌలు అందర్నీ తినమని చెప్పి, వాళ్లు ప్రాణాలతో ఉంటారని మళ్లీ భరోసా ఇచ్చాడు. ఆ తర్వాత పౌలు, “వాళ్లందరి ముందు దేవునికి కృతజ్ఞతలు” చెప్పాడు. (అపొ. 27:31, 35) ప్రార్థనలో అలా కృతజ్ఞతలు చెప్పడం ద్వారా లూకా, అరిస్తార్కులకే కాదు ఇప్పుడున్న క్రైస్తవులకు కూడా పౌలు చక్కని ఆదర్శం ఉంచాడు. మీరు అందరి ముందు చేసే ప్రార్థనలు ప్రోత్సహించేలా, ఓదార్చేలా ఉన్నాయా?
17 పౌలు ప్రార్థన చేశాక “వాళ్లంతా ధైర్యం తెచ్చుకొని కాస్త భోంచేశారు.” (అపొ. 27:36) తర్వాత, ఓడను ఇంకాస్త తేలిక చేయడానికి అందులో ఉన్న గోధుమల్ని పారేశారు. తెల్లవారినప్పుడు ఓడ సిబ్బంది తాళ్లను కోసేసి లంగర్లను పడిపోనిచ్చారు, ఓడ వెనక భాగంలో ఉన్న తెడ్ల కట్లను విప్పారు, ముందు భాగంలో ఉన్న చిన్న తెరచాపను పైకెత్తారు. అలా తీరం వైపుకు నడిపించడానికి ఓడను సిద్ధం చేశారు. తర్వాత, ఓడ ముందు భాగం బహుశా ఇసుక దిబ్బలో లేదా మట్టిలో ఇరుక్కుపోయింది, వెనక భాగమేమో అలల తాకిడికి విరిగిపోవడం మొదలైంది. అప్పుడు ఖైదీలు పారిపోకుండా కొంతమంది సైనికులు వాళ్లను చంపేయాలనుకున్నారు, కానీ అలా జరగకుండా యూలి ఆపాడు. ఈత వచ్చినవాళ్లను ఈదుకుంటూ ఒడ్డుకు వెళ్లమని, ఈత రానివాళ్లను ఓడ ముక్కల్ని పట్టుకుని వెళ్లమని అతను చెప్పాడు. మొత్తానికి పౌలు చెప్పింది నిజమైంది: ఓడలో ఉన్న వాళ్లందరూ అంటే 276 మందీ ప్రాణాలతో బయటపడ్డారు. అవును, “అందరూ క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు.” ఇంతకీ వాళ్లు చేరుకున్న ప్రాంతం ఏంటి?—అపొ. 27:44.
“మానవత్వంతో . . . ఎంతో దయ చూపించారు” (అపొ. 28:1-10)
18-20. మెలితే ద్వీపవాసులు ఎలా ‘మానవత్వంతో దయ చూపించారు’? పౌలు ద్వారా దేవుడు ఏ అద్భుతం చేశాడు?
18 ఆ ఓడలో ఉన్నవాళ్లు చేరుకున్నది, సిసిలికి దక్షిణాన ఉన్న మెలితే ద్వీపానికి. (“ మెలితే ఎక్కడ ఉంది?” అనే బాక్సు చూడండి.) అక్కడ వేరే భాష మాట్లాడే ద్వీపవాసులు వాళ్లమీద “మానవత్వంతో . . . ఎంతో దయ చూపించారు.” (అపొ. 28:2) వాళ్లు తీరం చేరేటప్పటికి పూర్తిగా తడిచిపోయి వణికిపోతూ ఉన్నారు. వాళ్లెవరో తెలీకపోయినా ద్వీపవాసులు వాళ్లకోసం చలిమంట వేశారు. ఆ మంట వాళ్లకు చలి నుండి, వర్షం నుండి కాస్త వెచ్చదనాన్ని ఇచ్చింది. అప్పుడే ఒక అద్భుతం జరిగింది.
19 ద్వీపవాసులకు సహాయం చేయడంలో పౌలు కూడా ఒక చెయ్యి వేశాడు. ఆయన కొన్ని పుల్లలు ఏరుకొచ్చి మంటలో వేయగానే, ఆ సెగకు ఒక విషసర్పం బయటికొచ్చి ఆయన చేతిని కరిచిపట్టుకుంది. దాన్ని చూసి మెలితే ద్వీపవాసులు, ఇతను ఏదో తప్పు చేసి ఉంటాడు కాబట్టే దైవం ఇలా శిక్షిస్తుంది అనుకున్నారు. a
20 పౌలును విషసర్పం కాటేయడం చూసిన ద్వీపవాసులు, ఆయన “శరీరం వాచిపోతుందేమో” అని అనుకున్నారు. ఇక్కడ లూకా వాడిన పదం “వైద్యపరమైనది” అని ఒక రెఫరెన్సు పుస్తకం చెప్తుంది. “ప్రియమైన వైద్యుడు” లూకాకు ఈ పదం తట్టడం వింతేమీ కాదు. (అపొ. 28:6; కొలొ. 4:14) ఏదేమైనా, పౌలు విషసర్పాన్ని విదిలించాడు, ఆయనకు ఏ హానీ జరగలేదు.
21. (ఎ) లూకా రాసిన కొన్ని ఖచ్చితమైన వివరాలు ఏంటి? (బి) పౌలు ఏ అద్భుతాలు చేశాడు? దానికి మెలితే ద్వీపవాసులు ఏం చేశారు?
21 ఆ ద్వీపంలో పొప్లి అనే పెద్ద భూస్వామి ఉన్నాడు. అతను మెలితేను చూసుకుంటున్న రోమా అధికారి అయ్యుండవచ్చు. అతను “ద్వీప ప్రముఖుడు” అని లూకా రాశాడు. మెలితేలో తవ్వకాలు జరిగినప్పుడు దొరికిన రెండు చెక్కడాల మీద, సరిగ్గా అదే బిరుదు కనిపిస్తుంది. అతను పౌలుకు, ఆయన స్నేహితులకు మూడు రోజులు ఆతిథ్యం ఇచ్చాడు. అయితే పొప్లి వాళ్ల నాన్నకు ఒంట్లో బాలేదు. అతని సమస్య గురించి లూకా ఖచ్చితమైన వివరాలు చెప్తూ, “అతను జ్వరంతో, జిగట విరేచనాలతో బాధపడుతున్నాడు” అని అన్నాడు. పౌలు ప్రార్థించి, అతని మీద చేతులు ఉంచినప్పుడు అతను బాగయ్యాడు. ఆ అద్భుతం ద్వీపవాసుల్ని ఎంతగా ఆకట్టుకుందంటే, వాళ్లు ఇంకొంతమంది రోగుల్ని పౌలు దగ్గరికి తీసుకొచ్చారు. ఆయన వాళ్లను బాగుచేశాడు. పౌలుకు, ఆయన స్నేహితులకు అవసరమైనవన్నీ వాళ్లు బహుమతులుగా ఇచ్చారు.—అపొ. 28:7-10.
22. (ఎ) పౌలు ప్రయాణం గురించి లూకా రాసిన వృత్తాంతాన్ని ఒక ప్రొఫెసర్ ఎలా పొగిడాడు? (బి) తర్వాతి అధ్యాయంలో ఏం చూస్తాం?
22 పౌలు ప్రయాణం గురించి లూకా రాసిన వృత్తాంతం నిండా వాస్తవాలు, ఖచ్చితమైన వివరాలు ఉన్నాయి. దాని గురించి ఒక ప్రొఫెసర్ ఇలా అంటున్నాడు: “బైబిలు మొత్తంలో, ప్రతీ చిన్న విషయాన్ని ఇంత వివరంగా రాసిన వృత్తాంతాల్లో ఇదొకటి. మొదటి శతాబ్దంలో ఓడను ఎలా నడిపేవాళ్లు, తూర్పు మధ్యధరా సముద్రంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండేవి వంటి విషయాల్ని లూకా ఎంతో ఖచ్చితంగా, వివరంగా రాశాడు.” ఆయన ఎంత పక్కాగా రాశాడంటే, అంతా ఒక డైరీ చూసి చెప్పినట్టే ఉంది. బహుశా, పౌలుతో ప్రయాణిస్తున్నప్పుడు జరిగిన విషయాల్ని లూకా ఒక పుస్తకంలో రాసుకొని ఉంటాడు. అదే నిజమైతే, తర్వాత వాళ్లు చేసిన ప్రయాణంలో కూడా లూకా తన చేతికి ఎక్కువ పని పెట్టివుంటాడు. ఇంతకీ పౌలు రోముకు చేరుకున్న తర్వాత ఏమైంది? తర్వాతి అధ్యాయంలో చూద్దాం.
a అప్పట్లో ఆ ద్వీపంలో విషసర్పాలు ఉండేవని మనకు అర్థమౌతుంది. కానీ ఇప్పుడు మెలితేలో విషసర్పాలు లేవు. వందల సంవత్సరాలుగా పర్యావరణంలో వచ్చిన మార్పుల వల్ల, లేదా జనసంచారం ఎక్కువ అవ్వడం వల్ల అవి కనుమరుగై ఉండవచ్చు.